దాతా పీర్-20

0
3

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[కాలం గడుస్తూంది. బక్రీద్ పండగకి రసీదన్‍కి దానం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. మరొకొన్ని నెలలు గడుస్తాయి. కలకత్తా నుంచి చున్నీ, బబ్లూ వచ్చి వెడతారు. సత్తర్ మియ్యా సబ్జీ బాగ్‍లో నివాసం ఏర్పర్చుకుని మద్యం వ్యాపారం చేస్తుంటాడు. రాదే భార్య బబిత ఆరోసారి గర్భవతి అవుతుంది. ఇక భార్యకి దూరంగా ఉండాలని అనుకుంటాడు రాధే. బక్రీద్ రోజున రసీదన్ ఇంటికి వచ్చిన సాబిర్ తర్వాతా మళ్ళీ రానేలేదు. అమీనా నవ్వు లేక, ఏడుపు లేక, ఇంటి పనికి అంకితమైపోతుంది. ఉస్తాద్ ఫహీం బఖ్ష్ తన మేనల్లుడు సాబిర్‌కి రాగాలు నేర్పుతుంటాడు. సాబిర్ చాలా తొందరగా సంగీతం నేర్చేసుకుంటాడు. తన తల్లి గురించి తెలుసుకున్న, ఆమె కుటుంబానికి దగ్గరైన సాబిర్‍కి ఇప్పుడు తన తండ్రి కుటుంబం గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. అడగ్గా అడగ్గా, ఓ రోజు పెద్దమావయ్య ఆ వివరాలు చెప్తాడు. సంగీత సాధనలో సాబిర్‍కి ఊపిరి సలపకుండా చేసేస్తారు మేనమామలు. సాబిర్ పెద్దమ్మ ఫర్హత్ బానో చనిపోతుంది. పెద్దమ్మకీ, తన తండ్రికి మధ్య జరిగిన సంఘటన తెలుసుకుని సాబిర్ బాధపడతాడు. ఫర్హత్ బానో చనిపోయిన 40 రోజుల తరువాత, నూర్ మంజిల్‌లో సాబిర్ పెళ్ళి ప్రస్తావనలు మొదలవుతాయి. ఓరోజు సాబిర్ మేనమామతో కూర్చుని సాధన చేస్తుండగా పెద్దత్త అక్కడికి వచ్చి – సాబిర్‍కి పెళ్ళి చేయాలన్న తన అభిప్రాయాన్ని చెబుతుంది. మర్నాడు సాబిర్ పీర్ ముహానీకి వచ్చి రసీదన్‍ని కలుస్తాడు ఫజ్లూ ఆరోగ్యం గురించి ఆరా తీస్తాడు. తన దగ్గర కొంత డబ్బుందనీ, అవి తీసుకుని ఫజ్లూని వేరే డాక్టర్‍కి చూపించమని అంటాడు. ఆ మాటలు వినగానే అమీనా సాబిర్‍పై విరుచుకు పడుతుంది. అతన్ని తిట్టేసి, లోపలి గదిలోకి వెళ్ళి ఏడుస్తుంది. సాబిర్ మౌనంగా ఆమెనే చూస్తూ వరండాలో నిలబడిపోతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-12 – రెండవ భాగం

[dropcap]ష[/dropcap]హనాయీ కళాకారుడు సాబిర్ అలీ బఖ్ష్ వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు రసీదన్ అతన్ని భోజనం చేసి వెళ్ళమంటే ఆకలిగా లేదన్నాడు. ఫజ్లూ గదిలోకి బైటినుంచే తొంగి చూశాడొకసారి! అతని ఆరోగ్యం కోసం మనసు లోనే ప్రార్థించి, వెళ్ళిపోయాడు. రాధే గోప్ దూరం నుంచే అతన్ని చూసినా, తనేదో పనిలో మునిగి ఉన్నట్టే పట్టించు కోలేదతన్ని! సాబిర్ కూడా అతన్ని చూశాడు కానీ మాట్లాడలేదు. అమీనాతో మాట్లాడనేలేదు. రసీదన్ అమీనాను వరండాలోనే బల్ల మీదే నిద్రపుచ్చింది.

ఫజ్లూకు అన్నం కలిపి నోట్లో పెట్టి తినిపించింది రసీదన్. అమీనా చేస్తుండేదీ పని ఇన్ని రోజులూ! ఫజ్లూ అన్నం తినటమే తగ్గిపోయింది. ఎంతో బతిమాలితే నాలుగు ముద్దలు తింటున్నాడు. వండిన అన్నమంతా అలాగే ఉండి పోయింది. రసీదనూ, అమీనా ఇద్దరూ తినలేదు.

సమయం ఆగదు కాబట్టి రోజు గడిచిపోయింది.

సాబిర్ అలీ బఖ్ష్ వచ్చి అమీనా జీవితాన్ని అతలాకుతలం చేసేశాడు. మడ్డిలో నిలిచిన మట్టిలా లోలోపల పేరుకుపోయిన బాధంతా ఒక్కసారి బైటికొచ్చేసింది. కొన్ని రోజులుగా సాబిర్ ఇక్కడ లేకపోవటం, అమీనాను కొత్త జీవితపు పద్ధతులకు అలవాటు పడేలా చేసింది. కానీ ఒక్కసారి వచ్చి, మళ్ళీ అంతా చిందర వందర చేసేశాడు. సాబిర్ కేవలం ఒక పరిచయమున్న వ్యక్తిగా మాత్రమే గుర్తు పెట్టుకునేందుకు అమీనా సంసిద్ధమౌతున్న సమయం. సాబిర్‌కూ, తనకూ మధ్య అంతమూ, ఆరంభమూ లేనంత పెద్ద దూరాన్ని సృష్టించుకోవాలనుకుంది అమీనా. ఆ దూరాలమధ్య తన పిలుపుల ప్రతిధ్వనులు, ఆత్మ హాహాకారాలూ కేవలం తాను మాత్రమే వినగలగాలంతే! ఇదీ ఆమె కోరిక!

సాయంత్రం చిక్కబడుతున్న వేళ అమీనా లేచింది. ముంగిట్లోనుంచీ బైటికొచ్చింది. గోరీల గడ్డ పడమర వైపు నిలుచుని ఉన్న చెట్లు చిక్కబడుతున్న చీకటితో మంతనాలాడటం చూసింది. దాతా పీర్ మనిహారీ దగ్గరికి వెళ్ళి నిల్చుంది.

