మహతి-61

8
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[అల ఢిల్లీలో విమానం దిగి బయటకొచ్చేసరికి కారులో వినోద్ కపూర్ ఎదురుచూస్తుంటాడు. ఆప్యాయంగా పలకరిస్తాడు. అది అతని సొంతకారు. కారు బయల్దేరాకా, ఓ బటన్ నొక్కుతాడు, ముందు సీట్‍కీ, వెనుక సీట్‍కీ మధ్య ఓ గ్లాస్ తెర వస్తుంది. మనం వాళ్ళని చూడగలం, కానీ వాళ్ళు మనల్ని చూడలేరు అంటాడు. చూస్తే మాత్రం ఏం, మనమేమీ చెడ్డ పనులు చేయడం లేదుగా అంటుంది అల. వినోద్ నవ్వేసి, తెరని తీసేస్తాడు. నేరుగా షూటింగ్ స్పాట్‍కి తీసుకువెళ్ళమని డ్రైవర్‍కి చెప్తాడు. షూటింగ్ గురించి మాట్లాడుకుంటారు కాసేపు. దారిలో భోజనం కోసం ఆగినప్పుడు అల తీసుకువచ్చిన పులిహోర, దోస ఆవాకయ, మాగయ పచ్చడి తింటారందరూ. వినోద్‍కి అవి బాగా నచ్చుతాయి. ఇప్పటి దాకా షూట్ చేసిన అల సీన్‍లన్నీ తానూ, డైరక్టర్ కలిసి చూశామనీ, చాలా బాగా వచ్చాయని చెప్తాడు. అల డ్రెస్ డిజైనింగ్ కోసం ఓ కాస్ట్యూమ్ ఎక్స్‌పర్ట్‌ని పిలిపిస్తున్నామని చెప్తాడు. ఉద్వేగంతో అలకి కన్నీరు రాగా, వినోద్ ఆమెని ఓదారుస్తాడు. కారులో ఆసుపత్రికి వెళ్తున్న కల్యాణి – మహతి గురించి, అల గురించి ఆలోచిస్తుంది. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తన తమ్ముడు ఫాలాక్షకిచ్చి పెళ్ళి చేస్తే అన్న ఆలోచన వస్తుందామెకు, కానీ వెంటనే ఆ ఆలోచనని తుడిచేస్తుంది. వాళ్ళిద్దరి లక్ష్యాలు ఉన్నతమైనవనీ, తన తమ్ముడి మనసు కూడా తనకి తెలియదని అనుకుంటుంది. ఆసుపత్రికి వెళ్ళి ఇందిరను పలకరిస్తుంది. మీకూ మహతికి ఎలా పరిచయం అని ఇందిర అడిగితే చెబుతుంది కల్యాణి. కాసేపు మాట్లాడాక, గౌతమ్ గారిని ఎందుకు పెళ్ళి చేసుకోలేదని కల్యాణి అడిగితే, ఇప్పుడున్నంత మూర్ఖత్వం, పట్టుదల అప్పుడు లేదని, అందుకని గౌతమ్ కోసం పట్టుబట్టలేదని అంటుంది. ఇంకాసేపు మాట్లాడుకుంటారు. కల్యాణి ఇందిరతో మాట్లాడడం చూసిన మహతి గది బయటకు వచ్చేస్తుంది. ఇంకో గదిలో ఊరు వెళ్ళడానికి అహల్య సూట్‍కేసులో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. వెళ్ళక తప్పదా అని మహి అడిగితే, తప్పదని, బాధ్యతలు చాలా ఉన్నాయని అంటుంది. తండ్రి మొహంలో ఎటూ చెప్పలేని బాధ కనబడుతుంది మహతికి. కాసేపటికి కల్యాణి అక్కడికి వచ్చి బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న అహల్యని చూసి ఆమెతో మాట్లాడాలనీ, ఆపాలని ప్రయత్నిస్తుంది. కానీ అహల్య నిర్ణయం మీద స్థిరంగా ఉంటుంది. వస్తానని భర్తకి చెప్పి బయటకు వచ్చేస్తుంది అహల్య. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-8

