జైత్రయాత్ర-11

0
3

[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆ సాయంకాలం ప్రకృతిని కలుస్తాడు శ్రీనివాస్. ఇద్దరూ ఊసులాడుకుంటారు. బావి దగ్గర పనిని పర్యవేక్షిస్తున్న వెంకట్రావుని – నమస్కారం సార్ – అంటూ పలకరిస్తుంది వనజ. ఆమెని ఎలా ఉన్నావని అడిగి, తను ఇక్కడి వచ్చిందని, వాళ్ళ బాబాయి రాయుడి గారింట్లో దిగిందని తెలిసిందని చెప్పి, మీ నాన్నగారెలా ఉన్నారని ఆమెని అడుగుతాడు. బాగున్నారని చెప్తుంది. అక్కడే ఉన్న విద్యని వనజకి పరిచయం చేస్తాడు వెంకట్రావు. కాసేపు ఆమెతో మాట్లాడి వెళ్ళిపోతుంది వనజ. ఇంతలో చిన్న కలకలం వినిపిస్తే అక్కడికి వెళ్తాడు వెంకట్రావు. అక్కడ మిత్రత్రయం పెద్దగా కేకలు వేస్తూ కనిపిస్తారు. శోభ తెచ్చిచ్చిన అరటిపళ్ళు తిని, పని చేయడానికి లేవడానికి సుబ్బు అవస్థ పడుతున్నాడనీ, వాడిని లేపడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తారు అంజి, శ్రీను. వాళ్ళని గట్టిగా హెచ్చరించి వెళ్తాడు వెంకట్రావు. తరువాత రాయుడి ఇంటికి వెళ్తాడు వెంకట్రావు. మా ప్రిన్సిపాల్ మీ అన్నయ్యేనని తెలిసిందండీ అని వెంకట్రావు చెబితే, తాను అవన్నీ పట్టించుకోనని, విషయం ఏమిటని అడుగుతాడు రాయుడు. బావి తవ్వడం కార్యక్రమంలో ఏ గొడవలు లేకుండా సహకరిస్తే, మా కాలేజీకీ, మీ అన్నయ్యగారికి మంచిపేరు వస్తుందని అంటాడు వెంకట్రావు. తానుగా వాళ్ళ పనికి అడ్దుపడననీ, తన భార్య చనిపోయాకా, తనకీ బంధాలన్నీ పోయినాయని అంటాడు. వెంకట్రావు బయల్దేరి వచ్చేస్తుంటే, వనజ కలిసి తన బాబాయి తత్వమే అంత అని చెప్పి, వెంకట్రావుతో పాటు క్యాంపు దగ్గరకి వస్తుంది. వంట పని చేస్తున్న మిత్రత్రయంలో అంజి అవతారాన్ని చూసి నవ్వుతుంది వనజ. అక్కడ జరుగుతున్న గందరగోళాన్ని అదుపు చేసి తాను వంటలోకి దిగుతుంది. మగపిల్లలంతా ఆమెకి సాయం చేస్తారు. మర్నాడు ఉదయం శోభ దగ్గరకి వెళ్ళి ఆమె ఇచ్చిన సున్నుండలు తిని తిరిగి వస్తుండగా సుబ్బుకి దారిలో శీనయ్య ఎదురవుతాడు. సుబ్బుని ఆగమని చెప్పి, ఏంటి నీ చేతులు ఇట్లా పొట్టుదిగిపోయినాయని అడిగి, అది ఓ భయంకరమైన జబ్బు అని వెంటనే వెళ్ళి డాక్టరుకు చూపించుకోమని చెప్తాడు. భయపడిపోయిన సుబ్బు వెళ్ళి డాక్టర్ పిచ్చేశ్వరర్రావుని కలిసి తనకి ఎయిడ్స్ వచ్చిందని శీనయ్య చెప్పాడనీ, వెంటనే మీ దగ్గర చికిత్స చేయించుకోమన్నాడని చెప్తాడు. విషయం అర్థమైన పిచ్చేశ్వరరావు సుబ్బు దగ్గరున్న ఐదువేలు పుచ్చుకుని, ఏదో ఇంజక్షన్ చేసి పంపేస్తాడు. ఈ రోగం గురించి ఎవరికీ చెప్పవద్దని హెచరిస్తాడు. సరేనంటాడు సుబ్బు. – ఇక చదవండి.]

