[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]
[dropcap]తం[/dropcap]డ్రి, ఇలా కాదని, వియ్యంకుడికి అప్పగిస్తాడు గోపాలరావును. ఆయన అల్లుడిని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి తీసుకొచ్చి దిగవిడుస్తాడు. “గోపాలరావుకు కొంచెం అవమానంగా ఉంది” అంటారు మాలతిగారు ఇక్కడ. ఆ చిన్నవాక్యంలో అతని వ్యక్తిత్వం ఏమిటో తెలిసిపోతుంది మనకు. కాని, అతనికి గట్టిగా పదహారే. కొంత నిస్సహాయత!
“మామగారు తమ పిల్ల జీవితం నాశనం అయిపోయినట్లు మాట్లాడుతూంటే గోపాలరావుకు పౌరుషం, కోపం ముంచుకొచ్చాయి. ‘మేనత్త వల్ల.. తమ అల్లుడు చెడిపోతున్నాడని’ మామగారు ఎత్తిపొడిచినప్పుడు తండ్రి కిక్కురుమనకుండా ఊరుకోవడం – గోపాలరావుకి ఆశ్చర్యం ఆగ్రహం రెండూ కలిగాయి” (పుట 65).
“నా చదువుకూ, మా అత్తయ్యకూ సంబంధం లేదు – అత్తయ్యని ఒక్క మాట అన్నారంటే ఊరుకోను” – (పుట 65) అంటాడు.
ఈ మాటల్లో అతనికి ఆమె పట్ల ఉన్న గౌరవాభిమానాలు తెలుస్తాయి. మామగారు “ఏం చేస్తావ్?” అని రెట్టిస్తారు. ఏం చేయాలో పదహారు నిండని గోపాలరావుకు తెలియడం లేదు!
“నువ్వు చదువుకొని ప్రయోజకుడివి అయ్యాక రాజకీయాల్లోకి దిగు. అయితేకాని, ఇప్పటినుండి స్వతంత్రం అంటూ చీటికీ మాటికీ ప్రదర్శనల్లో పాల్గొనటం మాకు ఇష్టం లేదు” అంటారు మామగారు. ఆయన లాంటి వారికి ‘పర దేశపాలన ‘అంటే చీమ కుట్టినట్లయినా ఉండదు మరి!
బి.హెచ్.యులో చేరతాడు. మదన్ మోహన్ మాలవ్యా గారి బ్రెయిన్ చైల్డ్ ఆ విద్యాలయం. అక్కడ కూడా గోపాలరావు మనస్తత్వాన్ని మాలతిగారు ఇలా వివరిస్తారు:
“రాముడత్తయ్య పెంపకంలో, గాంధీజీ బోధనలతో ప్రభావితమైన గోపాలరావుకి ఇక్కడ ఉన్న హిందూ సంప్రదాయంపట్ల ఆచార వ్యవహారాల పట్ల ‘అంత’ నమ్మకం లేకపోయినా అక్కడి క్రమశిక్షణ, బోధనా విధానమూ చాలా నచ్చాయి.”
అక్కడ నందయ్యను చూసి చాలా సంతోషిస్తాడు. గట్టిగా కావలించుకుంటాడు అతన్ని. మనిషిని కులంతో కాకుండా మనిషిగా గుర్తించగల సంస్కారం అతనికి అబ్బడానికి కారణం రాముడత్తయ్య, వాసుదేవరావు మామయ్యలే. నందయ్య రూమ్‍లో ఒక్కడే ఉన్నాడని తెలిసి “మనిద్దరం కలిసి ఉందాం” అని ప్రతిపాదిస్తాడు. “నందయ్య కళ్ళు దీపాల్లా తళుక్కుమని – మళ్లీ మామూలుగా అయ్యాయి” అంటారిక్కడ మాలతీ చందూర్.
