జైత్రయాత్ర-12

1
3

[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆ రాత్రి బోర్ కొడుతోందనీ, పట్నం వెళ్ళి సినిమా చూసొద్దామని అనుకుంటారు సుబ్బు, శ్రీనివాస్, ఆంజనేయులు. అదే సమయంలో కూరలు, ఇతర సరుకులు తీసుకురమ్మని బస్‌ని, డ్రైవర్‍ని ఇచ్చి పంపుతాడు వెంకట్రావు. మిత్రత్రయం, డ్ర్రైవరు పట్నంలో సినిమా చూసి, శుభ్రంగా తిని, తాగి – గ్రామానికి తిరిగి బయల్దేరుతారు. మరో వైపు, అర్ధరాత్రి పూట ఓ ఇద్దరు ఓ మూటని మోసుకుంటూ వెళ్తుంటారు. అలసట వచ్చేసరికి మూటని దింపి కాసేపు అలుపు తీర్చుకుంటారు. ఇంతలో ఏదో వాహనం చప్పుడు వినిపించేసరికి, ఆ మూటని అక్కడున్న గుంటలో పడేసి పారిపోతారు. బస్సులో నిద్ర పట్టక అస్తిమితంగా ఉన్న సుబ్బుకి ‘దబ్’ మన్న ఆ శబ్దం వినబడుతుంది. కిటికీ లోంచి చూసి, అది తాము బావి తవ్వుతున్న ప్రాంతమని గుర్తిస్తాడు. డ్రైవర్ నారాయణకి చెప్తే, అతను పట్టించుకోడు. తాము తువ్వుతున్న బావి దగ్గర ఏదో ‘ధబ్’ మని శబ్దం వినిపించిందని, ఎవరో తచ్చాడినట్లనిపించిందనీ, మిత్రులిద్దరికీ చెప్పినా, వాళ్లు వేళాకోళం చేస్తారు. బస్సు క్యాంపు దగ్గరికి చేరుతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-14

[dropcap]సు[/dropcap]బ్రహ్మణ్యం నిద్ర లేచేసరికి మిత్రులెవరూ కనబడలేదు. ‘ఎక్కడికెళ్ళారబ్బా’ అనుకుంటూ లేచి కాలకృత్యాలు కానిచ్చి టిఫిన్ ఏమన్నా దొరుకుతుందేమోనని వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ కూడా ఎవరూ లేరు. ఉస్సూరుమంటూ బయటకి వచ్చాడు. కనీసం శోభ వాళ్ళింటికెళితే బొక్కడానికి ఏమన్నా దక్కుతుందేమో అనుకుంటూ.

అప్పుడే శీనయ్య హడావుడిగా పొలాల వైపు వెళ్తున్నాడు. “ఏంటండీ శీనయ్య గారూ! కడుపులో గడబిడగా ఉందా? అలా పరుగెత్తుతున్నారు?” నవ్వుతూ అడిగాడు.

శీనయ్య “అయ్యో.. మీకు తెలీదా? మీరు త్రవ్వుతున్న బావిలో ఏదో శవం కనిపించిందట. ఊరంతా అక్కడే ఉన్నారు” అన్నాడు.

సుబ్రహ్మణ్యం అవాక్కయ్యాడు. శీనయ్య ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా బావి కేసి పరుగెత్తాడు.

సుబ్రహ్మణ్యం బావిని సమీపిస్తుంటే దూరంగా జనాలు కన్పిస్తున్నారు. పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యం వెళ్లేసరికి అప్పటికే వెంకట్రావు, ఆంజనేయులు, శ్రీనివాస్ మిగిలిన క్యాడెట్స్ కూడా ఒక ప్రక్కగా నుంచుని చూస్తున్నారు. వెంకట్రావు మొహం గంభీరంగా ఉంది. క్యాడెట్స్ మొహాల్లో ఆందోళన, భయం కనిపిస్తున్నారు. బావిలోకి చూసాడు సుబ్రహ్మణ్యం. పూల దుప్పటి కప్పిన ఐదడుగుల పొడవున్న మూట తాళ్లతో కట్టేసి ఉంది. రక్తం మరకలు దట్టంగా కనిపిస్తున్నాయి.

ఇద్దరు వెట్టివాళ్లు బావి లోకి దిగి పైనుంచీ వేసిన తాళ్ళకి మూతని కట్టారు. పైనుంచీ కాటికాపరి సేంద్రిడు తాళ్ళని పట్టిక లాగాడు. మూట పైకి వచ్చేసరికి అందరూ దూరం జరిగారు. అప్పటికే శవం కుళ్ళు కంపు కొడుతోంది. వూరిలో చిన్నా పెద్దా అందరూ ఏదేదో మాట్లాడుకోసాగారు.

