[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]
వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:
వాక్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.
ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.
శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.
ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.
వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్ధాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.
వాక్కులు
~
181
రచ్చ చెయ్యకుండా రమ్యత విరిసింది.
“పువ్వు”
182
అభిప్రాయాలకు అతీతంగా అత్యున్నతమైంది వ్యక్తమైంది.
“వెలుగు”
183
అనుకోవడాన్ని దాటుకుని అవసరమైంది సాగుతోంది.
“నది”
184
విశ్లేషణకందని విషయం తనరారుతోంది.
“ఆకాశం”
185
భావజాలాలకు బలి అవని భవ్యత బాఱులు తీరింది.
“పక్షులు”
186
కళంకంలేని కళారూపాలు సత్ఫలితాల్ని ఇచ్చేందుకు మసలుతున్నాయి.
“మేఘాలు”
187
మేధకు దూరంగా సత్యాలు నిలబడి ఉన్నాయి.
“కొండలు”
188
జనాలు తెలుగు కవుల్ని తరిమి, తరిమి కొడుతున్నారు.
“భవిష్యద్ఘటన”
189
తెలుగులో మూర్ఖులు, దుష్టులు, దద్దమ్మలు రాద్ధాంతం చేస్తున్నారు.
“సాహిత్యం, కవిత్వం, విమర్శ”
190
తెలుగులో బూతు, విదేశీ మతం, కులోన్మాదం, వక్రత, భ్రష్టత్వం పెనవేసుకుపోయాయి.
“కవిసంగమం, కవిసమ్మేళనం”
191
అభిప్రాయాల్ని మోసుకుంటూ ఉండడంవల్ల క్రుంగి, కృశించిపోతోంది.
“మధ్యతరగతి”
192
అభిప్రాయాలతో అలమటించడమే బతుకు అని నిర్ధారణ ఐంది.
“మధ్యతరగతి”
193
తనకే పనికిరాని తీరులో తాను తెగ ఊగిపోతోంది.
“మధ్యతరగతి”
194
అభిప్రాయాలతో బరువెక్కాక బాధ తగ్గడం లేదు.
“మధ్యతరగతి”
195
మెలకువనిచ్చేందుకు వెలుగుతో ఉదయం వచ్చింది.
“వరం”
196
చీకటి మూగిందని నిన్న రాత్రి భూమి ఆగిపోలేదు, పని చేస్తూనే ఉంది.
“ఉదయావిష్కారం”
197
రహస్యమైన సమయాల్లో రమ్యత రూపొందింది.
“పుష్పోదయం”
198
కదలడంవల్లే లోకానికి జరగాల్సిన మేలు జరుగుతోంది.
“గాలి”
199
వేకువ కవితకు అసదృశమైన భావం ఉంది.
“వెలుగు”
200
పక్షి ప్రత్యగ్రంగా పాడుకుంటూ ఎత్తుల్లో సాగుతోంది.
“స్వచ్ఛత, స్వేచ్ఛ”
201
హృదయంగమంగా మౌనగానం పొద్దున్నే వీచింది.
“పరిమళం”
202
మళ్లీ మంచి జరిగింది.
“ఉదయం”
203
తెలుగులో మతవాద, కులవాద కవిత్వం అని సిగ్గులేకుండా అఱుస్తున్నాడు.
“భ్రష్టుడు”
204
గౌతమ బుద్ధుణ్ణీ వదల్లేదు, బురద పూశారు.
“కులగ్రస్తులు”
205
చదువు, ప్రతిభ, లేవని కులాన్నీ, మతాన్నీ పట్టుకున్నాడు
“తెలుగుకవి”
206
రెండంగుళాల రంధ్రం అని తెలుగు మహిళ విరచించింది.
“సాధికారత”
207
ఏ బడిలోనూ నేర్పించని తెలుగు పరిఢవిల్లుతోంది ఈనాడు.
“ఉపాధ్యాయులు, కవులు”
208
త్రాష్టులకు బూతు స్త్రీలే చిరునామాలు.
“ముసలాళ్లు”
209
సిగ్గులేని తనం తెలుగు పరువును తగలబెడుతోంది.
“హైకు, గజల్, రుబాయీ”
210
భ్రష్టత్వం, దుష్టత్వం పాదాలుగా నీచత్వం తాండవిస్తోంది.
“మనస్తత్వం”
(మళ్ళీ కలుద్దాం)