చిరుజల్లు-130

0
3

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఎన్నడు విజ్ఞానమిక నాకు..

[dropcap]ఎ[/dropcap]వరో ఒక ఆగంతకురాలు రామనాథ శాస్త్రికి ఒక లేఖ రాసింది.

ఆయన సంస్కృతాంధ్ర భాషలలో దిట్ట. వేదాలను ఔపోసన పట్టిన మహాజ్ఞాని. వందకు పైగా అష్టావధానాలు చేసిన పండితుడు.

అలాంటి ఆయనకు ఆమె ఎవరో ఒక ఉత్తరం రాసింది. రామాయణం కథ ఆగిన చోటల్లా, ముందుకు నడిపిన వారు ఇద్దరు స్త్రీలు. ఒకరు మంథర. రాముడు అడవికి వెళ్లటానికి కారణం అయింది. రెండవ స్త్రీ శూర్పణఖ. సీతాపహరణకు దోహదం చేసింది. అవునంటారా, కాదంటారా అంటూ రామనాథ శాస్త్రిని ప్రశ్నించింది.

ఆయన సభలలో ప్రసంగించటమే గొప్ప. ఇలాంటి అనామకులకు జవాబులు రాసే స్థాయి కాదు ఆయనది. అయినా ఆమె ఊరుకోలేదు. ఒక రెండు వారాల తరువాత మరో లేఖాస్త్రాన్ని సంధించింది. ఈసారి భారతంలోని తప్పులను ఎత్తి చూపింది. కర్ణుడు తన కుమారుడని కుంతి లోకానికి వెల్లడించి ఉంటే, మహాభారత యుద్ధం జరిగేది కాదు, మీరు ఏమంటారు అంటూ ప్రశ్నించింది.

రామనాథ శాస్త్రి ఈ ఉత్తరాన్నీ చదివి పక్కన పడేశాడు. నెల రోజుల తరువాత ఆమె మరో ఉత్తరం రాసింది. ఈసారి భాగవతం మీద ధ్వజమెత్తింది. స్వర్గంలో కుటుంబాలు, ఆలుమగల అనుబంధాలు వంటివి ఏమీ ఉండవు. కృష్ణుడు అలాంటి స్వర్గాన్ని రేపల్లెలో సృష్టించాలనుకుని గోపికలను అందరినీ అలరించాడు, మీరు ఏమంటారు అంటూ ఆయన అభిప్రాయాన్ని చెప్పమని అడిగింది.

ఈమె ఎవరో తెలియదు. ఈమెకున్న పాండిత్యం, విజ్ఞానం ఏపాటిదో తెలియదు. ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో, ఆమె నేపథ్యం ఏమిటో కూడా ఆయనకు తెలియదు. అందుచేత, ఆమెకు గానీ, ఆమె సంధించిన బాణాలకు గానీ ఆయన స్పందించలేదు.

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‍లో రవీంద్ర భారతిలో రామనాథ శాస్త్రి అష్టావధానం ఏర్పాటు చేశారు. ‘నేను మీ అష్టావధానానికి వస్తున్నాను’ అని ఒక వి.వి.పి. లాగా ఆయనకు ఉత్తరం రాసింది. దానినీ ఆయన పట్టించుకోలేదు.

ఆరోజు ఆయన అవధానం విజయవంతంగా జరిగింది. ప్రేక్షకులతో హాలు నిండిపోయింది. ఆయనకు సన్మానం జరిగింది. అంతా అయిపోయినాక, రామనాథశాస్త్రి బయటకు వచ్చి కారు ఎక్కబోతుండగా ఒక స్త్రీ దగ్గరగా వచ్చి ఆయనకు పాదాభివందనం చేసింది.

“సార్, నా పేరు సులోచన. నేను ఇటీవల తెలిసో, తెలియకో రెండు మూడు ఉత్తరాలు రాశాను. ఇవాళ మీరు ఎంత గొప్ప మహానుభావులో తెలుకున్నాను. నా అజ్ఞానానికి నన్ను మన్నించండి” అన్నది.

“ఆయుష్మాన్ భవ” అని ఆయన ఆమెను దీవించాడు నవ్వుతూ.

నెలరోజుల తరువాత అనంతపురంలో రామనాథశాస్త్రి అష్టావధానం ఏర్పాటు చేశారు.

సులోచన ఎలాగో అవధాని ఫోన్ నెంబరు సంపాదించి, ఆయనకు ఫోన్ చేసింది. “సార్, నేను మీ అవధానంలో ఒక పృఛ్ఛకురాలిగా పాల్గొనాలనుకుంటున్నాను. అనుమతి ఇస్తారా?” అని అడిగింది. “నిర్వాహకులకు నేను చెప్పానని చెప్పు” అని ఆయన అన్నాడు.

