(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[అల వెళ్ళలేక వెళ్ళలేక ఢిల్లీ వెళ్తుంది. అలలో వచ్చిన మార్పులు, ఆమె ఎదుగుదలని మనసులో మెచ్చుకుంటుంది మహతి. ప్రేమ గురించి, పెళ్ళి గురించి అల వెలిబుచ్చిన అభిప్రాయాలను తలచుకుంటుంది. ఢిల్లీ వెళ్ళే ముందు రాత్రి కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు – అవసరమైతే ఇందిరగారికి బాసటగా ఉండమని, వీలైతే ఉప్పలపాడుకి తీసుకువెళ్ళమని అల చెప్తుంది. తనకీ ఆ ఆలోచన వచ్చిందనీ, కానీ స్పష్టత లేదని అంటుంది మహతి. హైదరాబాద్ వచ్చి వారమైందనీ, తానిక్కడ ఉందడం అనవసరం అనిపిస్తోందని భర్తతో అంటుంది అహల్య. పిల్లల చదువులు పాడయిపోతున్నాయనీ, విజయవాడ వెళ్ళడమే మంచిదని అంటుంది అహల్య. గౌతమ్ ఏమీ చెప్పలేకపోతాడు. మహతి ఇందిర దగ్గరకు వెళ్ళి ఆవిడని మాటల్లో పెడుతుంది. అల గురించి ఆవిడ అడిగిన వివరాలు చెప్తుంది. తన తండ్రి వాళ్ళ అమ్మానాన్నలు తెలుసా అని మహతి ఇందిరని అడిగితే, ఆమె తనకి తెలుసున్న వివరాలు చెబుతుంది. తన తండ్రి చేసిన ద్రోహానికి తనతో తమ వంశం అంతమైపోతోందని అంటుంది ఇందిర. మా నాన్న మిమ్మల్ని ప్రేమించారా అని మహతి అడగబోయి ఆగిపోతే, ఆ ప్రశ్నను గ్రహించిన ఇందిర – ఆ విషయం ఆయనకే తెలియాలని అంటుంది. అల ఢిల్లీ బయల్దేరే ముందు మాట్లాడుకున్న పరిష్కరా మార్గాలను గుర్తు చేసుకుంటుంది మహతి. అలని ఎయిర్‍పోర్టులో దింపేందుకు తయారైన మహతి జీవితంలో ఫస్ట్ టైం జీన్స్ పేంట్, వైట్ షర్టూ వేసుకుంటుంది. ఆ డ్రెస్‌లో మహీని చూసి అల అబ్బురపడుతుంది. నీ దుస్తుల్లోకి మారినట్టుగానే, నీ మనసులోంచి ఈ సమస్యని ఆలోచిస్తా, అప్పుడే నిష్పక్షపాతంగా ఆలోచించగలను అని అలకి చెప్తుంది మహతి. – ఇక చదవండి.]
మహతి-4 మహతి-అల-7
అల:
[dropcap]ఓ[/dropcap]హ్.. వినోద్ కపూర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి వస్తాడని నేను ఊహించలేదు. ఎయిర్‌పోర్ట్ బయట కార్‌లో వెయిట్ చేస్తున్నాడు. ప్రొడక్షన్ మేనేజర్ కూడా ఆ విషయం నాతో చెప్పకుండా దాచాడు. కారు దగ్గరికి వెళ్ళగానే డోర్ తెరుచుకుంది. ఆశ్చర్యంగా చూస్తే వెనక సీట్లో వినోద్.
“మైగాడ్.. ఆప్” అన్నాను ఆనందాశ్చర్యాలతో.
“హా.. వినోద్” అంటూ నవ్వి నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కారు స్టార్ట్ అయింది. అది వినోద్ స్వంత కారు. చాలా చాల ఖరీదైనది అనుకుంటా. ఓ బటన్ నొక్కగానే ముందు సీట్లోకీ వెనకి సీట్లకీ మధ్య ఓ థిక్ గ్లాస్ కర్టెన్ వచ్చింది.
