[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]
సంగీత ప్రాశస్త్రములో అంశాలు – 3వ భాగము:
యుగ విభజనం:
[dropcap]వా[/dropcap]ఙ్మయచరిత్రను యుగాలుగా విభజించినట్లే వాగ్గేయకార చరిత్రను కూడా విభజించవచ్చు. ప్రబంధరచనా పద్దతిలోని విశిష్టతను, లక్షణాలను బట్టి ఆయా యుగానికి ఆయా పేర్లు పెట్టడం అన్ని భాషలలోను వాఙ్మయ చరిత్రకారులంతా అవలంభించిన ప్రసిద్ధ సంప్రదాయం.
ఈ సంప్రదాయాన్ని బట్టి, మన వాగ్గేయకార చరిత్రను ఆయా యుగాలుగా విభజించాను. మొత్తం 11 యుగాలు.
I. సామగాన యుగం:
వేదకాలం నాటి ప్రబంధాలు, ఋక్కులు, గాథలు, సామములు దేవభాషలో వుంటాయి.
2. గాంధర్వ యుగం:
మార్గ లేక గాంధర్వ భక్తిప్రధానములు సంస్కృత, కావ్యభాషలో వుంటాయి. బ్రహ్మ విరచితములు, వాటిని స్వరబద్ధంచేసి, భరతుని నాట్యశాస్త్రం, శార్ఙ్గదేవుని సంగీత రత్నాకరము మొదలగు లక్షణ గ్రంథాలలో సుస్వరంగా వాటిని ఆయా లక్షణకర్తలు ఉదహరించారు. శివస్తుతి పురాలు.
3. ఆఖ్యాన యుగం:
రామాయణ, మహభారత, ఇతిహాసాలు వీణావాద్యములు పెట్టుకుని గానం చేయు వారిని కశీలపులు అంటారు. ఇంత వరకు సంస్కృత, దేశభాషలలో ప్రబంధాలు, గేయరచనలు లేవని చెప్పలేము.
4. ధ్రువాగాన యుగం:
దేశభాషలలో ప్రబంధనీతులు.
5. రాగకావ్య యుగం:
అభినవ గుప్తాచార్యుడే తన అభినవభారతిలో రాగ కావ్యముతో ప్రబంధములుగా చెప్పాడు. టక్క రాగంలో పాడవలసిన రాఘవ విజయ కావ్యము, కకుభ రాగంలో పాడవలసిన మారీచకధా కావ్యమూ ఉదాహరణలుగా వివరించాడు.
6. గీతగోవింద యుగం:
ధ్రువాపద యుగం నాటి లక్షణాలు, రాగకావ్య లక్షణాలు కలుపుకొని, బహురాగములతో బహుధ/ వాఫలమున మద్య మధ్య శ్లోకములతో భక్తి శృంగారాత్మకేతివృత్తంలో సర్గలుగా విభజించబడిన గీతగోవిందం తరువాత యుగ లక్షణానికి మార్గదర్శి అయింది. 11, 12 శతాబ్దాల మధ్య వెలసిన జయదేవుని కాలం ఆంధ్రభాషకు సాహిత్య స్థాయికి రాజసభా గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
7. దేశభాషా సంకీర్తన యుగం:
13వ శతాబ్దిలో దేశగేయ రచనా రీతులను స్వీకరించి మాతృభాషలో సంకీర్తనములు రచించడం ప్రారంభమైన కాలం. 15, 16, శతాబ్దాలలో వెలసిన అన్నమయ్య కాలం సంకీర్తన స్వర్ణయుగం.
8. యక్ష గాన యుగం:
16వ శతాబ్దం ప్రారంభంలో యక్షగాన రచనలకు సాహిత్యస్థాయి, సభాగౌరవము లభించాయి. ఒక యుగం జరుగుతుండగా మరొక యుగం ప్ర్రారంభం కావటం, ఒక శతాబ్ది దాటిన తర్వాత ఆ ప్రారంభన ప్రబంద రూపం పరిపక్వ స్థితి పొందడం యిలాగే, సాగుతుంది. సంకీర్తన యుగం 13వ శతాబ్దంలో ప్రారంభించినా, తాళ్ళపాక వెలసిన 15, 16వ శతాబ్దాలలో సంకీర్తన తన రూపాన్ని బహు విధాల పరిపక్వ స్థితిలో సవరించుకొని, 17వ శతాబ్దంలో రామదాసు, సుబ్రహ్మణ్య (అధ్యాత్మ రామాయణ కర్త) కవుల కీర్తనలో క్రమంగా భక్తి ప్రపత్తినీ, ఆఖ్యాన పద్ధతినే అవలంబించింది. ఆ కాలంలో వెలసిన నారాయణ తీర్థుల సంకీర్తన పద్ధతిలోని భక్తి రసాన్ని, అధ్యాత్మికాదాత్యాన్ని పుణికి పుచ్చుకున, తన యుగానికి విశేష లక్షణమైన యక్షగాన రూపంలో రచన సాగించాడు.
9. ధాతుకల్పనా పరిణామ యుగం:
క్షేత్రయ్య శృంగార భావానికి ప్రాముఖ్యం యిచ్చి, భావ ప్రధానమైన రాగ విన్యాసములకు అనుగుణమైన ధాతు రచనలో సమాన ప్ర్రాథాన్యం గల పదాలు రచించారు. ఇంతకు ముందు మాతౌవ్య రచన ప్రధానంగా యుండి – ధాతువు మాతువుకు కవచంగా వుండి ఉపాంగంగా ఉండేది. అంటే అన్నమయ్య కీర్తనలలో మాటలు ప్రధానం, సంగీతం ఉపాంగం. ధాతుకల్పనకు మాతువుతో సమప్రాధాన్యం యిచ్చి క్షేత్రయ్య వేసిన ప్ర్రాతిపదిక త్యాగరాజాదుల నాడు పరిపక్వత చెందింది.
10. సభాసంప్రదాయ యుగం:
క్షేత్రయ్య కాలం నుంచి వున్నా త్యాగయ్య కాలం నాటికి ఒక స్పష్ట రూపం దాల్చింది. తరువాత కుడా చాలా అభివృద్ది పొందింది. ధాతు కల్పన ప్రాధాన్యం ఎక్కువైంది. పాట లోని సంగతుల కల్పన ఎక్కువై మాటలు ఉపాంగాలయ్యాయి.
11. హరికధా యుగం:
19వ శతాబ్దం చివరిలో యక్షగానాలు హరికథలుగా పరిణామం చెందాయి. సంగీత సభా సంప్రదాయాలు విశిష్ట రూపం దాల్చి, పల్లవి రచనములు, చిట్టస్వర కల్పనలు విరివిగా జరిగాయి. క్రమంగా ధాతు ప్రాధాన్యం మరీ ఎక్కువైంది. మాతువులోని భావ ప్రదర్శనం మృగ్యమైపోయేటంత వరకు వచ్చింది. విద్వత్ ప్రకర్షణములైన సంగీత సభ ఒక ప్రక్క పండిత రంజనం చేస్తుంటే, హరికథలు పండిత పామర రంజకాలై వ్యాప్తి పొందాయి.
(ఇంకా ఉంది)