కథ, నవలా రచయిత శ్రీ విహారి ప్రత్యేక ఇంటర్వ్యూ

2
3

[‘జగన్నాథ పండితరాయలు’ అనే నవలని వెలువరించిన విహారి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం విహారి గారూ.

విహారి: నమస్కారం సార్.

~

ప్రశ్న 1. చారిత్రక కాల్పనిక నవల జగన్నాథ పండితరాయలువ్రాయడానికి మీకు ప్రేరణ ఎలా కలిగింది? పుస్తకం ముందుమాటలో కొద్దిగా తెలిపారు కానీ, నవలని ఇంకా చదవని వారి కోసం ఈ రచన సృజన వెనుక నేపథ్యాన్ని వివరిస్తారా?

జ: జగన్నాథ పండితరాయలు – తెలుగువాడు అని తెలుసుకోవటం నా విద్యార్థి దశలోనే ఒక ఉత్తేజకరమైన సంభవం. సహజంగా వివేకానందస్ఫూర్తి. ఉన్నత వ్యక్తిత్వాల పట్ల ఆరాధనాభావం. దీనికి తోడు మా గురువుగారు – ‘భారతీ నిరుక్తి’ గ్రంథకర్తలు, మహామహోపాధ్యాయ హరి సాంబశివశాస్త్రిగారు – నాకు కావ్యాల బోధ సందర్భంగా – జగన్నాథుని సృజనశక్తిని గురించీ అనన్యమైన ఆయన ధీరత్వం గురించీ చెబుతూ వుండేవారు. ‘రసగంగాధరం’ని కోట్‌ చేస్తూ వుండేవారు. అప్పటివరకూ ‘వాక్యం రసాత్మకం కావ్యమ్‌’ అన్న విశ్వనాథుని సూత్రం నన్ను కదిలించేది. ఆ తర్వాత జగన్నాథుడి ‘రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం’ వినేసరికీ మరింత వెలుగు వచ్చినట్లైంది. వాక్యం కంటే సూక్ష్మం కదా – శబ్దం. దాన్ని రమణీయం, రసార్ద్రం చేయగల అర్థ స్ఫురణకు ప్రయుక్తం చేయటం కన్నా ఘనత ఏముంది?  అలా జగన్నాథుడి ధీశక్తీ, యుక్తీ, కొన్ని చారిత్రక ప్రథలూ, అప్రథలూ – విని విని, ఆయన నా మదిలో తిష్ట వేశాడు. ఆయన గుణగణాల్లో ‘లవంగి’ మచ్చ నచ్చలేదు. అది వాస్తవం కాదనే ఒక సెన్స్‌! అంతే. అదీ కారణం ఆయన గురించి రాయాలనే ప్రేరణకు. కానీ 20 ఏళ్లు ఏమీ రాయలేదు.

1972 తర్వాత బందరు స్పందన సాహితీ సమాఖ్య వెలిసింది. నేనా రథసారధిని. విజయుడు మా గుత్తికొండ సుబ్బారావు. సాహిత్య కార్యక్రమాల్లో ముఖ్యపాయగా పుస్తకప్రచురణ ప్రారంభించాము. తొలిసారి మూడు పుస్తకాలు వేశాము. వాటి అట్ట వెనుక ‘రాబోవు ప్రచురణలు’ వేస్తుంటే – హఠాత్తుగా, ఎమ్వీయల్‌ – ‘సినిమా పాటల్లో సాహిత్యపు విలువలు’ రాస్తానన్నారు. దానికింద ‘పండితరాయలు’ గేయకావ్యం అని వేసేశాము. విహారి & శాలివాహన రచయితలుగా! రాయవలసింది నేనే!! గేయకావ్యం రాయాలనిపించటానికి స్ఫూర్తి – సినారె ‘కర్పూరవసంతరాయలు’ని ఆయన గళంలో (1958) వినటం, చదవటం! ఆయన పదలాలిత్యానికి నేను దాసుణ్ణి. 1977 వరకూ అనేక యుద్ధాలు. సరే 77లో నేను ధార్వాడ బదిలీపై వెళ్ళాను. పాఠకుల్ని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక(!) విహారి –  శాలివాహన జంట పేరున రచనల ప్రచురణని ఆపేశాము. ఎమ్వీయల్‌ కూడా మరణించాడు. ఆ పుస్తకం రాలేదు. పండితరాయలు నా బుర్రని తొలుస్తూనే వున్నాడు. ధార్వాడ నుండి కడప చేరాను – 1979లో. అక్కడ – ఒక ఉత్తేజిత క్షణంలో ‘గేయకావ్యం’ ఆరంభించాను.

