బ్రిటిష్ బంగ్లా-2

0
3

[‘బ్రిటీష్ బంగ్లా’ అనే అనువాద కథని అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు. కన్నడ మూలం శ్రీధర బనవాసి. ఇది రెండవ, చివరి భాగం. మొదటి భాగం ఇక్కడ.]

[dropcap]“ఈ[/dropcap] దసరా సెలవుల్లో నేను ఆగుంబెకు వస్తాను. నీతో నాలుగైదు రోజులు ఉండి ఆగుంబె చుట్టుపక్కల ఊళ్లను కూడా చూసుకుని వెళతాను” అని కార్వార్ నుంచి మణికాంత్ స్నేహితుడు సుధాకర్ పేట్కర్ కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసి చెప్పాడు.

సుధాకర్ ఫోన్ చేసి తెలిపిన విషయం మణికాంత్ మనసులో కలుగుతున్న గందరగోళానికి ఎందుకో సంబంధించినట్టు అనిపించింది. రావడానికి రెండు రోజుల ముందు మళ్లీ ఫోన్ చేసిన సుధాకర్ తాను ఆగుంబెకు వస్తున్న విషయాన్ని నిర్ధారించాడు. అప్పటిదాకా ఈ విషయాన్ని మరిచిపోయిన మణికాంత్ స్నేహితుడు వస్తున్న విషయం గుర్తుకొచ్చి ఈ విషయాన్ని తాను మరిచిపోయినందుకు నాలుక కరుచుకున్నాడు.

సుధాకర్ వస్తే అతన్ని తీసుకుని ఆ క్షణంలోనే కణగిలే కొండ ఎక్కాలని అనిపించింది. ఉన్న నిజం గురించి.. జనం మాట్లాడుకునే కథలు వింటే అతను కచ్చితంగా రాడు. ఆ దెయ్యాల, భూతాల కథలను దాచిపెట్టి, అతన్ని బ్రిటిష్ బంగ్లా చూడటానికి తీసుకుని వెళితే, అక్కడి సత్యాన్ని తానొక్కడైనా ఛేదించవచ్చనే ఆలోచన మణికాంత్‌కు సమంజసంగా అనిపించింది. అయినప్పటికీ, తనలోని కుతూహలాన్ని దాచిపెట్టి, తన స్నేహితుడికి ఉన్న ట్రెక్కింగ్ ఆసక్తిని సాకు చేసుకుని మిత్రుడిని మోసం చేస్తున్నాడనే విషయం కూడా మణికాంత్‌ను బాధిస్తూనే ఉంది.

రెండు రోజుల తర్వాత ఆగుంబెకు వచ్చిన సుధాకర్ పేటకర్, ‘ఇక్కడి ముఖ్యమైన ప్రాంతాలకు స్వయంగా నువ్వే తీసుకెళ్లాలనే ఒప్పందాన్ని’ మొదటి రోజే చెప్పాడు. ఈ ఒప్పందం కూడా మణికాంత్ ఆలోచనకు అనుగుణంగానే ఉంది.

“సుధాకర్.. ఇక్కడ కణగిలే కొండ ఉంది. చాలా మంచి ప్రదేశం అని చెబుతారు. ట్రెక్కింగ్ చేసేవారికి ఈ కొండ చాలా అనువైనది. ఆ కొండ పైన బ్రిటిష్ బంగ్లా అనే పురాతనమైన భవనం ఉందని చెబుతారు. ఇంతవరకూ ఎవరూ అక్కడికి వెళ్లలేదు. నువ్వు నాకు తోడుంటే ఇద్దరం కణగిలే కొండ చివర వరకూ ఎక్కుదామా?”

స్నేహితుడి మాటను తోసిపుచ్చలేడు. అసలే ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే సుధాకర్‍కు కణగిలే కొండ ఎక్కాలనే ఆలోచన అతనిలోని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. “కచ్చింతంగా దీన్ని మాత్రం మిస్ చేసుకోను” అని సూటిగా చెప్పాడు.

వెళుతున్న దారి సరైనదేనా? ప్రజలు ఈ దారిలో తిరుగుతున్నారా? ఎంత దూరం ఉంటుంది? అడవి జంతువులు బెడద ఉందా? తినడానికి ఏదైనా ఏర్పాటు చేసుకోవాలా? మరేదైనా ప్రమాదం ఉందా? ఇంతకు ముందు ఎవరైనా అక్కడికి వెళ్లివచ్చారా? మొదలైన అనేక ప్రశ్నలడిగిన సుధాకర్‌కు జవాబిచ్చి అతన్ని బయలుదేరేలా చేయడం అంత సులభం కాదు. ఏదో అబద్ధం చెప్పాల్సిందే. ఆ ఊరిలో ఎవరు పిలిచినా కణగిలే కొండ ఎక్కేందుకు రానివారు, భయపడేవారు చాలామంది ఉండడంతో తన కార్యసాధనకు సుధాకర్‍కు అబద్ధాలు చెప్పడంలో ఎలాంటి అర్థం లేదని అనుకుంటూనే, మణికాంత్ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.

సుధాకర్ వచ్చిన రోజు నుంచి ప్రతిరోజూ తన కళ్లకు కనిపిస్తున్న, తనను వేధిస్తున్న శ్వేతవర్ణపు మనిషి ఇప్పుడు కనిపించటం లేదు. ఇంట్లో ఎక్కడ చూసినా కనిపించే ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్లాడు? ఎందుకు రాత్రి కనిపించదు? ఉదయం ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్పడం లేదు? అని మణికాంత్ మనసు ఆలోచిస్తూనే ఉంది. అయితే సుధాకర్ వచ్చినప్పటి నుంచి ఎక్కడికో వెళ్లి ఉండొచ్చని భావించాడు. ప్రయాణం మధ్యలో వచ్చి వేధించకపోతే చాలని మణికాంత్ మనసు చెబుతూనే ఉంది.

