[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[కాశీ నుంచి వచ్చాక వసుంధరమ్మకి ఆరోగ్యం బాగోలేకపోతే, మేనమామ లాయర్ గోపాల శర్మ గారింట్లో ఉంటుంది. విశాఖపట్టణం వెళితే, ఆరోగ్యం చక్కబడుతుందని సొంతింటికి వెళ్ళాలని అనుకుంటుంది. అద్వైత్ లండన్ వెళ్తున్నందున స్కూలుకి ఆరు నెలలు సెలవు పెడతాడు. వెళ్ళే లోపు పిల్లల వార్షిక పరీక్షల పేపర్లు దిద్ది ఇవ్వాల్సి ఉన్నందున అతను అత్తతో విశాఖకి వెళ్ళలేకపోయాడు. అద్వైత్‍ని సీతని ఇంట్లోంచి, శాస్త్రి గారు, సావిత్రి వసుంధరమ్మని విశాఖలో దింపడానికి బయల్దేరుతారు. బావకి దగ్గరయ్యేందుకు ఇదే సమయమని భావించిన సీత, సుమతికి తన ప్రణాళిక చెప్పి సహకరించమని అడుగుతుంది. ఆమె పాండురంగతో చర్చించి, ఇద్దరూ – తమని అమ్మావాళ్ళు పిలిచారని, వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోతారు. పై అధికారులు రాబర్ట్ పనితీరును మెచ్చుకుని మూన్ స్థానంలో కల్నల్ ప్రమోషన్ ఇస్తారు. ఆ సందర్భంగా రాబర్ట్ తన ఇంట ఓ పార్టీ ఇవ్వదలుస్తాడు. ఉదయం మేరీని కలవడానికి ఇంటికి వచ్చిన అద్వైత్‍ని సాయంత్రం పార్టీకి రమ్మని ఆహ్వానిస్తాడు. సరేనంటాడు అద్వైత్. ఇంటికొచ్చాకా, పేపర్లు దిద్దే పనిలో లీనమవుతుంటే, సీత చనువుగా మాట్లాడాలని ప్రయత్నిస్తే, విసుక్కుంటాడు. ఆమె ఏదో మాట్లాడాలని అంటే, సాయంత్రం మాట్లాడుకుందాం అంటాడు. సాయంత్రం ఏడు దాటాకా రాబర్ట్ ఇంటికి వెళ్తాడు. పార్టీలో అద్వైత్‍ని మద్యం తాగమంటాడు. తనకి చల్లటి కూల్ డ్రింక్ ఇప్పించమని అద్వైత్ అడుగుతాడు. కానీ రాబర్ట్ – బేరర్‍తో మత్తు కలిగించే ద్రవాన్ని అద్వైత్‍కి ఇప్పిస్తాడు. కొద్దిగా తాగాకా, అది మద్యమని గ్రహించిన అద్వైత్ – తనను అవమానించటానికే రాబర్ట్ ఇలా చేశాడని గ్రహిస్తాడు. అయితే తాగకుండా వదిలేస్తే అందరూ హేళన చేస్తారని అనుకుంటాడు. త్రాగి రాబర్ట్‌కు ఎదురుగా నిలబడి షాక్ ఇవ్వాలనుకుంటాడు. బేరర్‍ని మరో గ్లాసు ఇవ్వమని అడిగి, దాన్నికూడా తాగి, రాబర్ట్ చేస్తున్న తప్పుల్ని అన్యాపదేశంగా బహిరంగంగా చెప్తాడు. మత్తులో బయటకు వచ్చిన అద్వైత్‍ను సుల్తాన్ భాయ్ కారులో ఇంట్లో దింపుతాడు. సీత సాయంతో మంచం మీద పడుకోబెడతాడు. అద్వైత్ పక్కనే మంచం మీద కూర్చుని ఆలోంచించిన సీత – బావని దక్కించుకోవాలన్న ఆలోచనతో అతని పక్కన పడుకుంటుంది. – ఇక చదవండి.]
అధ్యాయం 35:
[dropcap]రా[/dropcap]త్రి ఆశ్రమంలో వుండిన ఆండ్రియా, ఇండియా, మేరీలను తీసికొని వచ్చేదానికి సుల్తాన్ ఉదయం నాలుగున్నర గంటలకు ఆశ్రమానికి వచ్చాడు. సిద్ధంగా వున్న వారు.. సుల్తాన్‌తో ఇంటికి బయలుదేరారు.
“పార్టీ ఎలా జరిగింది సుల్తాన్!..” అడిగింది ఆండ్రియా.
