[‘బ్రిటీష్ బంగ్లా’ అనే అనువాద కథని అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు. కన్నడ మూలం శ్రీధర బనవాసి. ఇది మొదటి భాగం.]
[dropcap]ఆ[/dropcap]గుంబె అంటే ఎల్లప్పుడూ నిత్యహరిద్వర్ణంతో నిండిన అడవి. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతం. కొండల గుట్టల శ్రేణి. కనుమల మలుపుల మధ్య అప్పుడప్పుడు సద్దు చేసే వాహనాలు. ఘాట్ చివరన నిలబడి సూర్యోదయాన్ని చూసేవరకు మధ్యమధ్యన పర్యాటకుల పళ్లు, బిస్కెట్లకు ఆశపడి దారికి అడ్డు వచ్చే కోతులు.. కిలోమీటరుకు ఒకటి అరుదుగా కనిపించే ఇళ్లు, వాటి చుట్టూ తోటలు. జన సంపర్కం లేని వీళ్లంతా ఎలా జీవిస్తున్నారనే కుతూహలం. అడవి మధ్యలో ఒంటరిగా తిరిగే మనుషులు – ఇలాంటివాటి మధ్యన ఆగుంబె పరిసరాలల జీవించటం గురించి ఊహించుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ఇలాంటి ఆగుంబె పరిసరాలకు మనసుపడి ఒక కాలంలో ఇంగ్లాండ్ దేశానికి చెందిన హెన్రీ థామ్సన్ అనే వ్యక్తి కణగిలే అనే ఊరిలో నివసించేవాడు. బ్రిటిష్ అధికారి అయిన అతను భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తన స్వదేశానికి తిరిగి వెళ్లనేలేదు. ఆగుంబె ప్రాంతానికి కరణమైన చంద్రశేఖర దీక్షితుల కుమార్తె సంధ్యాదేవి అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ. ఆమె రూపానికి మరులుపోయి, ఆమెను ప్రేమించి, ఆమె ప్రేమ కోసం తన స్వదేశానికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవటానికి నిర్ణయించుకున్నాడట. ఇలా థామ్సన్ అనే ఆ బ్రిటిష్ అధికారి కొండప్రాంతపు మహిళను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిన కథతోపాటు, అతను బతికి జీవించిన బ్రిటిష్ బంగ్లా, అతని కుటుంబంలోని విషాద చావుల గురించి అనేక కథలు పుట్టుకొచ్చాయి. అతను నివసించిన కణగిలే అనే ఊరు ఇప్పుడు లేకుండాపోయింది. థామ్సన్ కుటుంబీకులతోపాటు అతని ఎస్టేట్‌లో పనిచేసిన ఐదారు కుటుంబాలు మాత్రమే నివాసమున్న కణగిలే అనే గ్రామం ఇప్పుడు ఊరి మ్యాప్ నుండి అదృశ్యమైంది. కణగిలె అనే గ్రామానికి వెళ్లే దారియైన వంతెన కూడా కూలిపోయింది. నది దాటి, కణగిలే అనే కొండ గుట్టను ఎక్కడానికి అందరికీ భయమే. దూరం నుంచే కనిపిస్తున్న బ్రిటీష్ బంగ్లాను చూసి, దాని విషాద కథ గురించి మాట్లాడుకోవటం సర్వసాధారణం. పాడుబడ్డ ఆ బ్రిటిష్ బంగ్లా గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఎవరికీ లేదు. దాన్ని చూడటానికి వెళ్లే ధైర్యం కూడా లేదు. ఆ బంగ్లాకు దెయ్యాల, భూతాల కథలు కూడా అంటుకుని ఉండటం వల్ల వాటి గురించి కొత్తవారికి చెప్పడానికి కూడా భయపడేవారు.
యాభై ఏళ్ల క్రితం హెన్రీ థామ్సన్ నిర్మించిన ఈ వంతెన ఎలా కూలిపోయింది? అది పొంగి ప్రవహిస్తున్న నదిలో ఎలా మునిగిపోయిందో కూడా అక్కడి ప్రజలకు ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. థామ్సన్ చేత నిర్మించబడినందున, ఆ వంతెనను అతని పేరుతోనే పిలిచేవారు.
థామ్సన్ కుటుంబం, ఎస్టేట్ వారు ఆ వంతెన కూలిపోవడంతో అక్కడే చనిపోవటంతో వారి ప్రేతాత్మలు అక్కడే సంచరిస్తాయనే వదంతులు ప్రజల భయానికి కారణమైంది. అందువల్ల వంతెన దగ్గర తిరగడానికి అందరూ భయపడేవారు. థామ్సన్ అనే బ్రిటీష్ అధికారి ఆత్మ దెయ్యమై తన బంగ్లా చుట్టూ తిరుగుతుంది. దానికి కాపలా కాస్తోంది అనే అనేక కథలను తమ అనుభవానికి వచ్చినట్లు చెప్పేవారు. ప్రజల నోళ్లలో బ్రిటీష్ బంగ్లా గురించి అనేక కథలు భిన్నమైన రూపాలు పొందాయి.