‘శ్రీ విశ్వనాథు సం
సేవితాంతరంగము
గంగాతరంగమై కదలె
కావ్యశ్రీకారమై మెదలె!’

అని మొదటి చరణం వచ్చింది. ఖండగతి పలికింది. ఆ ఊపులో ఒక పాతిక పేజీలు రాసేశాను. ఆగిపోయింది. సంఘటనలు వస్తే – గేయ కావ్యంలో సొబగు పలచబడుతుంది. కల్పనలు, వర్ణనలు చేస్తుంటే ఆనందం కలుగుతుంది. ఇదీ కారణం ఆగిపోవటానికి.  ఆ తర్వాత కె.రామలక్ష్మి ‘లవంగి’ నవలని – యువ దీపావళి సంచికలో రాశారు. దాన్ని చూశాను. ఎలాగైనా పండితరాయలు వ్యక్తిత్వంపై ‘లవంగి’ మచ్చని తుడిపేయాలనే కోరిక మళ్ళీ విజృంభించింది. తీశాను. గేయం నప్పదని నిశ్చయించుకున్నాను. కానీ ఏమీ రాయలేదు. ఊరికే ఆలోచనే. నేను కొన్ని రచనల్ని వేగంగా రాయలేను. కొన్ని రాసేస్తాను  (భారతికి 48 పేజీల నవలని ఒక రాత్రి రాసి, మరునాడు నా శ్రీమతి ఫెయిర్‌ చేస్తే ఆ మర్నాడు పోస్ట్‌ చేసినవాడిని. అదే నెలలో వచ్చింది అది). ఈ ‘పండితరాయలు’ కదల్లేదు! కడపలో తొమ్మిదిన్నర ఏళ్లు ఉన్నాను. నా సాహిత్య గ్రంథంలో బందరు తర్వాత – విహారిగా కడపకాలం ఒక స్వర్ణపరిచ్ఛేదం. అప్పుడంతా రచన సాహిత్య వేదిక స్థాపన, గడియారం వారి పేరన అవార్డు, కథారచన, రేడియో కార్యక్రమాలు – బిజీ! దీనికి తోడు ఉద్యోగబాధ్యతలు మరీ తీవ్రం! పండితరాయలు అక్షరాలకెక్కలేదు. 1989 ముంబై. 1990-94 హైదరాబాద్‌. ఇక్కడ వేదగిరి రాంబాబు ‘మెంటార్‌’ని. ఆయన్ను గురజాడ పూనేడు! కథా సదస్సులు వగైరా, బిజీ. 94-97 బెంగుళూరు. 97-2002 ముంబై. ఈ సమయాలన్నిటా – నన్ను రాముడు ఆవహించాడు. శ్రీ పదచిత్ర రామాయణం 6500 పద్యాలతో మహాకావ్యంగా వచ్చింది.  2002 నుండి 2008 వరకూ ఇన్సూరెన్స్‌, మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఫ్యాకల్టీ. బిజీ. సుప్రసిద్ధ కథకుల కథల్ని పరిచయాలు – పరామర్శలు పేరన (400 వరకూ) 5 పత్రికల్లో కాలమ్స్‌ రాయటం. ఇవి సరిపోయాయి. ఆ తర్వాత – పండితరాయలు ముందుకొచ్చాడు. నవల బాగుంటుందని నిశ్చయించుకున్నాను. చదువు, పరిశోధన మొదలెట్టాను. ఇదీ నేపథ్యం.

ప్రశ్న 2. ఈ చారిత్రక కాల్పనిక నవల రచించేటప్పుడు చరిత్రని, కల్పనని ఏయే పాళ్ళలో కూర్చాలో ఎలా నిర్ణయించుకున్నారు?

జ: పాళ్ల లెక్కేమీ లేదు. నవలకు కేంద్రం జగన్నాథుడు. ఆ పాత్ర వ్యక్తిత్వం, సాహిత్య ధీరత్వం, స్వరూపస్వభావాలు, మనస్తత్వం.. ఇలా, ఇవన్నీ ఉన్నతీకరింపబడాలి. ఆ ప్రయోజనం నెరవేరటానికి కొన్ని చారిత్రక వాస్తవాలూ, పక్కపక్కగా కల్పన.. ఇలా సాగాయి.

ప్రశ్న 3. నవల పూర్తి చేయడానికి ఎంత కాలం పట్టింది?