ఈ రోజు తెల్లవారుతూనే కొంతమంది ఆడవాళ్ళ గుంపు, దాతా పీర్ మనిహరీకి దుప్పటి కప్పే మొక్కు చెల్లించేందుకు వచ్చింది. ఎవరి కోరికో ఫలించింది. గాజుల బుట్ట నిండా గాజులున్నాయి. రసీదన్‌కు కాస్త భిక్ష కూడా దక్కింది. ఆకుపచ్చని దుప్పటి కప్పుకుని దాతా పీర్ నిద్రిస్తున్నారు. అమీనా అంది – ‘మీరీ రోజు నన్ను పలకరించి ధైర్యం చెప్పటానికొచ్చారు బాబా!! చాలా నమ్మకం వచ్చింది. నాకు ఏడవటమిష్టం లేదు బాబా! ఎవరి గురించీ యే ఫిర్యాదు చేయను కూడా! బతకడానికో ఆసరా కావాలంతే బాబా! మీరు నన్ను నా తల్లీ! అని ఎపుడైతే తియ్యగా పిలిచారో ఆ పిలుపే మాటిమాటికీ వినాలనిపిస్తూంది బాబా!’

అమీనా మోకాళ్ళ మీద కూర్చుని తలను సమాధికి ఆనించి, కళ్ళు మూసుకుంది.

చైత్రమాసపు చంద్రుడు ఆకాశంలో పచార్లు చేస్తున్నాడు. భూమిని తన వెన్నెల చినుకులతో తడుపుతున్నాడు. గంభీరంగా గాలి వీస్తున్నది. అమీనా చెవులకు ఒక అస్పష్టమైన తీయని స్వరంలో పాట వినిపించింది.

జర్గర్ పిసరే చూ మాహ్ పీరా

కుఛ్ గఢియే సవారియె పుకారా.. (అమీర్ ఖుస్రో గీతం)

‘మీరే భాషలో మాట్లాడుతున్నారో గానీ, నాకేమీ అర్థం కావటమేలేదు బాబా! నాకర్థం కాకుండా ఉండిపోకండి మీరు! ప్రపంచమంతా అర్థం కాకుండా ఐపోయిందిప్పటికే నాకు!’ అని వేడుకుంది అమీనా. ఏదో తీయని వాయిద్యం మ్రోగినట్టు, తియ్యని నవ్వు నిండిందామె చెవుల్లో! దాతా పీర్ మనిహారీ అన్నారు, ‘ఒక కంసాలి కొడుకుండేవాడు. చంద్రునిలా చక్కనోడు. అతడన్నాడు, ‘ఏదో ఒకటి తయారు చెయ్యి, చక్కగా!’ అని! బంగారం లాంటి నా మనసు తీసుకున్నాడు, విరిచేశాడు! ఏదీ చక్కగా తయారు చేయలేదు! అర్థమైనదా నా తల్లీ!’

‘అర్థమైంది నా దైవమా! నీ భాష అర్థమైంది. నా రక్షకుడా!! నా పీర్!’ అమీనా పెదవులు కదిలాయి.

***

ఫజ్లూ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతూంది. అమీనా చున్నీకి ఫోన్ చేసింది. ఆ రోజే చున్నీ హౌరా – దానాపూర్ ఎక్స్‌ప్రెస్ పట్టుకుని పొద్దునకల్లా పాట్నా చేరుకుంది. మరుసటి రోజు బబితా, రాధే ఇద్దరి సాయంతో ఫజ్లూను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మున్నా సింహ్, పాన్ దుకాణం నడిపే భుట్టీ భయ్యా ఇద్దరూ కూడా సహకారమందించారు. తర్నేజా సేఠ్ అడక్కుండానే రసీదన్‌కు డబ్బిచ్చాడు. వారం రోజులుండి చున్నీ మళ్ళీ కలకత్తాకు వెళ్ళిపోయింది. చాలా కష్టం మీద నాలుగు రోజుల సెలవు దొరికింది. మళ్ళీ సూపర్వైజర్‌ను బ్రతిమాలితే మరో మూడు రోజులు సెలవు పొడిగించింది చున్నీ. ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఎక్కువ మందులు బైటినుంచే కొని వాడాల్సి వచ్చింది. ఏదో ఒక విధంగా మొత్తానికి కథ నడిపిస్తున్నారు.

రసీదన్ ఆసుపత్రిలోనే ఎక్కువసేపు గడపాల్సి వస్తూంది. మధ్యలో ఒక గంట సమయం దొరికితే చాలు, పీర్ ముహానీకి వచ్చి స్నానమదీ చేసుకుని వెళ్తూంది. ఇల్లూ, కబ్రిస్తాన్ అమీనానే చూసుకోవలసి వస్తూందిప్పుడు. శవాలను పూడ్చిపెట్టే గోతులు తవ్వేందుకు సాయానికి పెట్టుకున్న అబ్బాయితో రసీదన్ బాధ్యతంతా అమీనానే చూసుకుంటూంది. అసలేమీ తెలియకుండానే తాను అమ్మ పాత్రలోకెలా ఇమిడిపోయిందో అమీనాకే అర్థం కాలేదు. శవాలు రావటం, అమీనా కబ్రిస్తాన్‌లో పనులన్నీ రసీదన్ లాగే నిర్వహించటం – అన్నీ సహజంగా జరిగి పోతున్నాయ్. అమీనా రూపం కూడా రసీదన్ లాగే మారిపోతూంది. ఈ క్రమం నెల రోజులదాకా నడిచింది.

ఫజ్లూ చావుకు దగ్గరగా వెళ్ళి మళ్ళీ బతికాడు. మునుపటికంటే ఆరోగ్యంగా ఇంటికొచ్చాడు, పూర్తి ఆరోగ్యంగా కాకపోయినా ఇదివరకున్న స్థితి లేదు. వాడలోని వాళ్ళకు ఫజ్లూ తిరిగొస్తాడన్న నమ్మకమే లేదు. డాక్టర్ రసీదన్‌తో, ‘ఎన్ని రోజులితనితో ఆసుపత్రిలో పడుంటావమ్మా? ఇంటికి తీసుకెళ్ళు, మందులిస్తూ ఉండు. బైట గాలి తగిలితే త్వరగా తేరుకుంటాడు’ అన్నాడోసారి!

