దాతా పీర్-21

0
3

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[సాబిర్ వెళ్ళిపోతాడు. రోజు గడిచిపోతుంది. సాబిర్ వచ్చి వెళ్ళాక తనలో కలిగిన అలజడిని దాతా పీర్ సమాధి వద్ద నిలుచుని ఆయనని ప్రార్థించి తొలగించుకుంటుంది అమీనా. ఫజ్లూ ఆరోగ్యం క్షీణిస్తోంది. అమీనా చున్నీకి పోన్ చేయగా, కలకత్తా నుంచి చున్నీ వస్తుంది. మర్నాడు బబితా, రాధేల సాయంతో ఫజ్లూని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుస్తారు. చుట్టుపక్కలా వాళ్ళంతా సాయం చేస్తారు. వీలు దొరికితే ఇంటికొచ్చి స్నానమదీ చేసి మళ్ళీ ఆసుపత్రికి వెళ్తోంది రసీదన్. కబ్రిస్తాన్ పనీ, ఇంటి పనీ అమీనా చూసుకుంటుంది. తనకి తెలియకుండానే అమీనా పూర్తిగా రసీదన్ పాత్రలోకి ఇమిడిపోతుంది. శవాలు రావటం, అమీనా కబ్రిస్తాన్‌లో పనులన్నీ రసీదన్ లాగే నిర్వహించటం – అన్నీ సహజంగా జరిగిపోతాయి. ఫజ్లూ ఆరోగ్యం కొద్దిగా మెరుగవుతుంది. రసీదన్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు సత్తార్ మియ్యా – రసీదన్ ఇంట్లోకి దూరి – అమీనాని వేధిస్తాడు. తనతో వచ్చేయమంటాడు. అమీనా అరుస్తుంది. ఆ అరుపులకి రాధే లోపలికి వచ్చి సత్తార్ మియ్యా చెంపపై కొట్టి, బయటకు పంపేస్తాడు. సాబిర్‍కి పెళ్ళి చేయాలన్న ఆలోచనలు రాగానే అత్తలిద్దరూ తమ తమ బంధువుల అమ్మాయిల గురించి ఆలోచిస్తారు. పెద్దత్త అన్న కూతురు, మెట్రిక్ చదివినామె ఉంది, కానీ ఆ అమ్మాయి సాబిర్‍ని చేసుకోనని చెప్పేస్తుంది. మామలిద్దరూ పెళ్ళి గురించి ఒత్తిడి చేస్తే, తాను అమీనాని ప్రేమించినట్టు, ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్తాడు సాబిర్. ఇప్పుడిప్పుడే సంగీతంలో ఎదుగుతున్న సాబిర్‍కు అమీనా తగదని, ప్రేమే కావాలనుకుంటే, సంగీతాన్ని ప్రేమించమని పెద్ద మామయ్య చెప్తాడు. సాధన కొనసాగుతుంది. కొత్తగా సాబిర్‍కు ప్రాధాన్యం పెరగటం ఆ బృందంలోని కొందరికి నచ్చదు. సంగీత ప్రపంచంలో ఇలాంటి ఇబ్బందులొక వైపూ, అమీనా దూరమైపోతూందన్న బాధ మరో వైపూ – సాబిర్ సతమతమైపోతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-12 – మూడవ భాగం

[dropcap]ఫ[/dropcap]జ్లూ ఆరోగ్యం మరింత దిగజరిపోతూందిప్పుడు! ఆసుపత్రి నుండీ ఇంటికి వచ్చినప్పుడు ఆరోగ్యం, ఇదివరకటి కంటే కాస్త మెరుగ్గా ఉండేది కానీ మళ్ళీ మెల్లి మెల్లిగా మునుపటిలాగే తయారైంది. చాతీలో కఫం మళ్ళీ నిండి పోతున్నది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. ఊపిరి పీల్చిన ప్రతిసారీ, గుర గుర శబ్దం వస్తూంది. పడుకున్నా, లేచినా సుఖం లేదు. డబ్బు లేకపోవటంతో డాక్టర్ వ్రాసిచ్చిన మందులు తేవటమే లేదు. రసీదన్ ఎముకల ఆసుపత్రి నుంచీ మందులు తీసుకుని వచ్చి వేస్తూంది. ఫజ్లూను చూసుకునే బాధ్యతంతా అమీనా మీదే పూర్తిగా పడింది. రసీదన్ శిథిలమైన శరీరం, మరింత శిథిలమైంది, ముక్కలు ముక్కలుగా పగిలిపోయిన మనసు ఆమెను మరింతగా అలసిపోయేలా చేస్తూంది.

సాబిర్, పీర్ ముహానీ గోరీల గడ్డకు చేరుకున్నప్పుడు ఎండ తీవ్రంగా ఉంది. సూర్యుడు నడినెత్తినున్నాడు. ఢిల్లీ వెళ్ళేందుకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఏవో కొనేందుకు సుల్తాన్ గంజ్ నుండి సబ్జీ బాగ్‌కు వచ్చాడు. కానీ అక్కణ్ణించీ పీర్ ముహానీకి చేరుకున్నాడు. ముందుగా ఫజ్లూ గదికి వెళ్ళాడు. ఫజ్లూ పక్కమీద పడున్నాడు. సాబిర్‌ను చూసి ఫజ్లూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సాబిర్‌కు మాటల్లేవు. ఫజ్లూ కళ్ళు మూసుకుని, సాబిర్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సబ్జీ బాగ్ నుండీ ఫజ్లూ కోసం తెచ్చిన పళ్ళక్కడే పెట్టి, అలాగే కాసేపు కూర్చుని, సాబిర్ మెల్లిగా బైటి కొచ్చాడు.

అక్కణ్ణించీ ఇంటి ముంగిట్లోకి వచ్చాడు. అమీనా వంట వండి, వరండాలో కూర్చుని, పొయ్యిలో ఆరిపోతున్న బొగ్గులను చూస్తూంది తదేకంగా!

