[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[అద్వైత్, సీత, సుల్తాన్ భాయ్‍తో కలిసి కారులో రాఘవ ఇంటికి భద్రాచలం వెళ్తారు. ముస్లిం అయినా, హిందూ మతం పట్ల, హిందూ దైవాల పట్ల సుల్తాన్ భాయ్‍కి ఉన్న అభిమానం గురించి అద్వైత్ అడిగితే, సుల్తాన్ భాయ్ చక్కని సమాధానం చెప్తాడు. హఠాత్తుగా వచ్చిన వాళ్ళని చూసి రాఘవ ఆశ్చర్యపోతాడు. మరునాడు ఉదయం ఆలయానికి వెళ్ళి రాముల వారిని దర్శించుకుంటారు. పెద్దల పేరిట అన్నదానం జరిపించేందుకు డబ్బు కడతాడు అద్వైత్. దర్శనాలకయ్యాక, సుల్తాన్ భాయ్ తన మిత్రుడిని కలవడానికి వెళ్తాడు. అప్పుడు – సీతా తాను వివాహం చేసుకున్నట్టు రాఘవకి చెప్తాడు అద్వైత్. ఓ ఆవేశంలో తమ పెళ్ళి జరిగిపోయిందనీ, తాను లండన్ నుంచి తిరిగి వచ్చే వరకూ ఎవరికీ చెప్పవద్దని రాఘవతో అంటాడు. బావ తిరిగి రాగానే తమ వివాహం.. అత్త మామయ్య యిష్టానుసారంగా మరోసారి జరుగుతుందని అంటుంది సీత. ఆ రాత్రికి రాఘవ – అద్వైత్, సీత, సుల్తాన్ భాయ్ లను తన మిత్రుడు గంటన్న ఉండే గూడేనికి సీతని, అద్వైత్‍ని తీసుకువెళ్తాడు. వాళ్ళ ఆతిథ్యాలు, ఆటపాటలు అయ్యాకా, పడుకోడానికి తమకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడిసెలోకి వెళ్తారు అద్వైత్, సీత. తాము ఏకాంతంగా ఉన్నామని గ్రహించిన సీత చొరవ తీసుబోతే సున్నితంగా వారిస్తాడు అద్వైత్. తాను తిరిగి వచ్చే వరకు సీత స్వచ్ఛంగా.. ఎవరి వలనా ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కోకుండా వుండాలనేది తన కోరిక అని చెప్తాడు. మర్నాడు ఉదయమే లేచి దగ్గర్లోని సెలయేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు అద్వైత్. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాఘవ – తాను అల్లూరి సీతారామరాజుని కలిసినట్టు, ఆయనతో మాట్లాడినట్టు చెప్పి – ఆయన చేసిన కర్తవ్య బోధను వివరిస్తాడు. కాసేపయ్యాకా, గంటన్న దగ్గర, వారి కుటుంబీకుల దగ్గర వీడ్కోలు తీసుకుని భద్రాచలం బయల్దేరుతారు. – ఇక చదవండి.]
అధ్యాయం 39:
[dropcap]రా[/dropcap]త్రి ఎనిమిది గంటలకు అద్వైత్ సీత సుల్తాన్లు రాజమండ్రికి చేరారు.
పాండురంగకు సుమతికీ ఇరువురూ వారి యాత్ర వివరాలను వివరించారు. కలసి భోంచేశారు. శయనించారు. మరుదినం.. పది గంటలకు నరసింహశాస్త్రి.. సావిత్రి విశాఖపట్నం నుంచి తిరిగి వచ్చారు.
అద్వైత్.. తల్లి తండ్రికి తాను సీత సుల్తాన్ భాయ్ భద్రాచలం వెళ్ళి రాఘవను చూచి వచ్చిన విషయాన్ని తెలియజేశాడు. వారు.. వీరు భద్రాద్రి సీతారాముల దర్శనాన్ని చేసుకొని వచ్చినందుకు సంతోషించారు.
మరుదినం.. ఆదివారం. సోమవారం ఉదయం అద్వైత్.. ఇండియా ఆండ్రియా మేరీలతో మద్రాసుకు వెళ్ళి.. అక్కడ నుంచి స్టీమర్‍లో లండన్ పయనించబోతున్నారు.
అద్వైత్ దుస్తులు.. అతనికి కావలసిన ఇరత సామాగ్రిని పాండురంగ.. సుమతీ.. సీతలు క్రమంగా సర్దారు.
మూడు గంటల ప్రాంతంలో ఆండ్రియా.. ఇండియా.. మేరీలు నరసింహశాస్త్రిగారి ఇంటికి వచ్చారు. వారిని చూచిన నరసింహశాస్త్రి సాదరంగా ఆహ్వానించాడు. పెద్దలిద్దరూ కూర్చున్నారు. ఇండియా లోనికి వెళ్ళింది.
“సార్!.. రేపు ఉదయం మా ప్రయాణం..” ఆంగ్లంలో చెప్పింది ఆండ్రియా.
“ఆ విషయం నాకు తెలుసుగా!..” నవ్వారు నరసింహశాస్త్రి.. ద్వారం దగ్గర నిలబడి వున్న సావిత్రి వైపు చూచాడు. సావిత్రి ఆ చూపులోని అర్థాన్ని గ్రహించి వంట ఇంటిలోకి వెళ్లింది.
“మీరు మీ అద్వైత్‌ను మాతో పంపుతున్నందుకు మాకు ఎంతో ఆనందంగా వుంది. మా మాటను మీరు గౌరవించినందుకు మీకు ధన్యవాదాలు” చిరునవ్వుతో చెప్పింది మేరీ.
“ఆ యోగాన్ని మీరు వాడికి కల్పించారు. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి” చేతులు జోడించారు నరసింహశాస్త్రి.
“మీ శిష్యరికంలో మా ఇండియా.. మీ భాషతో పాటు ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకుంది. ఆమెను మీరు ఎంతో ప్రేమాభిమానాలతో చూచారు” అంది ఆండ్రియా.
“ఇండియా.. చాలా గొప్ప వ్యక్తిత్వం వున్న యువతి. అలాంటి మనస్సు ఏ కొందరికో వుంటుంది. ఆ సర్వేశ్వరుడు ఆమెను అన్ని వేళగా చల్లగా చూస్తాడు” ఎంతో ప్రీతిగా చెప్పారు నరసింహశాస్త్రి.
సావిత్రి.. కాఫీ కప్పులతో వచ్చింది. ఆ ఇరువురికీ అందించింది.
“వారికి..” అడిగింది ఆండ్రియా.
“మీరు రాబోయే ముందు త్రాగారు..” ఆంగ్లంలోనే జవాబు చెప్పింది సావిత్రి.
చిరునవ్వుతో సావిత్రి ముఖంలోకి చూచాడు నరసింహశాస్త్రి. సావిత్రి బిడియంతో తల దించుకొంది. “కాఫీ చాలా బాగుంది..” అంది మేరీ.
“నా భార్య మనస్సూ అలాంటిదే!..” నవ్వుతూ చెప్పాడు నరసింహశాస్త్రి. కొన్నిక్షణాల తర్వాత..
