[box type=’note’ fontsize=’16’] “గురజాడా గిడుగువంటి మహనీయుల కృషిఫలాలు, ఇంటింటా వైభవంగా నిలిచింది తెలుగుదనం” అంటున్నారు సుధా మైత్రేయి ‘గజల్‘ కవితలో. [/box]
[dropcap]కో[/dropcap]యిలమ్మ పాటలోన నిండింది తెలుగుదనం
అంబా అను ఆవు పలుకు కూర్చింది తెలుగుదనం
ప్రబంధాలు కావ్యాలలో నుడికారపు సొగసులెన్నొ
మధువులొలుకు పదాలతో కూడింది తెలుగుదనం
గురజాడా గిడుగువంటి మహనీయుల కృషిఫలాలు
ఇంటింటా వైభవంగా నిలిచింది తెలుగుదనం
విదేశీయ సంస్కృతికే బానిసైన తెలుగోడా
పరదేశీ మాటల్లో పలికింది తెలుగుదనం
అక్షరాలు తేనెలూరు పదపదాన సుధలూరును
ఎన్ని భాషలున్నగాని వెలిగింది తెలుగుదనం