ఇద్దరి కళ్ళూ కలిశాయి. అతన్ని చూసిన అమీనా కళ్ళల్లో ఆశ్చర్యమూ లేదు, అసహ్యమూ లేదు. ఎదురు చూపు అసలే లేదు. అమీనా లేచింది. సాబిర్ మెల్లిగా దగ్గరికొచ్చాడు. చెక్కబల్ల మీద కూర్చోమని సైగ చేసింది అమీనా. ఇంతకు ముందు చున్నీ పడుకునే చోటు ఖాళీ అయింది. అక్కడ ఇప్పుడు ఒక పొయ్యి ఏర్పాటు చేసుకున్నారు. వంట సామానక్కడే పెట్టుకుని వంట అక్కడే చేస్తూంది అమీనా. ఆ పొయ్యిలోనే ఆరిపోతున్న బొగ్గులున్నాయిప్పుడు!

‘అత్తెక్కడ?’ సాబిర్ అడిగాడు.

‘ఎక్కడికో వెళ్ళింది.’

‘ఎక్కడికి?’

‘ఎక్కడికెళితే నీకేంటి? ఆమె తలమీద వంద బరువులున్నాయ్.’ అమీనా పైకి శాంతంగా కనిపిస్తూంది కానీ మనసు లోపల వర్ష కాలపు నది తాకిడికి ఒరుసుకుని పోతున్న తీరపు మట్టిలా జారిపోతూ, నీటిలో కలుస్తూ!!

కాసేపు మౌనం. తరువాత అడిగింది, ‘చాయ్ తాగుతావా?’

‘ఆ..’ చిన్న నిట్టుర్పుతో సాబిర్!

అమీనా లేచింది. పొయ్యిలో చాయ్ తయారయ్యేంత నిప్పు మాత్రమే ఉంది. గిన్నెలో నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి అక్కడే కూర్చుంది.

‘ఫజ్లూ ఒళ్ళస్సలు బాగాలేదు. మందులేస్తున్నారా?’సాబిర్ మాటలు ప్రారంభించాడు.

‘ఇప్పుడింక వాడి ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మకం కూడా లేదెవరికీ! అల్లా తాలా ఎలా దారి చూపిస్తాడో? ఫజ్లూ కూడా బతుకుమీద ఆశ వదులుకున్నాడు. అందరూ ఓడిపోయాం. మందులు వేస్తూనే ఉన్నాం. ఎముకల ఆస్పత్రి నుంచీ మందులు తెస్తూందమ్మ.’ చాయ్ కోసం పెట్టిన నీళ్ళు మరిగిపోతుంటే, అమీనా అందులో చాయ్ పొడి, చక్కెరా వేసి,చంచా తో కలిపింది.

‘నా చాయ్‌లో పాలు వేయొద్దు.’

‘పాలు లేవు కూడా!’ వెనక్కి తిరిగి అమీనా అడిగింది. ‘నీకు పాల్లేని చాయ్ అసలిష్టం లేదే ముందు?’

సాబిర్ ఏమీ మాట్లాడలేదు. అమీనా చాయ్ ఇచ్చింది. ఇద్దరూ చాయ్ తాగుతున్నారు.

చాయ్ తాగేసి సాబిర్ అడిగాడు, ‘ఎప్పటిదాకా వస్తారత్త?’

‘నాకు తెలీదు. తొందరగా ఉంటే వెళ్ళిపో! తనెప్పుడొస్తుందో తెలీదసలు.’

‘తొందరంటే.. రేపు ఢిల్లీ వెళ్ళాలి, అందుకే..!’ సాబిర్ మధ్యలోనే ఆగిపోయాడు.

నిజంగానే సాబిర్‌కు తొందరగా ఉంది. రేపు పొద్దున్నే బయలుదేరాలి. ఇంకా ఎన్నో పనులు పూర్తి చేసుకోవాలి. ఇక్కడినుంచీ కన్నౌజియా సేఠ్ దగ్గరికెళ్ళాలి. చినమామయ్య అక్కణ్ణించీ ముత్యాల పరిమళపు అత్తరు తీసుకుని రమ్మని చెప్పారు. విమానంలో మొట్టమొదటిసారి వెళ్తున్నాననీ, పెద్ద ఉత్సవంలో తను షెహనాయి వాయించాలన్న అమీనా కోరిక కూడా తీరబోతోందనీ అమీనాకు చెప్పాలనుంది. కానీ చెప్పలేకపోతున్నాడు. సాబిర్ ఆలోచనలో పడ్డాడు. ఇవన్నీ కాకుండా ఇంకో విషయం కూడా చెప్పాలనుకున్నాడా తను?

మెట్రిక్ వరకూ చదువుకున్న చిన్నత్త చెల్లెలి కూతురితో తన పెళ్ళి గురించి మాటలు నడుస్తున్నాయనీ చెప్పాలనుకున్నాడా? లేదా అమీనానే తను పెళ్ళి చేసుకుంటానని చెప్పగానే వాళ్ళు, తాను నూర్ మంజిల్‌లో ఉండాలంటే, ఎవరో గోరీలగడ్డ పిల్లతో పెళ్ళి కుదరనే కుదరదని అన్నారని చెప్పాలనుకున్నాడా? లేక తాను నూర్ మంజిల్ వదిలిపెట్టేసి వచ్చి, అమీనాతోనే బతకాలనుకుంటున్నానని చెప్పాలనుకుంటున్నాడా?

‘మొహమాటమొద్దు సాబిర్! తొందరుంటే వెళ్ళిపో! ఇది కబ్రిస్తాన్. ఇక్కడికొచ్చిన తరువాత, చనిపోయిన వాళ్ళు మాత్రమే ఉంటారు. తక్కినవాళ్ళు ఇక్కడుండటానికి రారు. తిరిగి వెళ్ళిపోవటానికే వాళ్ళొస్తారు. వెళ్ళు సాబిర్! వెళ్ళి నీ పనులు నువ్వు చూసుకో!’ అమీనా ముఖమ్మీద ఒక చిత్రమైన నవ్వుంది. బాధను కప్పి ఉంచిన నవ్వది.

‘నన్ను కూడా శవమనే అనుకో!’

