దంతవైద్య లహరి-6

3
4

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

చివరి దంతంలో పిప్పి

ప్ర: డాక్టర్ గారూ.. నా చివరి దంతంలో సన్నని రంధ్రం ఏర్పడింది. అది రోజురోజుకు పెద్దదిగా అవుతున్నది. మా డాక్టర్ గారికి చూపించుకుంటే ఆ దంతం తీసేయాలని చెప్పారు. ఇప్పటివరకూ ఎలాంటి నొప్పి, ఇబ్బంది కలుగలేదు కనుక అశ్రద్ధ చేసి ఊరుకున్నాను. ఆ పిప్పి పన్నును అలాగే వదిలేస్తే ముందు ముందు జరిగే పరిణామాలు ఏమిటి? ఇది ఇంకా తీవ్రరూపం దాలిస్తే, దవుడ ఎముక కూడా దెబ్బ తినే అవకాశం ఉందంటారా? ఒకవేళ మా డాక్టర్ సలహా మేరకు ఆ పంటిని తీయించుకుంటే, ఆ స్థానంలో కృత్రిమ దంతం పెట్టుకోవచ్చునా? తెలియజేయగలరు.

– శ్రీ గోనుగుంట మురళీకృష్ణ, తెనాలి.

జ: మురళీకృష్ణ గారూ, ముందుగా మీరు ‘నా దంతవైద్య లహరి’ శీర్షికను క్రమం తప్పకుండా చదువుతున్నందుకు ధన్యవాదాలు. మీవంటి సహృదయులకు ఈ శీర్షిక నచ్చుతున్నందుకు ఆనందంగా వుంది.

ఇక అసలు విషయానికి వస్తే, మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం మీకు పిప్పి పన్ను వ్యాధి జ్ఞాన దంతానికి (మూడవ విసురుడు దంతం/ థర్డ్ మోలార్) వచ్చినట్టుగా అనిపిస్తున్నది. దవుడలలో, చివరి దంతాన్ని వాడుకగా ‘జ్ఞాన దంతం’ అంటారు గానీ, జ్ఞానానికి ఈ పన్నుకి ఎలాంటి సంబంధం లేదు.

నిజానికి, దంతాలు ఒకదానికి ఒకటి కలుసుకుని (పై దౌడ పళ్ళు, క్రింది దౌడ పళ్ళు) నమలడానికి (మాస్టికేషన్) ఉపయోగపడతాయి. కానీ జ్ఞాన దంతాలుగా చెప్పబడే చివరి దంతాలు ఒకదానికొకటి కలుసుకోవు. అందుచేత ఆహరం నమిలే విషయంలో ఇవి ఎట్టి పరిస్థితిలోను ఉపయోగానికి రావు.

సమస్య లేనంతవరకూ ఈ పళ్లతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ పంటికి ఎటువంటి సమస్య వచ్చినా, తక్షణమే తీయించేసుకోవడం ఉత్తమం. భవిష్యత్తులో ఈ పన్నుతో ఎలాంటి ఇబ్బందినీ ఎదుర్కోవలసిన అవసరం ఉండదు.

అలాగే, చివరి పన్నుకు పిప్పి వ్యాధి వచ్చినప్పుడు దానికి ఎటువంటి చికిత్స చేయించుకోకుండా, నిర్లక్ష్యం చేస్తే, అది మొదట, ఎనామిల్ (పింగాణీ పొర) నుండి డెంటీన్ పొర గుండా పల్ప్ కుహరం చేరి విపరీతమైన నొప్పికి దారితీయవచ్చు. తరువాత పంటి -మూలం (రూట్) చివర ‘చీము తిత్తి’ (సిస్ట్) ఏర్పడి, దాని వల్ల దవుడ ఎముక వ్యాధిగ్రస్థం అయ్యే ప్రమాధం వుంది. అందుచేత పిప్పి పన్ను ప్రాథమిక దశల్లో నొప్పి రావడం లేదుకదా! అని నిర్లక్ష్యం చేస్తే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. నిజానికి ఒకప్పుడు పిప్పిపన్ను వ్యాధి వస్తే, దానికి పరిష్కార మార్గం పన్ను తీసేయడమే! కానీ నేటి ఆధునిక చికిత్సా విధానాలలో పంటిని, బ్రతికినంత కాలం పటిష్టంగా ఆరోగ్యంగా సంరక్షించడమే సరైన చికిత్స. పన్ను తీయడం అనేది ప్రస్తుతం చికిత్సా విధానంలో ఆఖరి అంశం. అందుచేత తక్షణమే మీరు ఆ పంటిని తీయించుకోవడం ఆరోగ్యకరం.

