ముకుందూ – ముక్కులు తుడుచుకునే దినోత్సవమూ

1
4

[box type=’note’ fontsize=’16’] ఎన్నో అంతర్జాతీయ దినోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తానూ కొత్త అంతర్జాతీయ దినోత్సవాన్ని కనిపెట్టి మానవసేవ చేయాలనుకునే వ్యక్తి కథ – ఆదూరి హైమవతి రచించిన “ముకుందూ – ముక్కులు తుడుచుకునే దినోత్సవమూ“. [/box]

[dropcap]మా[/dropcap] ముకుందుడున్నాడు చూశారూ! మహా మొండిమనిషి. వాడు అనుకున్నది చేస్తే కానీ నిద్ర కాదుకదా ముక్కుతో గాలైనా పీల్చడు. వాడికి ఇటీవల ఏదో ఒక గొప్ప పనిచేసి అందరి మన్ననలే కాక సమాజానికి ఏదైనా మేలు జరిగేలా చూడాలనే తపన బయల్దేరింది. వాడి బుర్రలో ఏదైనా ఒక ఆలోచన వచ్చిందంటే ఇహ అందర్నీ తినేస్తాడు, అది కార్యరూపం దాల్చిందాకా.

మేమిద్దరం ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకుని కేజీ నుండీ పీజీ వరకూ చదువు వెలగబెట్టాం లేండి. వాడికి ఉండూరులో ప్రైవేట్ కాలేజ్‌లో, వాళ్ళ నాన్నగారికున్న రాజకీయ పలుకుబడితో అధ్యాపక ఉద్యోగం రాగా, నేను గవర్నమెంట్ కాలేజ్‌లో అధ్యాపకునిగా చేరి బదిలీలతో ఇబ్బందులు పడుతున్నాను. ఐతే మా స్నేహానికి మాత్రం ఏ ఇబ్బందీ కలక్కండా చూసుకుంటున్నాం. నెలకో మారైనా మా వాడు ఫోన్ చేయగానే వెళ్ళకపోతే, త్రాచుపాములా తాటంత ఎత్తెగురుతుంటాడు. వాళ్ళావిడా మా ఆవిడా అప్పచెల్లెళ్ళలా కలసిపోటాన మా స్నేహా [ట]లూ సాగుతున్నాయ్.

ఈ రోజు ఉదయాన్నే ఫోన్. “ఒరే రామూ! రేపూ ఎల్లుండీ కూడా సెలవులేగా, చెల్లాయీ పిలల్లతో వెంటనే బయల్దేరి వచ్చెయ్! హాయిగా ఈ మూడు రోజులూ అంతా కలసి గడపవచ్చు. ఈ ట్రిప్‌లో మాత్రం ఏదైనా ఒక నూతన ప్రక్రియ చేయాల్రా. నా మెదడంతా దానికోసం తపిస్తున్నది. అందరిలా మనమూ ఉంటే ఎలారా! ఏదో ఒక కొత్త మేలైన ఘనకార్యం చేయాల్రా! నీవు పక్కనుంటేనే నా మెదడు సరిగా పనిచేస్తుంది” అంటూ ఆర్డర్ జారీ చేశాడు.

 కాదన్నానో ఇహ కొంపలంటుకుంటాయ్. ఐతే నాకీ రోజొక ప్రోగ్రాం ఉంది. అదే చెప్పాను వాడికి.

 “ఈ రోజు మా కాలేజ్‌లో ఒక డిబేట్ ఉందిరా ముకుందూ! ‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం’ జరుపుతున్నాం. పిల్లలందరిచేతా ఈ దుర్మార్గపు అలవాటు గురించీ, దానివల్ల సమాజంలో మానవులకు జరిగే ఇబ్బంది గురించీ అవగాహన కలిగించను మాట్లాడిస్తున్నాను. రాలేన్రా” అన్నాను.

అంతే ముకుందు ముక్కు చీదుతూ… “అంతేలేరా ‘పనైందాకా బావా! బావా!, పనయ్యాక ఎవర్రా బావ?’ అన్నట్లు నేనడిగితే ఎందుకువస్తావ్ లేరా!” అన్నాడు.

పక్కనే ఉన్న శ్రీమతి, వారింట వంటమనిషి ఉండటాన, మూడు రోజులైనా వంటా పెంటా లేకుండా హాయిగా ఉండవచ్చని, “ఏంటండీ! అన్నయ్యగారు అంత ప్రేమగా పిలుస్తుంటే మీకెప్పుడూ ఉండే మీటింగులూ షూటింగులేగా! పోదాం పదండి, బట్టలు సర్దేస్తున్నా” అంటూ మరో మాటకు అవకాశమే లేకుండా లోపలికి వెళ్ళిపోయింది.