సుధాకర్‍ను కణగిలే కొండకు తీసుకువెళ్లడం, తద్వారా కొండ మీద ఉన్న బ్రిటిష్ బంగ్లాను చూడటం, ప్రజలు చెప్పినట్లు అక్కడ దెయ్యాలు, భూతాలు వేధింపులు ఉన్నాయా అని తెలుసుకోవడం, హెన్రీ థామ్సన్ మరణం అనుమానాస్పదంగా ఉండటం వల్ల దాని వెనుక సత్యపు ఒక పోగైనా దొరకవచ్చా? అని దాని కొసం వెతకడం. మొదలైన పనుల జాబితా మణికాంత్ మనస్సులో ఉంది. కణగిలే కొండకు వెళ్లే మార్గం మూసుకుపోయిందని ఆగుంటే వాసులు చెబుతున్నారు. ఉన్న బ్రిడ్జి పడిపోయిన తర్వాత మరో దారి వెతుక్కోవడం కొంచెం కష్టమే అని జనాలు మాట్లాడుకోవడంతో సుధాకర‌ను తీసుకెళ్లేందుకు మరో దారి వెతుక్కోవాల్సి వచ్చింది. కణగిలే కొండ చుట్టూ కమ్ముకున్న అడవిని దాటి వెళితే కొండ దొరకటం నిజమే అయినా, ఏ దిశలో వెళితే తొందరగా దొరుకుందన్నది కూడా మణికాంత్‌కు ఆందోళన కలిగించే విషయమైంది. తన మనసులోని అయోమయాన్ని సుధాకర్ దగ్గర చెప్పుకోలేడు. తనకు దారి తెలుసునన్న ధైర్యంతో అతన్ని వెంటబెట్టుకుని కొండ ఎక్కాలి. బయలుదేరే సమయం అప్పటికే నిర్ణయింపబడటంతో సుధాకర్ ట్రెక్కింగ్ చేయడానికి అన్ని విధాలా సిద్ధమయ్యాడు. ఉదయం పదిగంటలకు కరిమలె దారిలో బయలుదేరిన మణికాంత్, సుధాకర్‍లకు పరిచయం ఉన్నవారు ఎక్కడికి ప్రయాణం? అని అడిగినప్పుడూ మణికాంత్ తప్పుడు సమాధానాలు చెబుతున్నాడు. సుధాకర్‍కు ఇతను ఎందుకు అబద్ధం చెబుతున్నాడు అని కాస్త అయోమయంగా అనిపించినా కణగిలే కొండ క్రింద ఉన్న అడవిని చేరే సమయంలో ప్రశ్నించే ధైర్యం చేశాడు. “సుధా.. జనం కణగిలే కొండకు వెళ్లకండి.. బ్రిటిష్ బంగ్లాలు దెయ్యాలుంటాయని అబద్ధాలు చెబుతారు. నాకు వారి మాటల్లో అస్సలు నమ్మకం లేదు” అని తన మనసులో దాచుకున్న ఆలోచనను చెప్పాడు.

“ఓయ్.. ప్రజలు ఊరకూరకే ఎందు ఇదంతా చెప్తారు.. ఇక్కడే పుట్టి పెరిగినవారికి తెలిసిన నిజం నీకు ఎలా తెలుస్తుంది? ఎందుకైనా మనపాటికి మనం జాగ్రత్తగా ఉండాలి.. అసలే నేను పిరికిగొడ్డును.. దెయ్యాలు, భూతాలు అంటే అసలు నేను భయపడతాను.. కాస్త చూసుకుని వెళదాం.. మరీ రిస్క్ అయితే వద్దు..” అని అన్నాడు. సుధాకర్ మాటలకు నిరాశ చెందిన మణికాంత్ “లేదురా, కచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్‍గా తీసుకోవద్దు.. వాళ్లు చెప్పినదంతా అబద్ధమని నాకు తెలుసు, అనవసరంగా వాళ్ల గురించి బుర్ర పాడు చేసుకోవద్దు.. రా.. నీతోపాటు నేనున్నాను కదా.. వై డూ యూ ఫియర్.. ఐ యామ్ హియర్” అని నవ్వుతూ సుధాకర్ భుజం మీద చేయి వేసి అడవిలోని ఓ దారి వైపు అడుగులు వేయసాగారు..

ఆ దట్టమైన అడవి, పగలు కూడా చీకటికి రారాజులా అనిపించింది. పెద్దపెద్ద చెట్లలోంచి తొంగిచూస్తున సూర్యకిరణాలు నేలను తాకుతున్నప్పటికీ వెళ్లవలసిన దారి ఇరుకుగా చిక్కుముడిలా ఆయినప్పటికీ కొండ అంచుని చేరే మంచి దారిలా కనిపించింది. మణికాంత్‌కు తాను వెళుతున్న దారి కొన్ని చోట్ల అనుమానం కలిగించినా, దూరంలో కనిపించే కణగిలే కొండ మాత్రం ఇటువైపు వెళితే తప్పకుండా తాను చేరుకుంటాడనే ఆశాభావాన్ని కలిగించింది. ఇద్దరికీ అరణ్య ప్రయాణం కొత్తే అయినా మణికాంత్ మాత్రమే తన కార్యసాధన విషయంలో ధైర్యంగా ఉన్నాడు. అప్పుడప్పుడు అడవి చీకటిని చూసి భయపడుతున్న సుధాకర్, ఎందుకో కొంత అనుమానాన్ని, అధైర్యాన్ని వ్యక్తం చేసినప్పటికీ అతడిని శాంతింపజేసి తీసుకెళ్లడం సవాలే. జనం చెప్పిన దెయ్యాలు, భూతాల కథను అతనికి ముందుగానే చెప్పివుంటే కచ్చితంగా అతను తనతో వచ్చేవాడు కాదు. తన ఉద్దేశం కూడా సఫలం కాదు. ఈ అబద్ధాన్ని స్నేహితుడైన అతనికి చెప్పకుండా ఉండాల్సింది. కానీ తన ఉత్సుకతను చల్లబరచడానికి తాను ఈ కార్యాన్ని చేయవలసి వచ్చింది. రోజూ వచ్చి తనను వేధిస్తున్న శ్వేతవర్ణపు వ్యక్తి మరణం వెనుకనున్న రహస్యం ఆ వంతెన ఎందుకు పడిపోయింది. ఆ బ్రిటిష్ బంగ్లా ముప్పై ఏళ్ల క్రితం కూలిపోయింది. ఇప్పుడు ఎలా ఉండొచ్చు? నిజానికి వంతెన దగ్గర, బంగ్లా చుట్టుపక్కల, థామ్సన్, అతని భార్యా పిల్లల ప్రేతాత్మల వేధింపులు ఉన్నాయా? జనం చెప్పే వందలాది కథల్లో నిజం దాగివుందా? ఇలా అనేక ప్రశ్నలు ప్రతిరోజూ బాధిస్తున్నాయి. పీడిస్తున్నాయి. వీటికి జవాబులు వెతకాలనుకుంటే.. సుధాకర్‍కు అబద్ధం చెప్పి తీసుకుని రావటంలో తప్పు లేదనిపించి తన మనసును శాంతింపజేసి తీసుకొచ్చిన మణికాంత్, అడవి దగ్గర దారి చిక్కుముడిలా ఉన్నప్పటికీ వెళ్లే ప్రయాణాన్ని కాస్త సులువుగా చేసుకున్నాడు. సుధాకర్ కూడా అడవి అందాలను ఆస్వాదిస్తూ వెళ్లే ప్రయాణానికి అవసరమైన ధైర్యం నింపుతున్నాడు. ఇక అడవిని దాటి కణగిలే కొండ పాదాల చెంతకు చేరటం దగ్గరలో ఉన్నట్లు కనిపించినా దాన్ని చేరటానికి చాలా సమయం పట్టింది. అప్పటికే అడవిలో రెండు మైళ్లు ప్రయాణించటం వల్ల మూడు నాలుగు సార్లు కాస్త విశ్రాంతి తీసుకున్నారు మధ్య మధ్యన అడవి అందాలను బందించటానికి ఫొటోగ్రఫీ కోసం కొంత సమయం, కాస్సేపు కబుర్లు చెప్పుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవటంలో అడవి ప్రయాణం సరళంగా సాగింది.

మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో కణగిలే కొండను చేరేసరికి, ప్రాణాలు అరచేతిలో పట్టుకోవలసి వచ్చింది. అలా గట్టిగా పట్టుకుని కొండను ఎక్కే పట్టుదల ఇద్దరికీ ఉంది. ఈ తరహా ప్రయాణం ఇద్దరికీ కొత్తే అయినా మధ్యమధ్యలో అడవి చీకటి, జంతువుల అరుపులు కొంచెం భయాన్ని పెంచినా, కాస్త ధైర్యం తెచ్చుకుని సాగుతున్న ఆ దశవరకు వచ్చి ఆగింది. అడవిలో ప్రయాణం అలసటను ఎంతగా కలిగిస్తుందో; కొండను ఎక్కడం కూడా అంతే అలసటను కలిగించేలా ఉంది. మణికాంత్ కార్యసాధన దృఢంగా ఉంది. సాయంత్రంలోగా కొండ ఎక్కి దిగాలనే నిర్ణయం బలంగా ఉంది. మధ్యాహ్న భోజనం తరువాత, తాను కొంత విశ్రాంతి తీసుకొని కణగిలె కొండ ఎక్కి ఆ బ్రిటిష్ బంగ్లాకు చేరుకోవాలనే ఉత్సాహం మాత్రం ఎక్కువైంది. సుధాకర్ కూడా బంగ్లాను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. కానీ అతనిలోని పిరికితనం అతని మనసులో ద్వంద్వాలను సృష్టిస్తూనే ఉంది. అనుకున్నట్టే కొండను ఎక్కడం ఇద్దరికీ కష్టం కాలేదు.

***

కణగిలే కొండ చివరన నిలుచుని చూసిన మణికాంత్ మనసు ఇన్ని రోజుల వరకూ ఈ బ్రిటిష్ బంగ్లాను చూడటానికి తహతహలాడటం ఏ సత్యాన్ని తెలుసుకోవాలన్న క్షణానికో లేదా థామ్సన్ మరణానంతరం ఆ బంగ్లా ఏమైందో చూడాలనే తపననా? కారణాలు ఏమైనాకానీ ఆ రోజు మణికాంత్, తన హఠసాధన ద్వారా కణగిలె కొండ చివరనున్న ఆ ఎస్టేట్ చేరాడు. ఎస్టేట్ మధ్యభాగంలో శిథిలావస్థలో ఉన్న బంగ్లా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దగ్గర దగ్గరికి వెళుతున్నట్టే ఆ బంగ్లా మణికాంత్ కళ్లకు తనవాస్తవ సౌందర్యాన్ని క్షణక్షణం చూపుతున్నట్టు అనిపిస్తోంది. అవును, ఇదే బ్రిటిష్ బంగ్లా. హెన్రీ థామ్సన్, సంధ్యాదేవి జీవితాన్ని సాగించిన ఇల్లు. వారి ప్రేమకు సాక్షిగా నిలిచిన ఇల్లు, ఒక ఊరికి కేంద్రంగా ఉన్న ఇల్లు. ఇదే ఎస్టేట్లో ఒకప్పుడు థామ్సన్ తన భార్యాపిల్లలతో, చాలామంది సేవకులతో నివసించిన ఇల్లు. మణికాంత్ బంగ్లా దగ్గరికి వస్తున్నట్టే అతని ఆలోచనల్లోకి వచ్చి వెళుతున్న పాత్రలన్నీ సజీవంగా కళ్లముందు రాసాగాయి. ఎండిపోయిన సంఘటనల సన్నివేశాలన్నీ మళ్లీ సజీవంగా జరిగినట్లు అనిపించసాగాయి. తాను ప్రతి క్షణం ఏ ప్రపంచంలో ఉన్నాడో అనే అనుమానం మణికాంత్‌ను వేధిస్తోంది.

ఎస్టేట్ మధ్యలో ఉన్న బంగ్లా మొత్తం పాడుబడినా మణికాంత్ కళ్లలో అది ఎన్నో నిజాలను దాచుకున్న గూడులా కనిపిస్తోంది. ఒకప్పుడు బ్రిటిష్ బంగ్లా అని చుట్టుపక్కల వారిచే పిలవబడే ఆ బంగ్లా పైకప్పు లేకుండా పడిపోయివుంది. మొత్తం ఇంట్లో అతనికి సంబంధించిన వస్తువులు ఏమున్నాయో, ఎక్కడున్నాయో అలానే ఉన్నాయి. గోడలపై ఉన్న పాత ఫోటోలను మణికాంత్ చూడసాగాడు. వెంట ఉన్న సుధాకర్, మణికాంత్ వెనకాలే అత్యంత భయంతో అడుగులు వేస్తున్నాడు. పాడుబడిన మొత్తం బంగ్లాలో తాను చూసినవన్నీ మణికాంత్ తన కెమెరాలో బంధిస్తూనే ఉన్నాడు. ఇన్ని రోజులు వరకూ థామ్సన్, అతని భార్య సంధ్యాదేవి, పిల్లల గురించి వందలాది కథలు విన్న మణికాంత్‌ను, థామ్సన్, సంధ్యాదేవిలు చూడటానికి ఎలా ఉన్నారో అనే కుతూహలం అతన్ని తీవ్రంగా వేధిస్తోంది. గోడల మీద ఉన్న వారి ఫోటో చూసి వాళ్లను కళ్లలో నింపుకున్నాడు. సంధ్యాదేవి అద్భుతమైన సౌందర్యవతి అని విన్న అతను, ఆ రోజు ఆమె పాత ఫోటో చూడగానే సంధ్యాదేవి కచ్చితంగా అద్భుతమైన సౌందర్యవతి అనటంలో సందేహం లేదనిపించింది. ఆమె సౌందర్యానికి మరులుపోయిన థామ్సన్ తన సొంత దేశానికి వెళ్లకుండా ఆమె మాటను కాదనలేక ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అక్కడున్న ఫోటోలు, ఇంట్లోని వస్తువుల మీద మణికాంత్ చూపులను, కుతూహలాన్ని ఆపడం కాస్త కష్టమైంది. సమయమూ ఎవరికీ చెప్పకుండా తనపాటికి తాను నిదానంగా జారిపోతోంది.