ఫజ్లూ ఆసుపత్రిలో ఉన్నప్పుడోసారి, పెద్ద ప్రమాదమే తప్పింది. రసీదన్ ఆసుపత్రిలో ఉంది. ఎండ వేడిమి తట్టుకోలేక అమీనా, ఇంటి ముంగిట కూర్చుని ఉంది. హఠాత్తుగా సత్తార్ మియ్యా ఇంట్లోకి జొరబడ్డాడు. అమీనా నిర్ఘాంతపోయింది. అసలాయనిలా ఇంట్లోకి రాగలడా? అన్న సందేహమింకా ఉండగానే, తెలిసిపోయింది ఆయనే అని! అమీనా అప్రమత్తమైంది. ఈ మండుటెండలో, ఎవరూ బైటికి రాలేని సమయంలో, సత్తార్ మియ్యా ఇంటిలోకి దూసుకు రావటం వెనకేదో పథకం ఉందనిపించింది. అమీనా గట్టిగా అరిచింది, ‘ఆగక్కడ! లోపలికి రావద్దు. బైటికెళ్ళు’ అని.

సత్తార్ మియ్యా వెనక్కి తగ్గాడు. చూపులు అటూ ఇటూ తిప్పి, ముందుకడుగేశాడు. ‘అమీనా! నీ బతుకెందుకు వృథా చేసుకుంటావ్? చున్నీ చూడు, ఇక్కడినుంచీ పారిపోయింది, హయిగా బతుకుతున్నది. పద, నాతో! బైటికెళ్ళకపోయావో, ఏదో ఒక రోజు మీ అమ్మ నీతో వ్యాపారం చేయిస్తుంది’ అన్నాడు.

అమీనా ఇంకా గట్టిగా అరిగింది. ‘వెధవా? వ్యాపారం చేసినా నీతో కాదు. నీ మొహమ్మీద ఉమ్మనైనా ఉమ్మను నేను! వెళ్ళిపో ఇక్కణ్ణించీ!’ సత్తార్ మియ్యా వెళ్ళేందుకు ససేమిరా సిద్ధంగా లేడు. తల వెంట్రుకలకు గోరింటాకు పెట్టుకుని మరీ వచ్చాడు మరి! మొండిగా నిల్చునే ఉన్నాడు. అమీనా గట్టిగా అరిచింది మళ్ళీ, ‘రాధే భయ్యా! ఓ రాధే భయ్యా!’ అని!

రాధే దుకాణం ఖాళీగా ఉంది. ఈ ఎండల్లో చాయ్ తాగేందుకెవరొస్తారు? బెంచీ మీద కూర్చుని తూగుతున్నాడతను. చెవుల్లో అమీనా గొంతు వినిపించింది. ఒక్క ఉదుటున లేచి, గోరీలగడ్డ గేట్ దాకా వెళ్ళాడు. లోపలేదో గడబిడగా ఉందనిపించింది. రసీదన్ ఇంటి పరదా జరిపి లోపలికి చూశాడు. వాకిలికానుకుని వణుకుతూ నిలుచుని ఉన్న అమీనా కనిపించింది. సత్తార్ మియ్యా వీపు అతని వైపుకి ఉంది. రాధే ముందుకడుగేశాడు. వెంటనే ముందుకు వెళ్ళి, శక్తి కొద్దీ సత్తార్ మియ్యా బుగ్గలమీద కొట్టాడు. మెహెందీ రంగు పులుముకున్న ఆయన తల వెంట్రుకలు కోడి రెక్కల్లా చెల్లాచెదురై పోయాయి. ముంగిట్లోకి లాగి, శక్తి కొద్దీ మళ్ళీ కొట్టాడు రాధే. ‘ఈ రోజుకిది తక్కువే ఇంకా! సత్తార్ మియ్యా, వెళ్ళిక్కడినుంచీ! మున్నాకీ సంగతి తెలిసిందంటే సబ్జీ బాగ్ వరకూ కూడ వెళ్ళలేవు నువ్వు! మళ్ళీ యీ ముంగిట్లోకి రావద్దు.’ అని అరిచాడు.

సత్తార్ మియ్యా లేచి, లోహాన్ పుర్ దారి పట్టుకుని మాయమైపోయాడు. రాధే అన్నాడు, ‘అమీనా! తలుపుకు గొళ్ళెం పెట్టుకో! తెరిచుంటే కుక్క ఇంట్లోకి జొరబడుతుందంతే!’

తన గదిలో ఫజ్లూ జబ్బుతో పడుకునే ఉన్నా, అతనికామాత్రం పేరుంది. అతనే ఇంట్లో ఉంటే సత్తార్ మియ్యాకు ఇంత ధైర్యం ఉండేదే కాదు. సత్తార్ మియ్యా, అమీనా వల్ల రెండోసారిలా దెబ్బలు తినటం. ఈ సారి వెనక్కు మళ్ళుతూ, మరో దుర్మార్గపు పథకం వేశాడా దరిద్రుడు!