“అలా.. మనం వాళ్ళని చూడగలం.. వాళ్ళు మనని చూడలేరు తెలుసా?” చిలిపిగా అన్నాడు వినోద్.
“వాళ్ళు చూసినా ఇబ్బంది ఏముందీ? చెడ్డపనులు మనం చెయ్యంగా!” అన్నాను నేను.
“ఓహ్.. ముందరి కాళ్ళకి బంధం అంటే ఇదేనా?” అన్నాడు నవ్వి.
“కాదు వినోద్.. ఓ అద్భుతమైన మొక్కని సంరక్షించడం.. ఎందుకంటే అది ఇవ్వబోయే ఫలాలు అత్యంత మధురంగా ఉండాలి. అలా ఉండాలంటే, ఆ మొక్క నిర్భయంగా, స్వేచ్ఛగా, బలంగా పెరగాలి” అన్నాను. నా దృష్టిలో ప్రేమ అనేదీ ఓ మొక్క లాంటిదే. నిరంతంరం దానిని సంరక్షిస్తేనే అది ఓ మహావృక్షమౌతుంది. అత్యాశ, అపనమ్మకాలతో పెంచితే బలంగా వేళ్ళూనుకోదని నా ప్రగాఢ నమ్మకం.
“అందుకే నువ్వంటే నాకు ఇష్టం” నా ముంగురుల్ని సృశించి అన్నాడు వినోద్. అతని మాటల్లో ఏ మాత్రం డిసప్పాయింట్‌మెంట్ లేదు. మరుక్షణమే స్క్రీన్‌ని కిందకి దంపేసి, “హరిలాల్ డైరక్టుగా షూటింగ్ స్పాట్‌కి పోనీ” అని “అలా, నీ కోసం ఓ కాటేజ్ స్పెషల్‌గా డెకరేట్ చేయ్యమన్నాను” అన్నాడు నాతో.
“ఎందుకూ? క్రితం సారి ఇచ్చింది బాగుందిగా” అన్నాను.
“జీవితంలో ప్రతిరోజూనా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. కనీసం, ప్రత్యేకత ఉండేలా మనం చూసుకోవాలి. లేదా, ప్రత్యేకతని సృష్టించుకోవాలి. అప్పుడే జీవితం మీద మనకి ఓ అనురక్తి ఏర్పడుతుంది” అన్నాడు.
“గొప్ప మాట చెప్పారు వినోద్. తప్పక పాటిస్తాను. ఏ రోజునైనా ఎటువంటి రోజైనా, దాన్ని ప్రత్యేకంగా అనుభవించిన నాడు, రోటీన్‌గా గాక, జీవితం ఇష్టంగా, ఫలవంతంగా ఉంటుంది” అన్నాను.
ఆ మాటని వెంటనే మహతికి చెప్పానిపించింది. ఎందుకంటే, ఇటువంటి చిన్న చిన్న మాటలే మనసుకి ఆహ్లాదం కలిగిస్తాయి.
“షూటింగ్ ఫాస్ట్‌గా జరుగుతోంది. షెడ్యూల్ లేటైనా, రాత్రి పగలూ షూటింగ్ చేద్దామనే పట్టుదలతో ఉన్నాడు అమిత్. తరుణ్ కూడా కోలుకుంది. అందరూ నీ కోసం మహా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.. అన్నట్లు డిన్నర్‌కి ఎక్కడైనా ఆగుదామా?” అన్నాడు వినోద్.
“నా ఫ్రెండ్ మహతి, నేనూ కొన్ని డిషెస్ చేశాం.. రోడ్డు పక్కన ఆపితే అందరం టేస్ట్ చెయ్యచ్చు” అన్నాను.
“ఓ.. సౌతిండియన్ పుడ్డా.. ok.. ok.. ట్రై చేస్తా” అన్నాడు. అతనికి అంతగా నచ్చకపోవచ్చు అని నాకు అనిపించినా, పేపరు ప్లేట్స్ తీసి పులిహోరా, దోసావకాయా, చిప్స్ వడ్డించి అందరికీ ఇచ్చాను.
