[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[సుబ్రమణ్యం ఉదయం నిద్ర లేచేసరికి మిత్రులెవరూ కనబడలేదు. శోభ వాళ్ళింటికి వెళ్తుంటే దారిలో పొలాల వైపు వెళ్తున్న శీనయ్య కనబడతాడు. కారణమడిగితే, మీరు తవ్వుతున్న బావిలో ఏదో శవం కనిపించదని చెప్తాడు. దాంతో సుబ్బు కూడా అక్కడికి పరిగెడతాడు. అక్కడ జనాలంతా గుమిగూడి ఉంటారు. రక్తం మరకలతో ఉన్న ఓ మూట బావిలో పడి ఉంది. పోలీసులు వచ్చి ఈ మూటని బయటకు తీయిస్తారు. తాడు విప్పి చూస్తే అందులో ప్రకృతి శవం ఉంటుంది. ఆమె ఆ ఊరి బసివి కావడంతో – బావి తవ్వుతున్నందుకు దేవుళ్ళకి కోపం వచ్చిందనీ, అందుకే బసివిని బలితీసుకుందని గ్రామస్థులను నమ్మించడానికి, ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు రాయుడు. ఆ పరిస్థితిలో అక్కడున్న అందరూ అతని మాటలనే నమ్ముతారు. విద్య వాళ్ళకి ఎంతగా నచ్చచెప్పాలని ప్రయత్నించినా వినరు. ఎస్.సి.సి. కాడెట్లు మాత్రం ఎలాగైనా బావిని పూర్తి చేయాలనే నిర్ణయించుకుంటారు. మొదట శ్రీనివాస్ బావి నిర్మాణం ఆపేద్దామని వెంకట్రావుతో అంటాడు, కానీ దీని వెనుక కుట్ర ఉందని గ్రహించి, అసలు నేరస్థులని బయటకు రప్పించాలని వెంకట్రావు శ్రీనుకి నచ్చజెప్తాడు. ఊరి బాగు కోసం చెల్లెలు విద్య చేస్తున్న ప్రయత్నాలు, ఎన్.సి.సి. వాళ్ళతో కలిసి తిరగటం అన్న పంచనాథానికి నచ్చదు. వాళ్ళతో వెళ్ళద్దని అంటే, విద్య ఒప్పుకోదు. – ఇక చదవండి.]
అధ్యాయం-15
[dropcap]వెం[/dropcap]కట్రావు అప్పుడే డ్రస్ చేసుకుని బయటకు వస్తున్నాడు.
“నమస్కారం సార్! నా పేరు పిచ్చేశ్వరరావు, ఎంబిబిఎస్. ఊరిలో ఉన్న ఏకైక డాక్టర్‌ని” అంటూ వచ్చాడు డాక్టర్ పిచ్చేశ్వరరావు.
“ఏంటి డాక్టర్ ఇలా వచ్చారు?”
“జరిగిన ఘోరం మీకు తెలుసుగా.”
“ఏమిటది?”
“అదే. ఊరి బావిలో పడిన శవం గురించి. అయితే అలాంటి సంఘటన తర్వాత ముందు జాగ్రత్తగా మంచిది లేకపోతే అంటూ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.”
“అయితే ఏం చేద్దాం అంటారు?”
“మీ క్యాడెట్స్‌కి ఇంజక్షన్స్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం.”
“మంచిది. ఇంజక్షన్ చేసి బిల్లు పంపండి.”
“ఓకే. ఈరోజు పంపండి”
“అలాగే. థాంక్స్”
***
పిచ్చేశ్వరరావు క్లినిక్ ముందు క్యాడెట్స్ అంతా క్యూలో నిలుచున్నారు
నర్సు హడావిడిగా లోపలికి బయటికి తిరుగుతుంది. హాస్పిటల్ మీద జోకులు వేసుకుంటూ లైన్ ముందుకు వెళుతుంది. ఒక్కొక్కరే లోపలికి వెళ్లి బయటికి నీరసంగా రాసాగారు.