***

ఏవో కళ్లు తమను వెంబడిస్తున్నాయని సుధాకర్‌కు అప్పుడప్పుడు అనిపిస్తున్నప్పటికీ, ఆ క్షణం నుంచే అక్కడి నుంచి త్వరగా వెళదామని అతని మనస్సు చెబుతూనే ఉంది. ఆ విషయాన్ని మణికాంత్‌కు చెబుతూ ఉన్నప్పటికీ, బ్రిటిష్ బంగ్లాలోని అంతరిక సౌందర్యాన్ని అనుభవిస్తున్న అతనికి తన స్నేహితుడికి కలుగుతున్న భయాన్ని తగ్గించడానికి ఆసక్తి చూపనేలేదు. తాను ఈ బంగ్లాను పూర్తిగా చూసే వరకూ సంతృప్తి కలగదు. “దయచేసి ఇంత కష్టపడి ఇక్కడిదాకా ఎలాగో వచ్చాం. దీన్ని చూడకుండా అలాగే వెళ్లిపోవడం నాకు సమంజసంగా అనిపించటం లేదు. ఇంకాస్సేపు ఓర్చుకో.. నీకు భయం వేస్తోందని నాకు తెలుసు. నీ గుండెను మరింత దృఢపరుచుకో. తుపాకీని మరింత గట్టిగా చేయి, ఇద్దరం కలిసే వెళదాం” అంటూ సుధాకర్‍కు నచ్చజెపుతూనే ఉన్నాడు. మణికాంత్ మాటలు సుధాకర్ లోపల కలుగుతున్న భయాన్ని తగ్గించలేదు. అతనికి ఆ బంగ్లా నుంచి ఏ క్షణంలోనైనా పారిపోవాలి అనే ఆలోచనే వేధిస్తోంది. అతనికి ఆ బ్రిటిష్ అధికారి, అతని భార్య, ఆ బంగ్లా వెనుకనున్న రహస్యం ఏదీ అవసరం లేదనిపించింది. ఇలా ఉన్నప్పటికీ తన నాలుకను కరుచుకుని మణికాంత్ అడుగులను అనుసరించసాగాడు. బంగళానంతా ఒకసారి చుట్టేసిన మణికాంత్‌కు తనలోని కుతూహలం అనే గుడ్డు పగిలిపోయేవరకూ తిరుగుతూనే ఉన్నాడు. తన ఊహల్లో కట్టుకున్న బ్రిటిష్ బంగ్లాను, థామ్సన్ కట్టుకున్న బంగ్లాతో పోల్చుకుంటూ తన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాడు. బయట ఏవో కళ్లు తనని చూస్తున్నాయని చెబుతూ మొండిపట్టు పట్టిన మిత్రుడు సుధాకర్ మాటలను సీరియస్‍గా తీసుకునే సమయం దాటిపోయింది. తాను ఇతని మాటలు నమ్మి ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. మనస్సు లోలోపల శిథిలావస్థలో ఉన్న బంగ్లాను చూసి గాభరాపడిన సుధాకర్, మణికాంత‌‍ను మనసులోనే తిట్టుకుంటూనే ఉన్నాడు. ఏ మాత్రం భయం లేకుండా బంగ్లా సౌందత్యాన్ని ఆస్వాదిస్తున్న మణికాంత్ మీద ఎక్కడా లేని కోపం వచ్చింది. ఇంకా అతని కోసం ఎదురుచూడటంలో అర్థం లేదు. ఇక్కడే వుండి అతనితోపాటు భయపడి చనిపోవడం కంటే ఇక్కడి నుంచి పారిపోయి చావడమే మేలు అని అతని మనసు చెప్పసాగింది.

“సుధాకర్.. బంగ్లాను చూసింది చాలు. సమయం దొరికినప్పుడు మళ్లీ వద్దాం!” అని మణికాంత్ చెప్పినపుడు ఆ క్షణంలో అనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకుని, అక్కడి నుంచి అతనితోపాటు పారిపోవటానికి మనస్సు సిద్ధమైంది. ఇద్దరూ బంగ్లా దాటి ఎస్టేట్ బయటివైపు అడుగులు వేయసాగారు.

మణికాంత్ అడుగుల కంటే సుధాకర్ అడుగులు వేగంగా ఉన్నాయి. అతని లోపల జరుగుతున్న పోరాటం, భయం, తమను వెంబడిస్తున్న ఆ విచిత్రమైన కళ్లు, సుధాకర్ గుండెను నలిపివేశాయి. ఈ విషయాన్ని మణికాంత్‌తో చెప్పుకున్నా, పెడచెవిన పెట్టిన మణికాంత్ మనసు ఆ రోజు వదిలి వచ్చిన బ్రిటిష్ బంగ్లా గురించే ఆలోచించసాగింది. తనను ఏవో కళ్లు చూస్తున్నాయి, వెంబడిస్తున్నాయి అని అనిపించినా, ఆ క్షణంలోని కుతూహలంలో అది అతనికి భయాన్ని కలిగించనేలేదు. ఎప్పుడైతే కణగిలె కొండ దిగి అడవిని చేరాడో ఆప్పుడు ఆ బంగ్లా మత్తు దిగి తనను అనుసరిస్తున్న కళ్ల గురించి మణికాంత్ మనసు ఆలోచించసాగింది. “అవును, సుధా.. ఏవో విచిత్రమైన కళ్లు మనల్ని వెంబడిస్తున్నట్లు అనిపిస్తోంది. ఎందుకో భయం వేస్తోంది. త్వరత్వరగా అడుగులు వేద్దామా?” అని మణికాంత్ చెప్పగానే, అతని మాటలు మరింత భయాన్ని కలిగించాయి.. ‘అయ్యో నా ప్రాణం ఇప్పటికే సగం పోయింది.. నా కాళ్లు వణుకుతున్నాయి, నరాలు బిగుసుకుపోయాయి. కనురెప్పలు జోరుగా కొట్టుకుంటున్నాయి. పెదవులు అదురుతున్నాయి.. నాలో ఉన్న భయాన్ని నీకెలా చెప్పను..? నీకైనా ఆ భయం ఈ క్షణం నుండి కలుగుతుంది. నేను అరగంట నుంచి చెమటలు కక్కుతున్నాను.. నేను నీతోపాటు వచ్చి తప్పు చేశానని అనిపిస్తోంది. ఈరోజు నా ప్రాణాలు మిగిలితే చాలు.. జీవితంలో ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయను..” అని సుధాకర్ అన్నప్పుడు, అతని మాటలకు జవాబిచ్చి ధైర్యం చెప్పడానికి సాధ్యం కాలేదు. కంటపడకుండా ఎక్కడో దాక్కుని అనుసరిస్తున్న ఆ కళ్లను ఎలా వెతకాలి? ఆ కళ్లను వెతుక్కుంటూ వెళితే అప్పటికే భయంతో సగం ప్రాణం పోగొట్టుకున్న సుధాకర్ గతి ఏమి? భయాన్ని కలిగించే ఆ కళ్ల వేటను మరోసారి ధైర్యంగా ఎదుర్కోవటమే సముచితమని మణికాంత్ భావించి, సుధాకర్‍తో కలిసి తాను నివసిస్తున్న కరిమలే దారిలో బిరబిరా అడుగులు వేయసాగాడు. కణగిలే కొండ కింది అడవిని దాటేవరకూ అవ్యక్తంగా వేధించిన ఆ విచిత్రమైన కళ్లు సాయంత్రం ఆరుగంటల సవయంలో ఆ మసకచీకటిలో మాయమయ్యాయి. కరిమలెలోని వీరాంజనేయ దేవాలయం అరుగు మీద కూర్చుని కుదుటపడే వరకూ భయంతో కిందికి జారిన గుండె ఇంకా పైకి రాలేదు. మణికాంత్ చాలా తొందరగా మేలుకున్నప్పటికీ సుధాకర‌కు ఆ సమయం చాల్లేదు.