సుల్తాన్.. వెంటనే జవాబు చెప్పలేదు. జరిగిన యథార్థ విషయాన్ని ఆండ్రియాకు చెప్పాలా వద్దా అనే ఆలోచనలో వుండిపోయాడు.
కొన్నిక్షణాల తర్వాత ఆండ్రియా..
“సుల్తాన్ భాయ్!.. మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు!..” అంది ఆండ్రియా.
యథార్థాన్ని తెలియజేయాలనే నిర్ణయానికి వచ్చిన సుల్తాన్.. పార్టీకి అద్వైత్ రావడం.. రాబర్ట్ అతని చేత త్రాగించడం.. ఆ తర్వాత వారివురి మధ్యన జరిగిన సంభాషణలను క్రమంగా వివరించాడు సుల్తాన్.
ఆ ముగ్గురూ.. రాబర్ట్ రాక్షస చర్యకు ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు. “డెవిల్… నో హుమ్యానిటీ..” అసహనంగా ఆవేశంతో అంది ఆండ్రియా.
తాను.. అద్వైత్‌ను ఇంటికి ఏ విధంగా చేర్చిన విషయాన్ని కూడా చెప్పాడు సుల్తాన్.
“ఫాదర్ యీజ్ ఎ ఛీటర్ మమ్మీ!..” అంది ఇండియా కసిగా..
“యువర్ ఫాదర్ యీజ్ నాట్ ఎ మ్యాన్. జంగిల్ క్రూయల్ అనిమల్..” అంది ఆవేశంతో మేరి.
తర్వాత.. ఆ ముగ్గురూ ఏమీ మాట్లాడలేదు. రాబర్ట్ విషయంలో ఎవరికి తోచిన రీతిలో వారు ఆలోచించసాగారు. అభిప్రాయ భేదాల వలన.. ఆండ్రియా రాబర్ట్ మధ్యన దాంపత్య అన్యోన్యత సంవత్సరంగా నశించింది.
రాబర్ట్ ఆఫీస్ లిల్లీ అనే ఆంగ్లో ఇండియన్ పనిచేస్తూ వుంది. రాబర్ట్ లిల్లీని మచ్చిక చేసికొన్నాడు. ఆండ్రియా ఇండియాలు ఆశ్రమానికి వెళ్ళిన సమయంలో రాబర్ట్ లిల్లీతో తన నిలయానికి వచ్చేవాడు.. లిల్లీతో కలసి ఆనందంగా.. మందు మజా.. చేసికొనేవాడు.
లిల్లీతో తన నిలయానికి రావాలనుకొన్న రోజు.. రాబర్ట్ సుల్తాన్‍ను ఇంటికి వెళ్ళి రెస్టు తీసికోమని చెప్పేవాడు. తన కార్యకలాపాలు అతనికి తెలియకూడదని.
కానీ.. సుల్తాన్ ఆ విషయాన్ని ఎప్పుడో పసిగట్టాడు. కానీ ఎవరికీ చెప్పలేదు. ఆ రహస్యాన్ని తనలోనే దాచుకొన్నాడు.
సుల్తాన్ కారును రాబర్ట్ యింటి పోర్టికోలో ఆపాడు. ఆండ్రియా ఇండియా మేరీలు కారు దిగారు. ఆండ్రియా వేగంగా వెళ్ళి తలుపును తట్టింది. తలుపు తెరవబడలేదు.
కొన్ని నిముషాల తర్వాత.. బలంగా తట్టింది. పడకపై వున్న రాబర్ట్ లిల్లీలు ఉలిక్కిపడి మేల్కొన్నారు. బెదురు చూపులతో లిల్లీ రాబర్ట్ ముఖంలోకి చూచింది.
“గో యిన్ సైడ్ ద రెస్టు రూమ్..” అన్నాడు రాబర్ట్.
లిల్లీ.. పరుగున రెస్టురూమ్‌లో దూరి తలుపు మూసుకొంది.
రాబర్ట్ లేచి మంచం దిగి సింహద్వారాన్ని సమీపించి గడియ తీశాడు.
ఆండ్రియా కోపంతో తలుపును త్రోసింది. అది తెరుచుకొంది. ఎదురుగా నిద్ర కళ్ళతో వున్న రాబర్ట్‌ను చూచింది.
“వై సో లెట్ టు ఓపన్ ద డోర్!..” అడిగింది ఆండ్రియా.
