[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారి ‘లేత మనసులు’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]ఉ[/dropcap]పాధ్యాయినిగా 24 ఏళ్ళు పని చేసి రిటైరైన శ్రీలక్ష్మి గారి తొలి కథా సంపుటి ‘లేత మనసులు’. ఈ సంపుటిలో గత 30లో శ్రీలక్ష్మి గారు వ్రాసిన 30 కథలున్నాయి.
“చివుకుల శ్రీలక్ష్మి ఇన్ని సంవత్సరాలుగా వ్రాసిన కథల లోంచి విలువలతో కూడిన కథలను ఏరి ‘లేత మనసులు’ పేరుతో తొలి కథల సంపుటి వేసుకోవడం చాలా ఆనందదాయకం” అన్నారు డా. చాగంటి తులసి గారు తమ ముందుమాటలో.
ఈ సంపుటి లోని కథల గురించి చెబుతూ, “వైవిధ్యమైన శీర్షికలతో కథలు పాఠకులను అలరిస్తాయి. పాత్రలను కూడా కథలకు అనుగుణంగా చక్కగా చిత్రణ చేసారు. మిన్నగా ఉన్న సంభాషణలు కథను రక్తి కట్టిస్తాయి” అన్నారు డా. డి. ఎన్. వి. రామశర్మ.
“శ్రీలక్ష్మి గారు రాసిన ‘గాంధీ గారికి స్పెషల్ ప్రైజ్’ అనే కథ చక్కని కథ. మానవతా విలువలు జోడించి రాసిన మంచి కథ” అని వ్యాఖ్యానించారు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు.
~
తనకి ప్రమాదకరమైన జబ్బున్నట్లు తెలియని ఓ చిన్నారి ఎదురింటి ఆంటీతో స్నేహం చేసి బోలెడు కబుర్లు చెబుతూ సందడి చేస్తుంది. బాల్యంలోని అమాయకత్వాన్ని చక్కగా చాటిన కథ ‘లేత మనసులు’. ఎండకి సొమ్మసిల్లిన సీతాకోకచిలుకని కాపాడి, కొంతసేపటికి అది తేరుకుని ఎగిరిపోతే సంబరపడిపోయిన ఆ చిన్నారి మరి తన జబ్బు నుంచి కోలుకోగలిగిందా? కోలుకుంటే బావుండని పాఠకులు మనస్ఫూర్తిగా కోరుకుంటారు.
కొడుకు ఓ మంచిపని చేసినా తండ్రి మొదట మెచ్చుకోకపోగా, కోపగించుకుంటాడు. పరీక్ష మానేసి మరీ అలా ఎందుకు చేశావని గద్దిస్తే, కొడుకు చెప్పిన సమాధానం తండ్రిని నివ్వెరపరిస్తే, చదువరుల హృదయాలను తాకుతుంది. పరీక్ష కన్నా మానవత్వమే ముఖ్యమని ‘దృక్పథం’ కథ చెబుతుంది.
బడిపిల్లల విజ్ఞాన ప్రదర్శన పోటీలలో భాగంగా – గాంధీ వేషం వేసిన బాలుడికి – ప్రకటించిన విభాగాలలలో కాకుండా – ప్రత్యేక బహుమతిని ఎందుకివ్వాలో న్యాయనిర్ణేత చెప్పిన తీరు – నేటి తరానికి గాంధీజీ గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఆ అబ్బాయిలో ఉన్న లక్షణాలను నిలుపుకోగలిగితే, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం ఉందని ‘గాంధీ గారికి స్పెషల్ ప్రైజ్’ కథలో రచయిత్రి చెబుతారు.
బతుకుతెరువు కోసం పులి వేషం వేసే సూరిగాడికి పండగలలో తప్ప అవకాశాలు రావు. అనారోగ్యంతో మంచమెక్కిన తండ్రి, పాచిపనులు చేసి కొద్దిపాటి డబ్బు సంపాదించే తల్లికి ఆసరగా ఉండేందుకు చిన్నతనంలో చదువు మానేస్తాడు. పట్టణంలో పులివేషంలో సూరిగాడ్ని మించినవాళ్ళెవరూ లేరని పేరు తెచ్చుకుంటాడు. అవసరార్థమై ఓ రాజకీయ పార్టీ ప్రచారంలో పులి వేషం వేస్తాడు. ఆ వేషం వేసి గెంతులు వేయాలంటే మద్యం తాగక తప్పని స్థితిలో తాగుతాడు. కొద్ది సేపటికి వాంతులై, నీరసపడిపోతాడు. ఎలాగోలా కాసేపు పులిలా ఆడి ఇంటికొచ్చేసరికి ప్రాణాలు పోతాయి. కలచివేసే కథనం! ‘పులిగాడు’ కథ చివర్లో రచయిత్రి వేసిన ప్రశ్నలు ఆలోచింపజేస్తాయి. కాని వాటికి జవాబులు చెప్పేదెవరు?