సుధాకర్ కణగిలే కొండ నుంచి దిగి వచ్చినా అక్కడి షాక్ నుంచి తేరుకోవడానికి రెండు రోజులు పట్టింది. అతనికి తాను కార్వార్ ఎప్పుడెప్పుడు వెళ్తానా అనిపించింది. ఆగుంబె సౌందర్యాన్ని చూడాలని అనుకున్నవాడు ఇప్పుడు ఆ బ్రిటీష్ బంగ్లాను చూసినప్పటి నుంచి అతని మనస్సు అక్కడి నుంచి తొందరగా తన ఊరిని చేరుకోవాలని చెబుతూనే ఉంది. అందుకే మరుసటి రోజే సుధాకర్ చెప్పాపెట్టకుండా కార్వార్ బస్ ఎక్కాడు.

మణికాంత్ తన స్నేహితుడి దగ్గర ఒక విధంగా వాస్తవం దాచిపెట్టి తన స్వార్థం కోసం అతన్ని బ్రిటిష్ బంగ్లా ఉన్న కణగిలే కొండకు తీసుకుని వెళ్లాననే బాధ కొన్ని రోజులు వేధించింది.

***

ప్రతిరోజూ సాయంత్రం పోస్టాఫీసు నుంచి వస్తున్నప్పుడు దారిలో కనిపించే కణగిలె కొండ కింది అడవి మణికాంత్‌ను రెచ్చగొడుతూనే ఉంది. ఆ అడవిని దాటుకుని కణగిలే కొండ ఎక్కుతున్న జనం చెప్పిన దెయ్యాల కథలు ఎందుకో తనకు నమ్మబుద్ధి కాలేదు. ప్రజలు చెప్పే ఈ కథలు వారి పిచ్చితనాన్ని తెలియజేస్తున్నాయి. వాళ్లు ఒక్కసారైనా ఆ బంగ్లా చూసి వచ్చివుంటే ఈ దెయ్యాల, భూతాల కథలు వదిలేసి సాధారణంగా మాట్లాడుతారని అతనికి అనిపించసాగింది. తాను కణగిలే కొండను ఎక్కి ఆ బ్రిటీష్ బంగ్లాను చూశానని ఎప్పుడు చెబుతాడో? తాను వెళ్లివచ్చానని చెబితే వాళ్లు నమ్ముతారా? వాళ్లను నమ్మించాలంటే, వాళ్లను తీసుకునిపోవాలి. అక్కడ ఏ దెయ్యమూ లేదు. భూతాల పీడ లేదు. ఇదంతా మీ పిచ్చి భ్రమ అని చెప్పాలి. ముందుగా కాళప్పకు చెప్పాలి. తాను కెమెరాలో బంధించిన బ్రిటిష్ బంగ్లా ఫోటోలు ఒకసారి చూపించాలి. అప్పుడు వారు తన మాటలు నమ్ముతారు. కరిమలె పక్కనే ఉన్న అడవిని చూస్తూ ఇలా ఆలోచిస్తున్న మణికాంత్ ఆ రోజు తనను, సుధాకర్‍ను అనుసరించిన ఆ కళ్లు ఎవరివి? ఎవరైనా తమకన్నా ముందే అక్కడికి వెళ్లారా? ఆ కళ్లు అచ్చం మనుషుల కళ్లలాగే ఉన్నాయి. అయితే ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. వాటిని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఎందుకో భయం వేస్తుంది.. మళ్లీ తాను ఆ అడవికి వెళితే ఆ కళ్లు వెంటడకుండా ఉండవు..? అందుకని ఆ కళ్లకు భయపడి చేతులు ముడుచుకుని కూర్చుంటే కణగిలే కొండ మీది నిజాన్ని మరుగుపరిచినట్లు అవుతుందికదా! మరొకసారి ఆ అడవిలోకి వెళితే? ఎలాగూ వెళ్లే దారి తెలుసు. ఒక్కణ్ణి ధైర్యంగా వెళ్లివస్తే.. తనను చాటుగా వెంబడించే ఆ కళ్లను ఒక్కసారైనా కలుసుకోగలడు. లేకుంటే వేటాడవచ్చు అనే ఆలోచనను మనస్సులోనే దృఢపరుచుకున్నాడు. ఆ సాయంత్రం మణికాంత్ మళ్లీ అడవికి వైపు సాగాడు. అడవికి దగ్గరవుతున్న కొద్దీ కటికచీకటిని ఆవరించుకుంటున్న ఆ అడవి మణికాంత్‍ను భయపెడుతూనే ఉంది. లోపల మళ్లీ ద్వంద్వం వేధించసాగింది. ఆ క్షణం వరకు తోడుగా ఉన్న ధైర్యం సన్నగిల్లసాగింది. ‘ఎందుకో కొంచెం జాగ్రత్తగా ఉండు.. వెళ్లే దారి పట్ల జాగ్రత్త వహించు’ అని బుద్ధి వివేచనపు మాటలు చెప్పింది. ఇంతలో ఆ వింత కళ్లు మళ్లీ తనని వెంబడిస్తున్నాయని మణికాంత్‍కు అనిపించసాగింది. తనను అనుసరిస్తూ భయాన్ని పుట్టిస్తున్న ఆ కళ్లుకు శారీరక ఆకారం తప్పకుండా ఉండాలి? ఒకసారి వెనుతిరిగి ఆ కళ్లను ఎదుర్కొంటే మాత్రమే తాను ముందుకు అడుగులు వేయగలడు. లేకపోతే కారడవిలో ధైర్యాన్ని నింపుకుని కణగిలే కొండను చేరడం చాలా కష్టమని గ్రహించిన మణికాంత్ వెనుతిరిగి విచిత్రమైన కళ్లవైపు చూశాడు. చీకట్లో అతన్నే చూస్తున్న కళ్లు ఒక్కక్షణం అక్కడే ఆగిపోయాయి. ఆ కళ్లను వెంటాడాలి అనిపించి ఏదో దిక్కు నుంచి తననే చూస్తున్న వాటి వెంబడి పరుగెత్తసాగాడు.. ఆ కళ్లు ఏ దిశలో వెనుతిరిగి పరుగెడుతున్నాయో అనే ధ్యాస కూడా లేకుండా మణికాంత్ తనను చూస్తున్న ఆ కళ్లున్న చోటికి పరిగెత్తసాగాడు. చీకట్లో అస్పష్టంగా కనిపిస్తున్న కళ్లు అతను పరుగెడుతున్న దిక్కులో కనిపించడమే లేదు. అయితే ఎవరో వ్యక్తి ఉచ్ఛ్వాసనిశ్వాసాల సద్దు వినిపిస్తోంది, కానీ వ్యక్తి కనిపించడం లేదు. పరుగెత్తే వేగపు ఆయాసం స్పష్టంగా వినిపిస్తోంది. మణికంఠ ఇప్పుడు కళ్లను వెతకడం లేదు. భారంగా పీల్చుకునే ఆయాసపు శబ్దం వినిపిస్తున్న వైపు పరుగెడుతున్నాడు.. అతని కాళ్లు కదులుతునే ఉన్నాయి. ఎంత దూరం పరిగెత్తాడో తెలియదు. కరిమలె వైపు పరుగెత్తాడో లేక కణగిలే కొండ వైపు పరుగెత్తాడో స్పష్టంగా తెలియదు. అయినా పరిగెడుతున్నాడు..

