[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘విత్తనాలతో వైవిధ్య చిత్రాలు’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]వి[/dropcap]త్తనం మొక్కలోని భాగం. పువ్వు కాయగా మారి, కాయలో విత్తనాలు ఏర్పడతాయి. విత్తనం అంటే మరొక మొక్కకు జన్మనిచ్చే అమ్మ అన్నమాట. ఇందులో రెండు రకాలుంటాయి. మామిడి టెంక లాంటి ఒకే నిండు విత్తనము. రెండు అర్ధభాగాలుగా విడిపోమే కంది పప్పు లాంటి గింజలు. వీటినే వృక్ష శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఏక దళబీజాలు, ద్విదళ బీజాలు అంటారు. కాయ పండుగా మారితే మొత్తని గుజ్జు లోపల విత్తనాలుంటాయి. గుజ్జు అని గింజలు పారేస్తాం. కానీ కొన్నింటిని గింజల్నే తింటాం. పెసలు, శనగలు, బఠాణీలు వంటివి గింజల్నే తింటాం గానీ కాయల్ని తినము.
విత్తనాలు అనేవి ఎప్పుడూ కాయ లోపల భద్రంగా ఉంటాయి. మొక్క తన జాతిని పునర్నిర్మించుకోవటానికి అవసరమైన విత్తనాలను జాగ్రత్తగా కవచాలతో దాచుకుంటుంది. కానీ ఒకే ఒక చెట్టుకు కాయకు వెలుపలే విత్తనం ఉంటుంది. పండుకు బయటే విత్తనం ఉండటమేమిటి అనుకుoటున్నారా? దీనిలో కాయనూ తింటాం, విత్తనమూ తింటాం. ఆలోచించండి. చివర్లో చెప్తాను.
సరే ఏమిటీ విత్తనాల గోల అనుకుంటున్నారా, విత్తనాలను తినటమే కాదండీ బొమ్మలు కూడా చేయవచ్చు. ఎలానో చూడండి.
మొదటగా ఒక పువ్వు బొమ్మను చేసి చూపిస్తాను. ఇందులో ఆరు రెక్కలున్న పువ్వు, కాడకు రెండు ఆకులు మాత్రమే ఉంటాయి. ఈ పువ్వు పెద్దదిగా పొద్దు తిరుగుడు పువ్వులా ఉన్నది. దీనిలో కేవలం రెండు రకాల విత్తనాలను మాత్రమే ఉపయోగించాను. పువ్వు రెక్కల కోస. బ్రౌన్ రైస్‌ను ఉపయోగించాను. ఆరోగ్యానికి మంచిదని ఈ మధ్య ఎక్కవగా పాలిష్ పట్టని ముడి బియ్యాన్నే వాడుతున్నారు. బియ్యం గింజ మీద ఉండే గోధుమ వర్ణపు పొరలో ‘బి’ విటమిన్ ఉంటుంది. బ్రౌన్ రైస్‌లో కూడా చాలా వెరైటీలు దొరుకుతున్నాయి. పువ్వుకాడ కోసం, ఆకుల కోసం నేను ‘లోబియా’ అనే అలచందల గింజల్ని వాడాను. ఈ గింజల మెరుపును చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఆభరణాల్లో వాడే రత్నాల మెరుపును కలిగి ఉంటాయి. నేనయితే ఒక నెక్‌లెస్ కూడా చేసేసుకున్నాను. ఆలోచన వచ్చిన వెంటనే చేసేయాలి కదా! వీటిలో ఇనుముతో సహా అనేక పోషకాలు ఉంటాయి. రెడ్ కలర్, కాఫీ కలర్ కలిసినట్లుండే మెరుపున్న ఈ గింజలు ప్రోటీన్ నిల్వలను కలిగి ఉంటాయి. అందుకే ఈ మధ్య ఎక్కువగా వీటిని వాడుతున్నారు. ఇంతకీ పువ్వు బాగుందా!
ఇప్పుడు చెట్టు మీద కూర్చున్న గుడ్లగూబను తయారు చేయడం చూద్దామా! ఈ గుడ్లగూబను సపోటా విత్తనాలతో చేశాను. తీపి గుజ్జు మధ్యలో ఉండే సపోటా విత్తనాలు సైతం మెరుపును కలిగి ఉంటాయి. కాకపోతే రెండు మూడు రోజుల తరువాత మెరుపును కోల్పోతుంది. మీనాల్లాంటి కళ్ళు అని పొగిడే మగువల కళ్ళ కోసం నేను సపోటా గింజల్నే ఎక్కువగా వాడతాను. కానీ ఇందుకు భిన్నంగా ఇక్కడ గుడ్లగూబకు వాడాను. గుడ్లగూబ తల కోసం కూల్ డ్రింకు బాటిల్ మూత లోని తెల్లని ప్లాస్టిక్ కవర్‌ను వాడుకున్నాను. దానిమీద రెండు కళ్ళను గీశాను. చెట్ల కొమ్మల కోసం శంకు చెట్ల కాయల్ని ఉపయోగించాను. మా ఇంట్లో విపరీతంగా, అల్లుకు పోయిన శంకు పూల కాయల్ని దాచి ఉంచుకున్నాను. అవి ఎండి గలగలలాడుతూ ఉoటాయి. బాగా ఎండితే పగిలి విత్తనాలు బయటపడతాయి. మట్టినేల, మొగ్గలు, ఆకుల కోసం పారిజాతం చెట్ల విత్తనాలను ఉపయోగించాను. మా బెంగుళూరు ఇంట్లో పెద్ద పారిజాతం చెట్టు ఉన్నది. ఆ విత్తనాలను తెచ్చి బొమ్మల కోసం దాచుకున్నాను. పారిజాత పువ్వులు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. అలాగే శంకు పూలు కూడా శివునికి పెట్టే పూలే. అంతేకాక శంకు పూలను సహజ రంగుల కోసం ఉపయోగిస్తారు.