***
మణికాంత్ సాళగాంకర్ ఆగుంబెలోని పోస్టాఫీసులో ఉద్యోగంలో చేరి దాదాపు ఆరు నెలలైంది! కొత్త ఊరు, ప్రజలు పరిసరాలతో సర్దుకోవడానికి మొదట్లో కొంచెం కష్టమైంది. సైన్స్ విద్యార్థి అయిన మణికాంత్ జీవశాస్త్రంలో చదివిన వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం ఆగుంబె పరిసరాలకు మంచి స్నేహితుడయ్యాడు. తాను ఖాళీ సమయంలో చదివిన వాటిని అర్థం చేసుకోవడానికి ఇది పూరకమైంది. సాయంత్రం లేదా వారం చివరలో తన కెమెరా తీసుకొని ఆగుంబె పరిసరాల చుట్టూ ఉన్న ఆసక్తికరమైన విషయాల అన్వేషిస్తూ వెళ్లేవాడు. ఆగుంబె పరిసరాల్లో త్రాచుపాములు ఎక్కువగా ఉన్నాయని విన్న అతనికి ఎక్కడైనా, ఎవరి ఇంట్లోనో, తోటలోనో త్రాచుపాము దూరిందనే వార్త తెలిసిన వెంటనే అక్కడికి పరిగెత్తేవాడు. అలా వెళ్తున్నప్పుడూ కొన్నిసార్లు పాములు కనిపించటం నిజం. మరికొన్ని సార్లు నిరాశ కలగటమూ నిజం. మొత్తానికి వచ్చిన ఆరు నెలల్లో, అతను తన కెమెరా కంటిలో పది నుండి పదిహేను అడుగుల పొడవైన త్రాచుపాములను బంధించాడు. ఆగుంబెలో ఇతని అన్వేషణల మధ్య బ్రిటిష్ బంగ్లా విషాదకథ, థామ్సన్ బ్రిడ్జ్ మునిగిపోయిన కథ మణికాంతన్‌ను చేరుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఒకసారి పోస్టాఫీసులో బట్వాడ చేయని ఉత్తరాల వైపు అతను దృష్టి సారిస్తుండగా, ఒక మూలన చాలా సంవత్సరాలుగా సంబంధించినవారికి అందించని ఉత్తరాలు, పత్రికలతో నిండిన మూట కనిపించింది. అందులో చాలా ఉత్తరాలు ఇంగ్లాండ్ నుంచి వచ్చినవి. ఉత్తరాలన్నిటి మీద ‘హెన్రీ థామ్సన్, కణగిలే ఎస్టేట్, కణగిలే గ్రామం, ఆగుంబె, కర్ణాటక రాష్ట్రం’ అని స్పష్టంగా రాయబడ్డాయి. మరికొన్ని ఉత్తరాల మీద ‘శ్రీమతి సంధ్యాదేవి వైఫ్ ఆఫ్ హెన్రీ థామ్సన్, కణగిలె ఎస్టేట్’ అని రాయబడివుంది. దాదాపు ముప్పై ఏళ్లుగా ఈ అడ్రస్‌కు బట్వాడ కాని, దుమ్ముధూళి నిండిన ఉత్తరాల రాశిని చూసినపుడు మణికాంత్ కుతూహలం వంద రెట్లు పెరిగింది. దాంతో పాటు ఉత్తరాలను అందజేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సహోద్యోగులపై కోపం కూడా వచ్చింది. కవర్లను తెరిచి చూడకూడదని మనసు చెప్పినప్పటికీ, పాతికేళ్ల కిందటి కవర్లను తెరిచి చూడటంలో ఏ సమస్యా లేదని మనసుకు అనిపించి ఆ మూటలో ఉన్న ఉత్తరాలను ఒక్కొక్కటిగా చూస్తూ పోయాడు. కొన్ని కవర్లలో ఉన్న క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులు, ఫోటోలు అతని దృష్టిని ఆకర్షించాయి. హెన్రీ థామ్సన్ అనే వ్యక్తి బ్రిటిష్ వ్యక్తి అని తెలిసిన మణికాంత్‌కు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డులు అతని కుటుంబీకులది, స్నేహితులవి అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆగుంబె ప్రాంత పరిసరాల్లో తీసిన ఫోటోలు అనేక అంతర్జాతీయ మ్యాగజైన్లలో, పత్రికలలో ప్రచురించబడ్డాయి. వాళ్లు పంపిన పత్రికలు, మ్యాగజైన్లు కూడా బట్వాడ కాకుండా మూటలో చేరుకున్నాయి.
థామ్సన్‍కు విపరీతమైన ఫోటోగ్రఫీ పిచ్చి ఉండేదని అక్కడి పత్రికల్లో ప్రచురితమైన ఫోటోలు చూడగానే మణికాంత్‌కు అనిపించింది. సంధ్యాదేవి పేరిట ఉన్న ఉత్తరాలను విప్పి చదవటానికి ఎందుకో మణికాంత్‌కు మనస్కరింలేదు. కణగిలె అనే గ్రామానికి వచ్చిన ఇన్ని ఉత్తరాలు దానికి సంబంధించిన వారికి చేరకుండా పోవడానికి కారణం ఏమై వుంటుంది? ఇన్ని సంవత్సరాలు గడిచినా చేరలేదంటే, కణగిలె అనే ఊరైనా ఉందా? ఉండివుంటే ఈ ఉత్తరాలు చేరివుండాలి.. చేరలేదంటే కణగిలె అనే ఊరు ఉండటం అసాధ్యం. అలాంటప్పుడు తన ముందున్న ఉత్తరాలు నేటికీ చైతన్యాన్ని కాపాడుకున్నాయి. ఏదో ఒక నిజాన్ని తమలో దాచిపెట్టుకున్నాయని చెబుతూనే ఉన్నాయి. దీని గురించి అడుగుదామంటే, మొత్తం పోస్టాఫీసులో తను తప్ప ఎవరూ లేకపోవటంతో మణికాంత్లో కుతూహలం మరింత పెరగడానికి కారణమైంది. చుట్టూ మౌనం. కానీ అతని మనసులో దూరి కూర్చున్న హెన్రీ థామ్సన్, సంధ్యాదేవిలు మాత్రం అతని మనసును తొలుస్తూనే ఉన్నప్పటికీ, మణికాంత్ ఒక్కచోట స్థిమితంగా కూర్చోలేకపోయాడు. అటు నుంచి ఇటు పచార్లు చేస్తూనే ఉ న్నాడు. పోస్ట్ మ్యాన్ కాళప్పగౌడ ఇంకా రాలేదు. అతను ఎప్పుడు వస్తాడు? ఈ ఉత్తరాల గురించి తాను అతనిని ఎప్పుడు అడుగుతాడో అన్నది వదలకుండా వేధిస్తూనే ఉంది. క్షణాలు దొర్లిపోతున్నప్పటికీ, ఒక్కొక్క క్షణాన్ని ప్రశ్నలుగా వేధిస్తున్న ఆ ఉత్తరాల గురించి తెలుసుకోవడానికి అతని మనస్సు తపిస్తూనే ఉంది. ఆ ఊళ్లో ఉన్న పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తున్నది కేవలం ముగ్గురు వ్యక్తులే. ఆ క్షణంలో ఎవరూ అతనికి దొరకలేదు. ఉద్యోగస్థులలో కాళప్ప పెద్దవాడు. ముప్పై ఏళ్లుగా అతను ఇక్కడే పనిచేస్తున్నాడు. అతనికి హెన్రీ థామ్సన్ గురించి కచ్చితంగా తెలిసివుంటుంది. అతన్నే అడగాలి, అడుగుదామనుకుంటే అతను అక్కడ లేడు..!
