‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-9 – పావ్ ఛూ లేనె దో..

1
2

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘తాజ్ మహల్’ (Taj Mahal 1963) చిత్రం కోసం లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ పాడిన పాట. సంగీతం రోషన్.

~

సాహిర్ ప్రేమ గీతాలలోని లోతును అందాన్నివర్ణించడానికి ఎన్నో గీతాలు ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ఆయన సృష్టించిన ప్రేమ గీతాలలో తాత్వికత, అందం, చమత్కారం, ఆధ్యాత్మికతతో పాటు లింగ సమానత్వం కూడా సమపాళ్లల్లో కనిపిస్తాయి. సాహిర్ ప్రేమ గీతాలలో ప్రేమికులలో లొంగుబాటు వెతికినా దొరకదు. పరస్పర గౌరవానికి పెద్ద పీట వేస్తూనే పరస్పర సమర్పణ భావాన్ని చూపించడం ఆయనకే చెల్లింది. అంటే ఈయన రాసిన యుగళ గీతాలలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న చర్చకు ప్రసక్తే ఉండదు. ఆమె అతని కోసం అతను ఆమె కోసం అన్న ప్రేమైక భావం తప్ప, నువ్వు ఎక్కువ, నేను తక్కువ లాంటి వాదనలు ఉండవు. ఒకరు లేకపోతే మరొకరు అపూర్ణం అంటారు తప్ప అసలు నా ఉనికే నువ్వు అనే లొంగుబాటు తత్వం వీరి గీతాలలో నాయికా నాయికలిద్దరిలో వెతికినా కనిపించదు. ఇంతటి సమానత్వాన్ని, స్త్రీ పురుషులను ఒకే స్థాయిలో చూపించే సాహసాన్ని ప్రేమగీతాలలో ఏ కవీ సాహిర్ అంత బలంగా చూపించలేకపోయారని చెప్పడం అతిశయోక్తి కాదు. సినిమాలలో పాత్రల వ్యక్తిత్వాన్ని దర్శకులు మలచడంలో విఫలం అయినా సాహిర్ గీతాలు సంపూర్ణంగా ఆ పాత్రలను న్యాయం చేసేవి అన్నది వాస్తవం.

తాజ్ మహల్ సినిమాలో ప్రతి గీతం ఉత్తమమైనదే. కాని నాకు వ్యక్తిగతంగా గొప్పగా అనిపించే పాట ఇది.

పావ్ ఛూ లేనెదో ఫూలో కో ఇనాయత్ హోగీ ఇనాయత్ హోగీ

వర్నా హమ్కో నహీ ఇన్కొ భీ షికాయత్ హోగీ షికాయత్ హోగీ

(ఈ పూలపై దయ చూపు నీ పాదాలను తాకనివ్వు. లేదా నేనే  కాదు ఇవి కూడా  ఫిర్యాదు చేస్తాయి)

ఇక్కడ ఉర్దూలో వచ్చిన ఇనాయత్, షికాయత్ అనే పదాలలోని అందాన్ని తెలుగులో తీసుకురావడం కష్టం. పై పల్లవిలో ఈ రెండు పదాలు ఆ పాట అందాన్ని పెంచుతాయి. కాని అర్థం తెలుసుకున్నా ఆ భావాన్ని ఆనందించవచ్చు. రారాజు షాజహాన్, ముంతాజ్ పై పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. అతన్ని కలవడానికి ఆమె వచ్చింది. ఆమె వచ్చే దారంతా అతను పూలు పరిచాడు. ఆమె వాటిని దాటి అతన్ని చేరుకోవాలని అతని కోరిక. సినిమాలో ఇది సీన్. కాని ఆ సందర్భానికి సాహిర్‌కి ఈ పల్లవి ఎలా తోచిందో అని నాకు ఈ పాట విన్న ప్రతి సారి అనిపిస్తూ ఉంటుంది. సాహిర్ గురించి విన్నవాళ్లందరూ అతనో బండబారిన మనిషి అనే చెప్తారు. కాని ఈ పల్లవిలో ఆయన చూపిన సున్నితత్వం, అందం ఆజరామరం.

“నీ పాదాలకు ఈ పూలను తాకనివ్వు ప్రియతమా, అది నా కోరిక కాదు. ఆ పూలే నీ పాదాల స్పర్శ కోసం తహ తహలాడుతున్నాయి. నువ్వు వాటికి ఆ అవకాశం ఇవ్వకపోతే అవి ఫిర్యాదు చేస్తాయి. బాధపడతాయి. నా కోసం కాకపోయినా వాటి కోసం అయినా నువ్వు నీ పాదాలతో వాటిని స్పృశించాలి” అంటున్నాడు ఇక్కడ షాజహాన్.

