అలనాటి అపురూపాలు – 231

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

శాంతా ఆప్టే:

సామాజిక కట్టుబాట్లకు తలవంచని – తొలి తరం భారతీయ నటీమణులలో అగ్రస్థానంలో ఉంటారు శాంతా ఆప్టే.

శాంతా ఆప్టే తిరుగుబాటు స్వభావానికి, ఆవేశపూరిత స్వభావానికి ప్రసిద్ధి. తన పదునైన కలానికి పేరుగాంచిన ఫిల్మిండియా ఎడిటర్ బాబూరావు పటేల్ తన గురించి ఏదో చెడుగా రాస్తే, వాళ్ళ ఆఫీసుకు వెళ్ళి గొడవ పెట్టుకున్నారట శాంతా ఆప్టే! అలాగే, కాంట్రాక్టు సంబంధించి ప్రభాత్ స్టూడియో యజమానులతో వివాదాలు రేగితే, చివరికి స్టూడియో గేటు ముందు నిరాహార దీక్ష చేసి కాంట్రాక్టును రద్దు చేయించుకున్నారామె. ఇలాంటి చర్యలు, సామాజిక నిబంధనలపై తిరుగుబాటు కారణంగా ఆమెకు ‘Stormy petrel of Indian cinema’ అనే పేరు వచ్చింది.

శాంతా ఆప్టే మరణించిన దశాబ్దం తర్వాత మరాఠీ రంగస్థల కళాకారిణి నయన ఆప్టే తాను శాంతా ఆప్టే కుమార్తెనని చెప్పుకోవడంతో ఆమె గురించి మళ్లీ సంచలనం నెలకొంది. బహిరంగంగా శాంతా ఆప్టేకు పెళ్లయిపోయిందని లేదా ఆమెకు పెళ్లి కాకుండానే బిడ్డ ఉందని తెలియదు. శాంతా ఆప్టే 1947-48లో నటించడం మానేసినప్పుడు తన దూరపు బంధువును పెళ్లాడారని, ధనిక భూస్వామి అయిన ఆప్టే అనే ఇంటిపేరును కూడా కలిగి ఉన్నానని నయన రాశారు. భార్య కళాత్మక ఆశయాలను అతను తీవ్రంగా వ్యతిరేకించారట. తన భర్తను ఒప్పించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ మొండిగా ఉన్న అతన్ని ఒప్పించటంలో విఫలమయ్యాయి. మూడు నెలల్లో శాంత అతన్ని విడిచిపెట్టారు. ఆ సమయంలో శాంతా ఆప్టే గర్భంలో తానున్నాని, తర్వాత తాను అంధేరీలో జన్మించానని నయన పేర్కొన్నారు. ఈ ఉదంతం శాంతా ఆప్టేకి చెందిన రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది.

23 నవంబరు 1916 (జన్మదినం సంబంధించి పలు తేదీలు ప్రచారంలో ఉన్నాయి) నాడు మహారాష్ట్రలోని దూధ్‌నిలో సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు శాంతా ఆప్టే. ఆమె తండ్రి ఒక స్టేషన్ మాస్టర్, గొప్ప గాయకుడు. బాల్యం నుంచే పాటలు పాడడం అభ్యసించారు శాంత. ఆమె గాన ప్రతిభని విన్న సుప్రసిద్ధ దర్శకనిర్మాత భాల్జీ పెంధార్కర్ తాను నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం ‘శ్యామ్‌సుందర్’ (1932) లో నటించే అవకాశం కల్పించారు. ఈ సినిమాలో ఆమె రాధగా నటించగా, కృష్ణుడిగా సాహు మోదక్, రాధ భర్త పాత్రలో ఆమె అన్నగారు బాబూరావ్ ఆప్టే నటించారు. ఆమె ఈ సినిమాలో ‘దర్శన్ దో భగవాన్, తర్సత్ హై ప్రేమ్ దుఖియారీ’, ‘దరస్ దిఖా దో జామోన్ కా సాంవరియా’ అనే రెండు పాటలు పాడారు. హిందీ వెర్షన్ బాగా ఆడకపోయినా, మరాఠీ వెర్షన్ అద్భుతమైన విజయం సాధించింది.

