అఖండ పద్య కవికి గండపెండేర సత్కారము

0
3

[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల రచించిన ‘అఖండ పద్య కవికి గండపెండేర సత్కారము’ అనే వ్యాసం పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సా[/dropcap]హిత్యం సాత్విక శక్తి. సాహిత్యాన్ని సృష్టించిన కవి అపర బ్రహ్మ. రచయితలు దేశ విదేశాలలో ఎక్కడ ఉన్నా అంతర్జాలం రాక ముందునుంచీ అంతర్జాతీయ మాధ్యమంలో అందరికీ దగ్గరవారు.

ఆధునిక పద్య కవులలో శ్రీ తిరుమల కృష్ణ దేశికాచార్యులు గారు అగ్రేసరులు. వారు కెనడాలో స్థిర పడ్డారు. జన్మసిద్ధమైన కవితా కళను సంరక్షించుకుంటూ, మహా కావ్య రచనను కావిస్తున్నారు. వారు Atomic Energy of Canada లోనూ, New Flyer Industries లోనూ computer scientist గా పనిచేసి ప్రస్తుతం టొరంటొలో ఉంటున్నారు.

కంప్యూటర్ల మధ్య నడయాడుతున్నా దేశికాచార్యుల వారు కావ్యతత్వాన్ని కనుగొన్నారని, యంత్రాలు వారికి మంత్రాలు నేర్పాయని విజ్ఞులన్నారు.

డా. తిరుమల కృష్ణ దేశికాచార్యులవారు రాసిన కావ్య పరంపరలో ‘కావ్యనందనం’ మొదటి సంపుటం మొదటిది. ఇందులో కవితా స్రవంతి మొదటి భాగం. ఇందులో సంస్కృతి ఖండం, ప్రకృతిఖండం అనే రెండు ప్రకరణాలున్నాయి. సంస్కృతిఖండలో తెలుగు సంస్కృతి చరిత్రకు సంబంధించిన 23 ఖండికలున్నాయి. సంస్కృతి ఖండంలో ఉన్న పద్యకథానికలు సంక్షిప్తంగా కొంత వరకూ కావ్య లక్షణాలను కూడా తెలుపుతాయి. ప్రకృతి ఖండం భారత దేశ ప్రకృతినేకాక, అసిన బోయినోద్యాన వనము, విరుల పాట,హిమ పాతము. పత్ర పతన కాలము, అను ఖండికలు కెనడా లోని ప్రకృతి వర్ణనాంశాలను కలిగి ఉండడం విశేషం. ఈ ప్రకృతి వర్ణనలు మానవ ప్రకృతులను కూడా వర్ణించి సందేశాలను ఇవ్వడం కావ్య ఉద్దేశానికి సర్వ సమగ్రతను కలిగిస్తుంది. ప్రకృతిని వీరు గురువుగా భావించారు.

ఈ సంపుటం లోని రెండవ భాగం ‘ఋతుసంహారం’, ఇది కాళిదాసుకవి ఋతుసంహారానికి పండిత జన రంజకమైన సమూలాంధ్రానువాదం.

ఈ సంపుటి లో మూడవ భాగం ‘అశ్రు మాల’. ఇది కవి గారు రాసిన తొట్ట తొలి కావ్యం. ఇది వారికి ఇష్టమైన రచన.

ఈ ‘కావ్యనందనం’ మొదటి సంపుటం పూర్వ ప్రతిని 2012లో పాలపిట్ట సంస్థ ప్రచురించింది. కవి గారిప్పుడు పిడిఎఫ్ ప్రతిలో అంతర్జాలం లో మనకు అందించారు.

“నలిపిన కొలది తావుల
నొలికెడు పొగడలవలె సుమనో హృద్యంబై
చెలగును గాదే పద్యము
తెలిసిన కొలది నవార్థ దీప్తంబగుచున్”

అని పద్యం మీద తమకున్న ధ్యాన ధ్యేయ తత్పరతను ప్రకటించారు. పద్యాలను చదివిన కొలదీ నవార్థముద్దీపితమవుతుందని తెలిపారు.

