[డా. కాళ్ళకూరి శైలజ రచించిన ‘విడుదల’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]పొ[/dropcap]ద్దున్నే నది ఒడ్డున
నిలబడి,
రాత్రి కలతల కడవ ఒంపి, సందేహల మకిలి తుడిచి,
రాగవిరాగాల వాసన పోయేలా,
వేళ్ళ కళ్ళతో వెతికి
తడిమి, తడిమి కడగాలి.
అందాకా పొర్లాడిన కలుగు వదిలి,
వెతుక్కుంటూ తీరం చేరి నలుదిక్కులా తేరిపార చూస్తే,
దిగంతాల నలుపు నీలమై, నీరమై,
నేల కౌగిలి వీడిన గతపు మగతలా తేలిపోతుంది.
నదిలా పరుగుతీసే కాలం ఒడ్డున
మైమరచిన మనసును
తట్టిలేపి,
లోకం పుస్తకంలో దిద్దుబాటు వాక్యంగా వ్రాసే ఒడుపు నేర్చుకుంటాను.
ఏదో ఒక రోజు కడవకెత్తేదంతా భ్రమేనని
దేహాత్మలు మూలుగుతాయి.
అదే నదీతీరంలో,
ఆనాటి ఉదయాన
మాట గడి దాటి,
మౌన రాగాలాపనై,
ఒదిగిన నాడు
నా కడవ అక్షయపాత్ర.