“తొందరగా మూట విప్పేసి ఏమిటో చూస్తే తర్వాత ఏం చేయాలో ఆలోచించచ్చు.. ఇట్లానే ఉంచితే కుళ్ళు కంపుకి పిల్లలికి రోగాలొస్తాయి” అన్నారెవరో పెద్దమనిషి గుంపులోంచీ.

వెట్టివాళ్లు కదిలే లోపు శీనయ్య ముందుకు వచ్చి “వద్దు. రాయుడు గారు టౌన్ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేశారు. ఈపాటికి పోలీసులు వస్తూ వుంటారు. పోలీస్ పటేల్ కూడా రాయుడి గారి దగ్గరే ఉన్నాడు. పది నిమిషాలు ఓపిక పడితే అందరూ వచ్చేస్తారు. మీరు ఇలాంటిదేదో చేస్తారనే నన్ను పంపారు” అన్నాడు. అందరూ కిమ్మనకుండా నిల్చుండిపోయారు.

వెంకట్రావు ఏదో ఆలోచించుకుంటున్నాడు. ఎందుకిలా జరిగిందో అతనికి ఏ మాత్రం అర్థం కావట్లేదు అందరూ తమకు సహకారం అందిస్తున్నట్టుగా కనిపిస్తోంది కానీ ఎక్కడికి అక్కడ అడ్డంకులు తప్పట్లేదు.

‘దీనివల్ల తమ కార్యక్రమం ఆగిపోతుందా? లేక తమని కూడా పోలీసు కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందా?’ ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు సమాధానం దొరకట్లేదు.

ఆంజనేయులు – వెంకట్రావు దగ్గరికి వచ్చి “సార్, ఏంటి సార్ ఇది? ఇది కావాలని ఎవరో చేస్తున్నారు సార్.

మనం ఊరుకోవద్దు. దీని అంత తేల్చుకుని వెళ్దాం సార్” అన్నాడు.

వెంకట్రావు అతని వంక దీర్ఘంగా చూసి తల తిప్పుకున్నాడు.

ఇంతలోకి రాయుడు, పోలీస్ పటేల్, టౌన్ నుంచి వచ్చిన పోలీసు ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడ చేరుకున్నారు.

పోలీస్ పటేల్ వెట్టి వాళ్ళతో “ఆ మాట విప్పండి” అన్నాడు.

వాళ్లు మెల్లగా ముళ్ళు చెబుతూ దుప్పటిని బార్లపరిచి పక్కగా నుచున్నారు. శవం కుళ్లిపోయిన వాసన ముక్కుపుటాలు అదరగొట్టింది.

అయినా ఉత్సాహం చంపుకోలేని కొంతమంది గ్రామ జనం ఒకరి మీదకు ఒకరు వంగి చూశారు.

‘బసివి రా, బసివి’ అంటూ గుసగుసలాడు సాగారు.

వెంకట్రావు ఆంజనేయులు శ్రీనివాస్ ముగ్గురు కూడా ముందుకు వెళ్లి చూశారు. సుబ్రమణ్యం అప్పటికి చూసి వచ్చి వెంకట్రావు వెనకాల నిలబడ్డాడు భయం భయంగా.

దుప్పటి మీద పడి ఉంది ఓ అమ్మాయి శవం. జుట్టు విడిపోయి ఉంది మొహం మీద గాట్లు వాటిలోంచీ నెత్తురు కారుతోంది.

“ఓ గాడ్” అన్నాడు వెంకట్రావు అప్రయత్నంగా.

ఆంజనేయులు శవాన్ని చూసి ముక్కు మూసుకొని వెనక్కి వచ్చేసాడు.

శ్రీనివాస్ ఆసక్తిగా శవం మొహం వైపు చూసి ఒక్కసారిగా నిలబడిపోయాడు. కళ్ళలోంచి జలజల నీళ్లు. నోట్లోంచి మాటలు రావట్లేదు.

ఆమె.. ఆమె..

ప్రకృతి!

“ప్రకృతి” అతని నోరు పెగల్చుకుని బయటికి వచ్చిందా పేరు.

“అవును బాబూ.. అది ప్రకృతే! ఈ ఊరి ప్రకృతి ఈ ఊరి పెద్దల ప్రవృత్తికి ఆహుతయి ‘బసవి’గా మార్చబడింది. అప్పుడే సగం సచ్చింది. ఇన్నేళ్లుగా బ్రతుకు అలవాటు పడిపోయింది అనుకున్నాం కానీ ఇప్పుడు ఇలా..” జీరబోయిన గొంతుతో అన్నాడు ఒక వృద్ధుడు.