అధ్యాయం-13

[dropcap]“ఒ[/dropcap]రేయ్ సుబ్బీ.. అంజిగాడు రాడేరా..?” విసుగ్గా అన్నాడు శ్రీనివాస్

“వాడు ఇంకా సెర్వింగ్ దగ్గరే ఉన్నాడు రా.”

వాళ్లిద్దరూ ఆరుబయట నుంచుని మాట్లాడుకుంటున్నారు.

“బోరు కొడుతోంది.. సినిమాకి వెళ్దామా?” అన్నాడు శ్రీనివాస్.

“బస్సులు కూడా లేవు.. ఎలా వెళ్ళటం?.. ఎలా రావటం? ఒకవేళ సైకిళ్ళ మీద వెళ్లినా రాత్రిపూట మరీ కష్టం.”

“అవును. అదీ నిజమే.”

“ఎంచక్కా గాల్లోంచీ ఆ మోటార్ బైక్ వచ్చి మన ముందు ఆగితే ఎంత బాగుంటుందో.”

“మోటార్ బైక్ నీ ఒక్కడికే సరిపోతుంది రా.. మేము కూడా రావాలంటే కారో, వేనో కావాలి.”

ఇంతలో ఆంజనేయులు వచ్చాడు.

విషయం తెలుసుకుని గంతేసి, “అయితే పదండి” అంటూ వాళ్ళిద్దరినీ ముందుకు తోసుకుంటూ పరుగెత్తసాగాడు.

“ఏవిట్రా.. ఈ ఉరుకులూ పరుగులూ? ఏదో దయ్యం వెంటపడ్డట్టు” అడిగాడు శ్రీనివాస్.

“చ.. ఊర్కో.. అవతల బస్సు వెళ్ళిపోతుంది.”

“ఎక్కడికి?”

“టౌన్‌కి రా”

“ఎందుకు? కొంపదీసి సార్‌ని సినిమాకెళతాం బస్సు ఇమ్మని అడిగావా?”

“ అదేం కాదు.. వచ్చే వారానికి కావాల్సిన సరుకులూ, కూరలూ తేవటానికి వెళ్తోంది.”

“అయితే మనం సినిమా చూసొచ్చేదాకా బస్సు మన కోసం ఉండాలిగా?”

“డ్రైవర్ నారాయణని కూడా సినిమాకి తీసుకెడదాం. అంతే!”

“అయితే మనకి ట్రాన్స్‌పోర్ట్ సమస్య తీరినట్టే” అన్నాడు సుబ్రహ్మణ్యం.

“ఇంతకీ ఏ సినిమాకి వెళదాం?” అడిగాడు శ్రీనివాస్.

“ఓ రాత్రి రాసలీల” అన్నాడు ఆంజనేయులు, “ప్రొద్దున బావి దగ్గర ఇద్దరు ఈ ఊరి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను.”

“అబ్బా.. నీ కింకా బుద్ధి రాలేదా? అలాంటి పేర్లు పెట్టి జనాల్ని మోసం చేస్తారని మనకే తెలిసొచ్చిందిగా.. అయినా ఈ కక్కుర్తి ఎందుకురా” అన్నాడు శ్రీనివాస్.

“అదికాదురా.. మొబైల్ ఫోన్ చేతిలో లేకపోయేసరికి ఎదో ఒకరకంగా కుతి తీర్చుకోవాలనేమో?” అన్నాడు సుబ్రహ్మణ్యం.