స్వాతంత్య్రోద్యమం చాలావరకు భారతీయులను ఏకం చేసిండొచ్చుగాని, తరతరాలుగా వారి పాతుకుపోయిన ‘కుల వివక్ష’ను దూరం చేయలేకపోయింది! ఒక దళితుడితో రూమ్ షేర్ చేసుకోవడం ఆ కాలంలో గొప్ప సాహసమే! కాని దానిని గొప్ప సాహసంగా, ఏదో తానొక Reformation చేస్తున్నవాడిగా గోపాలం భావించలేదు. అసలు అతనికి ఆ స్పృహే లేదు. Reformation అనేది దాన్ని చేసి ఎదుటివాడిని ఉద్ధరిస్తున్నామన్న consciousness తో చేస్తే, అది సంస్కరణ అనిపించుకోదు. హిపోక్రసీ అనిపించుకుంటుంది. ఆ హిపోక్రసీ అనే అవలక్షణం గోపాలరావులో మచ్చుకైనా లేదు.
నందయ్య “బాగా అలోచించుకొని నాతో ఉండు” అంటాడు. గోపాలరావు సంస్కారం అతనికి బాగా తెలుసు.
“అందరూ నీలాగా ఉంటారనుకోకు.”
ఈ మాటల్లో నందయ్యకు గోపాలరావు పట్ల ఉన్న గౌరవం అభిమానం వ్యక్తం అవుతాయి. అతని కులం వల్ల అతనికి 85 శాతం మెరిట్ వచ్చినా సీటు ఇవ్వరు.
గోపాలరావు అది విని “ఛ-ఛ” అంటాడు. అప్పుడు నందయ్య
“అని ఒకరిద్దరు నీలాంటివాళ్లు అని ప్రయోజనం లేదు. మా కులం పట్ల చాలా మందికి అసహ్యం తప్ప సానుభూతి లేదు” (పుట 69) అంటాడు.
“బాగా చదువుకొని కలెక్టరువైతే నిన్ను నెత్తిన పెట్టుకుంటారు” అంటాడు గోపాలరావు. “లేదా రాజకీయాల్లో.. రేపు స్వతంత్రం వచ్చాక మంత్రి అవుతావేమో? అప్పుడు బ్రహ్మరథం పడతారు”
“నాకు కాదు, నా పదవికి.”
నందయ్య మాటల ద్వారా భవిష్యత్ దర్శనం చేశారు రచయిత్రి అప్పటి పరిస్థితులు ఈనాడు కూడా కొనసాగుతూ ఉండటం గమనార్హం. దళితుల ఓట్ల కోసం మాత్రమే వారిని నెత్తిన పెట్టుకుంటున్నట్లు నటిస్తారు రాజకీయవాదులు. భారత రాజ్యాంగం ప్రసాదించిన కొన్ని వెసులుబాటుల వల్ల వారి పరిస్థితులు బాగుపడినా, దాన్ని జీర్ణించుకోలేని కుసంస్కారులు ఈనాడు ఉన్నారు. వారు ఎంత ఉన్నత పదవులు పొందినా, బయటికి గౌరవిస్తున్నట్లు నటిస్తూ, పరోక్షంగా వారి గురించి హీనంగా మాట్లాడతారు. ఇదంతా సూచనప్రాయంగా నందయ్య మాటల ద్వారా ఆవిష్కరించారు శ్రీమతి మాలతీ చందూర్. కావ్యంలో భావి దర్శనం ఉండడమనేది ఒక గొప్ప గుణం.
తర్వాత నందయ్య ఎలా స్వార్థపరుడుగా మారాడు, తన సోషియల్ స్టేటస్‍ను ఎలా exploit చేసి పైకొచ్చాడనీది వేరే విషయం అది ‘అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్’. దాన్ని తర్వాత expose చేశారు రచయిత్రి. దాన్ని తర్వాత చర్చిద్దాం.
ఈ సందర్భంలో నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనను పంచుకోవాలనిపిస్తూంది.