“బసివా? అంటే” అడిగాడు ఆంజనేయులు.

“దేవుడి సేవ కోసం ఓ కన్యను దేవదాసుగా ఏర్పాటు చేస్తారు బాబు. ఏటేటా ఒకరోజు ఆమెకు పూజలు చేసి ఊరేగిస్తారు. ఆ ఒక్కరోజు ఆమె దేవత. ఆ పైన ఊరి పెద్దలు ఆమె శరీరంపై ఊరేగుతారు. అలా ఆచారానికి బలైపోయినదే ఈ బసివి కూడా.”

కట్రాటలా నిలబడిపోయి అతను చెప్పేదంతా వింటున్నాడు శ్రీనివాస్. అతనికి ప్రకృతి అన్న మాటలు గుర్తొస్తున్నాయి.

ఆ రోజు –

“ప్రకృతీ, ఒక్క సారి ఆగు” శ్రీనివాస్ అరిచాడు. పరిగెత్తుతున్న సెలయేరు ఒక క్షణం ఆగింది. ప్రకృతి వెనక్కి తిరిగి చూసింది.

వగరుస్తూ నిలబడ్డ శ్రీనివాస్‌కి అలుపు అంతా మటుమాయమైపోయింది ఆమె చూపుతో.

ఏదో మాట్లాడాలనుకున్నాడు కానీ మాట వస్తేనా!? “ఏమిటి పిలిచావు” అడిగిందామె.

ఒక్క క్షణం నిశ్శబ్దం.

ప్రకృతి వినిపిస్తున్న సంధ్యారాగంతో ఆమెనే తదేకంగా చూస్తూ అన్నాడు శ్రీనివాస్.

“ఐ లవ్ యు.”

సంధ్యారాగానికి శృతి పలికినయి ఆ మాటలు. వింతగా చూసిందామె. అతని భావం అర్థం అయిందామెకు. అతని కళ్ళు చెప్తున్న సందేశం గ్రహించిందామె.

భాష ఏదైనా భావం ఒక్కటే. వేషం ఏదైనా ప్రేమ ఒక్కటే. ఆమె కళ్ళల్లో ఏదో వెలుగు!

ఆ రెండు అక్షరాల పదం ఈ లోకంలో మరో రెండు ప్రాణాలకు జీవమైంది.

ఆమె మధురవాహిని. అతడు మనోహరుడు.

కాలం ఒక క్షణం కళ్ళు మూసుకుంది. ఆ క్షణం వారి మధ్యలో శాశ్వతంగా నిలిచిపోయింది.

అతని కలలోకి చూస్తూ అందామె మెల్లిగా – “ఇకపై నేను పవిత్రంగా నీకోసం ఎదురు చూస్తాను.”

శ్రీనివాస్ చిరునవ్వు నవ్వాడు –  “ప్రకృతి ఎప్పటికీ పవిత్రే!” అన్నాడు.

స్మృతిలో నుంచి చేరుకున్న శ్రీనివాస్ కళ్ళల్లో నీళ్లు ఉబికినాయి.

అప్పటికి వెంకట్రావు ఆమెను పరీక్షగా చూస్తున్నాడు.. అతనికి అనుమానంగా ఉంది.

ఎనిమిది అడుగుల గోతిలో పడితే చనిపోయేంత ప్రమాదం జరగదు. ఆమె ఒంటిమీద గాయాలు ఉన్నాయి. ఆమె కంఠం చేసి పరిశీలనగా చూశాడు. నల్లగా కమిలిన చార ఉంది మెడ చుట్టూ.

అవును!

ఆమె గొంతు నులిమి చంపబడింది.

వెంకట్రావు సాలోచనగా తల పంకించాడు. హంతకుడు ఎవరు ఉంటారు?

పోలీసులు తమ కార్యక్రమం నిర్వహించి పంచనామా రిపోర్టు తయారు చేశారు. వాటి మీద రాయుడు, పాపయ్య శెట్టి, శీనయ్య సంతకాలు తీసుకున్నారు.

రాయుడు చూశాడు. బాధగా ముఖం పెట్టాడు. అవును మరి! ఎన్నిసార్లు తన కోరిక తీర్చిందో ఆ లేత శరీరం!

ఉత్సాహంతో ఇన్నాళ్లు ఉరుకులెత్తిన ఆ శరీరం ఇప్పుడు నిశ్చలంగా ఉంది.

