అందమైన దృశ్యకావ్యం గోవా

0
4

[శ్రీ ప్రమోద్ ఆవంచ గారి ‘అందమైన దృశ్యకావ్యం గోవా’ అనే రచనని అందిస్తున్నాము. ]

[dropcap]గో[/dropcap]వా..

ఒక అందమైన దృశ్యకావ్యం.

అక్కడి సముద్రం మరీ అద్బుతం. ఒడ్డున నిల్చుంటే ఎన్నో ఆలోచనల అలలు తీరాన్ని తాకేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అంతా నిశ్శబ్దం ఒక్క అలల హోరు తప్ప.. చెవులు వింటున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చూసే హృదయం స్పందిస్తుంది.. స్పందించే హృదయం ఒక గులాబీ మొగ్గలా విచ్చుకుంటుంది. కానీ మొగ్గ కింద ఉన్న ముల్లు చేసే గాయంతో.. మనసును పలికే ప్రతి పదం కవిత్వం అవుతుంది.. చెరిగిపోని జ్ఞాపకం అవుతుంది. తీర్చలేని వ్యథను మిగిలిస్తుంది.

అవును గాయం నుంచే కవిత పుడుతుంది. ఆ గాయం కేవలం మనసుకు మాత్రమే పరిమితమైనది. ఎవరితోనో చెప్పుకుంటే తీరేది కాదు. తనలో మథనపడి, తనలో తాను కోల్పోయి, బాహ్య ప్రపంచానికి అవసరం లేని తన బాధతో సహజీవనం చేస్తూ, ఊహిస్తూ, ఊహలతో మాట్లాడుతూ, ఆకాశంలో విహరిస్తూ, నింగి నేలా రెండింటినీ ఒకటి చేస్తూ ఉంటే అకస్మాత్తుగా స్వప్నం చెదిరిపోతే మస్తిష్కం తనతో తాను కుస్తీలు పడుతుంటే కల తేలిపోయి, నిజం కళ్ళ ముందు కనిపిస్తుంది. రోజు ముగుస్తుంది. కొద్దిరోజులకు రోజులు మసకబడుతాయి.

రోజులు గడిచేకొద్దీ ఆ పాత మధురాలు జ్ఞాపకాలు అవుతాయి. జీవితం అంటే జ్ఞాపకాలతో బాధ పడడమేనా, ఒంటరితనాన్ని అనుభవించడమేనా.. ఒంటరిగా గత ఆనందాలను తలుచుకుంటూ ప్రస్తుత జీవితాన్ని ఆస్వాదిస్తే అది పాజిటివ్ సైన్ అని అనుకోవాలా.. ఏమో ఏమీ అర్ధం కాని స్థితి.

గోవా.. సముద్రం.. కండోలిమ్ బీచ్:

నేను మిత్రుడు సాహిర్ భారతిని అడిగా. గోవాలో జనాలు తక్కువగా ఉండే బీచ్ ఏదో చెప్పమనీ, దానికతడు కండోలిమ్ బీచ్ పేరు చెప్పాడు. సాహిర్ భారతి గోవాకు  సంబంధించినంత వరకు నాకు చాలా ఇంపార్టెంట్.

ఎందుకంటే గత ఏడేళ్ల నుంచి తన రిసార్ట్స్‌లలో వేలాది మంది పర్యాటకులకు గోవా చారిత్రాత్మక స్థలాలను, అక్కడి బీచ్ లలో ప్రకృతి అందాలను, చూపిస్తూ, తాను, జీవిస్తూ,పది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు. సాహిర్ భారతి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం చేసే ఉద్దేశం లేక స్వంతంగా బిజినెస్ చేస్తూ పదిమందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో చాలా వేగంగా కాలంతో పరుగెతున్నాడు. ఆ యువకుడికి చాలా గొప్ప గోల్స్  ఉన్నాయి. తాను వంద కోట్లకు చేరుకునేంత వరకు విశ్రమించేది లేదని, తన లక్ష్య సాధన దిశగా అహర్నిశలూ శ్రమిస్తున్నాడు. తన మాటలో స్పష్టత, తాను అనుకున్నది సాధించాలన్న తపన, పట్టుదల, కాలంతో పోరాటం చేసే ఆ కసి, ఆ ధైర్యం.. తనలో నాకు కనిపించాయి.

ఇంజనీరింగ్ చదవడం వల్ల తనకు లాజికల్ థింకింగ్‌తో పాటు, భవిష్యత్తులో తాను చేసే పని మీద మంచి క్లారిటీ ఉన్నట్లు నాకు అనిపించింది. సాహిర్ ప్రముఖ కవులు యాకూబ్, శిలాలోలిత గార్ల రెండవ కుమారుడు. ఒక వారం క్రితమే సాహిర్ భారతి ఒక కొడుకుకు తండ్రి అయ్యాడు..

కట్ చేస్తే..