“ఈ సినిమా అలాంటిది కాదు.. సెక్స్ బాంబ్ రేష్మ నటించిందిట. అప్పుడే నెల అయ్యిందిట రిలీజ్ అయి. అయినా టికెట్స్ దొరకటం లేదుట.”

“అమ్మో.. బాంబు అంటున్నవ్.. అలాంటి బాంబులు తుపాకులు మనకెందుకురా?” భయంగా అన్నాడు సుబ్రహ్మణ్యం.

“నువ్వు నోర్మూసుకుని మా వెంట రా.. అంతే! నీ ప్రాణం శోభ దగ్గర పెట్టి రా.. సరిపోతుంది” అన్నాడు శ్రీనివాస్ .

మొత్తం మీద ఆ సినిమాకే వెళ్ళటానికి సిద్ధపడిపోయారు.

“అవును సరే.. మరి మనం లేని విషయం సార్‌కి తెలిసిపోతుంది కదా?” అనుమానంగా అన్నాడు సుబ్రహ్మణ్యం.

ఇంతలో వెంకట్రావు బయటకు వచ్చి, “ఇక్కడున్నారా? ఒరే సుబ్బిగా.. రోజూ ఎవ్వరికీ మిగలకుండా మింగేస్తున్నావట.. నీవు ఇప్పుడు బస్సులో వెళ్లి వచ్చే వారానికి కావాల్సిన సరుకులూ, కూరలూ తేవాలి. అదే నీకు పనిష్ మెంట్” అన్నాడు.

సుబ్రహ్మణ్యం మిత్రుల మొహాలు చూసాడు.

ఆంజనేయులు, “సార్ పోనీలెండి. వాడు మా స్నేహితుడే కదా. మేం కూడా తోడు వెళ్తాం. పంపించండి సార్” అన్నాడు ఆంజనేయులు.

“సరే.. తగలడండి. ..ఎక్కువ లేట్ చేయకుండా వచ్చేడవండి” అంటూ లోపలి వెళ్ళిపోయాడు.

ముగ్గురు మిత్రులు ఒకరి కేసి మరొకరు చూసుకుంటూ కుడి చేయి మోచేతివరకు లేపి పిడికిలి బిగించి “ఎస్.. ” అంటూ నవ్వుకున్నారు.

***

సినిమా థియేటర్ దగ్గర విపరీతమైన జామ్. హౌస్‌ఫుల్ అయిపొయింది. టికెట్ దొరికినవాళ్లు నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటూ లోపలి వెళుతుంటే, దొరకని యోధులు కొందరు టికెట్ కౌంటర్ కిటికీలో చేయిపెట్టి కిటికీ తలుపు తీయటానికి ప్రయత్నిస్తున్నారు. లోపల మిగిలిపోయిన టిక్కెట్లు, వచ్చిన డబ్బులు సరిచూసుకుంటున్న కౌంటర్ క్లర్క్ విసుగ్గా వాళ్ళ చేతిని బయటికి తోసేస్తున్నాడు. ఆశ వదల్లేని కొంతమంది యువకులు అటూ ఇటూ గమనిస్తూ అక్కడ ఉన్న పోస్టర్ల మీద పేడతో అలికేసి వున్నా అర్ధ నగ్న సుందరి బొమ్మని చేత్తో తడుముతూ తృప్తి పడుతున్నారు.

జనాల మధ్యలో దూసుకుపోతూ బ్లాక్ టికెట్ బాబులు గుస గుసగా “యాభై – వంద, యాభై -వంద” అంటూ వెళ్తూ సుబ్రమణ్యం దగ్గర చెవిలో చెప్పేసి వెళ్ళిపోయాడు. అదిరిపడి వెనక్కి తిరిగి చూసి ఎవరూ లేకపోవటంతో, “ఒరేయ్ ఆ వెళ్ళేవాడెవడో నా చెవిలో యాభై – వంద అంటున్నాడు. అంటే మనం యాభై ఇస్తే వాడు వంద ఇస్తాడా?”

