[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘మేజిక్ వాటర్’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]టూ, ఇటూ, కాస్త అసహనంగా చూసి “నువ్ చేసింది ఏం బాలేదురా గిరీ. నేను నీతో కష్టాల్లో ఉన్నానని చెప్పాను నిజవే. దానికి నువ్ నాకు ఎంతో ధైర్యం చెప్పావ్. అంతవరకూ సంతోషమే, కానీ బోలెడు డబ్బు అదీ వస్తుందీ, నా అప్పులు అన్నీ తీరిపోతాయనీ, నన్ను మారు మాట్లాడనీయకుండా నీతో పాటు రమ్మంటే, ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు, నీ బుట్టలో పడి ఇలా నీ వెనకాలే ఇక్కడికి వచ్చాను. తీరా ఇక్కడికి వస్తే, పదివేలు కట్టి, ఎవడో చైనా బాబా ఇచ్చే మేజిక్ వాటర్ తాగమంటావా. నేను తాగను గాక తాగను. ఇలాంటివన్నీ ఉత్తదే, బొత్తిగా వాటిలో నాకు నమ్మకం లేదు. అయినా వాడిది మన దేశమూ కాదు, మన భాషా రాదు. అతను మన మొహం చూసి నీరు తాగిస్తే, మనం ధనవంతులం ఎలా అవుతాం చెప్పు! ఈ కాలంలో కూడా నువ్ ఇలాంటివి నమ్ముతున్నావా” అడిగాడు సుబ్బారావ్ ఆశ్చర్యంగా చూస్తూ.
“అలా అనకు, అతను ఎక్కడెక్కడో తిరిగాడట. అతను ఇచ్చిన మేజిక్ వాటర్ తాగిన పరమ దరిద్రులు, ఆ తర్వాత కోట్లకి పడగెత్తారట. అప్పడాలు అమ్ముకునేవాడు అంబాని రేంజ్‌కి ఎదిగాడట. అస్వస్థత నుండీ స్వస్థత, ఆశాంతి నుండి శాంతిని పొందారట. మన లక్కు బావుండి, ఈరోజు మన లక్కవరం వచ్చాడట. ఒక్కటంటే ఒక్కరోజే మన ఊళ్ళో గుడారం వేసుకుని ఉంటాట్ట. కనుక ఈ అవకాశం ఎందుకు వదలాలి, కనుక మనం కూడా ఆ గుడారానికి వెళ్ళి, ఆ మేజిక్ వాటర్‌ని ఓ సారి తాగి చూద్దాం” అన్నాడు గిరి.
“దయచేసి నన్ను బలవంతం చేయకు. అంతగా తప్పదనుకుంటే, నువ్ తాగిరా, నేను వెళతాను” అంటూ అక్కడి నుండి అసహనంగా నడిచి వెళ్ళిపోయాడు సుబ్బారావ్.
గిరి ఓ క్షణం ఆలోచించి, డబ్బు, సంపద తేరగా కలిసి వస్తుందనే వెర్రాశతో, ఓ క్షణం అటూ ఇటూ చూసి, కలుగులోకి దూరే ఎలకలా, చటుక్కున ఆ చైనా బాబా గుడారంలోకి దూరి, అతని చేతుల మీదుగా ఆ మేజిక్ వాటర్ గటగటా తాగేసాడు. తాగినంత సేపు, బోలెడు డబ్బు, బంగారం అతని దగ్గరికి నడిచి వచ్చేస్తున్నట్టు, డబ్బు కట్టలు, గుట్టలుగా ఇంట్లో పేరుకుపోయినట్టు ఊహల్లో తేలిపోయి, ఎవరో కితకితలు పెట్టినట్టు, మెలికలు తిరిగిపోయి మరీ సంబర పడిపోయాడు. తాగిన తర్వాత, దాని ధర పదివేలు ఇచ్చేసి బయటకు వచ్చేసాడు. ఆ సాయంత్రం, అతనికి ఆరోగ్యం ఒక్కసారిగా పాడయిపోయింది. కడుపునొప్పి, వికారం, వాంతులు అయ్యాయి. అంతకు ముందు తిన్న నూనె పకోడీలను తిట్టుకుంటూ ఆసుపత్రికి వెళ్ళాడు. డాక్టర్ పరీక్షలు చేసి, జాయిన్ అవ్వమన్నాడు. ‘చచ్చింది గొర్రె’ అనుకుంటూ ఆ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. మరుసటి రోజు, “ట్రీట్మెంట్ అయిపోయింది, మీరు ఇక వెళ్లిపోవచ్చు” అని డాక్టర్ చెప్పగానే – ‘బతికాన్రా దేవుడా’ అనుకుంటూ, ట్రీట్మెంట్కి అయిన పాతిక వేల బిల్లు చెల్లించి బయటపడ్డాడు.
వెంటనే బైక్ తీసి, ఆ మేజిక్ వాటర్ బాబా గుడారానికి వెళ్ళాడు. అక్కడ గుడారం ఉంది కానీ చైనా బాబా లేడు. వెంటనే ఆ గుడారం పైన ఉన్న ఫోన్ నెంబర్‌కి ఫోన్ చేసాడు.
చైనా బాబా ఎత్తి, ఎత్తగానే, “మీ వాటర్ తాగినా నాకు డబ్బు రాలేదు సరికదా, ఉన్న డబ్బు పోయింది” అన్నాడు బాధగా.