ఇక్కడ లాగా అక్కడ భోజనం విషయాల్లో తేడా చూపించరు. ఇక్కడ పెద్ద పీట హీరో హీరోయిన్లు డైరెక్టర్లూ etc. ముందు. వారి వారి స్పెషల్స్‌తో.
నార్త్ లో అలా వుండదు. అందరూ అన్నిట్నీ రుచి చూస్తారు. హీరో లైట్ బాయ్ ప్లేట్లో నించి కూడా తీసుకొగలిగినంత చనువు అక్కడుంటుంది.
“మైగాడ్.. వాటీ జ్ దిస్..” స్పూనుతో పులిహోరతో పాటు దోసావకాయ నంజుకుని తిన్నాడు వినోద్. కళ్ళలోంచి నీళ్ళు. నవ్వాను. “డోంట్ వర్రీ. ఆంధ్రా పికిల్స్ యమా ఘాటు. బట్.. రెండు స్పూన్లు తిన్నాక వదలరు” అన్నాను కాన్ఫిడెంట్‌గా.
అన్నట్లే రెండు స్పూన్లు తిని “మైగాడ్.. పిచ్చ టేస్టుగా ఉంది. దీని పేరేమిటి?” అనడిగాడు స్పూన్ నిండుగా పులిహోర దోసావకాయ కాంబినేషన్ నంజుతూ.
“దటీజ్ పూలిహోర.. మీన్స్ టామరెండ్ రైస్, దిసీజ్ కుకుంబర్ పికిల్.. దోసకాయ” అన్నాను.
“ఎంత తీసుకొచ్చావూ?” అన్నాడు.
“రెండు బాటిల్స్” అన్నాను.
“ఒక ఫుల్ బాటిల్ నాదే” అన్నాడు.
“తప్పకుండా. ఇది పెట్టినది నిన్ననే. అందుకే అంత ఘాటుగా ఉంది. ఇంకో రోజు పోయాక చాలా కమ్మగా ఉంటుంది” అన్నాను. అందరూ పులిహోర, చాలా చలా బాగుందన్నారు.. దోసకాయతో సహా.
పెరుగన్నం వడ్డించి, దానిలో కొత్తగా పెట్టిన మాగాయి వడ్డించాను.
“వాటీజ్ దిస్.. ఎనదర్ టైప్ ఆప్ పికిల్?” ఆశ్చర్యంగా అన్నాడు.
“యస్.. మేడ్ ఆఫ్ డ్రై మేంగో పీసెస్.. కాల్డ్ మాగాయి” అన్నాను.
“ఫంటాస్టిక్.. మైండ్ బ్లోయింగ్” అన్నాడు వినోద్ మాగాయి ముక్కని కోరికి నములుతూ. నాకు ఆనందం కలిగింది. మాగాయి, ఆవకాయి, దోసకాయి సీసాలు భద్రంగా ప్యాక్ చేసి నా కోసం ఇచ్చారు కల్యాణి, మహతి.
“I think I have fallen in love with your pickles” అన్నాడు వినోద్ (మీ ఊరగాయలతో నేను ప్రేమలో పడ్డాను అనుకుంటున్నాను అని అర్థం).
“థాంక్యూ” నవ్వేశాను.
“నీకో విషయం తెలుసా.. ఈ ప్రయాణం అంతా హాయిగా విస్కీ తాగుతూ నీతో కబుర్లాడుతూ చేద్దగామని వచ్చాను” సైడ్ ఛస్ట్ ఓపెన్ చేసి విస్కీ బాటిలూ, సోడాలూ, వాటర్ బాడిల్స్ చూపించి అన్నాడు.
“సారీ.. మీకు బోర్ కొట్టించానా?” నిజంగా బాధేసింది. సినిమాల్లో జనాలు drinks తీసుకుంటారు. కానీ, ఒళ్ళు మరిచిపోయేలా కాదు. అదీ, షూటంగ్ టైమ్‌లో ఇంకా స్ట్రిక్టుగా తీసుకుంటారు. మనిషి కన్ను చూడలేనిది కెమేరా కన్ను వంద రెట్లు పరిశీలనగా చూస్తుంది కదా మరి.