“మీయందు నాకు వున్న నమ్మకంతో నేను అద్వైత్‍ను మీతో పంపుతున్నాను. మా ఆచార వ్యవహారాలు వేరు.. మీ సాంప్రదాయాలు వేరు. నా కొడుకు తత్వాన్ని మార్చేటందుకు ప్రయత్నించకండి. వాడు చిన్నవాడు. జీవితానుభవం తక్కువ. వాడు రేపు మీతో కలసి ఏ రీతితో వస్తున్నాడో.. అదే రీతితో వాణ్ణి కొంతకాలం తర్వాత ఇండియాకు పంపవలసిన బాధ్యత మీది..” చెప్పారు శాస్త్రిగారు.
“కొంత అంటే ఎంత?..” మెల్లగా అడిగింది సావిత్రి.
నరసింహశాస్త్రి భార్య ముఖంలోకి కొన్ని క్షణాలు చూచాడు.
“సావిత్రీ.. అది దైవ నిర్ణయం. జరగవలసిన రీతిగా జరుగుతుంది” అనునయంగా చెప్పారు నరసింహశాస్త్రి.
“మీ అద్వైత్‍కు అక్కడ ఏ లోటూ వుండదు. ఐదారు నెలల తర్వాత నేను ఇండియాకు తిరిగి వస్తాను. నాతో అద్వైత్‍ను తీసికొని వస్తాను సార్!..” అంది ఆంగ్లంలో ఆండ్రియా.
“హియీజ్ ఓన్లీ సన్ ఫర్ అజ్..” అంది సావిత్రి ఆండ్రియా ముఖంలోకి చూస్తూ.
నరసింహశాస్త్రి సావిత్రి ముఖంలోకి చూచారు. ఆమె తలను దించుకొంది.
“ఐ నో దట్.. వుయ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఇన్ ఆల్ యాస్పెక్ట్స్.. డోంట్ వర్రీ మేడం..” నవ్వుతూ చెప్పింది ఆండ్రియా.
రెడ్డి రామిరెడ్డిగారు వీధి తలుపును తెరచుకొని లోనికి రావడాన్ని ఆండ్రియా చూచింది.
“సార్!.. థాంక్యూ!.. వుయ్ విల్ గో నౌ!..” వినయంగా చెప్పి నమస్కరించింది. “ఓకే మేడమ్. వెళ్ళి రండి..” అన్నారు నరసింహశాస్త్రి.
“కెన్ యు ప్లీజ్ కాల్ ఇండియా!..” సావిత్రి ముఖంలోకి చూస్తూ అడిగింది ఆండ్రియా.
“యస్ మేడమ్..” సావిత్రి లోనికి వెళ్ళింది.
రామిరెడ్డిగారు వరండాను సమీపించి శాస్త్రిగారికి నమస్కరించారు.
“రండి కూర్చోండి..” అన్నాడు నరసింహశాస్త్రి.
రెడ్డిగారు కూర్చున్నారు.
“మీతో ముఖ్యమైన విషయాన్ని చెప్పాలని వచ్చాను శాస్త్రిగారూ!..” చిరునవ్వుతో చెప్పాడు.
ఇండియా వరండాలోకి వచ్చింది.
“మమ్మీ!.. ఐ విల్ కమ్ లేటర్..” అంది.
“ఓకే.. కమ్.. సూన్..”
“ఆల్ రైట్..” చెప్పి లోనికి వెళ్ళింది ఇండియా.
నరసింహశాస్త్రికి మరో మారు చెప్పి ఆండ్రియా మేరీలు వీధి గేటును దాటి కార్లో కూర్చున్నారు. వెళ్ళిపోయారు. నరసింహశాస్త్రి రెడ్డిగారి ముఖంలోకి చూచి.. “విషయం ఏమిటో చెప్పండి..” అడిగాడు.
“శ్రీ మహాలక్ష్మి దేవి బంగారు విగ్రహం తయారయింది. మన ఉభయులం వెళ్ళి చూచి రావాలి. ఏ రోజు వెళదామో మీరు చెప్పాలి..” చిరునవ్వుతో చెప్పాడు రెడ్డిగారు.
“మీరు చెప్పిన వార్త విన్న నాకు ఎంతో ఆనందంగా వుంది. వచ్చే గురువారం నాడు వెళదాం. సరేనా!..” “అలాగే శాస్త్రిగారు. ఇక నేను బయలుదేరుతాను..”
“మన అద్వైత్ రేపు వాళ్ళతో కలసి లండన్ వెళుతున్నాడు..”
“రేపేనా!..”
“అవును..”
“మంచిది.. వెళ్ళి రానివ్వండి. తిరిగి వచ్చాక వెంటనే పెండ్లి చేసేద్దాం” నవ్వాడు రామిరెడ్డి.
“వాళ్ళ అమ్మకు ఇష్టం లేదు..” సాలోచనగా చెప్పాడు నరసింహశాస్త్రి.
“తల్లి కదా!.. ఆమె భావన అలాగే వుంటుంది.. కానీ.. అందరికీ అలాంటి అదృష్టం రాదుగా!.. మన బిడ్డలకు పట్టిన అదృష్టాన్ని గురించి మనం సంతోషించాలే కాని విచారపడకూడదుగా!.. అన్నీ తెలిసిన వారు.. మీరే ఆమెకు నచ్చచెప్పాలి..” చిరునవ్వుతో చెప్పాడు రెడ్డిగారు.
వసుంధర.. రిక్షాలో వచ్చి వాకిట్లో దిగింది.
“ఇక నేను బయలుదేరుతాను శాస్త్రిగారూ!.. అరుగో అక్కయ్యగారు వచ్చారు!..”
నరసింహశాస్త్రి.. రెడ్డిగారు వీధి వాకిటి వైపుకు నడిచారు. రిక్షా అతనికి డబ్బులు యిచ్చి చేతి సంచితో వసుంధర వీధి గేటును తెరచింది.
నరసింహశాస్త్రి.. రెడ్డిగారు గేటును సమీపించారు.
“నమస్కారం అమ్మా!.. బాగున్నారా!..” ప్రీతిగా అడిగాడు రెడ్డిగారు.
“ఆఁ.. బాగున్నాను రామిరెడ్డి.. మన ఇంట్లో అందరూ కులాసేనా!..” అడిగింది వసుంధర.
“అందరూ క్షేమం అమ్మా.. వెళ్ళొస్తాను” రెడ్డిరామిరెడ్డిగారు వెళ్ళిపోయారు.
నరసింహశాస్త్రి చిరునవ్వుతో అక్కగారి చేతిలోని సంచిని తన చేతిలోకి తీసికొన్నారు.
“అక్కా!.. కౌలుదార్లు డబ్బును ఇచ్చారా!..”
“ఆఁ.. ఆ.. ఇచ్చారు. ఇవ్వకేం చస్తారా!.. ఎవడబ్బ సొమ్ము!.. అవునురా నరసింహా!.. సావిత్రి పిల్లలూ ఏరీ?..”
“అంతా ఇంట్లో వున్నారక్కయ్యా!.. రేపు అద్వైత్ ఆండ్రియా మేడం వాళ్ళతో కలసి లండన్ ప్రయాణం కదా!..”
“ఆఁ.. అవునవును..”
ఇరువురూ వరండాలోకి వచ్చారు.