“అయాం ఇన్ స్లీప్..” చెప్పాడు రాబర్ట్. వెంటనే నిర్లక్ష్యంగా వెను తిరిగాడు.
“లాస్ట్ నైట్ వాట్ యు డిడ్!..”
“ఎంజాయ్డ్ ద పార్టీ!..”
ఇండియా.. మేరీలు వారిరువునీ సమీపించారు.
“డిడ్ అద్వైత్ కమ్ టు ద పార్టీ..”
“అఫ్‌కోర్సు..”
“వై యు హ్యావ్ మేడ్ హిమ్ టు డ్రింక్ ఫాదర్..” అవేదనతో అడిగింది ఇండియా.
“డోన్ట్ కాల్ హిమ్ యాజ్ ఫాదర్!..” బిగ్గరగా ఆవేశంతో అంది ఆండ్రియా.
“హేయ్! రాబర్ట్ ఆర్ యూ ఏ మ్యాన్!..” ఆశ్చర్యంతో అడిగింది మేరీ.
“నో.. హి యీజ్..” ఆండ్రియా పూర్తిగా చెప్పక మునుపే..
“యానిమల్.. దిసీజ్ ద థింగ్ వాట్ యు వాంటు సే యునో!..” నిర్లక్ష్యంగా నవ్వాడు రాబర్ట్.
“యు డిడ్ ఎ గ్రేట్ మిస్టిక్..” అంది ఇండియా.
రాబర్ట్‌కు రోషం వచ్చింది. “నో!!!” బిగ్గరగా అరిచాడు.
ఆ అరుపుకు ఆ ముగ్గురూ.. బయట వరండాలో వున్న సుల్తాన్.. రెస్ట్‍రూమ్‍లో వున్న లిల్లీ ఆశ్చర్యపోయారు.
“మామ్!.. ఇండియా!.. డోన్ట్ టాక్ విత్ దిస్ యానిమల్..” అని, రాబర్ట్ వైపుకు తిరిగి.. “ఐ విల్ నాట్ స్టే విత్ యు..” అంది ఆండ్రియా
“దిస్ యు హ్యావ్ టోల్డ్ సెవరల్ టైమ్స్..” వ్యంగ్యంగా నవ్వాడు రాబర్ట్.
“దిస్ యీజ్ ఫైనల్ సేయింగ్.. ఐ విల్ గివ్ డైవర్స్!..”
“దిసీజ్ ఆల్సో ఏ స్టీరియో రికార్డ్..” బిగ్గరగా నవ్వాడు రాబర్ట్.
“నౌ యిటీజ్ నాట్ స్టీరియో.. యిట్ యీజ్ ఎ బుల్లెట్.. మేక్ యిట్ ఏ నోట్..”
“డోంట్ బార్క్..”
“హు యీజ్ బార్కింగ్. మై డాటర్.. నో.. నో.. యిట్ యీజ్ యు.. యు..!..” ఆవేశంగా అంది మేరీ.
ఆ ముగ్గురి అవతారాలను ఆవేశాన్ని చూచి ఇండియా నిట్టూర్చింది.
“మై స్వీట్ హార్ట్.. మమ్మీ!.. ప్లీజ్ కమ్ విత్ మి. వుయ్ నీడ్ నాట్ స్టే హియర్..”
“ఆండ్రియా!..” ఏదో చెప్పబోయిన మేరీని చెప్పనీకుండా..
“మమ్మీ!.. ప్లీజ్ స్టాప్!.. నో క్వశ్చన్ ఆఫ్ కన్విన్సింగ్.. ఐ హవ్ డిసైడెడ్ టు అపార్ట్ ఫ్రమ్ హిమ్” ఆవేశంతో తన గదికి వెళ్ళిపోయింది ఆండ్రియా.
“యిఫ్ యు డోన్ట్ లైక్ మి.. వై ఆర్ యు స్టేయింగ్ హియర్ యు కెన్ గో వేరెవర్ యు వాంట్.. డోర్స్ ఆర్ ఓపన్!..” అన్నాడు రాబర్ట్.
“ఫాదర్!..” దీనంగా అంది ఇండియా.
“యు షటప్!..” ఆవేశంగా అన్నాడు రాబర్ట్.
“సూన్ యు ఆర్ గోయింగ్ టు..”
“యూ టూ షటప్!..” మేరీ చెప్పడం ముగించక ముందే.. ఆమె ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అన్నాడు రాబర్ట్.
“మమ్మీ!.. ఇండియా!.. ప్లీజ్ కమ్ ఇన్..” తన గది నుంచి బిగ్గరగా అరిచింది ఆండ్రియా.
