[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
తొలి వేషం:
[dropcap]నే[/dropcap]ను నాన్న వైపే చూస్తున్నాను. నాన్న మాత్రం అద్దంలో తన ముఖం చూసుకుంటూనే ఉన్నారు. ఒక నిముషం కాదు, రెండు నిమిషాలు కాదు. ఐదారు నిమిషాలు శ్రద్ధగా అద్దం ముందు కూర్చోవడం వారానికి ఒకసారి జరిగే తంతే. అసలు మామూలుగా నాన్న జుట్టు దువ్వు కోవడానికి కూడా అద్దం ఎక్కువగా పట్టుకోరు. పట్టుకున్నా కేవలం అర నిమిషం లోపే. కానీ గడ్డం గీసుకునేటప్పుడు మాత్రం శ్రద్ధగా కూర్చుంటారు. పిల్లవాడినైన నాకు నాన్న గడ్డానికి సబ్బు పట్టించడం, ఆపైన పొలం దున్నతున్నట్లు ఓ పద్ధతిలో రేజర్‌ని నడిపిస్తూ గడ్డం గీసుకోవడం భలేగా ఉండేది. ఈ దృశ్యాన్ని అదే పనిగా చూడటం ఓ గమ్మత్తుగా అనిపించేది. నాకు బాగా నచ్చేది ఏమిటంటే గడ్డానికి సబ్బు పట్టించడం. గుండ్రటి సబ్బు డబ్బాని గూట్లో నుంచి తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న అద్దం, రేజర్ తీసుకున్నారంటే చాలు నేను నాన్న ప్రక్కనో లేదా చాటుగా ఏ స్తంభం వెనకో నక్కి కళ్లార్పకుండా గడ్డం గీసుకోవడం అనే ఘట్టాన్ని ఆసక్తిగా చూసేవాడ్ని. అసలు గడ్డం గీసుకోవడం ఓ ఆర్ట్ అని చాలా గట్టిగా నమ్మేవాడ్ని. అంతే కాదు, గడ్డం గీసుకోవడం ఓ సాహస కృత్యం కూడానూ. ఒక్కోసారి గడ్డం గీసుకుంటుంటే నాన్న గడ్డానికి పట్టించుకున్న తెల్లటి సబ్బు నురగలో ఎర్రటి చారలు కనిపించేవి. అప్పట్లో అర్థం కాకపోయినా నాన్న చేతిలోని రేజర్ గాడే గడ్డం తెగేలా చేస్తున్న విలన్ అని తెలిసిపోయింది.
సబ్బు తీసుకుని దానిపై కొద్దిగా నీళ్లు చల్లి బ్రష్‌తో సబ్బు బిళ్ల మీద రుద్దడంతో సబ్బు ఆ బ్రష్‌కి బాగా అంటుకోవడం, ఆ నురగను గడ్డానికి పట్టించుకోవడం. ఇదంతా చూస్తుంటే నాన్న మేకప్ చేసుకుంటున్నాడనే అనిపించేది. మేకప్ చక్కగా వేసుకుంటున్నప్పుడు మరి ఆయనెందుకు స్టేజీ ఎక్కడం లేదన్న డౌటూ వచ్చింది. నాటకం కోసం నేను తొలి వేషం కట్టడానికీ, నాన్న గడ్డం గీసుకోవడానికి సంబంధం ఉన్నదంటే మీరు నమ్మరు. కానీ ఇది నిజం.
నాన్న గడ్డం – నాటకం:
అది 1970వ సంవత్సరం. అడవిరావులపాడులోని పెంకుటింట్లో నాన్న ఇలా గడ్డం గీసుకోవడం చూస్తున్నప్పుడే నాకు ఓ బ్రహ్మండమైన ఆలోచన వచ్చింది. నేను వేయబోయే వేషానికి మేకప్ ఎలా చేసుకోవాలా అన్న సందేహం తీరింది అప్పుడే. మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అప్పటి వరకు నాన్న గడ్డం గీసుకోవడాన్ని అదే పనిగా చూస్తున్న నేను ఉన్నట్టుండి గెంతుకుంటూ హూషారుగా బయటకు వెళ్ళి ప్రెండ్స్‌ని పోగేశాను. నా ఆలోచన చెప్పాను. ‘భలేగా ఉందిరా’ అనేశారు వాళ్లు. దీంతో ఆ పల్లెటూరులో డ్రామా ట్రూప్ సిద్ధమైందన్న మాట. నా తొలి నాటకం పేరు ‘జోకర్’. ఆ వేషం మాత్రం నాదే, ఫ్రెండ్స్‌కి వేరే పాత్రలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.
మేరా నామ్ జోకర్:
‘మేరా నామ్ జోకర్’ సినిమా గుంటూరులో చూసి ఆ వెంటనే అడవిరావులపాడు వచ్చేశాను. ఆ సినిమాలో జోకర్ వేషం నాకెంతో నచ్చింది. అందుకే మా నాటకంలో జోకర్ పాత్ర ప్రవేశించింది. మా చిట్టి నాటికలో జోకర్ గాడు స్టేజీ ఎక్కి చీటికీ మాటికీ ‘మేరా నామ్ జోకర్.. మేరా నామ్ జోకర్’ అంటుంటాడు. మిగతా పాత్రలు చుట్టూ చేరి తప్పట్లు కొడుతుంటాయి. అంతే డ్రామా. అంతకంటే ఎక్కువ సీన్లు లేవు. మా పల్లెటూర్లో ఈ నాటిక ప్రదర్శన కోసమే ఈ హడావుడి అంతానూ.
