[బాలబాలికల కోసం శ్రీ సలీం రాసిన ‘అందమైన కానుక’ అనే కథని అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap] రోజు లాస్య పుట్టినరోజు.. ఉదయం నిద్ర లేవగానే వాళ్ళమ్మ నవ్వుతూ వచ్చి లాస్యను కౌగిలించుకుని “హ్యాపీ బర్త్‌డే బంగారు తల్లీ” అంటూ నుదుటిమీద ముద్దు పెట్టుకుంది. నాన్న కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
లాస్య తలంటి స్నానం చేసి, నిన్న అమ్మతో కలిసి బజారుకెళ్ళి కొన్న పూల పూల గులాబీరంగు గౌన్ తొడుక్కుంది. పుట్టినరోజంటే పిల్లలకు పండగే కదా. ఆ రోజు స్కూల్‍కి యూనిఫాం వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు.
లాస్య స్కూల్లో టీచర్లతో పాటు తన తోటి నాలుగో తరగతి విద్యార్థులందరికీ చాక్లెట్లు పంచింది. “రాత్రి ఏడింటికి మా యింట్లో బర్త్ డే ఫంక్షన్ ఉంది. మీరు తప్పకుండా రావాలి” అంటూ తన స్నేహితురాళ్ళు ధాత్రి, వినీల, మధూలికలను ప్రత్యేకంగా ఆహ్వానించింది. “అమ్మ పాయసం, గారెలు, బిర్యానీ, చికెన్ కర్రీ వండిపెడ్తానంది. భోజనాలు మా యింట్లోనే” అని కూడా చెప్పింది.
రాత్రి ఏడింటికి పూలమాలల్తో, రంగురంగుల బుడగల్తో అలంకరించబడిన గదిలో లాస్య కేక్ మీద గుచ్చిపెట్టిన తొమ్మిది కొవ్వొత్తుల్ని గాలి వూది ఆర్పేశాక, కేక్‍ని కోసింది. వాళ్ళమ్మ కేక్ ముక్కల్ని పేపర్ ప్లేట్లలో పెట్టి పిల్లలందరికీ పంచింది.
పిల్లలు కొంతమంది చాక్లెట్లు, పెన్నులు, ఫోటో ఫ్రేములు, ఆటబొమ్మలు మొదలైనవి బహుమతిగా ఇచ్చారు. వినీల ముద్దోచ్చే టెడ్డీబేరని బహుమతిగా యిచ్చింది. మధూలిక రెండు కామిక్ పుస్తకాల్ని బహుమతిగా యిచ్చింది. ధాత్రి నవ్వుతూ “నేను మీరెవ్వరూ వూహించని బహుమతిని ఇవ్వబోతున్నాను. ఇప్పుడే కాదు. అందరూ వెళ్ళిపోయాక యిస్తాను” అంది.
“ఆ బహుమతి ఏంటో చెప్పవా?” అని వినీల ఎంతడిగినా చెప్పలేదు.
“సస్పెన్స్” అంటూ నవ్వేసింది,
ధాత్రి వాళ్ళిల్లు లాస్య వాళ్ళింటికి రెండిళ్ళవతలే ఉంటుంది. ధాత్రికి లాస్యంటే చాలా ఇష్టం. లాస్య కు కూడా తన ముగ్గురు స్నేహితురాళ్ళలో ధాత్రితోనే గాఢమైన స్నేహం.
భోజనాలప్పుడు కూడా ధాత్రి యివ్వబోతున్న బహుమతి ఏమై ఉంటుందా అని లాస్య ఆలోచిస్తూనే ఉంది. రాత్రి ఎనిమిదిన్నరకు వినీల, మధూలిక వెళ్ళిపోయారు.
గదిలో లాస్య, ధాత్రి మిగిలారు. “నేను పది నిమిషాల్లో నీకివ్వాలనుకున్న బహుమతిని తెచ్చిస్తానుండు” అంటూ ధాత్రి తూనీగలా తన యింటి వైపుకి పరుగెత్తింది.
లాస్యలో ఉత్కంఠ.. అంత అరుదైన బహుమతి ఏమై ఉంటుందా అని. లాస్య ఆలోచనల్లో మునిగి ఉండగానే ధాత్రి వచ్చేసింది. ఆమె చేతిలో వెదురుతో చేసిన చిన్న బుట్ట ఉంది. దాన్లో పరిచిఉన్న పచ్చగడ్డి మీద తెల్లగా, మంచు ముద్దలా ఉన్న బుజ్జి కుందేలు పిల్ల.. పొడవాటి చెవులు, మెరుస్తున్న నీలి కళ్ళు, బుల్లి తోక..