***

నూర్ మంజిల్‌లో సాబిర్ అలీబఖ్ష్ పెళ్ళి గురించి రకరకాల గుసగుసలూ, ఊహాగానాలౌతున్నాయి. అప్పుడప్పుడూ రుక్న్ బీ, నూర్ మంజిల్ గాలుల్లోకి తన చెవులను దూర్చి, వినే ప్రయత్నం చేస్తుంది. ఏదో కాస్త వింటుంది. ఆ విన్నదే సాబిర్ దగ్గరికి కూడా చేరుతుంది. రుక్న్ బీ కథలల్లటంలో మంచి దిట్ట. ఆమె వినిపించే వార్తల్లో తన కల్పనల ప్రవీణ్యమూ ఉంటుంది. నూర్ మంజిల్ ఆస్తంతా అప్పుల మీదుంది. సాబిర్ ఒక మొహరా. సాబిర్ ఇద్దరత్తలూ ఆడుతున్నారు. పెద్దత్త అన్నయ్యకు నలుగురు కొడుకులూ, ఒక కూతురూ ఉన్నారు. సామాన్యమైన కుటుంబం. కొడుకులు దాదాపు నిరక్షరాస్యులు. చిన్నా చితకా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కూతురు చదువుకుంది, అందంగా కూడా ఉంటుంది. అన్న కొడుకులలో ఎవరినైనా ఫహీం బఖ్ష్ దత్తత తీసుకోవాలని పెద్దత్త చాలా ప్రయత్నించింది. ఆయన ఒప్పుకోలేదు. ఇప్పుడు, తన మేనకోడలి పెళ్ళి సాబిర్‌తో కావాలని ఆమె కోరిక. ఇక, చిన్నత్త పుట్టిల్లు మంచి హోదా గలిగినది. కానీ ఆమె చిన్న చెల్లెలి పెళ్ళి ఒక పనికిరాని వాడితో జరిగింది. అందుకే వాళ్ళ జీవితాలు సరిగ్గా లేవు. కొడుకు కావాలన్న కోరికతో ఐదు మంది ఆడపిల్లలను కన్నారా దంపతులు. పెద్ద పిల్ల మెట్రిక్ వరకూ చదివింది. పెళ్ళి కోసం ఎదురుచూస్తూ ఉంది.

సాబిర్ పెద్దత్త మేనకోడలు, మేనత్తకే షాకిచ్చింది. ఏడవ తరగతి పాసైన సాబిర్‌తో పెళ్ళి వద్దని తేల్చి చెప్పి, నూర్ మంజిల్ ఆస్తిని, ప్రస్తావనను తిరగ్గొట్టేసింది. లక్షసార్లు నచ్చజెప్పినా ఒప్పుకోనేలేదా అమ్మాయి. ఈ కథ ఇంతటితో ముగిసిపోయింది. పెద్దత్తకు యీ విషయంలో ఆసక్తి చచ్చిపోయింది. ఇప్పుడు చిన్నత్త పెత్తనం తీసుకుంది. కనీసం ఒక్క మేనకోడలైనా డబ్బున్న ఇంటికి కోడాలవ్వాలని ఆమె తహతహ. తన మేనకోడలు నూర్ మంజిల్ కోడలైతే, తక్కిన ఆడపిల్లల పెళ్ళిళ్ళకు తప్పక సహాయం చేస్తుందని ఆమె ఆలోచన. తామిద్దరూ కలిసి యీ పని సులువుగా చేసేయగలరు కదా మరి!

నూర్ మంజిల్‌లో బల్ల మీద రాత్రి భోజనం వడ్డిస్తున్నారు. రుక్న్ బీ మధ్యాహ్నం నుండే యీ ఏర్పాట్లలో ఉంది. బల్ల మీద భోజనం చేయటం ఇటీవలి కాలంలో తక్కువైపోయింది. ఇద్దరన్నదమ్ములూ తమ భార్యలతో వాళ్ళ గదుల్లోనే భోజనాలు కానిస్తూ ఉంటారు. సాబిర్ భోజనం కూడా అతని గదిలోకే రుక్న్ బీ పంపించేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే, అన్నదమ్ములిద్దరూ సాబిర్‌తో కలిసి బల్ల మీద భోంచేస్తారు. మగవాళ్ళ భోజనాల తరువాత ఆడవాళ్ళిద్దరూ కలిసి భోంచేస్తారు.

భోజనం చేసేటపుడు ఫహీం బఖ్ష్ అన్నారు, ‘సాబిర్! తొందరగా నీకు పెళ్ళి చేసెయ్యాలని మేమనుకుంటున్నాం. నూర్ మంజిల్‌లో శూన్యం ఏర్పడింది. ఇప్పుడెలాగైనా దీని వాతావరణం మారాలి. ఇంట్లో సందడుండాలి. కొత్త బంధువులు రావాలి. కొత్త వధువొస్తే ఇంటికి కళొస్తుంది.’

మేక మాంసంతో తయారైన రాన్‌లో వచ్చిన బొమికలో రసం పీలుస్తూ సాబిర్ కళ్ళెత్తి అందరినీ చూశాడు. దగ్గర కూర్చుని ఉన్న మేనత్తల కళ్ళతనిమీదే ఉన్నాయి. లోగొంతుకతో సాబిర్ అన్నాడు, ‘ఇప్పుడే తొందరేముంది? ఇప్పుడిప్పుడే..!’

‘తొందరుంది.’ గులాం బఖ్ష్ అతని మాటలు అడ్డుకుంటూ అన్నాడు, ‘జీవితంలో ఎన్నో అవసరాలొస్తాయి. ఇప్పుడు నీకు పెళ్ళి చేయవలసిన అవసరమొచ్చింది. మా ఇద్దరికీ పెద్ద వయసొచ్చింది. నువ్వింక నీ ముత్తాత ఉస్తాద్ జహూర్ బఖ్ష్, తాత నూర్ బఖ్ష్ వారసత్వాన్ని నిర్వహించాలని మా కోరిక. కోడలు రావాలి, ఆమె కూడా నూర్ మంజిల్ పద్దతులకూ, సంప్రదాయాలకూ అలవాటు పడాలి.’

‘ఇప్పుడింక తప్పించుకోకు సాబిర్ మియ్యా! సరే అనేసెయ్!’ తలుపు దగ్గరున్న రుక్న్ బీ అనేసింది.

‘రుక్న్ బీ!’ ఫహీం బఖ్ష్ ఆమెనాపారు.

కాస్త పెద్దగానే అంది రుక్న్ బీ, ‘హయ్యో, నేనేమన్నాను? నేనిక్కడికి వచ్చినప్పటినుంచీ ఒక్క వేడుకా జరగలేదు. ఏదన్నా జరిగితే కదా నా లాంటి బీదవాళ్ళకేదైనా ముట్టేది? నేనైతే ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఈ సారి నాకు బంగారమివ్వాల్సిందే! లేకపోతే..’

‘తలచుకుంటే తాత పెళ్ళి అన్నట్టు ఇప్పుడింకా పెళ్ళి గురించి యే మాటా అనుకోనేలేదు. ఈవిడకు బంగారు నగల కలలొస్తున్నాయ్!’ సాబిర్ చిన్నత్త మాటలకు అందరికీ నవ్వాగలేదు.