కాళప్ప వచ్చేవరకూ హెన్రీ థామ్సన్ మణికాంత్ సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. మణికాంత్ కుతూహలం క్షణక్షణం పెరుగుతునే ఉంది.
సుమారు ఒంటిగంట సమయానికి ఆ రోజు డెలివరీ చేయాల్సిన ఉత్తరాలు డెలివరీ చేసి సైకిల్ మీద వచ్చిన కాళప్పగౌడను కిటికీలోంచి చూసిన మణికాంత్ తాను అడిగే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవటానికి ఎదురుచూస్తున్నాడు. మణికాంత్ టేబుల్ మీద పరుచుకున్న ఉత్తరాల రాశిని చూసిన కాళప్పలో కలవరం..
“ఏమి కాళప్పా, ముప్ఫై ఏళ్లుగా ఈ ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. హెన్రీ థామ్సన్ అనే వ్యక్తికి వీటిని ఇంకా ఎందుకు డెలివరీ చేయలేదు? ఇన్నేళ్ల నుంచి ఇవి ఇక్కడే కుళ్లిపోతున్నాయి. ఈ లేఖలను సంబంధిత వ్యక్తులకు అందజేయాలనే కామన్‍సెన్స్ కూడా లేదా? మీ డ్యూటీ సక్రమంగా చేస్తున్నారా?”
మణికాంత్ కోపం వెనుక హెన్రీ థామ్సన్ గురించిన ప్రశ్నలు ఉన్నాయి.
సమాధానం చెప్పాల్సిన కాళప్ప, ఆఫీసర్ కోపంతో మాట్లాడినందుకు కలవరపడలేదు. పాపం, ఆయనకు విషయం గురించి ఏమీ తెలియదు. దాన్ని వారికి విడమరిచి చెబితే అర్థం చేసుకుంటారని గ్రహించి ఓర్పుగా సమాధానమిచ్చాడు.
“సార్, తమకు ఈ ఉత్తరాల విషయం ఏమిటో తెలియదని అనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన ఉత్తరాలన్నీ కణగిలే అనే ఊరికి వచ్చినవి. మీకు తెలుసా..? కణగిలె అనే ఊరు ఇప్పుడు లేదు. ఊరే లేకపోయిన తర్వాత నేను ఎలా ఆ ఊరికి వెళ్లగలను? ఎవరికి, ఎవరున్నారని ఈ ఉత్తరాలు ఇవ్వగలను? వచ్చిన ఎన్నో ఉత్తరాలను వారికి తిప్పి పంపడం జరిగింది. ఎన్నో తిరిగి పంపినప్పటికీ, ఇంకా ఇన్ని మిగిలివున్నాయి. నేను ఇప్పుడు ఏం చేయాలి సార్?”
“అలాగైతే ఈ ఉత్తరాలు సరైన చిరునామాకు వచ్చాయికదా! హెన్రీ థామ్సన్, శ్రీమతి సంధ్యాదేవి, కణగిలె ఎస్టేట్, ఆగుంబె – చిరునామా అంతా సరిగ్గానే ఉందనిపిస్తోంది. ఇంతకీ, ఈ హెన్రీ థామ్సన్ అనే వ్యక్తి ఎవరు? ఆయన ఇక్కడ నివాసం ఉండివుంటేనే కదా ఇన్ని ఉత్తరాలు రావడానికి సాధ్యం? ఆయనే లేరంటే ఈ ఉత్తరాలు ఎలా వచ్చాయి? కాళప్పా, ఈ విషయం గురించి, వచ్చి లేఖల గురించి నాకు సరైన సమాచారం ఇవ్వండి” – అని మణికాంత్ కొంచెం కోపంగానే కాళప్పతో మాట్లాడాడు.