“వావ్.. ఎంత ముద్దుగా ఉందో” సంబరపడిపోతూ అంది లాస్య.
“నీ పుట్టినరోజు నాడు బహుమతిగా ఇద్దామనే మా నాన్నకు చెప్పి దీన్ని తెప్పించాను. దీని వయసు నెలరోజులేనట. నీకు నచ్చిందా?” అంది ధాత్రి.
“ఓ.. చాలా బాగా నచ్చింది. దీని పేరేమిటి?” అని అడిగింది లాస్య.
“పేరేమీ పెట్టలేదు. నువ్వే చెప్పు ఏ పేరు పెడ్తే బావుంటుందో” అంది ధాత్రి.
లాస్య కొద్దిసేపు ఆలోచించి “స్నోలా తెల్లగా ఉందికదా. స్నోయీ అని పెద్దామా?” అంది.
ధాత్రి తలవూపుతూ “చాలా బావుంది. ఇక నుంచి దీని పేరు స్నోయి” అంటూ కుందేలు వీపు మీద మెల్లగా రుద్దుతూ “హలో స్నోయీ” అంది.
“కుక్కపిల్లల్ని నిమిరినట్టు దీని వీపుమీద, తల మీద, మెడకింద నిమరాలని నాన్న చెప్పాడు” అంటూ లాస్య వైపు చూసి నవ్వింది ధాత్రి.
లాస్య దాని తలమీద చేయి పెట్టబోయి చప్పున చేతిని వెనక్కి తీసేసుకుంటూ “కరుస్తుందేమోనే” అ౦ది.
ధాత్రి ఈసారి పెద్దగా నవ్వింది. “అయ్యో.. ఏమీ చేయదే. మనం దాన్ని నిమిరేకొద్దీ అది మనల్ని ఇష్టపడ్తుందట. కుక్కపిల్లల్ని ఎలా ముద్దు చేస్తామో అలానే వీటిని కూడా ముద్దు చేయాలట. కొన్ని రోజులు అలవాటైనాక దీన్ని పేరు పెట్టి పిలిస్తే పరుగెత్తుకుంటూ మన దగ్గరకొస్తుందట” అంది.
“హాయ్ స్నోయీ” అంటూ లాస్య స్నోయీ తలని సుతారంగా నిమిరింది.
అది తన ముందున్న గడ్డిపరకల్ని కొరికి తినడం చూసి “ఇది గడ్డిని మాత్రమే తింటుందా?” అని అడిగింది.
“చెప్పడం మర్చేపోయాను. ఇది పూర్తి శాకాహారి. దీని తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నాన్న చెప్పాడు. పచ్చగడ్డి పరకలు లేతవి, క్యారట్ ముక్కలు, క్యాబేజీ, కొత్తిమీర, తులసి ఆకులు, యాపిల్, అరటి పండు ముక్కలు.. ఇలాంటివే పెట్టాలి. సరేనా” అంటూ మరికొన్ని జాగ్రత్తలు చెప్పి ధాత్రి వెళ్ళిపోయింది.
లాస్య చాలా ఉత్సాహంగా స్నోయీని తీసుకెళ్ళి అమ్మానాన్నకు చూపించింది. వాళ్ళమ్మకు లాస్య కుందేలు పిల్లని పెంచుకోవడం సుతరామూ ఇష్టం లేదు. “ఎవరైనా తెల్లటి బొచ్చుకుక్క పిల్లనో, పిల్లి పిల్లనో పెంచుకుంటారు కానీ ఇలా కుందేలు పిల్లని పెంచుకుంటారా?” అంది.
“ఎందుకు పెంచుకోరూ.. చాలామంది కుందేలు పిల్లల్ని పెంచుకోవటం నేను చూశాను” అంటూ నాన్న లాస్యను సమర్థించాడు.
దాన్ని పెంచడం విషయంలో యింట్లో కొద్దిసేపు అమ్మాకూ నాన్నకూ గొడవైంది. “అది యిల్లంతా ఖరాబు చేస్తే నేనూరుకోను” అంది అమ్మ.
లాస్య దిగులుగా ‘ఏం చేద్దాం’ అన్నట్టు నాన్న వైపు చూసింది. “ఈ ఒక్క రాత్రికి యింట్లోనే ఉండనీ. రేపుదయం దాని కోసం మన పెరట్లో చిన్న యిల్లు కట్టిద్దాం” అన్నాడు నాన్న. లాస్య సంతోషంతో “భలే భలే” అంటూ గంతులేసింది.