వంట ఇంట్లో నుంచి బయటికి వచ్చిన సావిత్రి వసుంధరను చూచి వరండాలోకి వచ్చింది.
“వదినా!.. ఆరోగ్యం బాగుందిగా!..”
భర్త వైపు చూచి.. నరసింహశాస్త్రిగారి చేతిలోని సంచిని అందుకొంది.
ఆ వదిన మరదళ్ళు ఇంట్లోకి వెళ్ళారు.
నరసింహశాస్త్రి వరండాలో కూర్చున్నాడు. వారి మనస్సులో అద్వైత్‍ను గురించిన ఆలోచనలు. కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు.
అద్వైత్ గదిలో వున్న సుమతి.. పాండురంగలు బయటికి వచ్చారు.
గదిలో మిగిలింది అద్వైత్, సీత.. ఇండియా.
ఇండియా సీతను సమీపించింది. తన మెడలో వున్న బంగారు గొలుసును తీసి సీత మెడలో వేసింది.
“సీత!.. నీవంటే నాకు ఎంతో ఇష్టం. రేపు నేను లండన్‍కు వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు వస్తానో చెప్పలేను. నేను నీ మెడలో వేసిన ఆ గొలుసును నా జ్ఞాపకార్థంగా వుంచుకో. నా చర్యల వలన ఎప్పుడైనా నీ మనస్సుకు కష్టం కలిగి వుంటే సహృదయంతో నన్ను మన్నించు. నా దృష్టిలో నీవు నాకు చెల్లెలివి” నవ్వుతూ చెప్పింది ఇండియా.
సీత.. అద్వైత్ వూహించలేదు. ఇండియా.. తన మెడలోని దండను తీసి సీత మెడలో వేస్తుందని.. అంత అభిమానంగా మాట్లాడుతుందని.. అద్వైత్ సీతలు ఒకరి మొఖాలు ఒకరు చూచుకొన్నారు.
“సార్!.. సీతా!.. ఇకనే వెళతాను.” చెప్పి గది నుంచి బయటికి వచ్చింది ఇండియా.
వంట ఇంట్లోని సావిత్రి.. వసుంధరల మాటలు ఆమెకు వినిపించాయి. మెల్లగా వంట ఇంట్లోకి ప్రవేసించింది.
“అమ్మా!..” పిలిచింది.
ఏదో వసుంధరతో చెప్పబోయిన సావిత్రి ఆ పిలుపు విని.. ద్వారం వైపు చూచింది.
చిరునవ్వుతో ఇండియా.. కనుపించింది.
“రా ఇండియా!..” ప్రీతిగా పిలిచింది.
ఇండియా ఆమెను సమీపించి.. వంగి తన చేతులతో సావిత్రి పాదాలను తాకింది.
“నేను రేపు లండన్ వెళ్ళిపోతున్నాను. నా భవిష్యత్తు నాకు తెలియదు. పది మందికి మంచి చేయాలనే ఆశ నాలో వుంది. నన్ను దీవించండి” అంది ఇండియా.
సావిత్రి తన కుడి చేతిని ఆమె తలపై వుంచి.. “నీ కోర్కెను ఆ భగవంతుడు తప్పక నెరవేర్చుతాడు. లే..” తన చేతులతో ఆమె భుజాలను పట్టుకొని పైకి లేపింది.
ఇండియా కన్నీటితో సావిత్రిని కౌగలించుకొంది.
“మిమ్మల్నందరినీ విడిచి వెళ్ళేదానికి మనస్సు..”
“అద్వైత్‌తో తిరిగి వచ్చేయ్ ఇండియా..” అని – ఇండియా పూర్తి చేయక ముందే అంది సావిత్రి. తన పవిటతో ఇండియా కన్నీటిని తుడిచింది.
ఇండియా వసుంధరకూ నమస్కరించింది.
“చల్లగా వుండు తల్లీ!..” దీవించింది వసుంధర.
“వెళ్ళొస్తాను..” మెల్లగా చెప్పింది ఇండియా.
వంట ఇంటి ద్వారం దగ్గరకు వచ్చిన ఆగిన సీత.. లోన జరిగిన దృశ్యాన్ని చూచింది. ఆ క్షణంలో ఇండియా పట్ల సీతకు ద్వేషం లేదు. ‘ఇండియా మంచిది’ అనుకొంది.
“ఏదీ ఒకసారి.. నీవు పిలవాలనుకొన్న.. రీతిలో నన్ను పిలువు ఇండియా!..” నవ్వుతూ అంది సావిత్రి. ఇండియా ముఖంలో చిరునవ్వు..
“వెళ్ళొస్తాను అత్తయ్యగారూ!..” అంది.
“మంచిదమ్మా!..” ఆనందంగా చెప్పింది సావిత్రి.
ఇండియా మౌనంగా ముందుకు నడిచింది. క్షణంసేపు సీత ముఖంలోకి చూచి..
“ఇండియా!..”
ఆమె వెను తిరిగి చూచింది.
సీత ఇండియాను సమీపించింది. ఇండియా చేతులను తన చేతుల్లోకి తీసికొని..
“కొన్ని పర్యాయాలు నేను నిన్ను నొప్పించాను. నన్ను క్షమించు ఇండియా”
ఇండియా విరక్తిగా నవ్వి.. “అక్కా చెల్లెళ్ళ మధ్యన కోపతాపాలకు క్షమాపణలు చెప్పుకోవడాలకు తావు లేదు సీతా!.. చెప్పానుగా.. నీవంటే నాకు ఎంతో ఇష్టం అని” నవ్వుతూ చెప్పింది ఇండియా. సీత చేతుల్లోని తన చేతులను విడిపించుకొని.. వరండా వైపుకు నడచింది.
కుర్చీలో వెనక్కు వాలి.. కళ్ళు మూసుకొని వున్న నరసింహశాస్త్రి గారి ముందు వచ్చి మోకాళ్ళపైన కూర్చొని తన చేతులతో వారి పాదాలను తాకింది ఇండియా.
చల్లని ఇండియా చేతులు నరసింహశాస్త్రి పాదాలను స్పృశించగానే.. వారు ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. తన ముందు వున్న ఇండియాను చూచారు. శాస్త్రిగారు తలను దించి ప్రీతిగా ఆమె ముఖంలోకి చూస్తూ..
“అమ్మా!.. ఏమిటమ్మా ఇది!..”
“నాకు మీ ఆశీర్వచనాలు కావాలి గురూజీ.. రేపు లండన్‍కు వెళుతున్నానుగా!..” అంది ఇండియా దీనంగా.
“హు.. తల్లీ!.. నిన్ను వెన్నంటి నా ఆశీర్వాదం ఎప్పుడూ వుంటుందమ్మా!.. కారణం.. నీవు నాకు ఎంతో ప్రియమైన శిష్యురాలివి..” నవ్వుతూ చెప్పారు.
“మరలా మిమ్మల్ని నేను ఎప్పుడు చూడగలనో!..” విచారంగా అంది ఇండియా.
“ఇరువురు కలవడం.. విడిపోవడం.. మన నిర్ణయానుసారంగా జరగదు తల్లీ. అది ఆ సర్వేశ్వరుని నిర్ణయానుసారంగా జరుగుతుంది. అయితే.. మనలో సంకల్పం వుండాలి..”