నెమ్మదిగా ఒక లేఖకురాలి నుంచి, ప్రేక్షకురాలను నుంచి, పృచ్ఛకురాలి స్థాయికి ఎదిగింది. అవధాన సభలోనే ఆయన్ను – “అనేక వ్యసనాలు మనుష్యులను పట్టి పీడిస్తున్నాయి. ఇందులో అతి పెద్ద వ్యసనం ఏమిటి అవధాని గారూ?” అని అడిగింది.

“మనిషి బ్రతకాలనుకోవటమే అతి పెద్ద వ్యసనం” అన్నాడు రామనాథ శాస్త్రి.

“అవధాని గారూ, కొంత మంది చూస్తే దిష్టి తగులుతుంది అంటారు. చూపులు అంత ప్రమాదకరమా?” అని అడిగింది సులోచన.

“చాలా ప్రమాదకరం. నీ వంటి సౌందర్య రాశి ఓర చూపులకు ధీరులూ, వీరులూ కూడా పాదాక్రాంతువైన సందర్భాలు చరిత్ర నిండా ఉన్నయి గదా..” అన్నాడు సభలోని వారందరినీ నవ్విస్తూ.

ఈసారి సులోచన పైన అందరి దృష్టితో పాటు అవధాని గారి దృష్టి పడింది. నిజానికి సులోచనను ఒకసారి చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ ఆమె వైపు దృష్టి సారించకుండా ఉండలేరు.

తాకితే మాసిపోయే మేను. నేలమీద నడుస్తున్న రతీదేవి ఈమే ఏమో అనిపిస్తుంది. నిలువెల్ల వెల్లవిరిసిన సౌందర్యంతో, విరబూసిన బొండు మల్లెల తోటలా ఉంది.

ఇప్పుడు ఆమె అవధానికి సన్నిహితురాలు అయింది. సులోచన తరచూ ఆయన సామీప్యంలో ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకుంటోంది.

మరికొంత మంది ఆయన అభిమానులను పోగు చేసి, ఆయనకు అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంఘానికి ఆమె అధ్యక్షురాలు. రామనాథ శాస్త్రి ఇదివరలో చేసిన అవధానాల విశేషాలను సేకరించి, నాలుగు పుస్తకాలుగా ప్రచురించింది.

సులోచన సారథ్యంలోనే విజయవాడలో, ఆ గ్రంథాల ఆవిష్కరణ సభ ఎంతో ఘనంగా నిర్వహించింది. గొప్ప ప్రాచుర్యం లభించింది. పుస్తకాల అమ్మకాలు జోరుగా సాగుతున్నయి.

రామనాథ శాస్త్రికి ఇప్పుడు సులోచన అత్యంత ఆప్తురాలు అయింది.

“చాలా శ్రమ తీసుకుంటున్నావు రతీదేవీ” అన్నాడాయన.

“నన్ను మీరు రతిదేవి అన్నారు. ఆ ఒక్కమాట కోసం నేను ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలను?” అన్నది.

“చాలా ఖర్చు చేశావు” అని ఆయన అన్నాడు.

“నా విభవంబు మీకు తెలియదు. అది చాలా గుప్తంగా ఉన్నది” అన్నది సులోచన.

“స్త్రీ హృదయం సముద్రం కన్నా లోతైనది..” అన్నాడు అవధాని నవ్వుతూ.

“నా కోసం మీరు నాలుగు రోజులు సమయాన్ని కేటాయించగలిగితే, ఈ శిష్యురాలి జన్మ ధన్యం అవుతుంది” అని అన్నది సులోచన,

“నీవు కోరటమూ, నేను కాదనటమూనా?” అని నవ్వాడాయన. ఆమె ఆయనను ఒక తమలపాకుల తోటలోకి తీసుకెళ్లింది. తోట అంతా తిప్పి చూపించింది.

“నీ తనువే కాదు, హృదయమూ లేత తమలపాకు వంటిదే” అని అన్నాడు రామనాథ శాస్త్రి.

“ఈ తోట మాదే. మనసు బాగా లేనప్పుడు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు ఉండి, బయట ప్రపంచాన్ని మర్చిపోతుంటాను, నాకు సంగీతంలో కొంచెం ప్రవేశం ఉంది. పాటలు పాడుకుంటూ నా బాధను మర్చిపోతుంటాను” అన్నది సులోచన.

“రతీదేవికి కూడా బాధలు ఉండటం వింత కదా” అన్నాడాయన. సులోచనకు వంటలు చేయటం హాబీ. ఆయనకు రకరకాల వంటకాలు చేసి పెట్టింది.

రాత్రి ఆరుబయట వెన్నెలలో కూర్చుని ఉన్నారు.

