[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘మట్టి పలక’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]‘ప[/dropcap]లకే’ గదా అని చిన్నచూపు చూడకు
ఎందరినో మహామహులుగా తీర్చిదిద్దిన
జ్ఞానదేవత
అందమైన చెక్క కూర్పుతో
నల్లగా ఉన్న ఆ మట్టిపలక మీద
తెల్లని బలపంతో గురువుగారు
ఓం నమశ్శివాయ అని
దిద్దించిన అక్షరాలు జ్ఞానదీపాలు
ఆకాశంలో మెరిసే చుక్కలే అక్షరాలు
పలక చేతిలో పట్టుకుంటే
మహారాజునే అనిపించేది నాకు
కొత్త అక్షరాలు రాయాలంటే
తడిగుడ్డతో పలక తుడవాలి
నీళ్ళు కనపడకపోతే
ఉమ్మితో తుడిచినందుకు
పలకంటే సరస్వతీ ప్రతిరూపం
ఉమ్మితోతుడవచ్చా అన్నారు మాష్టారు
కింద పడితే ఎక్కడ పగులుతుందోనన్న
భయంతో గుండెలకు హత్తుకొని
ప్రాణప్రదంగా పట్టుకునేవాళ్ళం
పుస్తకాలకన్నా అక్షరాలు దిద్దిన
పలకంటే ఎంతోఇష్టం మాకు
పండగలు వస్తే పలక మీద
రంగురంగుల బలపాలతో
అందంగా అలంకరించేవాళ్ళం
బాగున్న వాటికి బహుమతిచ్చేవారు
మేమందరం అందుకోసం
ఎంతో ఆశతో ఎదురుచూసే వాళ్ళం
జ్ఞానాన్ని పంచే సరస్వతీ స్వరూపాలే
పలకమీద తెల్లని అక్షరాలు
ఆ మట్టిపలకే భవిష్యజ్జీవితానికి
వన్నెతెచ్చే భగవత్సరూపంగా
తలచి పూజించేవాళ్ళం
ఎన్నెన్ని ఆనందాలో ఆ రోజుల్లో
ఇప్పుడు పలకా బలపం తెలియదు
పేపరు బాల్ పెన్ తప్ప
ఆ ఆనందాలు వారికి తెలియదు
ఆ అనుభవాలు ఎంత గొప్పవో కదా
ఆ రోజులను తలచుకుంటే
మళ్ళీ చిన్నవాడినై బళ్లోకి వెళ్ళాలని
మనసులో తెలియని ఒక చిరుకోరిక.