అహల్య:

[dropcap]మ[/dropcap]నిషి ఎప్పుడూ ఒంటరే. మహతి. కల్యాణి బస్సు స్టార్ట్ కాగానే వెళ్ళిపోయారు. కొన్ని దశాబ్దాలు నా తోడుగా ఉన్న గౌతమ్ ఇందిర దగ్గరున్నాడు. సురేన్ ఆర్మీలో ఏ కొండా కోనల్లోనో ఉంటే, కల్యాణీ నరేంద్రలు తాతతో ఉన్నారు. ఇప్పుడు నేను బస్సులో నా తోడుగా నేనున్నాను. నిజమైన తోడేదీ? పాదచారి అనే రచయిత రాస్తాడు, “నా నీడ నన్ను వీడి పోయిందే, నీ శ్వాసలోన అది చేరిందే, నేనున్న సంగతే మరచిందే ప్రేమా” అని ఓ పాటలో (‘ప్రేమదేశం’ సినిమాలోని ‘ప్రేమా ప్రేమా’ పాట).

చిట్టచివరి వరకూ తోడుండేది ఒక్క నీడ మాత్రమేగా! మనిషి ఉన్నంత కాలం నీడా ఉంటుంది. చీకట్లో కూడా ఉంటుంది. ఒక్కసారి లైటు వేస్తే ఆ చీకట్లో కూడా అది మనని అంటిపెట్టుకునే ఉండటం మనం గమనించగలం.

సరే చనిపోయాక? శవాన్ని పైకెత్తినా నీడ అలానే ఉంటుంది. అంటే శవానికీ నీడ ఉంటుంది. కాల్చి బూడిద చేసి ఓ సంచిలో పోస్తే, ఆ సంచికీ నీడ ఉంటుంది.

ఆ బూడిదని ఓ గుప్పెడు పైకి విసిరితే, క్రింద పడే ప్రతి ‘రేణువు’కూ కూడా నీడ వుంటుంది. కింద పడ్డ రేణువుని ‘శ్రావణి’తో మళ్ళీ పైకెత్తితే దానికీ నీడ ఉంటుంది. అంటే పుట్టినప్పుడు నించీ మట్టి మట్టిలో కలిసిపోయేదాకా మనతో ఉండేది మన నీడేగా!

ఆ నీడ ‘నన్ను మరచిపోయి నీ శ్వాసలో కలిసింది’ అంటాడు రచయిత. అచ్చం నాలాగే. ఇన్నేళ్ళపాటు నన్ను నేను మరచిపోయాను. అందరితోటీ జివితం అనుకుని ఆనందంగా (?) గడిపేశాను. అది నిజంగా ఆనందమేనా. ఆ క్షణాల్లో ఆ సమయాల్లో అది ఆనందమే. కానీ ఇప్పుడు.. ఒంటరిగా బస్సులో కూర్చుని పయనిస్తున్న యీ క్షణంలో? ప్రశ్న ఉంది, కానీ జవాబు లేదు. జవాబు తెలుసుకోవాలనే తొందరా లేదు. అసలు నేనేమిటో, నేవెవరో నేను ఆలోచించుకోవాలి.

హిందీలో ఓ పాట ఉంది. “కాలువలు నదుల్లో కలుస్తాయి. నదులు సముద్రంలో కలుస్తాయి.. మరి సముద్రం దేనిలో కలుస్తుందీ?” అని (ओह रे ताल मिले नदी के जल में ‘ఓహ్ రే తాల్ మిలే నదీ కే జల్ మే’ పాట, చిత్రం ‘అనోఖీ రాత్’. సంగీతం రోషన్. గానం ముకేశ్.)

నేను నదిలా ప్రవహిస్తున్నా. భర్త, పిల్లలు అనే కాలువలు నాతో కలిసి పయనిస్తున్నాయి. అనంతమనే సముద్రంలో కలిసిపోతూ. అప్పుడు ఎవరి కెవరూ? నేను వారిలో కలిసినా, వారు నాలో కలిసినా పయనం మరణం వరకే. ఆ తర్వాత? సముద్రం నీరు ఆవిరై, మేఘమై మళ్ళీ కురుస్తుంది. మరి నేనూ?