ప్రేమ ఒక పిచ్చి. ఉన్మాదం కూడా. కాని అది ఈ ప్రపంచంలోనే ఓ అందమైన భావన. అందుకే ప్రతి వ్యక్తీ తనను పిచ్చిగా ప్రేమించే ఓ వ్యక్తి కావాలని కోరుకుంటారు. ఈ ప్రేమ చాలా సార్లు ఏ లాజిక్‌కు అందదు. కాని అంతకు మించిన అందమైన భావన మరొకటి ఈ ప్రపంచంలో కనిపించదు కూడా. ప్రియురాలి కోసం ఆమె వచ్చే దారిలో పూలను పరిచిన ఆ ప్రేమికుడు అది ఆ పూలకు దొరికిన అదృష్టమని ప్రియురాలికి తెలియజేయడంలో ఆమెను అతనెంత ఉన్నతంగా ఊహించుకుంటున్నడో ప్రియురాలికి చెప్పడం అతని ఉద్దేశం. దీనికి ఆమె ఇచ్చే జవాబు అంతే గొప్పగా ఉంటుంది.

ఆప్ జో ఫూల్ భిచాయే ఉన్హె హం ఠుకరాయే (2)

హమ్ కో డర్ హై

హమ్ కో డర్ హై కి యె  తౌహీన్-ఎ-ముహబ్బత్  హోగీ. ముహబ్బత్ హోగీ

(మీరు పరిచిన ఈ పూలను నేను తిరస్కరించటమా? . నాకు భయంగా ఉంది, నాకు చాలా భయంగా ఉంది ఇది ప్రేమను అగౌరవపరచడం అవుతుందని)

ఎంత గొప్ప జవాబో కదా ఇది. ముందు ఆమె వ్యక్తిత్వం చూద్దాం. అతను పూలను పరిచాడు కదా ఆమె వాటిని తొక్కుతూ అతన్ని చేరలేకపోతుంది. అతని ఉన్మాదాన్ని ఆమె సున్నితంగా తిరస్కరిస్తుంది. నేను దీన్ని తిరస్కరిస్తున్నాను అని ధైర్యంగా చెబుతుంది కూడా. ఎందుకంటే ప్రేమకు ప్రతిరూపాలయిన ఆ పూలను తొక్కడం అంటే ప్రేమను అగౌరవపరచడం అని ఆమె నమ్మకం, అందుకే “నేను ఆ పని చేయలేను ఆ పూలు నువ్వు పరిచినవే అయినా, నేను నీ కోసం కూడా ప్రేమను అగౌరవపరచలేను” అంటుంది. “నాకు నచ్చని పని చేయలేను” అంటుంది ఆమె. ఎంత గొప్ప సమాధానమో కదా.

పల్లవిలోనే సాహిర్ గొప్ప చమత్కారం చేశాడు. పురుషుడి దృష్టిలో ప్రేయసి దేవత. జగదేక సుందరి. అందుకని ఆమెను అపురూపమైన వ్యక్తిలా చూస్తాడు. ఆమె వదనం చంద్రబింబం. ఆమె పూవులంత నాజూకు. ఆమె పెదవులు గులాబీలు. ఆమె ప్రకృతికి ప్రతీక. సూర్యుడు రోజూ ఆమెని చూసేందుకే వస్తాడు. చంద్రుడు ఆమె అందం చూసి సిగ్గుపడి మేఘాలమాటున దాక్కుంటాడు. కానీ, ఆమెని తొంగి తొంగి చూస్తాడు. ఇలా అతిశయోక్తులతో ఆమెని వర్ణించి, పూజిస్తాడు. అందుకని, ఆమె దారిలో పూలుపరచి ఆమె పట్ల తన గాఢానురక్తిని, ఆమె పట్ల శ్రద్ధాభక్తులను వ్యక్తపరచటంలో  ఆశ్చర్యంలేదు.

