తల్లిదండ్రులకు, బాలబాలికలకు మార్గదర్శక కథలు ‘క్లాస్ రూం కథలు’

0
3

[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘క్లాస్ రూం కథలు’ అనే బాలల కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]బా[/dropcap]లబాలికలు స్కూళ్ళల్లో, హాస్టల్స్‌లో ఎదుర్కునే ఇబ్బందుల గురించి, వారు చెప్పుకోలేని సమస్యల గురించి డా. కందేపి రాణీప్రసాద్ రచించిన పిల్లల కథాసంపుటి ‘క్లాస్ రూం కథలు’.

“ఒంటరిగా వారిలో వారే అనేక భయాలతో గడిపే చిన్నారుల బాధల్ని చెప్పాలన్నదే ఈ పుస్తక ఉద్దేశం” అన్నారు రచయిత్రి. “క్లాస్ రూమ్ కథలుగా అనుకుని సమస్యలను కథలుగా మలచలేదు” అంటూ “ఇందులో ముప్ఫై ఏళ్ళ క్రిత రాసిన కథ ఉంది, అలాగే గత సంవత్సరం రాసిన కథ కూడా ఉంది. కాలం మారినా సమస్యలు మారలేదు” అని తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు రచయిత్రి.

ఈ పుస్తకంలో 20 కథలు, బాలలకి సంబంధించిన 2 వ్యాసాలు, రచయిత్రి పరిచయం ఉన్నాయి.

~

తన కొడుకు అఖిల్ అమాయకత్వాన్ని మందమతి తనంగా పరిగణించి అందరి ముందు హేళన చేసిన మాస్టారుకు బుద్ధి చెప్పి, కొడుకుని ఆ స్కూలు మాన్పించి, మరో స్కూల్లో చేరుస్తుంది వాళ్ళమ్మ. ఒక విద్యార్థి తన మిత్రుడి గురించి చెప్పిన కథ ‘అవహేళన’.

పిల్లలలో నిజాయితీ, నైపుణ్యాల మీద నమ్మకం పెంచాల్సిన బడిలో ఆటల పోటీలో విజేతను నిర్ణయించడానికి లాటరీ పద్ధతి సరికాదని చెబుతుంది ‘చెస్ పోటీ’ కథ. ఈ కథలో సందీప్ అమ్మ చేసిన సూచన అత్యంత విలువైనదీ, ఆచరణీయమైనది కూడా. టీచర్ల నిర్ణయాలు క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేట్లు ఉండకూడదంటుంది ఈ కథ.

స్కూల్లో తోటి పిల్లల పెన్సిళ్ళు, రబ్బర్లు వాళ్ళని అడక్కుండా, వాళ్ళకి తెలీకుండా అరుణ్ తీసుకుంటున్నాడని రుత్విక్ గ్రహిస్తాడు. ఎవ్వరూ తమ పెన్సిళ్ళు రబ్బర్లు పోయాయని టీచర్లకి ఫిర్యాదు చేయకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అలా తాను కూడా చేయాలని అనుకుంటాడు. మొదటిసారి భయమేసినా, ఎవరూ ఏమీ అనకపోయేసరికి మరో ఇద్దరి ముగ్గురి పెన్సిళ్ళు కాజేస్తాడు. రుత్విక్ వాళ్ళ అమ్మ వాడి జ్యామెట్రీ బాక్స్ చూసి, చాలా పెన్సిళ్ళు ఉండడం గమనిస్తుంది. పైగా అవి తను కొన్నవి కావని గుర్తిస్తుంది. కొడుకుని పిలిచి అడిగితే, అబద్ధం చెప్పలేక నిజం చెప్పేస్తాడు. అప్పుడు రమ్య నెమ్మదిగా వాడికి అర్థమయ్యేలా దొంగతనం ఎంత చెడ్డదో, అది అలవాటైతే ఎంతో ప్రమాదమో వివరిస్తుంది ‘చెడ్డ అలవాటు’ కథలో. తన తప్పుని దిద్దుకుంటాడు రుత్విక్.

పిల్లల్లో మార్కులు బాగా వచ్చేవారినే ప్రతిభావంతులుగా గుర్తిస్తూ, మార్కులు తక్కువ వచ్చినా, ఇతర విషయాలలో ప్రావీణ్యం ఉన్న పిల్లల్ని పట్టించుకోని ఓ మాస్టర్‍కి అతని తప్పు తెలిసేలా చేస్తుంది ఓ తల్లి ‘నేను డాన్స్ చేస్తాను’ కథలో.  “చదువులో తక్కువ ఉన్నంత మాత్రాన కళలో ముందుండకూడదా?” అని ఆ తల్లి వేసిన ప్రశ్న ఎంతో సమంజసం!

ఫీజుల విషయంలో పిల్లల్ని శిక్షించడం తగనిపని అని, ఆ విషయం తల్లిదండ్రులతో మాట్లాడి పరిష్కరించుకోవాల్సిన అంశమని ‘పనిష్మెంట్లు’ కథ చెబుతుంది. చిన్నవిషయానికి పెద్ద శిక్షలు వేసి పిల్లల మనసుల్ని కఠినంగా మార్చకూడదని ఈ కథ చెబుతుంది.

ఇంగ్లీషు నేర్చుకోవడం కోసం తెలుగును అవమానించాల్సిన అవసరం లేదన్న వాస్తవాన్ని చక్కగా చెప్తుంది ‘తెలుగు మాట్లాడడం తప్పా!’ కథ. తెలుగు మాట్లాడడం తప్పు అనే భావన పిల్లలలో కలిగించకూడదని హెచ్చరిస్తుందీ కథ.