ఆమె ముఖంలో జీవకళ ఇంకా చచ్చిపోలేదు. ఆదో విధమైన ప్రశాంతత కనిపిస్తోంది. అదే అందరికీ వింతగా ఉంది.

సుబ్రమణ్యం, ఆంజనేయులు మూడిగా మారిన శ్రీనివాస్ వంక చూస్తూ నిలబడ్డారు.

అతనిలో అదో విధమైన స్తబ్దత ఉంది. ఎక్కడో చూస్తున్నాడు అతనిలో పదిలమైన ఆ క్షణం కాలం మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోంది.

అప్పుడు ఆమె ప్రకృతి – ఇప్పుడు అమానుషానికి బలైపోయిన ఈ ఊరి సిరి!

బసవి అయితేనేం!

తన హృదయ సామ్రాజ్యాన్ని క్షణకాలంలో హస్తగతం చేసుకున్న మనోజ్ఞ రాజ్ఞి – ఆమె!

తొలి ప్రేమ ఆకర్షణ మాత్రమే నంటారు చాలామంది. కానీ తమది –

అతని గుండె లోయల లోతుల్లో మారుమోగింది అతనిలో పెల్లుబుకుతున్న భావలహరి –

వస్తాను ప్రియా..

ఊరు విడచి

వాడ విడిచి

నేల విడిచి

ఆలాపనై..

ఆవేదనై..

ఆవేశమై..

ఆకారం లేని ఆకాశమై..

నీ చెంతకు

….

అతని కళ్ళు సజలాశయాలు. అతని కలలు స్మృత్యాశ్రయాలు!

ఒకవైపు రాయుడు జనాన్ని ఉద్దేశిస్తూ చెబుతున్నాడు. అతని గొంతు బాధతో బొంగురు పోయింది.

“చూడండి రా! ఈ బావి ఊరి బాగు కోసమని ఇన్నాళ్లు మీరు అనుకున్నారు, ఆర్భాటాలు చేశారు. కాదన్నందుకు నన్ను చెడ్డవాడిని చేశారు. ఇటు చూడండి మన ఊరి దేవతనే బలి కోరింది ఈ మహమ్మారి. ఇందులో నీళ్లు పడినా అవి మన దాహాన్ని తీర్చవు. మనల్ని దహించి వేస్తాయి. ఎవరో ఏదో చేస్తున్నారని మన ఊరి ఆచారాల్ని అవతలికి నెట్టేస్తే ఇదే గతి. ఇంతే సంగతి. పాపలా మన మధ్య తిరిగిన ఈ బసవి మనం అందుకోలేని, అందుబాటులో లేని లోకాలకు ఎగిరిపోయింది కదరా!”

అతను నిజంగా బాధపడుతున్నాడు.

బసివి వూరికన్నా ఊరి పెద్దలకు పెద్ద ఆస్తి!

మరి ఆమె లేని లోటు అతని మందిరంలో కనిపిస్తూనే ఉంటుంది.

దేవత లేని గుడిలా!

దేవత కోరిన వరాలు ఇస్తుంది. ఈ దేవత నుంచి అడక్కుండానే అన్ని తీసుకోవచ్చు!

రాయుడు తన ఉపన్యాసాన్ని కొనసాగించాడు –

“మీకు ఇంకా ఈ బావి మీద మమకారం చావకపోతే మీరు ఈ బావిలోనే దూకండి. మానవత్వం ఉంటే వారికి దూరంగా వెళ్లిపోండి. గ్రామ పెద్దగా చెప్తున్నాను. మంచి కోరే కార్యం ఎప్పుడు మంచిని బలి తీసుకోకూడదు. మనిషి అనే వాడు మనిషిని బలి చేయడు. నేను మనిషిని” అంటూ వెళ్లిపోయాడు అక్కడి నుంచి.

అందరూ బావికి దూరంగా జరగసాగారు. అప్పటివరకు మౌనంగా ఓ ప్రక్కనే నిలబడ్డ విద్య అందరి మధ్యకు వచ్చింది-

“అవును. మనిషి అనేవాడు మనిషిని బలి చేయడు. కానీ ఇప్పుడు జరిగిందానికి అర్థం ఏంటి? బసివి తనంతట తానే వచ్చి ఇందులో పడింది అంటారా? ఆమెను బలి చేసింది మనిషి కాదా? ఊరి బాగు కోసం పెద్దల మాటల్లో ఉన్న తాపత్రయం ఆచరణలో ఎన్నడైనా కనిపించిందా? లేదే!