“గో గో షి యీజ్ కాలింగ్!..” వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు రాబర్ట్.
ఇండియా.. మేరీలు ఆండ్రియా గదిలో ప్రవేశించారు.
వరండాలో నిలబడి వారి సంభాషణనంతా విన్న సుల్తాన్ ‘కథ క్లైమాక్స్‌కు చేరింది.. ముగింపు ఎలా వుంటుందో!..’ అనుకొన్నాడు.
రాబర్ట్.. తన గదిలోనికి వెళ్ళిపోయాడు.
పావుగంటలో.. ఆండ్రియా.. ఇండియా.. మేరీలు చేత సూట్‌కేసులతో వరండాలోకి వచ్చారు. వారిని చూచిన సుల్తాన్ ఆశ్చర్యంతో
“అమ్మా!.. ఎక్కడికి!..” దీనంగా అడిగాడు.
“ప్లీస్ గో టు మిస్టర్ మూన్స్ హౌస్..” అంది ఆండ్రియా. ముగ్గురూ కార్లో కూర్చున్నారు. సూట్‌కేసుల్ని డిక్కిలో పెట్టి.. కారును స్టార్ట్ చేశాడు సుల్తాన్.
అధ్యాయం 36:
ఐదు గంటలకు సీతకు మెలుకువ వచ్చింది. కళ్ళు తెరచి ప్రక్కకు చూచింది. అద్వైత్ చేయి తన కడుపుపై వుంది. అతను గాఢ నిద్రలో వున్నాడు.
సీత మెల్లగా ప్రక్కకు జరిగి అద్వైత్ చేతిని మంచంపై వుంచింది. మంచం దిగి అద్వైత్ ముఖంలో కొన్నిక్షణాలు చూచి చిరునవ్వుతో ఆ గది నుంచి బయటికి వచ్చింది.
‘సీతా!.. జయించావు..’ అనుకొని తనలో తాను గర్వంగా నవ్వుకొంది.
అరగంటలో కాలకృత్యాలు ముగించి.. బట్టలు మార్చుకొని నొసటన సిందూరాన్ని దిద్దుకొని.. వంట గదిలోనికి వెళ్ళి పాలు కాచి.. సగ్గుబియ్యాన్ని ఉడికించి పాలల్లో వేసి పాయసం తయారు చేసింది.
పెరట వైపుకు వెళ్ళి చెట్లకు వున్న పూలను కోసి ప్లేట్లో వుంచుకొని పూజగదిలోకి వచ్చి ప్లేటును పూజా మందిరం ముందు వుంచి.. వంటగదికి వెళ్ళి పాయసపు గిన్నెను తెచ్చి పూల ప్లేటు ప్రక్కన వుంచి.. విగ్రహాలపై వున్న వాడిన పూలను తీసి కుందుల్లో దీపాలను వెలిగించి పూలతో విగ్రహాలను అలంకరించి శ్రీ శివశతనామావళిని చదివి.. పాయసాన్ని నైవేద్యం పెట్టి.. మోకాళ్ళ పై కూర్చొని ఐదు నిముషాలు దైవాన్ని ధ్యానించింది.
‘ఓ సర్వేశ్వరా!.. జగత్ రక్షకా.. మాతా జగత్ జననీ మహేశ్వరీ.. నా తప్పును మన్నించండి. నా బావ విషయంలో నా మనస్సున వున్న అభిప్రాయం మీరు నాకు కలిగించిందే!.. ఆ ఇండియాతో బావ లండన్ వెళ్లిపోబోతున్నాడు. అది మామగారి నిర్ణయం. బావ కాదనలేడు. నాకు దూరంగా వెళ్ళే బావకు నేను తన దానిగా గుర్తు ఉండాలని.. నేను తప్ప మరెవరూ బావ మనస్సున నిలవకూడదని.. త్వరలో బావ నావాడుగా తిరిగి నా కోసం.. తిరిగి రావాలని ఆ సాహసాన్ని చేశాను. నేను చేసింది తప్పని మీకు అనిపిస్తే.. యీ యావత్ జగానికి మాతా పితలైన మీరు నన్ను మన్నించాలి. నా బావ.. నా వాడుగా త్వరలో తిరిగి వచ్చేలా చేయాలి..’ దీనంగా కన్నీటితో ఆ మాతా పితలను సీత ప్రార్థించింది.