“నో.. నో.. నో.. ఏ డ్రింకూ తీసుకోకుండా చక్కని రుచికరమైన భోజనం చేశాను డియర్. థాంక్యూ” అన్నాడు నా చెయ్యి నొక్కి. అతని గొంతులో నిజాయితీ.
“థాంక్యూ” మనస్పూర్తిగా అన్నాను.
“నీకో మాట చెప్పానా అలా, ఘాట్ చేసిన ఫిల్మ్ అంతా ఎడిట్ చేసి చూశాం.. నేనూ అమిత్. అద్భుతంగా వచ్చింది. ఎంతగానంటే, సినిమా రిలీజయ్యాక నువ్వు నార్త్ మోత్తానికే మరో డ్రీమ్ గాళ్‌వి అయిపోతావు. అందుకే, నీ సీన్స్‌కి మరింత పదునుపెట్టాం. మరో సర్‌ప్రైజ్ చెప్పనా, కోలీవుడ్ నించి ‘క్లారా డేనియల్’ అనే కాస్టూమ్ ఎక్స్‌పర్ట్‌ని పిలిపిస్తున్నాం. నీ డ్రెస్ డిజైనింగ్ కోసం” మళ్ళీ నా చేతిని మృదువుగా స్నేహంగా నొక్కి అన్నాడు వినోద్. నాకు మాట రాలేదు.
ఎక్కడి నేనూ.. ఎక్కడి బాలీవుడ్.. ఎక్కడి కోలీవుడ్ డ్రెస్ డిజైనర్.. ఓహ్.. నా కళ్ళల్లోంచి సడన్‌గా కన్నీళ్ళు.
“ఓహ్.. కూల్ మై డియర్.. కూల్..” నా చేతులు గట్టిగా పట్టుకుని అన్నాడు.
జీవితం ఎప్పటికప్పుడు కొత్తగా ఉండటం అంటే ఇదేనేమో. ఇది నిజంగానే సృష్టించుకున్నది కాదు. ఓ మహా శక్తి ఇచ్చిన వరం.
***
కల్యాణి:
అల ఢిల్లీ వెళ్ళింది. మహతి హాస్పటల్‌కి వెళ్ళింది. ఆ ఇద్దర్నీ చూస్తే నాకు చాలా ఇష్టం. పుట్టుకతోనే ఓ గాంభీర్యం, విచక్షణాపరమైన ఆలోచనలలో నడయాడే మహతిని చూస్తే నాకు గంగానది గుర్తుకొస్తుంది. అలాగే క్షణక్షణం తనని తాను దిద్దుకుంటూ పైకెదుగుతున్న అలని చూస్తే పారిజాతం చెట్టు గుర్తుకొస్తుంది. నా బిడ్డలు తీర్చలేని ‘కొరత’ని యీ పిల్లలు తీర్చారు. అరమరికలు లేని వారి మనస్తత్వం నాకెంతో సంతోషాన్నిచ్చింది. వాళ్ళని చూసిన ప్రతిసారీ నాకు గుర్తుచ్చే మరో వ్యక్తి ఫాలాక్ష. నా తమ్ముడు. ‘వాళ్ళిద్దర్లో ఎవరో ఒకర్ని నా మరదలుగా చేసుకుంటే’ అనే ఆలోచన వచ్చినా దాన్ని అక్కడకక్కడే తుంచేస్తున్నాను. కారణం, మహతిలోని సమాజసేవకి అడ్డం రాకూడదనీ, ఇప్పుడే ఏపుగా ఎదుగుతున్న అల నట జీవితాన్ని మూడు మళ్ళ బంధంతో మూలన కూర్చోబెట్టకూడదనీ. చిత్రం ఏమంటే, ఫాలాక్ష కూడా ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళిద్దరి గురించీ అడుగుతాడు. అతని మనసులో ఏముందో కూడా నాకు తెలీదుగా!
ఆలోచనలు సాగుతూ వుండగానే హస్పటల్ వచ్చింది. పాపం, ఊరుగాని వూరు వచ్చి మహతి అమ్మనాన్న కూడా ఎంతకాలం ఉంటారు? అసలు ఇన్నాళ్ళు ఉండటమే యీ రోజుల్లో ఓ ప్రపంచ వింత.