తన గదిలో స్నోయీని కింద వదిలేసి, దానిముందు క్యారట్ ముక్కలు, క్యాబేజీ, యాపిల్ పండు ముక్కలు వేసింది. అది గదంతా చెంగు చెంగున దుముకుతూ కలియతిరుగుతుంటే లాస్యకు ఎంత ముచ్చటేసిందో.. అది తన బుల్లి మూతితో క్యారట్ ముక్కలు కొరికి తినడం, గెంతడం, దాని ముక్కు గాలికి రెపరెపలాడే ఆకులా కదలడం అబ్బురంగా చూస్తూనే నిద్రలోకి జారిపోయింది.
లాస్య ఉదయం నిద్ర లేచేటప్పటికే నాన్న పెరట్లో స్నోయీ కోసం యిల్లు తయారుచేసే పనిలో ఉన్నాడు. లాస్య స్నోయీని ఎత్తుకుని పెరట్లోకెళ్ళి నాన్న చేస్తున్న పనిని చూస్తూ నిలబడింది.
రెండు పెద్ద కార్డ్బోర్డ్ పెట్టెల్ని టేప్‌తో కలిపి, ఒకే పెట్టెలా చేసి దానికి ఓ వైపు కుందేలు లోపలికెళ్ళడానికి సరిపడినంత మేర కోసి, గాలీ వెల్తురూ రావడానికి నాలుగు చోట్ల కిటికీల్లా ఏర్పాటు చేశాడు.
“ఇది కార్డ్‌బోర్డ్‌తో చేసిన ఇల్లు కదా. నానడం వల్ల తొందరగా పాడైపోతుంది. ఆదివారం కార్పెంటర్ని పిలిచి మాట్లాడతాను. చెక్కల మధ్య మెష్ పెట్టి మంచి యిల్లు తయారుచేసి యిమ్మని చెప్తాను. సరేనా” అన్నాడు నాన్న.
“సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ప్లాస్టిక్‌తో చేసిన జంతువుల బొమ్మలు, రంగురంగుల బంతులు తెస్తాను. స్నోయీ వాటితో ఆడుకుంటుంది” అని కూడా అన్నాడు.
ఆ రోజు నుంచి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక స్నోయీతో ఆడుకోవడం లాస్య దినచర్యలో ఓ భాగమైపోయింది. ధాత్రి కూడా లాస్యతో కలిసి స్నోయీతో ఆడుకోసాగింది. వాళ్ళిద్దరి గొంతుల్ని స్నోయీ గుర్తుపడింది.
లాస్యగానీ ధాత్రిగానీ ‘స్నోయీ’ అని పిలిస్తే చాలు చెంగుచెంగున గెంతుతూ వాళ్ళ కాళ్ళ దగ్గరకొచ్చేస్తుంది. దాన్ని ఎత్తుకుని ఒళ్ళో కూచోబెట్టుకుని వీపునో తలనో నిమిర్తే చాలు, కళ్ళు మూసుకుని పారవశ్యంలో తేలిపోతుంది.
లాస్య పరుగెత్తితే స్నోయీ కూడా ఆ అమ్మాయి వెనకే పరుగెత్తుతుంది. కాళ్ళ చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఆడుకుంటుంది. మరీ ఇష్టం ఏర్పడినప్పుడు లాస్య పాదాల్ని నాకుతుంది.
ఇప్పుడు స్నోయీ వయసు ఏడాది దాటి ఆర్నెల్లు.. మంచి పౌష్ఠికాహారం తినడం వల్ల బాగా ఒళ్ళు చేసి, ఆరోగ్యంగా ఉంది.
సంక్రాంతి పండక్కి యింటికి లాస్య వాళ్ళ మేనమామ రమేష్ తన కుటుంబంతో సహా వచ్చాడు. అతని కొడుకు కమలికి పన్నెండేళ్ళు. చాలా అల్లరి పిల్లవాడు. వాడికి నోరు లేని జంతువుల మీద కాస్తయినా కనికరం లేదు. చీమలు కనిపిస్తే చాలు కాళ్ళ కిందేసి తొక్కి చంపేస్తాడు. రోడ్డు పక్కన ఏ చెట్టుకిందో విశ్రాంతి తీసుకుంటున్న కుక్కల్ని రాళ్ళతో కొట్టి తరిమేస్తాడు.
కమల్ వల్ల లాస్యకు మనశ్శాంతి కరువైంది. పెరట్లోకెళ్ళి స్నోయీ చెవుల్ని పట్టుకుని పైకి లేపి, మెలిపెట్టి తిప్పుతూ, అది బాధతో అరుస్తుంటే ఆనందిస్తున్నాడు. వాడు కనిపిస్తే చాలు స్నోయీ భయంతో చెవుల్ని కిందికి వేలాడేసుకుని, మెష్ లోపలికెళ్ళి దాక్కుంటోంది.