తరువాత ఆమె పూనాలోని ప్రభాత్ ఫిల్మ్ కంపెనీలో చేరారు. అమృత్ మంథన్ (1934), అమర్ జ్యోతి, రాజ్‌పుత్ రమణి (1936), దునియా నా మానే, వహన్ (1937), గోపాల్ కృష్ణ (1938) వంటి చిత్రాలలో ప్రతిభావంతులైన నటిగా, అద్భుత గాయనిగా కెరీర్‌ను విజయవంతం చేసుకున్నారు. 1938లో ప్రభాత్‌ సంస్థను వీడి ఆమె ఫ్రీలాన్సర్‌గా మారారు. బహుశా స్టూడియోలు ఉజ్వలంగా వెలుగుతున్న కాలంలో అలా చేసిన మొదటి నటి ఆమే. అప్నా ఘర్, జమీందార్, (1942), దుహాయి, మొహబ్బత్ (1943), భాగ్య లక్ష్మి, కాదంబరి (1944), పాణిహారి, సుభద్ర, ఉత్తరాభిమాన్యు, వాల్మీకి (1946) మొదలైన చిత్రాలలో నట-గాయకురాలిగా ఆమె కెరీర్ కొనసాగింది. ఆ తర్వాత, ఆమె కెరీర్ దాదాపు ముగిసింది. అయితే, ఒక దశాబ్దానికి పైగా సుదీర్ఘ విరామం తర్వాత, ఆమె అజిత్ మర్చంట్ లాఠీలో ‘చండీ పూజ’ (1957) చిత్రంలో ‘బోలో హే చండీమాత, బోలో మేరి భాగ్య విధాత’ అనే పాటను పాడారు, నటించారు. ఇది ఆమె కెరీర్‌లో చివరి పాట. అజిత్ మర్చంట్ స్వరపరిచిన రామ్ భక్త విభీషణ్ (1958) సినిమా క్రెడిట్స్‌లో కూడా ఆమె పేరు కనిపిస్తుంది, అయితే హెచ్‌ఎఫ్‌జికెలో ఏ పాట కూడా ఆమెకు క్రెడిట్ కాలేదు.

ప్రభాత్ సంస్థలో ఆమె నటించిన సినిమాలు చాలా వరకు మరాఠీలో నిర్మించబడ్డాయి, అక్కడ అవి చాలా విజయవంతమయ్యాయి. ఆమె గుజరాతీ, మరాఠీ రంగస్థల నటిగా, సినీనటిగా కూడా విజయవంతంగా రాణించారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి నారదుడి పాత్రను పోషించిన తమిళ చిత్రం ‘సావిత్రి’ (1941)లో కూడా శాంత నటించారు.

ఆమె జీవనశైలి ఆమె పతనానికి దారితీసింది. సినిమాలు లేకపోవడంతో మద్యపానానికి అలవాటు పడి విషాదకరమైన, ఒంటరి జీవితాన్ని అనుభవించారు. 24 ఫిబ్రవరి 1964న మృతి చెందారు.


కోన ప్రభాకర రావు:

