[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘దీదీ’ (Didi 1959) చిత్రం కోసం ముకేశ్, సుధా మల్హోత్రా పాడిన పాట. సంగీతం సుధా మల్హోత్రా.
~
సినిమా గీతాలకు సాహితీపరంగా పెద్దగా గుర్తింపు లేదు. సన్నివేశ ప్రాధాన్యంగా మాత్రమే వచ్చే సినీ గీతాలను సాహిత్యాన్ని గంభీరంగా అధ్యయనం చేసే సాహితీ పిపాసులు అంతగా ఇష్టపడరు. కావ్యాలలోని లోతు కవిత్వంలోని అనుభూతితో పోలిస్తే సినీ గీతాల స్థాయి తక్కువ అని చాలా మంది కవులు అభిప్రాయపడతారు. దానికి విరుద్ధంగా సాహిర్ గీతాలలో మనకు ఓ కబీర్, ఓ కృష్ణ శాస్త్రీ, ఓ శ్రీశ్రీ, ఓ దినకర్ కనిపిస్తూనే ఉంటారు. సినీ పాటకు ఒక ఫార్మాట్ ఉంటుంది. పతి ఒక్కరూ దానికే కట్టుబడి పాటలు రాస్తారు. కాని ఈ ఫార్మాట్‌ను ఎన్నో సార్లు బద్దలుకొట్టి తాననుకున్నట్లు రాసి ఆ పాటను ప్రజలకు చేరువ చేసినవాడు సాహిర్.
ఇక ప్రేమ గీతాలలో ఆయన చేసినన్ని ప్రయోగాలు మరే గేయ రచయిత ఆ స్థాయిలో చేయలేదన్నది నిజం. ప్రేమలో పడడం, స్త్రీ పురుషుడిని, పురుషుడు స్త్రీని కోరుకోవడం సహజం. కాని కొందరు తమ జీవితంలో కొన్ని ఆశయాలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరు వ్యక్తులను ప్రేమించరని కాదు కాని ఆ ప్రేమ కన్నా తమ జీవితాన్ని నమ్మిన ఆశయాల కోసం పని చేయడానికి ఉపయోగించుకోవడం వారి కర్తవ్యం అని నమ్ముతారు. ప్రస్తుత వ్యవ్యస్థలో అలాంటి మనుష్యులు కనిపించడం తక్కువ. కాని ఒకప్పుడు సమాజంలో ప్రజా పోరాటం ప్రధాన పాత్ర వహిస్తున్న నేపథ్యంలో తమ వ్యక్తిగత జీవితాలను వదులుకుని సమాజంలోకి వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. వీరికి సామాజిక పోరాటం ముందు తమ వ్యక్తిగత ఆనందం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. తమ వ్యక్తిగత సుఖం వీరికి అనవసరమైనదిగా కూడా కనిపిస్తుంది. అలా అని వీరు ప్రేమను తక్కువ చేస్తారని, ప్రియురాలిని విలువలేనిదిగా తీసిపారేస్తారని కాదు. వారి దృష్టిలో వ్యక్తిగత ప్రేమ కన్నా మించినది తాము నెరవేర్చవలసిన సామాజిక బాధ్యత.
విప్లవకారుల గురించి చెబుతూ చే గువెరా ఓ సందర్భంలో ఇలా అన్నాడు “నిజమైన విప్లవకారుడు గొప్ప ప్రేమ భావంతో నిండి ఉంటాడు. విప్లవకారుడిలో ఆ తీవ్రత లేకుండా ఉండడం అసాధ్యం. ఏదైనా గొప్ప పని చేయాలంటే అందులో అభిరుచి ఉండడం అవసరం. కాని విప్లవ బాటలో అభిరుచితో పాటు ధైర్యం పెద్ద మోతాదులో అత్యవసరం”. అంటే విప్లవకారులు సమాజం కోసం సర్వం పరిత్యజించే వ్యక్తులలో ప్రేమ భావం అధికంగా ఉంటుంది. వారి లోని ధైర్యం వారికి ఒంటరితనాన్ని ఎదుర్కునే శక్తిని ఇస్తుంది. ఆ శక్తి వారికి తమ జీవితంలో దొరికే వ్యక్తిగత ప్రేమను గౌరవిస్తూనే దాన్ని దాటుకుని ముందుకు వెళ్లడం నేర్పిస్తుంది.