‘మేరా నామ్ జోకర్’ సినిమా మరో రకంగా కూడా నాకు బాగా గుర్తుండిపోయింది. ఒక సినిమాకి ఒక ఇంటర్వెల్ ఉండటమే నాకు అప్పటి దాకా తెలుసు. ఈ సినిమా మొదటి సారి రిలీజ్ అయినప్పుడు నేనూ అన్నయ్యా వెళ్ళాం. చిత్రం ఏమిటంటే ఈ సినిమాకు రెండు సార్లు ఇంటర్వెల్స్ ఇచ్చారు.
నిడివి ఎక్కువ కావడంతోనో మరే కారణమో తెలియదు కానీ ఫస్ట్ రిలీజ్‌లో సినిమా బాగా ఆడలేదు. కానీ పదేళ్ల తర్వాత నిడివి తగ్గించి, ఒకే ఇంటర్వెల్‌తో రిలీజ్ చేస్తే బాగా ఆడింది. మా ఊర్లో అంటే, నందిగామలో భారత్ టాకీస్, విజయా టాకీస్ అని రెండు థియేటర్లు ఉండేవి. ఇప్పుడైతే విజయటాకీస్ ఉంది, కానీ భారత్ టాకీస్ లేదు. ఈ భారత్ టాకీస్ ఉన్న ప్రాంతంలో రెసిడెన్సియల్ కాంప్లెక్స్ వెలిసింది. కానీ ఇప్పటికీ ఆ సెంటర్‌ని భారత్ టాకీస్ సెంటర్ అనే పిలుస్తారు. లక్ష్మీ ప్రసన్నా, మయూరి పేరిట మరో రెండు సినిమా థియేటర్లు ఇప్పుడున్నాయి. నేను హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు భారత్ టాకీస్, విజయా టాకీస్‌లలో సినిమాలు సింగిల్ ప్రొజెక్టర్లు తోనే నడిచేవి. ప్రతి సినిమాకీ నాలుగు రీల్ బాక్స్‌లు వచ్చేవి. సింగిల్ ప్రొజెక్టర్ కనుక ఒక బాక్స్ లోని రీల్ అయిపోగానే రెండవది తీసి ప్రొజెక్టర్‌లో బిగించాలి. దీనికి కనీసం ఓ ఐదారు నిమిషాలు పడుతుంది. సినిమా సగంలో వచ్చే ‘విశ్రాంతి’ కాకుండా, ఈ సింగిల్ ప్రొజెక్టర్ వల్ల మరో రెండుసార్లు అదనంగా బ్రేక్‌లు వచ్చేవి. ‘మేరా నామ్ జోకర్’ సినిమా గుంటూరులో చూసినప్పుడు రెండుసార్లు విశ్రాంతి కార్డ్ పడటం అప్పట్లో వింతగా చెప్పుకునేవారు.
సరే, ఈ సంగతి ఎలా ఉన్నా, ‘మేరా నామ్ జోకర్’ సినిమాలో జోకర్ పాత్ర నాకెంతో నచ్చింది. ఆ పాత్ర ఎవరు వేశారో, ఆ కథ ఏమిటో సినిమా చూసినా నాకు అర్థం కాలేదు. కాకపోతే జోకర్ పాత్ర వేసిన వాడు సినిమాలో తెగ బాధపడుతుంటాడు. ఎంతగా అంటే భాష తెలియకపోయినా చూస్తున్న మన కళ్లు చెమ్మగిల్లేటంత.
జోకర్ గాడేమో గడ్డానికి తెల్లటి రంగు పులుముకుని ముక్కుమీద ఎర్రటి రంగు అద్దుకుని తలపైన కుచ్చు టోపీ పెట్టుకుని సర్కస్‌లో పాట పాడటం, ప్రేక్షకులను నవ్విస్తూ తాను మాత్రం ఏడవడం ఇవన్నీ నాకు బాగా నచ్చేశాయి.
‘నవ్వడం – ఏడ్వటం ఈ రెండూ చేయడం వస్తే నేనూ నటుడ్ని అయిపోతాను కదా. ఇప్పటికే ఈ రెండు బాగానే వచ్చేశాయి. నాన్న అరిస్తే ఏడుస్తాను. అమ్మ నవ్విస్తే నవ్వుతున్నాను కదా. నటుడికి కావాల్సిన అర్హతలు వచ్చేశాయ్. కాబట్టి నేనూ ఓ నటుడ్నే. నేనూ సినిమాల్లో నటించేయవచ్చు. స్టేజీ ఎక్కి నాటకాలు ఆడేయనూ వచ్చు’ – ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సినిమా చూసి ఇంటికి వచ్చిన దగ్గర నుంచీ ఈ జోకర్ గాడి గురించే నా ఆలోచన. నిద్రలో కూడా కలలోకి వచ్చేసే వాడు. కలలోని జోకర్ అదేమిటో అచ్చు నాలాగే ఉండే వాడు. జోకర్ పాత్ర పోషించాల్సిందేనని గట్టిగా అనేసుకున్నాను.