నేను కూడా ఒక కరడు కట్టిన, సంప్రదాయవాద, శుద్ధ శ్రోత్రియ కుటుంబంలో పుట్టాను. సకలశాస్త్ర పురాణేతిహాసాలను ఔపోశన పట్టిన కుటుంబం మాది. నాకు ఎనిమిదేళ్లకే ఉపనయనం చేశారు. రోజూ సంధ్యావందనమే కాకుండా, ‘అగ్నికార్యము’ ను కూడా రెండు పూటలా చేసుకోనేవాడిని.
మాకు వ్యవసాయం ఉండేది. మా జీతగాండ్లు (పాలేర్లు) అంతా దళితులే. టెంత్ తర్వాత స్కూలు మానిపించి వ్యవసాయం, జ్యోతిష్యం, సంస్కృతంలో శిక్షణ ఇవ్వసాగారు నాకు. మా జీతగాడి పేరు హనుమంతు. కాని అతన్ని ‘తోకోడు’ అని వ్యవహరించేవారు. వాళ్లు ముగ్గురన్నదమ్ములు. మొదటివాటిని ‘పెద్ద తోకోడు’ అనీ, రెండవవాడిని (మధ్యముడిని) ‘నడిపి తోకోడు’ అనీ, చివరివాడిని ‘చిన్న తోకోడు’ అనీ అనేవారు. మా దగ్గర పనిచేసేది ‘నడిపి తోకోడు’. అతడికీ నాకూ ఐదారేళ్లు తేడా. నాకు వ్యవసాయంలో మెలకువలు నేర్పిన గురువు. మంచి స్నేహితుడు.
మా యింటికి మంచి రోజులు చెప్పించుకోవడానికి, ముహూర్తాలు పెట్టించుకోడానికి జనం వచ్చేవారు. వారు తాంబూలంలో పెట్టిన చిల్లర పైసలపై నీళ్లు చల్లి తీసుకునేవారం (నోట్లకు మాత్రం ఇది వర్తించదు! ఎందుకంటే అవి తడవకూడదు). పొలంలోని ఇంజను రూము తాళాలు సాయంత్రం తోకోడు తెచ్చిస్తే, వాటిని డైరెక్ట్ అందుకోకూడదు. క్రింద పెట్టమని, వాటి మీద నీళ్లు పొక్షించి (చల్లి) తీసుకోవాలి. పండగలప్పుడు తోకోడికి భోజనం పెడితే, పశువులశాలలో, ఒక మూల కూర్చొని తినేవాడు. నీళ్ళు తాగడానికి గ్లాసు ఇవ్వము. దోసిలి పడితే పోస్తాము.
మా తోకోనికి చిన్నవయసులోనే పెళ్లయింది. వాడికి ఒక కొడుకు – నెలల పిల్లవాడు. జన్మనక్షత్రాన్ని బట్టి వాడికి సుధాకర్ అని పేరు పెట్టింది నేనే. నిమ్మతోటలో కాయలు దింపుతున్నాం ఒక రోజు. తోకోని భార్య బుడ్డక్క, ఐదునెలల పసికందు సుధాకర్‍ను అక్కడున్న పెద్ద మేడి చెట్టు కొమ్మకు గుడ్డ ఉయ్యాల కట్టి, అందులో పడుకోబెట్టింది. తోటలో దింపిన నిమ్మకాయలను ఆమె వెదురు తట్టల్లో, గుడిసెలోని గోనెపట్టాల మీదికి మోస్తూంది. మేడి చెట్టు వంద మీటర్ల దూరంలో ఉంది.