“అవును.. అందుకోసం మీ నాన్న నిన్ననే ఓ బ్యాంకు ఓపెన్ చేసాట్ట.. వాడు ఏజంట్‌ట.. తెలీదా?” వెటకారంగా అన్నాడు ఆంజనేయులు.

“చ్చ.. ఊరుకోరా.. వాడికేదో తెలీక అంటే నువ్వు మరీనూ” మందలించాడు శ్రీనివాస్.

“తెలీకపోవటానికి నేనేమీ ఎర్రి పప్పను కాదురా.. నేనేదో జోక్ చేస్తే వాడు నన్నే జోకర్‌ని చేస్తున్నాడు” అలిగాడు సుబ్రహ్మణ్యం.

ఆ బ్లాక్ మార్కెట్ బాబు మళ్ళీ వీళ్ళ కేసి వచ్చాడు. “ఏమ్ సార్ నాలుగే టిక్కెట్లున్నాయి.. తీసుకుంటారా .. లేదా?” ఆశ పెడుతూ అన్నాడు. ఇంకా ఆలస్యం చేస్తే అవి కూడా దక్కవు, వచ్చిన ఫలితం కూడా దక్కదు అనుకుని టిక్కెట్లు కొని లోపలి వెళ్లారు.

సినిమా మొదలైంది. ఇంటర్వెల్ వరకు చెత్తగా ఉంది. బోరుకొట్టి తల బొప్పికట్టి పోయింది.

సుబ్రహ్మణ్యం విసుగ్గా “పదండిరా.. పోదాం. లోకంలోని దరిద్రం అంతా ఇక్కడే ఉన్నట్టున్నాయి మొహాలు” అన్నాడు.

“సీన్స్, సీన్స్ అని గోలెత్తాశావ్ కదరా.. ఎక్కడరా సీన్స్” చిరాగ్గా అన్నాడు శ్రీనివాస్ .

ఆంజనేయులు బిక్కచచ్చి పోయాడు. డ్రైవర్ నారాయణ కల్పించుకుని, “సెకండ్ హాఫ్‌లో ఉన్నాయంట సార్ యెనక సీట్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు” అన్నాడు.

“అవునురా.. ఇప్పట్నించీ మాంఛి సీన్‌లు ఉంటాయి రా” అన్నాడు ఆంజనేయులు హుషారు తెచ్చుకుంటూ.. అంతలో బెల్ మ్రోగింది.

“ఒరేయ్ మంచి సీన్ లకోసం ప్రక్క హాల్‌లో “సీతమ్మ వారింట్లో సిరిమల్లె చెట్టు ఆడుతోందిరా. దానికెళ్ళాలి గానీ దీనికెందుకురా వచ్చాం?” అమాయకంగా అడిగాడు సుబ్రహ్మణ్యం.

అతని డిప్ప మీద ఒక్కటేసి “మళ్లీ జోకా” అంటూ లోపలి దారితీసాడు ఆంజనేయులు.