“సార్, మీరు దగ్గర ఈ లేఖల గురించి, ఆ హెన్రీ థామ్సన్ గురించి దాచిపెట్టడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఆ ఊరిలో థామ్సన్ అనే బ్రిటిష్ దొర గురించి వందలాది కథలు చెప్పుకుంటారు. అందులో ఎంత నిజముంది? ఎంత అబద్ధముందో చెప్పేవారికీ తెలియదు. నాకు కూడా తెలియదు. హెన్రీ థామ్సన్, అతని భార్య సంధ్యాదేవి తమ ఎస్టేటు, సేవకులు, పనివాళ్లను పెట్టుకుని నివాసముండేవారు. ఏమైందో ఏమో ఒకసారి అతని కుటుంబీకులు, పనివాళ్లు, వారి బ్రిడ్జ్ మీదుగా వస్తున్నప్పుడు బ్రిడ్జ్ కూలిపోయి ఆ నది నీటిలో కొట్టుకుని పోయారు. థామ్సన్ గారు నిర్మించిన వంతెన కూలిపోవడంతో ఆ ఊరే మునిగిపోయిందని చెబుతారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నా చిన్నప్పుడు ఒకసారి వారి ఎస్టేట్‍లో పనికి వెళ్లాను. నేను వారిని రెండు మూడు సార్లు మాత్రమే చూశాను. ఆయన చనిపోయి ముప్పై ఏళ్లు పైగానే గడిచాయి. ఇప్పుడు ఆయన లేరు, ఆయన నిర్మించిన ఊరు కూడా ఇప్పుడు లేదు. థామ్సన్ దొర జీవించి ఉంటే, ఈ లేఖలు ఇచ్చివుండొచ్చు. ఆయన చనిపోయారనే విషయం ఆయన బంధువులకు, పరిచయస్థులకు తెలియదు. భార్యాపిల్లలు అందరూ చనిపోయిన తర్వాత ఎవరికి మాత్రం ఈ ఉత్తరాలు ఇవ్వాలి? ఆయన లేఖలకు వారసులే లేరు. ఆ కారణంగానే ముప్పై ఏళ్ల నుంచి వచ్చిన ఉత్తరాలను నేనే ఒక చోట మూటకట్టి పెట్టాను. పాపం, ఈ విషయం మీకు తెలియదుకదా.. అందుకే ఇలా టెన్షన్ పడుతున్నారు..” అని చెబుతూనే కాళప్ప తన పని మీద దృష్టి సారించాడు.
అతని వెంటే వచ్చిన మణికాంత్ ఇంకా ఉత్సాహం తగ్గలేదు. తన మనసులో ఉన్న మరో ప్రశ్న అడిగాడు. “అలాంటప్పుడు కణగిలే అనే ఊరికి ఎవరూ వెళ్లరా? అక్కడికి వెళ్లటానికి ఏదైనా మార్గం ఉందా?”
“సార్.. కణగిలే కొండకు వెళ్లడానికి ప్రతి ఒక్కరూ భయపడతారు. కొండ ఎక్కడానికి మంచి దారే లేదు. థామ్సన్ బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత కొండకు వెళ్లడానికి చాలా భయపడతారు. బ్రిడ్జ్ మునిగిపోయి ఇప్పటికి ముప్పై ఏళ్లు పైనే అయింది. కణగిలే అనే ఊరు పేరు ఇప్పటి వారెవరికీ తెలియదు. కానీ వారు ఆ వంతెన చుట్టూ ఉన్న దయ్యాల గురించి అనేక కథలు చెబుతారు. థామ్సన్, ఆయన భార్య సంధ్యాదేవి, పిల్లలు అందరూ ఎస్టేట్‍లో దెయ్యాలు, భూతాలై తిరుగుతూ ఉంటారని జనం మాట్లాడుకుంటారు. అక్కడికి వెళ్లిన వాందరికి ఆ దెయ్యాలు పీడలు తప్పవు. ఆ దయ్యాలన్నీ కొండ మీదున్న బ్రిటిష్ బంగ్లాలోనే ఉన్నాయని అందరూ అంటారు. నన్నూ మూడు నాలుగు సార్లు దెయ్యాలు వేధించాయి. అక్కడికి సమీపంలోనే నాకు రెండు ఎకరాల పొలం ఉంది. చివరికి ఎవరో కేరళ నుంచి వచ్చిన సాహెబ్‍కు అమ్మేశాను. ప్రాణాలు ఉంటేనే కదా ప్రశాంతంగా జీవించడం సాధ్యం. అదే లేకపోతే ఎలా జీవించగలం? ఇప్పుడైతే అటువైపు తల కూడా పెట్టి పడుకోం.. వద్దు సార్.. ఈ ఉత్తరాల గురించి ఎక్కువగా మాట్లాడవద్దు.. ఆ బ్రిటిష్ దొర గురించి ఎక్కువగా బుర్ర పాడుచేసుకోకండి” అని చెప్పిన కాళప్ప మౌనంగా తన పాటికి తాను బయటికి వచ్చాడు.
“అలా కాదు కాళప్ప. నాకు ఎందుకో హెన్రీ థామ్సన్ చనిపోయాడనే విషయమే వేధిస్తోంది. అతని గురించి తెలుసుకోవాలని అనిపిస్తోంది” అంటూ కాళప్ప వెనకే మణికాంత్ అడుగులు వేస్తున్నాడు.
“అయ్యో సార్, మౌనంగా ఉన్న విషయం గురించి ఎక్కువగా బుర్ర పాడు చేసుకోకండి. చనిపోయినవారు ఎలాగూ చనిపోయారు. చనిపొయినవారి గురించి ఎందుకు ఆందోళన, కుతూహలం..? ఆ ఉత్తరాలను మూటలో నింపి, అది ఎక్కడ ఉండిందో పెడతాను.. లేకపోతే ఈరోజు ఇద్దరం కలిసి కాల్చివేద్దాం.. అంతగా.. మనసులో పెట్టుకోకండి. రండి, ఈ రోజే ఇద్దరం భోజనానికి గుండా భట్ట ఖానావళికి వెళదాం.. నేను ఈ రోజు భోజనం కట్టించుకుని రాలేదు” అని చెప్పి ఆ విషయాన్ని దాటవేయడానికి ప్రయత్నించాడు.
ఈ విషయం గురించి మాట్లాడుకుంటూనే రెండు గంటలు గడిచిపోయాయి. వాచీ చూసుకున్న మణికాంత్ తనలోని కుతూహలాన్ని అదిమి పెట్టుకుని కాళప్పతోపాటు నడిచాడు.
