[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
321
తలమునకలైనన్నిసమస్యలను వదిలేసి
ఆలయాల నిర్మాణానికి ప్రభత్వ నిధులు
కలల సాకారం కొరకు
సులభమైన మార్గమని
322
ఎన్నో పందారాలు చేస్తామని
మేనిఫెస్టోలు తయారు చేస్తారు
కనిపించని స్వర్గం చూపిస్తామంటారు
వినే జనం ఉంటే యెన్నైనా చెప్తారు నాయకులు
323
క్షణికావేశం ఎన్ని ఘోరాలు చేయిస్తుందో
క్షణం వెనక్కి ఆలోచించితే
రణరంగంలోకి ఎందుకు దిగామో తెలుస్తుంది
అణచి వేయచ్చు ఆవేశాన్ని
324
చేటు చేసే పనులతో, తప్పుడు దార్లలో
కోటానకోట్లు సంపాదించినా
తోటలోని కూలివానితో సమానం
తటపటాయించక ఆలోచించుకోవాలి
325
జీవితంలో సంతృప్తి సుఖమయం చేస్తుంది
భావి జీవితాన్ని ఆనందించవచ్చు
కావేవీ అర్హతలు సంతృప్తికన్నా
జీవితం సుఖమయమౌటానికి
326
వ్రణం శరీరంలో భాగమే
కణ కణంలో బాధ పెడుతుంటుంది
త్రుణమో ఫణమో ఇచ్చి బాగు చేయించుకోవాలి
ప్రాణం, చెప్పకుండా పోతుంది చివరకు
327
పుట్టినప్పుడు అందరూ సమానమే
గట్టిపడేకొంది నైపుణ్యం బైటపడు
నట్టనడుమ ఈ భాగోతమంతా
మట్టిలో చేరేటప్పుడు అంతా సమానమే
328
అన్ని రంగాలలో నిపుణులు వుంటారు
కొన్ని రంగాలలో కొంతమందే
కాని పనులు చేసేవారు కొందరు
లేని పోనివి నెత్తినేసుకునేవారెందరో
329
ప్రకృతిలో నీరు, నిప్పు, గాలికి
కకావికలు చేసే శక్తి కలదు
చక చకా విద్వాంసం చేస్తవి
రకరకాలుగా, ఎవ్వరు అడ్డుకోలేని విధంగా
330
మంట కలిసిపోతున్న ప్రజాస్వామ్యం
కంట తడిపెడుతున్న ప్రజ
చట్టాలు రూపొందిస్తున్న సభల దుస్థితది
దిట్టమైన మేధావుల నిరాసక్తత