[హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనే కోరికతో నగరంలో ప్రయాణించి పి. జ్యోతి గారు అందిస్తున్న ఫీచర్ ‘ఆదాబ్ హైదరాబాద్’.]
మక్బరా మహా లకా బీబీ, మౌలాలి
[dropcap]భా[/dropcap]రతదేశంలో మొదటి గజల్ కవయిత్రి మన హైదరాబాదీ అన్నది చాలా మందికి తెలియదు. మహా లకా బాయి చందా (1767-1824) ఈ నగరానికి చేసిన సేవలు, గడించిన కీర్తి అజరామరం. మౌలాలీ ప్రాంతంలో ఆమె సమాధి చూస్తే ఆమెకు ఈ నగరంలో అప్పట్లో ఎంత గౌరవం ఉండేదో అర్థం అవుతుంది. ఈ సమాధిని ఆమె ముందు తన తల్లి కోసం కట్టించింది. అయితే ఆమె మరణించిన తరువాత ఆమె కోరిక మేరా ఆమెనూ అదే చోట ఖననం చేయడం జరిగింది. అలా ఇది తల్లి కూతుర్ల సమాధి. తల్లి కూతుర్లకు ఒకే చోట సమాధి నిర్మించినది మన దేశంలోనే ఇదొక్కటే కావచ్చు. అలాగే మరో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, జన్మతః హిందూ అయిన మహా లకా, తల్లి జీవించినన్ని రోజులూ హిందువుగానే జీవించింది. మహా లకా తండ్రి ముస్లిం. ఆమె ఇస్లాంనే ఆచరించేది. అందుకని ఈ సమాధిలో రెండు మతాల వాస్తు శైలి కనిపిస్తుంది. రాజస్థానీ అయిన తల్లి కోసం అక్కడి వాస్తు శైలితో ఈ సమాధిని నిర్మించింది మహా లకా. అందుకని ఇది ఉత్తర దక్షిణ శైలిల కలయికలో నిర్మించిన అరుదైన కట్టడం కూడా. ఇది మౌలాలీ కొండ క్రింద ఉందని తెలుసుకుని వెతుక్కుంటూ వెళ్లాను నేను. ఆశ్చర్యంగా చిన్న చిన్న వీధుల గుండా నేను లోపలికి వెళ్ళే దాకా అక్కడ అంత చక్కటి, విశాలమైన కట్టడం ఉందని ఊహించలేదు. ఎవరికీ దీని గురించి తెలియకపోవడంతో అక్కడ సందర్శకులు ఎవరూ లేరు. కాని ప్రభుత్వం దీన్ని జాగత్తగా కాపాడుతుంది. ఆ సమాధి సౌందర్యం చూసిన తరువాత మనమెంత గుడ్డివాళ్ళంగా జీవిస్తున్నాం కదా అనిపించింది. రాజస్థానీ, దక్కనీ సాంప్రదాయ నమూనాలతో మన హైదరాబాదులో ఇంత సుందరమైన కట్టడం ఉందని తెలిసిన వారు కేవలం పదుల సంఖ్యలో ఉన్నారని తెలిస్తే అవమానంగా అనిపించదూ..
ఈ సమాధి ఓ మామూలు స్త్రీది కాదు. విద్య కోసం సాహిత్యం కోసం, కళల కోసం తనకున్నదంతా దానం చేసిన గొప్ప సంస్కర్త మహా లకా బాయి చందా. ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే ఉస్మానియా యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, నాంపల్లి ప్రభుత్వ కాలేజీ స్థలాలన్నిటిని విద్యార్థుల కోసం ముఖ్యంగా మహిళల విద్య కోసం ఆమె దానం చేసినవే. కొన్ని వేల మంది ఆ స్థలంపై తిరుగాడి, అక్కడే ఉండి విద్యనభ్యసించినా, ఆ స్థలలన్నీ దానంగా ఇచ్చిన స్త్రీ గురించి తెలిసిన వారు బహు కొద్దిమందే. నిజాం పాలనలో ఓ స్త్రీ ఇన్ని రంగాలలో ఇంతగా పేరు ప్రఖ్యాతులు సాధించినదని చాలా మందికి తెలియదు. సాధారణంగా ఒకటి లేదా రెండు కళలలో ప్రావీణ్యం సాంపాదించడమే గొప్ప. కాని మహ లకా ఓ గొప్ప కవయిత్రి, గాయని, నాట్యగత్తె, యుద్దనైపుణ్యం తెలిసిన ధీరురాలు. మగ వేషంలో స్వయంగా యుద్దంగా పాల్గొన్న సాహసోపేతమైన స్త్రీ. కులం రీత్యా తవాయిఫ్ అంటే రాజ వేశ్య.
