[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘అలల నది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
సొంత కవితలు కొన్ని
ఇంకొన్ని అనువాద కవితలు
అన్నీ కూడా
ఒక చెట్టు కొమ్మకు పూసిన పూలే
వస్తువులో ప్రేమ సంఘర్షణ
లోకం బతుకు
శైలి విన్యాసాల అభివ్యక్తి
ఝళిపించే విచ్చుకత్తుల ఫోర్స్
అందవతో కురూపో అల్లిక జిగిబిగో తెలియని గజిబిజితనం
పొల్లో సొల్లో ఎదురుపడితే చెప్పాలి నన్ను బతికించే గాలికి
క్షణకాలపు మంట కాదు
కలకాలం నిలిపే వేడి
కన్నీటి ప్రవాహం తేనీటి విందు
బతుకు కవిత్వం బతికించే కవిత్వం
చీకటి వెలుగుల చిలికే కవ్వం
ఆత్మలోకి జొర్రడమే అనువాదం కాదు
నడకల జొప్పించడం మాటల వంటావార్పు యుక్తకేళీ
సుందర పదబంధాల అల్లిక
ధ్వనించే సృజనలో ప్రతిధ్వనించడమే
కొత్తదనం అనువాదం
ఏదైనా కావొచ్చు
అది ప్రపంచం గుండెలనుంచి పారి
ఈ మట్టిలో ఇంకిపోవడం
నా మట్టినుండి విశ్వ జనులలోకి ప్రవహించడం కవిత్వం
ఆటుపోట్ల నది తరగలే దాని పాదాలు