పురుషుడు తనని పొగడుతూంటే, స్త్రీ పొంగిపోతుంది. ఆనదిస్తుంది. అతనింకా తన అందం చూసి మైమరపులో అలా పొగడాలని వున్నా, ఎక్కడ ఆపొగడ్తల మైమరపులో తనని తాను మరచిపోతుందేమో అన్న భయం వుంటుంది. ఈ పొగడ్తలన్నీ అతిశయోక్తులేనేమో, నిజంగా తానంత అందంగా వుందా? లేదేమో!!! అన్న వెరపు, సంశయాలుంటాయి. అతని పొగడ్తలను నమ్మకుండా వున్నట్టు చేస్తే, తన నిజాయితీని నిరూపించుకునేందుకు మరింతగా పొగడుతాడన్న ఆశకూడా వుంటుంది. అందుకే, ఆమె అతను పరచిన పూల తివాచీపై అడుగిడకుండా వస్తోంది. పైగా, పూలపై నడవకుంటే, తనకేకాదు, పూలకు కూడా బాధకలుగుతుందని అతనంటే, మీరు పరచిన పూలను నేను తిరస్కరించటమా, అది ప్రేమకు అవమానమని తప్పించుకుంటోంది. పూలపై కాలిడితే పూలు నలిగిపోతాయి మరి. ఆయన పరచిన పూలను నలపటమంటే, పూలను తిరస్కరించినట్టే కదా! రెండువైపులా పదనైన కత్తిలాంటి సున్నితమైన సమాధానం! అతడు మింగలేడు, కక్కలేడు. అవుననలేడు. కాదనలేడు.

దిల్ కి బేచైన్ ఉమంగో పె కరం ఫర్మావో (2)

ఇతనా రుక్ రుక్

ఇతనా రుక్ రుక్ కే చలోగే తో కయామత్ హోగీ, కయామత్ హోగీ

పావ్ ఛూ లేనెదో ఫూలో కో ఇనాయత్ హోగీ ఇనాయత్ హోగీ

(నా మనసులోని తీవ్రమైన  కోరికలపై దయ చూపించు. ఇలా ఆగి ఆగి, మెల్ల మెల్లగా నడుస్తుంటే ప్రళయం వచ్చేస్తుంది)

ఉర్దూలో కయామత్ అన్న పదాన్ని ఎన్నోసార్లు వాడతారు. మొత్తం ప్రపంచం ఓ రోజు నాశనమయి తీరుతుందని అదే ఈ ప్రపంచానికి ఆఖరు రోజు అని ముస్లింలు నమ్ముతారు. ఉర్దూ కవులు కయామత్ అన్న పదాన్ని చివరి ప్రళయం, తప్పించుకోలేని ప్రళయం అనే అర్థంతో ప్రేమ సందర్భంలోనూ చమత్కారంగా వాడడం పరిపాటి. కయామత్ తరువాత ఇక దేనికీ ఎదురు చూపు ఉండదు. ఎందుకంటే ఆ తరువాత ఏమీ మిగలదు అని అర్థం.

ఇక్కడ ఆమె పూలను దాటుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తోంది. ఆమె నడకలో ఈ పూల వలన వేగం తగ్గింది. ఆమెను గమనిస్తున్న ఆ ప్రియుడు ఆమె తన మందిరంలోకి వచ్చాక తనను త్వరగా చేరాలని కోరుకుంటున్నాడు. కాని తాను పరిచిన పూలను ఆమె దాటుకుని వచ్చే క్రమంలో వేగంగా రాలేకపోతుంది. అతను ఆలస్యాన్ని భరించలేకపోతున్నాడు. అందుకని నా మనసులోని కోరికలను అర్థం చేసుకుని అయినా త్వరగా రావచ్చు కదా. అలా మెల్ల మెల్లగా అడుగులు వేసేలోపల ప్రళయం వచ్చేస్తుందేమో అంటున్నాడు. అంటే ఆమె వచ్చేసరికి పుణ్యకాలం దాటిపోతుందన్న ఆత్రం అతడిది.   ఆ కాస్త ఆలస్యం అతనికి భరింపశక్యంగా లేదు. ఆ మెల్ల మెల్లగా అడుగులు వెస్తూ నా దగ్గరకు వచ్చే లోపు ఆ చివరి ప్రళయం వచ్చేస్తుందేమో అంత దాకా ఆగలా అన్నంత బాధగా ఉందతనికి. ఆమె అతన్ని చేరుకోవడంలో చేసే ఆలస్యం అతను భరించలేకపోతున్నాడు.

దీనికి ఆమె ఎంత అందంగా జవాబిస్తుందో చూడండి..