డైరెక్టుగా ఇందిర దగ్గరికి వెళ్ళాను. ఆవిడ ఒంటరిగానే ఉంది. “బాగున్నార ఇందిరా!” అన్నాను.
“చూస్తున్నారుగా! ఆ లోకానికీ యీ లోకానికీ మధ్య దారెంత పొడుగుందో కొలుస్తున్నాను.” చిన్నగా నవ్వి అన్నది.
“భలే మాట!” నేనూ నవ్వి అన్నాను.
“కల్యాణిగారూ, మీరు మహతీ మరి వాళ్ళకీ ఎలా పరిచయం?” అన్నది. ఆ పరిస్థితుల్లో ఆ ప్రశ్న అడగటం నాకు ఆశ్చర్యంగా అనిపించినా, అది ముఖంలో చూపించకుండా జాగ్రత్తపడి, ‘అల’ సినిమా చేస్తుండగా వచ్చిన ఇబ్బంది, దానికి మహతి ఇచ్చిన సలహా, తరువాత మా తమ్ముడు అలని మా ఇంటి దగ్గర వుంచడం వివరంగా చెప్పి “అసలు మహతిని చూస్తాను అనుకోలేదు. తను వచ్చింది మీ కోసం. లక్కీగా అల ఇక్కడ ఉండటం వలన తననీ మీతోబాటు నేనూ చూడగలిగాను” అన్నాను. కావాలనే, చిన్న చిన్న వివరాలు కూడా వదలిపెట్టకుండా గంట పాటు మా రిలేషన్ని వివరించాను. చాలా సేపు ఇందిర మౌనంగా ఉండి, “బహుశా.. మా పెళ్ళి అయితే మహతి నా కూతురు అయ్యుండేదేమో!” సన్నగా వినీ వినిపించకుండా అన్నది ఇందిర.
“మహతే కాదు ఇందిరా, మరో ముగ్గురు కూడా మీ పిల్లలే అయుండేవారు. ఓ నిజం చెప్పనా, వాళ్ళు నాకు పుట్టనా పుట్టకపోయినా, అలనీ మహతినీ కూడా నేను సంపూర్ణంగా ప్రేమిస్తున్నా. ఎంత అంటే, నా స్వంత కూతుళ్ళలాగా. లోకంలో పుట్టిన వాళ్ళు మాత్రమే పిల్లలు కారు. మనసులో నింపుకున్న ప్రతి బిడ్డా మన బిడ్డే. అందుకే అంటారు మానస పుత్రిక, మానస పుత్రుడు” అని అన్నాను. తనేమీ మాట్లాడలేదు.
“ఒక మాట అడగనా?” ఇందిర తల నిమురుతూ అడిగాను.
“ఏమిటి?” అన్నట్లు తన పెద్ద పెద్ద కళ్ళు విప్పినా వంక చూసింది.
“గౌతమ్ గారిని ఎందుకు పెళ్ళి చేసుకోలేదూ?” సూటిగా అడిగాను.
“ఇప్పటి మూర్ఖత్వం అప్పుడు లేదు గనుక. ఇప్పటి స్వార్ధమూ అప్పుడు లేదు గనుక. ఈనాటి అహంభావమూ ఆనాడు లేదు గనక” మెల్లగా స్థిరంగా అన్నది.
“నాకు అర్ధం కాలేదు” అన్నాను.
“అవును. ఇప్పటి మూర్ఘపు పట్టుదల అప్పుడ ఉంటే, ఆనాడే గౌతమ్ నాకు కావాలని పట్టుబట్టేదాన్ని. ఇది ‘నాకే కావాలి’ అనే ఇప్పటి స్వార్ధం ఆనాడు లేశమైనా లేదు. ఉంటే గనక, ఆనాడు గౌతమ్‌ని నా చేతుల్లోంచి పోకుండా ఆపేదాన్ని. ఈనాడు ఉన్న అహంకారం ఆనాడు ఉంటే భూమ్యాకాశాలు ఒక్కటి చేసైనా గౌతమ్‌ని దక్కించుకునేదాన్ని. కల్యాణి గారూ, ఆనాడు నాలో ఈ లక్షణాలు లేవు గనకే కళ్ళ ముందే అన్నిట్నీ పోగొట్టుకున్నాను.”
