[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ధర్మ నిరతి’ అనే రచనని అందిస్తున్నాము.]
గురూనహత్వా హి నహానుభావాన్ శ్రేయో భోక్తుం భైఖ్యమపీహ లోకే
హత్వార్ధ కామాంస్థు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్
(భగవద్గీత 2 వ అధ్యాయం, 5 వ శ్లోకం)
[dropcap]“నా [/dropcap]గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే, మనము అనుభవించే ఈ సంపద, భోగాలు, రక్తంతో కళంకితమై ఉంటాయి అని అర్జునుడు తాను ఈ మహాభారతం యుద్ధం చేయలేను” అని తన నిస్సహాయత ప్రకటించి యుద్ధ రంగంలో చతికిలపడ్డాడు అర్జునుడు. భిక్షాటన చేసైనా జీవిస్తాను కానీ ఈ నీచమైన నేరాన్ని మాత్రం చేయను అని ఒకవేళ, యుద్దం చేసి పెద్దలను మరియు బంధువులను చంపటం అనే ఈ హీనమైన పని చేసినా తన అంతరాత్మ తనను, ఈ పని ద్వారా ఈ లోకంలో లభించే ధనము, అధికారము వంటి ఫలములను అనుభవించనీయదు అని అర్జునుడు భావించాడు. అయితే అర్జునుడి ఈ నిస్సహాయతను శ్రీ కృష్ణ భగవానుడు అంగీకరించలేదు. గురువులు లేక పెద్దలు హేయమైన కార్యాలను చేస్తూ తమ విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు వారిని త్యజించవచ్చునని శాస్త్రాలు బోధిస్తున్నాయన్న సంగతిని కృష్ణుడు గుర్తు చేసాడు. దుర్యోధనుడు ఇస్తున్న ఆర్థక సహాయాల కారణంగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి వారు కౌరవుల పక్షాన్ని వహించి ధర్మ నిరతికి వ్యతిరేకంగా, అధర్మాం పక్షం వహిస్తూ పాండవులతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. అటువంటి చర్యల వలన వారు గురువులుగా, ఆచార్యులుగా తమ గౌరవాన్ని కోల్పోయారు. అయినాసరే వారు గౌరవనీయులని, పూజింపతగినవారని అర్జునుడు భావించాడు. అయితే ఆ భావం తప్పని కృష్ణుడు నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. వారిని సంహరించి చేజిక్కించుకున్న భోగభాగ్యాలు రక్తపంకిలమైనా అనుభవించతగినవనే అని భగవానుడి భావం.
సత్యం శాశ్వతమైనది. కాలమాన కారకాలకు, స్థితిగతులకు, పరిస్థితులకు అనుగుణంగా సత్యం మార్పు చెందదు కాని ధర్మం మాత్రం కాలానుగుణంగా, పరిస్థితుల ఆధారంగా, జరిగిన లేక జరుగుతున్న ఘటనలు సంఘటనల ప్రాతిపదికన, చిన్నచిన్న మార్పులకు లోనుకావచ్చు. ‘ధృ’ అనే ధాతువు నుండి ‘ధర్మం’ అనే పదం పుట్టింది. ‘ధృ’ అంటే ధరించడం అని అర్థం. దానంతట అది సహజంగా ధరింపబడిందే ధర్మం. అంటే అది అన్ని కాలాలకు, అన్ని దేశాలకు, అన్ని మతాలకు కూడ సహజంగా ఉంటుంది. యుగాల రీత్యా ధర్మంలో కొన్ని మార్పులు చోటు చేసు కుంటాయి. అందుకే ‘యుగధర్మం’ అని అంటారు. అంత మాత్రాన ధర్మం మూల స్వరూపం సమగ్రంగా, సంపూర్ణంగా మారినట్లు భావించవలసిన అవసరం లేదు. ‘ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం’. భగవంతుడు దేనినైతే నిర్దేశించాడో అదే నిజమైన ధర్మం. రాజ్యాంగానికి సంబంధించిన చట్టం ప్రభుత్వంతో ఎలా విధించబడి ఉంటుందో అదే విధంగా దేవదేవుని చేత విధించబడేది అసలైన ధర్మం. ధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వ ధర్మాలను పరిత్యజించి తననే శరణు పొందమని కృష్ణుడు ఆనాడే చెప్పాడు. ఇదే భాగవత ధర్మం. ద్వేషంతో ద్వేషాన్ని శాంతించడం అనేది జరగనే జరగదు. ద్వేషాన్ని అనురాగం చేతనే శాంతింపజెయ్యాల్సి ఉంది. మన జీవితాలు నిత్యాలు కావు. శాంతిగా జీవించడం నేర్చుకోవాలి. మనలోని ద్వేషాగ్నిని ప్రేమామృతం చేత తడిపి చల్లారుస్తూ ఉండాలి.
‘ధర్మో రక్షతి రక్షిత’. మనం ధర్మాన్ని రక్షిస్తే, ధర్మమే మనల్ని రక్షి స్తుంది. ధర్మానువర్తనులుగా మారాలి. కర్మ మూర్తులుగా, ధర్మమూర్తులుగా, దివ్యమూర్తులుగా, దివ్యత్వమూర్తులుగా నిలుద్దాం.