శ్రీనివాస్‌కి అనుమానం వచ్చింది
“ఒరేయ్, అటు చూడు! ఎంత హుషారుగా లోపలికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయిన పీనుగుల్లా బయటకు వస్తున్నారు” అన్నాడు.
“రక్తపరీక్ష కదా! అందుకేనేమో” అన్నాడు ఆంజనేయులు.
“నీ మొహం రక్తపరీక్ష అంటే ఒంట్లో రక్తం అంత తోడేస్తారని అనుకుంటున్నావా? కొద్దిగా కొద్దిగా తీసి పరీక్షలు చేస్తారు.”
“అంటే నీ అనుమానం ఏంటి?”
“రక్తం ఎక్కువగా తీసుకుంటున్నాడేమోనని.”
“ఎట్లా?”
“మత్తుమందు ఇచ్చి ఏం చేసుకుంటారో అంత రక్తం” అమాయకంగా అడిగాడు సుబ్రహ్మణ్యం.
“సిటీలో ప్రైవేట్ హాస్పిటల్ లేదా బ్లడ్ బ్యాంకులకు అమ్ముకుంటారు”
“నీకెలా తెలుసు?”
“ఎన్ని సినిమాలు చూడలేదు, అందులో ఇలాగే మనిషి అవయవాలతో బిజినెస్ చేయడం చూపించారు తెలుసా?”
సుబ్రహ్మణ్యం తీవ్రంగా చూశాడు.
“డాక్టర్ గారు దేవుడు రా! అలాంటి వెధవ వాగుళ్లు వాగద్దు. నీచంగా మాట్లాడితే నాకు కోపం వస్తుంది.”
“ఏం? నీక్కూడా వాటా ఇస్తున్నాడా ఏమిటి?” నవ్వుతో అడిగాడు ఆంజనేయులు.
“ఛీ ఛీ.. నాకేం ఖర్మ.. తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది.”
“మరి నీకు ఆయనపై అంతా అభిమానం ఏమిటో?”
“నన్ను భయంకరమైన ఎయిడ్స్ అని వ్యాధి నుంచి తప్పించాడు.”
శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు. “నీకేం మతిపోలేదు కదా! నీకు ఎయిడ్స్ వచ్చిందా? అలాగని ఆ డాక్టర్ చెప్పాడా?”
“కాదు. శీనయ్య చెప్తే, ఈ డాక్టర్ దగ్గరికి వచ్చాను.”
“కానీ ఎయిడ్స్ మందు ఇప్పటివరకు కనిపెట్టనే లేదే?”
“అందుకే! ఇతన్ని గొప్పవాడు అంటున్నాను. ఒకే ఒక ఇంజక్షన్‌తో తగ్గించేసాడు” గర్వంగా అన్నాడు సుబ్రమణ్యం.
“అయితే శీనయ్యే చెప్పాడా? ఆంజనేయులూ, ఇలా రా” అంటూ అతన్ని దూరంగా తీసుకుపోయి శ్రీనివాస్. ఏదో ఆలోచించి లోపలి డాక్టర్‌తో మాట్లాడుతున్న వెంకట్రావు బయటకు పిలిచారు. జరిగిందంతా వివరించారు. వెంకట్రావు వెంటనే మిగిలిన వారిని వెనక్కి పంపించేశాడు.
“శ్రీనివాస్! ఈ విషయం ఇప్పుడే బయట పెట్టొద్దు. వీడి చరిత్ర అంతా లాగి వీడి పని పడదాం” అన్నాడు.
ఆ తర్వాత మిత్రత్రయానికి ఏవో సూచనలు ఇచ్చాడు.
***
ఆరోజు సాయంత్రం క్యాడేట్ల దగ్గర నుంచి తీసి, నిల్వచేసిన రక్తం వేరే బాటిల్స్‌లో నింపి దొంగ దారిన ఊరు బయటకు తీసుకెళ్లసాగాడు శీనయ్య.