అన్యాయంగా అబలను బలి చేసి దాంతో ఒక యజ్ఞాన్ని మసి చేయాలని చూస్తున్నారన్నది కనిపిస్తున్న సత్యం. దానికి తలవంచి మీరు వెళ్ళిపోతారా?

ఇన్నాళ్లకు మనలో చైతన్యం వచ్చి ఈ పిల్లల సహకారంతో మనం సంఘటితమయ్యం. జరిగిన అన్యాయం భరించరానిదే! కానీ అది మన బ్రతుకులకు శాపం కాకూడదు.

బసివి మన ఊరికి దేవతే! అందుకే మీ శ్రమ ఫలితంగా మళ్లీ రేపు మందాకినిలా, ఇదిగో ఈ బావిలోనే ఉద్భవిస్తుంది!

ఆమె తీయని హృదయం ఈ నీళ్లలో ప్రతిఫలిస్తుంది. మీరు మాత్రం వెనక అడుగు వేయొద్దు” అంది ప్రాధేయపడుతున్నట్లు.

“నిజమేనమ్మ కానీ బలి అనేది మనం ఇస్తే పుచ్చుకుంటే బాగుంటుంది. కానీ పనికి అడ్డు వచ్చేదిగా ఉంటే ఆ దేవతకి ఇష్టం లేదనే కదా తల్లి, ఇంకా ఎందుకు బావి తవ్వటం. ఏదో రాయుడు గారి నీళ్ళైనా దొరుకుతున్నాయి కదా మనకి. వాటితోనే తృప్తి పడదాం. మరిన్ని చావులు ఇక్కడ జరగకముందే జాగ్రత్త పడమని హెచ్చరిస్తోందమ్మా బసివి” అన్నాడు ఓ పెద్దమనిషి.

“అవును”, “అవును” అని గొణుక్కుంటూ అందరూ వెళ్లిపోయారు.

వారి అమాయకత్వాన్ని చూసి ఏమీ చేయలేక నిలబడిపోయింది విద్య. ఆమె నిస్సహాయతకు నిశ్చల సాక్ష్యంగా బసివి. ఓ ప్రక్కగా దైన్యంగా వేలాడిన ముఖాలతో చూస్తున్న మిత్రత్రయం.

వెంకట్రావు పోలీసులతో మాట్లాడి తిరిగి వచ్చాడు. పోలీసులు కూడా తిరిగి వెళ్ళిపోయారు.

శీనయ్య గుళ్లో ఉన్న బ్రాహ్మణుని తీసుకువచ్చి శవ సంస్కారాలకి ఏర్పాట్లు చేయసాగాడు.

చివరిసారిగా శవాన్ని చూసి తిరిగి వెళుతున్న అందరిలో ఒకటే ఆలోచన – ‘ఎలాగైనా బావిని పూర్తిగా చేయాలి!’

***

రాత్రి అయింది చీకటితో నిశ్శబ్దం సహజీవనం సాగిస్తోంది అమాయకతనే అందంగా పంచుకున్న పల్లె చీకటి గుడిలో ఒదిగి గుర్రులు తిడుతుంది ప్రకృతి లేని ఆ ఊరి ప్రకృతి స్తబ్దంగా నిశ్శబ్దంగా రోదిస్తోంది ఎండాకాలపు ఆవిర్లు పగలు చెమట వచ్చిన శ్రమ విశ్రమిస్తోంది.

క్యాంపులో అందరూ నిద్రలో ఉన్న నిద్రలో ఉన్నారు.

వెంకట్రావు దీర్ఘాలోచనలో ఉన్నాడు వెంకట్రావు వెనుక అడుగుల శబ్దమైంది వెనక్కి తిరిగి చూసాడు.

శ్రీనివాస్.

అతని వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు వెంకట్రావు.

చిరు దీపం వెలుగులో అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. బాధతో అతని మొహం ఉబ్బినట్లుంది.

“సార్” మెల్లగా మాట్లాడసాగాడు “ఇక బావి పని ఆపేయాలి మనం” గొణిగాడు.

“మిస్టర్ శ్రీనివాస్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఎన్.సి.సి. పరువు మర్యాదల్ని మంట కలిపేందుకు కాదు. ఏదో అఘాయిత్యం జరిగిందని బేజారు అయితే నువ్వు ఎన్.సి.సి క్యాడెట్‌గా పనికిరావు. మరింత దీక్షగా మనం పని చేస్తేనే కానీ మన ఆశయాలు సాధించలేం. అసలే ఈ ఊరి జనం వ్యతిరేకంగా మారుతున్నారు. నీవు కూడా ఇలా పిచ్చిగా మాట్లాడక వెళ్ళు” అన్నాడు విసుగ్గా.