జ: సుమారు ఏడాదిపైనే పట్టింది.

 

ప్రశ్న 4. ఈ నవల రాయడానికి – ముఖ్యంగా మొఘలాయిలు, రాజపుత్ర, తంజావూరు, చంద్రగిరి ప్రభువులను, వారి రాజ్యాలను ప్రస్తావించేందుకు మీరు పరిశీలించిన చారిత్రక గ్రంథాలు ఏవి?

జ: నాకు బి.ఏ.లో హిస్టరీ ఒక సబ్జెక్ట్‌. అప్పటినుండే చరిత్ర, భారతీయ సంస్కృతీ, వారసత్వ సంపద వంటి అంశాల పట్ల అంతరాంతరాల్లో ఒక ఉత్సుకత, స్ఫూర్తి, పరిశోధనాత్మక దృష్టీ వున్నాయి. నా నవలలో కాలవిభజన ప్రకారం – స్థలాల ప్రాముఖ్యం వున్నది. కనుక – ఆయా స్థలాల చరిత్ర పాలకుల చరిత్రల్ని గట్టిగా చదివేను. వరుసగా పుస్తకాల పేర్లు ఇవ్వలేను. ‘హిస్టరీ ఆఫ్‌ రెడ్డి కింగ్‌డమ్స్‌’ (మల్లంపల్లివారు) నుండి మొగలాయీ దర్బారు (నేతి సూర్యనారాయణశర్మ) వరకూ చాలా పుస్తకాలు చూశాను. వాటితో పాటు ప్రధానంగా వ్యాసాలు (నిడదవోలు వెంకటరావు. పుట్టపర్తి వంటివారివి)కొన్ని కావ్యాల్లో ముందుమాటలు చదివేను. అంతర్జాలం సరేసరి. ఆంగ్లగ్రంథాల ఆకరాల్ని అక్కడ చూశాను.

ప్రశ్న 5. జగన్నాథ పండితరాయలపై వచ్చిన ఇతర రచనల ఛాయలు మీ నవలపై పడకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

జ: నిజం చెప్పాలంటే, ఒక్క ‘లవంగి’ తప్ప ఆయనమీద వచ్చిన కాల్పనిక రచనలేవీ చదవలేదు. అదే నాకు స్ట్రెంగ్త్‌!

ప్రశ్న 6. ఈ నవలలో ప్రస్తావించిన అలనాటి కాశీ, ఢిల్లీ, జయపురం, తంజావూరు, చంద్రగిరి వంటి ప్రాంతాల వర్ణన పాఠకులను విశేషంగా ఆకర్షించింది. ఈ ఊర్లు కొన్ని శతాబ్దాల క్రితం ఇలా ఉండేవని మీరెలా ఊహించారు? చారిత్రక గ్రంథాలలో వీటి ప్రస్తావనలు ఉన్నా, మీరు నవలలో ఇంత సవివరంగా కళ్ళకి కట్టినట్టు ఎలా అందించగలిగారు?

జ: పైన చెప్పిన ‘రిఫరెన్స్‌’ చదువులో ఆనాటి భౌగోళిక పటాలు, సర్వే ఆఫ్‌ ఇండియా వారి పుస్తకాలు, సాంఘిక పరిస్థితుల గురించి వున్న ఆంగ్ల గ్రంథాలు – అంతర్జాలంలోనే – పరిశీలించాను. అంతకంటే ముఖ్యంగా – నవల్లో వచ్చిన అన్ని నగరాలూ నేను మంచి అవగాహనతోనే సందర్శించాను (ఒక్క కాశ్మీర్‌ తప్ప).

ప్రశ్న 7. అలాగే నవల ప్రారంభంలో ప్రస్తావించిన ముంగండ అగ్రహారం మీరు స్వయంగా దర్శించారా? లేక స్థానికుల నుంచి సమాచారం స్వీకరించారా? ఎందుకంటే ముంగండ, ఆ పరిసరాల వర్ణన చదువుతుంటే, తామూ స్వయంగా అక్కడ తిరిగిన అనుభూతి పాఠకులకు కలుగుతుంది.