“ఎందుకలా చేస్తావు? దానికెంత నొప్పేస్తుందో తెలుసా? నీ చెవుల్ని మెలిపెడితే నీకు నొప్పేయదా?” అంది లాస్య కోపంగా.
“ఇప్పుడు మళ్ళా పైకెత్తిపట్టుకుని కిందికి వదిలేస్తాను చూడు” అంటూ వాడు స్నోయీని పట్టుకోబోతుంటే “నా స్నోయీని ముట్టుకోకు” అంటూ పెద్దగా అరిచింది.
కమల్ వల్ల ఎప్పటికైనా తన స్నోయీ ఆపదలో పడొచ్చన్న భయం పట్టుకుంది లాస్యకు.
“నిన్న వాడు స్నోయీకి చాక్లెట్లు తినిపించాడే. అవి తిన్పించకూడదని చెప్పినా వినడే. స్నోయీ పాలిట యముడ్లా దాపురించాడే” ధాత్రితో తన మనసులోని భయాల్ని పంచుకుంటూ అంది లాస్య.
“వాళ్ళు వెళ్ళేవరకు స్నోయీని జాగ్రత్తగా చూసుకోవే. పగటి పూట నేను కూడా ఎక్కువ సమయం స్నోయీతోనే గడుపుతాను. శెలవలేగా” అంది ధాత్రి.
ఆ రోజు లాస్య వాళ్ళమ్మ చికెన్ కూర, చికెన్ ఫ్రై చేసింది. భోజనాల దగ్గర అందరూ కబుర్లలో పడ్డారు.
చపాతీలో చికెన్ ముక్కని నంజుకుని తింటూ “బావా.. ఈ చికెన్లు మటన్లు తినీతినీ బోర్ కొడ్తోంది. కనుమ రోజు ఏమైనా స్పెషల్ చేయించు బావా” అన్నాడు రమేష్.
“ఏం వండించమంటావూ? జింక మాంసం వండించనా?” అంటూ నవ్వాడు లాస్య వాళ్ళ నాన్న.
“పరాచికాలు చాల్లే బావా. జింక మాంసం తింటే జైలేనటగా. నాకు జైలుకెళ్ళే ఉద్దేశం లేదులే. కు౦దేలు మాంసం చాల రుచిగా ఉంటుందని విన్నాను. నిజమేనా బావా” అని అడిగాడు రమేష్.
“నిజమే. ఎప్పుడో పదేళ్ళ క్రితం తిన్నాను. ఎంత రుచిగా ఉంటుందనుకున్నావూ.. ఆ రుచి ఇప్పటికీ నాలిక మీద ఉందనుకో” అన్నాడు లాస్య వాళ్ళ నాన్న.
“కనుమ రోజు కుందేలు మాంసం వండించు బావా” అన్నాడు రమేష్.
“మామయ్య వాళ్ళింట్లోనే కుందేల్ని పెంచుతున్నారుగా. బైటికెళ్ళి కొనాల్సిన పని కూడా లేదు మామయ్యకి” అన్నాడు కమల్.
వాడి మాటలు వినగానే లాస్యకు గుండెల్లో రైళ్ళు పరుగెత్తసాగాయి. పైన ఫ్యాన్ తిరుగుతున్నా భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి.
లాస్య భయం భయంగా నాన్న వైపు చూసింది. అతనేమీ మాట్లాడకపోవడంతో ఆమెలోని భయం రెట్టింపయింది. నిజంగానే స్నోయీని కోసి, వండేస్తారా? ఆ ఆలోచనకే ఆమెకు కళ్ళు తిరుగుతున్నట్టనిపించింది.
“కోసేయండి. పీడా విరగడైపోతుంది. అది యింటికొచ్చినప్పటినుంచి మనశ్శాంతి కరువైంది. స్నోయీతో ఆడుకోవడం ఎక్కువ కావడంతో లాస్యకు చదువుమీద శ్రద్ధ తగ్గింది. అన్నయ్యా.. కనుమ రోజు నీకు కుందేలు మాంసం వండిపెడ్తాలే” అంది లాస్య వాళ్ళమ్మ.
అప్పటికీ లాస్య వాళ్ళ నాన్న ఏమీ మాట్లాడకపోవడంతో లాస్యకు అర్థమైపోయింది. నాన్న అమ్మ మాటకు ఎదురుచెప్పడని. అసలే అమ్మకు స్నోయీ అంటే పడదు.