***

ఆశగా ఎదురుచూస్తున్న సీన్ రానే వచ్చింది. రైలు పట్టాలు. ట్రైన్ ఒకటి స్పీడ్‌గా వెళ్ళింది. పట్టాల అవతల దూరాన్నుంచీ హీరోయిన్ ఉల్లిపొర లాంటి దేవతా వస్త్రాల్లో పరిగెత్తుకుంటూ వస్తూ దర్శనమిచ్చింది. ఒళ్ళంతా తడిసిపోయి తెల్ల చీర ఒంటికి అతుక్కుపోయి అందాల్ని బయటేస్తోంది. అప్పుడప్పుడు వెనక్కి భయంగా చూస్తోంది. ఒక క్షణానికి వెనగ్గా నలుగురు దుండగులు ఆమె కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆమె పట్టాలమీదకు పరిగెత్తుకుని వచ్చింది. కాలికి రైలు పట్టాలు తగిలి “అమ్మా” అంటూ వంగింది. “అబ్బా” అన్నారు థియేటర్‌లో జనాలు ఉద్రేక పడిపోతూ. ఇంతలో ఆ దుండగులు రానే వచ్చారు. ఆమె పట్టుకుని లాగారు. బెదురుగా వారివంక చూసింది. వాళ్ళు కొంగు ఆమెని లేపబోయేసరికి కొంగు జారిపోయింది. అప్పుడే ఒక ప్యాసింజర్ రైలు మెల్లిగా వచ్చి వాళ్లకి, ప్రేక్షకులకి మధ్య ఆగిపోయింది.

“అబ్బా” అన్నారు జనాలు నిరాశగా.

“ఏమిటి సార్ , ఎప్పుడూ టైముకు రాని రైళ్లు ఇలా సమయానికి వస్తే ఎలా సామీ” నిట్టూరుస్తూ అడిగాడు డ్రైవర్ నారాయణ.

“రేపు రారా .. ట్రైన్ లేట్‌గా వస్తుందేమో..” శ్రీనివాస్ అన్నాడు.

అంతలో సీన్ మారిపోయింది.

బెడ్ రూమ్ తలుపులు తెరచి ఆ అమ్మాయిని లోపలికి తోసి తలుపు వేసి వెళ్ళిపోయారు దుండగులు.

అమ్మాయి మెల్లిగా లేచి వెళ్లి ఫ్యాన్ వేసుకుని బెడ్ మీద వెల్లకిలా పడుకుంది. ఇంకా అదే కనీ కనపడని తడిసిన చీరలో ఉంది.

“ఇంకా ఆ చీర ఆరలేదారా?” అడిగాడు సుబ్రహ్మణ్యం.

“ఎందుకురా బాబూ.. అది ఆరితే నిర్మాత ఆరిపోతాడు. ఇంకా వాడికి కాస్ట్యూమ్స్ కాస్ట్ కలిసొచ్చిందిగా”.

ఇంతలో ‘ధడేల్’ మని శబ్దం . ఒక్కసారిగా బెడ్ రూమ్‌లో కరెంటు పోయింది. ఆ అమ్మాయి ఒక్కసారి “అబ్బా” అని అరిచింది. పెనుగులాట “నో.. నో..” అంటూ అరుస్తోంది. మసక చీకట్లో అమ్మాయి బెదురూ కన్నులు, దుండగుడి ఎర్రటి కళ్ళు మార్చి మార్చి చూపిస్తున్నాడు. సంగీతం ఎరోటిక్‌గా ఉంది. జనాలందరికీ కిర్రెక్కిపోతోంది. పెద్దగా కేకలు.. ఈలలు.. “ఒరేయ్ లైట్లు వేయండిరా” అంటూ అరుపులు.

అమ్మాయి ఇంకా అరుస్తూనే ఉంది. “నో.. ప్లీజ్.. వద్దు.. లీవ్ మీ.. హిట్లర్.. ప్లీజ్ లీవ్ మీ” రెండు నిమిషాల తర్వాత బెడ్ రూమ్‌లో లైట్లు వెలిగినాయి.

ఆ అమ్మాయి గభాలున బెడ్ దిగింది. అప్పటిదాకా ఆమెని అల్లరిపెట్టిన పిల్లి హిట్లర్ ఎగిరి ఆమె మీద దూకింది.

“యూ స్టుపిడ్..” అంటూ ముద్దుగా తిట్టి వాటేసుకుని ప్రేక్షకులవంక చిలిపిగా చూస్తూ కన్ను కొట్టింది.