జ: నేను ఫోర్త్‌ఫారమ్‌ చదువుతుండగా – ఆ కోనసీమని చూశాను. నేను ప్రస్తావించిన ఊళ్ళు, కారణం నా మేనత్త- భీమనపల్లిలో వుండేవారు. (అమలాపురం నుండి 7 మైళ్లు అది) ముంగండనీ అప్పుడే చూశాను. అయితే, ముంగండ వర్ణనకి నాకు ఒక పెన్నిధి నళినీమోహన్‌గారి ‘భామినీ విలాసం’ పుస్తకమే. ఆ పుస్తకం లేకుంటే నవలని అసలు నేను ఇంత బాగా వ్రాయగలిగి ఉండేవాడిని కాదు. వారికి నమోనమః!

ప్రశ్న 8. ఈ నవలలో సందర్భానుసారంగా సంస్కృత ప్రయోగాలు, తెలుగు ప్రయోగాలు అద్భుతంగా చేశారు. ఓ మహాపండితుడి కథని నవలగా అందించే ఈ క్రమంలో ఇటువంటి ప్రయోగాలు చదువరులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ నవలలో మీకు బాగా నచ్చిన అటువంటి ప్రయోగాల గురించి చెప్తారా?

జ: పట్టికగా ఇవ్వలేను. చాలా విశేష విషయాల్నీ, నా ప్రత్యేక, విలక్షణ ప్రయోగాల్నీ – సంచిక పాఠకులు చదివి ఆనందించి, వాటిని కామెంట్స్‌లో ఇచ్చారు. వాటిలో మరీ ముఖ్యమైనవి డా॥తాడేపల్లి పతంజలిగారు చెప్పారు. అవి ముందుమాటలో వచ్చాయి. మిగిలినవి శతాధికం(!) (నిజం). ‘నవలా సమాలోచనమ్‌’ పేర రాబోయే పుస్తకంలో వస్తాయి. అవన్నీ అనుభవైకవేద్యాలు!

ప్రశ్న 9. లవంగిపాత్రకున్న చారిత్రక ప్రామాణికత ఏమిటి? మీరు నవలలో ఆ పాత్రని అతి తక్కువ నిడివికి పరిమితం చేయడంలో మీ ఉద్దేశాన్ని వివరిస్తారా?

జ: ‘లవంగి’ మచ్చని చెరిపేయాలనే గదా – అసలు ఈ నవల రాసింది. ఆ పాత్ర లేదనే మనిషి ప్రామాణికతకు – నేను స్వీకరించిన గ్రంథాల్ని నవలలో ఇచ్చాను. ఆయా రచయితలు – వారు దాన్నెలా నిర్ధారించారో- వారి గ్రంథాల్లో వివరించారు. నేను స్వీకరించిన ఆధారాలు అవే! ఇక్కడ ప్రధానాంశం- ‘అంతటి’ పండితరాయలు ఈ సోకాల్డ్‌ ‘లవంగి’ని కామించేటంతగా, కొందరు రాసినట్లు  దౌర్భాగ్యంగా, విచ్చలవిడిగా – ప్రవర్తించాడా?’ అనేది, నేను ‘లేదు’ అని నిశ్చయించుకున్నవారిలో నిలిచిన వాడిని. అంతే, కనుక ఆ ఆకరాల ఆధారంగా నవల రాశాను. ఆమె పాత్రని అబ్‌స్ట్రాక్ట్‌ చేసి, కాలగర్భంలో కలిసి పోయిన నర్తకిగా చిత్రించాను. అసలీ, నవలకు ప్రాణం – ఆమెని నవలలో పరోక్షంగా ప్రవేశపెట్టి – ఆమె గురించి భావబంధురంగా జగన్నాథుని చేత వర్ణింపజేయటమే. ఇలా చేయవలసిన అవసరం ఎలా కలిగింది – అంటే, ఆయన రాసిన శ్లోకాలు ‘ఉన్నాయి’ కనుక! ఆ శ్లోకాలు ఎలా వచ్చి వుంటాయి అని ప్రశ్నించుకుని, ఇలా వచ్చి వుండవచ్చు- అని ఊహించాను, కల్పనని ఆశ్రయించాను. అంతే!

ప్రశ్న 10. కాలం ఇరుపార్శ్వాల్నీ ధరించే కదులుతూ వుంటుందిఅన్న జగన్నాథుని వ్యాఖ్య ఈనాటికి వర్తిస్తుందని మా అభిప్రాయం. జగన్నాథుని ఈ వ్యాఖ్యకి అన్వయించదగిన ఇటీవలి సందర్భాలు ఏవైనా మీ దృష్టిలో  ఉన్నాయా?

