[శ్రీ ముకుంద రామారావు రచించిన ‘వృద్ధాప్యం ఒడ్డున’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ సందినేని నరేంద్ర.]
[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, అనువాద రచయిత, ముకుంద రామారావు కలం నుండి జాలువారిన ‘వృద్ధాప్యం ఒడ్డున’ కవిత పై విశ్లేషణా వ్యాసం ఇది.
‘వృద్ధాప్యం ఒడ్డున’ కవిత నన్ను ఆలోచింపజేసింది. ఈ కవిత చదవగానే ఎందుకో వృద్ధాప్యం ఛాయలు నాలో పొడచూపిన అనుభూతి కలిగింది. వృద్ధాప్యం మనిషి జీవితంలోని చివరి దశ. వృద్ధాప్యం దశను ప్రతి మనిషి ఎదుర్కొని తీరాల్సిందేనని చెప్పటంలో సందేహం అవసరం లేదు. వృద్ధాప్యం నిర్వచించడానికి వయో పరిమితి లేనప్పటికీ మనిషి శరీరం రోగ నిరోధక శక్తిని క్రమక్రమంగా కోల్పోయి చివరకు మరణించే స్థితి చేరే దశను వృద్ధాప్యం అని చెప్పవచ్చు. వృద్ధాప్యంలో మనిషి జీవన విధానం ఎలా ఉంటుంది?వృద్ధులు వృద్ధాప్యంలో సంతోషకరమైన జీవితమును కోరుకుంటారు. వృద్ధాప్యంలో వారిని ఒంటరితనం ఎక్కువగా బాధిస్తుంది. వృద్ధాప్యంలో చాలా మంది మానసిక సమతుల్యతను కోల్పోతారు. ముదిమిలో వృద్ధులను పసిపాపల వలె చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ, ఒంటరితనం వంటి సామాజిక సమస్యలు వృద్ధాప్యంలో ఎదుర్కొంటారు. ఒడ్డు అర్థాలు పందెమిడు క్రియ, నది, వాగు, ఏరు, సముద్రం నీటి ప్రవాహం ఇరువైపుల ఉన్న అంచున ఉన్న నేల లేదా భూభాగం. సముద్రానికి చివర ఉండేది ఒడ్డు. వృద్ధాప్యం ఒడ్డునకి చేరుకున్న మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ అవస్థలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? కవి ముకుంద రామారావు కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోండి.
‘కనపడకుండా భూగర్భంలో
విత్తనం పెరుగుతున్నట్లు
పెరిగిపోతున్న వయస్సు.’
నేల ఉపరితలంపై ఉన్న వాటికి కింద ఉన్న నేల పొర. మొక్కలు తయారు చేసినవి విత్తనాలు. విత్తనాన్ని బీజం అని కూడా అంటారు. మొక్కగా మారటానికి ఉపయోగపడే చెట్టు భాగాన్ని విత్తనం అంటారు. ఒక వ్యక్తి జీవించి ఉన్న సంవత్సరాల సంఖ్యను వివరించడానికి వయస్సు పదాన్ని ఉపయోగిస్తారు. వయస్సు అనగా ప్రాయం, యౌవనము. వయసు వాడు, వయసుది అని కూడా అంటారు .పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు జీవించి ఉన్న కాలంను వయస్సు అని అంటారు. మన కళ్ళకు భూమిలో విత్తనం నాటబడి పెరుగుతున్నట్లు ఎవరికీ తెలియదు. వర్షపు జల ధార సోకి భూగర్భం నుండి విత్తనం పైకి వచ్చి మొక్క పెరిగి మహావృక్షం అవుతుంది.తల్లి శిశువును గర్భంలో నవ మాసాలు మోసి కంటుంది. శిశువు ఎదిగి బాల్యము, కౌమారము, యౌవనము, వృద్ధాప్యము మొదలగు వివిధ దశలకు చేరుకుంటాడు. భూగర్భం నుండి పుట్టిన విత్తనం కూడా పెరిగి మహా వృక్షం అయినట్లుగా పుట్టిన పసిపాప కూడా పెరుగుతుంది. విత్తనంలాగే మనిషి వయసు కూడా పెరిగి పోతుంది. తెలియకుండానే మనిషి పుడతాడు. విత్తనం తెలియకుండానే మొక్కగా మారి వృక్షంగా పెరుగుతుంది. జననము, మరణము ఇది అంతా కాల ప్రభావమేమో అనిపిస్తుంది. మనిషి జీవిత చక్రంలో పెరిగిపోతున్న వయస్సు గురించి కవి చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘వయసొచ్చేది శరీరానికి
శరీర యంత్రాలకే అయినా
మనస్సుకీ ఆలోచనలకీ
ఎంత దూరమో..’