కమ్మని పద్య మరందము
గొమ్మని కోరంగవలెనె కోవిద గణమున్?
తమ్ముల తేనియ నానగ
రమ్మని పిలువంగ వలెనె భ్రమర గణంబున్?

అన్న పద్యాభి రసనా భృంగము ఈ కవి.

అల త్రిలింగ పద భవంబు తెలగ పదము
ఆణె మన దేశమగు, గాన నర్థమగు న
ఖండ తెలుగు ధరకు తెలంగాణ మనగ
ఇది ఎరుంగక విభజింప నెంతురేల?

అంటూ, తెలగాణెము పదాన్ని తెలుగు దేశాని కంతటికీ అన్వయించారు.

ఈ పద్య సంప్రదాయ కవి, నవ్య భాషా ప్రయోగ వైశిష్ట్యంతో కావించిన “సెలయేటిని ప్రకృతి కాంత ధరించిన రిష్టు వాచియుంబలె” వంటి పద ప్రయోగాలు ఆధునికత్వాన్ని సంతరించుకున్నాయి.

వాక్కు, కాయంబు అర్థంబె ప్రాణమగుచు నిఖిల జీవుల జిహ్వలే నెలవులగుచు, అంటూ తమ కావ్యనందనం జన జిహ్వలపై నివసించాలని కోరారు.

శ్రీ కృష్ణ దేశికాచారిగారు రాసిన ఛందోబద్ధమైన కావ్య పరంపరలో ‘కావ్యనందనం’ రెండవ సంపుటంలో మొదటి భాగంలో ‘మహాశిల్పి జక్కన చరిత్రము’, రెండవ భాగంలో ‘హనుమప్ప నాయకుడు’ కావ్యాలున్నాయి.

శ్రీ తిరుమల దేశికాచార్యుల వారిది నవీకృత ప్రబంధ శైలి. భావబంధమైన కావ్యశైలిని అలంకార, వర్ణనలతో సరికొత్త బాణీలో ప్రబంధావిష్కరణను కావిస్తారు.

“Prabandha when Dr. Krishna Desika has taken it up and breathed life into it. దేశికాచార్యులవారు సడలి పోతున్న పూర్వ ప్రబంధ శైలి కి పునరుజ్జీవనమును కలిగించారు” అని ఆంగ్ల కావ్య పీఠికను రాసిన ఎస్ లక్ష్మణ మూర్తిగారన్నారు (కాకతీయ విశ్వ విద్యాలయ విశ్రాంత ఆంగ్లభాషా చార్యులు).

జక్కన చరిత్రము కావ్యం తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్‌కు పిహెచ్‌డికు భాగంగా పరిశోధనకు మూలమైంది.

మహాకవి జక్కన చరిత్రము కవిగారు రాసిన కావ్యాలన్నింటిలో మకుటాయమానం అని వారు భావించారు.

ఈ కావ్యం ప్రథమ ముద్రణ 1994 లో జరిగింది. తదుపరి రెండవ ముద్రణ తొలిముద్రణ దోష పరిహరణ, సంస్కరణలతో పాలపిట్ట బుక్స్ సంస్థ వారిచే ముద్రణను పొందింది.

జక్కన చరిత్ర కవిగారి నాల్గవ కావ్యం. ఈ కావ్యాన్ని బేలూరు హళేబీడులను సందర్శించిన ప్రేరణతో అక్కడి శిల్ప సౌందర్యానికి ముగ్ధులై రాసారు. వారు ఈ కావ్యాన్ని 92లో ప్రారంభించి దాదాపు రెండున్నర సంవత్సరాలలో 1994 సెప్టెంబరులో ముగించారు

కవి గారు తమ కావ్యంలో నూత్న వృత్తములను ప్రవేశ పెట్టారు. కొత్త ఛందస్సులను వాడారు. పరభృతము, మనోరమ, వసంత కోకిల, విలాసిని, విభావరి, నయగారా, సుగతి, ప్రభావతి, కైవల్యము స్వకల్పిత వృత్తాలు.

