తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-12

0
4

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~
111.
జడమన్న నేది? నిద్రావస్థలోని సృష్టి
అడగి యున్నదందు నిద్రావస్థలో చైతన్యాగ్ని
విడువక పరసత్వ విద్యుద్దీప్తి
ఎడబాయక యందు చలించుచుండు – మంకుతిమ్మ!

112.
దాగియున్నది చైతన్యాగ్ని కణము హిమనగము నందు
తగ, స్థిమితంబుగ నిల్చియున్నదది భువి హితంబునకు
నగమది సుందర సాత్విక గాంభీర్యతల కాటపట్టు
ఆగమాది నిధియది – మంకుతిమ్మ!

113.
అణువుల గణింప గలడే విశ్వాన విజ్ఞాని
గణింప గలడే నాత డండగిన భూత శక్తిని
గణింప నలవి గాని దెదో దాగియున్నది దానివెన్క అగణిత తత్త్వమొకటి
గణుతింప మూలమిది – మంకుతిమ్మ!

114.
రూపురేఖల యందు వైవిధ్యత, క్రమ లక్ష్యంపు కొఱత, అస్ప
ష్టపు చిహ్నంబులు కానిపించిన నేమి, సృష్టిరచనా శిల్పమందు
అపరూప పరమాత్మశక్తి కుందునే, వీటివలన
యప్పరమేశ్వర తత్త్వము నందుంచవలె మన దృష్టి – మంకుతిమ్మ!

115.
క్రమముగ యాకసంబున మార్పు జెందెడి గాలి, మబ్బుల వోలె
క్రిమి బీజముల నుండి వచ్చెడి మత్స్య, మృగ, మునుజుల వోలె
క్రమ వివరంబులవి ఏవయినను సృష్టి విధానంబున
సమిసి పోనిది పరమాత్మ తత్త్వమొకటే – మంకుతిమ్మ!

116.
పరమాణువుల చేత ప్రపంచంబుల నిర్మించు
మరుగున నుండి సృష్టి యంత్రమును చలింపజేయు
చరించెడి లీలయందు నింపు చైతన్యము
పరతత్త్వ శక్తి యిది – మంకుతిమ్మ!

117.
నెలసి యున్నదే జీవము నీ ఒడలి యొక యంగమున మాత్రమున!
నెలసి యున్నదది యాపాద మస్తకము నందున
అల నెలసి వ్యాపించి యున్నది చైతన్యము విశ్వమునందున
అలేపన మీ సత్త్వము – మంకుతిమ్మ!

118.
రవి భువి చేత మాత్రన కాదీ
భువనంపు పోషణ, యుభయ సాకారము చేత,
వివిధ శక్తుల కలయిక చేతనే నది సాధ్యము, వాద
వివాదములకు చిక్కని సూక్ష్మమిది – మంకుతిమ్మ!

119.
మనయందరి ఆహారము, మనయందరి త్రాగునీరు
మనము పీల్చెడి గాలి, కప్పెడి వస్త్రము
లన్నియున్ భూమ్యాకాశపు కార్ఖానాల యుత్పత్తులే; జీవు
లన్నియున్ ఈ రెంటి శిశువులే – మంకుతిమ్మ!

120.
పాకమొకటి సాగుచున్నది నీలోన నిరంతరంబు
లోక వ్యవహారము లన్నియు నడగి యుండు అందు సూక్ష్మగతిని సకలంబు
యంత్రంబు పగిది, ఔ, గాదన్నను యన్నియు జరిగి తీరు
ఏ కారణంబున రచించెనో విరించి – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here