శ్రీనివాస్ కదల్లేదు. అతడి కళ్ళు మరింతగా జ్వలించాయి. ఆ అగ్నిపర్వతం లోంచి మాటల రవ్వలు పైకెగసినై-

“ఆశయాలు – ఆచరణలు! హు. బాగుంది సార్ మీ ఎన్.సి.సి! సదాశయాలతో అభివృద్ధి చేయమంటున్నారు మీరు. ఒక ప్రాణం బలయితే అదీ – మన వల్ల! దాన్ని పట్టించుకోవద్దు అంటుందా మీ ఎన్.సి.సి.? అది సహజ మరణం కాదు అని తెలిసినా కళ్ళు మూసుకోమంటుందా మీ ఆశయం? లక్ష్యం చేరితే చాలు చంకలు కొట్టుకొని బహుమతులు తీసుకోమంటుందా? మీ ఆదర్శం. ఎవరికోసమైతే మీ ఆశయం నడుం నడుము కట్టిందో వాళ్లే తిరస్కరిస్తుంటే, వాళ్లను కాదని పని చేసుకొని పొమ్మంటుందా? మీ డిసిప్లిన్? ”

వెంకట్రావు తబ్బిబ్బయ్యాడు.

“అయితే పని ఇక్కడితో ఆపేసి తిరుగు మొహం పట్టమంటావా, వెనకడుగు వేయమంటావా”

“అనను” స్థిరంగా జవాబు ఇచ్చాడు శ్రీనివాస్. “కానీ ముందు ప్రకృతి మరణానికి కారణం కనుక్కుందాం. పల్లె ప్రజలకు అసలు సంగతి తెలుస్తుంది. అప్పుడు వాళ్లే మనకు సహకరిస్తారు. మనకు కొండంత అండగా నిలబడతారు.”

“నిజమే కానీ అంత పరిశోధన చేసి సమస్యలు పరిష్కరించేంత సమయం లేదే మనకు! మనం కాలయాపన చేస్తూ కూర్చుంటే అక్కడ కాలేజీలు తెరుస్తారు. క్లాసులు మొదలవుతాయి. మన జీవితం ఇది కాదు శ్రీనివాస్. అందుకే చెప్తున్నాను. పల్లె రాజకీయాల గురించి నీకు తెలియదు, అవి తగులుకుంటే రక్తం కళ్ళు చూసి గాని ఆరవు. వాటి జోలి మనకెందుకు?”

“ఎంత స్వార్థపరులండి మీరు! మా కెప్టెన్ అంటే క్రమశిక్షణకు దేశభక్తికి మరో రూపం అనుకునేవాడిని. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే దేశం అంటేనే విరక్తి పుడుతోంది. ఏమైనా సరే, ప్రకృతి హత్య నిరూపించేంత వరకు నేను కదలను. మీ పనిని కదలనివ్వను” రౌద్రంగా అన్నాడు శ్రీనివాస్.

ఆవేశంతో అతని గుండెలెగసిపడుతున్నాయి.

వెంకట్రావు బాధగా నిట్టూర్చాడు. శ్రీనివాస్ భుజం తట్టాడు అనునయంగా.

“నీ బాధ నేను అర్థం చేసుకోగలను శ్రీనివాస్. నేను నీవనుకున్నంత స్వార్థపరున్ని కాను. కానీ నా ఆశయం నాకు ముఖ్యం. దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను చలించను. నీవు చెప్పిందీ నిజమే! మనల్ని ఆటంకపరిచేందుకు ఎవరో బసివిని పావుగా వాడారు. అబలను బలి చేశారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్పందే మనం ఇక్కడి నుంచి కదలం. సరేనా! కానీ ఒక మాట. మనం ఆ ప్రయత్నంలో ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే మరిన్ని ప్రమాదాలు మనల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. నాకు ఒక ఆలోచన ఉంది. పగలంతా మన పని మనం చేసుకుందాం. రాత్రిపూట వీలైనంత రహస్యంగా మన అన్వేషణ సాగిద్దాం. మనం మరీ ఒంటరిగా లేం! చదువుకున్న పల్లె యువకులు మన వెంటే ఉన్నారు. విద్య ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా న్యాయం మనవైపు ఉంది. మనం పోలీసులను లొంగ తీసుకోవాలి. వాళ్ళ బలం వల్లే ఇక్కడ పెద్దలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆ విషయం నేను చూసుకుంటాను. అందుకోసం నా ఎన్.సి.సి. అధికారాన్ని కూడా వాడతాను. మీరు కుర్రవాళ్ళు. ఆవేశంలో ఎలాంటి తప్పటడుగు వేస్తారో అని నా భయం” వివరంగా చర్చించాడు వెంకట్రావు.