జ: అలాంటి ఆ వాక్యాల్ని – ‘ఋతం’గా భావిస్తాము. అంటే ఒక విధంగా – సార్వకాలీనమైన సత్యాలు! సమాజంలో మనుషుల్లో ఏ కాలంలోనైనా- ద్వంద్వాలు – గిరులూ, నదులూ అన్నంత వాస్తవాలు. కనుక, స్థితిగతులను బట్టి ఆ ద్వంద్వాలు – రాజకీయ, ఆర్థిక, కళా, విజ్ఞాన, సాహిత్య, సాంస్కృతికాంశాలు – అన్నిటా ప్రతిఫలిస్తూనే ఉంటాయి. అందుకనే, రామయాణ కల్పవృక్షమూ వచ్చింది. విషవృక్షమూ వచ్చింది! సరేనా!

ప్రశ్న11. షరియార్‌ మరణవార్త తెలిసినప్పుడు జగన్నాథుడు, కామేశ్వరిని వెంట తీసుకువచ్చి లాడీ బేగమ్‌‌ను ఓదార్చే సన్నివేశంలో మీరు వ్రాసిన వాక్యాలు హృదయాన్ని తాకుతాయి. కామేశ్వరి చర్యలు – లాడీ బేగమ్‌‌కు సాంత్వన కలిగించినట్టే – పాఠకుల కళ్ళని చెమరింపజేస్తాయి. ఈ సన్నివేశం రచించినప్పటి మీ మానసిక స్థితి ఎలా ఉండేదో వివరిస్తారా?

జ: చాలా మంచి ప్రశ్న. చాలా ముఖ్యమైన ప్రశ్న. ముందు మీకు అభినందనలు. ఈ ఘట్టం రచనకి ప్రేరణ – కొన్ని దశాబ్దాలుగా నా మనస్సులో నిలిచిపోయిన ఒక ఇంగ్లీష్‌ సినిమా. దాని పేరు ‘బ్లో హాట్‌ అండ్‌ బ్లో కోల్డ్‌’! మనవారికి ఇంగ్లీష్‌ సినిమాల్ని సొమ్ము చేసుకోవటమే తెలుసు కనుక – దాన్నేదో సెక్స్‌ ఫిలిమ్‌ అన్నట్టు – పోస్టర్లలో చూపేరు. సరే! ఆ సినిమాలో రెండు జంటలు. దంపతులు. ఒక జంట వృద్ధులు. రెండవ జంట మధ్యవయస్కులు. మధ్యవయస్కుల జంటలో భర్త చనిపోయాడు. ఆ భార్య దుఃఖంలో వుంది. వృద్ధ దంపతులకు తెలిసింది. ఆమె పరామర్శకు వెళ్ళారు. ఇక్కడ – ఆ వృద్ధ వనిత వచ్చి, మాతృ భావనతో పెద్దరికంతో – ఆ యువతిని చేరబోతోంది. కెమేరా కదులుతోంది. ఆమె అడుగులు వేస్తున్నది. యువతి చూసింది. ఆమే అడుగులు వేస్తున్నది.  కెమేరా కదులుతోంది. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరైనారు. ఆ యువతి ఆమెని కౌగలించుకుని భోరున ఏడుస్తున్నది. ఈమె కళ్లనిండా నీళ్ళు. ఇదీ సీను! ఎక్కడా మాటలు లేవు! అది చూసి నేనారోజు ఆ దర్శకుని ప్రతిభకు, మానవ మనస్తత్వ అవగాహనకు ఏడ్చేశాను. సైకాలజీలో, తత్త్వశాస్త్రంలో కూడా ఈ నిశ్శబ్ద కదలికలకు ఒక ప్రత్యేకత ఉన్నది. అది వర్ణనాతీతం. ఇలాంటి దృశ్యీకరణ మన నవలల్లోనూ, అక్కడక్కడా బుచ్చిబాబు, లత..  వంటివారు చేశారు. ఇదీ నా రచనకు వెన్నుదన్నుగా నిలిచిన నేపథ్యం! చెప్పవలసినదాని కన్నాచెప్పనిది ఎక్కువ వుండీ , దాన్ని పఠిత ‘ఫీల్‌’ అయ్యేట్టు చేయటమూ, రాయటమే కదా – గొప్ప రచనా శిల్పం!!

ప్రశ్న12. పండిట్‌జీకి మనుషుల ఆర్తీ, మనసుల ఆవేదనా బాగా తెలుసుఅని జగత్సింహుడు, జయసింహూడూ ఒకేసారి అంటారో సందర్భంలో. అయితే ఈ సందర్భంలోనే కాకుండా నవల అంతటా జగన్నాథుని ఈ లక్షణం గోచరిస్తుందని మా అభిప్రాయం. మీరేమంటారు?