జక్కన చరిత్ర ప్రసిద్ధమైనది. ప్రతి కథకు ఒక మూలం ఉంటుంది. ఈ శిల్పి చారిత్రక పురుషుడనుటకు రస భావాలతో కూడిన శిల్పాలు సాక్ష్యమిస్తాయి. ఈ శిల్పి కథ ననుసరించి దాశరథి కృష్ణమాచార్యులవారు ‘మహాశిల్పి జక్కన’ అను లఘు గ్రంథాన్ని రాసారు. ఇంతకు పూర్వము చలన చిత్రం గానూ, గ్రంథ రూపం లోనూ వచ్చిన జక్కన చరిత్రకు దేశికాచార్యుల వారు ప్రబంధ రీతుల తగు కల్పనలను కావించారు. తమ రచనకు కన్నడ నవలలో, కావ్యములో గల హొయసల రాజ్య వంశాన్ని విష్ణు వర్థన మహారాజు, ఆతని రాణులు శాంతలా లక్ష్ములను,గురించిన పాత్రచిత్రణలను ఆధారంగా గ్రహించారు.

ఈ కావ్య నాయిక మల్లికను గుణాఢ్యురాలైన నర్తకిగా తీర్చారు. జక్కనను శ్రీమంతుడు కాని ఉత్తమ శిల్పిగా చిత్రించారు. మల్లికా జక్కనలు క్రీడాపుర సమీప వనంలో కలుసుకున్నారు. అక్కడ చైత్ర మండప ప్రారంభోత్సవ సమయంలో మల్లిక నాట్యం చేసినట్లు వారికి కలిగిన పరిచయము ప్రణయముగా మారి పరిణయానికి దారితీసిందని కథను అల్లారు. మూల కథకు అంతరాయం కలుగకుండునట్లు మల్లిక పాత్రను తీర్చిదిద్దారు. కావ్యాంతంలో భగవద్రామానుజుల వారి బోధనతో జక్కన దుష్ట శిలలో మూల మూర్తులను తొలచినందుకు పాప పరిహారంగా కరమును ఖండించుకొనక, ఉత్తరోత్తర ఆలయ నిర్మాణాన్ని కొనసాగించాడని కథను సుఖాంతం చేసారు.

“పలికెడిదొక శిల్పకళా
జలజాసను కథ యట, అల జలజాక్షుండే
పలికించెడునట దానిం
బలికెద వేరొండు గాథ బలుకగనేలా”

అనే పద్యం పోతనను తలపిస్తుంది.

పండిత ఓగేటి పరీక్షిత్తు శర్మ గారు (ఆటవా హిందూ దేవాలయము, కెనడా) గారు జక్కన చరిత్రము కావ్యము లోని ప్రతిపద్యం రస నిస్తులము అంటూ షష్ట ఉల్లాసములకు విపులమైన పీఠికను విస్తారంగా రచించారు.

‘కావ్య నందనము’ రెండవ సంపుటం లోని రెండవ భాగం ‘హనుమప్ప నాయకుడు’. ఇది ఆరు ఆశ్వాసములున్న కావ్యం. గద్వాల సోమనాద్రి భూపాలునికి విజయ కారణమైన ‘వాజిరాజాన్ని’ తురుష్కులు వంచనతో గ్రహించారు. ఆ గుర్రాన్ని చొప్ప అమ్మే వాడి వేషంతో ఆ తురుష్కుల సైనిక స్కంధావారానికి వెళ్ళి తిరిగి తెచ్చిన హనుమప్ప నాయకుని సాహసవంతమైన వీరగాథ ఇది. ప్రభు భక్తి పరాయణుడైన హనుమప్ప నాయకుని కథను, తమ ‘హైందవ ధర్మ వీరులు’ అనే గ్రంథంలో సురవరం ప్రతాప రెడ్డిగారు సంగ్రహంగా తెలిపారు. ఆ కథను ప్రబంధ రీతుల వర్ణనలతో పెంచి మథుర కావ్యంగా తీర్చిదిద్దారు దేశికాచార్యుల వారు.