గోవా కండోలిమ్ బీచ్.. జన సాంద్రత, సందోహం తక్కువగా ఉండే ప్రాంతం. నార్త్ గోవాలో దాదాపు ఆరు బీచ్‌లు ఉన్నాయి. ఒక్క కండోలిమ్ బీచ్ తప్ప అన్నింట్లో విపరీతంగా రష్ ఉంటుందని సాహిర్ చెప్పాడు. ఆకాశం మేఘావృతమై ఉంది. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి.. కారు డ్రైవర్ ప్రతాప్ సొంతూరు గోవా అని చెపుతున్నాడు, కానీ కొంకణి భాష మాట్లాడడం లేదు. నార్త్ గోవాలో డిల్లీ, ముంబై, కర్నాటక ప్రాంతాల వాళ్ళు బిజినెస్ లలో ఎక్కువగా ఉన్నారు. ప్రతాప్ మరాఠీ, హిందీ బాగా మాట్లాడుతున్నాడు. గురువారం ఉదయం మోప లోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో దిగినప్పటి నుంచి ప్రతాప్ చాలా బాగా రిసీవ్ చేసుకొని అర్పూరలో నేనుండే రిసార్ట్స్ తీసుకెళ్ళడమే కాకుండా మార్గమధ్యంలో ఒక ఉడిపి హోటల్ దగ్గర టిఫిన్ కోసం ఆపాడు. ఈ లోపల సాహిర్ నుంచి ప్రతాప్‌కి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మోప నుంచి అర్పుర వరకు నలబై కిలోమీటర్ల దూరం. దారిలో పిలెర్నే, మపూస, నగోవా ఊర్లు కనిపించాయి. ఈ ఊర్లన్నీ నార్త్ గోవా లోని టూరిస్ట్ ప్రాంతాలకు దగ్గరగా ఉంటాయి. కొన్ని ఊర్లు బార్దేజ్ తాలూకాలో ఉన్నాయి.

అక్కడి అధికార భాష కొంకణి. కానీ నార్త్ గోవాలో చాలా వరకు హిందీ భాషనే మాట్లాడుతున్నారు. ప్రతాప్ అతి జాగ్రత్తగా, మెల్లగా డ్రైవింగ్ చేయడం వల్ల రిసార్ట్‌కి ఒక గంట సమయం పట్టింది. రిసార్ట్స్ మేనేజర్ దిలీప్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి, ఫ్లాట్ కీస్ ఇచ్చాడు. అది ఒక సింగిల్ బెడ్రూం ఫ్లాట్.

ఒక బెడ్రూం, ఓపెన్ కిచెన్, హాల్, కిచెన్‌లో వండుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సాధారణంగా ఎవరూ అక్కడ వండుకోని తినరు. ఇక్కడ కోడి కూయక ముందే లేవడం వల్ల ఒక గంట రెస్ట్ తీసుకొని లంచ్ కోసం సాహిర్ చెప్పిన గోవన్ రెస్టారెంట్‌కి వెళ్ళాను.

అక్కడ సీ ఫుడ్ ఫేమస్. వెజ్ కూడా దొరుకుతుంది. అక్కడ భోజనం కానిచ్చేసి, నార్త్ గోవా ఫోర్ట్‌కి వెళ్ళాను. ఆశ్చర్యం అక్కడ అంతా తెలుగు వాళ్ళే. కరీంనగర్ నుంచి ఒక గ్యాంగ్‌గా కొందరు వచ్చారు. వాళ్ళతో ఫోటోలు దిగడమే కాకుండా నేనూ కొన్ని ఫోటోలు దిగాను. ఫోర్ట్ వెనక వైపు  కనుచూపు మేరలో పెద్ద సముద్రం అద్బుత దృశ్యం.

ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటే ఫోర్ట్ మీద వున్న నాకు నాకూ రెక్కలు ఉంటే ఎంత బాగుండేదన్న ఆలోచన వచ్చింది. సముద్రం అలలు కోట గోడలకు తగులుతుంటే.. దాన్ని చూస్తుంటే ఎంత బాగుందో.

చూడడానికి రెండు కళ్లు చాలవు. జీవితమంతా ఆ అలలను చూస్తూ గడిపేయవచ్చు.

***

ప్రతాప్ నన్ను కండోలిమ్ బీచ్ దగ్గర దింపాడు. నేను మెల్లగా అడుగులు వేసుకుంటూ బీచ్ లోపలికి వెళ్ళాను. దారికిరువైపులా షాపులు, రకరకాల వస్తువులు అమ్ముతున్నారు. వాటినన్నింటిని దాటుకుంటూ బీచ్ లోకి ఎంటర్ అయ్యాను. ఆకాశం మేఘావృతమై ఏ క్షణమైనా మేఘం గర్భాన్ని చీల్చుకుని వర్షం చినుకుల సవ్వడితో నన్ను తడిపేందుకు సిద్ధంగా ఉంది. ఆహ్లాదకరమైన దృశ్యం. చల్లగా వీచే గాలి. శరీరం చల్లని  గాల్లో తేలుతూ ఉంది. ఇంతకన్నా ప్రశాంతత  మనసుకు వేరొకటి ఉంటుందా.. నడుస్తున్నాను, నా పక్క  నుంచి నలుగురు యువకులు తెలుగులో మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ వెళుతున్నారు. వాళ్ళ వైపు పలకరింపు నవ్వొకటి విసిరి, అలాగే నడుచుకుంటూ బీచ్ లోకి వెళ్ళాను. సాహిర్ చెప్పినట్లుగా అక్కడ చాలా తక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళు కడలిని  కెమెరాలో బంధించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.

