తాంబూలం పుచ్చుకుందమ సుదతిరో

9
3

[త్వరలో ప్రచురితమవనున్న డా. జి. వి. పూర్ణచందు గారి ‘తాంబూలం’ అనే పుస్తకం గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు శ్రీమతి శీలా సుభద్రాదేవి.]

[dropcap]డా.[/dropcap] జి. వి. పూర్ణచందు గారి ‘తాంబూలం’ పుస్తకం తెరిచేలోపునే ఆంధ్ర కవితాపితామహుడు అల్లసాని పెద్దనగారు ‘కవిత్వం రాయడమంటే మాటలా దానికెంత కావాలి’ అంటూ చెప్పిన పద్యంలో “నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురవిడెం..” అంటూ ఇచ్చిన పట్టిక కూడా ఒకసారి గుర్తు చేసుకోక తప్పదు.

“తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండీ” అంటాడు అగ్నిహోత్రావధాన్లు కన్యాశుల్కంలో. అయితే తాంబూలాల గురించి మాట్లాడటం తాంబూలాలు ఇచ్చేసినంత సులభం కాదని పూర్ణచందు గారి పుస్తకం చదివితే తెలుస్తుంది. ఎందుకంటే అనేకానేక కావ్యాలు ప్రబంధాల దగ్గర నుండి ఆధునిక సాహిత్యం వరకు ఎన్నెన్ని ఉటంకింపులో చదువుతోంటే పూర్ణచందు గారి విషయ సేకరణ జిజ్ఞాసకు ఆశ్చర్యం కలుగుతుంది.

దానశీలత గల రాయన భాస్కరమంత్రి “జలక మాడుటకింట జల సృష్టి సత్రంబు”, ‘తాంబూల సత్రంబు ధన్యులకును..’ అంటూ పూర్ణచందు గారి ఉటంకింపుతో ఒకప్పుడు తాంబూల సత్రాలు వుండేవని తెలుస్తోంది.

మరో విషయం జరుక్ శాస్త్రి పేరడీగా చెప్పిన – వైజాగ్ కారాకిళ్ళీకి – అంతకుముందు పెద్దనగారి పద్యానికి సారూప్యం చెప్పటం కూడా గమనించవచ్చును.

పూర్ణచందు గారి ‘తాంబూలం’ పుస్తకంలో తాంబూలానికీ, కవిత్వానికీ, రసికతకూ గల దగ్గర సంబంధాల్ని అనేకానేక ఉదాహరణలతో వివరించారు.

మంచికంటి రాజారావు రాసిన కారాకిళ్ళీ ఆత్మకథని మచ్చుకు చెప్పారు. చేమకూర కవి వర్ణించిన తాంబూల నగరాన్ని చూపించారు. శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనగారిని ప్రబంధం రాయమని కోరితే కావల్సిన సామాగ్రి ఉంటేనే రాయగలం, కానీ ఎప్పుడంటే అప్పుడెలా రాస్తానని విసుక్కున్నాడంటూనే, నాటి కవులకు కిక్కు యిచ్చేది తాంబూలం అయితే ‘నేటి కవులకు కిక్కు నిచ్చేది మరొకటి’ అంటూ వ్యంగ్యీకరించారు రచయిత.

హిమశైల పుత్రిక పార్వతీదేవి వేసుకున్న తాంబూలపు రసంతో నా కవిత్వాన్ని గుర్రంలా కదను తొక్కించమని కాళిదాసు ప్రార్థించాడట – తాంబూలంతో ఎర్రబడిన దంతాల కెంపుల్నీ వర్ణించిన అన్నమయ్య, శ్యామశాస్త్రి వివరించిన తాంబూల సేవనం, సదాశివ బ్రహ్మేంద్రకవి పూజాస్తుతి శ్లోకంలో కృష్ణుడి తాంబూల రాసలీలను వర్ణించిన తీరునూ తెలియజేసారు తన రచనలో పూర్ణచందు గారు.

  • రుక్మాంగద చరిత్రలోని హితవులు–
  • తమలపాకు చిలకల గురించి ఉత్తరరామాయణంలోని ఉదంతాన్ని–
  • ఏనుగు లక్ష్మణకవి రచనలోని తాంబూలవిశేషాల్ని చాటిన చాటుకవి పద్యాన్నీ–
  • హంస వింశతి కావ్యంలో అయ్యల రాజు నారాయణామత్యుల ఉటంకింపుల్ని–
  • శ్రీనాధుడి చాటువులో కప్పురభోగి వంటకం ప్రసక్తి– క్షేత్రయ్య పదముల్లో దొంతెరవిడెము–
  • క్షేత్రాభిరామంలో కిళ్ళీ నమిలే స్టైలు గురించి–
  • ఆముక్త మాల్యద కావ్యంలో కృష్ణదేవరాయల తాంబూలసేవన వర్ణన–

“పొలుపు దరిగిన నిన్నునభ్యుద్ధరింప
రాజ రాజుల సభ గప్పురంబు తోడ
నందుకున్నాడు తాంబూలమాంధ్రవాణి
శబ్దశాసన కవిలోక చక్రవర్తి”

అని జాషువా మహాకవి నన్నయగారిపై పద్యం చెప్పాడనీ వివరించారు రచయిత.