లేచి.. కన్నీటిని తుడుచుకొని వంటగదికి వెళ్ళి కాఫీ పెట్టి చక్కెర వేసి.. సరిపోయిందా లేదా అని చిటికిన వ్రేలిని ముంచి నాలుకకు అద్దుకుంది. తియ్యగా కాఫీ బాగా కుదిరిందనిపించింది. చిరునవ్వుతో వెనక్కు తిరిగి అద్వైత్ గది తలుపును మెల్లగా తోసి లోనికి తొంగి చూచింది. చిరునవ్వుతో తన గదికి వెళ్లిపోయింది.
అద్వైత్ మంచం మీద లేడు. బాత్‌రూమ్‍లో వున్నాడు.. స్నానం చేస్తున్న అతని మనస్సున ఎంతో కలవరం.
సీత లేచి వెళ్ళిన పావుగంటకు అద్వైత్ లేచాడు. మంచం వైపు చూచాడు. వాడిన సన్నజాజులు మంచం తలగడలపై కనుపించాయి. మనస్సున.. అనుమానం.. లీలగా ఏదేదో జ్ఞాపకం.. అంతా అస్పష్టతగా గోచరించింది. మనస్సు తనువు చల్లబడే దానికి పావుగంటసేపు చన్నీటి స్నానం చేశాడు.
‘రాత్రి.. నా వలన ఏదో తప్పు జరిగింది.. వాడిన పూలు నా మంచంపై వున్నాయంటే.. సీత.. సీత.. నా మంచంపై పడుకొంది.. నేను.. నేను.. త్రాగిన మైకంలో.. మైకంలో.. తప్పు చేశాను.. తప్పు చేశాను..’ అనుకొన్నాడు.
అదే ఆలోచనలతో… బాధతో.. బట్టలు మార్చుకొన్నాడు. కుర్చీలో కూర్చున్నాడు. అతని దృష్టి మంచంపై మరలింది. మంచంపై పడుకొని ఆనందంగా నవ్వుతున్న సీత అతని కళ్ళకు గోచరించింది. కళ్ళు మూసుకొని తలను అటూ ఇటూ ఆడించాడు.
‘తప్పు చేశాను..’
‘సీతకు నా ముఖాన్ని ఎలా చూపించాలి…’ మనస్సున ఆవేదన.
‘బాధపడితే.. తప్పు ఒప్పుగా మారుతుందా!.. సీతను చూచేదానికి భయపడితే.. తాను నన్ను గురించి ఏమనుకొంటుందో!.. పాపం.. తాను ఎంతగా బాధపడుతూ వుందో!.. ఆమెను ఓదార్చవలసిన వారెవరు?.. నేనేగా!.. నేనేగా!..’ అనుకొని కుర్చీ నుండి లేచి వంట యింటి వైపుకు వెళ్ళి లోన చూచాడు. సీత అక్కడ లేదు.. పెరటి వైపుకు వెళ్ళి చూచాడు.. సీత కనుపించలేదు.
మెల్లగా సీత గదిని సమీపించాడు. తలుపును ముందుకు తోశాడు. తెరచుకొంది. లోనికి చూచాడు.
సీత మంచంపై వెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకొని వుంది. ఆ క్షణంలో ఆమె ముఖంలో ఎంతో ఆకర్షణ.. ప్రశాంతత గోచరించాయి అద్వైత్‍కు.
మెల్లగా గదిలో ప్రవేశించి మంచాన్ని సమీపించి.. “సీతా!..” మెల్లగా పిలిచాడు.
సీత కళ్ళు తెరచి చూచి వెంటనే మంచం దిగి అతనికి వీపు మళ్ళించి..
“ఏం బావా!..” ప్రీతిగా అడిగింది సీత.
“రాత్రి..”
క్షణం తర్వాత.. “రాత్రి..” అంది సీత.
“నా వల్ల గొప్ప తప్పు జరిగింది..”
“నా వల్ల కూడా బావా!..”
“తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం చేసికోవాలిగా!..”
సీత మౌనంగా వుండిపోయింది.
“సీతా!.. నీకు నా మీద కోపమా!..” దీనంగా అన్నాడు అద్వైత్.
“లేదు.. లేదు.. బావా… నీ మీద నాకు కోపం లేదు” అద్వైత్ వైపుకు తిరిగింది సీత. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో అద్వైత్ మీది ఆరాధనా భావం. కొన్ని క్షణాలు అతని ముఖంలోకి జాలిగా చూచి తల దించుకొంది.