ఇప్పుడొక గొరిల్లా బొమ్మను చేద్దాం. దీనికిగాను రెడ్ బెర్రీ పండ్లను తీసుకున్నాను. ఇందులో చిన్నగా చెర్రీ పండ్లలా ఉండేవి దొరుకుతాయి. నా ఫోటోలో కనిపించినట్లుండే పెద్ద పెద్ద బెర్రీలు కూడా ఉంటాయి. ఇవన్నీ డ్రైఫ్రూట్స్ దుకాణాల్లో బాగా దొరురుకుతాయి. ఈ పండ్లు డయాబెటిస్‌ను తగ్గిస్తాయంటారు. అంతేకాక యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయని చెపుతారు. మా ఇంట్లో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. మా పిల్లలు తినటానికి తెచ్చకుంటే నేనేమో బొమ్మలు చేసేస్తుంటాను. ఆర్తరైటిస్, క్యాన్సర్, ఒబేసిటీ వంటి వ్యాధుల్ని తగ్గించేలా పనిచేస్తాయట. పొడుగ్గా ఉన్న ఒర బెర్రీని గొరిల్లా తల లాగా వాడాను. ఆ బెర్రీలో వచ్చిన ముడతలు గోరిల్లా ముఖ కవళికల్లా కనిపిస్తే ఇలా చేసేశాను. వీటిలో ‘రాస్ బెర్రిస్, బ్లాక్ బెర్రీస్, క్రాన్ బెర్రిన్, బ్లూ బెర్రీస్’ అని చాలా రకాలు ఉంటాయి. నేను వీటన్నిటితోనూ బొమ్మలు చేశాను. వీటిని బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో ఎప్పుడైనా తినవచ్చు.
ఇప్పుడు విత్తనాల పూల కొమ్మల్ని చేద్దాం. విత్తనాలతో వాటి సహజ రూపమైన చెట్లను, పూలను, కొమ్మల్ని తయారు చేస్తే బాగుంటుంది. ఎండు విత్తనాలతో పూలకొమ్మలు ఎన్నో చేశాను. అందులో ఇదొకటి, దీనిలో కూడా పారిజాతం చెట్టు విత్తనాలు, శంకు కాయలు, సపోటా విత్తనాలు ఉపయోగించాను. ఈ మధ్య సపోటా పళ్ళు ఎక్కువ రావడంతో తిన్నతర్వాత విత్తనాలను ఎండబెట్టి దాచాను. ఇంకా వీటిలో ఆసుపత్రి వ్యర్థాలను కూడా ఉపయోగించాను. శంకు కాయల కొమ్మలకు సపోటా గింజల ఆకులు మొలిచాయి. ఈ కొమ్మకు పారిజాత విత్తనాల పూలు పూచాయి. ఇన్ని రకాలను కలిపి హైబ్రీడ్ మొక్కల్ని నేను కాక మరెవరైనా సృష్టించారా? చూడండి ఎంతందoగా ఉన్నాయో!
అవిశ గింజలతో చెట్టెక్కిన పిల్లల జంటను తయారు చేద్దాం. బలమైన చెట్టు కాండం కొరకు చింతగింజల్ని పెట్టాను. అక్కడక్కడా సపోటా గింజలు కూడా వచ్చి కూర్చున్నాయి. కాండం బలంగా ఉండటానికి పారిజాత చెట్టు గింజలు కూడా వచ్చి అతుక్కనాయి. చెట్టు మీదెక్కిన పిల్లల్ని అవిశ గింజలతో చేశాను. అవిశ గింజలతో కారప్పొడి కొట్టుకుని ఇడ్లీలలో, దోశలలో, కూరల్లో తింటున్నారు. దీని వలన బరువు తగ్గుతారని నమ్మడంతో ప్రతి ఇంట్లో వాడుకుంటున్నారు. ఫ్రై చేసిన అవిశ గింజలు డబ్బాలలో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. మామూలు అవిశ గింజలు నమిలితే బంకలా ఆతుక్కుపోయినట్లుంటాయి. ఇంతకీ ఈ గింజల చిత్రాలు బాగున్నాయా?
నేను మొదట్లో ఒక ప్రశ్న అడిగాను, సమాధానం తెలిసిందా? జీడి పప్పు సమాధానం జీడికాయ బయట జీడిపప్పు ఉంటుంది.