కోన ప్రభాకర్ రావు బాపట్లలోని సంపన్న తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యను అధిక భాగం బాపట్లలో పూర్తి చేశారు. మోతీలాల్ నెహ్రూ మరణించినప్పుడు, 16 సంవత్సరాల వయస్సున్న, ప్రభాకర రావు పాఠశాలలను బహిష్కరించారు. సామాజిక, రాజకీయ కార్యకర్తగా వ్యవహరించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బాపట్లలో యూత్ లీగ్‌ని నిర్వహించి ఖాదీని ఉపయోగించడాన్ని ప్రోత్సహించారు. ప్రభాకర రావుకి క్రీడల పట్ల ఆసక్తి మెండు. ఆయన 1938లో బొంబాయి విశ్వవిద్యాలయంలో టెన్నిస్ ఛాంపియన్. బాపట్లలో, ఇంకా మరికొన్ని చోట్ల శివాజీ వ్యాయామ మండలిని నిర్వహించారు. పూణేలో కాలేజీలో చదువుతున్న రోజులలో రెజ్లర్, బ్యాడ్మింటన్ ఛాంపియన్. రావు మద్రాస్‌లోని లయోలా కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు, పూనాలోని ILS లా కళాశాల నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. 1940లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని బాపట్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.

సినీ కెరీర్:

రావు రంగస్థల నటులు. వివిధ నాటకాలలో చంద్రగుప్తుడు, దుర్యోధనుడు, గిరీశం మొదలైన పాత్రలను పోషించారు.

సారథి, వౌహిని వారి చిత్రాలతో విపరీతంగా ప్రభావితమైన కోన ప్రభాకర రావు – మంగళసూత్రం/ఇది మా కథ/ఎక్స్‌క్యూజ్ మీ (1945) అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో లక్ష్మీరాజ్యం సరసన హీరోగా నటించారు. ‘సావాసం’లో కృష్ణవేణి సరసన హీరోగా నటించారు. ‘ప్రజాసేవ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘నిర్దోషి’లో హాస్య పాత్ర పోషించారు. ద్రోహి, సౌదామిని చిత్రాల్లో విలన్‌గా నటించాడు. ద్రోహిలో నోట్లో పైపుతో స్టైలిష్ విలన్‌గా చేశారు, జి. వరలక్ష్మితో యుగళగీతానికి అభినయించారు. 1951లో సురభి బాలసరస్వతి కథానాయికగా ‘రూపవతి’ అనే చిత్రాన్ని నిర్మించారు. బాల నటుడు జి.ఎన్. స్వామిని హీరోగా చేసారు. ఈ చిత్రంలో సావిత్రి ఒక ముఖ్యమైన పాత్రలో నటించి, ఒక పాటకి నృత్యం చేశారు. రావు ‘శ్రీ లక్ష్మమ్మ కథ’, తిలక్ గారి ‘ఉయ్యాల జంపాల’లో కూడా నటించారు.

రాజకీయ జీవితం:

కోన ప్రభాకర రావు 1967లో మొదటిసారిగా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. తరువాత 1972లో, 1978లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1980-81లో అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. ఆయన ఎపిసిసి(ఐ) అధ్యక్షుడిగా వ్యవహరించారు. భవనం వెంకటరామి రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక మరియు ప్రణాళికా మంత్రిగా రావు పనిచేశారు.

రావు 2 సెప్టెంబర్ 1983న పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి గవర్నర్‌గా నియమితుడయ్యారు. జూన్ 1984 వరకు ఆ పదవిలో కొనసాగారు. 17 జూన్ 1984న ఆయన సిక్కిం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

    

ఎయిర్ చీఫ్ మార్షల్ IH లతీఫ్ తర్వాత 30 మే 1985న మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు రావు.

బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపకుడిగా విద్యారంగంలో తన సొంత పట్టణంలో అనేక సంస్థలు అభివృద్ధి చెందేలా చూశారు. బాపట్ల పట్టణానికి కృష్ణానది నీటిని తీసుకురావడానికి ఆయన బాధ్యత వహించారు, ఇది పట్టణానికి కీలక జీవనాధారమైన వ్యవసాయ రంగంలో చాలా పురోగతికి దోహదం చేసింది.

గుండె జబ్బు, శ్వాస ఇబ్బందుల కారణంగా రావు 1990 అక్టోబర్ 20న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) హైదరాబాద్‌లో మరణించారు. ఆయన కుమారుడు కోన రఘుపతి బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here