ఆమె గొంతులో చెప్పలేని బాధ.
“అప్పటి విషయాలు ఇప్పుడు తలుచుకుని ఏం లాభం?” చాలా మెల్లగా అనునయంగా అన్నాను.
“గంగోత్రి దగ్గరా గంగని గంగే అంటారు. సముద్రంలో కలిసే చివరిక్షణం వరకూ కూడా గంగ గంగే. సముద్రంలో కలవడమంటే, నది మృత్యువాత పడి సాగరమనే అంతరాత్మలో కలిసిపోతూంది. అలాగే గౌతమ్ ఆనాడూ ఈనాడూ కూడా గౌతమే. నేనూ ఆనాడూ ఈనాడూ కూడా ఇందిరనే. మృత్యువు దరిదాపుకొచ్చాను. మృత్యువుతో ఆడుగులు కలిపేదాకా ఇందిరగానే జీవిస్తానుగా! ఇందిరగానే జీవించాలిగా!!” అన్నది. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు.
తను చేస్తున్నది తప్పని ఆమెకి తెలుసు. ఆ చేస్తున్న పని మొత్తం ఓ సంసారాన్ని ఛిన్నాభిన్నం చేస్తుందనీ తెలుసు. కానీ, ఆశ మనిషికి ఆఖరి క్షణం వరకూ వదలదు అనుకున్నాను.
“ఆశ అంత తొందరగా వదలదు కల్యాణి గారూ. ఎందుకు వదలదో తెలుసా? ఆ ఆఖరి క్షణంలోనైనా జీవితాంతం ఆశించినది దక్కుంతుందోమోనని. ఒక్కక్షణపు ఆ తృప్తి కోసమేగా వేల లక్షల కోట్ల క్షణాలు మనుషులు జీవించేదీ! నేనూ అంతే. ఎవరి కోసం జీవించాలి? ఎవరికో సొంతమైన గౌతమ్ కోసమా? ఎవరికీ ఏమీకాలేని నా కోసమా? నా మాటలు సహజంగా మీకు అనిపించకపోవచ్చు. సినిమా సంభాషణల్లాగాను అనిపించవచ్చు. కానీ, నా ప్లేస్‌లో మీరు ఉండి నన్ను చూడండి. అప్పుడు మీకు కనిపించేది ధర్మాధర్మాలు, సత్యాసత్యాలూ లేక జీవితపు ఆఖరి అంచులో నిలిచిన ఆశాపూరిత క్షణలా?” మాటలు ఆపి కళ్ళు మూసుకుంది.
బహుశా అలిసిపోయిందేమో. ఆ మూసివున్న కళ్ళల్లో కదలిక లేదు. అంటే మగత కమ్ముకొచ్చి ఉండాలి.
నేను మంచం మీదే కూర్చుని ఆమె తల నిమురుతూ ఉన్నాను. ‘బొమ్మ కోసం’ పేచీ పెట్టి రెండు రోజులు అన్నం మానేసిన నా అమాయకపు కూతురు ఆ క్షణం ఇందిరలో కనపడింది.
***
మహతి:
కల్యాణి గారు ఇందిరతో మాట్లాడటం చూసి మెల్లగా నేను గది బయట నించే వెళ్ళిపోయా. మా అమ్మ అప్పటికే తన చీరలు అవీ సూట్‌కేసులో సర్దుకున్నది. “తప్పదా అమ్మా” అన్నాను.