“బావా!.. నా దృష్టిలో నీవు ఎలాంటి తప్పు చేయలేదు. నేను నీదాన్ని. నా మీద నీకు సర్వహక్కులూ వున్నాయి..” మెల్లగా చెప్పింది సీత.
సీత మాటలను విని.. నిట్టూర్చాడు అద్వైత్ ‘యీ పిచ్చి పిల్ల నన్ను ఎంతగానో ప్రేమిస్తూ వుంది..’ అనుకొన్నాడు.
“సీతా నేను బజారు దాకా వెళ్ళి వస్తాను..”
“ఎందుకో తెలుసుకోవచ్చా!..”
“నేను ప్రాయశ్చిత్తం చేసికోవాలి సీతా!..”
“దానికి ఏం కావాలి బావా!..”
“మాంగల్యాలు..”
సీత ఆనందంగా అద్వైత్ ముఖంలోకి చూచింది.
“ఆగు..”
వేగంగా వెళ్ళి తన అలమరాను తెరచి.. తన బట్టల క్రింద వున్న చిన్న పెట్టె తెరచి అందులోని మాంగల్యాలను (బంగారు దండంతో) బయటికి తీసింది. అద్వైత్‍ను సమీపించింది. తల దించుకొని..
“బావా!.. ఇవిగో, నీవు కోరే మాంగల్యాలు..” చెప్పింది సీత.
అద్వైత్ ఆశ్చర్యపోయాడు.
“సీతా!.. ఇవి నీకు ఎక్కడివి?..”
“చేయించాను బావా!..”
“ఎప్పుడు.. మూడు నెలల క్రింద..”
“ఎందుకు?..”
“నిన్ను ప్రేమిస్తున్నానని.. నీవు నా వాడివని నీకు చెప్పి నీచేత కట్టించుకోవాలని..” చిరునవ్వుతో మాంగల్యాలను అతని చూపుతూ చెప్పింది సీత.
ఆ మాంగల్యాలను అద్వైత్ తన కుడి చేతిలోకి తీసుకొన్నాడు. ఎడమ చేతితో ఆమె కుడి చేతిని పట్టుకొన్నాడు. ఇరువురూ పూజా మందిరంలోకి వచ్చారు. అద్వైత్ మాంగల్యాలను పూజా విగ్రహాల పాదాల ముందు వుంచాడు. చేతులు జోడించాడు. కొన్ని క్షణాల తర్వాత వంగి మాంగల్యాలను చేతికి తీసుకొన్నాడు. సీత అతని కళ్ళల్లోకి ఆనందంగా చూస్తూ నిలబడి వుంది.
అద్వైత్ ఆమెకు దగ్గరగా జరిగాడు. ఆమె విగ్రహాల వైపు తిరిగి కూర్చుంది. ఆమెకు ముందు నిలబడి వంగి మాంగల్యాన్ని అద్వైత్ ఆమె మెడలో వేశాడు.
విగ్రహాల ముందున్న సిందూరాన్ని తీసి ఆమె నొసటన దిద్దాడు. సీత వంగి అద్వైత్ రెండు పాదాలను తన చేతులతో తాకి కళ్ళకు అద్దుకొంది.
అద్వైత్ ఆమె భుజాలను పట్టుకొని పైకి లేపాడు. సీత పరమానందంగా పశవశంతో అతని కళ్ళల్లోకి చూచింది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కన్నీరు.. అవి కన్నీరు కాదు.. ఆనంద బాష్పాలు..
తనపై పంచతో సీత కన్నీటిని తుడిచాడు అద్వైత్. పరవశంతో సీత అతన్ని అల్లుకుపోయింది.
అద్వైత్ శరీరం జలదరించింది. ఆమెను తన కౌగిలిలో బంధించాడు. అతని హృదయానికి సీత హృదయ స్పందన వినిపించింది.
కొన్ని క్షణాల తర్వాత..
“సీతా!..” మెల్లగా పిలిచాడు అద్వైత్.
“ఊ..” అంది సీత.
“నేను లండన్ నుండి తిరిగి వచ్చేవరకూ.. యీ విషయాన్ని నీవు ఎవరికీ చెప్పకూడదు. నాన్నగారు నా వివాహాన్ని ఎంతో ఘనంగా చేయాలని కలలు కంటున్నారు. వారి కలలను నిజం చేయడం నా బాధ్యత కదూ!..”
“అవును బావా!.. నీ మాటను నేను పాటిస్తాను. మనకు రెండు పెళ్ళిళ్ళు..” అందంగా ఆనందంగా నవ్వింది సీత.