అక్కడ ముందుగానే ఏర్పాటు చేసిన ప్రకారం జీపు వచ్చి ఉంటుంది. అందులో ఈ బాటిల్స్‌ని చేరయ్యాలి. ఐదువందలు వస్తాయి ఒక్క గంటలో! అంత సంపాదించడం ఈ పల్లెల్లో కష్టమే. అందుకే అతనితో అతనిలో ఆరాటం. వడివడిగా నడుస్తున్నాడు.
కనిపించిన చెట్టు నీడన కూర్చున్నాడు అలుపు తీర్చుకుంటూ.
ఇంతలో ఎవరో కళ్ళు మూశారు.
ఉలిక్కిపడ్డాడు శీనయ్య.
“ఎవరో చెప్పుకో “
ఆ గొంతు విని తేరుకున్నాడు.
“ఓ నువ్వా శోభా!” అని ఆమె చేతుల్ని తప్పించబోయాడు.
“అరె. భలే కనుక్కున్నావే” అంది చేతులు తీయకుండానే.
“సరేలే.. నేను పని మీద వెళుతున్నాను తల్లీ! చీకటి పడుతోంది. నన్ను వదిలి పెట్టు. చేతులు తీయి.”
“ఊహు.. నేను తీయను.”
“శోభ తల్లీ! నువ్వు మంచిదానివి గదూ.. నేను పట్నం నుంచీ స్వీట్లు తెస్తాను.”
“సరే, ముందు నన్ను ఎలా గుర్తుపట్టావో చెప్పు”
“ఎమ్మెస్ సుబ్బలక్ష్మి లాంటి నీ గొంతు పట్టి” విసుగ్గా అన్నాడు.
“నీవే గెలిచావు పో” అని చేతులు తీసేసి, పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది శోభా.
కళ్ళు నులుముకుని మెల్లిగా లేచి పక్కన ఉన్న బాటిల్స్ అందుకుందామని చూసాడు. అక్కడ అవి లేనే లేవు.
***
వెంకట్రావు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
“ఏమిటీ? ఎప్పుడు చూసినా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు?” అంటూ దగ్గరికి వచ్చింది విద్య.
“చాలా ఆశ్చర్యంగా ఉంది. పల్లెలు ప్రకృతికి ప్రతిరూపాలను అనుకున్నాను. చీకటి ప్రవృత్తికి కూడా ఆటపట్టని అనుకోలేదు.”
“ఏం? అలా అంటున్నారు?”
“మహా హంతకులు ఎందరో ఈ గ్రామంలో కనబడుతున్నారు.”
“ఇది ఒక గ్రామం కథ కాదు. ఎన్నో గ్రామాల కథ. ఇంతకీ మిమ్మల్ని ఈరోజు ఆశ్చర్యపరిచిన హంతకుడు ఎవరో?”
“ఆ డాక్టర్ పిచ్చేశ్వరరావు” అంటూ జరిగిన సంఘటన చెప్పాడు వెంకట్రావు.
“అంతేకాదు. పట్నం వెళ్ళినప్పుడు ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్లు, మందులు, నకిలీ టానిక్లు తీసుకొచ్చి ఊరివాళ్ళకి అంటగడతాడు. దానివల్ల వాడికి ఎన్నో బహుమతులు పుడతాయి. ఇలాంటివి మరెన్నో చేస్తుంటాడు” అంటూ వివరించింది.
“ఇంత గొప్ప క్రిమినల్. ఏ సిటీకి వెళితే ఇంకా గొప్పగా వెలిగిపోతాడు” చిరాగ్గా అన్నాడు వెంకట్రావు,
“కానీ వాడు ఊరు వదిలిపోడు.”
“ఎందుకని?”
“పల్లెటూర్లో చదువులూ తక్కువే, అవగాహనా తక్కువే. పల్లెటూర్లు దేశానికి హృదయం లాంటివి. కానీ హృదయంలోనే చట్టానికి అందని అక్రమాలు సాగుతున్నాయి. మరి దేశ శరీరం మాత్రం ఏం బాగుంటుంది. హృదయం పుచ్చిపోతుంటే బాధగా ఉంది” అంది విద్య.