ప్లే స్కూలు నుంచి మామూలు స్కూల్లో చేరిన చిన్నారి ఆర్ణ మనసులో చెలరేగిన సంఘర్షణని గుర్తించేదెవరు? ఆమె బాధని తీర్చేదెవరు? పరిస్థితులు ఆ పాపలో వయసుకు మించిన ఆలోచనలని కలిగిస్తాయి. ‘ఫింగర్ ఆన్ లిప్స్’ ఆలోచింపజేసే కథ.

బాగా చదవాలంటూ పిల్లలని ఒత్తిడికి గురి చేసి హాస్టల్‍లో చేర్పించి – వాళ్ళని సక్రమంగా పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో ‘అన్విక హాస్టల్’ అనే కథ చెబుతుంది. ఈ కథలో డాక్టర్ గారు చేసిన సూచన అనుసరణీయం.

గ్లోబల్ విలేజ్’ చక్కని వ్యంగ్యాత్మక కథ. బాలబాలికల పరిస్థితులు సముద్ర జీవులకు వర్తింపజేసి చెప్పిన ఈ కథలో ఓ చక్కని వాక్యం ఉంది. ‘హాయిగా బంగాళాఖాతంలో జీవించే వాటిని పసిఫిక్ మహాసముద్రం పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దడం’ – అంటారు రచయిత్రి. ఈ ఒక్క వాక్యంతోనే ఆధునిక విద్యావ్యవస్థ ఎలా ఉందో చెప్పేశారు రచయిత్రి.

మృగరాజు భాష’ మరో చక్కని కథ. అడవిలోని జంతువులను పాత్రలుగా చేసి – ఎవరి భాష వారికి గొప్పని, అందరూ ఒకరి భాషలోనే మాట్లాడాలనడం సరికాదని ఈ కథ సూచిస్తుంది.

పిల్లల్ని బలవంతంగా ఎక్స్‌కర్షన్‌కి తీసుకువెళ్ళాలని, వారి వయసును పట్టించుకోకుండా సముద్రం తీరానికి విహారయాత్రకు తీసుకెళ్ళాలనుకున్న స్కూలు యాజమాన్యం బాధ్యతారాహిత్యాన్ని ఓ విద్యార్థి తల్లిదండ్రులు ప్రశ్నించినా, వారి మూర్ఖత్వం మారదు. తమ పిల్లాడిని ఆ స్కూలు నుంచి మార్చేయాలని నిర్ణయించుకుంటారా తల్లిదండ్రులు ‘ఎక్స్‌కర్షన్’ అనే కథలో.

అసలైన ‘పెద్ద ర్యాంక్’ ఏమిటో రిషిత అనే పాప చెబుతుంది ఈ కథలో. తెలిసీ తెలియని వయసులో పిల్లల్ని హాస్టల్లో చేర్చితే, వాళ్ళు ఎదుర్కునే సమస్యలను ప్రస్తావిస్తుందీ కథ. అనవసరమైన పోటీకి దూరంగా ఉంచి పిల్లల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా చదివించుకోగలిగితే పిల్లలు ఎలా వికసిస్తారో ఈ కథ సూచనప్రాయంగా చెబుతుంది.

ఏదైనా బతికి ఉండాలంటే ఆహారం, నివాసమే కాదు, ఆనందం కూడా చాలా ముఖ్యమని ‘చెట్టుగా మారని మొలక’ కథ వివరిస్తుంది.

ప్రస్తుతం స్కూళ్ళల్లో పిల్లలకి ఇస్తున్న హోం వర్క్ భారంపై వ్రాసిన వ్యంగ్య కథ ‘పని భూతం’. ఏ పనినైనా చిటికెల చేసేయగల భూతం కూడా పూర్తి చేయలేని విధంగా హోం వర్కులు ఉంటున్నాయంటారు రచయిత్రి.

మనకి అసలైన మిత్రులెవరో ఎలా గుర్తించాలో ‘నిజమైన స్నేహితులు’ కథ చెబుతుంది. నిజమైన స్నేహితులను గుర్తించడమెలాగో తమ కొడుకు కిరణ్‍కి అర్థమయ్యేలా చెప్తారు అమ్మానాన్నలు.

ఓ నిరుద్యోగి – తమ ఊరి పాఠశాల పిల్లలలో – కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనని ఎలా రగిల్చాడో ‘సమస్య తీరింది’ కథ చెబుతుంది.

~

అన్ని కథలకు నప్పేలా చక్కని చిత్రాలను నెట్ నుంచి సేకరించి, కథలలో అమర్చారు. ఈ బొమ్మలు కథలకు నిండుదనాన్ని తెచ్చాయి. ఈ కథలు వర్తమాన సమాజంలోని విద్యావ్యవస్థలోని లోపాలను, తల్లిదండ్రుల అవగాహన రాహిత్యాన్ని, కొందరు ఉపాధ్యాయుల ప్రతికూల ధోరణులను చాటుతాయి. ఆలోచింపజేస్తాయి. తల్లిదండ్రులకు, బాలబాలికలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.

***

క్లాస్ రూం కథలు (బాలల కథాసంపుటి)
రచన: డా. కందేపీ రాణీప్రసాద్‌
ప్రచురణ: స్వాప్నిక్ పబ్లికేషన్స్
పేజీలు: 81
వెల: ₹ 100/-
ప్రతులకు: డా. కందేపీ రాణీప్రసాద్‌,
మేనేజింగ్‌ డైరెక్టర్‌,
సృజన చిల్డ్రన్స్‌ హాస్పటల్‌,
సిరిసిల్ల – 505301.
తెలంగాణ.
ఫోన్‌: 9866160378

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here