స్వార్థ రహిత ప్రేమ

0
3

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘స్వార్థ రహిత ప్రేమ’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]స[/dropcap]ర్వులను రక్షించేవాడు భగవంతుడే. అటువంటి ప్రేమమయుడైన భగవంతుడుని నిరంతరం అచంచలమైన విశ్వాసంతో, పవిత్రమైన మనస్సుతో ప్రేమిస్తూ, ఆరాధిస్తూపోతే, ఆ ప్రేమే మనల్ని రక్షిస్తుంది.

ఈ అంశాన్నే భగవంతుడు భగవద్గీతలో ఒక చక్కని శ్లోకం ద్వారా అద్భుతంగా చెప్పాడు. ఎవరైతే నన్నే నిశ్చలంగా, నిస్వార్ధంగా, పవిత్రమైన మనస్సుతో ప్రేమిస్తారో అట్టివారే నాకు అత్యంత ఆప్తులు, అట్టివారిని సర్వాకాల సర్వావస్థలయందు వారి వెన్నంటి వుండి కాపాడుతానని పరమాత్మ మానవాళికి గీత ద్వారా వాగ్దానం చేశాడు.

అటువంటి నిస్వార్థ ప్రేమ తత్వాన్ని మనస్సులో వుంచుకొని ఈ సకల చరాచర సృష్టిలో వుండే జీవులు అంతర్గతంగా వుండే ప్రేమ తత్వం ఒక్కటే అన్న సంగతి గుర్తుంచుకొని అందరినీ సమానంగా నిస్వార్ధంగా ప్రేమించడమే మన కర్తవ్యం అని అందరం గుర్తెరగాలి.

ప్రేమ ద్వారా సాధించలేనిది ఏమీ లేదు. అసూయ, డాంబికం, క్రోధం వంటి దుర్గుణాలన్నింటికీ ప్రేమ ఒక్కటే సమాధానం. అమృతం కంటే ప్రేమ మిక్కిలి మధురమైనది. మరణావస్థలో వున్నవారిని కుడా ప్రేమ బ్రతికిస్తుంది. దైవాన్నే తమ ప్రేమ ద్వారా సాధించుకున్న మహనీయులెందరో మనకు చరిత్రలో కనిపిస్తారు.

“ప్రేమ నా స్వరూపం, నా స్వభావం. ప్రేమే నేను. నేనే ప్రేమ” అన్నారు భగవాన్ సత్యసాయి. “నా జీవితమే నా సందేశం. ప్రేమే నా సందేశం, నీకు ప్రేమ లేకపోవడం చేతనే, నీకు స్వార్థం కలుగడం చేతనే ఇన్ని విధాల బంధాలతో జగత్తులో చిక్కుపడి ఉన్నావు. త్యాగము, ప్రేమ, ధర్మము నీలో కలిగినపుడు దివ్యమైన మానవునిగా రూపొందుతావు” అంటూ ఏ రూపమైనా, ఏ నామమైనా అనేకత్వం లోని ఏకత్వాన్ని ప్రబోధించేవారు.

ఈ సృష్టిలో పలు రకాల ప్రేమలు వున్నాయి. తల్లిదండ్రుల, అక్క చెళ్ళెళ్ళ, సోదరుల, భార్యాభర్తల, పెంపుడు జంతువుల ప్రేమ నిజమైన ప్రేమ కాదు, ఎందుకంటే ఈ ప్రేమలో స్వార్థం ఉంది. అయితే ఆత్మ తత్త్వంతో తనను తాను ప్రేమించుకునే ప్రేమ, ఎట్టి కోరికలు లేక సదా భగవంతుని పాదాల యందు ఆశ్రయ రహితుడై నిలిపే ప్రేమయే నిజమైన ప్రేమ. అందులో స్వార్ధం లవలేశమైన వుండరాదు. అప్పుడే భగవంతుని అనుప లభ్యమైన కరుణా కటాక్షాలు మనకు లభ్యమౌతాయి.

మానవుడు సహజంగా ఆత్మ స్వరూపుడు. అయితే మకరందం కోసం వాలిన తుమ్మెద ఆ పువ్వులో బంధించబడి ప్రాణాలు కోల్పోయినట్లు మానవుడు కూడా కోరికల చట్రంలో బంధింపబడి తన జీవితాన్ని అశాంతిమయం చేసుకుంటున్నాడు. అతనికి ఈ జగత్తు అంతా దుఖమయంగా అనిపిస్తోంది. మనల్ని మనం మరిచిపోయి, దేహ భ్రాంతి బ్రతకడం వలనే ఈ కష్ట నష్టాలకు, దుఖానికి, అశాంతికి, అలజడులకు లోనవుతున్నాం. నిస్వార్థమైన ప్రేమతో భగవంతుడిని ఆశ్రయిస్తే అప్పుడు మన నిజమైన తత్వం మనకు ఎరుకకు వచ్చి అప్పుడు మనల్ని దట్టంగా ఆవరించుకున్న అజ్ఞానం నుండి విడివడతాం. అప్పుడే అంతా బ్రహ్మానందమే, శాశ్వతానందం మిగులుతుంది. ప్రేమ అంతర్వాహినిగా లేకున్న అది సత్యమూ కాదు ధర్మమూ కాదు, శాంతమూ కాదు. అహింసా కాదు.

ప్రేమ మన ఆలోచనలో, సంకల్పంలో ప్రవేశిస్తే అది సత్యంగా మారుతుంది. సత్యమే దైవం కాబట్టి నిస్వార్ధమైన ప్రేమ తత్వంతో ఏ పని చేసినా అది భగవత్ సంబంధిత కార్యంగా మారుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here