హఠాత్తుగా కెవ్వుమనే పెద్ద కేక వినిపించింది.. అవును మగవాడి కేక శబ్దమా? తనను వెంటాడుతూ వచ్చిన వింత కళ్ల వ్యక్తిదే కావచ్చు.. అవును, కచ్చితంగా అతనిదే అయివుంటుంది.. ఈ దట్టమైన అడవిలో నా ఊపిరి తప్ప వినిపిస్తున్నది అతని ఊపిరి సద్దు మాత్రమే! ఇప్పుడు ఆ శబ్దం వినిపించటం లేదు.. తాను సాగుతున్న దిక్కు నుండే ఆ కేక శబ్దం వచ్చింది. అలాంటప్పుడు ఈ విచిత్రమైన కళ్ల వ్యక్తి ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఎక్కడో తట్టుకుని పడివుండాలి.. దొరికిపోయాడు వెధవ.. తనను దొంగతనంగా చూస్తున్నాడు బోడిముండా కొడుకు, వాడి పని చెప్పాలి? – ఇలా మనసులో అనుకుంటూ మణికాంత్ కేక పెట్టిన శబ్దం వచ్చిన వైపు వచ్చాడు.. ఆ దారిలో నెమ్మదిగా దగ్గర దగ్గరికి వెళుతున్నట్టే మూలుగుల శబ్ధం మరింత దగ్గరైంది. బాధతో ఆర్తనాదాలు చేస్తున్న సద్దువైపు మణికాంత్ అడుగులు మందగించాయి. అంతకు ముందు లేని భయం చిన్నగా మొదలైంది.

ఆ అడవిలో చీకటి మరింత భయంకరంగా మారసాగింది. ఆ చీకట్లో లోతైన లోయ ఉన్నట్టు కనిపించింది. అక్కడి నుంచే మూల్గుల శబ్దం.. లోలోపల భయం వేస్తున్నా గుండె చిక్కబట్టుకుని ఆ లోయలో మూల్గుతున్న వ్యక్తిని “ఎవరు నువ్వు? నన్ను ఎందుకు అనుసరిస్తున్నావు?” అని అడిగాడు.

‘దయచేసి నన్ను పైకి తీయి. నేను బతకాలి. మీకు నేనొక కథ చెబుతాను” ఈ మాటలు లోయ లోతుల్లోంచి వెలువడ్డాయి.

“నేను నిన్ను పైకి తీయాలి అంటే మొదట నువ్వు హెన్రీ థామ్సన్, అతని కుటుంబీకులు ఎలా చనిపోయారు? ఆ బ్రిడ్జ్ ఎలా పడిపోయింది? అంతా చెప్పాల్సిందే. ఈ నిజం చెబితేనే నిన్ను పైకి తీస్తాను.. లేకపోతే ఇక్కడే చచ్చిపోతావు.. త్వరగా నిజమేమిటో చెప్పు?” అని లోయలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి బిగ్గరగా అడిగాడు మణికాంత్

“చెప్తాను.. ఆ నిజాన్ని కచ్చితంగా చెబుతాను. ఇన్నాళ్లుగా నా లోపల దాచుకున్న నిజాన్ని ఈరోజు చెబుతాను..” లోయ లోతుల్లోంచి సమాధానం వచ్చింది.

“సరే త్వరగా చెప్పు.. నీ కథ వినడానికి ఎదురు చూస్తున్నాను..”

మణికాంత్ కుతూహలం పెరిగింది.

లోయ లోతుల నుండి వస్తున్న గొంతు కథ చెప్పడం ప్రారంభించింది.

