[box type=’note’ fontsize=’16’] “సుకుమారాలు, సుమనోహరాలు అయిన పూలు అల్పకాలం ఉండే అనల్ప సృష్టి. అసలు పూలు లేని ప్రకృతిని మనం ఊహించగలమా? పూలతోటలు… పూలలోయలు వాహ్! మనసు ఉప్పొంగిపోదూ” అంటున్నారు జె. శ్యామల “మానస సంచరరే-3: విరించి కూర్చిన విరుల విలాసం!” అనే కాలమ్‍లో. [/box]
[dropcap]‘కౌ[/dropcap]సల్యా సుప్రజా రామా… పూర్వా సంధ్యా ప్రవర్తతే…’ గుళ్ళో నుంచి వేంకటేశ్వర సుప్రభాతం వినబడటంతో ఒక్క ఉదుటున లేచాను. రాత్రి వాన వచ్చిన విషయం గుర్తుకొచ్చి ‘పేపర్ వేసి ఉంటాడు, తడిసిపోయిందేమో’ అనుకుంటూ గబగబా వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా వానధాటికి నేలరాలిన తెలతెల్లని, తాజా సన్నజాజులు నవ్వుతూ పలకరించాయి. వాటిని ప్రేమగా, ఇష్టంగా ఏరుతూ ఉంటే జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి ‘పుష్పవిలాపం’ గుర్తుకొచ్చింది.
నేనొక పూలమొక్క కడనిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్లు విప్పి మా
ప్రాణము తీతువా యనుచు బావురుమన్నవి, క్రుంగిపోతినా
మానస మందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై…
ఎంత చక్కని కావ్యం. అది విన్నప్పుడల్లా మనసంతా ఆర్ధ్రమైపోతుంది. పూల మనసు పాపయ్యశాస్త్రిగారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. అటుపక్క మరో పూలకుండీపై నిలిచిన పేపర్ కనిపించింది. దాన్ని అందుకుని ఏరిన సన్నజాజుల్ని పేపర్‌పై ఉంచి లోపలికి నడిచాను. చిన్న గాజు పాత్రలో వాటినిపోసి టేబుల్‌పై ఉంచి పేపర్ అందుకున్నాను. ఏవేవో వార్తలు ఉన్నాయి కానీ నన్ను ఆకర్షించింది మాత్రం ‘పబ్లిక్ గార్డెన్స్’లో రేపటి నుంచి ‘గులాబీల ప్రదర్శన’. ఎలాగోలా వీలుచేసుకొని వెళ్లాలి అనుకుంటూ లేచాను. కాఫీ తయారీ ప్రయత్నాలు ప్రారంభించి, బ్రష్ చేసుకుంటున్నానే కానీ ఆలోచనల్లో పూలు షికార్లు చేస్తున్నాయి. ‘గులాబీ బోధ చేయదు. దాని పరిమళంతోనే మనకు బోధిస్తుంది’ అంటారు గాంధీజీ. ఎంత చక్కటి సూక్తి. తీరిగ్గా కాఫీ తాగుతుంటే నా ఏకాంతాన్ని భగ్నం చేస్తూ ఫోన్ మోగింది.
వైజాగ్ వెళ్లిన మావారు… సంభాషణ చివరగా ‘నీకోసం ఏమైనా తెమ్మంటావా’ అని అడిగారు. ‘సింహాచలం వెళ్తానన్నారుగా. అక్కడినుంచి కాసిని సంపెంగలు తెండి చాలు’ అన్నాను. ‘అంతేనా, సరే’ నంటూ ఫోన్ పెట్టేశారు. పూలను మించిన మంచి కానుక ఏముంది అనుకుంటుంటే, మళ్లీ నాలో నేను మొదలైంది. సౌందర్య వర్ణన చేసేటప్పుడు సంపెంగలాంటి ముక్కుఅని, కలువల్లాంటి కళ్లనీ పూలతో పోలుస్తుంటారు. ప్రతి కవి ఏదో ఒక సందర్భంలో పూల ప్రస్తావన తెచ్చే తీరుతాడు.