సోమనాద్రి ధర్మ మార్గాన్ని అనుసరించి గద్వాలు రాజ్యాన్ని పరిపాలించాడు. గద్వాలును సోమనాద్రి తెలుగువారికి గర్వకారణమైన రీతిలో చక్కని కళాకేంద్రంగా తీర్చిదిద్దాడు. ఆతని వైభవాన్ని చూసి ఈర్ష పడిన ఉప్పేడు సర్దారు సయ్యదు, గద్వాలుపై యుద్ధానికొచ్చాడు. తెలుగు వీరులు తురుష్క సైన్యంతో పోరాడి వారిని ఓడించారు. సయ్యదు సాటి నవాబుల సాయాన్నే కాక నైజాము నవాబు సాయాన్ని కూడా అర్థించాడు. సోమనాద్రి విజయానికి ఆతని అశ్వమే కారణం అని దానిని తురుష్కులు రహస్యంగా అపహరించి అశ్వశాలలో కట్టేసారు.

అశ్వాన్ని కోల్పోయిన చింతలో ఉన్న సోమనాద్రి అశ్వాన్ని తెచ్చిన వానికి, ఆ గుర్రం ఒకరోజులో అతివేగంగా తిరిగినంత మేర భూభాగాన్నిస్తానని ప్రకటించాడు. హనుమప్ప తన ప్రాణాలకు తెగించి సాహసకార్యానికి ఒడిగట్టాడు. ఆ అశ్వాన్ని తిరిగి తెచ్చుటలో హనుమప్ప చూపించిన కౌశలము, ధైర్యము సాటి లేనివి.

హనుమప్ప నాయకుడు హనుమంతుని వర ప్రసాదంతో జనించాడు. ఆనాటి రామాయణంలో సముద్రాన్ని లంఘించి, అశోకవనంలో ఉన్న సీతను గూర్చిన క్షేమ వార్తను రామునికి తెలిపి, కృతార్థుడయ్యాడు హనుమంతుడు. అలాగే హనుమప్ప నాయకుడు తురుష్కులు అపహరించిన హయ రాజాన్ని తెచ్చి సోమనాద్రి కృతజ్ఞతకు పాత్రుడయ్యాడు.

మూలంలో ని చిన్న కథకు కవిగారు కావించిన వివరణ ప్రబంధ రీతులకు అనుగుణంగా ఉంది. కవిగారికి ఉన్న పూర్వ కావ్య పరిచయం, లోకజ్ఞత ప్రశంసనీయంగా ఉన్నాయి. వసంత, హేమంత ఋతువులు, హనుమంతుని వర్ణన, కృష్ణా తుంగభద్రలు, గద్వాల వైభవము, రాజ కళా విద్యాంసుల పోషణ, కేశవ స్వామి ఆలయ నిర్మాణం, తురుష్కుల అహంకారము, వారి మద్యపానాసక్తి, వారితో హనుమప్ప బేరము, హనుమప్పను గుర్తించి హయము చేసిన తాత్సారము, యుద్ద వర్ణనలను కవి రస పద్ధతులతో క్కావించారు.

అద్వితీయమైన ఛందో వైవిధ్యంతో,దిగ్గజ కవులకు సాటి ప్రతిభతో కవి గారు తీర్చి దిద్దిన కావ్య సంపుటులు “ఈ పాండిత్యము నీకు దక్క మరి యెందే గంటిమే” అనిపించక తప్పదు.

కవి గారు ఈ కావ్యాన్ని తమ తలిదండ్రులకు అంకితం ఇచ్చారు.