శ్రీనివాస్ ఆనందంతో “థాంక్యూ సార్! మీరు ఇంత సౌమ్యంగా మాట్లాడుతారు అనుకోలేదు. మీకు ఆ బెంగ వద్దు. మేము ఎంత చక్కగా పనిచేస్తామో మీరే చూస్తారుగా. పిల్లలు కాదు ఫిరంగులమని మీరే ఒప్పుకుంటారు. గుడ్ నైట్ సార్” అని చెప్పి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు

వెంకట్రావు ఆలోచిస్తూ పక్క మీద వాలాడు.

***

తర్వాత రోజు-

పంచనాథం సంగీత పాఠాలనుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అతనికి చికాకుగా ఉంది ఇంటికి తాళం కప్ప వేలాడుతోంది. అతనికి మరింత విసుగు వచ్చింది.

‘ఏమిటి ఈ విద్య? అసలు ఈ మధ్య ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతుంది’ అనుకుంటూ తన దగ్గర ఉన్న డూప్లికేట్ తాళం చెవితో తలుపు తెరిచి లోపలికి అడుగు పెట్టాడు.

ఎదురుగా బల్లమీద ఎన్.సి.సి. టికెట్ల పుస్తకం కనిపించింది. చిరాగ్గా దాన్ని తీసి అవతల పడేసాడు.

‘ఛీ ఛీ.. నన్ను నలుగురిలో తలఎత్తుకు తిరిగేలా చేసేటట్టు లేదు. ఇంత వయసు వచ్చిన ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది. అసలే ఊరు మండిపోతుంది ఆ మంటలకు దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా విద్య కొంప మీద తెచ్చి పెడుతోంది. అదేం చేసిన తానే జవాబు దారి! ఇన్నాళ్లు తన మొహం చూసే దాన్ని వదిలిపెట్టారు. ఇకపై వాళ్లు ఊరుకునేలా లేరు.

రాయుడు లోపల మనిషి. ఏం చేస్తాడో చెప్పడు. ఏం చేశాడో కూడా చెప్పడు. అనుభవించిన వాడికి మాత్రమే అర్థమయ్యేలా చేస్తాడు. అలాంటి తేనె పూసిన కత్తుల మీద సాము చేస్తోంది విద్య. దానికి ఏదైనా తనేగా బాధపడేది అర్థం చేసుకోదు. తిట్టటానికి కొట్టటానికి అదే చిన్నపిల్ల కాదు. కాస్త కదిలిస్తే చాలు కదం తొక్కుతోంది!

ఈ రోజు పాపయ్య శెట్టి కూడా తనతో నిక్కచ్చిగానే చెప్పాడు. ఇక ఉపేక్షించకూడదు. తను సంగీతంలో కూర్చుంటే సాగి సాగి తీగ తెగుతుంది. వెంటనే విద్యకు బోధించాలి పాఠాలు’ అనుకున్నాడు.

పంచనాథం బాధగా తల పట్టుకున్నాడు. అప్పుడే విద్య లోపలికి వచ్చింది.

“ఏమ్మా అన్నం వండావా లేక తిరుగుళ్లతోనే పొద్దుపుచ్చావా?”

విద్య అతడి వైపు వింతగా చూసింది ఆ శ్లేష అర్థం కాలేదు.

“ఏమిటన్నయ్య ఈ రోజు ఇంత వేడిగా ఉన్నావు? నీ శిష్యురాలికి సంగీతం చెప్పి సప్తస్వరాలు మర్చి పోయావా ఏమిటి కొంపతీసి” అని అడిగింది నవ్వుతూనే.

“మనమే అపస్వరాలం. మనకెందుకు సప్త స్వరాల సంగతి. ఊర్లోకి వెళ్ళొచ్చావా, వాళ్లు ఏమనుకుంటున్నారో విన్నావా?” అని అడిగాడు కోపంగా.

ఆశ్చర్యంగా చూసింది విద్య.

“అదే నీ తిరుగుళ్ళు, నీ వెధవ వాగుళ్ళు.. ఊరి పెద్దల మీద నీ విమర్శలు అన్ని”

విద్య నవ్వింది “ఓ అదా. అసలు ఊళ్లోకి పోయే ముందు నేను చెవుల్ని ఇంట్లో పెట్టి వెళ్ళాలే” అంది.