సీత వంగి.. తాను తయారు చేసిన పాయసాన్ని గ్లాసులో పోసి అద్వైత్ కళ్ళల్లోకి ఆరాధనా భావంతో చూస్తూ.. “పాయసం తాగు బావా!..” అంది.
“ఎప్పుడు చేశావ్!..”
“నీకంటే ముందు లేచానుగా!..” నవ్వింది సీత.
చిరునవ్వుతో గ్లాసు అందుకొన్నాడు అద్వైత్. పాయసాన్ని త్రాగసాగాడు.
“నాకు కొంత మిగల్చాలి..” కొంటెగా నవ్వుతూ అంది సీత.
అద్వైత్ గ్లాసును.. సీతకు అందించాడు. సీత ఆనందంగా పాయసాన్ని తాగింది.
వాకిట నుండి.. ‘సీతా!..’ అనే పిలుపు. ఆ కంఠం సుమతిది.
“సీతా!.. పాండురంగ.. సుమతి వచ్చినట్లున్నారు.. నేను చెప్పింది!..”
“ఎలా మరచిపోగలను బావా!..”
“నీవు వంట గదికి వెళ్ళు.. నేను వెళ్ళి తలుపు తెరుస్తాను..”
సీత వంట గది వైపు.. అద్వైత్ సింహద్వారం వైపుకు నడిచారు.
అద్వైత్ తలుపు తెరిచాడు. ఎదురుగా పాండురంగ.. సుమతి.. చిరునవ్వులతో నిలబడి వున్నారు.
“ఏరా పాండు!.. రాత్రి రాలేదే?..”
“మామయ్యగారు.. ఉదయాన్నే వెళ్ళమన్నారు బావా!..”
“అన్నయ్యా!.. సీత ఏదీ?..” అడిగింది సుమతి.
“వంటింట్లో వుందనుకొంటాను..”
సుమతి వంట యింటి వైపుకు వేగంగా వెళ్లింది.
“పాండు.. నాతో రా.. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి”
ఇరువురూ అద్వైత్ గదిలో ప్రవేశించారు.
సీత కాఫీని గ్లాసులో పోస్తూంది.
సుమతి గదిలోకి మెల్లగా వెళ్ళి ఆమె వెనక నుంచి సీత కళ్ళు తన చేతులతో మూసింది.
“సుమతీ.. తమరి స్వరాన్ని నేను విన్నాను. చేతులు తియ్యి. కాఫీ యిస్తా తాగుదువు గాని..” అంది సీత. సుమతి చేతులు కళ్ళపై నుంచి తీసింది.
సీత కాఫీ తట్టను సుమతి ముందుంచి.. “కాఫీ తీసుకో!..” నవ్వుతూ చెప్పింది.
“నీ కాఫీ తర్వాత.. ముందు ఏమయిందో చెప్పు”
సీత సిగ్గుతో తల దించుకొని.. “విజయం..” నవ్వింది. ఒక గ్లాసును సుమతికి అందిస్తూ.. “కాఫీ తీసుకో” అంది. సుమతి కాఫీ గ్లాసును అందుకొంది.
మిగతా గ్లాసుతో సీత అద్వైత్ గదిలోకి వెళ్ళింది. అద్వైత్‌కు.. పాండుకు కాఫీని అందించింది.
అద్వైత్‌కు అలనాటి సన్నివేశం గుర్తుకు వచ్చింది. ప్రశ్నార్థకంగా సీత ముఖంలోకి చూచాడు.
సీత నవ్వుతూ.. “అన్నా పాండు!.. కాఫీ త్రాగి ఎలా వుందో చెప్పు. యీ బావకు నా మీద అనుమానంరా!..” వాలు కంట అద్వైత్‌ను చూస్తూ చెప్పింది సీత.
పాండు కాఫీ చిప్ చేసి.. “సీతా!.. కాఫీ.. అమృతం.. బావా తాగి చూడు..”
సుమతి అక్కడికి వచ్చింది.
అద్వైత్ కాఫీ సిప్ చేశాడు.
“ఎలా వుంది బావా!..” ప్రీతిగా అద్వైత్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సీత.
“నా చిన్న మరదిగాడు నాతో ఎప్పుడూ నిజమే చెబుతాడు. ఆ పెద్దవాడు రాఘవే.. నన్ను అప్పుడప్పుడూ ఆటపట్టిస్తాడు. నా అయోమయస్థితి వాడికి ఆనందం.. ఎలా వున్నాడో!..”
“బావా! మనిద్దరం వెళ్ళి అన్నయ్యను చూచి వద్దామా!..” అంది సీత.