“నేను, మా నాన్న, ఇద్దరమూ స్వాతంత్య్ర సమరయోధులం.. శివమోగ్గా, చిక్కమగ్లూర్, ఉడిపి, మంగళూరులో జరుగుతున్న స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాల్గొనేవాళ్లం. మా నాన్న ఒక విధంగా విప్లవకారుడు. అతను పోలీసు పిస్టల్స్, బందూకులు దొంగిలించి, వాటితో బ్రిటిష్ వారిని చంపేవాడు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. ఒకసారి కలెక్టర్ హెన్రీ థామ్సన్ గారిని చంపడానికి వెళ్లి ఇద్దరమూ పట్టుబడ్డాం. హెన్రీ థామ్సన్ నాన్న గురి నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. లేకపోతే ఆయన ఆ రోజే చనిపోయేవారు. మా ఇద్దరికీ జైలు శిక్ష పడింది. సరిగ్గా పదిహేనేళ్లు జైల్లో ఉన్నాను.. మా నాన్న అనారోగ్యంతో జైలులో ఉండగానే చనిపోయాడు. నేను జైలులో పెరిగాను. జైలు నుంచి బయటికి వచ్చాక నేనూ, మా అమ్మా, చెల్లిని వెతుక్కుంటూ ఊరికి వచ్చి చూస్తే, వాళ్లు మా ఊరు వదిలి వెళ్లిపోయారు.. చాలా రోజులు వెతికిన తర్వాత వాళ్లు కణగిలే ఎస్టేట్లో పని చేస్తున్నారని ఎవరో చెప్పారు. ఈ ఎస్టేట్ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అమ్మ కూడా అప్పటికే చనిపోయింది.. అమ్మ ముఖం కూడా చూడలేకపోయాను. మా చెల్లెలు ఎస్టేట్లో పనిచేస్తూ ఉంది.. అమ్మ పనిచేస్తున్నది బ్రిటిష్ కలెక్టర్ అయిన హెన్రీ థామ్సన్ గారి ఎస్టేట్లో అని తెలిసింది. పాత పగ ఇంకా అలాగే ఉంది. తల్లీ తండ్రుల మరణం కళ్ల ముందుకు వచ్చింది. మా నాన్న చనిపోయేవరకు బ్రిటీష్ వారిని భారతదేశం నుండి తరిమికొట్టడానికి పోరాడుతూ ఉండేవాడు. ఇదిలా ఉంటే, ఈ హెన్రీ థామ్సన్ ఇంకా భారతాన్ని వదిలి వెళ్లలేదు. అప్పుడే నేను ఈ బ్రిటిష్ వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్నాను. ప్రతిరోజూ కాపుకాసి నేను అతనిని చంపడానికి చూస్తూవున్నాను. కానీ ఏమీ జరగలేదు. ఒకసారి కణగిలే ఎస్టేటు దారైన ఆ బ్రిడ్జ్‌ని బాంబు పెట్టి అతని కుటుంబాన్ని హతమార్చాలని ప్లాన్ చేశాను. అంతా నేను అనుకున్నట్లే జరిగింది. ఒక పాడు వర్షాకాలంలో, థామ్సన్ తన కుటుంబంతో కలిసి వంతెనను దాటుతున్నాడు. అతని రాక కోసం నేను పొంచి వుండి అతన్ని చంపడానికి ఎదురుచూస్తూ ఉన్నాను. అతను బ్రిడ్జి దాటటం, నేను పెట్టిన బాంబు పేలడం ఒకే సమయంలో జరిగాయి. వంతెన కూలిపోవడంతో నది నీళ్లు పొంగి ప్రవహించసాగింది. ఆ నది నీటిలో థామ్సన్, అతని భార్య, పిల్లలు అందరూ కొట్టుకుపోయారు. థామ్సన్ అనే బ్రిటీష్ అధికారిని భారతదేశం నుండి తరిమివేశానని సంతోషంతో అరిచాను. అయితే నా ఆనందానికి అదే ముగింపు పలికింది. ఆ రోజు అంత బాగా నవ్వినవాడ్ని మళ్లీ నవ్వనే లేదు..”

మాటలు సగానికే ఆగిపోయాయి.. మణికాంత్ మాత్రం ఆ కథను చాలా ఆసక్తిగా వింటున్నాడు.. లోయలోంచి వచ్చిన మాటలకు జవాబుగా “..తర్వాత ఏమి జరిగిందో త్వరగా చెప్పు.. నువ్వు మళ్లీ ఎందుకు నవ్వనేలేదు.. ఆ విషయం తొందరగా చెప్పు.. లేకపోతే.. పైకెత్తలేం చూడు..” అని బిగ్గరగా అరిచి చెప్పాడు.

“లేదు, చెప్తాను.. ఇంత చెప్పిన తర్వాత దాన్ని చెప్పకుండా ఉంటానా?.. ఇంతసేపు చెప్పింది థామ్సన్ కథ. ఇకపై నా కథ చెబుతాను.. ఆ బాంబు పేలి ఆనందంగా కేకలు వేస్తున్నప్పుడు ఆ క్షణం నాకు మా చెల్లెలు గుర్తుకొచ్చింది.. అయ్యో నా చెల్లీ.. నా ప్రియమైన చెల్లీ.. అని అరుస్తూ కణగిలే కొండ చివరికి పరిగెత్తాను. ఎస్టేట్ మొత్తం తిరిగాను. మొత్తం కొండలో ఎక్కడా కనిపించలేదు.. మా చిట్టి చెల్లెలు కనిపించనేలేదు.. అక్కడ వున్న పనివాళ్లు మీ చెల్లెలు థామ్సన్ దొరగారితో కలిసి కారులో వెళ్లిందని చెప్పారు. వాళ్ల ఆ మాట చెప్పిన క్షణమే నా గుండె పగిలిపోయింది. లేదు, నేను పెట్టిన బాంబు వల్ల నా సోదరి చనిపోకూడదు. ఆమె ఇక్కడే ఎక్కడో కొండ అంచులోనో, చివరనో ఉంది. ఆమె ఖచ్చితంగా ఆ బ్రిటిష్ వ్యక్తితో కచ్చితంగా చావలేదు. అయ్యో.. నా చెల్లిని నేనే చంపానన్న బాధ వేధించినా ఆ బాధను ఎవరి దగ్గర చెప్పుకోగలను?.. నా చెల్లెల్ని నేనే చంపానని ఎలా చెప్పుకోగలను?.. థామ్సన్‌ను చంపి నా చెల్లెల్ని విడిపించుకుని వెళ్లాలని అనుకున్నాను. అయితే అలా జరగనే లేదు. నా చిట్టి చెల్లెలు ఇంకా కణగిలె కొండ మీద ఉందా? ఆ బంగ్లాలో పని చేస్తుందనే నేను ఆమెను వెతుకుతున్నాను.. ఇప్పటికీ మా చెల్లి దొరకలేదు. ఆమె ఇక్కడే ఎక్కడో ఉంది.. తప్పకుండా ఏదో ఒకరోజున దొరుకుతుంది.. ఆమె మంచి సంబంధం వెతికి పెళ్లి చేస్తాను.. నా చెల్లెలి వివాహం వైభవంగా చేస్తాను. నా చెల్లెలు దొరుకుతుంది.. తప్పకుండా దొరుకుతుంది..” లోయ లోతుల నుండి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఆ స్వాతంత్య్ర సమరయోధుడి కథ విన్న తర్వాత మణికాంత్ కళ్లలో నీళ్లు తిరిగాయి. చనిపోయిన తన చెల్లెలిని ఈనాటికి వెతుకుతూనే ఉన్నాడని అంటే కచ్చితంగా అతను పిచ్చివాడై ఉండాలి.. ప్రియమైన చెల్లెలిని తానే చంపినందు వల్ల అతని పిచ్చి ఎక్కువై వుండొచ్చని అతని మనస్సు చెబుతోంది. పాపం.. ఇతని కథ వినగానే బ్రిటిష్ బంగ్లా రహస్యం బట్టబయలైంది. లోయ లోతుల్లో పడివున్న ఆ వ్యక్తిని పైకి లేపేందుకు మణికాంత్ తన చుట్టూ ఉన్న చెట్లతీగలను పెరికి ఆ అగాధం లోతుకు చేరేటంత పొడువుగా అల్లుకుని కిందికి వదిలాడు.