“నాలోనూ ఆ సంకల్పం వుంది గురూజీ!..”
“నీ సంకల్పాన్ని ఆ పరంధాముడు తప్పక నెరవేరుస్తాడు..” చిరునవ్వుతో చెప్పారు నరసింహశాస్త్రి. అద్వైత్.. సీతలు వరండాలోకి వచ్చారు. వారిని చూచి ఇండియా లేచి నిలబడింది.
సుల్తాన్ కారుతో వచ్చి వీధి గేటు ముందు ఆపి.. లోనికి వచ్చాడు. వరండా వైపుకు రాసాగారు.
“నాన్నా!.. నేను.. సీత గౌరి మేడంను కలిసి, పేపర్లు యిచ్చి లండన్‍కు వెళుతున్న విషయాన్ని చెప్పి వస్తాము” అన్నాడు అద్వైత్.
“మంచిది నాన్నా!.. వెళ్ళి రండి..” సాలోచనగా వారిరువురినీ చూస్తూ చెప్పారు నరసింహశాస్త్రి.
సుల్తాన్ వరండాను సమీపించి శాస్త్రిగారికి నమస్కరించి..
“అమ్మా!.. అమ్మగారు మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నారు” ఇండియా వైపు చూస్తూ చెప్పాడు.
“వెళదాం సుల్తాన్ భాయ్!..” చెప్పి అద్వైత్ ముఖంలోకి చూస్తూ.
“సార్!.. నేనూ మీతో వస్తాను. గౌరీ మేడమ్‍ను కలసి లండన్‍కు వెళుతున్న విషయాన్ని చెప్పాలి. రండి ముగ్గురం కార్లో వెళదాం” అంది.
అద్వైత్ తండ్రిగారి ముఖంలోకి చూచాడు.
“ముగ్గురూ వెళ్ళేది గౌరిని చూచేటందుకేగా!.. కలసి వెళ్ళండి..” చిరునవ్వుతో చెప్పారు.
సుల్తాన్ ముందు నడువగా.. ఆ ముగ్గురూ వారి వెనుక నడచి వీధి గేటు ముందుకు వచ్చి.. కార్లో కూర్చున్నారు. అద్వైత్ సుల్తాన్ ప్రక్కన కూర్చున్నాడు. సీత ఇండియాలు వెనక కూర్చున్నారు.
యిరవై నిముషాల్లో కారు గౌరి ఇంటి ముందు ఆగింది. ముగ్గురూ కారు దిగారు.
వరండాలో కూర్చొని వారపత్రికను చదువుతూ వున్న గౌరి వారిని చూచి లేచి వారికి ఎదురయింది. ముగ్గురూ ఆమెకు నమస్కరించారు.
“మీ.. మీ మనస్సుల్లో ఏ కోరికలు వున్నాయో.. నాకు తెలియదు. కానీ.. నేను మీ ముగ్గురి కోర్కెలను తీర్చమని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తాను. రండి..” నవ్వుతూ చెప్పింది.
నలుగురూ వరండాలో ప్రవేశించారు.
“కూర్చోండి..” తను కూర్చుంటూ చెప్పింది గౌరి.
అద్వైత్ తన చేతిలో పేపర్ల కట్టలను ఆమె ముందున్న టీపాయ్‍పై వుంచాడు.
“మేడమ్.. అందరూ పరీక్షలు బాగా వ్రాశారు. మంచి మార్కులు తెచ్చుకున్నారు”
“వారంతా ఎవరి శిష్యులు.. శిష్యురాండ్రు.. నీ వారేగా!..” నవ్వుతూ చెప్పింది గౌరి.
“మేడం!.. రేపే నా లండన్ ప్రయాణం..”
“క్షేమంగా వెళ్ళి లాభంతో తిరిగిరా అద్వైత్. నీ సామర్థ్యం నాకు తెలియంది కాదుగా.. పైగా అక్కడ నీకు మన ఇండియా తోడుగా వుంటుందిగా.. నీ ప్రతిభను అక్కడి బాలబాలికలకు పంచి మంచి గురువు అనే పేరుతో తిరిగిరా. యీ స్కూల్లో నీ స్థానం ప్రత్యేకం.. అది ఎప్పుడూ నీ రాకను ఎదురు చూస్తూనే వుంటుంది” నవ్వుతూ చెప్పింది గౌరి.. సీత ముఖంలోకి చూచింది.
దిగులుగా తల దించుకొని కూర్చొని వుంది సీత.
“ఏయ్!.. సీతా!.. గలగలా మాట్లాడే దానివి మౌనంగా కూర్చొని వున్నావేం!.. బావ లండన్ వెళ్ళిపోతున్నాడని దిగులా.. త్వరలో మంచి పేరు ప్రఖ్యాతులతో తిరిగి వస్తాడుగా!.. అలాంటి అవకాశం అందరికీ రాదుగా!.. సంతోషించు..” నవ్వుతూ చెప్పింది గౌరి.
అవునన్నట్లు సీత తల ఆడించింది.
ఇండియా తల వంచి క్షణంసేపు సీత ముఖంలోకి చూచింది. ఆమె కళ్ళల్లో కన్నీటిని చూచింది.
“సీతా!.. బాధ పడుతున్నావా!.. నీ బావగారిని నేను జాగ్రర్తగా నా ప్రాణ సమానంగా చూచుకొంటాను. భయపడకు.. బాధపడకు..” అనునయంగా చెప్పింది ఇండియా.
“విన్నావుగా!.. ఇండియా చెప్పిన మాట. అంతటి భరోసాను ఇచ్చే ఇండియా అద్వైత్‍కు తోడునీడగా వుండేటప్పుడు నీ బావను గురించి నీవు దిగులు పడకూడదు. అద్వైతకు కలసి వచ్చిన అదృష్టాన్ని తలచుకొని సంతోషించాలి సీతా!..” అంది గౌరి.
‘మీకు మా యిరువురి మధ్యన ఏర్పడిన బంధాన్ని గురించి తెలియదు. మంచి మాటలను చెప్పి నన్ను అనునయిస్తున్నారు. కానీ నా మనస్సులో వేదన.. దాన్ని గురించి నేను ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితి.. భగవాన్ నన్ను బేలను చేయకు. ధైర్యాన్ని ప్రసాదించు..’ అనుకొంది సీత.
“మేడం!.. నాకు మీ ఆశీర్వచనాలు కావాలి!..” వంగి గౌరి.. పాదాలను తాకింది ఇండియా.
“నీ మనస్తత్వానికి.. నీలోని మానవతావాదానికి.. ఆ దైవం.. ఎప్పుడు నీకు అండగా వుంటాడు. నీ కోర్కెలన్నీ తప్పక తీరుతాయి” తన కుడిచేతిని ఇండియా తలపై వుంచి దీవించింది గౌరి.
అద్వైత్ కుర్చీ నుంచి లేచాడు. సీతా.. ఇండియాలు లేచారు.
“వెళ్ళి వస్తాము మేడం..”
“కాఫీ త్రాగి వెళ్ళుదురుకాని కూర్చోండి” కుర్చీ నుంచి లేచింది గౌరి. వేగంగా యింట్లోకి వెళ్ళింది.