ఆ శక్తిని ఎరిగినవాడు సాహిర్. తన జీవితంలో దొరికిన ఈ వ్యక్తిగత ప్రేమను అతను ఆస్వాదించాడు, గౌరవించాడు. కాని దానికి కట్టుబడిపోయి, తన పరిధిని కుచింపజేసుకుని సమాజంతో మమేకం అవ్వాలనే తన కోరికను వదులుకోలేకపోయాడు. దాన్ని ఎంతో స్పష్టంగా ఎన్నో సందర్భాలలో వివరించాడు. అతనిలోని ఆ స్పష్టతను ప్రకటించే ఓ అద్భుత గీతం ఇది. ఫైజ్ మహమ్మద్ ఫైజ్ రాసిన ‘ముఝ్సె పెహలీ సీ ముహబ్బత్ మెరి మెహబూబ్ నా మాంగ్’ లో వినిపించే ఆ స్పష్టత సినీ గీతంలో చొప్పంచడం చాలా కష్టం. ఆ పనిని ఈ గీతంలో అతి గొప్పగా చేసిన వాడు సాహిర్.
తుం ముఝే భూల్ భీ జావో తొ హె హక్ హై తుమ్ కో
మెరి బాత్ ఔర్ హై మైనె తొ ముహబ్బత్ కీ హై
ఆమె అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది. కాని అతను ఆ ప్రేమకు మౌనమే సమాధానంగా ఇచ్చాడు. ఆమెను దాటుకుని పోవాలని అతను చూస్తున్నాడు. దానికి ఆమె బాధపడుతుంది.
కాని తనలోని దుఃఖాన్ని ఆమె ఎలా ప్రకటిస్తుందో చూడండి. “నువ్వు నన్ను మరచిపోయే హక్కు నీ కుంది. నా సంగతి వేరు నేను నిన్ను ప్రేమించాను.” ఈ వాక్యంలో ఎంత గొప్పగా ఓ ప్రేమికురాలి నిరాశను సాహిర్ వర్ణిస్తున్నాడో చూడండి. అతను ఆమెను ప్రేమించలేదు. ఆమెను స్వీకరించడం లేదా తిరస్కరించడం అన్నది అతని హక్కు. ప్రేమ లేనప్పుడు హక్కులే ప్రధానం అవుతాయి. అతను తన హక్కును ఉపయోగించుకుంటున్నాడు. ఆమె పరిస్థితి అది కాదు. ఆమె అతన్ని ప్రేమించింది అందుకనే హక్కుల ప్రసక్తి ఇక్కడ రాదు. ఆమె అతన్ని మరచిపోలేదు. ప్రేమ ఆమె సర్వ హక్కులను హరించింది. ప్రేమకు లొంగిపోయిన ఆమె అతన్ని ఎప్పటికీ మరచిపోలేదు, అతనిపై ఆమెకు హక్కు లేనందున తనను ఎందుకు మరచిపోతున్నావని అడగలేదు. ఈ స్థితిని ఎంత గొప్పగా రెండంటే రెండు సరళమైన వాక్యాలలో సాహిర్ పొందుపరిచాడో. ఆ తరువాతి గీతం ఇలా సాగుతుంది.
మెరె దిల్ కీ మెరె జజ్బాత్ కీ కీమత్ క్యా హై
ఉల్ఝె ఉల్ఝె సె ఖయాలాత్ కీ కీమత్ క్యా హై
మైనె క్యో ప్యార్ కియా తుమ్నె న క్యో ప్యార్ కియా
ఇన్ పరేషాన్ సవాలాత్ కీ కీమత్ క్యా హై
తుం జొ యె భీ న బతావో తొ యె హక్ హై తుంకో
మెరి బాత్ ఔర్ హై మైనె తొ ముహబ్బత్ కీ హై
తుం ముఝె భూల్ భీ జావో తొ యె హక్ హై తుమ్ కో
నా మనసుకు, నా భావోద్వేగాలకు విలువ ఏముందని, గందరగోళంలో పడేసే ఈ ఆలోచనలకు ఎంత విలువుందని, నేనెందుకు నిన్ను ప్రేమించాను, నువ్వెందుకు నన్ను ప్రేమించలేదు? ఇలాంటి ఆందోళన కలిగించే ప్రశ్నలకు విలువెంతని? వీటికి సమాధానాలు నువ్వు చెప్పదల్చుకోకపోవడానికీ నీకు హక్కు ఉంది. నా సంగతి వేరు నేను నిన్ను ప్రేమించాను. నన్ను మరచిపోయే హక్కు మాత్రమే నీకుంది.