సినారె ‘నవ్వులా, అవి కావు, నవపారిజాతాలు’ అని ఎంత అందంగా నవ్వును పారిజాతాలతో పోల్చారు!’ అనుకుంటూ ఉండగానే ఎదురుగా చిందరవందరగా ఉన్న అల్మైరా కనపడటంతో ఈ సెలవురోజున, అందునా నేను ఒక్కదాన్నే ఉన్న రోజున నేను చేయాలనుకున్న పనులు నిరాఘాటంగా చేసేయవచ్చు అనుకుంటూ ముందుకు నడిచాను. ఇలా సర్దడం మొదలు పెట్టానో, లేదో ఓ ఆల్బమ్ ధబీమని కిందపడింది. ‘అరే’ అనుకుంటూ వంగితీశాను. ఆల్బమ్ పడటంలోనే మధ్యకు తెరుచుకుంది. ఆ పేజీపై నా దృష్టి పడింది. అరచేయంత సైజులో అందంగా విరిసిన బంతిపూవును సున్నితంగా పట్టుకుని మా పెద్ద బంగారు దిగిన ఫొటో. చెట్టునిండా పూలే. పాతికేళ్ల నాటి ఫొటో. జ్ఞాపకాల అల ఉవ్వెత్తున లేచింది. అప్రయత్నంగానే ఆ ఆల్బమ్ అందుకుని సోఫాలో కూర్చుని తిరగేయడం మొదలుపెట్టాను. మా ఇల్లు కట్టుకున్న కొత్తల్లో తీసిన ఫొటోలు. కొత్త ఇల్లు కొత్త ఉత్సాహం. కాంపౌండంతా కొత్తమన్ను పోయించి రకరకాల పూలమొక్కలు నాటాం. ఎన్నెన్నో మొక్కలు కొన్నాం. పిల్లలు స్నేహితుల ఇళ్లనుంచి కొన్ని మొక్కలు తెచ్చి నాటారు. మల్లెలు, మందారాలు, డాలీయాలు, సన్నజాజి, కనకాంబరాలు, చామంతులు, డిసెంబర్ పూలు, గన్నేరు, గులాబీలు, బంతులు… ఒకటా, రెండా ఏవేవో రకాలు.
మరో పేజీలో మా చిన్నబంగారు అటు, ఇటు పూతీగెల మధ్యలో నిలబడి మధ్యలో మొహం మాత్రమే కనపడేలా నిలుచుంది. ఎంత అందంగా ఉందో. రంగురంగుల డాలియాలు రమ్య మనోహరంగా… ఆ మందార చెట్లు… అవును… అది మొదటిసారి పూచిన రోజయితే ఆ పువ్వును మళ్లీ మళ్లీ వెళ్లి చూసి మురిసిపోయింది. చిన్నారి పొన్నారి పూవు… విరబూసి విరబూసి నవ్వు’ అప్రయత్నంగా పాడాను. మల్లెలో… విరగబూసేవి. ఎంత పరిమళమో. ‘మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే…’ మల్లీశ్వరి పాట గుర్తొచ్చింది. అందమైన నవ్వును కూడా ‘సిరిమల్లె పూవల్లె నవ్వు’ అంటూ నవ్వుతోనే పోల్చారు. ఆనందాన్ని, విచారాన్ని కూడా పూలు సమంగా పంచుకుంటాయి. మధురోహలలో తేలిపోయే నాయిక ‘మల్లియలో ఘుమఘుమలు, ఘుమఘుమలో గుసగుసలు, ఏవేవో కోరికలు…’ అని ఆనందంగా హాయిగా పాడుకుంటే, మనసిచ్చిన చెలి దూరమైన నాయకుడు విషాదంగా ‘మల్లియలారా! మాలికలారా! మౌనముగా ఉన్నారా? మా కథయే విన్నారా?’ అని పూల ముందు గోడు వెళ్లబోసుకుంటాడు. మరోకవి ‘ఇది మల్లెల వేళయనీ, ఇది మల్లెల మాసమనీ… తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ… విందులు చేసింది’ అంటూ కథంతా పాటలో చెప్పేశాడు. మల్లెలు స్వచ్చతకు మారుపేరు. నిజానికి ఏ పూవు అందం ఆ పూవుదే. సాయంసమయాన విరిసే రంగురంగుల చంద్రకాంతాల ప్రకాశాన్ని చూసినప్పుడు ఆ వర్ణమనోహర పుష్ప విలాసం ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది! ఆల్బమ్‌లో మరో పేజీ తిప్పగానే కనకాంబరాలు… చిట్టిచేమంతులు దర్శనమిచ్చాయి. కనకాంబరాలకు వాటి రంగే ఆకర్షణ. చిట్టి చేమంతుల చిద్విలాసం చెప్పే పనేలేదు. అంతలో ఫోన్ రింగ్ కావటంతో ఆల్బమ్ మూసేశాను. పారిజాతం ఫోన్ చేసింది… వాళ్లింట్లో ఆదివారం గెట్ టు గెదర్‌కు రమ్మని ఆహ్వానించింది. మా స్నేహితులు మల్లిక, రోజా… అంతా వస్తున్నారని ‘మిస్’ కావద్దని చెప్పింది. సరేనన్నాను. పారిజాతం ప్రస్తావన రాగానే నాకు శ్రీకృష్ణ పారిజాతం వృత్తాంతం గుర్తుకొచ్చింది. నారదుడు శ్రీకృష్ణుడికి పుష్పాన్ని తెచ్చివ్వటం, ఆ నంద నందనుడు పక్కనే ఉన్న రుక్మిణికి దాన్ని ఇవ్వటం… ఆ విషయం తెలిసి సత్యభామ అంత అపురూప పుష్పాన్ని కృష్ణుడు తనకుగాక రుక్మిణికివ్వటం భరించలేక, అసూయతో అలకగృహానికి చేరటం… కృష్ణుడు వచ్చి బతిమాలగా ఓ తాపు తన్నటం, వగైరా కథంతా నడిచాక కృష్ణుడు నీకు ఒక పువ్వేమిటి, చెట్టే తెచ్చిస్తానని ఇంద్రుడి నందనోద్యానంలోని పారిజాతవృక్షానీ పెకలించి తేవటం, అది యుద్ధానికి దారి తీయటం… ఆ పైన చెట్టును కృష్ణుడు తెలివిగా సత్యభామ ఇంటిలో నాటి, పూలకొమ్మ రుక్మిణి ఇంటిలో వాలేట్లుగా ఉంచటం… కథంతా భలేగా సాగుతుంది. ఇలా ఒక పువ్వు కలహానికి, యుద్దానికి కూడా కారణమైంది. అయితే పారిజాతాలంటే ప్రస్తుతం మనకు తెలిసినవి కాషాయవర్ణం కాడతో ఉండే చిన్ని తెల్లని పూలు. కానీ సినిమాల్లో చూపించే కృష్ణ పారిజాతం వేరుగా ఉంటుంది. ఉత్తరభారతంలో ‘కుంతేలా’ గ్రామంలో పారిజాతం చెట్టు ఒకటుంది. అది కుంతీదేవికోసం, అర్జునుడు తెచ్చిందని, కుంతి పేరుమీదే ఆ గ్రామానికి ఆ పేరు వచ్చిందని జనవిశ్వాసం. అంతేకాదు, క్షీర సముద్రం నుంచి ఉద్భవించిన వాటిలో పారిజాతం చెట్టు కూడా ఒకటంటారు. ఇంతలో బయటనుంచి ‘పారిజాత సుమదళాల పానుపు… మనకుపరచినాడు చెరకువింటి వేలుపు’ పాట వినపడింది. రోజూ ఈ సమయానికి సిమెంటు బస్తాలను తీసుకెళ్లే ఓ రిక్షా అతను పాతపాటలను వింటూ, వినిపిస్తూ వెళతాడు. అతడి అభిరుచి చూసి అబ్బురపడుతుంటాను. పూవై విరిసిన పున్నమి వేళ… ఓ హెూ గులాబి బాలా… అందాల ప్రేమ మాలా, ముద్దబంతిపూవులో మూగకళ్ల ఊసులో, బంతీ చేమంతీ ముద్దాడుకున్నాయి… మల్లె, మందారం పెళ్లాడుకున్నాయి, చేమంతీ ఏమిటే ఈ వింత, ఈ చినవానికి కలిగెనేల గిలిగింత… లేని పులకింత… ఇలా ఎన్నెన్నో పాటలు రోజూ వీధంతా వినిపిస్తుంటాడు.