శరీరం అనగా జీవులకు సంబంధించినది. ప్రతి జీవి వ్యక్తిగత, భౌతిక శరీరంతో ఉంటుంది. శరీరాన్ని దేహం అని కూడా అంటారు. ఆంగ్లంలో శరీరాన్ని బాడీ అంటారు. మానవ శరీరం ముఖ్యంగా ఒక తల, మెడ, మొండెం, రెండు చేతులు, రెండు కాళ్లు, అలాగే శ్వాస కోశ, రక్తప్రసరణ, కేంద్రీయ నాడీ వ్యవస్థ వంటి అనేక అంతర్గత అవయవ సమూహాలు కలిగి ఉంటుంది. మనస్సు లేదా ఆత్మతో శరీరాన్ని పోల్చినప్పుడు శరీరము మనస్సు దేహం అని రెండు భాగములుగా భావిస్తారు. ఏ ప్రాణికైనా అన్ని అవయవాలు కలిపి ఉండేది శరీరం.శరీరం భౌతికానికి సంబంధించినది. మనిషి ఎదుగుతుంటే శరీరానికి కూడా వయసు పెరుగుతుంది. శరీరంతో కూడుకున్న యంత్రాలకు కూడా వయసు పెరుగుతుంది. మనం నిత్యం వాడుతున్న వాహనాలకు కూడా జీవిత కాలం ఉంటుంది. వాహనం జీవితకాలం పూర్తి కాగానే ఆ యంత్రం పని చేయడం ఆగిపోతుంది. జీవిత కాలం పూర్తి అయిన యంత్రాలను స్క్రాప్ కిందికి తరలిస్తారు. వయసుతో పాటే మనిషి మనస్సులో కలిగే ఆలోచనలు దగ్గరగా ఉండవు. మనిషి మనస్సు యొక్క ఆలోచనల్లో వేగం పెరిగి ఎంతో దూరం ఉంటుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
‘నడవాల్సిన దారికి
నడిచొచ్చిన దారి
ఎన్నెన్ని రహస్య సూచనలో
వృద్ధాప్యం ఒడ్డుకి చేరుకుంటున్నపుడు
కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్టుంది.’
వృద్ధాప్యం అనుభవిస్తున్న మనిషి జీవనంలోని ఉనికిని ముఖ్యమైన సంగతుల గురించి విప్పి చెప్పినట్లుగా ఉంది. కొత్త దారి ఉనికిలోకి రావాలంటే కొంత సమయం పడుతుంది. మన పూర్వీకులు నడిచిన దారి కాబట్టి అందరు అదే బాట వెంబడి నడకను సాగిస్తారు. నడిచి వచ్చిన దారి అంటే శిశువు పెరిగి పెద్దయి వృద్ధాప్యం దశకు చేరుకున్న విధానం అని చెప్పవచ్చు. వృద్ధాప్యంలో మనిషి గడిపిన జీవితం ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది. వృద్ధాప్యంలో వృద్ధుని జీవిత గమనంలో ఎన్నో అనుభవాలు చెప్పాల్సినవి ఉంటాయి. కొన్ని జీవితంలో ఇతరులకు చెప్పకూడని రహస్య విషయాలు ఉంటాయి అని చెప్పవచ్చు. వృద్ధాప్యం చేరుకుంటున్నప్పుడు మనిషిలో కొన్ని మార్పులు తెలియకుండానే జరుగుతాయి. పదవీ విరమణ, ఒంటరితనం వల్ల వృద్ధునికి ఏమీ తెలియని ఒక వింతైన లోకం ఏర్పడుతుంది. వృద్ధాప్యంలో వృద్ధుడు బుడిబుడి నడకల అందమైన శిశువు లాగా కొత్త కొత్తగా జీవితంలోకి అడుగులు వేస్తున్నట్టు తెలియని ఒక వింత అనుభూతి అతనిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అని కవి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
‘సముద్ర మధ్యంలో
అణిగిమణిగి ఉన్న అలల్లా
తీరానికి చేరువవుతున్న కొద్దీ
తెలియని ఉద్వేగం
నీటిలో దాని కాళ్ళను
చూసుకుంటున్న వంతెనలా
ప్రపంచాన్ని ఇంత వరకూ చూసిన కళ్ళు
గతాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాయి.’