సాహిర్ ఈ చరణంలో వాడిన పదాలు ఎంత చిన్నవో అంత లోతైనవి “మైనె క్యో ప్యార్ కియా తుమ్నె న క్యో ప్యార్ కియా” కేవలం న జోడించి ఈ వాక్యానికి ఎంత బలాన్ని ఇచ్చాడంటే ఈ వాక్యం వస్తున్నప్పుడు అక్కడ మనసొక్క క్షణం బాధగా మూలుగుతుంది. సాహిర్ నిజంగా పదాల మాంత్రికుడు, ఓ చిన్న మార్పుతో ఆ వాక్యంలో ఎంతటి విషాదాన్ని నింపుతాడో. ఆమె తిరస్కారానికి గురి అయిన స్త్రీ అయినా ఆమెలో ఎంత నిబ్బరం, ఎంత పరిణితి, ఎంత ఆత్మాభిమానం కనిపిస్తుందో. తనలోని అలజడిని బైటపెట్టుకుంటూనే దానికి అతనికేమీ సంబంధం లేదని ఓ చురక అంటిస్తుంది. అతను ఆమెను ప్రేమించలేదు కాబట్టి ఆ బాధ అతనికి అనవసరం. ఆమెను కాదనే హక్కు మాత్రమే అతని స్వంతం కాని ఆమె ఎలా ఉండాలో చెప్పే అధికారం అతనికి లేదు అని ఆమె ఎంత సున్నితంగా ప్రస్తావిస్తుందో. అలాగే ఆమె ప్రేమను ప్రశ్నించే హక్కు, విమర్శించే హక్కు అతనికి లేదు. కేవలం ఆమె ప్రేమను తిరస్కరించగలడు అతను అంతే. ఈ మాటలలో ఎంత బాధ, ఎంత బాధ్యత, ఎంత గౌరవం ఉందో, ఇన్ని భావాలను అంత హుందాగా ఓ తిరస్కృత నోట ఒక్క సాహిర్ మాత్రమే పలికించగలడు. అది అతని గొప్పతనం.
ఇంతలా గాయపడిన ఆ హృదయానికి ఆ యువకుడు జవాబివ్వలేకుండా ఎలా ఉండగలడు? అందుకని అతను ఇలా అంటాడు.
జిందగీ సిర్ఫ్ ముహబ్బత్ నహీ కుఛ్ ఔర్ భీ హై
జుల్ప్-ఒ-రుఖసార్ కీ జన్నత్ నహీ కుఛ్ ఔర్ భీ హై
భూఖ్ ఔర్ ప్యాస్ కీ మారీ హుఈ ఇస్ దునియా మే
ఇష్క్ హీ ఎక్ హకీకత్ నహీ కుఛ్ ఔర్ భీ హై
తుం అగర్ ఆంఖ్ చురావో తొ యె హక్ హై తుంకో
మైనె తుమ్సె హీ నహీ సబ్సె ముహబ్బత్ కీ హై
తుం అగర్ ఆంఖ చురావో తొ యె హక్ హై తుంకో
జీవితం కేవలం ప్రేమ మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది. కురులు చెక్కిళ్ల స్వర్గమే జీవితం కాదు అంతకు మించినది చాలా ఉంది. ఆకలి దాహాలతో అట్టుడుకుతున్న ఈ ప్రపంచంలో ప్రేమ ఒక్కటే నిజం కాదు ఇంకా ఆలోచించవలసినవి చాలా ఉన్నాయి. అయినా నా నుండి చూపులు తిప్పుకునే హక్కు నీకుంది, నేను ఒక్క నిన్నేకాదు అందరినీ ప్రేమించాను.