ఈ సమాధిని నిర్మీంచిన శైలి మాత్రం అత్యద్బుతం. ఉత్తర దక్షిణ సంప్రదాయాల మేళవింపుతో మన దక్షిణ భారతదేశంలో నిర్మించబడిన కట్టడం అది. దీన్ని మహ లకా చందా స్వయంగా దగ్గర ఉండి కట్టించింది. తల్లి రాజస్థాన్ ప్రాంతానికి చెందిన స్త్రీ అవడం వలన తల్లి కోసం నిర్మిస్తున్న ఈ సమాధి ప్రత్యేకంగా రాజస్థానీ శైలిలో ఉండేలా జాగ్రత్తపడింది ఆమె. అందుకే జైపూర్ పాలెస్‌లను పోలి ఉన్న గోపుర నిర్మాణం ఈ సమాధి గోడల పైన కనిపిస్తుంది. మనకు. ఇది దక్షిణ భారత దేశంలో మరో చోట ఎక్కడా లేదు.
మంచి గజల్ గాయని, కవయిత్రి కూడా అయిన మహ లకా బాయి చందా అక్కడే చుట్టూరా ఓ భవనం కట్టి ముషాయిరాలు నిర్వహించేది. అప్పట్లో ముషాయిరాలలో స్త్రీలు ఎవరూ ఉండేవారు కాదు. కాని మన దేశంలోనే ముషాయిరాలలో పాల్గొన్న మొదటి స్త్రీగా ఆమె నిజాం పరిపాలనలో పేరు తెచ్చుకుంది. సిరాజ్ ఔరంగాబాదీ అనే గొప్ప కవి కవితల ప్రేరణతో ఆమె తానూ కవిత్వం రాయడం మొదలెట్టింది. ఈ సమాధి చూట్టూ ఆమె సమయంలోనే ఓ కారవా సరాయి కూడా ఉండేది. అంటే యాత్రికులు విశ్రమించే స్థలం. అందుకే ఇప్పటికీ ఆ రోజులకు గుర్తుగా ఆమె తవ్వించిన రెండు బావులు ఈ సమాధి స్థలంలో కనిపిస్తాయి. ఇన్ని దశాబ్దాల తరువాత కూడా అవి వాడుక స్థితిలోనే ఉండడం విశేషం.