రుక్న్ బీ అసహనంగా కాళ్ళతో శబ్దం చేస్తూ వంటింటికేసి నడిచింది.

‘మీ చిన్నత్త చిన్న చెల్లెలు కూతురు, సబూహీ, మెట్రిక్ పాసైంది. చూట్టానికి కూడా చాలా బాగుంటుంది. చాలా కలుపుగోలు పిల్ల. ఇంటి పనులూ, ఇల్లు నడపుకోవటంలో కూడా నేర్పుంది. దగ్గరి సంబంధం. ఇందులో దాచేందుకేమీ లేదు. సబూహీ తో నీ పెళ్ళి జరిపించాలని మేమంతా అనుకున్నాం. నీకేమీ అభ్యంతరం లేదు కదా?’ సూచన లన్నీ చేసి, మాటలు ముగించాడు చిన మామయ్య.

సాబిర్ అన్ని మాటలూ మౌనంగా విన్నాడు. రుక్న్ బీ ద్వారా ముందే యీ సంగతులన్నీ తెలుసతనికి. భోజనమైపోయింది. సాబిర్ సమాధానానికై అందరి చెవులూ అప్రమత్తంగా ఎదురు చూస్తున్నాయి. ఫహీం బఖ్ష్ అన్నారు, ‘ఇప్పుడే సాబిర్ మియ్యా ఏదో ఒకటి చెప్పాలనేమీ లేదు. వాళ్ళ నాన్న కూడా తక్కువగానే మాట్లాడేవాడు. బాగా ప్రశాంతంగా ఆలోచించు!’

ఫహీం బఖ్ష్ ఇక వెళ్దామని సైగ చేశారు. సాబిర్ లేచి చేతులు కడుక్కుని తన గదికి వెళ్ళిపోయాడు. ఇద్దరన్నదమ్ములూ ఏమీ మాట్లాడకుండా తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. బల్ల దగ్గర ఇద్దరాడవాళ్ళూ కూచుని సాబిర్ మౌనానికి అర్థమేమిటో తమ తమ పరిధుల్లో ఆలోచిస్తున్నారు.

***

సాబిర్ ఎంత తొందరగా తన గదికి వెళ్ళాడో అంతే తొందరగా కిందికొచ్చాడు. భోజనానికి కూర్చునే ముందు తాగిన కాస్త మద్యం మత్తంతా అక్కడినుంచీ లేవగానే ఒక్క దెబ్బకు దిగిపోయింది. వేగంగా హసీన్ మియ్యా దగ్గరికి వెళ్ళాడు. అతను తన సామానంతా సర్దేసుకుంటున్నాదు. సాబిర్‌ను చూడగానే నవ్వుతూ, ‘ఏం సాబ్? డబుల్ కోటానా?’ అడిగాడు.

ఏమీ మాట్లాడకుండా డబ్బు చెల్లించి, ఇంకో సీసా కొని, జేబులో వేసుకుని గదికేసి నడిచాడు. అతనిప్పుడు పౌచ్ కాదు, విదేశీ మద్యమే తాగుతున్నాడు. సీసా పూర్తీ ఖాళీ చేసిన తరువాత తల తిరగటం మొదలైంది. ఫజ్లూ నుండి దూరమయ్యాక, సాబిర్ తాగే అలవాటూ మారిపోయింది. చాలా రోజుల తరువాత, ఇంత మద్యం తాగాడీ రోజు! కాలుతున్న గాజు గ్లాస్‌లా, అతని తల కూడా జ్ఞాపకాలను ఢీకొని ఢీకొని, నిప్పు రవ్వలను కక్కుతున్నది. అమీనా జ్ఞాపకాలు అగ్ని జ్వాలల్లా అతని చుట్టూ మండుతున్నాయ్. నాన్న, బిల్కీస్ బానో పిన్నీ, రసీదన్ అత్త, ఫజ్లూ, రాధే గోప్, సత్తార్ మియ్యా, అతని గది ఓనరు ముసలావిడా – అందరూ అతని చుట్టూ తిరుగుతూ వికటాట్టాహాసం చేస్తున్నారు. ఆకాశం మాయమై పోయింది. పీర్ ముహానీ వీధులూ, కబ్రిస్తాన్, అందులో ఒక మూల అమీనా వాళ్ళిల్లూ ఇవన్నీ ఆకాశం స్థానాన్ని ఆక్రమించి, తల క్రిందులుగా వేలాడుతున్నాయి. ఒక్కసారి కింద పడి అతన్ని అణచివేసేలా ఉన్నాయి. అంతా అయోమయంగా ఉంది. భయం కలిగిస్తున్నాయి.

గదిలోనుంచీ బైటపడి, పై అంతస్తు కెళ్ళి, అక్కడ ఆకాశం కింద నిలబడి అమీనా.. అమీనా.. అని గట్టిగా అరవాలనిపిస్తున్నది సాబిర్‌కు. సుల్తాన్ గంజ్ నుండీ పీర్ ముహానీ దాకా అతని గొంతు మాత్రమే వినిపించాలి, ప్రపంచంలోని అన్ని శబ్దాలనూ దాటుకుంటూ, తొక్కుకుంటూ, అతని గొంతు అమీనాను చేరుకోవాలి. కానీ అతనికి తెలుసు, లక్ష సార్లు కోరినా నూర్ మంజిల్ నుండీ అతని గొంతు అమీనా దాకా చేరటం అసంభవమని! ఆకాశంతో పోటీ పడే నూర్ మంజిల్ ఎక్కడ? లోతైన గొయ్యి అడుగునున్న అమీనా ఇల్లెక్కడ?

