[శ్రీ రఘు శేషభట్టార్ రచించిన ‘కంపన’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అం[/dropcap]తరిక్ష నీలాల నుంచి ఎగిరి ఒక పక్షి
ఇంటి శిఖరం మీద వాలినట్టు
వాడలా తుంపరలా వచ్చిపోయాక
ఇల్లు ఇల్లంతా అల్లుకున్నాయి నెమరు చెమ్మలు
ఇన్నాళ్లు వ్యాపకాలే వాడి దేవతలైనట్టు
తల్లిదండ్రులు ఉప దేవతలై మిగిలినట్టు
ముందు ముందు పలకరింపులు కూడా బరువెక్కి పెగులుతాయని
రుసరుసలాడి ఉంటాను
తీరా వాడి చెప్పుల చప్పుడు విన్నాక
చిటపటలన్నీ ప్రహరీ మీద పిట్టల్లా తుర్రుమంటాయి
వాడి రాకలో ఒక కువకువ
నా ప్రాణమయ కోశం మీద నాజూకు ఈకలా
స్థిరపడుతుంది
స్తబ్ధత మెత్తబడి ఉడికిన గింజలా చితుకుతుంది
మిలమిల పొదిగిన కళ్ళు అలవాటుగా
ప్రామాణిక ప్రేమల్ని రువ్వినప్పుడు –
ఎన్నో సుగంధాలు పోసి నేసిన గుండె కదా!
ఏ చిన్న కంపనకైనా పడవలాగే ఊగుతుంది