ఇలా నేనేమో ఆలోచనలతో ఉండగానే సమ్మర్ సెలవలు వచ్చేశాయి. ఎప్పటి లాగానే గుంటూరులో ఎర్రబస్సు ఎక్కి నందిగామ వచ్చేసి ఆక్కడి నుంచి గూడు కట్టిన ఎడ్ల బండిఎక్కేసి మా ఊరు చేరేవాళ్లం. ఇదిగే ఇక్కడే నాన్న గడ్డం గీసుకుంటుంటే నాకు వచ్చిన ఫ్లాష్ లాంటి ఆలోచన జోకర్ పాత్ర మేకప్ సమస్యను తీర్చేసింది. జోకర్ వేషం వేయాలంటే తెల్లటి రంగు కావాలి, కానీ ఎక్కడ దొరుకుతుందన్న సమస్యకి పరిష్కారం దొరికింది. నాన్న గడ్డం గీసేసుకుని గడ్డం సామాన్లు గూటిలో పెట్టేసి ఆయన అటు స్నానానికి వెళ్లగానే నేను ఇటు గుండ్రటి సబ్బు పెట్టెను, సబ్బు గడ్డానికి పట్టించుకోవడానికి వాడే బ్రష్‌ని అందిపుచ్చుకుని ఇంటి వెనుక ఉన్న వేపచెట్టు దగ్గరకు పరిగెత్తాను. సబ్బు అప్పటికే తడిసి ఉండటంతో బ్రష్‌ని సబ్బు మీద రుద్దగానే తెల్లటి నురగ వచ్చేసింది. దాన్ని నా చిట్టి గడ్డానికి పట్టించుకున్నాను. అరే! అప్పుడు గుర్తుకు వచ్చింది, అద్దం తీసుకురావడం మరచిపోయానే అని. అలాగే ఇంట్లోకి పరిగెత్తి అద్దం తీసుకుని ముఖం చూసుకుని ఆశ్చర్యపోయాను. జోకర్ గాడిలానే కనిపించాను. కాకపోతే ముక్కుమీద ఎర్రటి రంగు లేదు, తలమీద టోపీ లేదు. అంతే.
ఆలోచించడం మొదలు పెడితే ఎప్పుడో ఒకప్పుడు పరిష్కార మార్గం తడుతుంది. అదే నిజమైంది. ఎర్ర రంగు దొరికింది. అక్క బొట్టు పెట్టుకోవడం కోసం వాడే తిలకం, అమ్మ వాడే కుంకుమ నా మేకప్ అవసరాన్ని తీర్చేసింది. కళ్ల క్రింద నలుపు కోసం కాటుక డబ్బా లాగేసుకున్నాను. ఇలా మేకప్ సెట్ అమరింది.
బస్సాటలో బహు పాత్రలు:
ఇంటి ముందు వసారాలో ఓ మూలగా పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్‌తో నేను బల్ల మీదనే బోలెడు ఆటలు ఆడుకునే వాళ్లం. అందులో నాకిష్టమైనది ‘బస్సాట’. బల్లకి ఒక వైపున డ్రైవర్ కూర్చుంటాడు. వాడికి అటూ ఇటూ ఇంకెవరు కూర్చోకూడదు. అది రూల్. ఎర్ర బస్సెక్కినప్పుడల్లా చూసేవాడ్నిగా డ్రైవర్ సీట్‌ని. వాడికో ప్రత్యేకత ఉంటుంది. వాడి ముందు ఓ చక్రం ఉంటుంది. దాన్ని అటూ ఇటూ తిప్పుతుంటాడు. మధ్యమధ్యలో ప్రక్కనే సన్నటి పుల్ల ఉంటే దాన్ని నొక్కుతాడు. అలా నొక్కగానే బస్సు హారన్ మోత మారుమ్రోగేది. రాత్రి పూటైతే మరో స్విచ్ నొక్కుతాడు. బస్సులో లైట్లు వెలుగుతాయి. అలాగే బస్సు ముందు పెద్ద లైట్లూ వెలుగుతాయి. డ్రైవర్‌ని చూస్తుంటే పట్నంలో ఓసారి మెజీషియన్ చేసిన గమ్మత్తులు గుర్తుకు వచ్చేవి. డ్రైవర్ వెనుక ఓ వరసలో ప్రయాణీకులు కూర్చుంటారన్న మాట. ఈ ఆటలో నేను కాసేపు డ్రైవర్ మరి కాసేపు కండెక్టర్. కండెక్టర్ పాత్ర కూడా చాలా గొప్పదే. ఏ బస్సు అయినా కండెక్టర్ చెప్పినట్లే వింటుందని బలంగా నమ్మేశాను. నేను ఎర్ర బస్సు ఎక్కినప్పుడు కండెక్టర్‌నీ డ్రైవర్‌నీ అదే పనిగా చూసేవాడ్ని. కండెక్టర్ ‘రైట్’ అంటేనే బస్సు కదిలేది. అసలు కండెక్టర్ ఓ ‘బాస్’లా అనిపించేవాడు. వాడి మాటే శాసనం.