ఆ రాత్రి లాస్యకు నిద్ర పట్టలేదు. కనుమ యింకా నాలుగు రోజులుంది. ఈ లోపల స్నోయీని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించింది. ఉదయం నిద్ర లేవడం ఆలస్యం ధాత్రిని కల్సుకుని “ఏం చేద్దామంటావు?” అని అడిగింది.
“మీ మామయ్య వాళ్ళు వెళ్ళేవరకు స్నోయీని ఎక్కడైనా దాచేద్దాం” అంది ధాత్రి.
“నేనూ అదే ఆలోచించాను. కానీ ఎక్కడ దాచిపెట్టాలో తెలియడం లేదే” అంది లాస్య.
“వూరి చివర్న ఓ పాడుపడిన యిల్లుంది తెల్సుగా. మనం స్నోయీని ఆ కాంపౌండ్లో దాచిపెద్దాం. అక్కడికెవ్వరూ రారు. ఎవ్వరికీ అనుమానం కూడా రాదు” అంది ధాత్రి.
“అమ్మో.. అక్కడికా? ఆ యింటిని బైటినుంచి చూస్తేనే భయం వేస్తుంది కదే. దెయ్యాలకొంపలా ఉంటుంది” అంది లాస్య.
“మనం పగటిపూట కదా వెళ్తాం.. భయపడాల్సింది ఏముంటుంది? రోజులో రెండు మూడుసార్లు వంతులవారీగా వెళ్ళి స్నోయీని చూసుకుని వద్దాం. నామాటిను. అక్కడైతేనే స్నోయీ భద్రంగా ఉంటుంది” అంది ధాత్రి.
మరో గత్యంతరం లేకపోవడంతో లాస్య ఒప్పుకుంది. మధ్యాహ్నం భోజనాల తర్వాత స్నోయీని ఎవ్వరూ చూడకుండా యింట్లోంచి తెచ్చేసి, ఆ పాడుపడిన యింటి కాంపౌండ్లో దాచిపెట్టాలని నిర్ణయించుకున్నారు.
సాయంత్రం ఐదింటికి లాస్య “ధాత్రి వాళ్ళింటికెళ్ళొస్తానమ్మా” అని చెప్పి బైటికొచ్చింది. శబ్దం చేయకుండా పెరట్లోకి వెళ్ళి స్నోయీని ఎత్తుకుని, ధాత్రిని కల్సుకుంది. ధాత్రి చేతిలో ఓ సంచి ఉంది. ఇద్దరూ వేగంగా నడుస్తూ వూరి చివర ఉన్న యింటిని చేరుకున్నారు.
పెచ్చులూడిపోయి, రంగు వెలసిపోయిన గోడలు.. అక్కడక్కడా మూలల్లో సాలెగూళ్ళు.. తుప్పు పట్టిన ఇనుప గేట్.. ధాత్రి గేట్‍ని తెరిచినపుడు అది కిర్రుమంటూ శబ్దం చేస్తూ తెర్చుకుంది. యింట్లోకి వెళ్ళే గచ్చుదారికిరువైపులా పిచ్చిమొక్కలు మొలిచి ఉన్నాయి. పెరట్లో రెండు కొబ్బరిచెట్లు, ఓ వేపచెట్టు ఉన్నాయి.
“మనం స్నోయీని ఆ వేపచెట్టుకింద శుభ్రం చేసి పెద్దాం. నీడగా ఉంటుంది. గేట్ మూసేసి ఉంటుంది కాబట్టి స్నోయీ అటూ ఇటూ తిరిగినా ఈ కాంపౌండ్ లోపలే భద్రంగా ఉంటుంది” అంది ధాత్రి.
ఇద్దరూ వేపచెట్టు కింద పడిఉన్న చెత్తని తీసేసి, నేలని శుభ్రం చేశారు. ధాత్రి తన సంచిలోంచి పచ్చగడ్డిని తీసి నేలమీద పరిచింది. లాస్య స్నోయీని గడ్డిపరుపు మీద పడుకోబెట్టింది.
ధాత్రి సంచిలోంచి క్యారట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు తీసి స్నోయీ ముందు వేయబోతున్నప్పుడు “భౌ భౌ” అంటూ విన్పించింది. లాస్య, ధాత్రి భయంతో బిగుసుకుపోయి అటువైపు చూశారు. నల్లటి పెద్ద కుక్క.. స్నోయీ వైపు చూస్తూ మరోసారి మొరిగింది.
అప్పటికే బెదిరిపోయి వణికిపోతూ కాళ్ళ దగ్గరకొచ్చిన స్నోయీని లాస్య చప్పున ఎత్తుకుని ఒళ్లో కి తీసుకుంది.