నేను అటుగా వస్తున్నాను, గుడిసెలోని నిమ్మకాయలు ఎన్ని బస్తాలవ్వచ్చో చూసి. తోకోడు దూరంగా, మిరప తోటకు నీళ్లు పెడుతున్నాడు. ఉయ్యాల్లో పిల్లవాడు నిద్ర లేచి ఏడుస్తున్నాడు. నేను వెళ్లి చూశాను. వాళ్లమ్మకు గాని, నాన్నకు గాని వాడి ఏడుపు వినిపించలేదు. నేను మెల్లగా ఉయ్యాల ఊపాను. వాడు ఏడుపు మానలేదు. ఇంకా ఎక్కువగా ఏడవసాగాడు. ఇలా కాదులే అని నేను ఉయ్యాల ఉంచి తీసి ఎత్తుకున్నాను. టక్కున ఏడుపు ఆవేశాడు. నన్ను చూసి చిరునవ్వులు చిందించాడు పసివెధవ! నాకెందుకో “God Manifests Himself in Children” అన్న టాల్‌స్టాయ్ మహాశయుని మాటలు గుర్తొచ్చాయి. వాటిని ముద్దులాడుతూ, వాళ్లమ్మ దగ్గరకు తీసుకెళుతున్నాను.
ఇంతలో మా నాన్నగారు పొలానికి వచ్చారు. దళితుల పిల్లవాడిని ఎత్తుకోవడమే కాకుండా, ముద్దు చేస్తున్న నన్ను చూశారు. ఆయిన కళ్లు విస్ఫులింగాలు వెదజల్లుతున్నాయి. “వాడిని దించి, ఇంటికి వచ్చేయ్, వెంటనే!” అని కోపంగా ఆదేశించారు. నాకపుడు పదహారు సంవత్సరాలుంటాయేమో.
బిక్కుబిక్కుమంటూ ఇంటికి వెళ్లాను. మా అమ్మ గుమ్మంలోనే ఉంది. “ఎంత అనాచారం చేసినావురా నాయనా?” అని బాధపడింది. నన్ను ఆ బట్టలు తడివేసి, తలస్నానం చేయమంది. స్నానం చేసి పూజగదికి వెళ్లాను. నాన్నగారు ‘రుద్రాభిషేకం’ చేస్తున్నారు. చీకటి పడింది. అభిషేకం అయిన తర్వాత నా దోషపరిహారార్థం ‘పంచగవ్యం’ ఇచ్చి తాగమన్నారు. దానిలో గోమూత్రం, గోమయం కలుపుతారు. దాని రుచి దుర్భరం! కానీ తప్పదు! తాగేశాను.
తర్వాత నన్ను నాలుక చాపమన్నారు నాన్నగారు. దర్భపోచనొకదాన్ని తీసి, దాని కొసను దీపారాధన సెమ్మె లోని జ్యోతిలో వెలిగించి, ఆ మంటను నా నాలుక మీద పెట్టారు. నాలుక చురుక్కున మండింది. చిన్న బొబ్బ ఎక్కింది. అలా దళితుల పిల్లవాడిని ఎత్తుకున్నందుకు నాకు ‘ప్రాయశ్చిత్త కర్మ’ జరిగింది. ఆయనను ఎదిరించే ధైర్యం అప్పుడు నాకు లేదు. కొన్ని రోజులు అన్నం తినలేక పోయాను. కానీ నాకు ‘గిల్టీ’గా అనిపించలేదు. ‘పిల్లవాడు ఏడుస్తున్నాడు ఎత్తుకో’మని నా అంతరాత్మ ప్రబోధించింది. ఎత్తుకోన్నాను. అంతే!
తోకోని కొడుకు సుధాకర్ బాగా చదువుకున్నాడు. ప్రభుత్వం వారి ఫీజు రీ-ఇంబర్స్‌మెంట్ పథకం వల్ల కర్నూలు ‘కట్టమంచి రామలింగారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ’లో చదివి బెంగుళూరుతో ఉద్యోగం చేస్తున్నాడు. నేను ఇప్పటికీ మా ఊరు వెళితే మా తోకోడినీ, బుడ్డక్కను చూసి, వారు పెట్టే మెత్తని జొన్నరొట్టెను, కొరివికారాన్ని తినకుండా రాను.