అద్వైత్ లేచి ఇంటి ముందు క్రమంగా గౌరి నాటించిన పూల మొక్కలను వాటికి పూసిన పూలను చూస్తూ గేటు వరకూ నడిచాడు. అతని వెనకాలే సీత రావడాన్ని అతను గమనించలేదు. గేటు ముందు నుంచి వేగంగా వెనక్కు తిరిగాడు. అతని కాలు సీతకు తగిలి పడబోయింది. ఆందోళనతో తన చేతిని సీత నడుము చుట్టూ వేసి పడబోయిన సీతను ఆపాడు.
“నా వెనకాలే వున్న దానివి నన్ను పలకరించాలిగా!.. క్షణం నేను చేయి పెట్టడంలో ఆలస్యం అయితే నేలపడే దానివి సీతా!..” ఆందోళనగా అన్నాడు అద్వైత్ సీత ముఖంలోకి చూస్తూ.
సీత నవ్వుతూ.. “నా ముందు నీవు వున్నప్పుడు నాకేం భయం బావా!..” క్రీగంట చూస్తూ అందంగా నవ్వింది
ఆ సన్నివేశాన్ని ఇండియా చూచింది. అద్వైత్ ఇంట్లో గతంలో ఒకనాడు తన విషయంలోనూ అద్వైత్ అలాగే ప్రవర్తించాడు. ఆ సన్నివేశాన్ని తలచుకొని ఇండియా వారిరువురినీ చూస్తూ నవ్వుకొంది.
‘అద్వైత్!.. అసమాన వీరుడు. అందరి అభిమాని..’ అనుకొంది ఇండియా.
గౌరి కాఫీ ప్లేటుతో వరండాలోకి వచ్చింది. ఆమె రాకను చూచి సీత అద్వైత్‍లు వరండాలోకి వచ్చారు. గౌరి ముగ్గురికీ ప్రీతిగా కాఫీ కప్పులను అందించింది చిరునవ్వుతో.
ముగ్గురూ కాఫీ త్రాగారు.
వెళ్ళొస్తామని చెప్పి.. వీధి గేటు వైపుకు నడిచారు. వెనకాలే గౌరి వచ్చింది.
తమతో వస్తున్న గౌరిని చూచి అద్వైత్…
“మేడం మీరు ఆగండి. మేము వెళతాం..” అన్నాడు.. క్షణం తర్వాత.. గౌరి ముఖంలోకి చూస్తూ.. “మేడం!.. సీతను జాగ్రత్తగా చూచుకోండి..” అభ్యర్ధనగా కోరాడు అద్వైత్.
“అలాగే అద్వైత్!..” నవ్వుతూ చెప్పింది గౌరి.
ముగ్గురూ కారును సమీపించారు.
“కూర్చోండి..” అంది ఇండియా
“బావా!..” అంది సీత.
అద్వైత్ సీత ముఖంలోకి చూచాడు.
“యిక్కడికి గోదావరి ఒడ్డు దగ్గరే కదా!.. మనం పావుగంట ఆ ఒడ్డున నడిచి ఇంటికి వెళదాం.. కాదనకు” మెల్లగా చెప్పింది సీత
“అమ్మా బయలుదేరుతారా!..” ఇండియాను చూస్తూ అడిగాడు సుల్తాన్.
“మీరు నాతో వస్తే మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి నేను వెళతాను” అంది ఇండియా.
సీత అద్వైత్ ముఖంలోకి దీనంగా చూచింది. క్షణంసేపు ఆమె ముఖంలోకి చూచి.. ఇండియా వైపు తిరిగి.. “ఇండియా.. మీ అమ్మగారు రమ్మన్నారుగా!.. యిప్పటికే ఆలస్యం అయింది. నీవు ఇంటికి వెళ్ళు. మేము నడిచి వెళతాం..” చెప్పి సీత వైపు చూచి.. “సీతా!.. పద..” అన్నాడు అద్వైత్.
“ఓకే!..” ఇండియా కార్లో కూర్చుంది. సుల్తాన్ కారును కదిలించాడు.
“అద్వైత్!.. సీతను నేను చూచుకొంటాను. నీవు జాగ్రర్తగా వెళ్ళిరా!..” నవ్వుతూ చెప్పింది గౌరి.
“అలాగే మేడం.. ధ్యాంక్యూ..” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.
గౌరి ఇంటి వీధి గేటును మూసి లోనికి నడిచింది.
అద్వైత్.. సీతలు ప్రక్క ప్రక్కన నడుచుకొంటూ పదినిముషాల్లో నడి ఒడ్డుకు చేరారు.
అది వైశాఖమాసం.. ఎండల తీవ్రత వలన నదిలో నీళ్ళు నిండుగా లేవు. పల్లపు ప్రాంతాల్లో పాయలుగా ప్రవహిస్తున్నాయి.
ఇరువురూ నదిలో దిగి యిసుకలో కూర్చున్నారు.
తన్నే తదేకంగా చూస్తున్న సీత ముఖంలోకి చూస్తూ.. “సీతా!.. ఏమిటలా చూస్తున్నావు!..” అన్నాడు.
“రేపటి తర్వాత మరి కొంతకాలం నిన్ను చూడలేనుగా బావా!..”
“నీ హృదయం నిండా నేనే వున్నానన్నావుగా!”
“కళ్ళకు హృదయం లేదుగా!..”
“హృదయపు ప్రతిబింబాలే మన కళ్ళు సీతా!.. మంచి మనస్సు వున్న మనిషి భావాలను మాట్లాడని కళ్ళు వ్యక్తం చేస్తాయి”
“నా కళ్ళు మీకు ఏమి వ్యక్తం చేశాయి?..”
“నీ తనువు.. మనస్సు.. కళ్ళతో సహా నావేనని తెలియజేశాయి” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.
సీత పరవశంతో అతని చేతులపై వాలిపోయింది.
“బావా!.. ఎప్పుడు తిరిగి వస్తావు?” మెల్లగా అడిగింది.
“నా సర్వస్వం నీవుగా యిక్కడ వున్నప్పుడు.. నేను అక్కడ ఎంతో కాలం వుండలేను సీతా.. త్వరలో వచ్చేస్తాను”
“అదే.. ఎప్పుడు..”
“ఐదారు నెలల్లో..”
“తప్పకుండా!..”
“అవును..” సీతను లేపి కూర్చోపెట్టి..
“సీతా!.. నేను తిరిగి వచ్చేవరకూ నీ మెడలో నేను కట్టిన మాంగల్యాన్ని మనవారెవరి కంటా పడకుండా నీవు జాగ్రర్తగా వుండాలి సుమా!..”
“ఆ విషయం నాకు తెలుసు కదా బావా!.. ఇంకేమన్నా చెప్పు!..”
“ఏం చెప్పమంటావు సీతా!..”
“నా గురించి..”
“చెప్పానుగా.. నీవు నా సర్వస్వం అని.. ఇంతకంటే వేరే ఏం చెప్పాలో నాకు తోచటం లేదు సీతా!..” అనునయంగా చెప్పాడు అద్వైత్.
“బావా!.. నామీద నీకు కోపం లేదా!..”
“తన ప్రాణం మీద ఎవరికైనా కోపం వుంటుందా!..”