“మనం గేట్ మూసేసి కదా లోపలికొచ్చాం. చుట్టూ ఎత్తయిన ప్రహరీ గోడ ఉందిగా. మరి ఈ కుక్క లోపలికెలా వచ్చింది?” లోగొంతుకతో అంది లాస్య.
ధాత్రికి కూడా అదే అనుమానం వచ్చింది. ప్రహరీని పరిశీలనగా చూసింది. ఓ వైపు మూలలో గోడ పడిపోయిఉంది. కుక్క ఎలా వచ్చిందో ఆ అమ్మాయికి అర్థమైంది.
“స్నోయీని ఇక్కడ ఉంచటం మంచిదికాదు. మరో స్థలం వెతుక్కోవాలి. వెళ్లాం పద” అంటూ నేల మీద పరిచిన గడ్డిని తీసి సంచిలో వేసుకుంది ధాత్రి. ఇద్దరూ మెల్లగా లేచి నిలబడ్డారు. కుక్క “గుర్ర్‌ర్” టూ వాళ్ళ వైపు చూసింది.
ఇద్దరూ రెండడుగులు వెనక్కి వేశారు. కుక్క రెండడుగులు ముందుకొచ్చి మళ్ళా “గుర్ర్‌ర్” అంది.
దాన్నుంచి తప్పించుకోవటం ఎలా అని వేగంగా ఆలోచించింది ధాత్రి. ఆ అమ్మాయికి తను స్నోయీ కోసమని తెచ్చిన పండ్ల ముక్కలు గుర్తొచ్చాయి. సంచిలోంచి కొన్ని ముక్కలు తీసి కుక్కకి వెనక వైపు దూరంగా పడేలా విసిరేసింది. కుక్క కొన్ని క్షణాలు వాళ్ళ వైపు చూసి, తల తిప్పి ముక్కలు పడిన వైపు చూసింది. మెల్లగా కదిలి అటువైపుకెళ్ళి వాటిని తినడంలో నిమగ్నమైపోయింది.
అదే అదనుగా ఇద్దరూ వేగంగా బైటికి నడిచి, గేట్ మూసేశారు.
“హమ్మయ్య. బతికిపోయాం.. ఎంత భయమేసిందో నాకు” అంది లాస్య.
“మొదట స్నోయీని ఎక్కడ దాచిపెట్టాలో ఆలోచించు. చీకటిపడేలోపల మనం తిరిగెళ్ళకపోతే ఇంట్లోవాళ్ళు కంగారు పడ్తారు” అంది ధాత్రి.
“స్నోయీకి ఆకలేస్తూ ఉంటుంది. అది తిండి తిని చాలా సేపైంది. మొదట దానికేమైనా పెద్దాం. తర్వాత ఎక్కడ దాచిపెట్టాలనే విషయం ఆలోచిద్దాం” అంది లాస్య.
కొద్దిదూరంలో ఉన్న చెట్టు కిందికెళ్ళి, గడ్డిపరకలు పరిచి వాటిమీద క్యారట్, క్యాబేజీ, అరటిపండు ముక్కలు పెట్టారు. స్నోయీ మెల్లగా ఆ ముక్కల్ని కొరికి తినసాగింది.
స్నేహితురాళ్ళిద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు. వెనకేదో అలికిడైతే ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. యిందాకటి నల్లటి కుక్క.. గుర్రుగా చూస్తూ “భౌ” అని అరిచింది. లాస్య తేరుకుని స్నోయీని ఎత్తుకునే లోపల స్నోయీ భయంతో పరుగందుకుంది. నల్ల కుక్క దాని వెంటపడి తరమసాగింది.
“స్నోయీ ఆగు” అని అరుస్తూ వాటి వెనుక లాస్య, ధాత్రి కూడా పరుగెత్తసాగారు.
అక్కడినుంచి మరో కిలోమీటర్ ముందుకెళ్తే దట్టంగా పెరిగిన చెట్లు, పొదల్తో నిండిన చిన్నపాటి అడవిలాంటి ప్రాంతం ఉంది. చాలా లోపలికెళ్తే అక్కడో చెరువు కూడా ఉంటుంది. దాని చుట్టూ అడుగెత్తున గడ్డి పెరిగి ఉంటుంది.
అందులోకి చిన్నపిల్లలెవ్వరూ వెళ్ళరు. వూళ్లోని పేదోళ్ళు వంట చెరుక్కోసమో, గడ్డి కోసుకుని రావడానికో అందులోకి వెళ్తారు. ఎవరెళ్ళినా చీకటి పడేలోపల తిరిగొచ్చేస్తారు.