ఇదంతా ఎందుకు? ఎందుకో గోపాలరావులో నన్ను నేను ఐడెంటిఫై చేసుకోవాలనిపించింది. అలా పాఠకులకు అనిపించేలా చేయడమే గొప్ప రచన లక్షణం. మాలతీ చందూర్ దానిని సాధించారు.
“హరిజన విద్యార్థిని, మాలవ్యా గారు తమ విశ్వవిద్యాలయములో చేర్చుకోడానికి ఒప్పుకున్నా, అక్కడి సంస్కృత పండితులు, లెక్చరర్సూ వల్ల కాదన్నారు. స్టూడెంట్స్‌లో కొందరు, కలిసి భోజనాలు చెయ్యము – అని గొడవ చేశారట.”
“కొండా వారు మాలవ్యా గారితో వాదించి, ఒప్పించారట (భోజనం వసతి, ఈ రెండు విషయాల్లో నందయ్య మిగతావాళ్లతో కాక విడిగా ఉండేటట్లు).
ఇక్కడ మహోపనిషత్తులోని మంత్రం (V1-72) గుర్తొస్తుంది . ఇది సామవేద సాంప్రదాయానికి చెందింది.
శ్లో:
“అయం బంధురయం నేతి
గణనా లఘు చేతసామ్
ఉదారచరితానాం తు
వసుధైవ కుటుంబకం”
ఇదీ శ్లోకం, మొదటి పాదంలో పాఠాంతరంతో, హితోపదేశంలో కూడా ఉంది.
శ్లో:
“అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్
ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకమ్”
– హితోపదేశం (1.3.71)
తాత్పర్యం: ఇతడు తనవాడు, అతడు కాదు, ఇతడు సొంతం అతడు పరాయి అని సంకుచిత మనస్కులే ఆలోచిస్తారు. కాని ఉదారచరితులకు అంటే విశాల దృక్పథం కలవారికి, ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబమే!’
ఈ విస్తృత భావాన్నే, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణ రెడ్డిగారు ‘విశ్వంభర’లో చక్కని కవితగా మలిచారు.
“ఆకసము బీజ ప్రదాతగ/అవనియే ఒక ఆది మాతగ/కానగల్గిన మానవునకు జ/గజ్జనాళి ఒకే కుటుంబము
నింగి లోపల లేవు ఎల్లలు/నీరథిని కనరావు ఎల్లలు/ఎందుకీ ధరణీ తలమ్మున/ఇరుకు వాడలు! ఇనుపగోడలు?”
నాకెందుకో ఈ సందర్భంలో మాలవ్యా గారికంటె కొండా వెంకటప్పయ్య గారే గొప్పవారనిపిస్తుంది. ఎందుకంటే నందయ్యలోని ప్రతిభను మొదటినించి గుర్తించి ప్రోత్సహిస్తున్నవాడాయన. మాలవ్యగారు అంగీకరించినట్లే కనబడినా, భోజనం, వసతి, నందయ్యకు విడిగా ఏర్పాటు చేసారు. ఉదార చరితులకు ప్రపంచమంతా ఒకటే కుటుంబమే. వారికి తన, పర అనేభావం ఉండదు.
కాని ఆరునెలల తర్వాత నందయ్యను మిగతా విద్యార్థులు తమలో కలుపుకున్నారంటారు రచయిత్రి. ‘బెటర్ లీట్ దేన్ నెవర్’ అన్నట్లుగా, ఆలస్యంగానైనా వారు మేలుకున్నారు. అది మంచిదే.
తర్వాత భగత్ సింగ్ కుట్ర కేసు గురించి ప్రస్తావిస్తారు రచయిత్రి. “ఆయన కేంద్ర శాసనసభలోకి పట్టపగలే బాంబు విసరడం కొందరు సాహస చర్యగా భావిస్తే, కొందరు ఇది సరైన పద్ధతి కాదని వాదిస్తూ ఉండేవారు” (పుట 71).
