కథనం కొత్త ఫ్లేవర్ ఇచ్చిన సినిమా ‘మహారాజ’

0
3

[విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ అనే సినిమాని సమీక్షిస్తున్నారు డా. రాయపెద్ది వివేకానంద్.]

[dropcap]సి[/dropcap]నిమా మొత్తం అయిపోయి సాంకేతిక నిపుణుల పేర్లు స్క్రోల్ అవుతూ ఉన్నాయి. టీవి ఆర్పేయ్యాలని గానీ లేదా వేరే చానెల్ మార్చుకుని చూడాలని కానీ అనిపించలేదు. అసలు మన స్పృహలో మనం ఉంటే కద.

సమయం దాదాపు రాత్రి పదకొండు అవుతోంది. ఇంకా భోజనాలు చేయలేదని గానీ, వండిన పదార్థాలు డైనింగ్ టేబిల్ పై సిద్ధంగా ఉన్నాయి, వెళ్ళి కూర్చుని భోంచేయాలని గానీ గుర్తు రావటానికి మన స్పృహలో మనం ఉంటే కద.

ఇదిగో ఈ ఒక్క సీన్ అవ్వంగానే వెళ్ళి సినిమా పాజ్‌లో పెట్టి భోంచేసి వచ్చి మిగతా సినిమా చూద్దాం అని అనుకుంటూ అలాగే టీవీ స్క్రీన్‌కి అతుక్కుపోయాము అందరం.

మీదు మిక్కిలి కన్నుల వెంబడి సతతంగా జారి పోతున్న కన్నీళ్ళు. కళ్ళు మసక బారి టీవీ గానీ, ఆ టీవీ తెరపై వస్తున్న ప్రకటనలు గానీ కనిపిస్తుంటే కద. మన ప్రజ్ఞలో మనం లేము.

బాధ

దిగులు

ఆవేశం

కోపం

గుండెల్ని మెలిపెట్టేసే వేదన

కుర్చీలోంచి లేవబుద్ధేయలేదు. అసలు ఏ పని చేయబుద్ధవలేదు.

ఇటీవలి కాలంలో నన్ను ఇంతగా కలత పెట్టిన సినిమా ఇంకోటి లేదంటే నమ్మాలి. సంతాన భారతి దర్శకత్వంలో కమలహాసన్ నటించిన ‘మహానది’లో – కూతురు రొంపిలో ఇరుక్కుని తండ్రి విడిపించగా వచ్చేశాక ఆ పిల్ల కలవరింతలు విని పొగిలి పొగిలి ఏడ్చిన కమలహాసన్ నటన చూసి నేను ఏడ్చేశాను. నన్ను నేను సంబాళించుకోవడానికి కొన్ని రోజులు పట్టింది.

అదే విధంగా అంతకు ఒకట్రెండేళ్ళ ముందు చూసిన ‘కంకణం’ (మలయాళ చిత్రం ‘కౌరవర్’ తాలూకు తెలుగు డబ్బింగ్) లో తన కూతుర్ని కాపాడుకోవడానికి మమ్ముట్టి పడే వేదన నన్ను కంట తడిపెట్టించింది. ఆ సమయంలో దర్శకుడు జోషి పండించిన హూమన్ ఎమోషన్స్, మెలోడ్రామా అత్యంత సహజంగా  ఉండటం వల్ల ఇన్నేళ్ళైనా నేను మరవలేకున్నాను.

సీనియర్ నటుడు తిలకన్, మమ్ముట్టిల నటనకి జోహార్ చెప్పకుండా ఉండలేకపోయాను. అదే నేను మమ్ముట్టి నట విశ్వరూపాన్ని చూసిన మొదటి సందర్భం.

ఇక ‘మాతృదేవోభవ’ సినిమా గూర్చి కూడా చెప్పుకోవాలి కన్నీళ్ళు పెట్టించిన చిత్రాల జాబితాలో.

గాంగ్‌స్టర్ సినిమాలు అనంగానే అందరూ ‘నాయకుడు’ లేదా ‘గాడ్ ఫాదర్’ల గూర్చి చెబుతారు. యాదృచ్ఛికంగా నేను ఆ రెండూ చూడలేదు.

నన్ను ఎమోషనల్‌గా అత్యంత ప్రభావితం చేసిన గ్యాంగ్‌స్టర్ మూవీ మహేష్ భట్ కాంప్ నుంచి వచ్చిన ‘గాంగ్‌స్టర్’. ఈ సినిమా గూర్చి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే, నేను ఇటీవల ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ చూసి దిగ్భ్రమకి గురయ్యాను.

ఇలా కూడా ఉంటారా మనుషులు.

‘హే భగవాన్! నీవు కల్కి రూపంలో వస్తావో దత్తావతారంలో వస్తావో, ప్రవక్తగా వస్తావో, దేవపుత్రుడిగా వస్తావో నాకు తెలియదు. వెంటనే వచ్చేయి. ఈ పాడు సమాజంలో నరరూప రాక్షసులుగా సంచరిస్తున్న ఒక్కొక్కడినీ ముక్కలు ముక్కలుగా నరికేయి. లేదా వాడేవడో రాజకీయ నాయకుడు చెప్పినట్టు పదిహేను నిమిషాలు పోలీసులని పక్కన పెట్టేయి, నాకు అపరిమితమైన శక్తులు ఇవ్వు, ఈ నరరూప రాక్షసులను అందర్నీ నేనే సంహరిస్తాను.

