[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘మైసూరు అరమనే’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]మై[/dropcap]సూరు చాముండి హిల్స్ పాదాలను ఆనుకుని ఉన్నది. ఇది బెంగుళూరుకు నైరుతి దిశగా నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మాకు ఎన్నిసార్లు మైసూరు చూసినా పూర్తిగా చూడలేదనే అనిపిస్తుంది. ఒక్కోసారి ఒక్కొక్కటి చూస్తూ ఉoటాం. మైసూరు అనే పదం మహిషూరు అనే పదం నుంచి ఉద్భవించింది. మహిపాషాసురుడు అనే రాక్షసుడు పాలించిన నేల కావటాన దీనికా పేరు వచ్చింది. తొమ్మిది రోజులు యుద్ధం చేసిన దుర్గాదేవి పదవరోజున ఈ మహిషాసురుణ్ణి వధించింది. చెడుపై మంచికి జరిగే విజయన్ని అనుసరించి విజయదశమి అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ దుర్గా మాతకు చాముండేశ్వరిగా పేరు వచ్చింది. చాముండి హిల్స్ మీద అవతరించిన కారణంగా చాముండేశ్వరిగా పిలవబడుతున్నది. ఈ పేరును గుర్తుచేస్తూ మైసూరు పట్టు వస్త్రాలు, మైసూరు శాండల్ సబ్బులు, మైసూరు బోండాలు అనే టిఫిను, మైసూరుపాక్ అనే స్వీటు, మైసూరు గోల్ట్ లీఫ్ పెయింటింగ్ అనే చిత్రాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. మైసూరు అంటేనే ఎన్నిటికో ప్రసిద్ధి.
మైసూరు ప్యాలెస్‌ను ఎన్నిసార్లు చుసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. మొదటిసారి మైసూరు వెళ్ళినపుడు రాత్రి పూట వెళ్ళి ఉదయానికల్లా వచ్చేశాo. రాత్రి పూట వెలుగుల్లో బృందావన్ గార్డెన్స్ మైసూరు ప్యాలెస్‌ను చూశాం. మైసూరు ప్యాలెస్‌ను బయటి నుంచే చూసి ఫోటో తీసుకున్నాము. బంగారు రంగు కాంతితో మెరిసిపోయే రాజభవనాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు అనిపిస్తుంది. మేమూ ఆ రాత్రంతా బృందావన్ గార్డెన్స్ లోని నీళ్ళ సయ్యాటల్లో మునిగి తేలాం. రంగు రంగుల దీపాల వెలుగుల్లో నీళ్ళ నాట్యాలను చూస్తుంటే ఇంత సాగసైన వయ్యారాల నీళ్ళెనా భయంకర తుఫాన్లను తీసుకువచ్చేది అనిపిస్తుంది. వాటి లాలిత్యము, సోయగము, వంపుసొంపుల్ని వీనుల విందైన సంగీతంతో వీక్షించడం ప్రధాన ఆకర్షణ.
భారతదేశం లోని అతి పెద్ద రాజభవనాల్లో మైసూరు ప్యాలెనను గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పటికీ ఆ రాజభవనంలో వడయార్ రాజులు నివసిస్తున్నారు. మైసూర్ నుంచి శ్రీరంగపట్నానికి టిప్పు సుల్తాన్ రాజధానికి మార్చాడు. టిప్పు సుల్తాన్ మరణం తర్వాత మైసూరు మరల వడయార్ రాజుల వశమయ్యింది. మైసూరు ప్యాలెస్‌తో పాటు జగన్మోహన ప్యాలెస్, జయలక్ష్మి ప్యాలెస్, లలితామహల్ వంటి ఎన్నో ప్యాలెస్‌లు ఉన్నాయి.