సముద్రం భూమిపైన పెద్ద పెద్ద జలరాశుల గురించి చెప్పడానికి వాడే పదం. నీళ్లు నిండుగా ఉండే ప్రదేశం సముద్రం. విశాలమైన భూభాగాన్ని ఆక్రమించినవి సముద్రాలు. నీటి పరిమాణం లోతు చాలా ఎక్కువగా ఉన్న ప్రదేశం సముద్రం. మానవ జీవనంలో మరియు పర్యావరణంలో సముద్రాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. సముద్రపు నీటిని మనం తాగు నీటి అవసరాల కోసం శుద్ధి చేయవచ్చు. సముద్రంలోని అలలతో మనిషి వృద్ధాప్య జీవనంలోని సంగతుల గురించి కవి పోల్చడం జరిగింది. సముద్రంలోని అణిగిమణిగి ఉన్న అలలు కూడా తొందరగా తీరం చేరాలని తహతలాడుతుంటాయి. మనిషి కూడా సముద్రంలోని అలల వలె వృద్ధాప్యం ఒడ్డుకు చేరాలనే కోరుకుంటాడు. నది మొదలైన వాటి పైన కట్టేది వంతెన. చిన్న చిన్న కాలువలు రోడ్లు దాటడానికి వీలుగా ఉండే కట్టడం వంతెన. వివిధ అవసరాల కోసం మనిషి నిర్మించిన కట్టడం వంతెన. సముద్రంలో తన కాళ్ళను చూసుకుంటున్న వంతెనలా వృద్ధాప్యంలో మనిషి ప్రపంచాన్ని ఎన్నో ఏళ్లుగా తన కళ్ళతో చూస్తున్నప్పటికీ గతం తాలూకు అనుభూతుల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
‘పేరుకున్న ధైర్యంతో వృద్ధాప్యం
వ్యాధిలా అనిపించక
కాలాతీత ఆరోహణో
నాతో పెరుగుతున్న సంఖ్యలానో అనిపిస్తోంది.’
ఆరోహణ అనగా చిన్న విలువ నుండి పెద్ద విలువ వరకు సంఖ్యలను అమర్చే పద్ధతి. ఏ పని చేయడానికి అయినా అందుకు నియమితమైన సమయం ఉంటుంది. సమయం దాటిపోతే ఇప్పటికీ కాలాతీతమయింది కదా ఇంకా తగిన సమయానికి పని పూర్తి కాలేదా? అని అంటారు. ఇప్పటికే టైం అయిపోయింది అని చెప్పడం కాలాతీతమైనదని తెలియ జేయడం. అనారోగ్య పరిస్థితిని వ్యాధి లేదా రోగం అంటారు. వ్యాధులు కలగకుండా శరీరంలోని రోగ నిరోధక శక్తి మనిషిని కాపాడుతుంది. వ్యాధి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనిషిని ప్రభావితం చేస్తుంది. వ్యాధి బారిన పడటం, జీవించడం వ్యక్తి జీవితంపై దృక్పథాన్ని మారుస్తుంది. వయస్సుతో పాటు మనిషి సహజంగా వృద్ధాప్యం దశకు చేరుకోవడం జరుగుతుంది. వృద్ధాప్యం వచ్చింది కదా అని మనిషి ధైర్యమును కూడా సడలనివ్వ లేదు. వృద్ధాప్యం తనకు దాపురించిన వ్యాధి అని మనిషి అనుకోలేదు. శిశువుగా పుట్టి పెరిగి వృద్ధాప్యం దశ వలె చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు పెరిగి కాలం గడువు తీరిపోయింది. వయసుతో పాటు పెరిగిన సంఖ్య వలె వృద్ధాప్యం సంభవిస్తుంది అని కవి చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘సాయంకాలం వెలుగులా
చూస్తూ చూస్తూనే శక్తి సన్నగిల్లుతున్న
దూరాన చీకటిలో కూడా
ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న కాంతి
మనస్సులోకి ఏ ముసలితనాన్ని రానివ్వక
కొవ్వొత్తిలా కరుగుతూ
నిశ్శబ్దంగా నేర్చుకుంటున్నదో
అనువాదం చేసుకుంటున్నాను.’