అది సాధ్యమా.. నేను వాళ్ళకు దూరంగా, ఒడ్డున కొంత దూరం నడుస్తున్నాను. అలలు ప్రతి నిమిషం నా కాళ్ళను ముద్దాడుతూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి అల ఉదృతి ప్రేమతో నా కాళ్ళను, నన్నూ తనతో లాక్కెళ్ళేందుకు ప్రయత్నిస్తుంది. అదొక అందమైన అనుభూతి. ఇసుకపై నా పాదాల అడుగులు ఒరిస్సా పట్నాయక్ రూపొందించే సైతక శిల్ప రూపాన్ని పోలి ఉన్నాయి. వెనక్కి ఒక్కసారి చూస్తే నేను నడిచిన అడుగుల పాదాలను అల తనలో కలుపుకుంటుంది. నా మనసుతో మాట్లాడేందుకు అంగీకారం తెలిపినట్లుంది. నన్ను భరించడానికి, నా పిచ్చి సోదిని వినడానికి ఒప్పుకున్నట్లుంది. కొంచెం దూరం వెళ్ళి ఒడ్డున కూర్చున్నాను. తన అంగీకారాన్ని వ్యక్తపరుస్తూ దూరం నుంచి ఒక అల చాలా ఉత్సాహంగా నన్ను చేరింది. అంతే వేగంగా వెనుదిరిగింది. వెళుతూ వెళుతూ “నువ్వు మాట్లాడుతుంటే నీ బాధని మద్య మద్యలో వెనక్కి వెళ్ళి కడలి లోతుల్లోకి వెళ్లి ఆక్కడికి చేరవేస్తా. నీ మస్తిష్కంలో ప్రవహించే లక్షల ఆలోచనలు క్షణ క్షణానికి మారిపోతుంటాయి. వాటికి రూపం ఉండదు. క్షణం క్రితం ఉన్న ఆలోచన మరో క్షణంలో మాయమవుతుంది. సముద్రం నీ సమస్యలకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది భయపడకు” అని చెప్పింది. కొద్దిసేపు వరకు ఏ అలా నా దరికి చేరలేదు. ఆ క్షణం నా మస్తిష్కం కొద్దిసేపు స్తంభించింది, కళ్ళు తెరుచుకొనే ఉన్నాయి. సముద్రాన్ని చూస్తూనే ఉన్నాయి. ఎలాంటి కదలిక లేదు. వెనక్కి పెట్టిన నా చేతులు ఇసుకలోకి దూసుకుపోయాయి. అంతలోనే ఏదో తడి.. నీళ్ళ తాలూకు నురుగు, నా కాళ్ళను తాకింది.. అంతే ప్రస్తుతంలోకి వచ్చాను.

మస్తిష్కం పనిచేయడం ప్రారంభించింది. చేతులను చాలా సేపు వెనక్కి పెట్టాను కదా అందుకే తిమ్మిర్లు ఎక్కాయి.

చేతులను ఇసుకలో నుంచి బయటకు తీసాను. ఆ స్థలంలో నా చేతులకు సంబంధించిన అచ్చులు చాలా లోతులో దిగబడినట్లుగా కనిపించాయి. ఏమయింది ఎక్కడ విహరిస్తున్నావు ఈ ప్రపంచంలో లేవా అంది అల.

పరీక్షగా చూసాను.. అల చాలా ఉత్సాహంగా ఉంది. ఒక గుంపుగా పరుగులు తీస్తూ వచ్చి నన్ను తాకి.. నువ్వంటే ఇష్టం అంటూ నవ్వుతూ, కవ్విస్తూ వెనక్కి తిరిగి వెళుతుంది. లేచి పట్టుకోవడానికి ప్రయత్నం చేసాను. వెంట పరిగెత్తాను. అందుకోలేకపోయాను. కొద్ది దూరం లోతుల్లోకి వెళ్ళాను. పట్టుకున్నాను అని భ్రమ పడ్డాను. పిడికిలి విప్పి చూసాను. అంతా శూన్యం. తడిగా ఉన్న ఖాళీ చేతులతో ఒడ్డుకు చేరాను.

నిరాశ నన్ను ఆవహించింది. ఏదో ఒంటరితనం నన్ను వెంటాడుతూనే ఉంది. కళ్ళు సముద్రం లోతుల్లో వెతుకుతున్నాయి. ఉన్నట్లుండి ఒక ఉరుము ఉరిమింది. ఆకాశం వైపుకు తలెత్తి చూసాను. చినుకు కింది పెదవిని తాకి కిందికి జారింది. మస్తిష్కం లోతుల్లో  జ్ఞాపకాలకు చలనం వచ్చింది. నా కోసమే అనుకుంటా ఒక అల ఒడ్డుకు కొట్టుకొస్తూ కనిపించింది..

గోవాలో ఇంకా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోవల్సింది ఇంకా వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here