“ఆ రాత్రి.. నేను..”
“అది దైవ నిర్ణయంగా నేను భావించాను సీత.. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు..”
“నిజంగా!..”
“సత్యంగా!..”
“మనమిద్దరం భద్రాచలం వెళ్ళినట్లుగా లండన్ వెళ్ళలేము కదా బావా!..”
“ప్రస్తుతంలో కుదరదు. భవిష్యత్తు.. నాకు తెలియదు”
“ఇంట్లో మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకోలేము కదా బావా!..”
“అవును.. అందుకే నీవు అడగగానే నీతో యిక్కడికి వచ్చాను. నా మాటలు నీకు ఆనందాన్ని కలిగించాయా!..”
“చాలా ఆనందాన్ని బావా.. మాటలతో చెప్పలేను”
“రేపు అందరి ముందూ మనం నోరు విప్పి మాట్లాడుకోలేము. మన ఇరువురి నయనాలు తప్ప..”
“వాటికీ భాష వుందనీ నీ కళ్ళు నా కళ్ళకు నేర్పాయి బావా!..”
“అలాగా!..”
“అవును..”
అద్వైత్ లేచి నిలబడ్డాడు. సీత లేచి అతన్ని సమీపించింది. ఆమె భుజాలను పట్టుకొని దగ్గరకు తీసికొని తన హృదయానికి హత్తుకొన్నాడు అద్వైత్.
కొన్ని క్షణాలు పరవశంతో వారు తేలిపోయారు. పైన ఎగిరే పక్షుల రవాన్ని విని వారు యీ లోకంలోకి వచ్చారు. అద్వైత్ సీత చేతిని తన చేతిలోకి తీసికొన్నాడు. ఇరువురూ ఆనందంగా ఇంటి వైపుకు నడిచారు.
అధ్యాయం 40:
ఆ రాత్రి భోజన సమయానికి ముందు.. సీత సుమతీలు వంటిట్లో వున్న సావిత్రిని నవ్వుతూ సమీపించారు.
“ఏమిటే.. నవ్వులు పువ్వులై గుబాళిస్తున్నాయి మీ యిరువురి ముఖాల్లో!..” అడిగింది సావిత్రి. సుమతి.. చిరునవ్వుతో తల దించుకొంది.
సీత సుమతిని చూచి పరమానందంగా నవ్వసాగింది.
“ఏందే పిచ్చి పిల్లా!.. ఆ నవ్వు!..”
“సుమతిని చూడండత్తయ్యా!..”
సావిత్రి సుమతి ముఖంలోకి చూచింది. క్షణం సేపు సావిత్రి ముఖంలోకి చూచి చిరునవ్వుతో తల దించుకొంది సుమతి.
కొన్ని క్షణాల తర్వాత సావిత్రి ఆనందంగా నవ్వుతూ!..
“సుమతీ!..” అంది.
అవునన్నట్లు సుమతి తల ఆడించింది.
సావిత్రి సుమతి భుజాలను పట్టుకొని.. “నిజంగానా!..” అంది.
“అవును..” మెల్లగా చెప్పింది సుమతి.
“నాతో చెప్పలేదేమ్మా!..” చిరుకోపాన్ని ప్రదర్శించింది సావిత్రి.
సుమతిని తన హృదయానికి హత్తుకొని.. “పండంటి మొగ బిడ్డను కను తల్లీ!.. పసిబిడ్డ ఏడుపు బోసి నవ్వులు యీ ఇంట వినిపించి చాలా కాలమయింది” ఎంతో సంతోషంతో చెప్పింది సావిత్రి.
వేగంగా వరండా వైపుకు వెళ్ళి అక్కడ కూర్చొని వున్న నరసింహశాస్త్రిని.. వసుంధరను చూస్తూ
“ఏమండీ!.. వదినా!.. మన యింటికి త్వరలో బోసి నవ్వుల బుజ్జాయి రాబోతున్నాడు సుమతి మూలంగా!..” నవ్వుతూ చెప్పింది సావిత్రి.
“ఏమిటీ!..” ఆశ్చర్యంతో అడిగారు నరసింహశాస్త్రి
“అవునా!..” అడిగింది వసుంధర.
“అవును.. అవును..”
“చాలా సంతోషకరమైన వార్తను వినిపించావు సావిత్రి.” పరమానందంతో చెప్పారు నరసింహశాస్త్రి.
సీత వరండాలోకి వచ్చింది. లడ్లు వున్న ప్లేటుతో.. తాను సావిత్రి వసుంధర శివాలయానికి వెళ్ళివుండగా అద్వైత్‍కు ఇష్టమని లడ్డుండలను చేసి డబ్బాలో మూతపెట్టి దాచింది.
నరసింహశాస్త్రిని సమీపించి తట్ట ముందుకు సాచి..
“తీసికొండి మామయ్యా!..” నవ్వుతూ చెప్పింది.
నరసింహశాస్త్రి ఆనందంగా లడ్డును చేతికి తీసికొన్నాడు. తుంచి నోట్లో వేసికొని.. “సీతా!.. లడ్డు అద్భుతం అమ్మా!..” అన్నారు.
సావిత్రికి ఆశ్చర్యం.. “యిప్పటికిప్పుడు లడ్లు ఎలా వచ్చాయి. ఏ పిల్లా!.. ఆ లడ్లు ఎక్కడివే!..”
“తయారు చేశాను..”
“ఎప్పుడు!..”
“నిన్ను మీరు బామ్మ.. గుడికి వెళ్ళినప్పుడు.. బావకు ఇష్టం అని చేశాను.. ఏం తప్పా!..”
వసుంధర ముందుకు నడిచి.. “బామ్మా.. తీసికొని తిని ఎలా వుందో చెప్పు..” అంది సీత.
వసుంధర తిని.. “ఒసే సావిత్రీ! .. ఇది లడ్డును ఎంత కమ్మగా చేసిందే. తిని చూడు..” అంది.
సీత నవ్వుతూ సావిత్రిని సమీపించి.. లడ్డును తన చేతికి తీసికొని ఆమె నోటి ముందుంది..
“అత్తయ్యా.. నోరు తెరవండి. తిని ఎన్ని మార్కులు వేస్తారో చెప్పండి” అంది.
సావిత్రి నోరు తెరచింది. నవ్వుతూ లడ్డు నోట్లో కూరింది సీత.
లడ్డును.. నమిలి మ్రింగి సావిత్రి.. “అద్భుతంగా వున్నాయే!.. ఎలా చేశావే!..” ఆశ్చర్యంతో అడిగింది సావిత్రి.
“అది ముందే చెప్పిందిగా చేసింది తన బావ కోసమని.. దానికి వాడి పట్ల వున్న ప్రేమనంతా పాకంలో కలిపింది” పరమానందంగా నవ్వింది వసుంధర.
“నిజంగా వదినా!.. దీని చేతిలో ఇంత మహిమ వుందని నాకు ఇప్పటివరకూ తెలీదు”
“ఇప్పుడు తెలిసిందిగా!..”
“ఆఁ.. ఆఁ.. తెలిసింది..”
బయటికి వెళ్ళిన అద్వైత్.. పాండురంగలు వచ్చారు. వారు వరండాలో.. ప్రవేశించగానే..