‘వద్దొద్దు సాబిర్ మియ్యా! అల్లా దయుంచాలి, నువ్వు శవం కావద్దు. బతికుండగానే శవమయ్యేందుకు ధైర్యం కావాలి సాబిర్! శవాల్లాగా బతకడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఇంకొక్క మాట విను సాబిర్! దాతా పీర్ మసీదు దగ్గర కూర్చుని నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావ్. సరిగ్గా అక్కడే గొయ్యి తీసి, నీ అమీనాను పాతిపెట్టేశాను.’ అమీనా లేచింది. సాబిర్ తాగిన చాయ్ గ్లాస్‌ను పాత్రలు కడిగే చోట పెట్టేందుకు తీసుకెళ్ళింది.

సాబిర్ కూడా లేచాడు. ప్యాంట్ జేబులోనుంచీ తన పర్స్ తీసి అందులోంచీ ఐదువందల రూపాయల నాలుగు నోట్లు తీసి అమీనా చేతిలో బలవంతంగా పెట్టే ప్రయత్నం చేస్తూ, ‘దీన్ని అత్తకివ్వు. ఫజ్లూకు మందులు కొనొచ్చు. తీసుకో అమీనా!’ అనేశాడు.

అతని చెయ్యి విదిలించుకుని అమీనా ముంగిట్లోకొచ్చింది. ఎటువంటి ఆవేశమూ లేదు. అరవటమూ కాదు. కానీ నెమ్మదిగా మేఘంలా గంభీరంగా అన్నది, ‘వెళ్ళిపో సాబిర్! మమ్మల్ని ఋణగ్రస్థులను చేయొద్దు, మాపై దయ పెట్టి వెళ్ళిపో!’

సాబిర్ చేతిలో నోట్లు! కళ్ళు నేలను చూస్తూ! తన షెహనాయీ నుంచీ వెలువడిన వక్ర రాగం లోని ని స్వరం, సప్తమం లోకి వెళ్ళి మొండిగా అక్కడే నిలిచిపోయినట్టుగా అమీనా గొంతు వినిపిస్తున్నది సాబిర్‌కు!

***

సాబిర్ పీర్ ముహానీలో ఉన్నప్పుడు, రసీదన్ షాహ్ అర్జా దర్గాలో తన మేనమామ కొడుకు సమదూ ఫకీర్ దగ్గరుంది. మర్రి చెట్టు కింద చిక్కని నీడలో అక్కడున్న చప్టా మీద ఇద్దరూ కూర్చుని ఇదివరకటిలాగే, మాట్లాడుకుంటున్నారు. మరో వైపు దర్గా లోపలికి వచ్చి వెళ్ళేవారి సందడి. ముసలి రోజ్ వుడ్ చెట్టు తొర్రలోనుండీ ఒక చిన్న పిట్ట మాటిమాటికీ బైటికొస్తూంది. కుళాయి మీద కూర్చుంటుంది కాసేపు, మళ్ళీ తుర్రున తొర్రలోకి వెళ్ళి దూరిపోతూంది. కుళాయి ఎండిపోయింది. ఈ మునిసిపాలిటీ కుళాయిలో నీళ్ళు రాక చాలాకాలమైంది. ఎదురుగా ఉన్న నీటి మడుగు దగ్గరే వచ్చిన వాళ్ళంతా నీళ్ళు తాగుతారు, ప్రార్థనలు చేస్తారు. అక్కడ తడి ఉంది. నీటి మడుగు దగ్గరే ఒక చిన్న గుంట ఏర్పడింది. దాని నీళ్ళలో కొన్ని తుంటరి పిట్టల గుంపు తానాలు చేస్తూంది. నీళ్ళ బిందువులు ఎగిరెగిరి పడుతున్నాయి.

సమదూ ఫకీర్, రసీదన్ చేతుల్లో చాయ్ కప్పులున్నాయి. రసీదన్ అంటూంది, ‘ఇప్పుడు అలసిపోయాయి సమద్, దేహం, మనసు రెండూ..!’

‘అత్తా! నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావ్. నేనేమో నీ మాటలు విని, ఫజ్లూ కొచ్చిన కష్టం గురించి ఆలో చిస్తున్నాను. అందరూ తమ వంతులో వచ్చినవన్నీ అనుభవించాల్సిందే! నువ్విలా కుంగిపోయేందుకు ఇది సరైన సమయం కాదు. అతడికి అతని కష్టాలనుంచీ విముక్తిని ప్రసాదించమని అల్లా తాలాను ప్రార్థించు.’ సమదూ కళ్ళు దూరమెక్కడో నిలిచిఉన్నాయి. బహుశా తన పాత రోజుల చిత్రాలు కళ్ళముందు నిలిచాయేమో! ఏదో వాయిద్యం, మధ్యమంగా, ఉదాసీనంగా వినిపిస్తూ ఉంటే అతను వింటూ దానిలోంచీ వినిపించే సమయ పద ముద్రలను తన చెవులతో బేరీజు వేస్తున్నాడా అనిపిస్తూ ఉంది.

‘ఫజ్లూ కష్టాన్ని ఇంక నేను చూడలేను. నా బిడ్డ ఎలా తట్టుకుంటున్నాడో మరి!’ రసీదన్ గొంతు వణుకుతూంది.

‘హు..’ ఒక చిన్న నిట్టూర్పుతో సమదూ రసీదన్‌ను చూశాడు సమదూ.

‘అమీనా కోసం కూడా దారేదీ తట్టటం లేదు. ఆమె జీవితం కూడా ముడివడిపోయింది. సాబిర్ ఇలా మారిపోతాడని అనుకోనేలేదు. సాబిర్ పట్ల ఉన్న నమ్మకం సడలిపోతున్నది. చున్నీని తలుచుకుంటేనే గుండె మండిపోయేది. అలాంటిది తనేమో అల్లా తాలా దయ వల్ల తన బతుకేదో తాను బతుకుతున్నది. అమీనా గుండెల్లో బరువును మోస్తూ, బతుకుతున్నది. బతకడమేంటి? లోపల్లోపల క్షణక్షణమూ పిగిలిపోతూంది. ఏమీ మాట్లాడదు. కానీ నాకన్నీ అర్థమౌతూనే ఉంటాయి. నా గుండెను కోసేస్తూ ఉంటుంది తన ఉదాసీనమైన ముఖం.’ దుఃఖాల మూటలా తయారైన రసీదన్ గుండెలనుండీ ఏడుపు ఉండుండి కారుతూంది.