లాలాలజపతి రాయ్‌ని పోలీసులు ఛాతీ మీద కొట్టడంచేత, ఆయన పక్కటెముకలు విరిగి, చాలా రోజులు నరకయాతన పడి మరణించారు. దీనికి కారకుడైన సార్జంట్ శాండర్స్‌ని భగత్ సింగ్ హత్య చెయ్యడం చాలా మందికి నచ్చింది. భగత్ సింగ్‌ని మహావీరునిగా పరిగణించి రహస్యంగా అతని ఫోటోను పెట్టెల్లో దాచుకునేవారు” (పుట 71).
త్రిపాఠీ అనే కుర్రవాడు “ఆ సాండర్సును చంపినట్లు తెల్లవాళ్లందరినీ నరికి పారెయ్యాలి” అంటాడు.
అప్పుడు గోపాలరావు అంటాడు –
“ఇక్కడ వాళ్లని చంపేస్తే బ్రిటన్ నుంచి మళ్లీ పంపుతారు. తలలు నరికినందువల్ల మనకు స్వతంత్రం
రాదు” (పుట 71).
“మరి నీకు మల్లే కూర్చుని కబుర్లు చెబితే వస్తుందా?” అంటాడు వెక్కిరింపుగా త్రిపాఠీ.
ఈ సంభాషణ ద్వారా, మాలతీ చందూర్, స్వాతంత్య్ర సంగ్రామంలో, అతివాదులకూ మితవాదులకూ గల వైరుధ్యాన్ని చూపించారు. సామాన్య ప్రజలలో, ముఖ్యంగా విద్యార్థుల్లో ఇరుపక్షాల అభిమానులూ ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.
జీతేంద్రనాథ్ దాస్, రాజకీయ ఖైదీలను మామూలు నేరస్థులతో కలిపి చూడడం న్యాయం కాదని, జైలు శిక్షాస్మృతిలో కొన్ని మార్పులు తేవాలని నిరాహారదీక్ష ప్రారంభించాడు. 63 రోజుల దీక్ష తర్వాత ఆయన ప్రాణాలు వదిలాడు. కలకత్తాలో ఆయన అంత్యక్రియలకు దాదాపు ఆరులక్షల మంది ప్రజలు హజరైనారు, అత్యంత క్రమశిక్షణతో! తాను వెళ్లలేకపోయినందుకు గోపాలరావు బాధపడ్డాడు.
త్రిపాఠీ, నందయ్య లాంటివారు అతివాదుల అభిమానులు. గోపాలరావు గాంధీజీ బోధనల వల్ల ప్రభావితుడైనవాడు. హింసను అంగీకరించడు. భగత్ సింగ్, జీతేంద్రనాథ్ దాస్, ఇరువురి లక్ష్యం ఒక్కటే. కాని దారులు వేరు.
దీనినే తన ‘గాంధియన్ థాట్’లో మహత్ముడు ‘Means and Ends’ అన్న అధ్యాయంలో వివరంగా చర్చించారు. ఆయన ఉద్దేశంలో విత్తుకు, చెట్టుకు ఉన్న సంబంధమే Means (విధానాలు) కు, లక్ష్యాలు (ends) కు ఉంది. ఆయన ఇలా అన్నారు. “It is means, rather than ends, that provide the standard of morality – నైతికతా ప్రమాణాలను సమకూర్చేవి విధానాలే గాని లక్ష్యాలు కావు.”
“హింస, అహింస అనేవి స్వాతంత్య్రం సాధించడం అనే లక్ష్యాన్నిసాధించడానికి వేర్వేరు విధానాలని నేను నమ్మను’ అన్నాడు మహాత్ముడు. అవి నైతికంగా, నాణ్యతలోగాని, సారం (essence) లోగాని పూర్తిగా పరస్పర భిన్నమైనవి. విధానాలను మనం ముందు గానే ఊహించవచ్చు కాని లక్ష్యాలను కాదు. దీనినీ ‘ఆసియా మానిటర్’లో విశ్లేషిస్తూ ప్రముఖ జర్నలిస్టు, సామాజిక విశ్లేషకుడు రామ్‌కృష్ణ సిన్హా, ఇలా అన్నారు.