“చ్చీ.. దీనమ్మ జీవితం” అంటూ కొంతమంది బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్లిపోయారు. ఆశావహులు మరికొంతమంది సీట్లకి అతుక్కుని కూర్చున్నారు. వాళ్ళు వెళ్లే వాళ్ళని చూసి జాలిపడుతున్నారు ఛాన్స్ మిస్సయిపోతారేమో అన్నట్టు.

నిరాశ, నిస్పృహ లతో కోపం తారాస్థాయికి చేరిన కళాపోషకుడు ఒకడు నేలమీద దొరికిన రాయి తీసి స్క్రీన్ కేసి కొట్టాడు. ‘థూ’ అంటూ బయటికి వెళ్ళిపోయాడు.

హీరోయిన్ పిల్లిని బాత్ రూమ్‌కి తీసికెళ్ళి బయటికి వచ్చేసరికి ఆ అమ్మాయి నైటీ లోకి మారివుంది. మళ్ళీ ప్రేక్షకులకేసి చూసి నవ్వింది. ‘పిచ్చి పువ్వుల్లారా’ అన్నట్టు.

జనాలు భయపడ్డారు.

హీరోయిన్ మెల్లిగా పిల్లిని తీసుకుని బెడ్ మీద పడుకుని కాసేపు దానితో ఆడుకుని ప్రేక్షకులకేసి తిరిగి నవ్వుతూ చెయ్యి ఊపుతూ ‘గుడ్ నైట్’ అని పాల నురగలాంటి బ్లాంకెట్‌లో ముసుగు తన్నింది.

సీన్ తెల్లారింది. ఆసక్తి చల్లారింది.

***

కీచురాళ్ళ శబ్దం ఆ ప్రదేశాన్ని ఆక్రమిస్తోంది. అక్కడ ఒకప్పుడు ఏ రాజు తన రాణుల కోసం ఉద్యానవనాల్ని నిర్మించాడో గానీ ఇప్పుడు మాత్రం రాజ్యం కోల్పోయిన రాజు మొహంలా ఉంది. పగలు ప్రకృతికి అందాల నద్దే పరిసరాలు రాత్రి వేళా భయంకర కాళ కంకాళాలుగా కనిపిస్తాయి. అది ఆ ఊరి బయట ప్రాంతం.

ఆ నిర్జన ప్రదేశంలో అప్పుడే ఏవో రెండు ఆకారాలు ఏదో బరువుని మోస్తూ స్మశానంలో శవాల్ని పీక్కుతినేందుకు వెళ్తున్న అఘోరాల్లాగా వెళ్తున్నారు. బరువు మోయలేక పోతున్నారు. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అంత కీచురాళ్ళ శబ్దంలోనూ గుండె చప్పుడు డాల్బీ సౌండ్ ఎఫెక్ట్‌లో వినిపిస్తోంది. ముళ్ళకంపలు మట్టిదిబ్బలు ఉండటంతో ప్రతి అడుగూ చూసుకుంటూ వేయాల్సి వస్తోంది.

కృష్ణ పక్షం చంద్రుడు నమీబియా కరువు బాధితుడి లాగా బక్క చిక్కి వున్నాడు. తిండీ తిప్పలు లేకుండా వర్తిమే చేసిన కార్మికుడిలా నీరసంగా, నిస్తేజంగా, నిరాసక్తంగా వెన్నెల కాస్తున్నాడు.

ఆ ఆకారాలు ఆ చెట్ల దగ్గరికి వచ్చి ఆగినాయి. గుబురుగా ఉండటం వల్ల, వెన్నెల వెలుగు అక్కడ పడటంలేదు. భుజం మీది మూటని తీసి క్రింద దించారు.

ఇంతలో ఏదో వాహనం శబ్దం వినిపించింది. కంగారుగా ఆ మూటని ఎత్తి పడేసి, ఆ చెట్ల చాటునుంచీ పొదల్లోకి మాయమయ్యారు.

ఆ మూట గుంటలో పడేసరికి ‘దబ్’ మన్న శబ్దం వచ్చింది.