గుండాభట్ట ఖానావళికి వెళ్లే దారిలో కాళప్ప, థామ్సన్ గురించి తనకు తెలిసిన కథ చెప్పసాగాడు.
“సార్, ఈ థామ్సన్ అనే బ్రిటిష్ దొర మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తమ దేశానికి వెళ్లలేదు. ఆయన ఇక్కడ కలెక్టర్‍గా ఉండేవారు. మా పక్కనున్న హోబ్లి కరణం కూతురు సంధ్యాదేవి వారిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ గుడ్డిదని అంటారుకదా, ఆ బ్రిటిష్ దొర సంధ్యాదేవిగారిని చాలా గాఢంగా ప్రేమించారట. ఆమె కోసం తన దేశాన్ని, కుటుంబాన్ని, స్నేహితులను, అధికారాన్ని అన్నిటిని వదిలేసి, అదిగో, అక్కడ కనిపిస్తుందే ఆ కణగిలె కొండమీద ఒక బంగ్లా, తోట, ఎస్టేటు నిర్మించుకుని నివసించేవారు. ఆ కొండకు వెళ్లే బ్రిడ్జ్‌ని కూడా ఆయనే కట్టించారట. నాకు గుర్తున్నంత వరకు ఆయన ఎస్టేట్‍లో చాలామంది పని చేసేవారు. ఆయన వాళ్లందరికీ అక్కడే ఇండ్లు కట్టించారు. తామున్న ప్రదేశానికి ‘కణగిలే’ గ్రామం అని ఆయనే పేరు పెట్టారట. నా చిన్నతనంలో ఆయన ఎస్టేట్లో పనికి వెళ్లేవాడిని. అప్పుడు నేను ఆయనను, ఆయన భార్యా పిల్లలను చూశాను. చాలా చక్కగా ఉండేవారు. అటుతర్వాత ఏమైందో ఏమో తెలియదు. తీవ్రమైన వర్షాకాలంలో, ఒక రోజు ఆయన కుటుంబంతోపాటు తానే నిర్మించిన బ్రిడ్జ్ దాటుతుండగా ఆ బ్రిడ్జ్ కూలిపోయిందని అందరూ చెబుతారు. అయితే ఆ బ్రిడ్జ్ ఎలా పడిపోయిందో ఎవరికీ తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తారు. జనాలు చెప్పేది నమ్మగలమా సార్.. మొత్తానికి ఆ బ్రిటిష్ బంగ్లా వెనుక చాలా పెద్ద కథే ఉంది సార్..”
తనకు తెలిసిన థామ్సన్ కథ చెబుతూనే గుండాభట్ట ఖానావళికి వచ్చి, రెండు భోజనాలు ఆర్డర్ చేసి కాళప్ప కాళ్లు చేతులు కడుక్కోవడానికి వెనుక వైపు వెళ్లాడు. మణికాంత్ మాత్రం ఇంకా థామ్సన్ ప్రపంచం నుండి ఇంకా బయటకు రాలేదు. అతను కాళప్ప చెప్పిన కథను మనసులో ఊహించుకుంటూనే ఉన్నాడు. అతని ఊహ అతన్ని మౌనమునిగా మార్చేసింది. అతని మౌనం ఆందోళనకు కారణమైంది. కాళ్లు చేతులు కడుక్కుని వచ్చిన కాళప్పని చూడగానే మణికాంత్‌కు ప్రశ్నలు నోటి చివరకు వచ్చాయి. “కాళప్పా, ఇప్పుడు ఆ వంతెన ఎక్కడ వస్తుంది? నాకెందుకో ఆ బ్రిటిష్ బంగ్లా చూసేవరకూ సంతృప్తి కలగదు మహానుభావా” అని అనడంతో కాళప్ప ఒక్క క్షణం అవాక్కయ్యాడు.
“సార్, మీకు ఎందుకైనా ఆ బ్రిటిష్ బంగ్లా కథ చెప్పానా అని ఇప్పుడు అనిపిస్తూవుంది. దయచేసి ఆ సాహసం చేయకండి. ఇప్పుడు అదంతా దట్టమైన అడవి ప్రదేశంగా మారింది. దూరం నుంచీ ఆ బ్రిటీష్ బంగ్లా మనకు కనిపిస్తుందే కానీ, అక్కడికి వెళ్లే మార్గం మాత్రం ఎవరికీ కనిపించదు. వంతెన కూడా నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు విపరీతమైన వర్షకాలం, నదిలో నీళ్లు నిండిపోయి ఉధృతంగా ప్రవహిస్తూ వుంది. ఈ రిస్క్ వద్దు సార్.. చాలా మందికి అక్కడున్న దెయ్యాల అనుభవం ఉంది. ఆ దెయ్యాలు నన్ను కూడా వేధించాయని ఇంతకు ముందే చెప్పాను. నిజం తెలిసి కూడా అక్కడికి వెళ్లాలని ఆలోచించకండి. మీకు నా కొడుకు వయసు. అనవసరంగా ఇలాంటి వాటిని తలమీదికి తెచ్చుకోకండి. ఆయనకు ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. రానీలేండి.. చనిపోయిన వాళ్ల గురించి మనమెందుకు బుర్ర పాడు చేసుకోవాలో చెప్పండి..” అని మాట్లాడుతూనే భోజన ప్లేట్లతో వస్తున్న గుండాభట్ట వైపు దృష్టి సారించాడు.