“అలాగా! అయితే మీపై నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువున్నట్టుంది. అందుకే సింగిల్ మేజిక్ వాటర్ డోస్ మీకు సరిపోలేదు. కనుక వెంటనే ఈ నెంబర్‌కి ఆన్‌లైన్‌లో మరో పది వేలూ, మీ అడ్రస్ పంపండి. డబల్ పవర్ గల మేజిక్ వాటర్‌ని కొరియర్‌లో పంపుతాను. అప్పుడు చూడండి మేజిక్. అప్పుడు కూడా సంపద రాకపోతే, ఈ నెంబర్‌కి ఫోన్ చేసి నన్ను చంపుకు తినండి”. చెప్పాడతను నమ్మకంగా.
“మీ మేజిక్ వాటర్ ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుందా” అని తెగ ఉత్సాహపడిపోయి, “సరే” అని వెంటనే ఆన్‌లైన్‌లో డబ్బులు పంపేసి, దారిలో సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు. అతని పక్కన సోఫాలో కూర్చుని ఏదో చెప్పబోయేంతలోనే, సుబ్బారావు అడ్డుపడి, “నిన్న నేను చెబితే విన్నావు కాదు. టివిలో బ్రేకింగ్ న్యూస్ చూడు. ఆ మేజిక్ వాటర్ అంతా బూటకం అట. పైగా అందులో మాదక ద్రవ్యాలు కలపడంతో, కొందరు మళ్ళీ, మళ్ళీ ఆ మేజిక్ వాటర్‌ని ఆర్డర్ చేసుకుని మరీ తాగుతున్నారట. కొందరు నేరుగా వెళ్ళి అతని ఆశ్రమంలో కూడా జాయిన్ అయిపోయారట. అలాంటివి కలిసిన కలుషిత నీరు కావడంతో, అది తాగిన వారు డయేరియా వచ్చి ఆసుపత్రి పాలయ్యారట. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, కొందరు ఇలా జరిగిందేవిటి అని అతనికి ఫోన్ చేస్తే, ఏదో కథ చెప్పి మరో పది వేలు ఇమ్మాన్నాడట. కొందరు వెర్రిమాలోకాలు ఆ డబ్బు కూడా పంపారట ఖర్మ”. అని ఓ క్షణం ఆగి, “అవునూ, కొంపదీసి నీ ఆరోగ్యం ఏం పాడవలేదు కదా” అడిగాడు అనుమానంగా గిరి వంక చూస్తూ.
‘అసలు విషయం చెబితే, వీడు సోషల్ మీడియా సాక్షిగా చెలరేగిపోయి, అందరికీ చేర వేసి నా పరువుని అడ్డంగా, నిలువుగా తీసేస్తాడు’ అని లోలోపల నలిగిపోయి, ముఖం పై కాస్త నవ్వు పులుముకుని, “అసలు విషయం నీకు తెలీదు కదా, నిన్న నువ్ అలా వెళ్ళిపోగానే, నేనూ ఓ క్షణం బాగా ఆలోచించాను. నువ్ చెప్పిందే సబబు అనిపించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ మేజిక్ వాటర్ తాగలేదు” చెప్పాడు, ఏం తెలియనట్టు ఓ వెర్రి నవ్వు నవ్వుతూ.
ఇంతలో దీర్ఘంగా టీవి వంక చూస్తూ ఉండిపోయాడు సుబ్బారావు.
టీవిలో, “అతని మోసం తెలియక, గొర్రెపిల్లల్లా అతని మాదకద్రవ్యాలు కలిగిన, కలుషిత మేజిక్ వాటర్‌ని పది వేలు కట్టి మరీ తాగి అనారోగ్యం కొని తెచ్చుకున్నారు కొందరు అమాయకులు. అలాగే ఆ మ్యాజిక్ వాటర్ కోసం కొందరు ఎగబడ్డంతో, తొక్కిసలాట కూడా జరిగి కొందరు చనిపోయారు” అంటూ, మోసగాడైన చైనా బాబా చేతుల మీదుగా మేజిక్ వాటర్ తాగిన వారి దృశ్యాలను చూపుతున్నారు. ఆ తాగుతున్న వారిలో గిరి కూడా సుబ్బారావుకి కనబడ్డాడు. దాంతో గిరి వంక, కంపుకొట్టే చెత్త కుండీ వంక చూసినంత అసహ్యంగా చూస్తూ, “ఈ కాలంలో కూడా, దొంగ బాబాలనీ, దొంగ పాస్టర్లనీ నమ్మే నీలాంటి వెర్రి గొర్రెలు ఉన్నంత కాలం, అలాంటి వాళ్ళు ఇలానే జనాల ప్రాణాలతో, ఆటలాడుతూనే ఉంటారు” చెప్పాడు.
“ఏంట్రా, ఉన్నట్టుండి మర్యాద మంటగలిపి ఇలా మాట్లాడుతున్నావ్” అంటూ గిరి కూడా టీవి వంక చూసి బిక్కచచ్చిపోయాడు.
ఏం చెప్పాలో తెలియక, వెంటనే పైకి లేచి “వస్తారా చిన్న పనుంది” అని గబ, గబా బయటికి నడిచేసి, ‘అక్కడే ఉంటే, ఆ కోపంలో నన్ను చంపినా చంపేసేవాడేమో, ఇక నుండి అలాంటి దగా గాళ్లని చచ్చినా నమ్మకూడదు’ అనుకున్నాడు మనసులో గట్టిగా.