సాయంకాలం అనేది పగటి పూట ముగింపుతో ప్రారంభమయి రాత్రి ప్రారంభంతో వ్యాప్తి చెందే పగటి కాలం. ఇది సూర్యుడు హోరిజోన్‌కు దగ్గరగా ఉన్న కాలాన్ని సూచిస్తుంది. సూర్యాస్తమయానికి కొద్దిసేపటి ముందు చివరిగా క్షీణిస్తున్న పగటి సమయాన్ని తెలియజేస్తుంది. రోజు చివరి భాగం మరియు రాత్రి ప్రారంభమైన భాగం సాయంకాలం. నిప్పు రావడం వెలుగు. చమక్ చమక్ మనడం వెలుగు. చీకటిని ఆంగ్లంలో Darkness అని అంటారు. చీకటి ఒక ప్రదేశంలో దృగ్గోచర కాంతి లేమిని సూచిస్తుంది. చీకటి అంతరిక్షంలో నలుపు రంగులో కనిపిస్తుంది. మానవులు కాంతి గాని చీకటి గాని ప్రబలమైనప్పుడు దాని రంగుని స్పష్టంగా గుర్తించ లేరు. కాంతి లేనప్పుడు ఆ ప్రదేశం వర్ణ విహీనంగా పూర్తి నలుపుగా గోచరిస్తుంది. వెలుతురు ప్రసరించని భాగాన్ని చీకటి అంటారు. ప్రతి రోజు రాత్రి చీకటిగా ఉంటుంది. మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనస్సు. ఏదైనా వస్తువు లేదా జీవరాశి పై ప్రేమ, ద్వేషం కలిగించే ఒక అంతరంగం. మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు మనసు ఆలోచించే విధానం పై ఆధారపడి ఉంటుంది. వ్యక్తి జీవితంలో వృద్ధాప్యం చివరి దశ. ముసలితనం ముంచుకొస్తుంది అంటారు. నిశ్శబ్దం అంటే శబ్దరాహిత్యం లేదా శబ్దానికి అతీతమైనది. నిశ్శబ్దం నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండే క్రియ. మౌనం అన్నది మాట్లాడకపోవడం. మౌనం నిశ్శబ్దాన్ని సృష్టించే ఒక ప్రయత్నం. నిశ్శబ్దం అనేది పరిసర శబ్దం లేక పోవడం, తక్కువ తీవ్రత కలిగిన శబ్దాల ఉద్గారం. అవి తమ దృష్టిని ఆకర్షించలేవు. శబ్దాలను ఉత్పత్తి చేయడం మానసిక స్థితి. అనువాదం అనేది అసలు సందేశం మరియు కమ్యూనికేషన్ నిర్వహించడానికి ఒక భాష నుండి మరొక భాషలోకి వచనాన్ని పునర్నిర్మించే ప్రక్రియ. ఒకరు చెప్పిన దానిని మరల చెప్పటం అనువాదం అంటారు. ఉదయిస్తున్న సూర్య కాంతి రేఖలు ప్రకాశవంతంగా ఉంటాయి. సాయంకాలం కాగానే సూర్య కాంతి రేఖలు క్షీణిస్తున్నట్టు అగుపిస్తాయి. అల్లంత దూరాన చీకటిలో కూడా ఎక్కడో ఒక చోట ఆకాశంలోని తారకలు మిణుకుమిణుకుమంటూ కాంతి గోచరిస్తుంది. మనల్ని నడిపిస్తున్న మనసులోకి వృద్ధాప్యం ఛాయలు సోకకుండా లోకానికి వెలుగులు ప్రసాదిస్తున్నప్పటికీ కొవ్వొత్తిలా కరుగుతూ వ్యక్తి జీవితంలో చివరి దశ ముసలితనం ముంచుకొస్తున్నప్పటికి నిశ్శబ్దంగా అతను మాత్రం తన జీవితంలో ముఖ్యమైన అనువాదం రచన వ్యాసంగంలో నిమగ్నమై తాను పని చేసుకుంటున్నానని కవి చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
‘సూర్యోదయాలే కాదు
సూర్యాస్తమయాలు ఇష్టమే
రెండు అనివార్యాలేనన్న ఎరుకతోనే
ఎంత దూరమైనా ప్రయాణం.’