“Means can be controlled, managed and guaranteed but ends are not – మన విధానాలను మనం నియంత్రించుకోగలం, నిర్వహించుకోగలం, భరోసా ఇవ్వగలం. కాని లక్ష్యాలను కాదు” (Asia Monitor, Ramkrishna Sinha, October, 2020).
‘శాంతి’ అనే లక్ష్యం అత్యంత గొప్పది, అభిలషణీయమైనది దాన్ని సాధించాలంటే భావావేశాలు అనే ఆయుధాలను విసర్జించాలి. అవే కోపం, పగ, ద్వేషం, స్వార్థం అనే దుర్గుణాలు. వాటిని తొలగిస్తే మన మనస్సు క్షాళితం అవుతుంది. సంతోషం, సంక్షేమం, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయి. ‘శాంతి’, ‘అహింస’ అనేవి మన దైనందిన ఆలోచనల్లో, చర్యల్లో ప్రతిఫలిస్తే తప్ప, వాటిని మనం శక్తివంతమైన విధానాలుగా మల్చుకోలేం. ఒక రకంగా అవి విధానాలే గాని, లక్ష్యాలు కాదు.” – దలైలామా.
పైన చెప్పిన భావాన్నంతా దలైలామా రెండు పదాల్లో చూపారు. అవి ‘emotional disarmament’. భావావేశ నిరాయుధీకరణ! సరిగ్గా దీనినే మహాత్ముడు నిర్దేశించారు.
ఈ సిద్ధాంత చర్చలను శ్రీమతి మాలతీ చందూర్ నవలలో అసలు తీసుకురారు. పాత్రల ద్వారా, వాటి సంభాషణల ద్వారా, సంఘటనల ద్వారా అవన్నీ పాఠకులకు స్ఫురింపచేస్తారామె. Means అన్న పదం నిత్య బహువచనం. దానికి ఏకవచనరూపం ఉండదు. కాని end, ends అని లక్ష్యానికి రెండు వచనాలు ఉన్నాయి.
త్రిపాఠీ, గోపాలరావులు రెండు రకాల విధానాలకూ ప్రతినిధులు. అట్లాగే భగత్ సింగ్, జితేంద్రనాథ్ కూడా. మొదటి వారు ఉద్యమం లోని క్షేత్రస్థాయివారు. రెండవవారు ఉద్యమాన్ని నడిపించే నాయకులు.
మాలతమ్మకు ‘మీన్స్ అండ్ ఎండ్స్’ గురించి, గాంధీగారి మార్గం గురించి పూర్తి అవగాహన ఉంది. పాఠకులకు విసుగు వచ్చేలా, నవలలో, వాటిని గురించి ఆమె సుదీర్ఘంగా చెప్పుకుంటూ వెళ్లరు. ఆమె ఏ విషయంలో నైనా Judgmental గా తనను తాను ఆవిష్కరించుకోదు. అంతా ‘కథ’లోనే ఉంటుంది. పైన చెప్పినవన్నీ విశ్లేషించాల్సింది మాలాంటి విమర్శకులే తప్ప, అది రచయితల పని కాదు. విమర్శ ఎవరయినా చేయవచ్చు. ‘వి – మర్శ’ అంటే విశేషంగా ఆలోచించడం. ‘మర్శ’ అనే సంసృత ధాతువుకు మథించడం, లోతుగా పరిశీలించడం అని అర్థం. ఇంత విమర్శకు ప్రాతిపదిక ఐన ఇతివృత్తాన్ని, పాత్రలను, వాటి చిత్రణను, వాటి దృక్పథాల్లోన్ని వైరుధ్యాన్ని ‘సృష్టించడం’ ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే మాలతమ్మను ‘creative genius’ అని అనవచ్చు.
(సశేషం)