పిచ్చి పిచ్చి ఆలోచనలా ఇవీ? ఏడ్చే దానికంటే ఇలా ఆలోచనలలో గడపడమే మంచిది. అసలు ఎందుకు ఏడవాలీ? ఏ తప్పు చేశానని ఏడవాలీ?

ఎవరెవరి కోసమో కొన్ని వేల సార్లు చెమ్మగిల్లిన నా కళ్ళు, కన్నీరు కార్చిన నా కళ్ళు ఇవాళ నా కోసం ఎందుకు చెమ్మగిల్లలేదు? ఎందుకు కన్నీరు కార్చడం లేదు?

“మీరు బెజవాడకా?” ఆగిన బస్సులోకి ఎక్కి నా పక్కన కూర్చున్నామె అడిగింది. అవును అన్నట్టుగా తలాడించాను. నిజం చెబితే ఎవరితోటీ మాట్లాడాలనిపించలేదు.

“అమ్మయ్య.. బెజవాడ దాకా నాకు తోడుంటారన్న మాట. చూశారా, మా వారూ పిల్లలూ లేకుండా నేనిప్పటిదాక ఒంటరిగా ప్రయాణం చెయ్యలేదు. చచ్చే భయం వేసిందనుకోండి. ఆయనేమో ఆఫీసు ఆడిట్, పిల్లలేమో చదువుల్లో బిజీ. నేను బయల్దేరక తప్పలేదు” అన్నదావిడ. నా వయసే ఉండొచ్చు. కానీ కాస్త కుదమట్టంగా ఉంది. నగలూ అవీ బాగానే పెట్టుకుంది. పట్టు చీర.

“పాపం.. ఆయనకి అన్నీ ఎదురుగా పెట్టినా, వడ్డించుకోడం కూడా రాదు. అన్నీ దగ్గరుండి చూడాలి. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళేగా! పది రోజుల పాటు వాళ్ళు ఎలా ఉంటారో ఏమిటో?” మాట్లాడుతూనే ఉంది ఆవిడ. ఆవిడ అంటున్న ప్రతి మాటా నాకు కత్తులు గుచ్చుతున్నట్లు అనిపించాయి. నేనూ ఇలాగే ఉన్నానా. వండుతూ, వొడ్డిస్తూ, నన్ను నేను మరచిపోయి ఆయనకీ పిలల్లకీ పడీ పడీ సేవలు చేస్తూ, నేను ఒక్క క్షణం లేకపోతే వాళ్ళలే ఉంటారో, ఎన్ని ఇబ్బందులు పడతారో అని ఆలోచిస్తూ.. ఓహ్.. ఏమయిందిప్పుడు?

ఎవరి దారిన వారు బాగానే ఉంటారు. ‘నాకు ఇందిర కాదు, ఇన్నాళ్ళూ నన్నూ పిల్లల్ని చూసుకున్న నువ్వే ముఖ్యం’ అని ఒక్కమాట అనలేదు ఆయన. ‘అమ్మా నువ్వు వెళితే, నేనూ నీ వెంట వచ్చేస్తా’ అని మహతీ అనలేదు. అనరు. ఎందుకంటే వారి వారి ఆలోచనలు వారికి ముఖ్యం.

“మిమ్మల్నే.. ఏదో ఆలోచిస్తున్నారా?” అన్నదావిడ.

“సారీ.. ఏదో ఆలోచనే.. మీరేమన్నారో వినలేదు.. చెప్పండి” అన్నాను.

“మీ పేరేమని అడిగాను” అందావిడ నవ్వుతూ.

“నా పేరు అహల్య” అన్నాను.