లోతైన బావి నీళ్ళలో సుడిగుండం వచ్చినట్టు, సమదూ ఫకీర్ మనసులోనూ జ్ఞాపకాల వెల్లువ! వందల సంవత్సరాల కిందట బావి అడుగున నిద్రపోయిన ముసలి తాబేలు, దీర్ఘ నిద్రలో కాస్త మెలకువ వచ్చి, అటుకేసి తిరిగినప్పుడు, నీలి కళ్ళ చేపపిల్ల దాని కింద పడి, పెడబొబ్బలు పెట్టినట్టు, సరిగ్గా అటువంటి ఆర్తనాదం సమదూ గుండెల్లోనుంచీ! రసీదన్‌ను అడిగాడు సమదూ, ‘నీకు గుర్తుందా అత్తా? చాలా సంవత్సరాల కిందట, పీర్ ముహానీలో ఒక యువతి శవమొచ్చింది కబ్రిస్తాన్‌కు! ఉన్నట్టుండి పోలీసులొచ్చి, ఆ శవాన్ని పాతిపెట్టనివ్వలేదు. చిరాయీ ఘర్ తీసుకు వెళ్ళారా శవాన్ని! దాని తరువాత మళ్ళీ ఆ శవమొచ్చింది. పాతిపెట్టారు. గుర్తొచ్చిందా అత్తా? పోలీసులు ఆ అమ్మాయి నాన్నను అరెస్ట్ కూడా చేశారు, గుర్తొచ్చిందా?’

చటుక్కున రసీదన్‌కు ఆనాటి సంఘటనంతా కళ్ళముందు ప్రత్యక్షమైంది. ‘ఆ.. గుర్తుంది, ఫజ్లూ నాన్నే ఆ శవాన్ని పూడ్చిపెట్టాడు. చాలా హంగామా జరిగింది. ఆ పిల్ల తండ్రే గొంతు పిసికి చంపేశాడట! ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి అతనికి నచ్చలేదనీ, అందుకే యీ పని చేశాడనీ, అందరూ అనుకున్నారు. ఎవరా అమ్మాయి సమద్? నీకు తెలుసా ఆ పిల్ల?’

‘తెలుసత్తా! ఆ అమ్మాయిని పాతిపెట్టిన స్థలమెక్కడో నీకు గుర్తుందా అత్తా? చాలా సంవత్సరాలైంది కదా మరి? షబే బారాత్ రోజు ఎవరైనా వస్తారా అక్కడికి?’ సమద్ ఫకీర్ బొంగురు గొంతును గాలే సంబాళిస్తున్నట్టుంది.

‘షబే బారాత్ నాడు ఎవరైనా వస్తారో లేదో తెలీదు కానీ, ఆ అమ్మాయిని పాతిపెట్టిన స్థలమైతే గుర్తుంది. నైఋతి దిక్కులో పాతిపెట్టారు. రెండో రోజు ఆ శవాన్ని పోలీసులు తీసుకు వచ్చినప్పుడు, మగవాళ్ళెవరూ రాలేదు వెంట! ఒకావిడెవరో వచ్చిందంతే! ఆమెకూ ఆరోగ్యం బాగులేదనుకుంటా!! కబ్రిస్తాన్ బైట కూర్చుని ఏడుస్తూనే ఉంది పాపం. శవాన్ని పాతిపెట్టేందుకైన ఖర్చూ అదీ, ఆమే ఇచ్చింది’. రసీదన్ మధ్యలోనే మాటలాపేసింది. సమదూ ఫకీర్ ఎక్కడో ఆలోచనల్లో ఉన్నాడని తెలిసిందామెకు.

కాసేపు అలాగే మాట్లాడకుండానే ఉన్నాడు, సమదూ. స్వర్గం నుండీ దిగి, జూబీ ముఖం దగ్గరికొచ్చింది. చాలా దగ్గరికి! ఆమె ముఖాన్నే చూస్తూ ఉండిపోయాడు. సమదూ. నీలి ముఖంలో నీలి కళ్ళు!!

ఒకసారి మళ్ళీ దృశ్యం మారింది. నమాజ్ కోసం అజాన్ పిలుపు వినిపిస్తోంది. సమదూలో కదలిక వచ్చింది. రసీదన్ వైపు చూసి, ‘నమాజ్ సమయమైంది.’

‘నేనూ బయలుదేరుతాను. ఫజ్లూను వదిలిపెట్టి ఎక్కువసేపు ఉండటమూ మంచిది కాదు. అమీనా ఒంటరిగా భయపడుతూ ఉంటుందేమో! నువ్వు రాలేదింకా సమద్? ఎప్పుడొస్తావ్? ఒకసారొచ్చి నా కొడుకు నుదుటిమీద నిమురు! నీ ప్రార్థన ఫలిస్తుందేమో!’ రసీదన్ లేచింది.

‘వస్తానత్తా! మూడు నాలుగు రోజుల్లో వస్తాను.’ సమదూ ఫకీర్ రసీదన్ కు గేట్ దగ్గరిదాకా వెళ్ళి వీడ్కోలు పలికాడు. తరువాత మళ్ళీ నమాజ్ ముందు కాళ్ళూ చేతులూ శుభ్రం చేసుకునేందుకు కూర్చున్నాడు.

***

రసీదన్ ఇంటికొచ్చేసరికింకా ఫజ్లూ తన గదిలోనే అలాగే పడున్నాడు. ముంగిట్లోకి వచ్చి చూసింది. అమీనా తన పక్క మీద పడుకుని ఉంది. ఆమె వీపు ముంగిటి వైపుకుంది. ఆమె వెక్కిళ్ళు విని దగ్గరికొచ్చింది రసీదన్. ఏడ్చి ఏడ్చి, ముఖం పీక్కు పోయింది. ఎన్ని సార్లడిగినా బదులే లేదు.

బైటికొచ్చి రాధేనడిగింది ఎవరినా వచ్చారా అని.

‘ఆ.. వాడే, నీకిష్టమైన సాబిర్ వెధవ!’ అన్నాడు.

‘ఏమైందో ఏమో కానీ పిల్ల ఏడుస్తూనే ఉంది పక్కమీద పడి! ఏమీ చెప్పనూ చెప్పదు.’