***

‘దబ్’ మన్నశబ్దం విన్పించి, ఉలిక్కిపడి లేచి “ఏంట్రా అది?” అన్నాడు కంగారుగా సుబ్రహ్మణ్యం. అందరూ నిద్రపోతున్నారు. డ్రైవర్ నారాయణ కాస్తంత మత్తుగా కాస్త మెలకువగా బస్సు నడుపుతున్నాడు. సినిమా అయింతర్వాత వెళ్లి అందరూ తలా కాస్త తీర్థం పుచ్చుకుని భోజనం కానిచ్చేశారు. అందుకే బస్సు ఎక్కగానే గుర్రుకొట్టటం మొదలెట్టారు.

అందరివంకా చూసాడు సుబ్రహ్మణ్యం. అందరూ జోగుతున్నారు. కిటికీలోంచీ బయటకు చూసాడు. బస్సు హెడ్ లైట్‌ల వెలుతురూ తప్ప చుట్టూ దట్టంగా చీకటి. ఎక్కడిదాకా వచ్చామో కూడా తెలియటం లేదు. కళ్ళు నులుముకుని మళ్ళీ చూసాడు. దాదాపు ఊరు దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తోంది. పొలిమేరల్లో ఇళ్ళు కనిపిస్తున్నాయి. కుడివైపు కిటికీలోంచీ మసక వెలుతురులో తాము త్రవ్వుతూన్న బావి ఛాయారూపంగా కనిపిస్తోంది.

“నారాయణా” డ్రైవర్‌ని పిలిచాడు

“ఏంటి బాబూ” తూలుతూ పలికాడు.

“ఏమన్నా శబ్దం వినిపించిందా?”

“నీకు విన్పించిందా?”

“అవును”

“అయితే నాకూ అవును”

“అదికాదు..”

“అవును. అది కాదు”

సుబ్రమణ్యానికి విసుగొచ్చింది. బస్సు ఫుల్ బాటిల్ తగినవాడిలాగా ఆ మట్టి రోడ్లమీద తూలుతూ వెళుతోంది.

‘అసలు ఏమిటి ఆ శబ్దం? కొంపదీసి దెయ్యం కాదుకదా?!, మనుషులవైతే కనపడాలిగా!, ఏవో ఆకారాలు నల్లగా అటూ నుంచి ఇటు ఎగురుతూ వెళ్లినట్లనిపించిందే! ఒకవేళ మనుషులైతే ఈ టైములో ఎందుకు వచ్చినట్టు? ఎన్నెన్నో భయాలు, అనుమానాలూ, సందేశాలూ, ..’ నిద్ర తేలిపోయింది.

ఆంజనేయులు కళ్ళు తెరచి సుబ్రమణ్యాన్ని చూస్తూ, “ఏంట్రా ఏమైంది ? ఆకలేస్తోందా?”

“ఫోరా.. నీకెప్పుడూ వేళాకోళమే .. మన బావి దగ్గర ఏదో ‘ధబ్’ మని శబ్దం వినిపించింది. దాన్ని గురించి..” అంటూ ఏదో చెప్పబోయాడు సుబ్రహ్మణ్యం.

“అలాంటి ఆలోచనలతో బుర్ర పాడుచేసుకోకు.. నీవు భయపడకు, మమ్మల్ని భయపెట్టకు..” అన్నాడు అప్పుడే లేచిన శ్రీనివాస్.

“నిజం రా! నా మాట నమ్మండి రా! అక్కడ ఎవరో తచ్చట్లాడినట్లనిపించిందిరా, దయ్యాలంటారా?”

“ఇంకాసేపుంటే మనల్ని కూడా దయ్యాలంటాడు.. వెధవ ఆలోచనలు.. వెధవ భయాలు..” అన్నాడు ఆంజనేయులు. బస్సు క్యాంపు దగ్గిరికి జేరింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here