“ఏమిటీ!..”
“సీత చెప్పిన మాట మంచిదే కదా బావా!.. యిద్దరూ కలసి వెళ్ళి ఆ భద్రాద్రి సీతారాములను దర్శించి.. రాఘవతో ఓ రోజు గడిపి రండి”
“అవునన్నయ్యా!.. ఇరువురూ కలసి జాలీగా వెళ్ళి రండి” చెప్పింది సుమతి.
అద్వైత్ ఆలోచించసాగాడు.
“రెండు రోజుల ప్రయాణానికి ఇంతగా ఆలోచించాలా బావా!..”
అద్వైత్ సీత ముఖంలోకి చూచాడు.
“వెళ్ళి వద్దాం బావా!..” గోముగా అంది సీత.
“సరే సీతా!.. వెళ్ళొద్దాం..” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.
“ఒరే పాండూ.. మన బావ మంచోడేరా..” ఆనందంగా నవ్వింది సీత. అందరూ సరదాగా నవ్వుకొన్నారు.
“ఆఁ.. పాండు, నేను నీతో చెప్పాలనుకొన్న విషయం!..”
“చెప్పండి బావా!..”
“మరేం లేదురా!.. ఆండ్రియా మేడం ఓ అనాథ ఆశ్రమం నడుపుతూ వుందన్న విషయం నీకూ తెలుసుగా!..”
“తెలుసు..”
“ఆమె లండన్ వెళ్ళిపోతూ వుంది. కొద్ది రోజుల తర్వాత తిరిగి వస్తారు. అంతవరకూ.. ఆ ఆశ్రమ నిర్వాహక బాధ్యతలను నమ్మకస్థుడికి అప్పగించాలని.. నాకు తెలిసిన వారెవరైనా వుంటే చెప్పమని అడిగారు. నేను నిన్ను దృష్టిలో పెట్టుకొని సరే అన్నాను. నీవు ఆ బాధ్యతను స్వీకరించగలవా!..”
“బావా!.. మీరు చెప్పడం.. నేను కాదనడమా!.. తప్పకుండా స్వీకరిస్తాను. మానవసేవయే మాధవ సేవ కదా బావా!..” నవ్వుతూ చెప్పాడు పాండురంగ.
“సరే!.. చాలా సంతోషంరా!.. నీవు యీ రోజు ఎక్కడికీ వెళ్ళవలసిన పని లేదుగా!..”
“లేదు బావా!..”
“అయితే.. వెళ్ళి ఆండ్రియా మేడంను కలిసి.. నేను పంపానని చెప్పి మాట్లాడిరా”
“అలాగే బావా!..”
సీతకు సుమతికి చెప్పి పాండురంగ రాబర్ట్ నిలయం వైపుకు బయలుదేరారు.
అతని వరండా ముందు సుల్తాన్ భాయ్ కనుపించాడు.
“బావా!.. సుల్తాన్ భాయ్ వచ్చాడు” చెప్పి.. పాండురంగ వెళ్లిపోయాడు. ఆ పిలుపు విని అద్వైత్.. వరండాలోకి వచ్చాడు. సుల్తాన్‍ను చూచాడు.
“సుల్తాన్ భాయ్!.. భద్రాచలం దాకా వెళ్ళి రావాలనుకొంటున్నాను. నాకు ఒక టాక్సీ కావాలి”
“బాబూ! మీరు కుశలమే కదా!..” చిరునవ్వుతో అడిగాడు సుల్తాన్
“కుశలమే సుల్తాన్ భాయ్!.. మరి టాక్సీ!..”
“ఏర్పాటు చేస్తాను బాబు. మీరు ఎప్పుడు బయలుదేరుతారు?..”
“టాక్సీని ఏర్పాటు చేస్తే.. ఓ గంటలో బయలుదేరుతాం”
“మీరు ఒక్కరేనా!..”
“నేను.. సీత..”
“అరగంటలో టాక్సీతో వస్తాను బాబు. మీరు సీతమ్మా రడీ కండి..” సుల్తాన్ భాయ్ వేగంగా వీధి వైపుకు వెళ్ళిపోయాడు.
అక్కడే నిలబడి అంతా విన్న సీత ముఖంలోకి చూచి.. “సీతా!.. సంతోషమేనా!..” చిరునవ్వుతో అడిగాడు అద్వైత్.
“చాలా చాలా సంతోషం బావా..” పరమానందంతో చెప్పింది సీత..
(ఇంకా ఉంది)