మీ మరొక సందేహం విషయానికొస్తే, చివరి పన్ను తీయించుకోవలసి వస్తే దాని స్థానంలో కట్టుడు పన్ను పెట్టుకోవచ్చా? అని కదూ! అక్కడ కట్టుడు పన్ను(డెంచర్) పెట్టుకోవలసిన అవసరం లేదు. పూర్తి కట్టుడుపళ్లు (full dentures) లో కూడా చివరి పళ్ళు ఉండవన్న విషయం గమనించాలి.

కట్టుడుపళ్లలో జ్ణాన దంతం వుండదు.

మీకులా పిప్పిపళ్లు వున్నవాళ్లు ఎలాంటి ఆహార పదార్థం తిన్నా పలుమార్లు మంచి నీటితో నోరు పుక్కిలించాలి. లేని పక్షంలో పంటి నొప్పితో పాటు నోటి దుర్వాసన (హలిటోసిస్) వచ్చే అవకాశం ఉంటుంది.

~

మూల చికిత్స (రూట్ కెనాల్ ట్రీట్మెంట్ )

గత ఎపిసోడ్లలో ఈ విషయం గురించి చర్చించాను. అయినా మీ కోసం మళ్ళీ సంక్షిప్తంగా వివరిస్తాను.

ఈ మధ్య కాలంలో, దంత చికిత్సా విధానాలలో ‘మూల చికిత్స’ అనే మాట ఎక్కువగా వినపడుతున్న విషయం వాస్తవం. దానికి కొన్ని కారణాలు వున్నాయ్.

  • ఆధునిక దంత చికిత్సావిధానాలలో పన్ను తీయకుండా జీవితాంతం పన్నును సంరక్షించే విషయంలో మూల చికిత్స కొన్ని సందర్భాలలో బాగా ఉపయోగ పడుతున్నది.
  • ఈ చికిత్స చేయించుకునేవారికే కాకుండా చేసేవారికి లాభసాటిగా ఉండడం.
  • అవసరం లేకున్నా ధనాపేక్షతో మంచి పళ్లకు సైతం మూల చికిత్స చేసే అనైతిక దంతవైద్యులు, దంతవైద్య రంగంలో ఎగబడడం.

సద్వినియోగం చేసుకుంటే ఉద్దేశం మంచిదే. అయితే ఈ చికిత్స చేయించుకొనే ముందు, దంతవైద్యులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాకనే ఈ చికిత్సకు ఒప్పుకోవాలి.

~

ఈ చికిత్స ఎప్పుడు చేస్తారు?

కొన్నాళ్ల క్రితం పంటికి దెబ్బతగిలి తర్వాత పన్ను రంగు మారిపోయి పంటి మూల రంధ్రం వ్యాధిగ్రస్థం అయినప్పుడు, పన్ను తీయకుండా మూల చికిత్స చేయించుకోవచ్చు.

పిప్పిపన్ను వ్యాధి వచ్చి, ఫిల్లింగ్‌కు అనుకూలంగా లేనప్పుడు మూల చికిత్స ద్వారా పంటిని నిలబెట్టుకోవచ్చు.

వివిధ కారణాల వల్ల పంటి నమిలే భాగాలు అరిగిపోయినప్పుడు మూల చికిత్స చేయించుకోవచ్చు. (పళ్ళు జివ్వు మనే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు, ఫిల్లింగ్‌కు అనుకూలంగా లేనప్పుడు)

వివిధ కారణాల వల్ల పళ్ళు నిలువుగా అరిగిపోయినప్పుడు, ఆమ్లాల ప్రభావంతో కరిగిపోయినప్పుడు, మూల చికిత్స తప్పనిసరి.

ప్రమాదాలలో దెబ్బలు తగిలినప్పుడు పన్ను సగానికి పైగా విరిగిపోయినప్పుడు ఆ ముక్క తీయకుండా మూల చికిత్స చేయించుకుని దానిపైన కేప్ వేయించుకోవచ్చు.

మూల చికిత్స అంటే, పంటిలో జీవం లేకుండా దానిని నిర్వీర్యం చేయడమే, అన్న సంగతి మరచిపోకూడదు. అలాగే, మూల చికిత్స ఎందుకు చేయవలసి వస్తుందో దంతవైద్యులను అడిగి తెలుసుకోవాలి. మనం అడగకుండానే చికిత్స వివరాలు అందించవలసిన బాధ్యత దంతవైద్యులదే మరి! ముందస్తు దంతవైద్య పరీక్షలు ఎప్పుడూ ఆరోగ్యకరమే!!

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here