వద్దు నాకు ఇలాంటి సమాజం వద్దు.

వద్దు ఇలాంటి చీడపురుగులతో నిండిన ప్రపంచం వద్దు.

తన పిల్లలు, తన భార్య మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళంతా ఎలా పోయినా ఫర్వాలేదు అనుకునే మృగాలు ఉన్న ఈ లోకం నాకు వద్దు.’

ఇలా నా మనసు నిండా సుడులు సుడులుగా ఆలోచనలు.

ఇటీవలి కాలంలో నేను చూసి కంట తడి పెట్టిన సినిమా ఇదొక్కటే.

***

నేను పాపం చేశాను ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడకుండా. కనీసం ఓటీటీలో చూసి నా పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నాను.

మిత్రులు ఎందరో ఎఫ్‌బీ సాక్షిగా ఎలుగెత్తి ప్రశంసించారు వెండి తెరపై చూసి. ఊరికే పొగిడేస్తున్నారు, సరే ఎలాగూ ఓటీటీలో వస్తుంది కద, అప్పుడు చూడొచ్చులే అని ఆలసించాను.

విజయ్ సేతుపతి నటన అద్భుతం. అది నటన కూడా కాదు. అసలా తండ్రి మన ముందు అలా నిజంగా నిస్సహాయంగా నిలబడ్డాడు అనే అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా చూసినంతా సేపు.

ఎక్కడా నాటకీయత లేదు.

అనురాగ్ కాశ్యప్ కొన్నాళ్ళు ప్రజల ముందుకు రాకపోవటమే మంచిది. నిజంగానే అతన్ని పట్టుకుని కొట్టగలరు జనాలు.

మిగతా ఇద్దర్నీ సునాయాసంగా హతమార్చి అనురాగ్ కాశ్యప్‌ని అంతమొందించటానికి సిద్ధమైన సమయంలో విజయ్ సేతుపతి మొహంలో ఆందోళన మనల్ని అయోమయానికి గురి చేస్తుంది.

అప్పుడు ఇచ్చాడు దర్శకుడు ట్విస్టు.

మిత్రుడు తమిళ సినీ విమర్శకుడు ఒకరు, ఈ సినిమాలో రెండు సందర్భాలలో వచ్చిన త్రాచుపాము ఎపిసోడ్ గూర్చి పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు.

అదొక్కటే కాదు, ఈ సినిమాని మళ్ళీ కొత్త కోణంతో చూడాలిరా నాయనా అనిపించే విధంగా ప్రతి సీన్ గూర్చి కొత్త విశ్లేషణలు ఇచాడు.

దర్శకుడు నిదిలన్ సామినాధన్ సామాన్యుడు కాదురా నాయనా అని తీరుతాము ఈ సినిమా చూశాక.

చివరికొచ్చే వరకు ఇది పగ ప్రతీకారం ఆధారంగా అల్లుకున్న కథ అని అర్థం కాదు.

హాస్య చిత్రంలా సాగుతుంది దాదాపు సగం వరకు.

చెత్త బుట్ట కథేంటి అన్న ఉత్కంఠ మనల్ని సరదాగా ఆకట్టుకుంటుంది.

మొదటి సగం సాదా సీదాగా సాగినప్పటికి బిగి కోల్పోకుండా తీశాడు దర్శకుడు.

చివరి సీన్‌లో “అమ్ము అమ్మూ” అంటు తన కూతురికై తపన పదే తండ్రిని చూసి ఒక నిమిషం మనం విచలితులం అయినా ‘వీడికి ఇలాగే కావాలి’ అని ఖచ్చితంగా అనుకుంటాము.

ఈ సినిమా కథ సాదా సీదాదే అయినప్పటికి పకడ్బందీగా వ్రాసుకున్న కథనం ఈ సినిమాకి ఒక కొత్త ఫ్లేవర్ ఇచ్చింది.

ఇంతకూ జానర్ ఏమిటి అని అడిగాడు మిత్రుడు నా ఉత్సాహం చూసి.

హాస్యమా కాదు

గాంగ్‌స్టర్ మూవీనా కాదు కాదు

పగ ప్రతీకారమా కాస్త అవును

ఇవన్నీ కాదు, ఇది అసలు సినిమా కాదు. ఇది ఒక ఎమోషన్.

***

నేను, నా కుటుంబం బాగుంటే చాలు. మిగతా వాళ్ళు అందర్నీ నాశనం చేసైనా సరే నా భార్యని నా బిడ్డని బాగా చూసుకుంటాను అనే భావన రాక్షస గుణంనుంచి వస్తుంది.

అలా కాదు. అందరు బాగుండాలి. వసుధైక కుటుంబకం అన్న భావన దైవీ సంపద ఉన్న మనసు నుంచి వస్తుంది.

“నువ్వు ముఖ్యం. నీవే ముఖ్యం. ఎదుటి వాళ్ళు ఏమైపోయినా ఫర్వాలేదు, నీవు బాగుపడు. నీవు ధనికుడివి అవ్వు” అనే తరహా శుష్క నినాదాలు ఇస్తూ యువతని పెడత్రోవ పట్టిస్తున్న చౌకబారు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రెయినర్లు అందరూ కూడా తమకి తెలియకుండానే ఈ చిత్రంలోని సెల్వ పాత్ర లాంటి వ్యక్తులతో సమాజాన్ని నింపుతున్నామని తెలుసుకుంటే మంచిది.

నిజం నిష్ఠూరంగా వుంటుంది మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here