బస్సు వేగంగా పోతున్నప్పుడు డ్రైవర్ ఉన్నట్లుండి బ్రేక్ వేసి ఆపేస్తుంటాడు. రోడ్డు మీద గేదెలు, మేకలు వచ్చినప్పుడు ఇలా ఆపేస్తుంటారన్న మాట. ఇంకోసారి ఎడ్ల బండ్లు అడ్డం వస్తుంటాయి. అలాంటప్పుడు డ్రైవర్ గారికి కోపం వచ్చేది. సైడ్ ఇవ్వమని అరిచేవాడు. అప్పుడు అనిపించింది, ‘ఎడ్ల బండి కంటే ఎర్ర బస్సు గొప్ప’ అని. అప్పటి నుంచి బస్సాట పట్ల మక్కువ పెరిగింది. మా ఊర్లో పెద్ద బల్ల ఉన్నదని చెప్పాను కదా. అది చూడగానే బస్సాట ఆట ఆడాలనిపించేది. పిల్లల్ని పోగేసి గంటల కొద్దీ ఆడుకునేవాళ్లం. మధ్యలో గేదెలు అడ్డం వచ్చినట్లు, ఒక ప్రయాణీకుడు టికెట్ తీసుకోకపోతే అరిచినట్లు, ‘ఖాళీ లేదు’ అంటూ, ఎక్కేవారిని క్రిందకి తోసేస్తున్నట్లు, నోట్లు చిల్లర లెక్క పెట్టుకున్నట్లు, మధ్యలో బస్సు ఆపించి చిద్విలాసంగా టీ తాగుతున్నట్లు.. ఇలా ఎన్నో సన్నివేశాలు ఈ బస్సాటలో చోటు చేసుకునేవి. అసలు బస్సాటతోనే నాలో ఒక నటుడు ఉన్నాడన్న సంగతి తెలిసింది. ఆటల్లోనే బస్సు కండెక్టర్‌తో పాటుగా, ట్రాఫిక్ పోలీస్, పోస్ట్‌మాన్, డాక్టర్, టీచర్, పేపర్ బాయ్, ఎడ్ల బండి నడిపే జీతగాడు – వంటి పాత్రలు పోషించిన అనుభవం చాలా చిన్నప్పుడే వచ్చేసింది. కానీ నా నటనకు గుర్తింపు రాలేదు. ఇదేగా నా బాధ. ఊర్లో ఓ నాటకం వేస్తే గుర్తింపు వస్తుందన్నది నా ప్లాన్ అన్న మాట. అంతే కాదు,’మేరా నామ్ జోకర్’ సినిమాలో జోకర్ గాడిలా గొప్ప హీరోని అయిపోవడమే నా లక్ష్యం.
ఇంకెందుకు ఆలస్యం. నాటక ప్రదర్శన సన్నాహాలు మొదలయ్యాయి. సరిగా అప్పుడే, మా ఫ్రెండ్స్‌లో కొందరు సందేహాలు లేవనెత్తారు.
‘ఒరేయ్, నాటకం వేయాలంటే ఓ స్టేజ్ ఉండాలి గదరా?’
‘ఉంది కదా మా పెద్ద బల్ల’
‘స్టేజీకి ముందు తెర ఉండాలి?’
‘ఓస్, అంతే కదా, ఓ తాడు కట్టి దుప్పటి దింపేస్తే పోలా’
‘లైట్లు కావాలి?’
‘పగటి పూట ఆడితే లైట్లు అక్కర్లేదు రా’
‘మైక్ కావాలి’
‘గట్టిగా అరచి చెబుతాను. ఉన్నది ఒక్కటే డైలాగ్ కదా, అదీ నాదే. అరిచి చెబుతాన్లే’
‘ప్రేక్షకులు కావాలి?’
‘ఊర్లోకి వెళ్ళి పోరగాళ్లకి చెప్పి పోగేద్దాం’
‘మరి ముఖానికి రంగో..?’
‘అవును ఇది కావాలి. అందుకేగా జోకర్ గాడికి మాత్రమే మేకప్. మిగతా పాత్రలకు నో మేకప్.’
అలా పకడ్బందీగా ప్లాన్ చేశానన్న మాట. నాటకం ఆడించడం డైరెక్టర్ పని అని ఆ తర్వాత తెలిసింది. కానీ ఇవన్నీ తెలియకుండానే పన్నెండేళ్ల వయసులోనే నాలోకి ఓ డెరెక్టర్ ప్రవేశించాడన్న సంగతి గుర్తించలేదు. మొత్తానికి సబ్బు నురగ గడ్డానికి పట్టించి, ఇంట్లోనే ఉన్న కుంకుమ, తిలకం, కాటుక వంటివి ముఖానికి పూసేసుకుని జోకర్‌ని అయిపోయాను. ఇదే నా తొలి వేషం.
పల్లెటూరిలో జోకర్ వేషం వేయడానికి నేను చేసిన ప్రయత్నం ఆ తర్వాత నాటకరంగం వైపు నన్ను ఆకర్షింపజేసేలా చేసింది. పురస్కారాలు, ప్రశంసలు అందుకునేలా చేసింది.