ఇహ తప్పదని “సరే, నే వెళ్ళి కాలేజ్‌లో డిబేట్ చూసుకుని వస్తాను. తయారవ్వండి” అంటూ కారు తీసుకునెళ్ళాను. ‘అవినీతి దినోత్సవ’మవటాన, పక్కనే రెండురోజులు సెలవులవటానా, ఏవో కొత్త సినిమాలు రిలీజవటానా – డిబెట్‌కు ఎక్కువమంది రాలేదు. ఒక గంటలో ముగించుకుని వచ్చేసరికి అంతా బ్యాగులతో సిధ్ధం.

రెండు గంటల్లో వాడి ఇంటి ముందున్నాం. అందర్నీ చూసి వాడి ముఖం పున్నమి చంద్రునిలా వెలిగి పోయింది. అంతా ఎవరి జతల్లో వారు చేరిపోయారు. మేమిద్దరం గంట గంటకూ అందుతున్న కాఫీలు, వేళకు తిండీ, ఫలహారాలూ కూడా అక్కడే సేవిస్తూ, ముకుందు గాడి తోటలో సంభాషణల్లో పడ్డాం. మా ముకుందు మెదడంతా ఏదైనా ఒక కొత్త ప్రణాళిక తయారు చేసి గొప్ప కీర్తీ, పేరుతోపాటుగా మానవ సేవా చేయాలనే తపనతో ఉంది. ఏదేదో ఆలోచిస్తూ, మామధ్య సంభాషణలు సాగిపోతున్నాయి.

“అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం’ అనగానే మా విద్యార్ధులకే ఉత్సాహం లేకుండా పోయి సగం మందైనా రాలేదురా! ఏం విద్యార్ధులురా” అన్నాను

“అసలు ఈ దినోత్సవాలేంటిరా రామూ! తల్లులరోజూ, పిల్లలరోజూ, నాన్నలరోజూ, నానమ్మలరోజూ, అత్తలరోజూ, ఆడపడుచులరోజు… అంటూ ఈ రోజులేంట్రా! ఉత్తప్పుడు వారెవ్వరితో మాట్లాట్టం, వారిని చూసుకోడం ఉండదా ఏం! ప్రత్యేకంగా ఇలా దినోత్సవాలు జరపాలా!” అన్నాడు సీరియస్‌గా.

 “అదేంట్రా! అలా అంటావ్! మన వాళ్ళను మనం ఆ రోజున గౌరవించుకోడం తప్పా! ఎంతో మందికి ఎన్నో విషయాలు తెలీవు. వారందరికీ ఎవేర్‌నెస్ కలిగించడం తప్పా!” అన్నాను, ముక్కు తుడుచుకుంటూ.

నీళ్ళు మారటానా, చలిగా ఉండటానా ఇక్కడికి రాగానే అందరికీ ముక్కులు కారసాగాయి. అప్పటికే ముకుందు ముక్కు తుడుచుకోను ఓ టవలూ, ముక్కు పీల్చుకునే గొట్టమూ (ఇన్‌హేలర్) అదీ పక్కనే ఉంచుకుని నిముష నిముషానికీ ముక్కు తుడుచుకుంటూనే, పీల్చుకుంటూనే ఉన్నాడు.

సాయంకాలం అవటాన, పిలల్లూ, వాళ్ళ అమ్మలూ అంతా తోటలో మాతోపాటు చేరారు.

అంతా ముక్కులు ఎగబీలుస్తూ, చేతిలో చేతి గుడ్డలతో ఉన్నారు.

అందర్నీ చూసి నేను “ఇదేంట్రా! తమాషాగా ఉందే. అంతా ముక్కులు తుడుచుకుంటూ ఎగబీల్చుకుంటూనూ!” అన్నాను.

మా చెల్లెమ్మ “అందుకే అన్నయ్యగారూ! వంటావిడను అందరికీ తులసివేసి మిరియాల కషాయం పెట్టుకురమ్మన్నాను” అంది. వంటావిడ ఓ డజను గ్లాసులూ ఓ పెద్ద జగ్గులో కషాయం తీసుకొచ్చింది. ఆవిడా ముక్కు చీర కొంగుతో తుడుచుకుంటూనే ఉంది.

నేను అందర్నీ చూసి నవ్వి “భలే ఉందిరా ముకుందూ! ముక్కుందా! ముక్కుందా! ముకుందా! ముకుందా!…” అంటూ పాట అందుకున్నాను. నేను కాస్త పాటగాడినిలెండి.

మా ముకుందు ఒక్క ఎగురెగిరి, గంతేసి – “ఒరే! భలే ఆలోచనరా! మనం ‘అంతర్జాతీయ ముక్కులు తుడుచుకునే దినోత్సవం’ ఎందుకు జరపరాదూ!” అన్నాడు.

“నీకేమన్నా పిచ్చిగానీ పట్టలేదు కదా! ముక్కుల రోజేంట్రా!” అన్నాను

“ఏం? ఎందుకు జరపరాదూ!’ అంతర్జాతీయ చేతులు కడుక్కునే రోజూ, అంతర్జాతీయ కారము-మసాల ఆహార దినోత్సవం, ఫూల్స్ రోజూ, పీస్ రోజూ, ఎర్త్ డేలూ, బర్త్ డేలూ… ఇన్ని జరుపుతున్నపుడు ‘ముక్కులు తుడుచుకునే రోజెం’దుకు జరపకూడదూ! అసలు ముక్కు లెందుకు కారతాయి? ముక్కులనెలా తుడుచుకోవాలి? ముక్కు కారినపుడు నొప్పెట్టకుండా సున్నితంగా ఏ కాయితాలతో ఎలా, తుడుచుకోవాలి? ఆ కాయితాల నాణ్యత ఎలా ఉండాలి? ఏ కంపెనీలు ఆ కాయితాలను సరఫరా చేస్తున్నాయి? తుమ్ము వస్తే ఆ గాలిలో క్రిములెంత వేగంగా దూరంగా వెళతాయి? అసలు ముక్కులు కారటానికి కారణాలేంటి? ముక్కు తుడుచుకున్నాక చేతులెలా కడుక్కోవాలి? కడుక్కోకపోతే నష్టాలేంటి? ఏ సబ్బుతో కడుక్కోవాలి? ఎలా కడుక్కోవాలి? ఒకరి ముక్కు నుంచీ మరొకరి ముక్కు కారను కారణాలేంటి? ఆ క్రిములు గాలిలో ఎలా వ్యాపిస్తాయి? ఇలా ఎన్నో పరిశోధనలు చేసి, జనాలందరికీ తెలియపరచి, ఎంత మానవ సేవ చేయవచ్చు? ముక్కులు కారేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోం రెమెడీస్ ఎలా పనిచేస్తాయి? ఎంత బిజినెస్ పెంచవచ్చు? ఎన్ని వ్యాపార రహస్యాలు ఎడ్వర్‌టైజ్ చేయవచ్చు? ఎన్నున్నాయిరా జనాలకు చెప్పను… ఏ రోజు సంవత్సరంలో ఖాళీగా ఉందో ఆ డేట్స్ మీరంతా అంతర్జాతీయ దినోత్సవాల పట్టికలు తలో కాపీలు తీసి చూసి చెప్పండి. ఎంత మానవసేవ చేయవచ్చో నాకిప్పుడు అర్ధమవుతున్నది. రామూ! నిన్ను ఇందాక ఈ దినోత్సవాలన్నీ ఎందుకురా అన్నానా! నాకిప్పుడు ఈ దినోత్సవాల స్వరూప స్వభావాలు, చేసే మేళ్ళూ తెలిసొస్తున్నాయిరా! మనమే ఈ ‘అంతర్జాతీయ ముక్కు తుడుచుకునే దినోత్స’వాన్ని ప్రారంభిద్దాం” అని మాకందరికీ ఆజ్ఞలు జారీచేసి, తాను మొబైల్ అందుకుని,ఆ ఊరి ఎం.పి.గారికీ, ఎం.ఎల్.ఏ గారికీ, వాడి కాలేజీ ప్రిన్సిపల్ గారికీ, టీ.వీ ఛానెల్సుకూ ఫోన్స్ చేసి మీటింగ్ ఎరేంజ్ చేయడంలో మునిగిపోయాడు ముకుందు, తనకున్న స్థానిక పలుకుబడి, రాజకీయ పలుకుబడీ ఉపయోగించుకుంటూ – గొప్ప స్థాయిలో ఏర్పాట్లు చేయను.

‘అంతర్జాతీయ ముక్కులు తుడుచుకునే దినోత్సవా’నికి డేట్ ఫిక్స్ చేయడంలో మేము ములిగిపోయాం. దీన్లో నా పాత్రా ఉంది లెండి, నన్నో ప్రధాన స్పీకర్‌గా పేరేస్తానని బలవంతంగా ఒప్పించాడు మా ముకుందు. మీరూ తప్పక రండేం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here