సెంటిమెంటు పేరుతో, కొత్త మోడల్స్ వచ్చాయన్న సాకుతో, బంధువులు కానుకగా ఇచ్చారనీ – ఇలా ఏదో ఒక కారణంగా ఇంట్లో సామాన్లు పెంచుకుంటూపోయి ఇల్లు సరిపోవడం లేదని భావించే ఓ ఇల్లాలికి – నిరాడంబరత ఎంత ముఖ్యమో ఓ కొత్త దంపతుల జంట – ప్రాక్టికల్‍గా నిరూపిస్తుంది. మనకి అవసరం లేనివి, ఇతరులకు ఉపయోగపడే వస్తువులను – వాటి మీద వ్యామోహం, మమకారం వదులుకుని – అవసరం ఉన్నవారికి ఇచ్చేస్తే ఎంత తృప్తి కలుగుతుందో ‘ఇచ్చుటలో ఉన్న హాయీ..’ కథ చెబుతుంది.
ఎన్నో తర్జనభర్జనల అనంతరం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోడం అంత సులువాని పాఠకులకు అనిపించినా – కొందరి పరిచయం, వ్యక్తిత్వం – స్వల్ప సమయంలోనే బలమైన ముద్ర వేసి మనం తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించేలా చేస్తాయి. ‘కనురెప్పలు బరువా?’ అనే చిన్న కథ ఇదే విషయాన్ని ఋజువు చేస్తుంది.
ఓ పాఠశాలలో జరిగిన ‘గ్రాండ్ పేరెంట్స్ డే’ కార్యక్రమం – తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చిన ఓ కొడుకులో ఆలోచనకి కారణమవుతుంది. రెండు తరాల మధ్య వంతెనలయ్యేందుకు పసిపిల్లలు సిద్ధమయ్యేలా చేసిన ప్రధానోపాధ్యాయుడి ఆలోచన అత్యంత ప్రశంసనీయం. ‘వారధి’ కథలో చేసిన ప్రయత్నం సమాజానికి వర్తింపజేసినట్లయితే.. మనవలకి తాతయ్యలు, అమ్మమ్మలు/బామ్మలు లభిస్తారు; అమ్మమ్మా/బామ్మా తాతయ్యలకు మనవలూ లభిస్తారు. మైక్రో కుటుంబాలు విస్తరించి.. మళ్ళీ ఒకనాటి కుటుంబ సంస్కృతి పునరుద్ధరించబడే అవకాశం ఏర్పడుతుంది.
చనిపోయిన అమ్మ కోరికని తీర్చిన కొడుకు ఓ పాపకి కంటి వెలుగు ప్రసాదించి అమ్మని సజీవంగా ఉంచుకుంటాడు. ‘తీరిన అమ్మ కోరిక’ హృద్యమైన కథ. పోటీలో 2000/- రూపాయలు బహుమతి పొందిన కథ.
‘ఉప్పెన బతుకులు’ రచయిత్రి తొలి కథ. పేదలు/నిస్సహాయులు – అవకాశవాదుల బారిన పడి ఏ విధంగా బతుకుతెరువు కోల్పోతుంటారో చెప్తుందీ కథ. తుఫాను అల్లకల్లోలం సమయంలో ఊర్లు ఎలా ఉంటాయో, మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అత్యంత సహజంగా చెప్పారీ కథలో రచయిత్రి.
దేశంలో కొన్ని ప్రాంతాలుంటాయి.. ఆ ఊర్ల నుండి దేశ రక్షణ కోసం సైన్యంలో చేరేవారు – తమ కుటుంబంలో ఒకరిని కోల్పోయినా – మరొకరు దేశ సేవకి సైన్యంలో చేరేందుకు ముందుకొస్తారు. దేశం కోసం ప్రాణాలర్పించటం వారికి తృణప్రాయం. అటువంటి ఓ కుటుంబం కథని చెబుతుంది ‘జీవన హేల’.
పిల్లల కోసం రాసిన ‘మాటల మహిమ’ కథ – మంచిగా మాట్లాడితే, ఎంతటి కఠినాత్ములలోనైనా మార్పు వస్తుందని సూచిస్తుంది.
120 నిమిషాల్లో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలను చెప్తుంది ‘ఆ రెండు గంటల్లో..’ కథ. రెండు పాత్రల మధ్య వీచిన ఆధ్యాత్మిక పరిమళాలు ఆచార్య వ్యవహారాలను గౌరవించి, సక్రమంగా పాటించాలనుకునే వారికీ సోకుతాయి. చక్కని కథ.
