[బాలబాలికల కోసం ‘కింకిణీ చెట్టు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
[dropcap]కొ[/dropcap]న్ని వందల సంవత్సరాల క్రితం కోదండం అనే బీదవాడు కష్టపడి సంపాదించుకుని తినేవాడు. వాడు నిరంతరం కష్టపడి ఐదు బంగారు నాణేలు సంపాదించాడు. ఒక బంగారు నాణెంతో నిత్యావసర సరుకులు కొనుక్కున్నాడు. వాటి వలన వాడికి మరో మూడు నెలలు భుక్తికి ఢోకాలేదు.
ఆ మిగిలిన నాలుగు నాణేలు తన పాకలో దాస్తే భద్రత ఉండదని వాటిని ఎవరూ చూడకుండా జాగ్రత్తగా దాచాలని నిర్ణయించి ఆలోచించి నాణేలను మూటకట్టి ఓ అర్ధరాత్రి ఎవరూ చూడటం లేదని నిర్ణయించుకుని తన ఇంటికి కొంత దూరంలో ఉన్న పెద్ద చెట్టు మొదలులో లోతుగా గొయ్యి తీసి మూటను పాతిపెట్టి ఎవరూ ఆ పరిసర ప్రాంతంలో లేరని నిర్థారించుకుని పాకకు వచ్చి పడుకున్నాడు.
ఒక రోజు మాత్రమే తృప్తిగా నిద్రపోయాడు. రెండో రోజు పాతి పెట్టిన నాణేల గురించి ఆందోళన మొదలయ్యింది! ఆ అనుమానంతో నిద్ర కరువైంది కోదండానికి.
రెండో రోజు చెట్టు వద్దకు వెళ్ళి ఎవరూ చూడటం లేదని నిర్ణయించుకుని త్రవ్వాడు. అంతే కోదండం గుండె ఒక్కసారి గుభేల్ మంది! మరి అక్కడ తన మూట లేదు! అయినా ఆశగా మరింత త్రవ్వి చూసాడు. మూట ఆచూకీ లేదు! కష్టపడి సంపాదించిన బంగారం పొయ్యేసరికి కోదండానికి దుఃఖం ఆగలేదు.
పొద్దున్నే లేచి గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న తన స్నేహితుడు బ్రహ్మయ్య వద్దకు వెళ్ళి తను దాచిన బంగారం అక్కడినుండి అవి మాయమైన సంగతి చెప్పి భోరుమన్నాడు.
“ఏడవకు కోదండం నాకు రెండురోజులు సమయం ఇవ్వు. ఆలోచించి వాటిని దోచుకున్న వాడి జాడ కనిబెడతాను” చెప్పాడు బ్రహ్మయ్య.
బ్రహ్మయ్య తెలివికలవాడు. ఊర్లో వారికి ఏకష్టం వచ్చినా తగిన సలహాలు ఇస్తుంటాడు.
రెండు రోజుల తరువాత బ్రహ్మయ్య కోదండం ఇంటికి వచ్చి “నీవు ఏ చెట్టుకింద పాతావో ఆ చెట్టు చూపించు” అని చెప్పి కోదండంతో ఆ చెట్టు వద్దకు వెళ్ళి పరిశీలించసాగాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రయ్య అనేవాడు “ఏమిటి చూస్తున్నారు మీకు నడుంనొప్పా? ఈ చెట్టు వేళ్ళు బాగా నూరి లేహ్యం చేసి మింగితే మూడు రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది.. ఇది అరుదుగా ఉండే కింకిణీ చెట్టు (కల్పితం)” అని చెప్పాడు రుద్రయ్య.
రుద్రయ్య మాటలతో బ్రహ్మయ్య మెదడులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది!
“ఈ చెట్టు వేళ్ళు నీవు వాడుతున్నావా?” అడిగాడు బ్రహ్మయ్య.
“అయ్యా పక్క ఊరి ఆయుర్వేద వైద్యుడు చంద్రన్న ఆరునెలల క్రితం నాకు నడుము నొప్పి వస్తే ఈ చెట్టూ వేళ్ళని లేహ్య రూపంలో తీసుకోమని చెప్పాడు. రెండు రోజుల్లో నా నడుము నొప్పి తగ్గి పోయింది!” చిరునవ్వుతో చెప్పాడు రుద్రయ్య.