తప్పెవరి వల్ల, ఎక్కడ జరిగిందో అర్థం కావటం లేదతనికి! డబ్బూ, పేరు ప్రతిష్ఠల కోసం నూర్ మంజిల్‌కు రాలేదు తను! అమ్మ ఫోటో కోసం మాత్రమే వచ్చాడిక్కడికి! అమ్మెలా ఉండేదో కనీసం ఆ ఫోటో చూసైనా తెలుస్తుందని వచ్చాడు. షెహ్‌నాయ్ నేర్చుకోవాలనుకున్నాడు సరే. కానీ అమీనాను వదులుకుని కాదు. అమీనా తనను హత్తుకుని నిలబడిన ఆ సాయంత్రం, తన జ్ఞాపకాల్లోకల్లా మురిపెమైనది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న అమీనాను సముదాయిస్తూ ముద్దు పెట్టుకున్నాడు తను! అమీనాను వదిలిపెట్టి వచ్చే ఆలోచనే తనకు లేదనటానికి దాతా పీర్ మనిహారీ యే సాక్ష్యం. ఏదో పురాతన శిధిల భవనం, వర్షానికి ఫెళ్ళున విరిగి కింద పడ్డట్టు, పక్క మీద దబ్బున పడిపోయాడు సాబిర్. తన పక్క కూడా పాతాళంలోకి కుంగి పోతున్నట్టనిపిస్తూందతనికి! కిందకి.. ఇంకా కిందకి, పీర్ ముహానీ కబ్రిస్తాన్‌లో భూమి లోతుల్లోకి! తక్కిన గోరీలన్నీ తెరుచుకున్నాయి. వాటిలో ఉన్న అస్థిపంజరాల ఎముకలన్నీ తుప్పు పట్టిన ఈటెల్లా, తన గుండెలో దిగబడిపోతున్నాయి. తన పరుపుమీద అటూ ఇటూ తెగ కదిలిపోతున్నాడు సాబిర్. పాము కుబుసాన్ని విడిచేసినట్టు తన ప్రియురాలిని వదిలేయటం సాధ్యం కాదతనికి! కళ్ళ ముందు మాటి మాటికీ అమీనా ముఖమే కనిపిస్తూంది. తననే చూస్తూంది. గాయపడి భయపడుతున్న ఆమె కళ్ళల్లో ఉబికి వచ్చే కన్నీటిని స్పష్టంగా చూస్తున్నాడు సాబిర్. ఈ రోజతను మాట్లాడి తీరాలి. అంతా చెప్పేయాలి. అమీనాను ప్రేమిస్తున్నానని చెప్పాలి. ఆమెకింకా కోపంగా ఉంది తన మీద! కానీ తను ఆమెను ఒప్పించగలడు. వేరెవరినో కాదు. అమీనానే తాను పెళ్ళి చేసుకుంటాడు. అమీనా కోసమే తను పుట్టాడు. రేపు పెద్ద మామయ్యతో మాట్లాడాలి. అమీనా నాకోసం ఎదురుచూస్తున్నదని చెప్పాలి. షెహ్‌నాయ్ లాగే అమీనా కూడా తనకు ప్రాణమని చెప్పాలి. తన ఊపిరి అమీనా. షెహ్‌నాయ్‌లో నింపే శ్వాస అమీనా. తన షెహ్‌నాయ్ లోనుంచీ వెలువడే తీయని గొంతుకే అమీనా అని చెప్పేయాలి!

***

రెండో రోజు ఉదయం నూర్ మంజిల్ మొత్తం, కిందా మీదా ఐపోయింది. సాబిర్, తాను గోరీల గడ్డలో ఉండే అమీనాను ప్రేమిస్తున్నాననీ, ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాననీ పెద మామయ్యకు స్పష్టంగా చెప్పేశాడు. దీనితో ఒకసారి మళ్ళీ, నూర్ మంజిల్ పునాదులు కదిలిపోయాయి. భూకంపమొచ్చినట్టే అయింది. ముప్ఫై ఐదేళ్ళ కిందట మదీహా అలీబఖ్ష్‌ను పెళ్ళి చేసుకున్నప్పుడూ ఇలాగే జరిగింది. నూర్ మంజిల్ గోడలనుంచీ కూడా ద్వేషం కురిసిందప్పుడు! గదుల్లో, ముంగిట్లోనూ ఊపిరాడలేదెవరికీ అప్పుడు! మదీహా, అలీ బఖ్ష్ ఇద్దరికీ నూర్ మంజిల్ తలుపులు శాశ్వతంగా తలుపులు మూసుకున్నాయి. ఫర్హత్ బానో చేతిలో కమానుంది. అన్నదమ్ములిద్దరూ, కత్తులు దూస్తున్నారు. ఉస్తాద్ నూర్ బఖ్ష్ మనుమడు (కూతురు కొడుకు) మళ్ళీ ఇలాంటి వార్తే తెస్తాడని ఎవరూ ఊహించనేలేదు. ఇద్దరత్తలూ ఆశ్చర్యంలో ఉన్నారు. గులాం బఖ్ష్ మండిపడుతున్నాడు. ఫహీం బఖ్ష్ మాత్రం, విషయం చాలా సున్నితమైనది కాబట్టి సహనంగా ఉన్నారు. ఒక రుక్న్ బీ కి మాత్రం ఏమీ అర్థం కావటం లేదు. టిఫిన్ కోసం, పరాఠాలూ, ఆమ్లెట్లూ తయారు చేసింది కానీ ఎవ్వరూ ఒక్క ముక్కైనా నోట్లో పెట్టుకోనేలేదు.