“నాకు ఒక విషయం ఎంతో సంతృప్తినిస్తోంది” అన్నాడు వెంకట్రావు మాట మారుస్తూ.
“ఏమిటది?” ఆశ్చర్యంగా అడిగిందామె.
“సుబ్రమణ్యం, ఆంజనేయులు, శ్రీనివాస్‌లు కాలేజీలో ఎంతో గొడవ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళ పద్ధతి చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.”
“కుర్రతనంతో చేసే తప్పులు నేరాలు కావండి. బాధ్యత తెలియజేసే వారు లేకపోబట్టి గానీ, లేకపోతే మన యువతకు మానవతకు పట్టం కట్టేంత సామర్థ్యం ఉంది” విశ్వాసంగా అంది విద్య.
“నిజమే మీరు చెప్పింది. ఇంతకుముందు నేను మరీ అతిగా డిసిప్లిన్ మెయన్‌టెయిన్ చేసి అవహేళనకు గురి అయ్యాను. ఇక్కడ వాళ్లని చూసిన, తర్వాత వాళ్ల లోనూ శక్తియుక్తులు ఉన్నాయన్న తర్వాత వాళ్ళని ప్రోత్సహించాలనిపిస్తోంది. యువతీ యువకులను ఎలా సక్రమంగా గైడ్ చేయాలో తెలుస్తోంది” అన్నాడు వెంకట్రావు దీర్ఘంగా నిట్టూరు విడిచి.
ఆ తర్వాత బావి గురించి తర్జనభర్జనులు జరిగాయి.
***
మధ్యాహ్న సమయం.
ఊరి జనానికి పని లేక నిద్రావస్థలో ఉన్నారు. వారి మత్తు వదిలిస్తూ వినిపించింది డప్పు శబ్దం. ఆ శబ్దం మందుతో మత్తెక్కి చేస్తున్న చప్పుడు కాదు. సమర సన్నాహానికి సైనికుల్ని సమాయత్తం చేసే దుందుభి! అందరూ వింతగా చూస్తూ ఇళ్లలోంచి బయటకు వచ్చారు డప్పు మోత లయగా సాగుతోంది. లహరిలా సాగుతోంది. సారా కొట్టు నుంచి బయటికి వచ్చి తన ఆస్తిని ఎవరో కొల్లగొట్టినట్టు చూసాడు సెంద్రిగాడు. అక్కడ – శ్రీనివాస్!
ఊరి వాళ్ళని చూసి లేత కంఠానికి ఆవేశం అద్ది చెప్పసాగాడు –
“వినండి. అందరూ శ్రద్ధగా వినండి ఆపై ఆలోచించండి.. మనసుంటే మాతో కలవండి.. మీకోసం ఈ ఊరికి మీ ఊరి కోసం పట్నం నుంచి పనికట్టుకుని వచ్చాము మేము. మీకు శత్రువులం కాదు. శ్రేయోభిలాషులం మాత్రమే. మాకు దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరే వంచించుకుంటున్నారు. భక్తి విశ్వాసాల కంటే ముందు బ్రతుకు ముఖ్యం. ఆ బ్రతుకు సాగడానికి నీరు ముఖ్యం. దానికోసమే మా శ్రమ. మీరు మాకు చేయూతనివ్వండి.”
వింతగా చూస్తున్న జనాల్లోంచి ఓ పెద్దమనిషి ముందుకు వచ్చాడు – “చూడు బాబూ! వేడి రక్తం ఉరుకులెత్తే వయసు నీది. నీ మాటలు అలాగే ఉంటాయి. కానీ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళం మేము. బలి కోరుతున్న మహమ్మారి ఆ గొయ్యి. అలాంటి చోటికి వచ్చి అక్కడ పలుగేస్తే మా దేవతకు కోపం వస్తుంది. మా ఈ కాస్త బ్రతుకు బుగ్గి అవుతుంది.”