స్నోయీ ఆ అడవి వైపుకే వేగంగా పరుగెత్తుతోంది. నల్ల కుక్క వెనుక పరుగెత్తుతోన్న లాస్య, ధాత్రి తాము అడవిలోపలికి వెళ్తేన్న విషయాన్ని కూడా గమనించుకోలేదు.
చిక్కగా అల్లుకున్నట్లు చెట్లు.. గుబురుగా పెరిగిన పొదలు.. స్నోయీ చెట్లవెనుక మాయమై మళ్ళా కన్పిస్తోంది. నల్లకుక్క దాన్ని వదలకుండా వెంటాడుతోంది. చెరువుకట్ట దాటి మరికొంత దూరం పరుగెత్తాక స్నోయీ కన్పించలేదు. నల్లకుక్క కూడా పరుగాపి దానికోసం వెతుకసాగింది. లాస్య, ధాత్రి కుక్క వైపు రాళ్ళు విసరడంతో అది వెనక్కి తిరిగి పారిపోయింది.
స్నేహితురాళ్ళిద్దరూ “స్నోయీ.. స్నోయీ” అని పిలుస్తూ పొదల్లో వెతుకుతూ ముందుకు నడుస్తున్నారు. మెల్లగా చీకట్లు కమ్ముకోసాగాయి. మరో ఫర్లాంగు దూరం నడిచాక అక్కడి పొదలో దాక్కుని ఉన్న స్నోయీ బెదురుతూనే బైటికొచ్చి చిన్నగా శబ్దం చేస్తూ లాస్య కాళ్ళకు అడ్డం పడింది.
స్నోయీ కన్పించగానే లాస్యకు ప్రాణం లేచొచ్చినట్టయింది. దాన్ని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది అప్పటికి చీకటి చిక్కబడసాగింది.
“చీకటి పడిందే. మనం తొందరగా యిక్కడినుంచి బైటపడటం మంచిది. మనం వచ్చిన దారి గుర్తుందా?” అని అడిగింది ధాత్రి.
“ఆ నల్లకుక్క స్నోయీని తినేస్తుందేమోనన్న భయంతో పరుగెత్తడంతో దారి చూసుకోలేదు. నీకు గుర్తుందా?”
“నేనూ అంతేనే. మరిప్పుడేం చేద్దాం?” భయంగా అంది ధాత్రి.
“నడుస్తూ ఉందాం. ఏదో ఒక దారి దొరక్కపోదు” అంది లాస్య.
వాళ్ళ అదృష్టం కొద్దీ ఆకాశంలో చంద్రుడు దారి దీపంలా ప్రకాశించసాగాడు. ఆ వెలుగులో ఇద్ద రూ ముందుకు నడుస్తున్నారు. గంట సేపటినుంచి నడుస్తున్నా యింతక్రితం దాటిన చెరువు జాడ కన్పించలేదు.
“ఈపాటికే మనం చెరువుని దాటాలిగా. ఎంత నడిచినా చెరువు కన్పించదేమిటే” అంది లాస్య.
ధాత్రి కూడా అరగంట నుంచి అదే విషయం ఆలోచిస్తోంది. “మనం దారి తప్పామని అన్పిస్తోంది” అంది భయం భయంగా.
ఆ మాట వినగానే లాస్యకు కూడా భయమేసింది. “మరిప్పుడేం చేద్దాం?” అంది.
“చేసేదేముంది? నడుస్తూ ఉండటమే” అంది నిస్పృహగా ధాత్రి.
***
చీకటిపడినా పిల్లలిద్దరూ యింటికి తిరిగిరాకపోవడంతో ఇరు కుటుంబాలవాళ్ళు ఆందోళన పడసాగారు. వాళ్ళని వెతకడానికి లాస్య వాళ్ళ నాన్న, ధాత్రి వాళ్ళ నాన్నతో పాటు రమేష్ కూడా బయల్దేరాడు. ముగ్గురూ మూడువైపులకెళ్ళి వెతకసాగారు. రాత్రి తొమ్మిది దాటినా పిల్లల జాడ తెలియకపోవడంతో వాళ్ళలో ఆందోళన మరింత పెరిగింది.
ఇద్దరమ్మాయిల్ని వూరి చివరున్న పాడుపడిన యింటి దగ్గర చూసినట్టు ఓ వ్యక్తి లాస్య వాళ్ళ నాన్నకు సమాచారం అందించాడు. స్నోయీతో ఆడుకుంటూ పిల్లలిద్దరూ అటు వైపుకి వెళ్ళి ఉండొచ్చని లాస్య వాళ్ళ నాన్నకు అన్పించింది.