వృద్ధులని ముసలివాళ్ళుగా చూడకుండా, మనతో పాటు, మనలో ఒకరిగా కష్టసుఖాలలో భాగం చేస్తే – వృద్ధుల శారీరిక మానసిక ఆరోగ్యం చక్కగా ఉండి, కుటుంబాలకి ఆలంబన అవుతారని చెప్తుంది ‘జ్ఞాపకాల పందిరి’ కథ.
‘మరీచిక’ ఎవరికి వారు చదువుకోవాల్సిన కథ. సాహితీస్నేహాలు పక్కదారి పట్టకుండా చూసుకోవడానికి ఓ రచయిత్రి ఎంత గట్టి సంకల్పం చేసుకుందో ఈ కథ చెబుతుంది.
ఎదిగీ ఎదగని వయసులో తప్పనిసరిగా పెళ్ళి చేసుకోవాల్సిన వచ్చిన వసంత జీవితంలో ఏం కోల్పోయిందో ‘విముక్తి’ కథ చెబుతుంది. ఎంత పేదవారైనా, అమ్మాయికి పెళ్ళి చేసేముందు అబ్బాయి గురించిన అన్ని వివరాలు తెలుసుకుని, అతని గుణగుణాలు తెల్సుకుని పెళ్ళి జరిపించాలని, లేకపోతే ఆ అమ్మాయి జీవితాంతం బాధపడాల్సి వస్తుందని ఈ కథ సూచిస్తుంది.
గంభీరమైన ఇతివృత్తాల కథలు చదివిన పాఠకుల మనసులు తేలికపడేలా రాసిన ‘బామ్మగారూ కరోనా మడి’ అనే హాస్య కథ నవ్విస్తుంది. కరోనా కాలపు కథగా రాసిన ‘ఎప్పటికెయ్యది..’లో మంచి సందేశం ఉంది. కరోనా ఉపద్రవం తొలగిన తరువాత కూడా పాటించదగ్గ విలువైన సూచన ఉంది. కరోనా కాలంలో రాసిన మరో కథ ‘నాలాగా ఎందరో’. గడ్డు పరిస్థితులలో మానసిక నిబ్బరం కోల్పోకుండా ఎలా ఉండాలో, ఆదాయం కోసం ప్రత్యామ్నాయ పద్ధతులు ఎలా వెతుక్కోవాలో ఈ కథ చెబుతుంది. కరోనా కాలపు మరో కథ ‘అమ్మ దీవెన’. చక్కగా చదివిస్తుంది.
30 ఏళ్ళు సముద్ర గర్భంలో ఉండి దేశసేవ చేసిన ఐఎన్ఎస్ కురుసుర అనే జలాంతర్గామిని విశాఖ తీరంలో మ్యూజియంగా మార్చిన సంగతి తెలిసినదే. ఆ మ్యూజియంను, ఆ జలాంతర్గామి వైభవాన్ని చూపించి, తన తల్లి ఆలోచనా విధానాన్ని మారుస్తాడో బుడతడు ‘వారసత్వ సంపద’ కథలో. పిల్లల మనసులు స్వచ్ఛమైనవి కాబట్టే పెద్దల మలినమైన మనసులకు తట్టని మంచి ఆలోచనలు వాళ్ళకే వస్తాయని ఈ కథ చెబుతుంది.
ఎలకలెంత తెలివైనవో ‘మూషిక ప్రహసనం’ అనే కథ చెబుతుంది. చాలా మంది ఇళ్ళల్లో ఎదుర్కునే సమస్యని, హాస్యం జోడించి చెప్పారు రచయిత్రి.
~
కేవలం సందేశం కోసమే రాసినట్టు కాకుండా – సమాజంలో జరుగుతున్న పలు సంఘటనల ఆధారంగా అల్లిన కథలివి. ఎలా నడుచుకుంటే మనుషులు బావుంటారో – వ్యక్తులు/సంఘం బాగుపడతారో ఈ కథలు సూచిస్తాయి.
ఉపాధ్యాయ వృత్తిలో రెండు దశాబ్దాలకు పైగా సమాజాన్ని సన్నిహితంగా పరిశీలించిన శ్రీలక్ష్మి గారు అందరి హితాన్ని ఆశిస్తూ రాసిన కథల సంపుటి – పాఠకులను నిరాశ పరచదు.
***
లేత మనసులు (కథా సంపుటి)
రచన: చివుకుల శ్రీలక్ష్మి
పేజీలు: (150+x) 160
వెల: ₹ 150/-
ప్రతులకు:
చివుకుల శ్రీలక్ష్మి
ఇంటి నెంబరు 20-24-18
పద్మావతి నగర్, ఆరవ వీధి
విజయనగరం- 535002
ఫోన్: 9441957325
~
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-chivukula-srilakshmi/