“లేదమ్మా.. ఏవీ ఈ లోకంలో శాశ్వతం కాదు. కానీ బాధ్యతలు ఉన్నాయి. వాటిల్లో పిల్లల్ని పెంచి ఓ దారి చూపించడం ముఖ్యం. నేనిక్కడ కూర్చుని పనికి మాలిన ఆలోచనలతో సమయం వృథా చేస్తున్నానని నాకే తెలిసింది. మేఘమైనా కనపడని ఆకాశం చూస్తూ వర్షాన్ని ఆశించడం ఎందుకూ? ఇందిర మీ నాన్నని వదిలపెట్టదు. చావుకి దగ్గరౌతుందేమో అని మీ నాన్న ఆవిడకి కుండబద్దలు కొట్టి చెప్పలేరు. అందరం బాగానే ఉంటాం. కానీ పిల్లలు మాట? నీ ఆలోచనలు నీకున్నాయి. నా ఆలోచనలు నాకున్నాయి. మరి నీ చెల్లెలూ తమ్ముడి మాట?” మాటలు ఆపేసింది. ఆ మాటల్లో సూటిపోటీదనం లేదు. కర్కశత్వం లేదు. కోపం లేదు. వ్యథో వేదనో కూడా లేదు. నాన్న నిశ్చేష్టుడై నిలబడి ఉన్నారు. ఒక చెప్పలేని బాధ ఆయన ముఖంలో ఉంది.
సడన్‌గా నాకు మా సంగీతం టీచర్ సంపూర్ణాదేవి గుర్తుకొచ్చారు. ఆవిడ జీవితాన్ని ఓనాడు నాతో చెబుతూ సైలెంటయ్యారు.
కాసేపాగి, “మహీ.. ఆడది తన ప్రతి కష్టానికీ, అసంతృప్తికీ మగవాడ్నే బాధ్యత చేస్తుంది. అలా ఎందుకు చెయ్యాలీ? ఒక తప్పు జరిగితే, ఆ తప్పు జరగడానికీ ఇద్దరూ బాధ్యులే. మగవాడ్ని మాత్రమే ఎందుకు నిందించాలీ? వాళ్ళు చేసిన తప్పు వల్ల ఆ స్త్రీ గర్భవతి కూడా కావొచ్చు. దానికి కూడా మగవాడ్ని ఎందుకు బాధ్యుడ్ని చేయ్యాలీ? గర్భం ధరించడం స్త్రీల హక్కు. అది స్త్రీలకి మాత్రమే భగవంతుడు ఇచ్చిన వరం. ఆ వరం పురుషులకి లేదుగా! కానీ, నా శీలం పోవడానికి కారణం నువ్వే అని ఆడది మగవాడ్ని నిందిస్తుంది, ఆ తప్పులో తనకీ భాగస్వామ్యం ఉందని మర్చిపోయి” అన్నారు.
“అంటే..” సరైన ప్రశ్నకి తడుముకుంటూ అన్నాను.
“ఇది ఈ వయస్సులో నీకు అర్థం కాదు. కానీ గుర్తుంచుకో. పురుషులందరూ దుర్మార్గులు కారు, స్త్రీలందరూ ఉత్తమోత్తములు కారు. మంచీ చెడూ ఇద్దరిలోనూ ఉంటుంది. ఏకపక్షంగా సమాజం నిర్ణయం తీసుకోకూడదు. సానుభూతి అనేది ఆడవారికి మాత్రమే కాదు. మగవారికీ కావాల్సిన దినుసే!” అన్నారు సంపూర్ణాదేవి.
ఇప్పుడు మా నాన్న మొహం చూస్తే నాకు ఆవిడ మాటలే గుర్తొచ్చాయి. దశాబ్దాల కాలం నాటి ప్రశ్న నేడు మరో భూతంలా ప్రత్యక్షమై జవాబివ్వమంటే ఏం చెయ్యగలరూ?
మనసులో బాధ చెప్పుకోవడానికి అమ్మకీ, ఇందిరగారికీ, మేమందరం ఉన్నాం. ఆయనకి ఎవరున్నారూ?
స్నేహం+ప్రేమ=అనురాగం అని చెప్పిన అల మాటలు గుర్తుకొచ్చాయి. అంటే అమ్మ నాన్నల మధ్యనా, ఇందిరా నాన్నల మధ్యనా కూడా ఒక వివాహ బంధం, ఒక విఫల ప్రేమ బంధం తప్ప స్నేహ బంధం లేదు. స్నేహం లేని చోట స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది? నాన్న కళ్ళల్లో చెప్పలేని ఆవేదన. అమ్మని ఆపాలంటే మాట్లాడాలి. మాట్లాడి ఆమెని ఒప్పించే శక్తి ప్రస్తుతం ఆయనలో లేదని తెలిసిపోయింది. అంత నిస్తేజంగా, నీరసంతో ఉన్నరాయన.