“రా త్వరగా.. పైకి రా.. నిన్ను పైకి లాగుతాను.. నీ కథ నేను విన్నాను. నీ కథ విని నా గుండె బరువెక్కింది. నీ చెల్లెలు తొందరగా దొరకాలని నేను ఆశిస్తున్నాను. రా త్వరగా రా..” మణికాంత్ పైనుంచి అరుస్తూనే ఉన్నాడు.

ఇంత సేపు ఆ లోయలోంచి కథ చెప్పిన వ్యక్తి చీకట్లో ఏ శబ్దమూ చేయడం లేదు.. మణికాంత్ ఎంత అరిచినా ఆ వ్యక్తి జవాబు ఇవ్వడమే లేదు. లోయ లోతుల్లోంచి నీరవ మౌనం..

“హలో.. ఓ స్వాతంత్య్ర సమరయోధుడా.. తొందరగా ఈ తీగను త్వరగా పట్టుకో.. నేను నిన్ను పైకి లాగుతాను.. ఇద్దరం కలిసి మీ చెల్లెలిని వెతుకుదాం.. రా త్వరగా.. పైకి రా..”

మణికాంత్ లోయ లోతుల్లోకి చూస్తూ అరుస్తూనే ఉన్నాడు.

లోయ లోతుల్లో అంతటా కటిక చీకటి.. నిశ్శబ్దం. అతని మాటలకు జవాబు లేదు. బాధ లేదు. మూల్గులు లేవు. సద్దులు, కోలాహలం లేదు. అలాంటప్పుడు ఇంతసేపు తనకు కథ చెప్పిన వ్యక్తి ఏమయ్యాడు? నిజంగా ఆ లోయలో అతను ఉండటం నిజమేనా? అప్పుడే కదా వింత కళ్లతో తనను వెంబడిస్తున్న ఆ వ్యక్తి ఈ లోయలో పడింది.. ఆకస్మాత్తుగా అతను అక్కడే చనిపోయాడా? నిజంగానే అతను ఆ లోయలో ఉండటం సత్యమా? ఉండివుంటే ఈపాటికే అతను జవాబిచ్చేవాడు. ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదు. కిందికి దిగి చూద్దామనుకుంటే ఆ చీకట్లో లోయ ఎంత లోతుగా ఉందో కంటికి కనిపించడం లేదు. ఆ క్షణం వరకు దేనికీ భయపడని మణికాంత్ ఆ తర్వాత భయపడసాగాడు. లోయలోని వ్యక్తితో మాట్లాడుతున్నవాడు చుట్టుపక్కల ఉన్న అడవిని ఒకసారి చూశాడు. ఎటు చూసినా నల్లటి కటిక చీకటి. కథ వింటూ సమయం గడిచిపోవటం అతనికి అర్థం కాలేదు. రాత్రి చీకట్లో క్రిమికీటకాలు, పక్షుల అరుపులు, కూతలు, ఎక్కువయ్యాయి. దట్టమైన అడవి కటిక చీకటి తననే మింగేసేలా చూస్తోంది. లోయ లోతుల్లో దాక్కున్న వ్యక్తి అబద్ధం అనిపించసాగాడు. సోదరిని చంపిన ఆ వ్యక్తి కచ్చితంగా బతికివుండడు. అతను చనిపోయివుండాలి.. లేదా సోదరిని వెతుకుతూ వెతుకుతూ అతను పిచ్చివాడై ఉంటాడు. లోయ లోతుల్లో ఉన్న మనిషి గురించి ఆలోచనలు రాసాగాయి. జనం మాట్లాడుకునే దెయ్యాల, భూతాల కథలు గుర్తుకు రాసాగాను. ఇంతసేపు తనతో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడటం లేదంటే, ఊరంతా చెబుతున్నట్టు ప్రేతాత్మల పీడ కావచ్చా? అనే గందరగోళంలో మణికాంత్ చిక్కుకున్నాడు.

కటికచీకటి తీవ్రత మరింత పెరగసాగింది. దాని సద్దు పెరుగుతూనే ఉంది. చుట్టూ ఉన్న అడవి మణికాంత్‌ను మరింత భయపెట్టసాగింది. కణగిలె కొండ మీది బ్రిటిష్ బంగ్లా గురించి రహస్యాన్ని గుండెలో దాచుకుని ఆ కారుచీకట్లో పరుగెత్తసాగాడు. తాను ఏ దిశలో పరుగెత్తుతున్నాడో అనే ధ్యాసే అతనికి లేనట్లు కనిపించింది. కరిమలెకు వెళ్లే మార్గమొ లేదా కణగిలే కొండ లోయకు వెళ్లే దారో అతనికి తెలియదు. చుట్టూ మనుష్యుల్లా అరిచినట్లు వినిపిస్తున్న సద్దు మాత్రం మణికాంత్ పరుగు వేగాన్ని మరింత పెంచింది. కేకలు.. అరుపులు.. ఛీత్కారాలు కొనసాగుతూనే ఉన్నాయి.

చీకటి మణికాంత్ పరుగెడుతున్న దారి వైపు వెళుతూ అతన్ని అనుసరిస్తూవుంది..

మణికాంత్ దారి స్పష్టంగా లేదు.

పరుగెత్తే దారిలో స్వాతంత్ర్య సమరయోధుడు పదే పదే గుర్తుకొచ్చి అతన్ని బెదిరిస్తూనే ఉన్నాడు. బ్రిటీష్ బంగ్లా రహస్యాన్ని తలలో నింపుకున్న మణికాంత్ సాళగాంవకర్ ఎటువైపు పరిగెత్తాడు..?!

కన్నడ మూలం: శ్రీధర బనవాసి

అనువాదం: రంగనాథ రామచంద్రరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here