పాడుపడిన యింటి పరిసరాల చుట్టూ టార్చితో వెతికినా పిల్లలు కన్పించకపోవడంతో అతనికెందుకో ఓ అనుమానమొచ్చింది. స్నోయీతో పరుగెత్తే ఆట ఆడుతూ అడివిలోకి వెళ్ళి ఉండొచ్చేమోనని.
వాళ్ళని వెతుక్కుంటూ “లాస్యా.. ధాత్రీ” అని పెద్దగా పిలుస్తూ అడవి లోపల నడవసాగాడు,
నడిచి నడిచి అలసిపోయిన ధాత్రి “యింక నడవలేనే.. నా వల్ల కావడం లేదు” అంటూ ఓ చెట్టు మొదల్లో కూలబడిపోయింది. “నా పరిస్థితీ అలానే ఉందే, కాళ్ళు నొప్పెడుతున్నాయి” అంటూ లాస్య కూడా ఆ అమ్మాయి పక్కన కూచుంది.
“ఇప్పుడేం చేద్దాం?” అని అడిగింది లాస్య.
“రాత్రంతా యిక్కడే గడిపేసి, తెల్లారగానే మళ్ళా బైటికి దారిని వెతుక్కుందాం” అంది ధాత్రి.
“ఈ పాటికి మన కోసం మనింట్లో వాళ్ళు వెతుకుతూ ఉంటారు కదా. వాళ్ళెవరైనా ఇటువైపుకొస్తే బావుంటుంది కదా” ఆశగా అంది లాస్య.
అప్పుడే “లాస్యా.. ధాత్రీ” అంటూ పెద్దగా పిలుస్తోన్న లాస్య వాళ్ళ నాన్న గొంతు విన్పించింది. లాస్య ఒక్కసారిగా సంతోషంతో పొంగిపోతూ లేచి నిలబడి “ఇక్కడున్నాం నాన్నా” అంది.
టార్చి లైట్ వెలుగులో లాస్యని, ధాత్రిని చూడగానే లాస్య నాన్న పిల్లలిద్దర్నీ దగ్గరకు తీసుకుని “ఎందుకిలా చేశారు? ఈ అడవిలాంటి ప్రదేశంలో రాత్రుళ్ళు ఉండటం ఎంత ప్రమాదమో తెలుసా? అదృష్టం కొద్దీ మీకేమీ కాలేదు” అన్నాడు. వెంటనే పిల్లలు క్షేమంగా ఉన్నట్టు ధాత్రి వాళ్ళ నాన్నకి, రమేష్‌కి ఫోన్ చేసి చెప్పాడు.
“మామయ్య కోసం పండగ రోజు స్నోయీని కోసి వండుతారేమోనన్న భయంతో దాన్ని దాచిపెడ్దామని వచ్చాం నాన్నా” అంది లాస్య.
“అలా అని ఎవరన్నారు?” వాళ్ళతో పాటు నడుస్తూ అడిగాడు.
“అమ్మ అంటుంటే నువ్వూ విన్నావుగా. నువ్వు కూడా వద్దనేమీ అన్లేదుగా” అంది లాస్య నిష్ఠూరంగా.
అతను పెద్దగా నవ్వాడు. “అదా నీ భయం? పిచ్చి పిల్ల. నీకు స్నోయీ అంటే ప్రాణమని నాకు తెలుసుగా. నాకు నువ్వంటే ప్రాణమని నీకు తెలుసుగా. అలా జరగనిస్తానని ఎలా అనుకున్నావు? నేనున్నాగా అడ్డుపడటానికి” అన్నాడు.
“హమ్మయ్య. ఐతే నా స్నోయీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదన్నమాట” అంది లాస్య.
“దాని ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. సరేనా” అన్నాడతను.
“థ్యాంక్స్ నాన్నా” సంతోషంగా అంది లాస్య. ఆ అమ్మాయికి కమల్ గుర్తొచ్చి మళ్ళా భయమేసింది.
“నాన్నా.. పండగయ్యే వరకు స్నోయీని నా గదిలోనే పడుకోబెట్టుకుంటాను. అమ్మకు చెప్పి ఒప్పించవా?” అంది లాస్య.
“సరే తల్లీ. నీ ఇష్టం” అన్నాడు ఆమె నాన్న.
లాస్య సంతోషంతో స్నోయీ తలమీద ముద్దు పెట్టుకుంటూ “యింక నీకేమీ భయం లేదు. సరేనా” అంది. ధాత్రి కూడా తన స్నేహితురాలి సంతోషంలో పాలుపంచుకుంది.