అలంకరణకు, పూజకు, పూజలో అలంకరణకు కూడా పూల వాడకం విరివిగా ఉంటుంది. లక్షల ఖరీదు చేసే టన్నుల కొద్దీ పూలతో తిరుమలేశుడికి పుష్పయాగం చేయడం వీక్షిస్తూనే ఉంటాం. అన్నట్లు ఒక్కో దేవుడికి ఒక్కో పువ్వు ఇష్టం. ఈశ్వరుడికి తుమ్మి పూలు ఇష్టంట. అందుకే ‘ఏమి చేతురా లింగా, ఏమి చేతురా…’ అంటూ తుమ్మిపూలు తెద్దామంటే తుమ్మినున్న కోటి తుమ్మెద ఎంగిలంటోందని భక్తుడు బాధపడతాడు. దేవుడి పాదాలముందు పూవై క్షణం నిలిచినా చాలని మరో భక్తుడు తన మనసు వెల్లడిస్తాడు. ‘ఆముక్తమాల్యద’ కథలో విష్ణుచిత్తుని పుత్రిక దేవుడికోసం రోజూ పూలమాలలల్లి ముందుగా తాను ధరించి ఇచ్చిన వృత్తాంతం ఉంది. కృష్ణుడి విషయానికి వస్తే ‘చేత వెన్నముద్ద, చెంగల్వ పూదండ’ అనే పద్యం అందరికీ తెలిసిందే. లక్ష్మీదేవి అయితే… పద్మాసనే, పద్మకరే, పద్మ లోకైకపూజితే…
ఇంతలో ఫోన్లో వాట్సాప్ మెసేజ్ శబ్దం. అప్రయత్నంగా నొక్కాను. విరిసిన కమలంతో శుభోదయ సందేశం. పూలల్లో ఎన్ని చిత్రాలో. సూర్యుడు వస్తే విరిసే కమలాలు, చంద్రుడు వస్తే విరిసే కలువలు, సూర్యుడిని అనుసరిస్తూ ముఖాన్ని తిప్పే పొద్దు తిరుగుడు, పన్నెండేళ్లకోసారి పూసే బ్రహ్మకమలాలు… చిత్రవిచిత్ర ఆకృతులలో, రమణీయ వర్ణాలలో… గంధర్వ కన్యలు ప్రత్యేక సుగంధం కలిగి ఉండటం కూడా కావ్యాల్లో చదువుతాం.
మనుచరిత్రలో వరూధిని ‘పాటలగంధి’. అంటే ఆమె మేనుకు పాటల పుష్పాల సౌరభం ఉంటుంది. ఇక జానపద కథల్లో అయితే ఫలాని పువ్వు తెచ్చి వాసన చూపితే అపస్మారకం నుంచి రాజుగారో, రాకుమారో బయటపడతారని ఉంటుంది. ఏడు మల్లెలెత్తు రాకుమారి ఊహించుకోవటానికి భలేగా ఉంటుంది. స్వయంవరాల్లో రాకుమార్తె ఆ పూమాల ఎవరిమెళ్లో వేస్తుందా అని స్వయంవరానికి వచ్చిన వారంతా టెన్షన్తో చూడటం అదో తమాషా. ఇక రాజెవరో తేల్చుకోవటానికి ఏనుగుకే పూల దండ ఇచ్చి వదలటం, అది వెళ్లి ఓ అనామకుడి మెల్లో ఆ దండవేసి, రాజుని చేయటం… ఇలా ఎన్నెన్నో కథలు. రాజులు వస్తుంటే ఆ దారంతా పూలు చల్లటం… పూల తేరులు, పూల పల్లకీలు… రాజసానికి ప్రతీకలు. ఇప్పుడు శిరోజాలంకరణలో పూలు చాలావరకు తగ్గాయి. పెట్టుకున్నా ఒకటో, రెండో పూలే. ఒకప్పుడు ఆడపిల్లలకు వేసవి వచ్చిందంటే మల్లెపూల జడ వేయాల్సిందే. ప్రతి ఇంట్లో ఆడపిల్లల పూలజడ ఫొటో తప్పనిసరిగా ఉండేది. అలాగే మొగలిరేకుల జడలు. ఇప్పుడు అవన్నీ కనుమరుగయ్యాయి. పెళ్లికూతురికి పూలజడ వేయడం కూడా తగ్గిపోయింది. ఇమిటేషన్ జ్యుయెలరీ షాపులనుంచి జడ తెచ్చి అలంకరిస్తున్నారు.