“బావుంది తాతా! చాలా బాగుంది. త్రాగేందుకు నీళ్లు ఇవ్వలేని అమ్మవారు నీటి కోసం కష్టపడితే కోపగించుకుంటుంది. మంచి బ్రతుకు ఇవ్వలేని ఆ దేవత మీ బ్రతుకుల్ని బుగ్గి చేస్తుంది. ఇంకా అలాంటి దేవత మీద పెంచుకున్న మీ భక్తికి అర్థమేంటి? పుట్టుకతోనే పూజల్లో కూర్చునే మీకు కడుపునిండా తిండి ఇవ్వలేదు. మీ కష్టాన్ని గుర్తించటం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ కంచి గరుడ సేవ?”
“మీలో ఉన్నది రక్తం అయితే రండి. కలిసికట్టుగా కదులుదాం! డబ్బు పెట్టి కొనే నీళ్లు కావాలంటే ఇళ్లలోనే కూర్చోండి. ఇదే హాయి అనుకోండి. మేము విజయవార్తతో తిరిగి వచ్చినప్పుడు, మీకు స్వేచ్ఛకు అర్థం తెలుస్తుంది. వస్తాను” అంటూ కదిలాడు. స్పృహలో నీరు కారుతున్న అతనికి కొన్ని జతల అడుగులు జత కలిశాయి అప్పటికప్పుడే ఆ వార్తను అవసరమైన వాళ్లకు మోసుకెళ్లిపోయాయి మరికొన్ని కాకులు.
అధ్యాయం-16
‘సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. బావి పని కొనసాగించేందుకు అందరూ వ్యతిరేకత చూపిస్తున్నారు. తమతో కలిసిన కొద్దిమంది ఊరిని కదిలించేంత శక్తిమంతులు కాదు. వారి సహకారం అక్కర్లేదు. పనికి అడ్డు రాకుంటే చాలు. అంతవరకు అయితే తనే చూడగలనని హామీ ఇచ్చింది విద్య.
వనజ రాయుడు గారి అమ్మాయి కనుక ఆమెను చూసి కొంతమంది అభ్యంతరం పెట్టకపోవచ్చు. నెలరోజులు కార్యక్రమంలో 15 రోజులు గడిచిపోయాయి. ఎలాగైనా బావి పూర్తి చేయాలి. ఏ ఆటంకమూ లేకుండా జరిగే పని కన్నా ఇలాంటిది రెట్టింపు దీక్షతో చేయాలి. లేకపోతే కష్టమే!
పని అలవాటు లేని పిల్లలు స్టూడెంట్లు. వాళ్లలో ఉత్సాహం రేకెత్తించాలి. నిజానికి ఇది ఓ యజ్ఞంలా తయారయింది’ అనుకుంటూ వెంకట్రావు తన ఆలోచనను మిగిలిన వారికి వివరించాడు.
సుబ్రహ్మణ్యం భయపడ్డాడు పని పెరుగుతోందని. ఆంజనేయులు దిగాలుగా వనజకేసి చూశాడు.
శ్రీనివాస్ ఖచ్చితంగా చెప్పాడు “మీరు గనక ఈ పని పూర్తి చేయకపోతే మిమ్మల్ని బలి ఇచ్చి పని మొదలు పెడతాను.”
అతని ఆవేశం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
తర్వాత రోజే పని తిరిగి ప్రారంభమైంది. ఊరి వాళ్ళు అడ్డుపడలేదు కానీ ఉత్సాహాన్ని చంపుకోలేక రోజూ వచ్చి చూసి పోతున్నారు.
పని మాత్రం ముట్టుకోవటం లేదు. రాయుడు ఆనందించాడు. ఇక బావి త్రవ్వినా దాని జోలికి ఎవరు పోరు. తన వద్దకే వస్తారు. అటుపై తన ప్రజాసేవ నిరాకాటంగా సాగిపోతుంది. అటు కాంట్రాక్టు డబ్బులు- ఇటు నీళ్ల డబ్బులు. తను ఊహించినట్లే జరుగుతున్నాయి అన్నీ. అందుకే ఎలాంటి అభ్యంతరము పెట్టలేదు.
