జీవన రమణీయం-20

1
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]నూ లలితా ఒకరి మొహాలొకరం చూసుకున్నాం. ఇంత మామూలుగా చెప్పేసి కార్డ్స్ ఆడేస్తున్నారేమిటీ వాన్‌లో అని. లలితని ‘ఆడతారా?’ అంటే, “అయ్యో… నేను జీవితంలో అసలు టచ్ చెయ్యలేదు ఇంతవరకూ” అంది. ఆడ్తున్న యండమూరి పేక ముక్కలని లలితకి తాకించి… “ఈరోజుతో మీ వ్రతభంగం అయిపోయింది” అన్నారు.

నాకైతే ఇంక లీడర్ ఆవిష్కరణ గురించే ఊహలు. మనసు నేల మీద లేదు… “మనసే విహంగముగా వినువీధికెగసెనుగా” అన్నట్టు…

వచ్చేడప్పుడు కారు పాడయిపోయింది. యండమూరిగారితో సహా నేనూ, లలితా సిటీ బస్ ఎక్కి సీటు దొరకక పైన రాడ్ పట్టుకుని నిలబడడం, భలే గమ్మతుగా అనిపించింది!

“యండమూరి… యండమూరి…” అని అంతా గుసగుసలు… కొంతమంది యువకులు వచ్చి చొరవగా నమస్కారం పెట్టి ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం… రచయితకి అంత ఫాలోయింగ్ వుండడం ఒక్క యండమూరిగారికే చూశాను.

తరువాత కపాడియా లేన్‌లో ఆయన ఆఫీసు దగ్గర శలవు తీసుకుని, నేనూ లలితా ఆటోలో వచ్చేసాం. ఆయన బస్‌లో “మసాబ్‌ట్యాంక్‍లో మా పాత ఇల్లు… నా చిన్నప్పుడు కాకినాడలో…” అంటూ నాకు లలితకీ కబుర్లు చెప్పడం, జోక్స్ వెయ్యడం అంతా చాలా థ్రిల్‌గా అనిపించింది!

నేను తరువాత రచయిత్రిగా నిలదొక్కుకున్నాకా, నాకు అత్యంత ఆత్మీయులైన వీరేంద్రనాథ్‍గారి దగ్గరకీ, అక్కినేని నాగేశ్వరరావుగారి దగ్గరకీ, రామానాయుడుగారి దగ్గరకీ అడిగినవాళ్లందరినీ వెంటబెట్టుకు తీసుకెళ్తూ వుండేదాన్ని. దానికి కారణం… ప్రతివారికీ జీవితంలో కొన్ని అనుభూతులూ, జ్ఞాపకాలూ ఉండాలిగా! అందుకే… ‘మిమ్మల్ని చూడాలి…’ అని అమెరికా నుండొచ్చినప్పుడు అడిగిన ఎన్‌ఆర్‌ఐల కోసం నేను తప్పకుండా టైమ్ చేసుకుంటూ వుంటాను. అంతకన్నా నేనేం ఇవ్వగలనూ అభిమానంతో వచ్చేవాళ్ళకి!

లలితా నేనూ ఒకర్నొకరు గిచ్చి చూసుకుని పిచ్చి నవ్వు! ఇద్దరం సుశీలకి ఈ విషయం చెప్పడం కోసం సుశీల ఇంటి దగ్గరే ఆటో దిగేశాం. సుశీల అప్పటికప్పుడు బజ్జీలు వేసి పెట్టి “ఎప్పుడు తిన్నారో ఏవిటో?” అని కాఫీ పెట్టిచ్చింది. అసలు ఆకలి కూడా తెలీలేదు ఆనందంలో.

ఇంట్లో కూడా చెప్తే మా వారు ఆనందించారు.

***

మర్నాడు ఇంకో ఆనందరకరమైన వార్త చతుర నుండొచ్చింది. “మీ నవల ‘తృప్తి’ ప్రచురణకి తీసుకోబడింది” అని.

తరువాత భవానిగారితో మాట్లాడాక ఆవిడ, ఆహ్వానాలు వేయించడానికి, “ఎవరికి అంకితం ఇస్తే బావుంటుందీ?” అని చర్చించారు.