ఈ కట్టడాలకు సరిగ్గా మధ్యలో ఉన్నది సమాధి స్థలం. అందులో పక్క పక్కన తల్లి కూతురుల సమాధులు ఉంటాయి. నాలుగు వైపుల నుండి బైటి కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి. చూట్టు నీరు పారడానికి నీటి కోసం నిర్మించిన కాలువలు ఉన్నాయి. ఇప్పటికీ సమాధి చుట్టు ఉన్న ఆ కాలువల వ్యవస్థ స్పష్టంగా మనకు పద్మాకారంలో కనిపిస్తుంది. ఇది ముగల్ వాస్తు శైలి. సమాధి లోపలనుంఛి చూస్తే ఇస్లామిక్ వాస్తు కళ కనిపిస్తుంది. అంటే బైట హిందూ పద్ధతిలోనూ లోపల ఇస్లామిక్ పద్ధతిలోనూ కలిసి ఉన్న అపురూపమైన కట్టడం ఇది. మహ లకా బాయి చందా ఇస్లాం మతాన్ని ఆచరించేది. ఆమె తల్లి మాత్రం హిందూ మతస్తురాలిగా అదీ రాజస్థానీ యువతిగానే జీవించింది. అందుకని తల్లి గుర్తుగా హిందూ భవన నిర్మాణ శైలితో చుట్టు సమాధి ఉంటూ లోన ఇస్లాం సాంప్రదాయాన్ని జోడించిన పైకప్పు కనిపిస్తుంది. అక్కడే ఆమె ఎన్నో ముషాయిరాలు బ్రతికి ఉన్నప్పుడు నిర్వహించేది అంటే ఆ స్థలంతో ఆమెకు ఓ మానసిక అనుబంధం ఉండి ఉండాలి. అందుకే అక్కడే తల్లిని ఖననం చేసి తాను ఆమె పక్కనే చేరింది. తవాయిఫ్‌గా బ్రతికినా గొప్పవారి ప్రేమను ఆదరణను పొందినా, ఆమె ఒక రకంగా ఒంటరిగానే జీవించింది.
సమాధి బైట గోడల పైన కళాకృతులు స్పష్టంగా ఉండి ఆకట్టుకుంటాయి. సమాధి చుట్టూ నాలుగు పక్కల ఉన్న కట్టడాలలో ఒకటి ముఖ ద్వారం. దీని పైన మరో అంతస్తు ఉంది. ఇక్కడ యాత్రికులు నివసించడానికి ఆ రోజుల్లో వెసులుబాటు ఉండేది. మరో పక్క భవనంలో చిత్రకళా శిల్పాలు ఉండేవన్న గుర్తులు ఉన్నాయి. అక్కడే ఓ శిలాశాసనం మహ లకా బాయి చందా మౌలాలీలో కట్టించిన కట్టడం గురించి సమాచారంతో నేటికీ నిలిచే ఉంది. సమాధి వెనుక ఓ మసీదు ఉంది. ఇప్పటికీ అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇక నాలుగు పక్కాలా అందమైన చెట్లు సొగసు ఈ రోజుకీ మనసు దోచుకుంటుంది. ఇక అప్పట్లో చుట్టు పారుతున్న నీటితో ఈ భవనం ఎంత అందంగా ఉండేదో ఊహించుకోవచ్చు.
మహ లకా బాయి అసలు పేరు చందా బీబీ. ఈమె ఔరంగాబాద్‌లో జన్మించింది. రాజ్ కున్వర్ అనే రాజ్‌పుతానా స్త్రీ, మొగల్ సామ్రాట్టు మొహమ్మద్ షా దగ్గర సైన్యంలో పనిచేసే బహదుర్ ఖాన్ ఆమె తండ్రి. ఈమె పిన తల్లి మెహతాబ్ మాకు పిల్లలు లేకపోతే ఈమెను పెంచుకుంది. కాని సమాధిలో ఉన్నది మహ లకా కన్న తల్లి. నవాబ్ రుకుండ్ దౌలా దక్కన్ నిజాం వద్ద ప్రధాన మంత్రి. మెహతాబ్ బీ ఈయన దగ్గర తవాయిప్‌గా ఉండేది. ఈయన చందా బీబీ పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పధ్నాలుగేళ్ళకల్లా ఆమెకు గుర్రపు స్వారీ, శస్త్ర విద్య నేర్పించాడు. ఆ రోజుల్లో ఈమెకు పోటీగా బాణాలు సంధించేవారెవ్వరూ పురుషులలోనూ లేరట. పద్నాలుగేళ్ల వయసులోనే ఆమె ఇంట్లో ఓ సొంత గ్రంథాలయం ఉండేటంతగా ఆమె పుస్తకాలు చదివింది. అరేబియన్ గుర్రాల నుంచి యుద్ధ కళల దాకా ఆమెకున్న అవగాహనకు నవాబులు సైతం ఆశ్చర్యపోయేవారట. పైగా ఈమె రాజకీయ విషయాలలో కూడా ప్రధానమంత్రులకు సలహా ఇచ్చే స్థితికి ఎదిగింది. ఆమె బయటకు వెళుతుంటే ఆమెతో 500 సైనికుల దళం తోడుండేదట. ఇంత గౌరవాన్ని ఈ దక్కన్ భూమి మీద పొందిన మొదటి మహిళ మహ లకా బీబీ.