కాలేజీ ఓ నాటక ప్రయోగశాల:
నందిగామ కెవీఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు నాలోని ‘డైరెక్టర్’ ఒక కొత్త ప్రయోగం చేయించాడు. ఆ ప్రయోగం గురించీ, ఆ నాటిక గురించి ఇప్పటికీ ఆనాటి నా స్నేహితులు గుర్తు చేస్తుంటారు. విష్ణు గాడైతే మరీను. మా నాటికకు వాడేమో టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాడు. ఆదివిష్ణు నాటిక తీసుకుని మా కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో ప్రదర్శించాలనుకున్నాము. పాత్రధారుల ఎంపిక చేసే పనిలో పడ్డాము. సరే నేను ఒక పాత్ర తీసుకుని దర్శకత్వం బాధ్యత కూడా తీసేసుకున్నాను. మిగతా పాత్రల మాటేమిటి..?
మా కాలేజీలో కో-ఎడ్యుకేషన్. బీఎస్సీ ఫస్ట్ బ్యాచ్ మాది. కాకాని వెంకటరత్నం పేరిట ఉన్న- కేవీఆర్ కాలేజీ అంతకు ముందు పేరు ఎన్టీఆర్ కాలేజీ. నిజమే అండి. విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ పేరిటనే కాలేజీ ఉండేది. నేను ఇంటర్‌లో చేరినప్పుడు మొదటి సంవత్సరం ఎన్టీఆర్ కాలేజీగానే ఉంది. రెండో సంవత్సరంలోకి రాగానే పేరు మారిపోయింది. కాలేజీ పేరు ఇలా ఎందుకు మారిందన్న విషయంలో ఆ రోజుల్లో ఏవేవో చెప్పుకునేవారు. అవేవీ నేను బుర్రకెక్కించుకోలేదు. సరే, ఇంటర్ అయి డిగ్రీలో అదే కాలేజీలో చేరాను. విజయవాడలో లయోలా కాలేజీలో చదవాలని నాకుండేది. కానీ మా ఇంట్లో వాళ్లేమో, ఊర్లోనే డిగ్రీ కాలేజీ వచ్చేస్తే పట్నం వెళ్లడం ఎందుకని నా ప్రపోజల్‌ని అటకెక్కించారు. మా అన్నయ్య డిగ్రీ చదివిందేమో గుంటూరు హిందూ కాలేజీలో. అందుకే నేనూ డిగ్రీ గుంటూరులోనో లేకుంటే విజయవాడలోనో ఇంగ్లీష్ మీడియమ్‌లో చదవాలని అనుకున్నాను. కానీ అప్పటికే అంటే, నేను ఎనిమిదో తరగతికి వచ్చే సరికే గుంటూరు నుంచి నందిగామకి మకాం మార్చేశాము. పైగా నందిగామ కాలేజీలోనే బీఎస్సీ (సైన్స్ డిగ్రీ- తెలుగు మీడియం) కోర్స్ పెట్టేశారాయె. దీంతో నా లాగానే చాలా మంది పట్నం వెళ్ళి చదువుకునే అవసరం లేకుండా పోయింది. ఉన్న ఊర్లోనే సైన్స్ డిగ్రీ క్లాస్‌లు పెట్టడం ఆర్థికంగా కూడా ఇంట్లో వాళ్లకి కలసి వచ్చింది. ఏదైతేనేం, నందిగామలోనే బీఎస్సీలో చేరిపోయాను. కాలేజీలో వార్షికోత్సవాలు ఘనంగానే జరిగేవి.
కదలి వచ్చిన విశ్వనాథుల వారు:
ముఖ్య అతిథులుగా పెద్దపెద్ద వారిని పిలిచేవారు. ఓసారేమో విశ్వనాథ సత్యనారాయణ గారిని పిలవడం నాకు గుర్తుంది. ఆయన ఎవరో, ఆయన ఎంతటి గొప్ప వారో నాకు అప్పట్లో తెలియదు. అప్పటికే ఆయన వయసులోనూ పెద్దవారయ్యారు. సన్నగా, పొడువుగా సాంప్రదాయ దుస్తులతో ఓ సాధారణ వ్యక్తిగా ఆయన స్టేజీ ఎక్కగానే కుర్రకారు అరుపులు, ఈలలు. కేకలు. ఆయనకు కోపం వచ్చిందేమో ఎక్కువ సేపు మాట్లాడలేదు. మాట్లాడిన కాసేపు ఆయన మాటల్లో పదును, చురుకుతనం, చురకలు – నాకెంతో నచ్చాయి. సూటిగా విషయంలోకి రాకుండా, ఓ గమ్మత్తైన శైలిలో చెప్పిన తర్వాతనే అసలు పాయింట్‌కి రావడం గమనించాను. చాలా కాలం తర్వాత వారెంతటి మహానుభావులో అర్థమైంది. ఆయన రచనలు చదువుతున్నప్పుడు ‘ఆహా, ఓహో’ అనకుండా ఉండలేకపోయాను. నేను విశాఖలో కొన్నాళ్లు ఉన్నప్పుడు సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు తెలుగు సాహిత్యం పట్ల మక్కువ పెరిగింది. ఆ క్రమంలోనే ఎక్కువ కాలం లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదివేవాడ్ని. అలాంటప్పుడే విశ్వనాథ వారి రచనలు చదివి ఆశ్చర్యపోయాను. అంత మంచి మనిషి మా కాలేజీకి వస్తే ఆయన విలువను గుర్తించలేకపోయానే అన్న దిగులు ఇప్పటికీ నా మనసుని కలచివేస్తున్నది. నిజమే, జీవితంలో ఒక్కోసారి ఆణిముత్యాల్లాంటి మనుషులు తారసపడుతుంటారు. కానీ మనమే గుర్తించలేక పోతుంటాము. అలా నా జీవితంలో కూడా విశ్వనాథ వంటి వారిని దగ్గరగా చూసినా, వారితో మాట్లాడినా వారి గురించి సరిగా అర్థం చేసుకోలేకపోయిన సంఘటనలు ఉన్నాయి. నేను ఆంధ్రప్రభ విజయవాడ ఎడిషన్‌లో పనిచేస్తున్నప్పుడు మా ఆఫీస్‌కి ఒకాయన వస్తుండే వారు. ఓసారి మా న్యూస్ ఎడిటర్ గారు వారిని నాకు పరిచయం చేస్తూ, ‘వీరు విశ్వనాథ సత్యనారాయణ గారి అబ్బాయి పావన శాస్త్రి గారోయ్’ అన్నారు. ఆ ఒక్క మాటతో పావన శాస్త్రిగారి పట్ల నాకు అమితమైన గౌరవం పెరిగిపోయింది. మా కాలేజీ రోజుల్లో విశ్వనాథుల వారు వచ్చినా పట్టించుకోలేక పోయినందుకు మరో సారి సిగ్గుపడుతూ వారి కుమారుడిని ఎంతో ప్రేమతో అభిమానంతో నిండుగా చూడగలిగాను.
లెక్చరర్‌కూ ఓ పాత్ర:
సరే, కాలేజీ రోజుల్లో నాటిక వేద్దామనుకున్నాం కదా, విజయవాడ నుంచి నాలుగైదు నాటిక పుస్తకాలు తెప్పించాము. వాటిలో ఆదివిష్ణు వ్రాసిన నాటికని (‘అద్దె ఇల్లు’ అని గుర్తు) ఎంపిక చేసుకున్నాము. ఇక, పాత్రల ఎంపిక జరగాలి. మా క్లాస్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. కల్మషం లేని స్నేహం అది. నాటిక వేయాలనుకుంటున్నామని తెలిసి అమ్మాయిల్లో ఇద్దరు (పేర్లు వ్రాయడం లేదు) నాటికలో పాత్రలు పోషించడానికి ముందుకు వచ్చారు. వారి ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆ రోజుల్లో కాలేజీ వార్షికోత్సవ స్టేజీ ఎక్కడమంటేనే చాలా ధైర్యం కావాలి. కుర్రకారు రెచ్చిపోతుంటారు. అలాంటప్పుడు అమ్మాయిలు నాటికలో పాత్రలు పోషించడమా!! కాలేజీలో ఈ వార్త గుప్పుమంది. చివరకు లెక్చరర్స్ కూడా మా దగ్గరకు వచ్చి అడగడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో లెక్చరర్స్‌లో కొంత మంది మాతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు. సీనియర్ లెక్చరర్స్ మా పట్ల ఎంతో అభిమానంతో ఉండేవాళ్లు. మేము నాటిక రిహార్సల్స్ వేస్తుంటే కొంత మంది లెక్చరర్స్ వచ్చి మాకు అండగా ఉండే వాళ్లు. కాలేజీలో ఒక కొత్త ప్రయోగానికి తెర లేచింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లెక్చరర్స్ కూడా భావించి సపోర్ట్‌గా నిలిచారు. ఇంకో గమ్మత్తు జరిగింది. ఈ నాటిక చివర్లో పోలీస్ పాత్ర ఎంటరై ఒకటి రెండు డైలాగ్‌లు చెప్పాలి. ఇక్కడ మరో ప్రయోగం చేశాము. ఈ రెండు డైలాగ్‌లను ఒక లెక్చరర్ చేత (పేరు వ్రాయడం లేదు) చెప్పించాలనుకున్నాము. మా విష్ణు తన వద్ద ఉన్న టేప్ రికార్డర్ తీసుకువచ్చాడు. ఆ రెండు డైలాగ్‌లు మాష్టారి చేత చెప్పించాము. ఇక ప్రదర్శన సమయంలో ఆ మాష్టారు ముందు వరసలో కూర్చుని నాటకం చూస్తున్నారు. చివరి ఘట్టం వచ్చేసింది. పోలీస్ ఎంటరై ఆ రెండు డైలాగ్‌లు చెప్పాలి. ఆ మాష్టారేమో ముందు వరసలోనే అందరితో పాటు కూర్చుని చూస్తున్నారు. అంతలో వారి వాయిస్ గంభీరంగా లౌడ్ స్పీకర్స్‌లో మారు మ్రోగింది. నాటక సన్నివేశానికి తగ్గట్టుగా డైలాగ్‌లు వినబడ్డాయి. పోలీస్ పాత్ర చెప్పిన ఈ డైలాగ్‌లు అచ్చు మాష్టారివే. కానీ మాష్టారేమో ముందు వరసలోనే ఉన్నారాయె. అందరికీ ఆశ్చర్యం. టేప్ రికార్డర్ సాయంతో ఈ గమ్మత్తు చేశామని పాపం వారికి తెలియదు కదా. ఇదో ప్రయోగం. సక్సెస్ అయింది. పైగా లెక్చరర్ గారినే నాటికలో ఇన్వాల్ చేయడం ఓ సంచలనం అయింది. వారిచ్చిన ప్రోత్సాహంతోనే ప్రేక్షకుల్లోని కుర్రకారు ఆగడాలు చేయకుండా బుద్ధిగా నాటిక చూశారన్న మాట.