‘ఏమో మరి! నీకూ ఆ సాబిర్‌కూ మాత్రమే తెలియాలంతే!’ ఆమె వైపు చూడకుండా రాధే మాట్లాడుతున్నాడు.

‘పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు రాధే! నా సొంత బిడ్డలాగే పెంచాను. ఇప్పుడొక్కసారి మెడబట్టి బైటికి గెంటేస్తానా? ఈ పిల్ల తప్పు లేదా మరి? ఎప్పుడొచ్చినా ఏదో ఈటెల్లాంటి మాటలని, బాధపెడుతుంది తనను! ప్రతిమాటా గుండెలో దాచిపెట్టుకుంటుంది. సాబిర్‌తో సరిగ్గా మాట్లాడదూ, సరిగ్గా..’

‘నువ్వేం తల్లివత్తా? కూతురి బాధ నీ కళ్ళకు కనిపించదా? ఆ దొంగ వెధవకీ అమ్మాయి బాధ అర్థం కాదా ఆ మాత్రం? ఇప్పుడు వాడికేంటి? రాజభోగాలనుభవిస్తున్నాడు. నువ్వేమో వాడెప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నావ్!’

‘నిన్ను కలిశాడా? మాట్లాడాడా?’

రాధే అన్నాడు వెనక్కి తిరిగి, ‘నేనా దరిద్రుడి ముఖాన ఉమ్మనైనా ఉమ్మను. మాట్లాడావా అని అడుగుతున్నావ్ నువ్వు! పోయినసారైతే కళ్ళు కప్పి వెళ్ళిపోయాడలాగే! ఈ సారి కూడా పదడుగులు వేసి నా దగ్గరికి రాలేదు. నాకేమి పట్టింది వాణ్ణి పిలిచి మాట్లాడటానికి? రావటమూ చూశాను, వెళ్ళిపోవటమూ చూశాను, కానీ నోరెత్త లేదంతే!’

రాధే చాయ్ గ్లాస్ రసీదన్ ముందుకు జరిపాడు. ‘ఇంకోటివ్వు, అమీనాకు!’

రెండు గ్లాసులూ తీసుకుని, ఇంట్లోపలికి వెళ్ళిందామె. అమీనా దగ్గరికెళ్ళి కూచుని, తల నిమిరింది. నీళ్ళు తెచ్చి ఇచ్చింది. తాగగానే తన చేతికి చాయ్ గ్లాస్ అందించింది. అక్కడే పడున్న పీటమీద కూర్చుని అంది, ‘చాయ్ తాగు ముందు! తరువాత చెప్పు. ఏమి జరిగిందీ ఏమిటీ? మెల్లిగా.. అన్నీ చెప్పు.’

‘నా ఏడుపు నీకిబ్బందైతే, యే విషమో తెచ్చివ్వు.’

‘చూడు, చున్నీలాగా చెయ్యొద్దు. ఎలా ఉండేదానివో, అలాగే ఉండు.’

‘ఎలా ఉండేదాన్నో, అలాగే ఎలా ఉండేది? దాని ఫలితమే ఇది మరి.’ అమీనా గొంతులో అలసట.

‘సాబిర్ వచ్చాడా?’

‘ఆ.. నిన్ను కలవటానికొచ్చాడు. నీకోసమే వెదికాడు. గంటకు పైగా కూర్చున్నాడు నీకోసం. భిక్ష వేస్తాడట! నోట్ల భిక్ష! అత్తకివ్వు, ఫజ్లూ మందులకు పనికొస్తాయన్నాడు.’ అమీనా కళ్ళల్లోంచీ మళ్ళీ నీళ్ళు!

‘ఇంకేమీ అనలేదా?’

‘ఢిల్లీ వెళ్తున్నాడట! ఇది చెప్పడానికొచ్చాడు.’

‘ఇప్పుడు ఎలా తెలుస్తుంది. ఏమి చెప్పటానికొచ్చాడో?’

మౌనం.

‘నువ్వేమీ అడగలేదా మరి?’

‘ఆ.. పల్లకీ ఎప్పుడు తెస్తున్నావ్ తీసుకుపోవటానికి అని అడగాలా? లేకపోతే, మేము అప్పులు చేసి పొట్టలు నింపుకుంటున్నాం బాబూ! డబ్బేమైనా ఇస్తావా? అని అడగాలా?’ విసురుగా చాయ్ గ్లాస్ కింద పెట్టి, అమీనా లేచి నిల్చుంది.

‘నేనామాటనలేదు. కానీ మాటలన్నీ పొట్టలోనే పెట్టుకు నుంటే ఏమీ జరగదు. ఏమీ మాట్లాడకుంటే, అతని మనసులో ఏముందో తెలిసేదెలా మరి?’ రసీదన్ గొంతులో బేలతనం.

‘మాట్లాడాల్సిన పని లేదు. నా కడుపులో వేరే మాటలేమీ లేవు. సాబిర్‌తో కానీ, ఇంకెవరితో నైనా కానీ, మనకు ఇచ్చి పుచ్చుకునేదేమీ లేదు. నా మనసును పాతిపెట్టేశానెప్పుడో! నీకు బరువుగా ఉంటే చెప్పు, యే నుయ్యో గొయ్యో చూసుకుంటాను.’

‘నీ నోట్లో ఏదో ఉంది చున్నీ లాగే! ఈ నోటి దురద వల్లే ప్రతిసారీ సాబిర్ వెనక్కెళ్ళిపోతాడు. అర్థమైందా?’ అలసిన గొంతుతో అంది రసీదన్.

‘ఏం చెయ్యను? డబ్బు తీసుకోవాలా మరి? ఇలాంటి డబ్బు తీసుకునేందుకు బదులు వేశ్యగా సంపాదించటం మేలు.’ ఏడుస్తూ దాతా పీర్ మనిహారీ మసీదుకేసి వెళ్ళిపోయింది అమీనా.

రసీదన్ అలాగే కూర్చుండిపోయింది వెళ్ళిపోతున్న అమీనాను చూస్తూ! అన్ని ఇక్కట్లకూ మూల కారణం తానే అనిపిస్తూందిప్పుడు! కాసేపలాగే కూర్చుని బైటికి కదిలింది.