అతనికి కృతజ్ఞతలు తెలిపి బ్రహ్మయ్య, “భయపడకు ఇది దొంగపని అయి ఉండదు. మనం వెంటనే వైద్యుడు చంద్రన్నని కలుద్దాం విషయం తెలియవచ్చు” అని చెప్పి ఇద్దరూ చంద్రన్న ఆసుపత్రికి వెళ్ళారు.
“అయ్యా చంద్రన్న గారూ మా కోదండాని నడుము నొప్పి మీరు మంచి మందు ఇస్తారని తెలిసీవచ్చాం. మీకు అభ్యంతరం లేకపోతే ఈ మధ్య మీరు సూచించిన మందు వాడిన వారిని కలసి వారికి ఏమేర తగ్గిందో తెలుసుకోవచ్చా?” అని నమ్రతగా అడిగాడు బ్రహ్మయ్య.
“దానికేం భాగ్యం ఈ ఊర్లోనే ఉన్న వ్యాపారస్తుడు బుచ్చయ్యను అడగండి, అతనికే కొద్దిరోజుల క్రితం కింకిణీ చెట్టు వేళ్ళ లేహ్యం తినమని చెప్పాను. ఆ లేహ్యాన్ని వాడి అతను నాదగ్గరకు మరలా రాలేదు! మీరు అతనికి నడుం నొప్పి తగ్గిందో లేదో కనుక్కుని మీకు వీలైతే వచ్చి అతను ఏం చెప్పాడో అది నాకు చెప్పండి” అన్నాడు.
చంద్రన్నకు నమస్కారం పెట్టి వ్యాపారస్థుడు బుచ్చయ్య వద్దకు వెళ్ళి నడుము నొప్ఫిని గురించి అడిగారు. తరువాత మెల్లగా ఎక్కడి కింకిణీ చెట్టు అని అడిగారు. కోదండం ఇంటి పరిసరాల్లో ఉన్న కింకిణీ చెట్టు నుండి వేళ్ళు సేకరించినట్లు చెప్పాడు చంద్రయ్య.
“అయ్యా తమరు ఏమీ అనుకోకండి, నా స్నేహితుడు కోదండం చాలా బీదవాడు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న బంగారు నాణేలు కింకణీ చెట్టు కింద మూట కట్టి పాతి పెట్టాడు” అని చెప్పాడు
బుచ్చయ్య బ్రహ్మయ్య మాటలు అర్థం చేసుకుని ఆ నాణేలు కోదండానివని తెలుసుకుని లోపలికి వెళ్ళి బంగారు నాణేల సంచీ తెచ్చి ఇచ్చాడు. పరుల ధనం బుచ్చయ్య ఆశించేవాడు కాదు.
కోదండం, బ్రహ్మయ్య బుచ్చయ్య మంచితనాన్ని పొగిడి నమస్కారం పెట్టి, “అయ్యా తమరికి నడుంనొప్పి తగ్గిందా? వైద్యుడు చంద్రన్న కనుక్కని రమ్మన్నాడు” అని చెప్పారు.
“పూర్తిగా తగ్గింది.. కింకిణీ చెట్టు వేళ్ళు మహత్తర ఔషద గుణాలు కలిగి ఉన్నాయి” అని చిరునవ్వుతో చెప్పాడు బుచ్చయ్య.
ఇద్దరూ చంద్రన్న వద్దకు వెళ్ళి బుచ్చన్నకు నడుంనొప్పి తగ్గినట్లు చెప్పి కోదండం బంగారు నాణేల సంచి బుచ్చన్న మంచి మనసును గురించి చెప్పారు.
“కష్టపడి సంపాదించింది ఎక్కడకూ పోదు. మంచి మనసున్న బుచ్చన్న వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతోంది” అని వివరించాడు.
ఎంతో సంతోషంతో కోదండం, బ్రహ్మయ్య వెళ్ళి పోయారు.