ఇలా నాటక రంగం వైపు ఆకర్షితుడినైన నేను ఆ తర్వాత ఉద్యోగంలో స్థిరపడ్డాక ఆంధ్రప్రభలో ఉగాది వేడుకలప్పుడు మరో సారి నాలోని నటుడు , దర్శకుడు మేల్కొన్నాడు.
ఆంధ్రప్రభ – ఏక పాత్రలు:
ఆ రోజుల్లో (90 దశకం) ఆంధ్రప్రభ – ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌లో పనిచేయడం అంటే చాలా గొప్పగా ఫీలయ్యే వాళ్లం. ఇప్పుడు ఆ గ్రూప్ లేదనుకోండి. అదో పెద్ద కథ. తర్వాత చెబుతాను. అప్పట్లో ఉగాది వేడుకలు ఆంధ్రప్రభ ఆవరణలో చాలా బాగా జరిగేవి. ఇప్పటికీ ఉగాది రాగానే ఆ నాటి ఆంధ్రప్రభ మిత్రులందరికీ ఆ వేడుకలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఆంధ్రప్రభ – ఉగాది వేడుకల గురించి ఎంతైనా వ్రాయవచ్చు.
తర్వాత చూద్దాం. ఏకపాత్రలు, నాటికల్లో నేను నటించాను. ఏకపాత్రల్లో అయితే వరుసుగా మూడు సార్లు ఉత్తమ ఏకపాత్ర పోషించిన నటుడిగా గుర్తింపు పొందాను. అలా రావడానికి ప్రధాన కారణం నేను ఎంచుకున్న పాత్రలు అలాంటివి. మొదటి సారేమో షిర్డీ సాయిబాబా పాత్ర పోషించాను. నేను వేసిన ఏకపాత్రలకు రచన కూడా నాదే. దర్శకత్వం కూడా నేనే. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేవాడ్ని. ఈ విషయంలో మా ఆవిడ (శ్రీదేవి) సపోర్ట్ చేస్తుండేది. ఆమె ఎం.ఏ. తెలుగు కావడం, నాటక రచన పట్ల ఆమెకీ ఆసక్తి ఉండటంతో నా పని సులువైంది. షిర్డీ సాయిబాబాగా స్టేజీ మీద కనిపించగానే ప్రేక్షకులు రెప్పవాల్చకుండా చూస్తుండిపోయారు. ఏకపాత్రల సెక్షన్‌లో మొదటి బహుమతి ఈ ‘షిర్డీ సాయిబాబా’ గారు అందుకున్నారు.
మరుసటి ఏడాది ‘రామకృష్ణ పరమహంస’ – ఏకపాత్ర. మరోసారి అంతే స్పందన. రామకృష్ణ పరమహంస గురించి పెద్దగా తెలియని వాళ్లు సైతం ఈ ఏకపాత్ర తర్వాత నా దగ్గరకు వచ్చి, వారి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిజానికి నాకూ పెద్దగా తెలియదు. కాకపోతే ఏకపాత్రకి స్క్రిప్ట్ తయారు చేయడం కోసం పుస్తకాలు చదివాను. పాయింట్స్ నోట్ చేసుకున్నాను. దీంతో రామకృష్ణ పరమహంస పట్ల ఆసక్తి పెరిగింది. భక్తి భావన పాత్ర పోషణలో కలిసిపోయింది. ఆ కాసేపు నేనే రామకృష్ణ పరమహంసని అన్న భావన కలిగింది. నిజంగానే ఇదో అద్భుతం. పాత్ర వేరు నటుడు వేరు కాకూడదు. రెండూ మిళితమైపోవాలి. ఈ విషయం అప్పుడే నాకు బాగా అర్థమైంది. మరోసారి ఉత్తమ ఏక పాత్రగా ‘రామకృష్ణ పరమహంస’ నిలిచారు.
మరో చిత్రం జరిగింది. ఎన్టీఆర్ గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ స్మారక కల్చరల్ ట్రస్ట్ వారు 1998లో విజయవాడలో ఏకపాత్రల పోటీలు పెట్టారు. హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగినట్లు గుర్తు. ఈ పోటీల్లో నేను ఆంధ్రప్రభ యాజమాన్యం వారి పర్మిషన్ తీసుకుని పాల్గొన్నాను. రామకృష్ణ పరమహంస పాత్రనే ఎంచుకున్నాను. నాకు రెండో బహుమతి వచ్చింది. బహుమతి ప్రదానోత్సవ సభలో ఒక వక్త చెప్పిన మాటలు నా కిప్పటికీ గుర్తున్నాయి. ‘ఎన్టీఆర్ ఎన్నో పాత్రలు పోషించారు. కానీ రామకృష్ణ పరమహంస పాత్ర వేయలేదు. బహుశా వారే ఈ అబ్బాయి చేత రామకృష్ణ వేషం కట్టించి తన మనసు తీర్చుకున్నారేమో’ – అని ఆ వక్త అనడం నాకు దక్కిన అతి గొప్ప ప్రశంసగా భావించాను.
