[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
331
వల్లమాలిన అభిమానముంటే చాలదు
కల్ల బొల్లి మాటలతో సరిపోదు
కల్లా కపటమెరుగని పాపలు
తల్లడిల్లే వాళ్ళని ఆదుకోవాలి
332
కాల యముడు కాచుకొని ఉంటాడు
పలు ప్రమాదాలు సృష్టిస్తుంటాడు
వీలు చూచుకొని కాటేస్తుండాడు
నలువైపులా చూచి ప్రాణాలను హరించేస్తాడు
333
పుట్టించుట, గిట్టించుట ప్రకృతి లక్షణం
పుట్టి జీవనం సాగించుట జీవి లక్షణం
నట్ట నడుమ స్వైరవిహారం చేస్తుంది జీవి
మట్టిలో కలిసి మాయం
334
పర్యావరణ పరిరక్షణ మానవుని విధి
కార్యాచరణ అంతే ముఖ్యం కదా
తరువులను బాగా పెంచి రక్షించాలి
నరులందరు ఆలోచించాలి
335
మనసులోని ఆలోచనలు అక్కడే చిక్కుకుపోతే
పనులు ఎలా గట్టెక్కుతాయి
తనువెలా స్పందించగలదు
కనుక ఆలోచన బైటపడాలి
336
బ్రహ్మ ముహూర్తం అంత గొప్పదా?
ముహూర్తం పల్లెలలో బాగుంటుంది
సహకరిస్తుంది వాతావరణం పనికి
వాహనాల రద్దీ ఉండదు, కాలుష్యం తక్కువే
337
కవితలు వ్రాయటం గొప్పా?
నవలలు చదివి ఉంటే వ్రాయటం తేలికే
లవ లేశమైనా స్ఫురణకు రావాలిగా
చవకబారు కవిత్వం బాగుండదు
338
టెక్నాలజీ యెంత ఉపయోగమో అంత నష్టం
నకిలీలు ఎన్నో చేయవచ్చు
చక చకా సైబర్ నేరాలు చేయవచ్చు
రక రకాల మోసాలకు మూలం
339
అరువుతో బాధలు ఎనెన్నో
బరువులు మోయలేకే కొందరు
కరువు కాటకాలతో కొందరు
పరువు పోయిందని కొందరు. ఎన్ని రకాల బాధలో
340
కాల మహిమను ఎవ్వరు ఊహించ లేరు
వేల ఏళ్ళనుండి ఇదే పరిస్థితి
కలలోనైనా ఊహించటం అసాధ్యమే
ఇలలో జరుగును ఈవిధంగా