రెండవ నిజాంతో మూడు యుద్ధాలలో పాల్గొన్న ఏకైక స్త్రీ ఈమె. రెండవ నిజాం మీర్ నిజాం అలీ ఖాన్ ఈమెకు మహ లకా బాయి అన్న బిరుదుని ఇచ్చి గౌరవించాడు. ఉర్దూలో దీని అర్థం చంద్రుని దృశ్యం అని. ఈమె చేసిన సేవకు ఇప్పుడు హైదర్‌గుడా, చందానగర్, సయ్యద్‌పల్లి, అడిక్మెట్ అని మనం పిలుచుకునే ప్రాంతాలను జాగీర్లుగా ఆమెకు నిజాం ఇచ్చాడు. మహ లకా యుద్ధవిద్యలతో పాటు అరబ్బీ, ఉర్దూ, భోజ్‌పూరి భాషల్లో సిద్ధహస్తురాలు. మంచి కవయిత్రి, గాయని, నృత్య కళాకారిణి కూడా. ఈమె ప్రదర్శించిన దక్కనీ కథక్ ఇప్పుడు కనుమరుగయపోయిన నృత్య కళ. స్త్రీలకి విద్య అంటే ఏంటో తెలియని రోజుల్లో ఈమె సాధించిన విజయాలకి ఇప్పుడు తలచుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఆ రోజుల్లో స్వంత గజల్ పుస్తకాన్ని వెలువరించిన మొదటి స్త్రీ ఈమె. ఈమె రాసిన 39 గజళ్ళను ‘గుల్జార్ – ఎ- మెహలఖా’ పేరుతో ఈమె మరణం తరువాత పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
ఈమె వివాహం చేసుకోలేదు కాని రాంభారావ్ అనే మరాఠా సైన్యాధికారిని ప్రేమించింది అంటారు. బ్రిటీష్ అధికారి కాప్టెన్ సర్ జాన్ మాల్కొల్మ్ ఈమె స్నేహితుడు. తన సొంత దస్తూరితో రాసి సంతకం చేసిన ‘దివాన్ ఎ చందా’ అనే 125 గజల్సు సంకలనాన్ని అతనికి ఆమె బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడది బ్రిటిష్ మ్యూజియంలో భద్రంగా ఉంది. ఆమె చందా అనే కలం పేరుతో రచనలు చేసేది. చివరగా ఈమె నిజాం ప్రధాన మంత్రి దగ్గర తవాయిప్‌గా ఉండిపోయింది అంటారు. వేశ్యా వృత్తిలో ఉంటూ కూడా నిజాం హయాంలో ఆమె సాధించిన విజయాలు, దక్కన్ ప్రాంతానికి ఆమె చేసిన సేవ మరపురానివి. రెండవ నిజాం, మూడవ నిజాంల రాజ్యసభలో ఆ రోజుల్లో సాహితీపరంగానూ రాజకీయంగానూ గౌరవాన్ని పొందిన ఉన్న ఏకైక స్త్రీ మహ్ లకా బీబీ.
నల్గొండ జిల్లాకు చెందిన విశ్రాంత చరిత్రోపన్యాసకులు శాసన పరిశోధకులు దామరాజు సూర్యకుమార్ గారు పరిష్కరించిన శాసన సారం వాక్యాల వారీగా, ఆంగ్ల అర్థం తోను..
1.ధాతనామసవబచ్చరకాతీ ్
2.క శు1..నామసా 1226సాలు
3.సు…రాచకూమ
4.రుబాయికీతి ్ చంద్దా
5.బీబీ వురఫుమాలకబా
6.యి మోవులాలి[మీద]
7.కట్టించిన[..చతా.