ప్రేమ మైకంలో పడ్డవారు తట్టుకోలేని కఠోమైన వాస్తవికతను ఆతను ఎంత సహజంగా సరళంగా చెప్పాడో. అతనికి ఆమె అంటే ఇష్టం లేదా అంటే ఉంది. కాని ఆకలి బాధతో కృంగి కృశించి బాధపడుతున్న ప్రపంచాన్ని కూడా అతను అంతగానూ ప్రేమించాడు. వారందరి కోసం ఏదో చేద్దామనుకుంటున్నాడు. అందుకే వ్యక్తిగత ఇష్టాలను పక్కకు నెట్టేస్తున్నాడు.
తుమ్ కొ దునియా కె గమ్-ఒ-దర్ద్ సె ఫుర్సత్ నా సహీ
సబ్ సె ఉల్ఫత్ సహీ ముఝ్ సె హీ ముహబ్బత్ నా సహీ
మై తుమ్హారీ హూ యహీ మెరె లియె క్యా కమ్ హై
తుమ్ మెరె హోకె రహొ యె మెరి కిస్మత్ నా సహీ
ఔర్ భీ దిల్ కొ జలావొ యె హక్ హై తుమ్ కొ
మెరి బాత్ ఔర్ హై మైనె తొ ముహబ్బత్ కీ హై
తుమ్ ముఝె భూల్ భి జావొ తొ యె హక్ హై తుమ్ కో
అతని జవాబు విన్న ఆమెకు తామెప్పటికీ కలవమని అర్థం అవుతుంది. దాన్ని మౌనంగా స్వీకరిస్తూ, “నీకు ప్రపంచపు విషాదం నుండి తీరక చిక్కదు. అందరిపై నీకు ప్రేమే, నాపైనే మోహం లేదు. నేను ఎప్పటికీ నీ దాన్నే అన్న నిజం ఒక్కటి చాలు నాకు. నువ్వు నావాడవయ్యే అదృష్టం మాత్రం నాకు లేదు. నా మనసును ఇంకా బాధించే హక్కు నీకు ఉంది. నా సంగతి మాత్రం వేరు ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను” అంటుంది.
ఇద్దరు ప్రేమికులు తమ దారులు కలవవని చెప్పుకుంటూ తమ మనసుల్ని ఇలా ఒకరితో ఒకరు పంచుకోవడంలో ఎంత పరిపక్వత ఉందో. ప్రియురాలిని అంత కన్నా ఉన్నతమైన ఆశయాల కోసం కాదంటున్న అతనిలోనూ ఆమెపై ప్రేమ కనిపిస్తుంది. కాని తనను తాను సమాజానికి అర్పించుకున్న వ్యక్తి అతను. ఆమె అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది. మరొకరిని తాను స్వీకరించలేననీ అతనికి చెబుతుంది. అందుకే నువ్వు ఎప్పటికీ నా వాడవే అని కూడా అంటుంది. అతను తనను స్వీకరించినా లేకపోయినా, ఆమె అతన్ని తన వాడుగా నిర్ణయించుకుంది. అతనిచ్చే బాధను మౌనంగా స్వీకరిస్తుంది. అతను తనవాడు కాకపోయినా తాను అతని సొంతం అని స్పష్టంగా అంటుంది ఆమె.
ఈ పాటలో విషాదం ఉంది. రెండు అద్భుతమైన వ్యక్తిత్వాల పరిచయం ఉంది. అందుకే ఇది గొప్ప పాట. సాహిర్ నాయికా నాయికల వీడ్కోలు గీతాల్లో కనిపించే లోతు మనసులను నేరుగా చేరుతుంది. ముఖ్యంగా అందులో ఆయన వాడే పదాలు, చేసిన పదప్రయోగాలకు పరవశించని వారుండరు. ఈ పాటలో ఆ రెండు హృదయాలు ప్రదర్శించే మానవతావాదానికి ఎవరైనా తల వంచాల్సిందే. సాహిర్ గీతాలలోని సంస్కారం, నిండుతనం అబ్బురపరుస్తాయి. అందుకే ఎందరు గేయ రచయితలు ఉన్నా వారందరి మధ్యన సాహిర్ ప్రదర్శించే రాజసం వేరు. అతని స్థాయి వేరు.
మై తుమ్హారీ హూ యహీ మెరె లియె క్యా కమ్ హై
తుమ్ మెరె హోకె రహొ యె మెరి కిస్మత్ నా సహీ..
ఇది కదా ప్రేమంటే..
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)