కబ్రిస్తాన్ గేట్ దగ్గరికి రాగానే ఆమెను చూసి రాధే గట్టిగా అరిచాడు, ‘అత్తా! ఈ వార్త తెలుసా?’ అని.

‘ఏమైంది?’

‘దగ్గరికి రా! గట్టిగా అరిచి చెప్పే వార్త కాదు మరి!’

రసీదన్ వచ్చింది. రాధే అన్నాడు, ‘సత్తార్ మియ్యా మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడంట, నీకు తెలుసా అత్తా? మందు సప్ప్లై చేసేందుకు ఒక ముసలాయన్ను పనికి పెట్టుకున్నాడట, ఆయనకు ముగ్గురాడపిల్లలు వయసులో ఉన్న వాళ్ళు, పెళ్ళికానివాళ్ళున్నారట! ఏదో డబ్బిచ్చి, ఆయన మొదటి కూతురిని నిక్కా చేసుకున్నాడట! నాకీరోజే తెలిసింది. నీకు చెబుదామనుకున్నా.’

రసీదన్ ఏమంటుంది? మాట్లాడలేదేమీ! నిక్కా అదీ లేకుండా సత్తార్ మియ్యాను ఇంట్లోకి తాను ఆహ్వానించిన రోజు క్షణం పాటు గుర్తుకు వచ్చింది. ఆ రోజు జీవితంలో ఏర్పడిన మచ్చ, యీ రోజు వరకూ…!! ఏమీ మాట్లాడ కుండా రసీదన్ వెనక్కి తిరిగి, కబ్రిస్తాన్ గేట్ వైపు వెళ్ళిపోయింది.

***

స్వర్గీయ ఉస్తాద్ నూర్ బఖ్ష్ దౌహిత్రుడు సాబిర్ అలీ బఖ్ష్, ఏర్ ఇండియా విమానం 408లో ఢిల్లీకి బయలుదేరారు. ఉస్తాద్ ఫహీం బఖ్ష్ – ఉస్తాద్ గులాం బఖ్ష్ వారి శిష్యులు ఢిల్లీలో ఐదు రోజులు నిర్వహించబడే షహనాయీ ఉత్సవంలో రెండు కచ్చేరీలు ఇవ్వబోతున్నారు. మొదటిది, మొదటి రోజే పెద్ద హాల్‌లో, ఇక రెండవది, చివరి రోజు ఓపన్ ఆడిటోరియంలో! విమానంలో ప్రయాణించే సమయంలో సాబిర్, ‘భూమ్మీద ఉండటంలోనూ, ఆకాశం మీద ఎగరటం లోనూ ఎంత తేడా ఉంది కదా!’ అనుకున్నాడు. కింద నుండీ పైకి చూడటానికీ, పైనుండీ కిందకి చూడటానికీ ఎంత తేడా? తాను ఎగురటాన్ని అమీనా, ఫజ్లూ, రసీదన్ అత్తా, బిల్కీస్ పిన్నీ చూస్తే ఎంత బాగుండును?’ అనుకున్నాడు! ‘నాన్న బతికుంటే ఎంత బాగుండు? నాన్న కిందనుండీ చూడటమేమిటి? తనతో ఆయనా ఉంటారు కదా విమానం లోనే!’ అనుకున్నాడు కూడా!

సాబిర్ ఎక్కిన విమానం పీర్ ముహానీ పైనుంచీ ఎగురుతున్న సమయంలో, అమీనా, భన్వర్ పోఖర్ వాలే అబ్బాయితో పాటు, ఎవరిదో శవాన్ని పాతిపెట్టేందుకు సన్నాహాలు చేస్తూంది. ఎవరో ధనవంతులట! గోరీ మీద చల్లేందుకు వాళ్ళు తెప్పించిన అత్తరు, గులాబీ పన్నీరు సీసాలను సర్దుతోంది. అదే సమయంలో సాబిర్ విమానం ఆకాశంలో పీర్ ముహానీ పైనుంచీ ప్రయాణించింది. ఢిల్లీ విమానాలు ఇటే వెళ్తూ ఉంటాయి. అమీనా తలెత్తి చూడనైనా లేదు. సాబిర్ అలీ బఖ్ష్ ఆ విమానంలోనే ఢిల్లీకి వెళ్తున్నాడని ఆమెకు తెలియదసలు. ఒక వేళ తెలిసే ఉంటే, తలెత్తి ఓసారి చూసి, ప్రార్థించేదేమో!

మధ్యాహ్నం తరువాత అమీనాకు కాస్త తీరిక దొరికింది. స్నానమదీ చేసి, అలసట తీర్చుకున్న తరువాత, ఆకలయింది. రసీదన్ ఫజ్లూ గదిలో కూర్చుని ఉంది, అతని ఊపిరి కదలికలు తదేకంగా గమనిస్తూ! తన నుదుటి వ్రాతను నిశితంగా పరిశీలిస్తూ! ఫజ్లూ బతకటమిక కష్టమేననిపిస్తూంది. తన వాళ్ళు తన ముందే మృత్యువు ఒడిలోకి చేరుకోవటం చూస్తూంది తాను! అల్లా తాలాను, తన కొడుకుకు యీ కష్టాలనుండీ విముక్తి కలిగించమని ప్రార్థిస్తున్నది !

రాధే దుకాణం నుందీ బిస్కెట్, చాయ్ తీసుకుని వచ్చి రసీదన్‌కు ఇచ్చింది అమీనా. తానూ ముంగిట్లో కూర్చుని తాగుతూంది. చాయ్‌లో బిస్కెట్ ముంచి తింటూంది. ఆమె శరీరంలో ప్రతి కీలూ సడలిపోతూంది. నిన్న రాత్రసలు నిద్రే లేదామెకు. సాబిర్ చేసేదానికంతా తానే కారణమా? సాబిర్‌కు ఇప్పుడు తన ప్రేమకంటే వాళ్ళ అమ్మావాళ్ళింటి డబ్బూ, వైభవం, కొత్త జీవితంలోని డాబూ, దర్పమూ, షహనాయీ ముఖ్యమైపోయాయా? సాబిర్ కాళ్ళ మీద పడి, ‘నన్నిప్పుడే నీతో తీసుకెళ్ళు!’ అని బ్రతిమాలి ఉండాల్సిందా? లేదా ‘చూడండందరూ! నన్ను నా సాబిర్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు!’ అని గుండెలు బాదుకుని ఏడ్చి ఉండవలసిందా? ఊహూ! తానివన్నీ చేయదు. ఎక్కడికీ వెళ్ళదు. ఈ కబ్రిస్తాన్ లోనే ఉంటుంది. ఈ శవాలమధ్యే జీవనోత్సవం చేసుకుంటూ ఉంటుందంతే! ఒక్కటే బాధ, ఫజ్లూకు వైద్యం చేయించలేకపోతోంది తాను! డబ్బెక్కణ్ణించీ తేవాలి? అప్పుతో బతుకు లీడుస్తూ ఉన్నామందరం. వైద్యం చేయాలనే ఉంది. చున్నీకి ఫోన్ చెయ్యాలి, కాస్త డబ్బు పంపితే, కనీసం ఫజ్లూకు పాత మందులైనా కొనవచ్చు.’