రాయుడు ఊహలు వ్యూహాలుగా మారాయి. వ్యాపారం వ్యాపారమే వ్యవహారం వ్యవహారమే.
***
రాత్రి.
ఎన్.సి.సి క్యాంపులో వెంకట్రావు శ్రీనివాస్ ఆంజనేయులు సుబ్రహ్మణ్యంలు చర్చించుకుంటున్నారు.
‘అసలు ఇంతకీ ఎవరు హత్య చేసి ఉంటారు బసివిని?’
ఇదీ ప్రశ్న!
“ఇంకెవరూ.. రాయుడే” అన్నాడు ఆంజనేయులు.
“నీకెలా తెలుసు?” ఆశ్చర్యంగా అడిగాడు వెంకట్రావు.
“నేను ఊహిస్తున్నాను”
వెంకట్రావు సీరియస్‌గా చూశాడు
“ఆధారం లేని ఊహలు చెప్పడం మంచిది కాదు. మనకి శత్రువు అయిన ప్రతివాడూ నేరస్థుడు అవ్వాలని లేదు.”
“నా ఊహకి ఆధారం లేక కాదు. ఎటోచ్చీ అది మనకు తెలియలేదు అంతే” బింకంగా అన్నాడు ఆంజనేయులు.
“ఏమిటి ఆధారం?” అడిగాడు వెంకట్రావు.
“బసివిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, రాయుడు ముఠాకి తప్ప” ప్రశ్నించాడు ఆంజనేయులు.
“అదే తప్పు అంటున్నాను. రాయుడి పని అని ఎందుకు అనుకుంటున్నావు?”
“రాయుడికి మన కార్యక్రమం ఇష్టం లేదు. ముఖ్యంగా మన బావి అతని వ్యాపారానికి అడ్డమని అతని అభిప్రాయం” అన్నాడు శ్రీనివాస్ కల్పించుకుంటూ. “ఈ జనంలో మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటిని వాడుకునే తెలివితేటలు రాయుడికి ఉన్నాయి. దేవతలా చూసుకునే బసివిని చంపి బావిలో పడేస్తే బావి జోలికిరారు సరిగదా మనల్ని పని కూడా చేయనివ్వరు. ఇంకా మాట్లాడితే బావినీ, అడ్డం వస్తే మనల్ని కూడా పూడ్చేస్తారు.”
“ఈ హత్యని ఇంత తేలిగ్గా అంచనా వేయలేం. దీని వెనక మరేదో నిజం దాగి ఉంటుంది” ఆలోచనగా అన్నాడు వెంకట్రావు.
“ఏమై ఉంటుంది?” ఆసక్తిగా అడిగాడు శ్రీనివాస్.
“రాయుడికి బసివికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో మనకైతే తెలియదు. ఏమైనా విరోధం ఉంటే మన పరిశోధనలో బయటపడాలి. ఎలా ఎంత చాకచక్యంగా చేసినా ఏదో పొరపాటు ఉంటుంది. దాన్నే మనం కనుక్కోవాలి” అన్నాడు తెలివిగా ఆంజనేయులు.
“తప్పు బయటపడి తీరని సిద్ధాంతం ఉందా?” అన్నాడు శ్రీనివాస్
“తప్పు ఉన్నచోట భయం ఉంటుంది భయం ఉన్నచోట పొరపాటు ఉండి తీరుతుంది. అదే నేరస్థుని పట్టిస్తుంది” అన్నాడు వెంకట్రావు సంభాషణ ముగిస్తూ.
***
“శోభా, శోభా! నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో” అన్నాడు సుబ్రమణ్యం.