“నువ్వు నాకు ఇంత సన్నిహితంగా వచ్చినా, నీ గురించి నాకు ఏమీ తెలియదు. నీకు వివాహం అయిందని తెలుస్తూనే ఉంది. నీ భర్త ఏం చేస్తుంటాడు. ఎక్కడుంటాడు?”

“ఆయన ఒక వ్యాపారస్థుడు. విజయవాడలో పెద్ద బట్టల షాపు ఉంది. లక్షల్లో సంపాదన. ఆయనకు నోట్ల కట్టలు లెక్క పెట్టుకోవటంలో ఉన్న సంతోషం ఇంకే పనిలోనూ ఉండదు. మీరు నన్ను రతిదేవి అన్నారు. రసజ్ఞులు గనుక మీరు నా అందాన్ని చూశారు. కానీ నా భర్తకు నేనొక మరమనిషిని, ఇల్లు, ఆస్తులు, పొలాలు, తోటలూ అన్నీ ఉన్నయి. ఇది అమ్మితే ఎంత వస్తుంది, ఇది కొంటే ఎంత వస్తుంది – అని మాత్రమే ఆయన ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇక్కడే ఆయనకూ నాకూ తేడా. ఆయన లోకం వేరు. నా లోకం వేరు..” అన్నది సులోచన.

“భగవంతుడు ప్రతివాళ్లకీ ఏదో ఒక లోటు పెడుతుంటాడు” అన్నాడు రామనాథ శాస్త్రి.

“ఎందుకని?” అని అడిగింది సులోచన ఆయన నోటికి తాంబూలం అందిస్తూ.

“ఏ లోటూ లేనివాడు, ఆయనను గుర్తుంచుకోడు మరి” అన్నాడాయన.

మర్నాడు స్నానం చేస్తుంటే, స్నానాల గదిలో ఆయన జారి పడ్డాడు. పెద్ద దెబ్బ తగల్లేదుగానీ, మడమ దగ్గర నొప్పి చేసింది . పూర్తిగా కాలు కింద మోపి నడవలేక పోతున్నాడు.

సులోచన ఆయన చేతిని తన భుజం మీద వేసుకుని ఆయనను నడిపించింది.

మధ్యాహ్నం భోజనాలు చేశాక, ఆయన మంచం మీద పడుకుని ఉన్నాడు. సులోచన మంచం మీద కూర్చుని ఆయన కాలికి ఏదో లేపనం రాసింది.

కొద్దిసేపటికి ఆయన గుండెల మీదకు ఒరిగి పోయింది.

ఆయన ఆమె చుట్టూ కౌగిలి బిగించాడు.

ఆ రాత్రి ఆరుబయట వెన్నెలలో కూర్చున్నారు. చల్లని గాలి సేద తీరుస్తోంది.

చాలాసేపు సులోచన ఏదో ఆలోచనలో మునిగి పోయింది. తరువాత ఆమె నెమ్మదిగా అన్నది.

“నాకు పుట్టబోయే బిడ్డ బట్టల కొట్లో కట్టలు లెక్కపెట్టుకునేవాడు కాకూడదు. అలాంటి అనామకుడు నాకు అక్కర్లేదు. నా బిడ్డ పెరిగి పెద్దవాడు అయ్యాక ఏదో ఒక రంగంలో జగత్ ప్రసిద్ధి పొందేవాడు అయిఉండాలి. అలాంటి వాడిని కనాలి అంటే – మీకు తెల్సుకదా – క్షేత్రమూ, బీజమూ కూడా సరియైనదై ఉండాలి. అందుకనే మీలాంటి పండితుడి బీజం కోసం ఆరాట పడ్డాను..”

రామనాథ శాస్త్రి ఒక నిముషం ఆగి అన్నాడు “నీ కోరిక నెరవేరాలనే కోరుకుంటున్నాను. కానీ ఎక్కడో ఒక చోట తప్ప, పండితుల పుత్రులు ఎవరూ పండితులు కాలేదు. చాలామంది పండిత పుత్రులు పనికిమాలినవాళ్ల గానే ఉంటున్నారు” అన్నాడు.

“ఎక్కడో ఒక చోట తప్ప.. అన్నారు గదా. ఆ చిన్న అవకాశమే నాకు ఆశావహం అవుతుంది..” అన్నది సులోచన.

చాలాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. రామనాథ శాస్త్రి “నీకు సంగీతం వచ్చు. పాటలు పాడతానన్నావు కదా. ఏదీ ఒక పాట పాడు” అడిగాడు.

సులోచన గొంతు సవరించుకుని పాట అందుకుంది –

‘ఎన్నడు విజ్ఞానమిక నాకు..’ అని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here