ఇలా ఇలా ఎన్నెన్నో కావ్యాలూ, ప్రబంధాలలోంచి తాంబూలానికి సంబంధించిన ఉటంకింపుల గూర్చి చెప్పుకోవాలంటే ముందుగా పూర్ణచందు గారి పరిశోధనాత్మక రచనని చదివి అభినందించాల్సిందే.

ఇంతవరకూ తాంబూలప్రసక్తి ఉన్న సాహిత్యం గురించి తెలుసుకున్నాం.

పూర్ణచందు గారు అంతటితో ఆగలేదు. ఆయన ఆయుర్వేద డాక్టరు కదా! ఆ దృష్టి కోణంలో ఎలా రాసారో కూడా తెలుసుకుందాం–

తాంబూలానికి వాడిన తమలపాకులు ప్రపంచ వ్యాప్తంగా 90 రకాలు ఉంటే భారతదేశంలోనే 40 రకాలు పండుతాయట. ఇంక ఆకులలో రకాలూ, వాటి రుచులూ, ఉపయోగాలు సరేసరి.

తాంబూలంలో వాడే సున్నం రకాలు– నత్తగుల్లభస్మం, పగడాలభస్మం, సువర్ణ భస్మం దేనిని ఏ హాదా వారు వాడుతారో తెలిపారు.

20 రకాల బనారసీ పాన్ల గురించి నోరూరేలా చెప్తూ,తాంబూలాలు ఇవ్వటానికి కూడా ప్రోటోకాల్ వుంటుందంటారు పూర్ణచందు గారు.

తాంబూలాన్ని ఏ హోదా కలిగిన వ్యక్తికి ఇస్తున్నారో ఆ స్వీకర్త హోదాని బట్టి ఎన్ని ఆకులు వేయాలి, ఎన్ని వక్కలు వేయాలి అనే నియమాలు ఉన్నాయట చాలా ఆశ్చర్యం కదా!!

దేవాలయం సిబ్బందిలో శుభ్రపరిచేవారికీ, పూజారులకు, మంగళవాద్య కళాకారులకు ఇలా ప్రతి ఒక్కరికీ ఎన్నెన్ని ఆకులు ఉండాలి? ఎన్ని వక్కలు పెట్టాలి అన్నది నిర్దేశిస్తూ శాసనాలు ఉన్నాయని చెప్పారు పూర్ణచందు. అది మరీ ఆశ్చర్యకరం!!!

ఇంతేకాదు వశీకరణకి పనికొచ్చే తాంబూలాల నోములు కూడా తెలియజేసారు.

తాంబూలం నమిలే తీరుని బట్టి ఆ వ్యక్తి గుణగుణాలు తెలుసుకోవచ్చని క్రీడాభిరామంలో ఉందంటారు పూర్ణచందు.

1939 లో మంచికంటి రాజారావు అనే కవి ‘కారాకిళ్ళీ మహోపన్యాసము’ అనే పుస్తకంలో కారాకిళ్ళీ ఆత్మకథని, కారా కిళ్ళీ దండకాన్ని, కారా కిళ్ళీ నవరత్నాల్నీ రాశాడట.

జానపదులు తాంబూలాలపై పొడుపుకథలు కూడా చెప్పారని సోదాహరణంగా చెప్పారు రచయిత.

కాశీయాత్ర చరిత్ర రాసిన ఏనుగుల వీరాస్వామయ్యగారు “మద్రాసు తమలపాకుల కన్నా హైదరాబాద్ ఆకులు రుచికరం” అని రాసారుట. రకరకాల తాంబూలాలతో పాటూ పాన్ స్వీట్ గురించి కూడా చెప్పారు. దాంతో పాటూ 20 రకాల బనారస్ పాన్ స్వీట్ లతో నోరు తీపి చేసారు పూర్ణచందు.

చివరగా అయిదు పేజీలలో పాఠకుల సౌలభ్యం కోసం తాంబూల నిఘంటువు ప్రచురించి ఈ పుస్తకంలో ఉటంకించిన పద్యాలు, శ్లోకాలలో వచ్చిన పదాలకు అర్థాలు తెలియజేయటం ఈ పుస్తకానికి కొసమెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here