ప్రముఖులు కొందరు పూలను అలంకరించుకోవటమూ ఉంది. మయన్మార్ లీడర్ ఆంగ్ సాన్ సూకీ ఎప్పుడూ తలలో ఓ పువ్వుతో ప్రత్యేకంగా కనిపిస్తారు. అంతెందుకూ, మన చాచా నెహ్రూగారు ఎర్రగులాబీని ధరించటం మనకు తెలిసిందే. తలలో పెట్టుకోవటం తగ్గినా వేదికల అలంకరణలకు మాత్రం పూలను విరివిగా వాడుతున్నారు. పెళ్లికొడుకు ఎక్కే కారుకు గులాబీపూలను అలంకరిస్తున్నారు. పండగలు, ఇతర శుభసందర్భాల్లో గుమ్మాలకు పూలను అలంకరించడం మామూలే. పూల అలంకరణ ప్రత్యేక కళ. అదే… ఇక్బానా. పూలగుచ్ఛాలు ఎంత అందంగా, వైవిధ్యంగా తయారుచేస్తారో! పూలదండలు సరేసరి… మామూలు మాలలనుంచి, భారీ గజమాలల వరకు ఎన్నో రకాలు. పూలదండను వేయడాన్ని మించిన సత్కారమేముంది. ఇక వేలంటైన్స్ డే వస్తే ఎర్రగులాబీలకు భలే గిరాకీ. ప్రేమ అమీ తుమీ తేల్చేది కూడా ఈ గులాబీ స్వీకరణ, నిరాకరణలే. మనిషి మరణించినా పూలదండతో, పూలగుచ్ఛంతో అంజలి ఘటించడం మామూలే. పూలు వాడినా కూడా పరిమళ ద్రవ్యాల రూపంలో మనల్ని అంటి పెట్టుకునే ఉంటాయి. తామరపూవంటి తమ్ముణ్నీయవే అని, మొగలిపూవంటి మొగుణ్నియ్యవే అని గతంలో పాటలుండేవి. చిన్నప్పుడు పున్నాగపూలు ఏరుకొని వాటిని పెద్ద జడలాగా అల్లేవాళ్లం. వాటి అందం తీరే వేరు. అన్నట్లు రాత్రిరాణుల పరిమళం ప్రస్తావించుకోకుండా ఉండగలమా? వెన్నెల చల్లదనం, రాత్రిరాణుల పరిమళం…
‘ఆ రేయి… ఎంత హాయి’ అన్నట్లు ఇప్పుడు నిరసనలను కూడా పూలందించి అందంగా తెలియజేయడం కొత్తగా వాడుకలోకొచ్చింది. నమ్మలేని మాట చెపుతూ నమ్మించే ప్రయత్నం చేయటం ‘చెవిలో పువ్వు’గా చెలామణి అవుతోంది. సుకుమారాలు, సుమనోహరాలు అయిన పూలు అల్పకాలం ఉండే అనల్ప సృష్టి. అసలు పూలు లేని ప్రకృతిని మనం ఊహించగలమా? పూలతోటలు… పూలలోయలు వాహ్! మనసు ఉప్పొంగిపోదూ.
ఉత్తరాఖండ్ లోని ‘వేలీ ఆఫ్ ఫ్లవర్స్’ చూడాలన్నది నా బకెట్ లిస్ట్ లో ఒకటి. అందరికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే సుమాలు నిజంగా ధన్యులు సుమా. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అని తలుపు తీస్తే ఒకావిడ.. ‘మేం వెనుక వీధిలో ఉంటామండీ. రేపు మా ఇంట్లో పూజ… పూలు కోసుకుంటాను’ అడిగింది. పూలు కోయటం నాకిష్టం లేకపోయినా పూజ అన్న సెంటిమెంటుతో సరేనంటూ తలూపాను. ఆపైన వాస్తవంలోకి వచ్చి ‘అబ్బ ఎంత సేపు నా మనసు పూలలోకం లో విహరించింది’ అనుకొంటూ పూలను ఓసారి పలకరించివద్దామని, పూల మొక్కలవైపు నడుస్తూ ‘సేవే పరమార్థంగా బతకాలని పూలు చాటుతున్నాయి, మనిషి పూవులా బతకాలి, ముల్లులా కాదు’ అనుకొన్నాను.