వాళ్ళిద్దరూ చెరువు దగ్గర కూర్చున్నారు. శోభ ఆలోచించి.. ఆలోచించి.. ఆలోచించి.. చించి… చెప్పింది.
“లడ్డూలు”
“కాదు”
“జంతికలు”
“కాదు.. ఎప్పుడూ తిండేనా? మళ్లీ ఈసారి కనుక్కో”
“చీర”
“ఛీ.. నీకు చీర.. చాలా చీరలు కావాలి. అయినా అది తెస్తే అందరికీ కనబడుతుంది అందుకని..”
“అందుకని..” ఆసక్తిగా అడిగింది శోభ.
“ఇదిగో.. ఈ ఉంగరం తెచ్చాను. చూడు బాగుందా” అన్నాడు సుబ్రమణ్యం.
“అబ్బా.. ఎంత బాగుందో.. నువ్వు ఎంత మంచివాడివి” అంటూ గట్టిగా కౌగిలించుకుంది.
“అయ్యో,.. అయ్యో.. నేను తెచ్చిన కానుకకు ఇదేం శిక్ష రా భగవంతుడా? వదులు ఊపిరాడటం లేదు” మూలిగాడు సుబ్రమణ్యం.
అతనిపై జాలి పడి వదిలేసింది
“ఎక్కడిది?” అడిగింది.
“మా నాన్న కువైట్ వెళ్ళినప్పుడు తెచ్చాడులే” అన్నాడు గర్వంగా.
“అదేం ఊరు?” వింతగా చూసింది శోభ.
“అరేబియా సముద్రంలో ఉందిలే. అక్కడ ఒక్క లడ్డు 300 రూపాయలు ఉంటుంది” అన్నాడు సుబ్రహ్మణ్యం.
“అబ్బో”
“అది సరేగానీ ఆ ఉంగరం మీద ఏం రాసిందో చూడు” అన్నాడు మాట మారుస్తూ.
“ఏమిటో పాము బొమ్మ వేసి ఉంది. అంటే ఏమిటి?” అంది.
“అది పాము కాదు. ఇంగ్లీష్ అక్షరం ‘ఎస్’. అంటే సుబ్రహ్మణ్యం. ‘ఎస్’ అంటే నీ పేరు శోభ. అంటే నేను నీకు ఇచ్చిందన్నమాట”
“ఎస్ అంటే సుబ్రహ్మణ్యం కాదు శోభ కాదు. శీనయ్య. అది నాది ఇచ్చేయ్” అన్నాడు అప్పుడే వచ్చిన శీనయ్య కంగారుగా లాక్కుందామని ప్రయత్నం చేస్తూ.
“నువ్వెప్పుడొచ్చావ్? మేము ప్రేమించుకున్నప్పుడు మధ్యలో రాకూడదని తెలియదూ” అంది కోపంగా శోభ.
“ఆఁ.. ప్రేమా? ప్రేమ దోమ అన్నా ఉంటే మీ నాన్నతో చెబుతాను” అన్నాడు శీనయ్య బెదిరిస్తూ.
“చెబుతావా?”
“ఆ ఉంగరం ఇస్తే చెప్పను”
“అమ్మో మా సుబ్రహ్మణ్యం ముద్దు పెట్టుకుని ఇచ్చాడు. ఇది నేను ఇయ్యను” అంది చేతిని వెనక్కి దాచుకుంటూ.
“అయితే మీ నాన్నతో చెబుతా.”
“చెప్పుకో.. నేను నీ మీద చెప్తా. ప్రతిసారి వచ్చి శోభా నిన్ను ప్రేమించాను. ముద్దు పెట్టుకుంటా.. ముద్దు పెట్టు.. అంటున్నాడు అని చెబుతా” అంది శోభ వెక్కిరిస్తూ.
‘ఈ పిచ్చిదాని బుర్రలో ఇంత ఆలోచన ఎప్పుడు వచ్చిందబ్బా? ఇది ప్రేమ మహిమ కాబోలు’ అనుకుంటూ చేతిలో ఉన్న అరటిపళ్ళు శోభకి ఇచ్చాడు శీనయ్య.