దినానికి సంబంధించిన ఉదయించిన సూర్యున్ని అస్తమించిన సూర్యున్ని మనిషి రోజు చూస్తాడు. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ప్రకృతిలో ఇవి అనివార్యాలు. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ఉంటాయి అనే ఎరుకతోనే ఎంత దూరమైనా ప్రయాణం కొనసాగించడం జరుగుతుంది అని కవి వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. కవి ‘వృద్ధాప్యం ఒడ్డున’ అనే చక్కని కవితను అందించి సమాజానికి స్ఫూర్తిని కలిగిస్తున్నారు. కవి ముకుంద రామారావు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
యల్లపు ముకుంద రామారావు తేది 09-11-1944 రోజున పశ్చిమబెంగాల్ ఖరగ్పూర్ లో జన్మించారు. తల్లి ఎరుకలమ్మ, తండ్రి యెల్లయ్య. తండ్రి రైల్వే ఉద్యోగి. ముకుంద రామారావు ఎమ్మెస్సీ మ్యాథ్స్, డి.ఐ.ఐ.టి., పి.జి.డి.సి ఎస్. ఖరగ్పూర్ లో చదివారు. వీరు రైల్వే శాఖలో కంప్యూటర్ రంగంలో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరి భార్య పేరు సుభాషిణి. ముకుంద రామారావు, సుభాషిణి దంపతులకు ముగ్గురు సంతానం – 1) లావణ్య 2) చైతన్య 3)కళ్యాణ చక్రవర్తి.
వీరు రచనా ప్రస్థానం మొదట కథారచయితగా ప్రారంభించి కవిగా స్థిరపడ్డారు. వీరు అనువాదకుడిగా రాణించి వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషలలోని కవితలను అనువదించారు. వివిధ పత్రికలలో పరిచయ వ్యాసాలు రాశారు.
వలస పోయిన మందహాసం, మరో మజిలీకి ముందు, ఎవరున్నా లేకున్నా, నాకు తెలియని నేనెవరో, నిశ్శబ్దం నీడల్లో, విడని ముడి, ఆకాశయానం, రాత్రి నదిలో ఒంటరిగా, నిశ్శబ్దంలో శబ్దం – స్వీయ కవితా సంపుటులు; అదే ఆకాశం, అదే గాలి, అదే నేల, అదే కాంతి, అదే నీరు, శతాబ్దాల సూఫీ కవిత్వం, 1901 నుండి నోబెల్ కవిత్వం, 1901 నుండి సాహిత్యంలో 13 మంది నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు, భరత వర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం, చర్యా పదాలు, మిణుగురులు (టాగూర్ Fireflies కు తెలుగు అనువాదం), ఇసుక నురగ (ఖలీల్ జిబ్రాన్ Sand and Foam కు తెలుగు అనువాదం), మియా కవిత్వం – అసోమియా ముస్లిం అస్తిత్వ స్వరం, బెంగాలీ బౌల్ కవిత్వం వంటి అనువాద కవితా సంపుటాలతో సహా అనేక పుస్తకాలు ప్రచురించారు.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, పెమ్మరాజు లక్ష్మీపతి గారి స్మారక పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం, అజో- విభో -కందాళం ఫౌండేషన్ వారి 2024 ప్రతిభా మూర్తి జీవితకాల సాధన పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు గెల్చుకున్నారు..