“మంచి పేరు.. నా పేరు రుక్మిణి. మా ఆయన పేరు మధుసూదనరావు. ఆయన ఓ పెద్ద కంపెనీకీ మేనేజరు. నాకు ముగ్గురు పిల్లలు. చిత్రం చూశారూ, ముగ్గురూ ఆడపిల్లలే. రత్నాలనుకోండి. పెద్దది బి.టెక్ చదువుతోంది, రెండోది లా చదువుతోంది. మూడోది టెన్నిస్ ప్లేయరు. స్టేట్ ప్లేయర్” గర్వంగా అన్నది.

“నేనింకా మీ పిల్లలు చిన్న పిల్లలేమో అనుకున్నా” అన్నాను.

“చిన్న పిల్లలే గదండీ! కాఫీలు పెట్టుకోవడం కూడా రాదు. అమ్మా అమ్మా అంటూ ప్రతిదానికీ నన్నే పిలుస్తారు” మళ్ళీ గర్వంగా అన్నది.

ప్రతి ఆడదీ పెళ్ళయ్యాక భర్త తన మీద ఆధారపడటమే గ్రేట్ అనుకుంటుంది. బ్రష్ మీద పేస్టుతో సహా సర్వ సేవలూ చేసి మనిషి తన మీద ఆధారపడేట్టు చేసుకుంటుంది. కావాలని చేసుకోకపోవచ్చు. కానీ భర్త, పిల్లలు తన మీద ఆధారపడడాన్ని ఎంతో ఇష్టపడుతుంది. వన్ ఫైన్ మార్నింగ్ ఎవరి దారిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని పోయాక, ..ఇప్పుడు నా అవసరం ఎవరికీ లేదు అని మథనపడుతుంది.

అసలీ నైజం ఎప్పటిదీ? మొదటి నుంచీ ఆడదాని స్వభావమే ఇదా! ఆలోచిస్తున్నాను. నేనూ ఇన్నేళ్ళుగా చేసింది అదే పని గదా! వాళ్ళందరూ నా మీదే ఆధారపడ్డారనుకున్నాను. ఆయనకి తేడా తెలుస్తుందో కూడా తెలీదు. మహతి కథ వేరు. అది ఎక్కడైనా ఉండగదు. ఓ సుదీర్ఘమైన నిట్టూర్పు.

“మళ్ళీ మీరు ఏదో ఆలోచిస్తున్నారు. సరే లెండి. మిమ్మల్ని విసిగించను..” చిన్నబుచ్చుకుని అన్నది రుక్మిణిగారు.

“అయ్యో.. అదేం లేదండీ.. మీలాగే నేనూ ఇద్దరు చిన్న పిల్లల్ని హైద్రాబాదులో వదిలి రావల్సి వచ్చింది.” కావాలనే అన్నాను.

“సారీ.. సారీ.. మీరు వాళ్ళని ఎంత మిస్ అవుతున్నారో మీ ఆలోచనల్లోనే కనబడుతుంది. ఏమైనా, మన ఆడవాళ్ళు జీవితాలే వేదనే. పిల్లలతో ఉన్నంతసేపూ పని చెయ్యలేక విసుగొస్తుంది. వాళ్ళని వదిలి వెళ్ళాలంటే బెంగలో పిచ్చెక్కుతుంది” నిట్టూరుస్తూ అన్నది రుక్మిణి. నాకేం చెప్పాలో తోచలేదు.

“ఏమిటోనండీ. పిల్లలుగా ఉండేప్పుడు ఒక బాధ. వాళ్ళు ఎదిగాక ఇంకో బాధ. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి చేసి పంపాలంటే మరో బాధ. అన్నట్టు మీ ఎరికలో సంబంధాలు ఏమైనా ఉన్నాయండీ? మా పెద్దది బి.టెక్ చదువుతోంది. పిల్లవాడు ఖచ్చితంగా ఇంజనీరో డాక్టరో అయిండాలి. అన్నట్టు ఆ పిల్లాడికి కూడా పెళ్ళి కావాల్సిన అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములూ లేకపోతే మహాప్రసాదం. ఎందుకంటే, పిల్లా చదువుకున్నదేనండీ. రేపు ఉద్యోగం చేస్తే దాని సంపాదననంతా వాళ్ళకి పోదూ! అందుకే జాగ్రత్తలు” అన్నది రుక్మిణిగారు.