~
The inscription states that Chhanda Bībī, known as Rubāi Kīrthi,alias Mahalakābāi constructed a platform on ‘MOVULĀLI’ on Monday, the 18th October1816A.D.
~
1226 ఫాసలి సంవత్సరం. ఇది ముస్లిం కాలెండర్. ఇంగ్లీషు కాలెండర్ కి 590 సంవత్సరాలు కలుపుకోవాలి అంటే 1886 AD అవుతుంది.
కళల కోసం, సాహిత్యం కోసం ఆమె ఎంతో ఖర్చు పెట్టేది. మహ లకా ఆ రోజుల్లోనే ఒక గ్రంధాలయం స్థాపించి ఎన్నో గ్రంథాలను, రాతప్రతులను జాగ్రత్త చేసింది. కవిత్వంతో పాటు ఇతర కళాత్మక వస్తువుల్ని, శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన వాటిని సంగ్రహించి అందరికి అందుబాటులోకి తెచ్చింది. ఒక నృత్య, సంగీత పాఠశాల పెట్టి ఎంతో మంది ఆడపిల్లలకి శిక్షణ ఇప్పించింది. తను ఇస్లాం మతాన్నే నమ్మినా తల్లి హిందూ అయిన కారణంగా హిందూ వేదాంతం వల్ల కూడా ప్రభావితమైంది.
అన్నిటికన్నా ఆశ్చర్యపరిచే విషయం, మీర్జా హాది రుసువా రాసిన మొదటి ఉర్దూ నవల ఉమ్రావ్ జాన్ అదా కి స్పూర్తి ఈ మహ లకానే. ఈమె ఆ రోజుల్లో విద్య కోసం ఆవాసాలు కట్టిస్తూ ఎన్నో బావులను తవ్వించింది. ఇప్పుడున్న ఇఫ్లూ (IFLU) కాంపస్‌లో ఈమె తవ్వించిన బావి నేటికీ నీటితో నిండుగా నిలిచే ఉంది. ఆ బావి చుట్టూ విద్యార్ధులు అనేక కార్యక్రమాలు కూడా ఇది వరకు జరుపుకున్నారు. వర్షాకాలంలో నీటిలో పై అంతస్తు దాకా మునిగిఉండే ఈ బావి ఈ రోజుకీ కళకళలాడుతూ కనిపిస్తుంది.
హైదరాబాద్ చరిత్రను పరిశోధించిన కొందరు ఈమె చేసిన సేవలు, విద్య కోసం ఈమె పడిన కృషిని అధ్యయనం చేసారు. ముఖ్యంగా స్త్రీలకు ఏ మాత్రం స్వతంత్రం లేనిదిగా మనం ప్రస్తావించుకునే ముస్లిం పరిపాలనలో వేశ్యగా ఉంటూ అమితమైన మేధస్సును ప్రదర్శించి సమాజ శ్రేయస్సుకు పాటుపడిన స్త్రీ మహ లకా బీబీ. ఇఫ్లూ కాంపస్ మొత్తం కూడా ఆమె జాగీరు క్రిందకే వస్తుంది. దాన్ని ఆ రోజుల్లోనే ఈమె విద్యాబోధన కోసం దానం చేసింది. దానిపై కొన్ని దశాబ్దాల తరువాత విశ్వవిద్యాలయమే స్థాపించబడుతుందని ఆమె అనుకోకపోయి ఉండవచ్చు. ఆమె చేసిన సేవలకు ఇప్పుడు ఆ ప్రాంగణంలోని స్త్రీల హాస్టల్‌కు ఆమె పేరు పెట్టడమే కాకుండా, ఆ భవనం లోపల ఆమె చిత్రపటాన్ని, దానితో బాటు ఆమె చేసిన సేవలను ప్రస్తావిసూ ఓ శిలాఫలకాన్ని యూనివర్సిటీ పెట్టించింది.