“నీవు చెవుల్ని ఇంట్లో పెట్టినా.. నీ అన్నగా నాకు వినక తప్పడం లేదు. విద్యా, సూటిగా చెబుతున్నాను. ఇకపై తిరుగుళ్ళు మానేయ్ నీ పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. నేను ఇంటికి తెచ్చే కాస్త సంపాదనని కూడా దక్కనిచ్చేట్టు లేవు. చూశావుగా అమాయకురాల్ని బలి తీసుకున్న ఊరిది. నీవు కాస్త కరుగ్గా మాట్లాడితే చాలు, ప్రాణాలు తీస్తారు” అనునయంగా అన్నాడు.

“అదే నేను చెప్తున్నాను అన్నయ్యా! ఏమీ తెలియని బసివిని అమానుషంగా హత్య చేశారే? మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా దానికి సాక్షిగా నిలబడతాడు. కానీ నీవు అలా మాట్లాడటం బాగాలేదు. నేరాలు చట్టప్రకారం చేసే నీచులు ఉన్న ఈ పల్లెల్లో చదువుకున్న మనం కూడా మడిగట్టుకుని కూర్చుంటే ఎట్లా?” ఆవేశంగా అడిగింది విద్య.

“చదువు.. నీవు చదివిన చదువులోనే ఉంది కదమ్మా దుష్టులకు దూరంగా ఉండమని. అయినా నీవు పుస్తకాలనే చదివావు. నేను జీవితాన్ని కూడా చదివాను తల్లీ! అందుకే ఇంత బాధ. నా భార్యకు రోగమొస్తే కనీసం పట్టణానికి వెళ్లే టైం లేక ఊరి డాక్టర్ దగ్గరికి వెళ్లాను. వాడు ఉన్న రోగాన్ని మరింత చేసి చంపేశాడు. అది హత్యే! కానీ అలా అని నేను అరవలేకపోయాను.

నాకున్న పొలాన్ని మెల్లిగా తన పొలంలో కలుపుకుంటూ మీసాలు మెలివేసే రాయుడికి ‘అది అన్యాయం’ అని చెప్పలేకపోయాను.

లెక్కల్లో ఆరితేరిన నాకే వడ్డీ లెక్కలు చూపించి ఇల్లు జప్తు చేయించిన పాపయ్య శెట్టిని పల్లెత్తు మాట అనలేకపోయాను. అందుకే ఈ పల్లెలో నేను అందరికీ మంచివాడిని అయ్యాను” అన్నాడు పంచనాథం బాధగా.

“అది మంచితనం కాదన్నయ్య అసమర్థత, అన్ని కష్టాల పాలైన నువ్వు ఊరిని విడిచి పెట్టకుండా ఎందుకు వేలాడుతున్నావో అర్థం కావటం లేదు”

“పుట్టిన ఊరు అనే బలహీనత! ఇక్కడ తిండికి లోటు లేదు కనుక ఇంకే ఆలోచనలు పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు నీ వ్యవహారం చూస్తుంటే నేను తప్పు చేశాను అనిపిస్తోంది.”

“లేదన్నయ్యా! నువ్వు చాలా మంచి పని చేశావు. ఇంతకుముందు వరకు ఊరివారి కోసమే కష్టపడుతున్నాను అనుకునేదాన్ని. వాళ్ళు నా నుంచి దూరంగా జరిగిపోయినప్పుడు నాలో నేనే కృంగిపోయాను. కానీ నువ్వు చెప్పిన విషయాలతో నాలో మళ్ళీ ఉద్రేకం పొంగుతోంది. ఈసారి ఊరివారి కోసం కాదు. నాకోసం మన కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం ఎదురు తిరుగుతాను” అంది ఆవేశంగా విద్య.

“ఆవేశం నాకూ ఉందమ్మా, కానీ అది అన్ని వేళలోనూ పనికిరాదు. అందుకే నిన్ను ఇంటి పట్టునే ఉండమంటున్నాను. రేపు నీ పెళ్లికి ఈ తిరుగుడే ఆటంకం అయితే ఎంత బాధో ఆలోచించావా?”

“ఏం పర్వాలేదు అన్నయ్యా! నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను. నీ మాటకు ఎదురు చెబుతున్నందుకు క్షమించు..” అని ఏదో చెప్పబోయింది.

అంతలో బయట నుంచి ఎవరో “విద్యమ్మా.. వెంకట్రావుగారు మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు” అన్నారు.

అంతే! విద్య వెంటనే వెనక్కి తిరిగి హడావిడిగా వెళ్లిపోయింది.

పంచనాథం విచారంగా నిట్టూర్చాడు

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here