“నా ఎరికలో ఎవరూ లేరండీ. ఒక వేళ ఉన్న, వాళ్ళు పెళ్ళిని వాళ్ళే చేసుకోమని చెబుతా!” అన్నాను.

మహతి పెళ్ళి విషయంలో ఇక నేను కల్పించుకోదలుచుకోలేదు. చదువైనా పెళ్ళైనా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవడమే మంచిది. నేను చేసుకున్నది అన్నీ చూసుకునేగా! ఏమయిందీ? ఇందిర తాలూకు ఆలోచననే నాకు ముల్లులా గుచ్చుతోంది. నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంది, నేను వెళ్ళొస్తానని చెప్పాక కూడా ఒక్క మాట మాట్లాడలేదు. గుండెల్లో చెప్పలేని బాధ.

“అవునూ.. మీ పిల్లలు ఏం చేస్తున్నారూ?” కుతూహలంగా అడిగిందావిడ.

“చదువుతున్నారు” ముక్తసరిగా అన్నాను. నాకు కాసేపు మౌనంగా ఉండాలని ఉంది. వీలైతే కళ్ళు మూసుకుని ఏ ఆలోచనా లేకుడా నిద్రపోవాలని ఉంది.

“అదృష్టవంతులు. చదవుతూ వున్న వాళ్ళైతే మీతో ఇంకొన్ని సంవత్సరాలు ఉంటారు. అదే పెళ్ళి యీడు వచ్చిన వాళ్ళనుకోండీ, ఎప్పుడు వెళ్ళిపోతారో అని భయమూ బాధా కూడా నేను అనుభవించడం లేదూ! అసలు మన పిల్లలు మన దగ్గరే ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా?” ఉత్సాహంగా మాటలు పొడిగిస్తోంది ఆవిడ. మొహమాటంతో కఠినంగా జవాబు చెప్పలేక పోతున్నాను.

“ముగ్గరి పిల్లలకీ పెళ్ళి చేసి అల్లుళ్ళని ఇల్లరికం తెచ్చుకోవాలని నా కోరిక. కుదురుతుందంటారా?” అడిగింది.

“అది మీకున్నఆర్థిక స్తోమత, వియ్యంకుల వియ్యపురాళ్ళ నుదుటి రాత మీద ఆధారపడి వుంటుంది..” అన్నాను.

“డబ్బుకేం తక్కువ లేదు” ధీమాగా అంది.

“అయితే మీ అల్లుళ్ళ తల్లిదండ్రులు ఖర్మ” అన్నాను చికాగ్గా.

“అదేంటీ అలా అంటారు?” అంది.

“మీరు ఆడపిల్లల్ని ఎలా కన్నారో, వాళ్ళు మగపిల్లల్ని అలాగే కన్నారు. అల్లుడు ఇల్లరికం రావాలని మీరెంత కోరుకుంటున్నారో, వంశాన్ని నిలబెట్టే పొందికైన పిల్ల వాళ్ళింటికి కోడలిగా రావాలని వాళ్ళు అంతే అనుకుంటారు. మీ వృద్ధాప్యం మీ పిల్లల చేతుల్లో గడిచిపోవాలని మీరెలా అనుకుంటారో, వాళ్ళ వృద్ధాప్యం పిల్లల చేతుల్లో గడపాలని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ మీరే కాదు, వాళ్ళూ పిల్లల మీద ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులే. కొడుకుల్ని ప్రయోజికుల్ని చేసిన తల్లిదండ్రులే. ఎదిగి ఫలాలిస్తున్న చెట్టుని ఎవరో మీలాంటి వాళ్ళు గద్దల్లా తన్నుకుపోయి ఇల్లరికం అల్లుళ్ళని చేసుకుని ఆస్తులు ఇస్తామంటే డబ్బు యావ గల పెళ్ళికోడుకులు సంతోషించవచ్చునేమో గానీ, తల్లిదండ్రులు మాత్రం పది జన్మలకు సరిపడే శాపనార్థాలు పెడతారు” చాలా తీవ్రంగానే అన్నానని నాకే తెలుస్తోంది. అంతగా పరిచయం లేని వారి దగ్గర అంత ఆవేశం తగునా నాకు.