“ఏమంటున్నారు కొత్త సారు.. ఏదో గంభీరంగా మాట్లాడుతూ ఉన్నారు..?” అని కాళప్ప వైపు చూస్తూ గుండాభట్ట అడిగారు. “ఆ బ్రిటిష్ బంగ్లా కథ చెప్పాను. దాని గురించి విపరీతంగా బుర్ర పాడు చేసుకున్నారు. దాన్ని చూడాలట. వెళతాను, చూస్తాను అని అంటున్నారు? మీరైనా ఆయనకు బుద్ధి చెప్పండి భట్టగారు.. మాకంటే మీరు పెద్దవాళ్లు..”
కాళప్ప మాటలకు గూండా భట్ట గొల్లుమని నవ్వుతూ, “వేడి రక్తం.. ఆయనది వినే వయస్సా.. ఈ కాలపు పిల్లలకు దేవుడంటే ఉదాసీనత.. దెయ్యమంటే కూడా ఉదాసీనత..” అని మణికాంత్ ముఖం చూస్తూ భట్టగారు మరొకసారి గొల్లుమని నవ్వారు.
“అలాగైతే బ్రిటిష్ బంగ్లాల్లో దెయ్యాలు ఉండటం నిజమని మీరు నమ్ముతున్నారా భట్టగారు?” అని మణికాంత్ అడిగాడు.
“స్వామీ, మనం దేవుడిని ఎంత బలంగా నమ్ముతామో, అంతే బలంగా దెయ్యాలను కూడా నమ్ముతాం.. ఆ బ్రిటిష్ బంగ్లాలో దెయ్యాలు ఉంటడం కచ్చితం.. అనుభవం పొందినవారు ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు. నీలా నమ్మనివారు కూడా ఆ వంతెన దగ్గర అనుభవాన్ని పొందారు. ఇది మాకు కొత్త కాదు. నా వయసులో నీలాంటివాళ్లను చాలా మందిని చూశాను.. చూడండి మీ ఇష్టం.. అనుభవం కావాలంటే పొందండి. అంతే! అయితే ఏ కారణంగానూ మరీ ఎక్కువగా చింతించకండి..” గుండాభట్ట మణికాంత్ వైపు చూస్తూ చెబుతున్నారు. ఆయన తెచ్చి పెట్టిన కంచంలోంచి ఒక్కటంటే ఒక్క మెతుకు అతని నోటికి చేరలేదు. కాళప్ప మాత్రం గుండాభట్ట మాటలు వింటూ భోజనం చేయసాగాడు.
“భట్టగారు, నేనైతే చెప్పాను, మీరు కూడా చెప్తారా? నేను చెప్పింది అర్థం చేసుకుంటే అయ్యగారు ఇక్కడే ఎక్కువ రోజులు ఉండొచ్చు. లేకపోతే చాలా త్వరగా ఇక్కడి నుండి బదిలీ చేయించుకుని వెళ్లొచ్చు” అని భట్టగారి ముఖం చూసి నవ్వారు
వాళ్లిద్దరి నవ్వుకు మణికాంత్ నవ్వలేదు. అతని మౌనం భోజనం ముగిసేవరకూ కొనసాగింది. ఆ తర్వాత కాళప్ప దగ్గర బ్రిటిష్ బంగ్లా విషయంగా మాట్లాడనే లేదు.
***
ఆ రాత్రి మణికాంత్‌కు నిద్ర పట్టలేదు. అతని మనస్సంతా హెన్రీ థామ్సన్ ఆక్రమించుకున్నాడు. సంధ్యాదేవి అప్రతిమ సౌందర్యానికి మరులుపోయి ఆమె కోసం తన దేశానికి కూడా వెళ్లని థామ్సన్ అతన్ని వేధించసాగాడు. సంధ్యాదేవి అంత సౌందర్యవతి అంటే ఆమె ఎలా ఉండేది? థామ్సన్ కుటుంబమంతా నిగూఢంగా మరణించారంటే, అందులో కచ్చితంగా ఏదో నిజం ఉంది. ఎక్కడో తన మరణం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోమని థామ్సన్ చెబుతున్నట్టు మణికాంత్‌కు అనిపించసాగింది. హెన్రీ థామ్సన్ కలెక్టర్‍గా ఉన్నప్పుడు నిర్మించిన వంతెనలు ఇప్పటికీ ఇంగా దృఢంగా ఉన్నాయి. అలాంటప్పుడు కణగిలే కొండకు మార్గంగా నిర్మించిన ఈ వంతెన ఎలా పడిపోయింది? థామ్సన్ ఎస్టేట్ లోని పనివారిలో ఎవరైనా బతికివున్నారా? ఎవరైనా బతికివుంటే వారి ద్వారా నిజాన్ని తెలుసుకుని ఉండొచ్చు. అనుకోకుండా ఎవరైనా సజీవంగా ఉంటే, వారు ఎక్కడ ఉండొచ్చు? వాళ్లను ఎలా వెతకాలి? తమకు తెలిసిన నిజాన్ని వాళ్లు బయటపెడతారా? ఏదో విధంగా కణగిలే కొండ దారిని కనిపెట్టి, థామ్సన్ ఎస్టేట్‍లో ఉన్న ఆ బ్రిటిష్ బంగ్లాలోకి ఒకసారి దూరి వస్తే తనలోని ప్రశ్నలకు కొన్ని సమాధానాలైనా దొరుకుతాయని మణికాంత్‌కు అనిపించింది. అర్ధరాత్రి ఒంటిగంట. బుర్రంతా ఆక్రమించుకున్న ఈ ఆలోచనల వల్ల నిద్ర పట్టలేదు. కాళప్ప ఖచ్చితంగా దీనికి సహాయం చేయలేడు. అతన్ని నమ్ముకుంటే అంతే! ఎవరిని అడగాలి.. ఎవరు సహాయం చేయగలరు. మణికాంత్ ఈ ప్రశ్నలు తెల్లవారుజామున నాలుగుగంటల వరకూ కొనసాగింది. ఆ తర్వాత మణికాంత్ కొద్దిసేపు నిద్రపోయాడు!