“అబ్బే ఊరికే బెదిరించాను. అంతే! ఎవరితోనూ ఏమి చెప్పకే?! అరటిపండు తినండి. ఆ ఉంగరం మాత్రం ఇంకెవరికి ఇవ్వద్దు” అంటూ హడావిడిగా వెళ్లిపోయాడు
ఇద్దరూ కూర్చుని అరటిపళ్ళు తినడం ప్రారంభించారు.
అంతలో ఆంజనేయులు శ్రీనివాస్ వచ్చారు.
“ఏరా సుబ్బిగా.. శీనయ్య అలా పరిగెడుతున్నాడు. కొంపతీసి వాణ్ణి తింటానన్నావా?” నవ్వుతూ అడిగాడు ఆంజనేయులు.
“మరీ మా సుబ్రమణ్యం ఈ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుని నాకు ఇచ్చాడు. శీనయ్య ఏమో ‘తనది’ అంటూ పోట్లాడాడు నేను మా నాన్నతో చెబుతానని అనేసరికి పారిపోయాడు” ముద్దు ముద్దుగా అంది శోభ.
“నీకు ఉంగరం ఇచ్చాడా సుబ్బిగాడు” ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాస్.
“అవును. ముద్దు పెట్టుకుని ఇచ్చాడు” అని ఉంగరం చూపించింది.
సుబ్రమణ్యం ఇబ్బందిగా కదిలి “సరే చీకటి పడుతోంది నువ్వు ఇంటికి వెళ్ళు” అన్నాడు శోభతో.
“అలాగే రేప్రొద్దున మా ఇంటికి రా. సరేనా?” అంది స్వామి లేస్తూ.
“నీకు ఉంగరం ఎక్కడిది రా?” అడిగాడు శ్రీనివాస్ శోభ అటు వెళ్ళగానే.
“మా నాన్న కువైట్‌కి వెళ్ళినప్పుడు తెచ్చాడు. అది అరేబియా సముద్రంలో పెద్ద దేశం. నీకు తెలియదులే” బింకంగా అన్నాడు సుబ్రహ్మణ్యం.
“కబుర్లు కట్టిపెట్టి నిజం చెప్పు” కసురుకున్నాడు శ్రీనివాస్.
“సారీ రా. ఇది.. ఇది.. బావి దగ్గర దొరికింది” అన్నాడు మెల్లిగా.
“ఎప్పుడు?”
“బసివి చనిపోయిన రోజునే”
షాక్ తిన్నట్లు అయింది శ్రీనివాస్‌కి.
“ఇది నిజమేనా” అనుమానంగా అడిగాడు
“నన్ను నమ్మండి రా.. ఆరోజు రాత్రి కూడా అంతే! ఏదో శబ్దం వచ్చిందిరా బావి దగ్గర అంటే మీరు ఎవరూ నమ్మలేదు” ఏడుపు మొహంతో అన్నాడు.
వెంకట్రావుకు విషయం అంతా జేరవేశారు.
ఆ విషయం విని వెంకట్రావు కూడా ఆశ్చర్యపోయాడు.
‘సుబ్బిగాడికి ఉంగరం బావి దగ్గర దొరికింది దాన్ని శోభకి ఇవ్వడం చూసిన శీనయ్య ఎందుకు అడిగాడు.. అతనికి ఉంగరానికి సంబంధం ఏమిటి? బంగారం కాజేద్దామనా.. లేక?’
ఉలిక్కిపడ్డాడు. అంటే బస్సు టౌన్‌కి వెళ్లిన రాత్రి ఒక మూటని బావిలో పడేసారు. వాళ్ళల్లో శీనయ్య ఉన్నాడు.
నెమ్మదిగా విషయం అర్థమైంది అతనికి.
ఇక తీగ లాగడమే మిగిలింది.
దీర్ఘoగా నిట్టూర్చాడు వెంకట్రావు.
(సశేషం)