“అబ్బ.. అచ్చు మా వారు మాట్లాడుతున్నట్టే ఉందండీ, మీరు మాట్లాడుతుంటే. ఆయినా లోకం ఏమనుకంటే మనకెందుకు అహల్యాగారూ. నా పిల్లలు నా దగ్గర ఉంటే నాకు సంతోషం. ఇల్లరికం ఇష్టమైన వాళ్ళే వస్తారు” అన్నది రుక్మిణి.

“ఇటువంటి ఆలోచనలు తల్లులకి మాత్రమే ఉంటాయనుకుంటాను. మగవాళ్ళు తాను కూతుళ్ళ తమ దగ్గరే ఉండాలీ, అల్లుళ్ళు ఇల్లరికం రావాలనీ కోరుకోరు” స్తబ్ధుగా అన్నా. వివరించి ఉపయోగం లేదనుకున్నప్పుడు సైలెన్స్ బెస్టు పద్దతి.

“అవుననుకోండీ..! మీ పిల్లలు చదువుకుంటున్నారు అన్నారుగా.. ఏం చదువుతున్నరూ? అన్నట్టు మీ వారేం చేస్తారూ?” అంది.

“అన్నీ మీకు వివరంగా చెబుతాను.. కానీ.. నాకు ముందు ఒక గంట రెస్టు కావాలి. సరేనా?” అన్నాను, అది కాస్త మర్యాదకరం కాకపోయినా.

“సరే.. సరే.. పాపం.. రాత్రి నిద్రపోలేదనుకుంటాను. నేనూ అంతే. పిల్లల్ని విడిచి వచ్చే ప్రతి తల్లికి నిద్ర వుంటుందీ! పడుకోండి పడుకోండి” అన్నది అనునయంగా. ఆమెలో ఒక అమాయకత్వం అప్పుడు నాకు అనిపించింది. వేరొకరు అయితే నా మాటలకు హార్ట్ అయ్యేవారు.

కళ్ళు మూసుకుని పడుకున్నాను.

వచ్చే ముందు నేను ఇందిర గదిలోకి వెళ్ళడం.. ఆమె నేను చెప్పంది విని తల కూడా తిప్పకుండా తిరుగుతున్న ఫేన్ వంక చూడటం నాకు గుర్తొకొచ్చింది. అంత అహంకారమా!

బలవంతంగా నా మనసుని మరల్చుకున్నాను. లోపల్లో నా చిన్నతనాన్ని, అమ్మనీ నాన్ననీ గుర్తుంచుకునే ప్రయత్నం చేశాను. ఎంత ఏకాగ్రత సాధించాలని ప్రయత్నించినా ఆ ఇందిరా, గౌతమ్, మహతి, ఆ హస్పటల్ నాకు మనసుని వదిలి పెట్టడంలేదు.

నేను వచ్చేస్తున్నానన్నాక అసలు మహతి అక్కడ ఎందుకుండాలి? అంటే, నాకు తెలియని విషయాలు మహతికి ఏమైనా తెలుసా? లేదా, ఇందిర ఏమైనా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందా? ఆ బెదిరింపు అందరం వుండగానే చేసిందిగా? కొత్తదేం కాదుగా. మహి నా బాధ అర్థం చేసుకోగలదు. అయినా అక్కడే ఉందంటే? బోలెడు ప్రశ్నలు. జవాబు లేని, జవాబు రాని ప్రశ్నలు, మెల్లగా నిద్రాదేవి కరుణిస్తున్నట్లు అనిపించింది.