షర్మ్ రోకే హై ఇధర్,  షౌక్ ఉధర్ ఖీంచే హై (2)

క్యా ఖబర్ థీ

క్యా ఖబర్ థీ కభీ ఇస్ దిల్ కీ యే హాలత్ హోగీ

యే హాలత్ హోగీ

(సిగ్గు నన్ను ఓ పక్కన ఆపుతుంటే, కోరిక నీవైపుకు లాగుతుంది. నాకేం తెలుసు ఈ మనసు ఓ రోజు ఇలాంటి అవస్థలో చిక్కుకుంటుందని)

ఆమెకు అతన్ని చేరడానికి సిగ్గుగా ఉందట. అందుకని వేగంగా అడుగులు వేయలేకపోతుందట. కాని ఆమెలో కోరిక మాత్రం అతని వైపుకు లాగుతుందట. ఇలాంటి గుంజాటనలో నా మనసు ఇరుక్కుంటుందని నేనెప్పుడూ అనుకోలేదు అని జవాబిస్తుంది ఆమె. ఇక్కడ ఆమె తనలోని సిగ్గుని కోరికనూ ఒకే సమయంలో బైటపెట్టుకోవడంలో గొప్ప అందం ఉంది. పైగా నాకు నిన్ను చేరాలనే కోరిక ఉందని ఓ రకంగా సిగ్గు పడుతూనే  ఆమె బైటపెట్టుకునే విధానంలో అందంతో పాటు ఆమె వ్యక్తిత్వం కూడా కనిపిస్తుంది. తనలోని కోరికలను బైటకు చెప్పుకోవడానికి భయపడని స్త్రీ ఆమె. ప్రేమించిన వ్యక్తి, అప్పటిదాకా పరాయివాడైన వ్యక్తిని మనసు అందరికన్నా ఎక్కువగా కోరుకుంటున్న సందర్భంలో ఆమెలో ఓ భయం, అయోమయం, ఇష్టం, ఆలోచన ఇవన్నీ కలగాపులగంగా జనియించినప్పుడు సహజంగా ఈ స్త్రీ మనసులోని గుంజాటన ఇలాగే ఉంటుంది. దీన్నిఇంత పారదర్శకంగా చిత్రించడానికి సాహిర్ ఎందరి స్త్రీల హృదయాలను తాకి చూసాడో మరి. అంతటి ప్రేమైక స్థితిలో ఓ స్త్రీ ఎలా ప్రవర్తించగలదో అంతే ఖచ్చితంగానూ స్పష్టంగానూ ప్రకటించగలిగాడాయన.

ఇక ఆమెలోని సిగ్గుని భయాన్ని పోగొట్టడానికి ఆ ప్రియుడు ఇచ్చే జవాబు అదరహో.

షర్మ్ గైరోం సె హువా  కర్తి హై అప్నోం  సే నహీ (2)

షర్మ్ హంసే

షర్మ్ హంసే భీ కరోగీ తో ముసీబత్ హోగీ, ముసీబత్ హోగీ

(సిగ్గు పరాయివాళ్లముందు ప్రదర్శించాలి కాని మనవాళ్ల ముందు కాదు కదా. నా దగ్గర సిగ్గు పడితే మరి కష్టమే సుమా)

పరాయి వాళ్లను చూసి సిగ్గు పడాలి అట. మరి అతను ఆమెకు పరాయి వాడు కాదు కదా. ఆమె కోరిన, ఆమెను కోరిన ప్రియుడు. అతని ముందు ఆమె సిగ్గు పడడం తప్పు కదా. అదెంత కష్టమో ఇద్దరికీనీ..

ఈ పాట నిండా చమత్కారం, ప్రేమ దాహం, ప్రేమికుల కోరిక కలిసి కనిపిస్తాయి. కాని ఎక్కడా అసభ్యతకు తావుండదు. ప్రేమను చులకనగా, ఆకతాయితనంగా ప్రదర్శించడం గొప్ప అనుకునే కవులు ఈ మధ్య ఎందరో తయారయ్యారు. వారికి ఈ గీతం వినిపించాలనిపిస్తుంది. ఇలాంటి స్థాయి ప్రేమ గీతాలను విని, ఆస్వాదించి, ఆనందించిన మా తరం ఇప్పటి చిల్లర పాటలను అంగీకరించలేకపోవడం జనరేషన్ గాప్ అనుకుంటే ఏం చెప్పగలం. ప్రేమను శృంగారాన్ని ఆ స్థాయిలో ఆస్వాదించడం, అందులోని అందాన్ని సంపూర్ణంగా అనుభవించటం ఓ అదృష్టం. సాహిర్ గీతాలు అందుకే  అజరామరం.

షర్మ్ గైరోం సే హువా  కర్తీ హై అప్నోం  సే నహీ.. ఎంత అందమైన వాక్యం.. ఈ పాట విన్న ప్రతీ సారి మనసు ఆనందంతో నిండిపోతుంది. మీరూ ఓ సారి ఈ పాట వినండి మరి.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here