ఉదయం పది గంటలకు మణికాంత్‌కు మెలకువ వచ్చినా నిద్రమత్తు అతని కళ్లను బాధిస్తూనే ఉంది. ఆలోచనల సెల అతని అక్షిపటలం నుంచి జరగనేలేదు. రాత్రి ఆలోచనలు, ప్రశ్నలు మళ్లీ జీవం పోసుకుని పిచ్చి గుర్రాల్లా పరుగెత్తడానికి సిద్ధమయ్యాయి. కంటి ముందుకొచ్చి నిలుచున్న ఒక వ్యక్తి, మణికాంత్‌ను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. మణికాంత్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.
తన ముందు నిలుచున్న శ్వేతవర్ణపు ఆ వ్యక్తి థామ్సన్ లాగా కనిపిస్తున్నాడు. ఇతనే బ్రిటిష్ అధికారి థామ్సన్ అయివుండాలి. ఇతను చనిపోయాడు కదా! మరి ఎలా వచ్చాడు? తననెందుకు తదేకంగా చూస్తున్నాడు? ఆ.. ఆ.. ఇతని చావు వెనుక రహస్యం గురించి తాను ఆలోచిస్తున్నాడు.. మణికాంత్‌కు ఒక్క క్షణం భయం వేసింది.. మరుక్షణం మనస్సులో తలెత్తుతున్న ప్రశ్నలు.. వాటికి సమాధానాల కోసం అన్వేషణ.. తనకెందుకు ఈ విధమైన పిచ్చి..! థామ్సన్ చనిపోయాడనే విషయం ప్రజలు మర్చిపోయారు. అతని మరణం వెనుక రహస్యం ఎవరికీ అక్కర్లేదు. అతని కుటుంబం సభ్యులు దెయ్యాలయ్యారు. బ్రిటిష్ బంగ్లా చుట్టూ తిరుగుతున్నారు. ప్రజలను వేధిస్తున్నారు. తమ ఆస్తిని కాపలా కాస్తున్నారు.. ఇక్కడి జనం చెప్పే సంగతులు. అలాగైతే ఇది ఎంతవరకు నిజం? తన ముందు నిలబడి ఉన్న ఈ తెల్లవాడిని అడిగెయ్యనా? ఇతనే థామ్సన్ అయితే, కచ్చితంగా తన మరణం వెనుక ఉన్న రహస్యం తెలిసివుంటుంది. ఆ రహస్యం తాను తెలుసుకుంటే బ్రిటిష్ బంగ్లా వెనుకనున్న రహస్యాన్ని తాను ఊరు మొత్తానికి చెప్పొచ్చు. ఇన్ని సంవత్సరాలుగా ఎవరూ తెలుసుకోని ఈ రహస్యాన్ని తాను ఊరంతా చెప్పొచ్చు. మణికాంత్ తన ముందు నిలబడి ఉన్న శ్వేతవర్ణపు వ్యక్తిని అడిగేలోపు, అతను నిలబడి ఉన్న చోట కనిపించలేదు. మాయమయ్యాడు. అలాగైతే ఇంత సేపు తనను చూస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడికి వెళ్లాడు? తనను ఎందుకు అతను చురచుర చూశాడు. ఇప్పుడు కనిపించినవాడు క్షణంలో మాయమయ్యాడు.. అబ్బా అతని ముఖం, మనసులో ఇంకా దిట్టంగా కూర్చునివుంది. మరిచిపోలేని ముఖమది..!
ఇప్పుడు కళ్ల ముందున్నవాడు క్షణాల్లో మాయమైపోయాడు. ఏమిటిది? మాయనా? మణికాంత్‌కు తెల్లవారుజామున కలిగిన ఈ అనుభవం కొంచెం భయాన్ని పుట్టించినా ఎక్కడో ఒక చోట తాను భ్రమాలోకంలో మునిగిపోయాడా? అనే ప్రశ్న వేధించసాగింది. థామ్సన్ దెయ్యమయ్యాడని ఊరిజనం మాట్లాడుకోవడంలో సత్యముందా? ప్రజలు ఈ విధమైన వేధింపుతో బాధపడుతున్నారా? దీనికి వాళ్లు ప్రేతాత్మల వేధింపు అని చెబుతుండవచ్చా? ఉన్నా ఉండొచ్చు. అలాగని దీన్ని నమ్మడం చాలా కష్టం. మంచం మీద కూర్చున్న, అతన్ని ఆలోచనలు విపరీతంగా కమ్ముకుని వేధించసాగాయి. కాళప్ప చెప్పినట్లు, ఈ హెన్రీ థామ్సన్ ఆలోచనలోంచి తాను బయటికి రావాలా?
మణికాంత్ ఎందుకో మరింత మౌనంగా మారాడు. కానీ అతనిలో ఈ విషయంగా ముందుకుసాగాలా వద్దా అనే ద్వంద్వభావన, పోరాటం నడుస్తూనే ఉన్నాయి. క్షణక్షణమూ తలెత్తిన ప్రశ్నలు సరైన సమాధానాల కోసం తహతహలాడుతూనే ఉన్నాయి.