***

చాలా సేపు నిద్రపోయాననుకుని వాచీ చూసుకునంటే, నేను నిద్రపోయింది గంట మాత్రమే. అలసిపోయిన మనసు గాఢమైన నిద్రలోకి జారుకుంటుందని తెలిసింది. పక్కన రుక్మిణిగారు పుస్తకం చదువుతోంది. నేను లేవటం చూసి, “అహల్యగారూ, మీ రెంత గాఢంగా నిద్రపోయారో తెలుసా? అస్సలు కదల్లేదు. నాకెంత భయం అనిపించిందంటే నిముషానికోసారి మీరు గాలి పీలుస్తున్నారో లేదో అని గమనిస్తున్నాను. అమ్మయ్య!” అని తృప్తిగా నిట్టూర్చింది.

“అంత కంగారెందుకూ?” అన్నాను.

“కంగారు కాక? బస్సు టైరు పేలి అరగంట సేపు రోడ్డుకి అడ్డంగా ఆగిపోయింది. అటూ ఇటూ చెవులు పగిలేలా హారన్లు, ఓహ్. టైరు మార్చి మళ్ళీ బస్సుని దారిలో పెట్టడానికి నలభై నిముషాలు పట్టింది” నావంక ఆశ్చర్యంగా చూస్తూ అన్నది రుక్మిణిగారు.

షాక్ తినడం నా వంతైంది. అంత గందరగోళంలో నేను మొద్దులాగా నిద్రపోయానా? అని.

“సారీ!..” అన్నాను.

“సారీ ఎందుకు లెండి. ఓ సారి నేనూ మా అత్తగారూ మామగారూ బస్సులో ప్రయాణిస్తున్నాం. మా మామగారు మధ్యలో ఓ స్నేహితుడ్ని కలవాలని దిగారు. నేనూ మా అత్తగారు ప్రయాణం కంటిన్యూ చేశాం. కరెక్టుగా గంటలోపే మా అత్తగారికి హార్టెటాక్ వచ్చింది. దేముడా. ఆ సంఘటన వెయ్యి జన్మల దాకాక గుర్తు లోనే ఉంటుందనుకోండి. బస్సుని ఓ చిన్న పల్లెలో ఆపేశాడు డ్రైవరు. నరకం అంటే నరకం అనుభవించాం.. ఎక్కడికెళ్ళాలో ఎవరి దగ్గర కెళ్ళాలో.. అత్తగార్ని ఎలా హాస్పటల్ చేర్చాలో అని” ఆవిడ మొహంలో ఇప్పుడు కూడా ఆ టెన్షన్ చూశా.

“తరువాత?”

“ఆ బస్టాండులో పేసింజర్ అంటే పల్లె వెలుగులు తప్ప ఎక్స్‌ప్రెస్‌లు ఆగవుట. అదృష్టవశాత్తూ ఓ ప్రయివేట్ వేన్ వాళ్ళని ఆపగలిగాను. రామకృష్ణా మఠం భక్తులున్నారు. దేవుడు పంపినట్లు వాళ్ళలో ఓ డాక్టరున్నాడు. వేన్‌లో ఎక్కించి మరో ఊళ్ళో హాస్పటల్‍కి తీసికెళ్ళి వైద్యం చేయించే వరకు ఆ పెద్దాయన అంటే డాక్టర్ గారు మాతోనే ఉన్నారు.

‘అయ్యో మీ యాత్ర మధ్య లోనే ఆగింది’ అని నేను బాధపడుతుంటే, ‘కృష్ణుడు అందరిలోనూ ఉన్నాడమ్మా. కేవలం మధురలోనో, రేపల్లోలోనూ లేడు. ఆ దేవుడ్ని అన్నీటా అంతటా చూడొచ్చు’ అని నవ్వారు. అహల్య గారూ, అప్పటిదాకా కళ్ళు తెరుచుకోని నా మనస్సుకి ఆ మాటలు చూపునిచ్చాయి” భక్తిగా అంది రుక్మిణిగారు.

నా మనస్సు తేలికపడింది. అవునుగా! చిన్నగా నిట్టూర్చాను. ఏదెలా జరగాలో అలాగే జరగనీ!