“అత్యమోఘమౌ విశ్వ సాహిత్య వనము
లోతెల్గు పూలకు సరిలేని వింత
సౌరభంబుల,రంగుల నేర్చి కూర్చి,
తమ్మ, నీ కెంత ప్రియమమ్మ ఆంధ్రులన్న!”

అని తెలుగు భాషమీదున్న గౌరవాన్ని సహేతుకంగా నిరూపించుకున్నారు.

“విరులతో మాలకరి వివిధమౌ హారముల
విరచించు గతిసుధా విమల మధురోక్తులను
విరచింతు రాశువుగ వర కావ్యముల వారు.
కురుపింత్రు నవ పద్య కుసుమమ్ములను వారు”

అంటూ గద్వాల సంస్థానంలో ప్రతి మాఘ మాసంలో విద్వద్గోష్టులు జరుగుతుండేవని కావ్యంలో కవిగారు పలికిన మాటలు, ఆనాటి సంగతినటుంచి, స్వీయ విషయంలో ప్రత్యక్షర సాక్ష్యాలుగా శ్రీ తిరుమల దేశికాచార్యులవారి కవిత్వ నిర్మాణచాతుర్యాన్ని చూపుతాయి.

పై కావ్యాలన్నింటికి ఉద్దండులైన పండితవర్యులు ఉపోద్ఘాతాలను, పీఠికలను రాసారు. కవిగారు స్వయంగా తదుపరి ముద్రణలలో తాము కావించిన మార్పు,కూర్పులను గురించి విపులంగా ప్రస్తావించారు.

నా వ్యాసం కవిగారి కావ్య నిర్మాణ పటిమను చూపే కొండను పట్టిన అద్దము మాత్రమే.

జక్కన చరిత్రము కావ్యం తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్‌కు పిహెచ్‌డికు భాగంగా పరిశోధనకు మూలమైంది. వారి పద్య కావ్యాలు హనుమప్ప నాయకుడు, ఋతుసంహారము, జక్కన చరిత్రలను యువ భారతి వారు ముద్రించి. తెలుగు నేలపై రసధారలను కురిపించారు. వీరి ఋతు సంహారము, హనుమప్ప కావ్యాలు విశ్వనాథ పురస్కారాన్ని పొందాయి.

వీని తర్వాత శ్రీమాన్ దేశికాచార్యుల వారు వ్రాసిన వాణి నారాణి, బిల్హణీయము అనే రెండు పద్యనాటికలు గల పుస్తకం, సమూలపుష్పబాణవిలాసం అనే పుష్పబాణవిలాసం, గీతగోవిందాది ఇతరగ్రంథాల్లో ఉన్న కొన్ని శ్లోకాలకు వారి అనువాదాలతో గూడిన గ్రంథం, నెల క్రింద విడుదల ఐన ఓపెరామాలిక అనే 584 పుటల గ్రంథం ఎమెస్కో ప్రచురణలుగా వచ్చాయి.

కంప్యుటరులో తెలుగుకు వీరు ప్రప్రథమంగా యూనికోడు ప్రమాణ సహితంగా పోతన లిపిని. రూపొందించారు. పోతన కీ బోర్డు డ్రైవరును నిర్మించారు. వేద మంత్రాలను సస్వరంగా రాయడానికి వైదిక పోతన ఫాంటును రూపొందించారు. వేమన, శ్రీనాథ – ఇతర ఫాంటులను తయారు చేసారు.

తెలుగు భాషకు తన పటిమతో మరిన్ని వన్నెలుదిద్దిన శ్రీ తిరుమల కృష్ణ దేశికాచారి గారికి ‘గండపెండేర’ సత్కారమును తెలుగు వాహిని (కెనడా) వారు గురుపూజా మహోత్సవం సందర్భంగా బహూకరిస్తున్నారు. ఈ ఉత్సవం గురుపూర్ణిమ రోజున వైభవోపేతంగా జరుగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here