“అక్కినేని నాగేశ్వరరావు గారు” అని ఠక్కున చెప్పాను.

ఎందుకంటే అమ్మమ్మ నాగేశ్వరరావు గారికి చాలా అభిమాని. మా ఇంట్లో మూడు తరాలు ఆయన అభిమానులం! అంతే కాకుండా మా తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడై వుండీ, స్వాతంత్ర్యం వచ్చాకా, రాజకీయ నాయకులు చేసే అవినీతిని ఆ రోజుల్లోనే ఖండిస్తూ ‘విప్’ అనే పత్రిక పెట్టి విరుచుకుపడేవారు. అందుకే తాతయ్యకి ఆప్త మిత్రులు, జైల్‌మేట్ అయిన ముదిగొండ రాజలింగం గారు… సభాసామ్రాట్ భాస్కరరావు గారూ, అక్కినేని నాగేశ్వరరావు గారూ, పబ్లిషర్ దూపాటి విజయ్‌కుమార్ గారూ, యండమూరి గారెలాగూ వుంటారు… అమ్మమ్మకి సన్మానం అని ప్లాన్ చేశాం!

నాగేశ్వరరావు గారు మొదట “రాజకీయాలు నాకేం తెలుసు… లీడర్ అని పుస్తకం పేరుంది కదా!” అన్నారట. కానీ వీరేంద్రనాథ్ గారు ఫోన్ చేసి, “దేశభక్తుడి కథ, కొత్త అమ్మాయి రాసింది. మీ చేత్తో తన రచనా జీవితం ప్రారంభం కావాలి” అని చెప్తే ఒప్పుకున్నారు.

అమ్మమ్మ అయితే చాలా సంతోషించింది. నాగేశ్వరరావుగారిని ‘అతను’ అనాలి అనేది. వాడూ, వీడూ అని నటుల గురించి కూడా అమ్మమ్మ మాట్లాడనిచ్చేది కాదు.

సర్గిగా అప్పుడే మళ్ళీ ఒక తమాషా అయిన సంఘటన జరిగింది.

యండమూరి గారు నన్ను ఆఫీస్‌కి ఓ రోజున రమ్మన్నారు. నేను వెళ్తే చాలా విచారంగా, “మీరు రాసినది ప్రథమ పురుషలో. ‘నేనూ’ అని బానే వుంది, మీ అమ్మమ్మగారు చెప్తునట్లూ. అలా కాకుండా, మామూలుగా రాస్తే డ్రామా రక్తి కడుతుంది… అలా ట్రై చెయ్యండి…” అన్నారు.

డిసెంబరు 31 సాయంత్రం ఆవిష్కరణ ఫంక్షన్. ఆహ్వాన పత్రికలు అచ్చు అయిపోయాయి. సిటీ సెంట్రల్ లైబ్రరీలో అని అందరికీ పిలిచేశాను. ఐదు రోజులే వ్యవధి వుంది. “సరే” అన్నాను.

పట్టుదలగా రాత్రంతా కూర్చుని, స్కూల్ కూడా మానకుండా, ఐదు రోజుల్లో లీడర్ కథ మూడో వ్యక్తి చెప్తున్నట్లు, కథలా వ్రాసి ముగించి వెళ్ళి ఇచ్చి వచ్చాను. చాలా ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నవాళ్ళతో, “ఈ అమ్మాయి చాలా పైకొస్తుంది” అన్నారు. అవన్నీ ఆశీర్వాదాలు.

‘తృప్తి’ చతురలో 1 జనవరి 1994 నాడు రాబోతున్నట్టు డిసెంబర్ అంతా ప్రకటనలు వచ్చాయి. “ఇది నేనే… రమణీ ప్రభాకర్ అంటే… నా నవలే” అని అది అందరికీ చూపించుకునేదాన్ని. మా అక్కలు, బాబాయ్‌లూ అందరూ కూడా అనందపడ్డారు.