తరువాత మా మధ్య స్నేహం పెరిగిందనే చెప్పాలి. ‘ఇల్లరికం’ విషయంలో తప్ప మిగతా విషయాల్లో ఆవిడ బోళా మనిషే. మా మాటల్లో సినిమాలూ రాజకీయాలూ వంటలూ అన్నీ దొర్లాయి. నా అదృష్టం ఏమింటే ఆవిడ వక్త నేను శ్రోతని.

“అవును అహల్యగారు, మీరెప్పుడైనా ప్రేమించారా?” అన్నది ఆవిడ గడుసుగానూ, చిలిపిగానూ.

“లేదండీ” అన్నాను.

“నేను ప్రేమించా. అబ్బో.. తలములకలుగా అనుకోండి” అన్నది తన్మయంగా.

“ఓహ్.. చెప్పండి” అన్నాను.

“నేను ప్రేమించింది మా బావనే. మా అత్తామావలకి ఇష్టం లేదు. నేనేమో రంగు తక్కువ. మా బావ పచ్చని మేరిసే రంగు. నాది 10th క్లాసు. బావది గొప్ప చదువు. అయిదారు డిగ్రీలున్నాయి. నేను అందంలో సామాన్యం. మా బావ చాలా అందగాడు” ఆగింది రుక్మిణి.

“పెళ్ళయిందా మీ ఇద్దరికీ?” అన్నాను కుతూహలంగా.

“అయింది. కానీ మామూలుగా కాదు. నేను చస్తానని బెదిరించి భయపెట్టి మరీ పెళ్ళి చేసుకున్నా” గర్వంగా అందావిడ.

“అలా ఎందుకూ?” అడిగాను.

“పుట్టినప్పుడు సంగతలా ఉంచితే, పెరిగేటప్పుడు మా వాళ్ళు ‘నీ మొగుడేడే’ అంటూ బావని చూపించేదాన్ని. ‘నీ మొగడు పేరేంటే?’ అంటే బావ పేరు చెప్పేదాన్ని. బావా నన్నే చూపించి నా పేరే చెప్పేవాడు, నీ పెళ్ళాం ఎవరని అడిగితే” ఆగింది రుక్మిణి.

“మరి ఆత్మహత్య దాకా ఎందుకు పోవల్సి వచ్చిందీ?” అడిగా.

“డబ్బు చేస్తున్న కొద్దీ మనుషులు మనసులు దూరమై, మా అత్తామామలు అలాగే మారి, గొప్ప గొప్ప సంబంధాలు చూడ్డం మొదలెట్టారు. అప్పుడు నేననుకున్నా, యీ సమయం దాటితే బావ నాకు దక్కడని. ఎట్లాగొట్లా బెదిరించి బ్రతిమాలీ వాళ్ళని పెళ్ళకి ఒప్పించా!” ఆవిడ కళ్ళల్లో ఓ వెలుగు.. ఓ గర్వం.

“ఎలా?”

“మా బావకి నేనంటే ప్రాణం అని నాకు తెలుసు. కానీ పెద్ద వాళ్ళ ముందు కుండ పగలగొట్టలేడు కదా!” నవ్వింది రుక్మిణి.

“ఇప్పుడు మీతో ఎలా ఉంటారూ?”

“బాగా ఉండక తప్పుతుందా? మగవాడి చుట్టూ ఆకర్షణలే. కరిగిపోకుండా చూసుకోవల్సింది ఆడదేగా! నేను చూడ్డానికి పిచ్చిదాన్లా ఉంటాను గానీ, మా బావని అనుక్షణం కనిపెడుతూనే ఉంటాను” నవ్వింది రుక్మిణి.

ఠక్కున ఓ ప్రశ్న అడగాలనిపించింది. అడగలేకపోయాను. ఇందిర లాంటి మనిషి తన బావ జీవితంలోకి వస్తే రుక్మిణికి ఏం చేస్తూందీ అనే ప్రశ్నని అడగలేక, పెదవుల చాటున దాచుకున్నా.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here