తాను కొత్తగా ఇంటిని అద్దెకు తీసుకున్న కరిమలె వీరాంజనేయుడి దేవాలయం దగ్గర పాతకాలం నాటి ఇళ్లు చాలా ఉన్నాయి. అక్కడంతా ఎనభై దాటిన వయస్సు మీరిన వృద్ధులు కొందరున్నారు. వారి దగ్గర బ్రిటిష్ బంగ్లా విషాద కథ గురించి అడిగినప్పుడూ, కాళప్ప చెప్పిన కథనే వేరే విధంగా మరింత విస్తారంగా వర్ణించారు. అందరూ బ్రిడ్జి మునిగిన ప్రదేశంలో దెయ్యాలు, ప్రేతాత్మలు ఉండటం వాస్తమేనని అన్నారు. అలాగైతే తెల్లవారుజామున తన ముందు నిలుచున్న శ్వేతవర్ణపు ఆ వ్యక్తి ఎవరు? అది థామ్సన్ దెయ్యం కావచ్చా? మణికాంత్ మొహంలో చెమటలు పట్టాయి. మనసు లోపలి మాటలు నోటి నుంచి బయటికి రావడం లేదు. ప్రజలు చెప్పే నిజాన్ని అంగీకరించనా? లేదా దీని వెనుక ఉన్న సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్లనా?
మణికాంత్ మనసు సత్యపు ద్వారం కోసం వెతుకుతూనే ఉంది.
***
బ్రిటీష్ బంగ్లా విషయాన్ని మనసులో నింపుకుని లోలోపల గిలగిలా తన్నుకుంటున్న మణికాంత్, పోస్టాఫీసులో ఉన్నప్పుడు కూడా తీవ్రమైన నిశ్శబ్దానికి లొంగిపోయాడు. సహెూద్యోగులు కాళప్ప, ఏకనాథ్‌లు అతన్ని పలకరించటానికి ప్రయత్నించినా, అతను మునుపటిలా స్పందించడం కష్టమైంది.
కాళప్ప మణికాంత్‌ను కలిసి “కొద్దిరోజులు సెలవు తీసుకుని మీ ఊరికైనా వెళ్లిరండి.. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్నప్పటి నుంచీ మీరు ఈ విధంగా నిస్తేజంగా ఉండటం నేను చూడలేకపోతున్నాను.. మీరు కొన్ని రోజులు నీ ఊరికి వెళ్లిరండి” అని ఒత్తిడి పెట్టసాగాడు.
‘అవును.. కాళప్ప చెప్పటంలో వాస్తవం ఉంది. తన మనసు కూడా ఎందుకో మునుపట్లా లేదు. కొద్దిరోజులపాటు కార్వార్‌కు వెళ్లి కుటుంబీకులతో కలిసివుండి వస్తే మనసు కుదుటపడవచ్చ’ని అనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చినప్పటికీ మూలలో కనిపిస్తున్న బ్రిటిష్ బంగ్లాకు వచ్చిన వందలాది ఉత్తరాల రాశిని చూసినప్పుడల్లా మనస్సులోని ద్వంద్వం మరింత పెరుగుతోంది. ‘అలాంటప్పుడు ఏది చేయాలి? ఊరికి వెళ్లిరావటమా? లేదా బ్రిటీష్ బంగ్లాకు దారి వెతకటమా?’
రోజులు గడుస్తున్న కొద్దీ మణికాంత్ మనసు మళ్లీ విచలితమైంది. ఇంట్లో ఒంటరిగా ఉండడం ఎందుకో మనస్కరించటం లేదు. ఇంట్లో కూర్చున్నా, నిల్చున్నా శ్వేతవర్ణపు వ్యక్తి ఎప్పుడూ తనతోపాటే ఉంటాడు. తన వైపే చూస్తుంటాడు. పలకరించినా అతను మాట్లాడడు. అతను మాట్లాడినట్లు ప్రవర్తించినా, అతని భాష తనకు అర్థం కావటం లేదు. మొదట్లో భయాన్ని కలిగిస్తున్న అతను ఇప్పుడు అలవాటైపోయాడు. సాయంత్రం ఇంటికి వెళ్లినప్పుడు గుమ్మంలోనే తన కోసం ఎదురుచూస్తుంటాడు. తాను తలుపు తెరిచి లోపలికి రాగానే, అతను తన వెనుకే వచ్చి తన కదలికలను గమనిస్తుంటాడు. తన నుండి ఏదైనా సహాయం కావాలా? అని అడుగుతాడు. కాఫీ, స్నాక్స్, భోజనం చేసుకున్నప్పుడు తనకు ఎక్కడ అన్నట్టు కనుబొమ్మలు ఎగరేస్తాడు. ఏం చేయాలి? తనను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టని అతను, తాను రాత్రి పడుకున్నప్పుడు కూడా తన మంచం చుట్టూ తిరుగుతుంటాడు. ఒక్కడే ఒంటరిగా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. అతను తరచుగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. నవ్వుతాడు. ఎవరికో ఏదో సైగ చేస్తుంటాడు. ఆ శ్వేతజాతీయుడే హెన్రీ థామ్సన్ అని తనకు అనిపించినా, అతన్నుంచి అసలు నిజం తెలుసుకోవడానికి తనకు సాధ్యం కావటం లేదు. ఏం చేయాలి? రహస్యంగా అనిపించే ఆ విషాదపు నిజమైన తలుపును ఎలా తెరవాలి? ఒక్కడినే నిలిచి సత్యపు తలుపును తెరుద్దామనుకుంటే ఈ ఊరిలో తనకు మద్దతు ఇచ్చేవారు ఎవరూ లేరు.. ఇంట్లో తనతో పాటు ఉండే శ్వేతవర్ణపు వ్యక్తి మాత్రం వెంటాడుతూనే ఉన్నాడు. అతన్ని ఇంటి నుండి, మనస్సు నుండి ఎలా బయటకు తరమాలి? వెళ్లు అంటే వెళ్లే వ్యక్తి కాదు..! తిట్టినా, మాట్లాడినా అతనికి అర్థం కావటం లేదు. అయినా తనతోనే ఉంటున్నాడు. తనను ఇబ్బంది పెట్టకుండా..
కన్నడ మూలం: శ్రీధర బనవాసి
అనువాదం: రంగనాథ రామచంద్రరావు
(ఇంకా ఉంది)