సరోవరాలు మనకు నేస్తాలు!

0
10

[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘సరోవరాలు మనకు నేస్తాలు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]స[/dropcap]రోవరాల హొయలు
కనులకు విందులు
మనసుకి సంతోషాల వెల్లువలు

ఎటో వెళ్ళిపోతూ
మలుపులు తిరుగుతూ
సాగే నీటి గలగలలు
మదిలో మోగే నాదాలు

తుషార శీతల సరోవరాలు
ప్రకృతి ప్రేమికులకు ప్రియ నేస్తాలు
అందమైన దృశ్యాలు
లిఖించిన ప్రకృతి ప్రతి క్షణం
కుంచెకు ప్రాణం పోస్తుంది

విడిచి రాలేని అనుబంధాలతో
మనలను బంధించివేస్తాయి
తీరం వెంబడి నిలిచిన చెట్లు
ఆకుల కదలికలతో ఊసులెన్నో చెబుతాయి
వయ్యారాల కొమ్మలు
నీటిలోకి ఒరిగి
ప్రతిబింబాన్ని చూసుకుంటూ మురిశాయి
పూలను రాల్చి అల్లరి చేస్తాయి
నీటిలో తేలుతూ
దూరతీరాలకు చేరుతాయి
స్వచ్ఛమైన నీటిఅడుగున
గులకరాళ్లు గతచరిత్రకు
ఆనవాళ్లుగా పేరుకుంటాయి
అలుపులేని నీటి బాతులు
మీనాలను వేటాడుతూ
ఈదులాడుతుంటాయి
అప్పుడప్పుడు నీరెండలో
రెక్కలార్చుకుంటూ
పచ్చికలో తిరుగాడుతుంటాయి

మంచుకురిసే వేళలో
దూరతీరాలకు
మజిలీలుగా తరలిపోతాయి
రుతువులు మారగానే
వచ్చి చేరుతాయి
నేస్తాలై మనతో కలిసిపోతాయి

ఆకాశంలో పయనించే
మేఘమాల అరుణకాంతి సోకగా
పసిడివర్ణంతో మెరిసింది
ప్రకృతిని చూడగానే
పరవశించి పాడింది
నా మనసు మధుర గీతాలు ఎన్నో

రోజూచూసే అందాలు ఐనా
కొత్తరూపు సంతరించుకుని
ముచ్చట గొలుపుతాయి

పూచేపూలు ఎగిరేపక్షులు
వివిధవర్ణాల సీతాకోకచిలుకలు
మనలను అలరిస్తాయి

మంచు కురిసిన నేల తడిసి
ఆకు పచ్చని తివాసీలు పరిచి
స్వాగతం చెబుతుంది
స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యం
మనసుకి ఉల్లాసం
అలసిన మేనుకు విశ్రాంతి కలిగిస్తుంది

వీలు వున్నప్పుడు
విహారాలు చేయడం
వినువీధిలో
చందమామను తిలకించడం
అవధులులేని ఆనందంతో
ప్రకృతిలో లీనమవడం
మనకు మనమే సేదతీరడం

[అమెరికాలోని మినిసోటా రాష్ట్రం సరోవరాలకు నెలవు. ప్రకృతికి పచ్చని చీర కట్టినట్టు వుండే అందాలు ఆ రాష్ట్రవాసులకు నేస్తాలు. చూసేవారికి మత్తుమందు చల్లినంత మైకాలు. మంత్రముగ్ధులను చేసే ఈ పరిసరాలను విడిచి రావడం చాలా కష్టం. స్విమ్మింగ్ (జలక్రీడలకు), బోట్ రైడ్స్ (నౌకా విహారం) చేసేవారికి అంతులేని ఆనందాలు. రచయితలకు, చిత్రకారులకు తనివితీరని విందులు చేస్తాయి. అలా వాటిని చూసినపుడు వచ్చే ఆలోచనలకు రూపమిది.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here