“ఇరువురూ నేను చేసిన లడ్డును తినండి”
“ఏమిటమ్మా!.. విషయం?..” అడిగాడు పాండురంగ.
“ముందు చేతికి తీసుకొని తిని చెప్పండి ఎలా వుందో!..”
పాండురంగ తిని.. “చాలా బాగుందమ్మా!.. యిప్పుడు చెబుతావా తీపిని తినిపించిన దానికి కారణాన్ని!..” నవ్వుతూ అడిగాడు.
అద్వైత్.. లడ్డును తిన్నాడు. తల్లి ముఖంలోకి చూచాడు.
“నీ కోసం.. నేను ఇంట్లో లేని సమయంలో తను చేసిందట ఎలా వుంది!..” అడిగింది సావిత్రి.
“బాగుందమ్మా!..” ముక్తసరిగా జవాబు చెప్పాడు అద్వైత్.
“అదేందిరా!.. అంత తేలిగ్గా చెప్పావ్!.. బాగాలేదా!..”
“చాలా బాగుందమ్మా!..” సీత ముఖంలోకి క్షణంసేపు చూచి దృష్టిని తల్లివైపు మళ్ళించాడు చిరునవ్వుతో.
“పాండూ!..”
“ఏం మామయ్యా!..” నరసింహశాస్త్రిని సమీపించాడు పాండు.
“నీవు తండ్రివి కాబోతున్నావురా. అందుకే నీ చెల్లి నీ నోటికీ.. మా అందరి నోటికీ తీపిని అందించింది.” చిరునవ్వుతో చెప్పారు నరసింహశాస్త్రి.
పాండు సింహద్వారం ప్రక్కన నిలబడి వున్న సుమతి ముఖంలోకి ప్రీతిగా చూచాడు. ఆమె నవ్వుతూ తల దించుకుంది.
అద్వైత్.. పాండులు తమ గదుల వైపుకు నడిచారు. సుమతి పాండు వెనకాలే వెళ్ళింది.
“వంట సిద్ధం అండి.. భోజనానికి వస్తారా!.. అడిగింది సావిత్రి.
“పిల్లలనూ పిలూ.. అందరం కలసి భోంచేద్దాం” అన్నారు నరసింహశాస్త్రి.
సావిత్రి.. అద్వైత్..పాండు గదుల ముందుకు వెళ్ళి.. “త్వరగా రండిరా.. వారు.. అందరం కలసి భోంచేస్తామని చెప్పారు..” అంది సావిత్రి.
సీత.. “అత్తయ్యా యీ పూట మీరు మామయ్య గారి ప్రక్కన కూర్చోండి.. నేను అందరికీ వడ్డిస్తాను. కాదనకండి.. సరేనా!..” అంది.
సావిత్రి ఆశ్చర్యంగా సీత ముఖంలోకి చూచింది. “అత్తయ్యా ప్లీజ్..” బ్రతిమాలింది సీత.
“సరే..” అంది సావిత్రి.
అందరూ భోజనాలకు కూర్చున్నారు. సావిత్రి సీతలు వడ్డించారు. తన ప్రక్కన వున్న ఆకును చూచి.. “యిది..” అడిగారు శాస్త్రిగారు.
“మా అత్తయ్యగారికి మామయ్యా!.. ఇక నేను వడ్డిస్తాను. అత్తయ్య అక్కడ కూర్చుంటారు” చిరునవ్వుతో సావిత్రి ముఖంలోకి చూచింది సీత.
“అత్తయ్యా!..” ఆకు వైపు చేతిని చూపించింది.
సావిత్రి భర్త గారి ముఖంలోకి చూచింది. వారి పెదవులపై చిరునవ్వు.. నిట్టూర్చి తనలో తాను నవ్వుకొంటూ సావిత్రి నరసింహశాస్త్రి ప్రక్కన వున్న ఆకులో కూర్చుంది.
సీత.. తినే వారిని అనుసరించి.. గమనించి.. వారి వారికి కావలసిన పదార్థాలను వడ్డించింది.
“సీతా!..” పిలిచారు నరసింహశాస్త్రి.
“ఏం మామయ్యా!.. ఏదైనా కావాలా!..”
“ఇంత పద్ధతిగా వడ్డించడం ఎప్పుడు నేర్చుకొన్నావు.. ఎక్కడ నేర్చుకున్నావు!..”
“మామయ్యా!.. నాకు సావిత్రిగారు అనే పేర ఓ అత్తయ్యగారు వున్నారు. యీ కళను నేను వారి వద్ద నుంచి అభ్యసించాను” చిరునవ్వుతో చెప్పింది.
ఆమె.. చెప్పిన తీరుకు అందరూ నవ్వారు.
భోజనాన్ని ముగించి వారంతా లేచారు. అద్వైత్ తన గదికి, పాండురంగ సుమతి వారి గదికి.. వసుంధర తన గదికి వెళ్ళిపోయారు.
రాత్రి భోజనానంతరం.. పావుగంట వాకిట ముందు పచారు చేయడం నరసింహశాస్త్రిగారి అలవాటు. వారు ఆ క్రమాన్ని సాగించారు.
“సీతా! నీవు కూర్చోవే.. నేను వడ్డిస్తాను..” అంది సావిత్రి.
“అత్తయ్యా!.. మీరూ మామగారిలా కాసేపు వాకిట్లో అటూ ఇటూ పచారు చేయండి. అది మీ ఆరోగ్యానికి మంచిది. నాకు కావలసింది నేను పెట్టుకొని తిని వంట యింటిని నేను సర్దుతాలే అత్తయ్యా!.. సరేనా!..” అంది సీత.
“సీతా!.. యీ మధ్యన నీకు రోజు రోజుకూ నా మీద అభిమానం పెరుగుతూ వున్నట్లనిపిస్తూ వుందే!..”
“అది కేవలం అభిమానం కాదు. నా ధర్మం కూడా అత్తయ్యా!..”
సీత ముఖంలోకి కొన్ని క్షణాలు చూచి వరండా వైపుకు నడిచింది సావిత్రి.
అన్ని ఆకులనూ తీసి పెరటి వైపున వాటిని పారవేయవలసిన స్థలంలో వేసి.. తాను తీయని అద్వైత్ ఆకులో కూర్చొని తనకు కావలసింది పెట్టుకొని త్వర త్వరగా తినింది సీత.
ఆ ఆకునూ మడచి పెరట్లో పడేసి.. ఆ ద్వారం గడియ బిగించి వెను తిరిగింది. నరసింహశాస్త్రి సావిత్రి లోనికి వచ్చి తమ గదిలో ప్రవేశించారు.
