[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
దేవ త్వత్సేవకాః సర్వే స్వగృహోత్కంఠితాశయాః।
దేశకాలావనాలోచ్య కథయన్త్య సుఖప్రదమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 95)
హే ప్రభూ! మీ సేవకుల మనస్సు వాళ్ల ఇళ్ల వైపు మళ్ళింది. లేకపోతే, ఇలా ముందూ వెనుక ఆలోచించకుండా, నష్టం కలిగించే అసుఖప్రదమైన మాటలు మాట్లాడరు.
అందరూ హాజీఖాన్‍ను కశ్మీరుపై దండయాత్రకు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారు. కానీ మంత్రులు మాత్రం ఇతరుల సలహాలకు వ్యతిరేకమైన సలహానిస్తున్నారు. నీ సేవకులు కశ్మీరుకు దూరంగా ఉండటం వల్ల విసిగి ఇళ్ళకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. లేకపోతే ముందూ వెనక ఆలోచించకుండా ఇలాంటి సలహాను ఇవ్వరు అని హాజీఖాన్‌ను హెచ్చరిస్తున్నారు.
కథమభ్యన్తరం యామః సతి రాజ్ఞి బలోర్జితే।
ప్రదీప్తం వ్యోమ్ని మార్తాండం కుండేన పిదధాతి కః॥
(శ్రీవర రాజతరంగిణి, 96)
ఆకాశంలో సూర్యుడికి ఎవరు అడ్డుపెట్టి ఆపగలదు? అలాగే కశ్మీరులో శక్తిమంతుడైన రాజు ఉన్నంత వరకూ కశ్మీరులో ఎవరైనా ఎలా అడుగుపెట్టగలరు? సూర్యుడిని కొబ్బరి చిప్పతో అడ్డు పెట్టి ఆపగలరా? అని అడుగుతున్నారు మంత్రులు. అంత శక్తిమంతుడు జైనులాబిదీన్. జైనులాబిదీన్ కశ్మీరులో జీవితుడై ఉన్నంత వరకూ ఎంతటి వీరుడైనా కశ్మీరు వైపు కన్నెత్తి చూడలేడు. కాబట్టి ఎవరెంతగా ప్రగల్భాలు పలికినా, కశ్మీరుపై దాడి చేసి గెలవగలటం అసంభవం అన్న మాటను నిర్మొహమాటంగా చెప్తున్నారు. మంత్రులు అన్న వారు ఎంతటి అప్రియమైన సత్యానయినా చెప్తారు. వారు రాజు శ్రేయస్సును మాత్రమే కాంక్షిస్తారు. ఇతరులు ఎంతగా రాజును ఉత్తేజపరచి చెడు దారిలో ప్రయాణింప చేయాలనుకున్నా మంత్రులు రాజుకు నిజానిజాలు చెప్తారు. అంతా విన్న తరువాత రాజు తన నిర్ణయం తీసుకుంటాడు.
(ఇంకా ఉంది)