మైసూరు ప్యాలెస్ లోని కొద్ది భాగం మాత్రమే రాజ కుటుంబీకులు అట్టిపెట్టుకుని మిగతా భవనాన్నంతా మ్యూజియంగా మార్చేశారు. ప్యాలెస్‌కు నాలుగు వైపులా ద్వారాలు ఉన్నాయి. ద్వారాల వద్ద కూడా ఎంతో కళను ప్రదర్శించారు. లోపలకు ప్రవేశించాక రాజభవనాన్ని చూస్తుంటే పూర్వ రాజుల వైభవం కళ్ళ ముందు నిలుస్తుంది. ద్వారాలకు ఎదురుoగా రెండు వైపులా రెండు సింహలను ప్రతిష్ఠించారు. ఆ సింహాల ప్రతిమలు ఎంత బాగుంటాయో! నల్లని రాళ్ళతో చెక్కి ఉంటాయి. ప్యాలెస్ చుట్టూ తిరిగి నడవలేని వారికి బ్యాటరీ కార్లుంటాయి. వంద రూపాయలు ఇస్తే రాజభవనం చుట్టూతా తిప్పి తీసుకుని వస్తాడు. లోపల ఉన్న పురావస్తు సంగ్రహాలయాన్ని చూడాలంటే టిక్కెట్టు తీసుకోవాలి. రాజభవనం లోపలికి చెప్పులు అనుమతించబడవు.
రాజభవనం ఆవరణలో చాలా ఆలయాలు కనిపించాయి. దాదాపు పన్నెండు ఆలయాలకు పైగా ఉన్నట్లు అక్కడి వాళ్ళు చెప్తుంటే విన్నాము. ప్రధాన ద్వారం దాటగానే సోమేశ్వరాలయం కనిపిస్తుంది. దీనికున్న తలుపు ఎత్తు తక్కువగా ఉన్నది. ఇంకొక గుడి లక్ష్మి రమణాలయం కనిపిస్తున్నది. ఈ గుడి లోపరికి మనుష్యులు వెళుతున్నట్లుగా అనిపించలేదు. అంటే ఇందులో వైష్ణవాలయం, శివాలయు రెండూ ఉన్నాయి. పర్యాటకులకు రాజభవనం చూడటానికే సమయం సరిపోవడం లేదు. అందుకే చుట్టూ గబగబా చూసేసి భవనం లోపలికి వెళ్ళిపోతున్నారు. వడయార్ రాజుల ఆభరణాలు, వారి కుటుoబ చిత్రపటాలు వంటి వన్నీ ప్రదర్శనలో ఉంటాయి.
రాజభవనం మొత్తం ఇండో శార్సినిక్ శైలిలో నిర్మించబడింది. పదమూడవ శతాబ్దం నుంచి వడయార్ రాజుల అధీనంలోనే ఉన్నది మధ్యలో మైసూరును హైదరలీ హస్తగతం చేసుకుని ఆలయాలను, రాజభవనాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాతి కాలంలో టిప్పుసుల్తాన్‌ను ఓడించి వడయార్ రాజులు మైసూరును వశం చేసుకున్నారు. బంగారంతో చేసిన రాజా సింహాసనం, రాజ దర్బారు, కల్యణ మండపం వంటివి పర్యాటకులకు అద్భుతమైన మనోహరమైన ప్రధాన ఆకర్షణలుగా కనిపిస్తాయి. పండుగ రోజుల్లో, ప్రతి ఆదివారం కూడా రాజభవనం లోని పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలను వెలిగిస్తారు. రాజభవనం మీద ఉన్న బంగారు పగోడాలు అపూర్వంగా కనిపిస్తాయి. మైసూరు రాజులు కళలకు ఎక్కువ ప్రాధానమిచ్చేవారని చెప్పడానికి రాజమందిరం సాక్ష్యంగా నిలుస్తున్నది. భారతీయ యూరోపియన్ వాస్తు నిర్మాణంలో ప్రధాన ద్వారం అలరిస్తున్నది.