పొయ్యి నీరసంగా పడి ఉంది. రాత్రి గిన్నెలన్నీ అలాగే పడున్నాయ్. తెల్లవారగానే ఎవరిదో శవమొస్తున్నదన్న సమాచారంతో తనీపనిలో మునిగిపోయింది. అమీనా ముంగిట్లో అంతా పరికించి చూసి గట్టిగా నిట్టూర్పు విడిచి తల వంచుకుంది.

ఎండ క్రమంగా తగ్గుముఖం పడుతూంది.

***

రాత్రి గడిచింది.

అమీనా చున్నీకి ఫోన్ చేసింది. ఫజ్లూ ఎలా ఉన్నాడో చెప్పింది కానీ డబ్బు పంపించమని చెప్పలేక పోయింది. అడగకుండానే చున్నీ, బబితా వదినె బ్యాంక్ ఖాతాలో రెండువేల రూపాయిలు బదిలీ చేసింది. మధ్యాహ్నం బబితా వదినె వచ్చి ఇచ్చి వెళ్ళింది. అమీనా వెళ్ళి కొన్ని మందులు తీసుకువచ్చింది కానీ ఫజ్లూ వాటిని మింగే పరిస్థితిలో లేడు. అతని గొంతులో ఎంతో కష్టమ్మీద రెండు మూడు చుక్కల నీళ్ళు మాత్రమే వెళ్తున్నాయ్. ఊపిరి కూడా అతి కష్టమ్మీదే పీల్చుకుంటున్నాడు, పెద్దగా శబ్దం చేస్తూ! కళ్ళు చాలాసేపు తెరుచుకునే ఉంటాయి, కాసేపు మాత్రమే మూసుకోగలడు. కనుపాపల రంగు కూడా మారుతోంది. ఎన్నడూ రాని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాయా అన్నట్టు, ఉదాసీనంగా, బుడిద రంగులోకి మారాయి. పెదవుల మీద పక్కులుకట్టాయి. చర్మమ్మీద ప్రతి చోట పక్కు లాంటి నల్లటి పొరలు! రసీదన్ మాటిమాటికీ పెదవులను చిన్న తడి టవల్‌తో తుడుస్తూ కూర్చుంది. కానీ క్షణాల్లో తడి ఆవిరైపోతూంది.

అటు ఢిల్లీ అశోకా హోటల్ గదిలో లేత నీలం రంగు షేర్వానీ, తెల్ల పైజామా వేసుకుని తయారై తన మామయ్యలతో సాబిర్ అలీ బఖ్ష్ బయలుదేరారు. కోపర్నికస్ మార్గ్‌లో కమానీ ఆడిటోరియంలో జరుగనున్న షెహనాయీ మేలా ప్రారంభోత్సవంలో పాల్గొననటానికి ఆసీనులై ఉన్నారు. అయన వేసుకున్న హినా అత్తరు, చిన మామయ్య వేసుకున్న మోతియా అత్తరూ – రెండూ ప్రేమగా కౌగిలించుకున్నాయి. షహనాయీ మేలాలో పాల్గొన బోతున్న సంగీత విద్వాంసుల పేర్లలో ఉస్తాద్ ఫహీం బఖ్ష్, ఉస్తాద్ గులాం బఖ్ష్ పేర్లతో పాటూ, తన పేరూ విని సాబిర్ కళ్ళలో ఆనంద బాష్పాలు! తన నాన్న దివంగత అలీ బఖ్ష్‌ను గుర్తు చేసుకున్నాడు సాబిర్.

రసీదన్ ఇంట్లో రాత్రి భోజనం వండే ఓపికా, తినే కోరికా ఎవరికీ లేక, పొయ్యే వెలగలేదు. ఫజ్లూ చావు కోసం ఎదురు చూస్తూ క్షణాలు గడుస్తున్నాయి. రసీదన్, అమీనా ఇద్దరూ గదిలో కూర్చునున్నారు, కాసేపు ఫజ్లూనూ, కాసేపు ఒకరినింకొకరూ చూసుకుంటూ!! ఇద్దరి కళ్ళలో తడి ఆరిపోయింది. ముఖాలు కళ తప్పి ఉన్నాయి.

రాత్రి గడుస్తోంది, నావికుడూ, తెప్పా లేకుండా నదిలో నడుస్తున్న నావలా!

ఆకాశంలో చంద్రుడూ ఉన్నాడు, మేఘాలూ ఉన్నాయి.

సాయంత్రం నుండీ చలనం లేకుండా ఉన్న గాలి ఇప్పుడు కదులుతోంది, ఒకసారి చంద్రుణ్ణి ముద్దు చేస్తూ, ఇంకోసారి మేఘాలతో కబుర్లాడుతూ!

మధ్య రాత్రి.