పెదమామయ్యకు తన నిర్ణయం చెప్పి సాబిర్ బైట ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, పెద మామయ్య పిలుస్తున్నారని రుక్న్ బీ వచ్చి చెప్పింది. అక్కడికెళ్ళేసరికి, చిన్న మామయ్యా అక్కడే ఉన్నారు. ఉస్తాద్ ఫహీం బఖ్ష్ సాబిర్‌కు, లోకమూ, లోకరీతులూ గురించిన విషయాలు చెబుతున్నారు. సాబిర్ తన కళ్ళు దించుకుని, ఆ మాటలు వింటున్నాడు. ఉస్తాద్ అన్నారు, ‘సాబిర్! బిడ్డా! ఈ సంగతులన్నింటిలో ప్రేమ ఒక అభిరుచి మాత్రమే! పిచ్చి మాత్రమే! మనిషి ఎంత సంపాదిస్తాడో, అంత కంటే ఎక్కువే కోల్పోతాడు. మీ అమ్మే దీనికి ఉదాహరణ. మా చెల్లెలికేమి దక్కింది? బీదరికమూ, చావేగా? కొడుకునొకసారి దగ్గరికైనా తీసుకోలేదు. నీ చిన్నతనం ఎట్లా గడిచిందో నీకు తెలుసు మాకంటే ఎక్కువగా! అల్లా తాలా దయ వల్ల ఆలస్యంగానైనా నువ్విక్కడికొచ్చావ్. మాతో ఉంటున్నావ్. మేము గుండె తలుపులు తెరిచి నిన్ను ఆహ్వానించాం. మనసులో ఎటువంటి దాపరికమూ ఉంచుకోలేదు. నిన్ను మా వారసుడు చెయ్యాలనుకున్నాం. ఇప్పుడింక అంతా నీ చేతుల్లోనే ఉంది, నువ్వేమి కావాలనుకుంటున్నావో! పీర్ ముహానీకి వెళ్ళి శవాలకోసం గోతులు తవ్వుతావో లేక షెహ్‌నాయి వాయిస్తావో నీ ఇష్టం. గొప్ప విద్వాంసుడు ఉస్తాద్ నూర్ బఖ్ష్ మనుమడిగా బతుకుతావా లేక గోరీలగడ్డ ఇంటి అల్లుడిగా బతుకుతావా? సాబిర్! యీ వయసులో ఇలాంటి బంధం విషయంలో ఎలాంటి ఆవేశముంటుందో నాకు తెలుసు. కానీ యీ ఆవేశం ఎప్పుడైతే వరద నీటిలా తగ్గిపోతుందో, అప్పుడు జీవితం చాలా భారమైపోతుంది. నూర్ సరాయ్ నుండీ పాట్నా వరకూ అంతా నీ అధీనంలో ఉంది. మా అన్నదమ్ముల జీవితంలోని తక్కిన రోజులన్నీ నీ అధీనంలో ఉన్నాయి. నీ తాత, ముత్తాతల సంగీత సంప్రదాయం నీ అధీనంలో ఉంది. నీకిష్టమైతే దీన్నంతా సర్దుకుని, నీ మూటలో పెట్టుకో, లేదూ, అన్నీ చెల్లా చెదరూ చేసేసి, నీ కాళ్ళకింద నలిపేసి, పీర్ ముహానీ కబ్రిస్తాన్‌లో వెళ్ళి ఉండిపో! కానీ నేను చెప్పేదొకటి మాత్రమే, నీకు ప్రేమే కావాలనుకుంటే, సంగీతాన్ని ప్రేమించు!’

ఉస్తాద్ ఫహీం బఖ్ష్ కళ్ళు వర్షిస్తున్నాయి. గొంతు పూడుకుపోతూంది. గులాం బఖ్ష్ లేచి వారికి నీళ్ళు తాగించారు. సాబిర్ ఏదో విగ్రహం లాగే కూర్చుని ఉన్నాడు. అతని శరీరం, ప్రాణం లేనిదానిలా, తేలికగా ఐపోయింది. అతని చెవుల్లో ఉస్తాద్ వాయించిన మిశ్ర్ పీలూ రాగం లోని ఠుమ్రీ వినిపిస్తున్నది.

నా మనసీ మాటను వినదూ..

తలవంచుకుని కాసేపలాగే కూర్చుని ఉన్నాడు.

గులాం బఖ్ష్ కూడా జరిగేదంతా మౌనంగా చూస్తున్నారు. ఫహీం బఖ్ష్ ఎదురుగా బల్ల మీద పడున్న కవర్ తీసి, లోపలున్న ఉత్తరం తీస్తూ అన్నారు, ‘మున్నా! అందరికీ చెప్పు, రేపు సాయంత్రం నుండీ రిహార్సల్స్ మొదలౌతాయని! పండిత్ రాం సింగార్ మహారాజ్‌కు ఫోన్ చేసి నాతో మాట్లాడించు. పుత్తన్ లాల్, మౌజూద్ హుస్సైన్, సఫీర్ ఖాన్‌కు కూడా చెప్పు, అందరికీ కొత్త బట్టలవీ కుట్టించాలి కూడా! సమయం చాలా తక్కువుంది. ఈ రోజునుంచీ పదో రోజే ఢిల్లీలో కచ్చేరీ. నా జీవితంలో అన్నిటికన్నా పెద్ద ఉత్సవంలో షెహ్‌నాయ్ వాయించాలి. అకాడమీ ఉత్సవం, షెహ్‌నాయీ ఉత్సవం. దేశం మొత్తం మీదున్న షెహ్‌నాయ్ కళాకారులందరూ అక్కడే ఉంటారు. ఈసారి సాబిర్ మియ్యా బట్టలు, అచ్చం మన బట్టల్లాగే ఉంటాయి. అందరి పేర్లూ అకాడమీ వాళ్ళకు పంపించు. అక్కణ్ణించీ విమానం టికెట్లు రావాలి కదా మరి? సాబిర్ మియ్యా! రేపటినుంచీ పగలూ రాత్రీ సంగీతం గురించే ఆలోచించాలి నువ్వు. ఢిల్లో కార్యక్రమంలో మా ఇద్దరి మధ్యా నువ్వు కూర్చుంటున్నావ్.’

***

ఉస్తాద్ ఫహీం బఖ్ష్ ఢిల్లీ వెళ్ళే ముందు, చాలా సార్లు రిహార్సల్స్ కోసం కూర్చోబెట్టారు అందరినీ! ఈ రిహార్సల్స్‌లో చాలా గమకాలు, సాబిర్ ఒక్కడే వాయించేందుకు నిర్ణయించారు. రాగ్ అభేరీ కాన్ హడా, గున్ కలీ, తిలక్ కామోద్ లో తమ పితామహులు ఉస్తాద్ జహూర్ బఖ్ష్ కూర్చిన పాత పల్లవులను కొత్తగా తయారు చేశారు. వాటిలో కవ్వాలీ తళుకులు కలిసున్నాయి.

కొత్త బట్టలూ వచ్చేశాయి. ఇద్దరన్నదమ్ముల బట్టలూ, సాబిర్ బట్టలూ ఒకే రంగులో, ఒకే తరహాలో కుట్టబడ్డాయి. తెల్లటి పైజమా, ఆకాశ నీలం రంగు షేర్వానీ, దాని మీద ముదురు నీలం రంగు కుట్టుపని. తక్కిన వాళ్ళ బట్టలు బూడిద రంగులో ఉన్నాయి. కుర్తా, పెద్ద పైజామాల్లాంటివే!