ఇఫ్లూ కాంపెస్ వెనుక కొంచెం దూరంగా బీ.ఎడ్. కాలేజి కాంపస్ ఉంది. ఇది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కూడా ఈమె తవ్వించిన మరో బావి కనిపిస్తుంది. విద్యార్థులకు వసతి గృహాలు కట్టాలంటే నీటి వసతి అవసరం అని నమ్మి ఆమె ఆ చుట్టూ ఈ బావులు తవ్వించిందట. ఇదంతా తన సొంత డబ్బుతోనే ఆమె చేయించడం విశేషం. ఇప్పటికీ కొన్ని ప్రార్థనా మందిరాలు ఆమె కట్టించినవి ఈ చుట్టుపక్కల ఉన్నాయంటారు. ఆమె చనిపోయిన తరవాత ఆమె నివసించిన భవనాన్ని స్త్రీ విద్య కోసం దానం చేసింది. నాంపల్లిలో ఇప్పుడున్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఈమె ఆ రోజుల్లో నివసించిన భవనం. ఈమె ధనం, ఆస్తులు, నగలు అన్నీ మరణం తరువాత పేద స్త్రీలకు పంచి పెట్టారట.
సమాధిని ఆమె కన్న తల్లి మరణం తరువాత 1792లో నిర్మించింది. ముగల్ వాస్తు శైలిలో ‘చార్ బాగ్’ అంటే నాలుగు దిక్కుల తోట పద్దతిలో నిర్మించారు. ఎమొరి విశ్వివిద్యాలయంలో పని చేసే ఫ్రొఫెసర్ స్కాట్ కుగల్ మహ లకా బాయి జీవితంపై అధ్యయనం చేసారు. అతను రీసెర్చ్ చేస్తున్నప్పుడే మౌలాలీలో జీర్ణావస్థలో ఉన్న ఆమె సమాధిని కనుగొన్నాడు. ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితుడయిన అతను ఆ సమాధికి మరమ్మత్తులు చేయించి మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలని సంకల్పించాడు. యూ.ఎస్. ఫెడరల్ ప్రభుత్వం సహాయంతో ఆయన నిధులు సమకూర్చుకుని సమాధిని పూర్వ స్థితికి తీసుకొచ్చాడు. ఆ కార్యక్రమం ఎంత జాగ్రత్తగా జరిగిందో వెలికి తీసిన నీటి కాలువలను చూసి చెప్పవచ్చు. ఉత్తర భారతంలో ముగల్ శైలిలో నిర్మించిన కట్టడాలలో కూడా పూర్తిగా ఆనాటి నీటి కాలువలను అలాగే ఉంచలేకపోయారు. ఈ సమాధి చుట్టు తిరుగుతుంటే ముగల్ మినియేచర్ చిత్రాలలో మనం చూసే భవణ శైలి ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది. అంత జాగ్రత్తగా పునరుద్దరించిన కట్టడం ఇది. లోపలికి ప్రవేశించగానే ఈ పునరుద్దణకు సంబంధించిన సమాచారం ఓ శిలాఫలకం రూపంలో స్వాగతం పలుకుతుంది.
బెంగుళూరు నాగరత్నమ్మ సంగీత ప్రపంచానికి చేసిన సేవలు మనకు తెలుసు. కాని మన నగరంలో నివసించి ఈ భూమికి ఎంతో పేరు తీసుకు వచ్చి మహిళా విద్యకు ఎంతో కృషి చేసిన మహ్ లకా బీబీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. హైదరాబాద్ చరిత్రలో ఆమెకు ప్రముఖమైన స్థానం ఉంది. మన నగరం గురించి, ఈ నగరం ఈ స్థాయిలో నిలబడడానికి కృషి చేసిన వారి గురించి తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా పురాతన కట్టడాలను ప్రేమించే వారు, చరిత్రను ఆసక్తిగా చదివేవారు సందర్శించవలసిన చారిత్రిక నిర్మాణం మౌలాలీలో ఉన్న ఈ మక్బరా మహ్ లకా బీబీ. సిటీలో ఉండేవారు తప్పకుండా వెళ్ళి చూడండి.