షహనాయీ మేలాలో చిట్టచివరి కచ్చేరీ, పాట్నాకు చెందిన ఉస్తాద్ ఫహీం బఖ్ష్ మరియు గులాం బఖ్ష్ వారి శిష్యులచే! దివంగత కవ్వాలీ ఉస్తాద్ జహూర్ బఖ్ష్ గారి మనుమళ్ళ ఖ్యాతి దేశం మొత్తం సువిదితం. షహనాయీ వాయిస్తూ, దాని సాహిత్యాన్ని వివరిస్తూ, సాగే వారి విధానం అపూర్వం. అంతరించిపోతున్న ఒక పురాతన సంగీత సంప్రదాయానికి యీ సోదరులిద్దరూ చివరి వారసులు. షహనాయీ మీద పలికించే ఈ పద్ధతిని వీళ్ళ తండ్రిగారు ఉస్తాద్ నూర్ బఖ్ష్ ప్రారంభించారు. ఖమాజ్ థాట్ కోసం తిలక్ కామోద్‌లో ఖయాల్‌ను షహనాయీ మీద ప్రారంభించారు. ఈ రచన తూతీ ఏ హింద్ అమీర్ ఖుస్రో ది. రాగాలాపన తరువాత, ఇద్దరన్నదమ్ములూ, యీ పాట స్వరాలను పలికించే పనిని తమ సంగీత సంప్రదాయ వారసుడు, యువ సంగీత విద్వాంసుడూ సాబిర్ అలీ బఖ్ష్ కు అప్పగించారు. ‘మంగల్ కరన్ సుందర్ గజ్ గామినీ నిర్మల్ గాత్ హరి కర్ దామినీ..’ అనే సాహిత్యాన్ని షహనాయీ మీద అతడు పలికించగానే ఆ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగి పోయింది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఫజ్లూ తన గదిలో చివరి శ్వాస తీసుకున్నాడు.

సాబిత్ అలీ బఖ్ష్ షహనాయీ మీద తిలక్ కామోద్ స్వర లహరులు ఆగకముందే ఫజ్లూ శ్వాస ఆగిపోయింది.

***

రెండో రోజు మధ్యాహ్నం అమీనా, రసీదన్ ఇద్దరూ కలిసి ఫజ్లూ శవాన్ని పాతిపెట్టేందుకు గొయ్యి తవ్వారు. అమీనా గునపంతో తవ్వుతూంటే, రసీదన్ మట్టిని ఒకచోట చేరుస్తోంది. అమీనా, భన్వర్ పోకర్ అబ్బాయినేమీ చెయ్యనివ్వలేదు. నమాజే జనాజా (మరణానంతర ప్రార్థన) తరువాత, ఫజ్లూ మీద ఆఖరిసారి మట్టిని వేసి గొయ్యిని పూడ్చేసరికి సాయంత్రమైంది. తల్లీ కూతుళ్ళిద్దరూ ప్రార్థనలు చేసి దాతా పీర్ మనిహరీ సమాధి దగ్గరికి వచ్చారు. ఎగుడు దిగుడు దారిలో చాలా దూరం నడిచి వచ్చినట్టు, రసీదన్ కాళ్ళు తడబడుతున్నాయి. భూమి లోలోపలికి కుంగిపోతున్నట్టూ, నలువైపులా వినిపిస్తున్న అరుపులూ, కేకలూ మెల్లి మెల్లిగా దూరమైపోతున్నట్టూ రసీదన్‌కు అనిపిస్తూంది. ఒకరినొకరు కళ్ళార్పకుండా చూసుకున్నారిద్దరూ! ఉన్నట్టుండి అంతా స్తంభించిపోయినట్టుగా, చాలా కాలంగా చేసిన నిరీక్షణ ముగిసేందుకై విశ్వమంతా వేచి ఉన్నట్టుగా అనిపించిందిద్దరికీ! ముందు అమీనా గొంతు పగిలింది. తరువాత, పొలికేకతో అమ్మ శరీరాన్ని పెనవేసుకుంది అమీనా. ఆమెను తనలో పొదువుకుంది రసీదన్. తరువాతే ఆమె గొంతు పెగిలింది. విరిగిపోయిన కంచు గిన్నె నుండీ వెలువడే శబ్దంలా ఉందామె ఏడుపు.

ఎక్కడినుంచో వేగంగా గాలి వీచింది. దాతా పీర్ మనిహారీ సమాధి మీద పడున్న చెట్ల ఆకులు ఎగిరిపోయాయి. సాయంత్రపు లేత చీకటి ని ఛేదిస్తూ వెలుగు చక్రం ఒకటి మెల్లి మెల్లిగా నాట్యమాడుతూ, వేగంగా కబ్రిస్తాన్ లోకి వెళ్ళి మాయమైపోయింది. అంతటా నిశ్శబ్దం. చిలుక లాగ పిలుస్తూ, ముద్దు చేస్తూ, దాతా పీర్, లాలి పాట పాడుతున్నట్టు సున్నిత స్వరమేదో వినిపిస్తూంది. ఆ స్వరం గోరీల గడ్డంతా చుట్టి వస్తూంది. ఎదురుగా నల్లటి జుబ్బా వేసుకుని రసీదన్ తాతగారు కాలే ఫకీర్ వస్తూ కనబడ్డారు. ఆయనతో పాటూ తెల్లటి జుబ్బా వేసుకుని సమదూ ఫకీర్ కూడా!! మరీ దగ్గరికి రాగానే కాలే ఫకీర్ మాయమై పోయారు.

సమదూ ఫకీర్ రసీదన్ భుజమ్మీద చెయ్యి వేసి, ఆప్యాయంగా.’అత్తా!’ అని పిలిచారు.

రసీదన్ క్షణం సేపు ఆయన్ని చూసి, అల్లుకుపోయింది, ‘సమద్!’ అంటూ!

సమదూ ఫకీర్ రసీదన్‌ను తన గుండెల్లో పొదువుకున్నారు. అమ్మకు కాస్త దూరంగా నిల్చుని ఉంది అమీనా. ఒక చేత్తో రసీదన్‌ను సముదాయిస్తూనే మరో చేత్తో అమీనాను కూడ దగ్గరికి తీసుకున్నారు సమదూ. ‘అత్తా! నేనొచ్చేశాను. ఇక్కడే ఉంటాను మీతో కలిసి! షాహ్ అర్జా నుండీ సెలవు తీసుకుని వచ్చేశాను. ఇక ఇక్కడే దాతాపీర్ మనిహారీ సేవలో అందరమూ జీవిద్దాం. చూడత్తా! నాకేసి చూడు! తాత ధరించిన వంకర టింకర చేతికర్రా, భిక్షాపాత్ర నాకు నువ్వివ్వాలంతే!!’.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here