జ: అవును.. నిజమే. అదే జగన్నాథుని పాత్ర వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించగలిగిన శైలీ, శిల్పం.

ప్రశ్న13. జగన్నాథుడు, కామేశ్వరిల దాంపత్యం గురించి చెబుతూ వారికి సీతారామ సామ్యం నప్పుతుందని అన్నారు. ఈ పోలికని మరింత వివరిస్తారా?

జ: సుందరకాండలో హనుమ సీతను చూసి రామస్ఫురణతో – ఆయనా, ఈమే ఒకటిగానే ఉన్నారనే సామ్యాన్ని భావిస్తాడు. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఆదర్శ దాంపత్యమే గాక స్వరూప స్వభావాల స్వామ్యం విషయంలోనూ ప్రసక్తమైంది. అందుకని దాన్ని చెబితే వీరి గురించీ అంతా చెప్పినట్టవుతుందని అలా రాశాను.

ప్రశ్న14. జీవించడమనేది అనుభవాల పంక్తి, పరంపర, కూర్పు.. అది ద్రవీభూతమైన స్థితిఅని జగన్నాథుడు శిష్యులతో అన్న మాటలు నేటికి వర్తించే గొప్ప సూక్తి. మీ జీవితానుభవం నుంచి వచ్చిన ఈ వాక్యాలను జగన్నాథుడితో పలికించారని అనిపిస్తుంది. అవునా?

జ: ఖచ్చితంగా నిజం! అందరి జీవితాలూ అనుభవాల మాలికే కదా!

ప్రశ్న15. భవిష్యత్తులో ఏమైనా మరికొన్ని చారిత్రక నవలలు రాసే ఆలోచన ఉన్నదా?

జ: రాయలవారి చరిత్ర తరగని గని! నా బుర్రనిండా ఆయనా, కొండవీటి రెడ్డిరాజులూ ఉన్నారు. చూద్దాం. ఏది వస్తుందో. 1970ల్లో (విహారి – శాలివాహన) వసంతరాయలు చారిత్రక నవల వచ్చింది. ఆదర్శ గ్రంథమండలి ప్రచురణ. నోరివారి మెప్పు పొందింది.

నిజానికి- వ్యక్తిత్వ వికాసం కేంద్రంగా నేను చంద్రహాస చరిత్రని – ‘మహావిజేత’ పేరుతో నవలగా రాశాను.  ఆంధ్రభూమి ఆదివారం పత్రికలో సీరియల్‌గా ఆ సంపాదకుల కోరిక మేరకు 120 పేజీల్లో వచ్చింది. అది నిజానికి 300 పేజీల నవల. చాలా పక్కా చారిత్రకాధారాలతో రాసిన ఉత్తమ నవల. దాన్ని 300 పేజీలు నవలగా అచ్చువేయించాను. అది నాకు మరీ ఇష్టం. నాకంటే నా శ్రీమతికి ఇంకా ప్రియమైనది. కారణం – దానిలో ఆమె ప్రమేయం, శ్రమా ఉన్నాయి!

అలాగే రాయలవారి కాలానికి సంబంధించిన మరో నవల ‘ధైర్యే సాహసే..’ అనేది ‘సహరి’ అంతర్జాల పత్రికలో వచ్చింది.

ప్రశ్న16. ఈ నవలకు పాఠకుల స్పందన ఎలా ఉంది?

జ: పాఠకుల స్పందన అద్భుతం. చెప్పాను కదా. త్వరలో అవన్నీ పుస్తకంగా రాబోతున్నాయి. ‘సంచిక’ సౌజన్యమే ఈ నవల ప్రశస్తికి ఒక కారణం. రెండవది ఎమెస్కో వారు ప్రచురించటం కూడా. వారికీ, మీకూ అందరికీ ధన్యవాదాలు!

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు విహారి గారూ.

విహారి: ధన్యవాదాలండీ.

***

జగన్నాథ పండితరాయలు (నవల)
రచన: విహారి
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
పేజీలు: 320
వెల: ₹ 200/-
ప్రతులకు
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Jagannatha-Panditarayulu-Vihaari-Narasimha-Sastry/dp/B0D4MFVTD4

 

~

‘జగన్నాథ పండితరాయలు’ నవల సమీక్ష:
https://sanchika.com/jagannatha-panditarayalau-book-review-sp/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here