మైసూరు ప్యాలెస్‌ను ‘మైసూరు అరమనే’ అని కన్నడ భాషలో పిలుస్తారు. బెంగూళూరులో టిప్పు సుల్తాన్ కోటను ‘టిప్పు సుల్తాన్ అరమనే’ అంటారు. టిప్పు సుల్తాన్ వేసవి కాలం విడిది చేసే భవనమిది. మైసూరు ప్యాలెస్‌ను అంబా ప్యాలెస్ ఆనీ కూడా అంటారు. ఇందులో సౌండ్ అండ్ లైట్ షో కూడా ఉంటుందట. మేమయితే చూడలేదు. ఇది మాడు అంతుస్తులు ఉంటుంది. పచ్చని పచ్చిక బయళ్ళు, దేవాలయాలతో కన్నుల కింపుగా ఉటుంది. ఈ ప్యాలెస్ మంటల్లో కాలిపోవడంతో తిరిగి రాజమందిరాన్ని నిర్మించటం జరిగింది. పెద్ద పెద్ద స్తంబాలతో దర్బార్ హాల్, అనేక గదుల సమాహారం ఈ రాజమందిరం.
వడయార్ రాజులు వాడిన కత్తులు, చుర కత్తులు, ఖడ్గాలు చిత్రాలు ఇందులో ఉన్నాయి. కృష్ణ రాజ వడయార్ రాజుల పెళ్ళి వేడుకలు, పట్టాభిషేకం, వారి తల్లిదండ్రుల చిత్రపటాలున్నాయి. రాజా రవివర్మ వేసిన తైల వర్ణ చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. వారు వాడిన పాత్రలు, వస్తువులు, వస్త్రాలు, ఒక్కో, గదిలో అందంగా తీర్చిదిద్దబడ్డాయి. రాజుల చిత్రాలు నిజంగా మనిషిని దగ్గరుండి చూస్తున్నట్లుగా అనిపించింది. మేము మంచి ఎండల్లో అంటే మే నెలలో వెళ్ళే సరికి, బాగా చెమటలు కారిపోయాయి. బాగా అలసిపోయాం కూడా, బంగారు సింహాసనాన్ని ఫోటో తీసుకున్నాం.
దసరా ఉత్సవాలలో ఏనుగు మీద బంగారు అoబారిలో కత్తిని పెట్టి ఊరేగిస్తారు. బంగారు అంబారీ కూడా అద్బుతంగా ఉన్నది. తలుపులు, ద్వారాలు మెట్లు వంటి వన్నీ రోజ్ వుడ్‌తో చేయబడ్డాయి. బెంగుళూరు, మైసూరు ఆడవుల్లో ఎక్కువగా దొరికే నల్ల చెక్కను వాడారు. అందమైన నగిషీలతో చెక్కబడి కళ్ళకింపుగా ఉన్నాయి. రాజ దర్బారు లైట్ల కాంతులతో మిరుమిట్లు గొల్పుతూ ఏది చూడాలో అర్థం కానట్లు అనిపించింది. నేల మీది బండలు సైతం చలువరాళ్ళతో పరచబడ్డాయి. సీలింగ్, గోడలు కూడా మ్యూరల్ ఆర్ట్‌లో కళ్ళు జిగేల్ మంటున్నాయి. విద్యుత్ కాంతులు ఎక్కువగా ఉండటం వల్ల పోటోలు సరిగా రాలేదు. కానీ చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు అనిపించింది.
మొత్తం తిరిగి చూసే సరికి అలసిపోయి బయటకు రాగానే కూల్ డ్రింక్ పాపుల్లో దూరాము. పెద్ద పెద్ద వృక్షాల మధ్య నుంచి రాజభవనాన్నీ చూస్తుంటే మతి పోయింది. భవనం పైన ఉండే గోపురాలు బంగారంతో చేయబడ్డాయి. సింహాల ప్రతిమలు పౌరుషానికి సంకేతాలుగా మలచబడ్డాయి. ఇవీ మైసురు ప్యాలెస్ లోని విశేషాలు.