సాబిర్ తప్ప తక్కినవాళ్ళంతా విమాన ప్రయాణాలు చేస్తున్నవాళ్ళే! అతను మొట్టమొదటిసారి విమాన మెక్కబోతున్నాడు. విమానమెక్కి ప్రయాణిస్తానని అతనెప్పుడూ కలలోనైనా అనుకోలేదు. చిన్నప్పుడు ఆకాశంలో విమానం వెళ్తుండగా చూసి, సాబిర్, ఫజ్లూ ఇద్దరూ దాన్ని చూస్తూ పరుగులు పెట్టేవాళ్ళు. దానితో పోటీ పడేవాళ్ళు. తరువాత ఫజ్లూ కాలు దెబ్బ తిని పరుగాపినప్పుడు, సాబిర్ కూడా ఆపేశాడు. పీర్ ముహానీ నుండీ విమానం చూసేందు కొకసారి కాలినడకన విమానాశ్రయానికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళటం అసాధ్యం. ప్రహరీ గోడ చాలా ఎత్తుగా ఉంది. దగ్గరికి వెళ్ళి చూడలేదు కానీ, ప్రహరీ గోడ దగ్గరే దాక్కుని కూర్చుని, లోపల దిగే విమానాలనూ, ఎగిరే విమానాలనూ చూశాడు.

ఢిల్లీకి వెళ్ళేముందు, పీర్ ముహానీకి ఒకసారి వెళ్ళి అమీనాను కలవాలని అనుకున్నాడు సాబిర్. తన జీవితం గురించి వివరించి చెప్పి, అమె కోపం పోగొట్టాలని అనుకున్నాడు. ఇప్పుడు తాను దిగిన రెండవ జీవితం బురదలో నుంచీ బైటపడే మార్గమేదైనా కనిపిస్తుందేమోనని ఆశ. కానీ నూర్ మంజిల్ అతనికి కన్నార్పేంత సమయం కూడా ఇవ్వటం లేదు. పొద్దునా సాయంత్రమూ సాధనే సాధన, గంటల కొద్దీ! గిట్కారీ తాన్, జబడా తాన్, హలక్ తాన్, శుద్ధ తాన్, వక్ర్ తాన్ ఇలా! ఒకసారి ఆలాప్, మరోసారి, రాగ విస్తారం. ఒకసారి టప్పా, తరానా, మరోసారి ఠుమ్రీ దాదరా. ఒకసారి బిలాస్ ఖానీ గత్, మరో సారి మసీత్ ఖానీ గత్. ఖమసా అంటే పెద మామయ్యకు చాలా ఇష్టం. సంగీత ప్రపంచానికి ముస్లింల కానుకిది అనేవారాయన. ఇది పూర్తిగా కవ్వాలీ శైలిలోనే ఉంటుంది. వాయిద్యం వాయించే వారికి పాడే పద్ధతి కూడా తెలిసుండాలని అనేవారాయన. ముందాయన పాడి వివరించేవారు. తరువాత, షెహ్‌నాయీ మీద వినిపించేవారు. రక రకాల తాన్‌లూ, గతులూ, గమకాలూ, వీటిలో మునుగుతూ తేలుతూ సాబిర్ పగలూ రాత్రులు గడిచిపోతున్నాయి. గంటల కొద్దీ షహ్‌నాయీని వాయించేటప్పుడు, కంసాలి తిత్తిలా ఊపిరితిత్తులు పనిచేయాల్సి వస్తుంది. షెహ్‌నాయిలో గాలి ఊదేటప్పుడు శ్వాసను అధీనంలో ఉంచుకోవాలి. పెద్ద తాన్ వాయించేటప్పుడు, గమకాలతో ఆటలాడటం, సులభమేమీ కాదు. రెప్పపాటు లోనే శ్రుతి తగ్గిపోవటమో, లేదా లయలో తేడా రావటమో జరిగిపోతుంది. అల్లా తాలా ఇద్దరు మామయ్యలకూ విపరీతమైన శ్రవణ శక్తినిచ్చాడు. చిన్న తప్పు జరిగినా, వాళ్ళిద్దరి తీక్షణమైన చూపులు, ఈటె మొనల్లాగుచ్చుకుంటాయతన్ని! అలాంటి సమయంలో పండిత్ రాం సింగార్ మహారాజ్ సాబిర్ వైపు ప్రేమగా చూస్తారు. కళ్ళతోనే ‘ఫరవాలేదులే’ అన్న భరోసా ఇస్తారు. పుత్తన్ లాల్ దీనికి పూర్తిగా విరుద్ధం. తన డుగ్గీ మీద ఎడా పెడా వాయించి ఇబ్బంది పెడుతుంటారు. అతని యీ చిలిపితనాన్ని చూసి, మామయ్య చాలా సార్లు మందలించారు. కానీ అతని అలవాటు అతనిదే! మౌజూద్ హుస్సైన్, సఫీర్ ఖాన్ లకు కూడా సాబిర్ అంటే అంతగా పడదు. ఈ కొత్తబ్బాయికి ప్రాముఖ్యత ఇవ్వబడుతున్నదని వాళ్ళకు కోపముంది.

సంగీత ప్రపంచంలో ఇలాంటి ఇబ్బందులొక వైపూ, అమీనా దూరమైపోతూందన్న బాధ మరో వైపూ! నది మధ్యలో చేతినుంచీ జారిపోయిన చుక్కానిలా అమీనా దూరమైపోతుంటే చూస్తూ ఉన్నాడు సాబిర్. అమీనా లేకుండా తాను బతకగలడా? చుక్కాని లేకుండా అతని నావ ముందుకెలా వెళ్తుంది? ఒకవేళ మధ్యలోనే ఆగిపోతే నావను తీరానికి చేర్చేదెలా? ఈదుకుంటూ తీరానికి చేరుకునేందుకు, అతని ఊపిరితిత్తుల్లో అంత శక్తి ఉందా? షహ్‌నాయీని వాయించటం, జీవిత నదిని ఈదుకుంటూ దాటి అటు వెళ్ళటం – రెండూ వేరు వేరు పనులని అతనికి అర్థమౌతూంది.

(ముగింపు వచ్చేవారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here