కల్యాణి గారు లోపలికొచ్చి సద్దిన సూట్‌కేస్ చూసింది.
“అహల్యా” అన్నారు కల్యాణి.
“అవును కల్యాణీ.. నేను మళ్ళీ విజయవాడకి వెళ్ళిపోతున్నా. దారిలో ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి చెప్తాను సురేంద్రకి. పిల్లల్ని మా నాన్ననీ నేను చూసుకోగలను. ఆయన దగ్గర మహీ ఉంటుంది. ఓ ఆడ తోడు లేకపోతే ఇందిరగార్ని చూడటం కష్టం. మరొకటి ఏమంటే ఏ పనీ లేకుండా ఇంతకాలం నా బాధ్యతలు మర్చిపోయి మొన్నటి వరకూ ఎవరో తెలీని ఇందిరగారి కోసం ఇక్కడ ఉండటమే తప్పు. ఇంకా అదే కొనసాగించడం మూర్ఖత్వం అవుతుంది” స్థిరంగా అన్నది మా అమ్మ.
నేనూ సైలెంటైపోయాను. బ్రతిమలాడినా ఉండే స్థితిలో లేదు అమ్మ. తను ఒకసారి నిర్ణయించుకుంటే, ఆ నిర్ణయానికి మార్పు ఉండదని మాకందరికీ తెలుసు.
“అహీ..” అస్పష్టంగా అన్నాడు మా నాన్న.
“మీరేమీ దేని గురించి విచారించకండి. ఒక విధంగా తప్పు మీదీ కాదు నాదీ కాదు ఇందిరదీ కాదు. కనబడని గోడలు ఉన్నాయని ఇప్పుడు తెలుసుకున్నాం అంతే. మా నాన్నని, పిల్లల్ని నేను చూసుకుంటాను. ఇందిరకీ పాపం ఎవరూ లేరుగా!” అనేసి లేచి నిలబడింది.
“అహల్యా..” ఏదో చెప్పబోయారు కల్యాణి.
“కల్యాణీ, దయచేసి నా నిర్ణయాన్ని నేను పాటించే అవకాశాన్ని ఇవ్వండి. నేను స్త్రీనీ, భార్యనీ, మాత్రమే కాదు. ఓ.. తండ్రికి కూతుర్నీ, రెక్కలు రాని పక్షులకి తల్లినీ కూడా!” అన్నది.
“సరే.. నేనే మిమ్మల్ని దిగబెడతాను. కానీ ట్రైన్స్..” అన్నారు కల్యాణి.
“బస్‌లో వెళ్తాను. ఒక బస్సు కాకపోతే పది బస్సులు ఎక్కి ఊరు చేరగలను” స్థిరంగా స్పష్టంగా అన్నది మా అమ్మ.
నేను సూట్‌కేస్ పట్టుకుని మా నాన్న వంక చూశాను. ఆయన తలవొంచుకుని వున్నారు. అంతులేని వేదన ఆ ముఖంలో.
“వస్తాను” నాన్న వంక చూడకుండానే అని బయటకి నడిచింది మా అమ్మ. మా నాన్న భుజాన్ని పట్టుకుని నొక్కి ఆవిడ వెనక నేను నడిచాను. మా వెనక కల్యాణి గారు వచ్చారు.
(ప్రియ మిత్రులారా.. జీవితాలు ఇలానే ఉంటాయి. అన్నీ ఒకచోట ఉన్న గులకరాళ్ళుగా గుట్టగా ఉంటాయి. కానీ దేనినీ మరొకటి అంటిపెట్టుకోదు. కలిసి ఉన్నట్టే ఉంటాయి. కానీ ఉండేది విడివిడిగానే. ఇవేనా బంధాలంటే?)
(ఇంకా ఉంది)