ఆ తర్వాత ఏడాది రాఘవేంద్ర స్వామి ఏకపాత్ర పోషించి ఇంకో సారి ఆంధ్రప్రభ వేడుకల్లో బహుమతి అందుకున్నాను. ‘గిరీశం’, ‘చంటోడు’ వంటి ఏకపాత్రలు కూడా వేశాను. అలా ఏకపాత్రల రచన, పాత్ర పోషణలో చక్కటి ప్రవేశం కలిగింది. అంతే కాకుండా ఉగాది వేడుకల్లో నాటికల్లో కూడా పాల్గొన్నాను. అసలు ఉగాది అన్నది ఇప్పటికీ నాకో ప్రత్యేక పండుగే. దాదాపుగా ఏ కంపెనీలో పనిచేస్తున్నా ఉగాదికి ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడమో, పాల్గొనడమో జరిగిపోతున్నది నా జీవితంలో. చివరకు రిటైర్ అయ్యాక హైదరాబాద్‌లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉగాది వేడుకలు నిర్వహించడం ఇప్పటికీ ఓ ఆనవాయితీ. ఈ విశేషాలను మరో సారి వివరంగా చెబుతాను.
రూపకానికి ‘రూపం’:
నాటకం, రూపకం ఈ రెంటికీ దగ్గర సంబంధం ఉంటుంది. నాటక రచన పట్ల ప్రవేశం ఉన్న వారు రూపకం వ్రాస్తే దానికి మరింత శోభ చేకూరుతుంది. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో మంత్రివాది మహేశ్వర్ గారు నాలోని రచనా పటిమను గుర్తించి నాచేత నాటికలు, రూపకాలు వ్రాయించారు. అందులో ‘నరుడే ఓనరుడైతే..’ అన్న నాటిక ప్రశంసలు అందుకుంది. అలాగే హైదరాబాద్‌లో విజయ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ‘అదిగో హరివిల్లు’ వ్రాస్తే దానికి జాతీయ ప్రతిభా పురస్కారం దక్కింది.
ఇంగ్లండ్‌లో..:
ఆ మధ్య ఇంగ్లండ్ టూర్‌కి వెళ్ళినప్పుడు సుప్రసిద్ధ నాటక రచయిత షేక్‌స్పియర్ పుట్టిన చోటు (Stratford) చూడటం జరిగింది. అక్కడే ఓపెన్ థియేటర్‌లో యువ కళాకారులు రోమియో జూలియట్ పాత్రలు పోషిస్తూ ఓ సీన్‌ని పండిస్తున్నారు. కాసేపు అక్కడ కూర్చుని వారి నటనకు ముగ్ధుడనయ్యాను. సీన్ కాగానే వెంటనే కూర్చున్న చోటు నుంచి లేచి వారి వద్దకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని రోమియో జూలియట్ పాత్రలు పోషించిన వారిద్దరినీ అభినందించాను. వాళ్లు కూడా సంతోషించారు. నటులకు ఇలాంటి ప్రశంసలే వెలకట్టలేని పతకాలు.
‘జీవితమే ఓ నాటకం’ అన్నాడు ఓ మహాశయుడు. ‘ఇంతేరా ఈ జీవితం. తిరిగే రంగుల రాట్నము’ అన్నాడో ఓ సినీ కవి. ‘పుట్టుకకీ గిట్టుకకీ మధ్య జరిగే మాహా నాటకంలో మనమంతా పాత్రధారులమనీ సూత్రధారి మరొకరు ఉన్నారని’ తేల్చి చెప్పాడు మరో కవి. మధ్యలో వచ్చే అనుబంధాలు, ఆత్మీయతలు అంతా బూటకం అని తేల్చి పారేశారు ఇంకో కవి. జీవితమే ఓ మహా నాటకమే అయినా అందులో నాటకం ఆడటం, నాటక రచన చేయడం, అందులో ప్రశంసలు అందుకోవడం ఓ అదృష్టం. జీవితాన్ని సరిగా అర్థం చేసుకోవాలన్నా, జీవన మహర్నాటక రంగంలోని పాత్రల తీరుతెన్ను పసిగట్టాలన్నా నాటక రంగ ప్రవేశం ఎంతో కొంత ఉపయోగపడుతుంది. నాటకంలో నటించాలి, జీవితంలో నటించకూడదన్న సత్యం తెలుసుకోవాలి.
ఈ భాగంలో నా నాటక రంగ ప్రస్తానంలోని ఆసక్తికరమైన అంశాలను గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేశాను. అయితే ఇది అసంపూర్ణం. చెబితే సానా ఉంది, వింటే ఎంతో ఉంది.
(మళ్ళీ కలుద్దాం)