నరసింహశాస్త్రి పడకపై వాలారు. కళ్ళు మూసుకొన్నారు. ‘సర్వేశ్వరా!.. తండ్రి!.. రేపు మమ్మల్ని వదిలి చాలా దూరం వెళుతున్న నా కొడుకుకు నీవే రక్ష. ఏ కారణం చేత వాడిని అంతదూరం పంపదలచుకొన్నానో.. ఆ విషయం నీకు నాకు తెలుసు. పెండ్లి చేసికొని బిడ్డ పాపలతో మా కళ్ళ ముందు వుండవలసిన వాడు.. సముద్రాలను దాటి మాకు ఎంతో దూరం వెళ్ళిపోతున్నాడు. నా బిడ్డ యింతవరకూ నా మాటను దాటలేదు. వాడి చూపుల్లో.. వెళ్ళడానికి అయిష్టత నాకు గోచరించింది.. కానీ.. నా మాటను పాటించడం తన ధర్మంగా భావించి బయలుదేరే దానికి సిద్ధం అయినాడు. ఆ దేశంలో ఆ మనుషుల మధ్యన వాడు గౌరవంగా బ్రతికేదానికి వాడి మనోవాక్కాయలందు నీవు నిలిచి వాడు తన ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చేదానికి తగిన శక్తిని సమయస్ఫూర్తిని.. వాడికి ప్రసాదించు. నా యిల్లాలు సావిత్రి ఏనాడు నా మాటకు ఎదురు చెప్పి ఎరుగదు. తన కొడుకు తన్ను విడచి దూరంగా వెళుతున్నందుకు ఆమె హృదయంలో రేగిన సంక్షోభం నాకు తెలుసు. కానీ.. తన ఆవేదనను హృదయంలో అణచుకొని నవ్వుతూ.. మా ముందు తిరుగుతూ వుంది. పుత్ర వాత్సల్యపు వేదనను ఆమెకు దూరం చెయ్యి. ఆమెకు.. సహనాన్ని శాంతిని ప్రసాదించు. నా తప్పులను మన్నించు నా వారందరినీ రక్షించు’ – తాను నమ్మిన దైవాన్ని వేడుకొన్నారు శాస్త్రిగారు.
“ఏమండీ!..” మెల్లగా పిలిచింది సావిత్రి.
నరసింహశాస్త్రి తలపులకు ఆ పిలుపు అంతరాయం కలిగించింది.
కళ్ళు తెరచి.. సావిత్రి ముఖంలోకి చూచాడు. ఆమె అద్వైత్‍ను గురించి మాట్లాడబోతుందన్న విషయాన్ని గ్రహించి.. “సీతను చక్కగా తయారు చేశావు సావిత్రీ!..” అన్నాడు నరసింహశాస్త్రి.
“దానిలో ఒక భాగం వుండేది మీ రక్తమే కదండి. మీలాగే పట్టుదల కల పిల్ల.. యీ మధ్యన నాకు మరీ సన్నిహితంగా వుంటూ వుంది.. సాయం చేస్తూ వుంది. అది నా కోడలైతే.. నేను నిజంగా ఎంతో అదృష్టవంతురాలిని అవుతాను..”
“ఆ అదృష్టం అంతా నీకేనా.. నాకూ భాగముందా!.. లేదా!..”
“నాకు ఆ యోగం కలగబోయేది మీ అంగీకారంతోనేగా!..”
“యథార్థం చెప్పనా!..”
“మీరు నాతో ఎప్పుడు అబద్ధం చెప్పారు!..”
“యింత వరకూ లేదు..”
“యిక పైనా వుండబోదండి..”
“నా మీద నీకు అంత నమ్మకమా!..’
“మీ మీద నాకు నమ్మకం లేకపోతే.. నా మీద నాకు నమ్మకం లేనట్లే అవుతుందండి”
“నీ నమ్మకాన్ని ఆ సర్వేశ్వరుడు నెరవేర్చుగాక..”
“అంటే సీత నాకు కాబోయే కోడలేగా!..”
అవునన్నట్లు తల ఆడించాడు నరసింహశాస్త్రి.. క్షణం తర్వాత..
“ఇక పడుకో సావిత్రి.. వేకువనే లేవాలిగా!..”
“ఔనండీ..” సావిత్రి మౌనంగా పడకపై వాలింది.
నరసింహశాస్త్రి కళ్ళు మూసుకొన్నారు.
సీత.. తన గదిలో పడకపై పడుకొని అద్వైత్‍ను గురించి ఆలోచిస్తూ వుంది.
అందరూ పడుకొన్నారు. ఒక్కసారి బావ వద్దకు వెళ్ళి ఏం చేస్తున్నాడో చూచి మాట్లాడి రావాలనుకొంది సీత. మంచం దిగి మెల్లగా తన గది తలుపును తెరిచి బయటికి వచ్చి మూసి.. అద్వైత్ గదిని సమీపించి తలుపును నెట్టింది. అది తెరుచుకొంది. తలవంచి లోనికి చూచింది.
మంచంపైన పద్మాసనంలో కూర్చొని.. కళ్ళు మూసుకొని ధ్యానంలో వున్నాడు అద్వైత్.
మెల్లగా లోన ప్రవేశించి తలుపును మూసింది సీత.
మంచం ప్రక్కన వున్న కుర్చీని సమీపించి కూర్చుంది సీత. ఆమె తల్లో సన్నజాజుల సౌరంభం అద్వైత్ నాశిక రంధ్రాల్లో ప్రవేశించింది.
అద్వైత్.. తొట్రుపాటుతో కళ్ళు తెరిచాడు. ప్రక్కన కుర్చీలో కూర్చొని వున్న సీతను చూచాడు. “ఎప్పుడొచ్చావు సీతా!..”
“పావుగంట అయింది..”
“యీ సమయంలో..”
“ఎందుకు వచ్చావనేగా మీ ప్రశ్న?..”
అవునన్నట్లు తల ఆడించాడు అద్వైత్.
“నా భర్త దగ్గరకు నేను వచ్చేదానికి నాకు ఎవరైనా పర్మిషన్ యివ్వాలా!..”
“ఆ అధారిటీ నీకు వశం అయ్యేదానికి.. నీవు కొంతకాలం ఓపిక పట్టాలి కదా సీతా!..” అనునయంగా చెప్పాడు అద్వైత్.
“నిద్ర పట్టలేదు. ఏం చేస్తున్నారో చూడాలనిపించింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి రాలేదు బావా!..”
“నది ఒడ్డు నుంచి వచ్చేటప్పుడు చెప్పానుగా లక్ష్యాన్ని సాధించేదానికి సహనం చాలా ముఖ్యమని..”
“మరువలేదు.. మరువబోను..”
“ఎవరన్నా వస్తే!..”
“ఎవ్వరూ రారు. అందరూ వారి వారి గదుల్లో పడుకొన్నారు బావా!..”
“నాకూ నిద్ర వస్తూ వుంది..”
“పడుకొని నిద్రపో!..”
“నీవు బయటికి పోకుండా!..”
“నేను ఎలా పడుకోగలనంటావుగా బావా!..”
“ఇప్పుడు అనవలసింది అదేగా..”
“సరే కదలకుండా కూర్చో.. కళ్ళు మూసుకో..”
అద్వైత్ సీత చెప్పినట్లుగా చేశాడు.
సీత వంగి అతని ముఖాన్ని తన చేతుల్లోకి తీసికొని నొసటన ముద్దు పెట్టింది. అద్వైత్.. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
“అది నీవు తిరిగి వచ్చేవరకూ నా మనస్సున వుండబోయే తీపి గుర్తు. గుడ్‍నైట్ బావా!.. ప్రశాంతంగా పడుకో” సీత వేగంగా వెళ్ళిపోయింది. తలుపును బిగించి అద్వైత్ మంచంపై వాలిపోయాడు.
(ఇంకా ఉంది)