ముఖ్యంగా వాళ్ళనాన్నగారి చరిత్ర పుస్తకంగా వస్తున్నందుకూ, అక్కినేని నాగేశ్వరరావుగారిని చూడబోతున్నందుకూ మా పెద్దమ్మలూ, అక్కలూ, అన్నలు, బంధువులూ అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు. అమ్మమ్మ మరీ ఆనందించింది. అందరం ఆ రోజు కోసం ఎదురు చూశాం.

మా టీచర్లు అందరూ సిటీ సెంట్రల్ లైబ్రరీలో మాకన్నా ముందే వచ్చి వున్నారు. మా రమ చక్కగా ప్రార్థనా గీతం పాడింది.

 

అంతా తాతయ్య గురించీ, ఆయన ధీరోదాత్తత గురించీ చక్కగా మాట్లాడారు. నాగేశ్వరరావు గారి చేత అమ్మమ్మకి సన్మానం చేయించాలని వీరేంద్రనాథ్ గారి ప్రయత్నం. ఆయన నా వైపు చూసి ఆ మాల నా మెడలో వేశారు. నేను షాక్ అయిపోయాను. ఆయన నవ్వి, చిత్రంగా కళ్ళార్పి, “ఈ రోజు హీరోయిన్ మీరే” అన్నారు. తర్వాత అమ్మమ్మ మెడలో దండ వేసి, సన్మానం చేసి “ఈ సూరంపూడి శ్రీహరిరావు గారికి ముగ్గురు ఆడపిల్లలే… సన్ స్ట్రోక్ లేదు, అదృష్టవంతులు” అన్నారు (అప్పుడే నాగార్జున అమలని పెళ్ళి చేసుకున్న కొత్త!).

నేను రాసిన కథ గురించి, వాళ్ళావిడ చదివిందని కొన్ని విషయాలు చెప్పారు.

వీరేంద్రనాథ్ సడెన్‍గా “ఈ సభకీ, ఈ రమణీ ప్రభాకర్ రచయిత్రి కావడానికీ కారణమైన ప్రభాకర్ స్టేజి మీదకి రావాలి” అని ఎనౌన్స్ చేశారు. మా ఆయనని ఆయన అలా ఆహ్వానించడం నాకెంతో సంతోషం అయింది.

చిన్న కృష్ణుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మా ఆయన ఒకే ఒక ఫోటోలో ‘లీడర్’ స్టేజ్ మీద వున్నారు.

మా తాతగారి స్నేహితులు రాజలింగం గారు వృత్తిరీత్యా లాయర్. ఆయన గురించి కూడా ఆ బుక్‌లో వుంది. “వి.వి.గిరి వచ్చారు మావయ్యా, అమ్మకి ఫ్రీడం ఫైటర్స్ పెన్షన్‌కి సాయం చేస్తారేమో” అని మా అమ్మ ఆశగా అడిగితే, “వెళ్ళవే… వెళ్ళి అడుగు… నిన్నెవరు ఆపుతారు…. సూరంపూడి శ్రీహరిరావు గారి కుతురివీ” అని అమ్మమ్మనీ, అమ్మనీ గిరి గారి దగ్గరకి (అప్పటి ప్రెసిడెంటు) పంపిన ఘనత ఆయనదే.

భాస్కరరావు గారిని సభాసామ్రాట్ అని ఎందుకు అంటారో ఆయన వాగ్ధాటి విన్నాక అర్థమైంది. నా స్పీచ్‍లో “ముగ్గురు సామ్రాట్‍లున్న వేదిక మీద నిలబడి మాట్లాడడానికి చాలా సాహసం కావాలి… ఒకరు నట సామ్రాట్… ఇంకొకరు నవలా సామ్రాట్… మరొకరు సభాసామ్రాట్…” అని ప్రారంభించాను. నా నవలకి ప్రేరణ అయిన అమ్మమ్మ గురించ్చీ, అది రాసిన వుద్దేశం గురించీ మాట్లాడాను.

ఎమెస్కో విజయకుమార్ గారు “ఇది నేను వేసిన మంచి పుస్తకాలలో ఒకటిగా నిలిచిపోతుంది” అన్నారు.

చివరికి మాట్లాడిన వీరేంద్రనాథ్ గారు అందరం షాక్ అయిపోయే నిజం ఒకటి చెప్పారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here