పడమటి సూరీడు

0
3

[వేలూరి ప్రమీలా శర్మ గారు రచించిన ‘పడమటి సూరీడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఏ[/dropcap]టి గట్టుమీదనున్న రావిచెట్టు కింద కూచుని చేతిలోకి చిన్న చిన్న రాళ్లు తీసుకుని నీటిలోకి విసురుతూ, ఆలోచనల సుడిగుండాల లోతును కొలిచే ప్రయత్నం చేస్తున్నాడు సూర్యం. ‘రాయి విసిరినప్పుడల్లా నీటిలో ఏర్పడుతున్న భ్రమణాలు, వాటి కింద తిరుగుతున్న చేపల్లో అలజడి కలిగిస్తున్నాయి. అయినా ఈదడం మానవు కదా! మరి ఆటుపోటులు తట్టుకోలేక మనిషి ఎందుకింత అలసిపోతున్నాడు?’ తన మనసులో కలిగిన ఆలోచనలకి నిర్లిప్తంగా నవ్వుకున్నాడు సూర్యం.

ఒడ్డున ఉన్న రావి చెట్టు, ఎన్నో ప్రాణులకి ఊరటనిస్తోంది. కొమ్మలపై చేరిన పిట్టలు, రావి కాయల్ని ముక్కుతో పొడిచి కింద పడేస్తున్నాయి. మరోపక్క నల్లని కండ చీమలు కొన్ని, ఒకదాని వెనుకొకటి లైనుగా ఆదరాబాదరాగా పైకీ, కిందకీ పరుగెడుతున్నాయి. బలంగా వీచిన గాలికి నాలుగైదు పండుటాకులు రాలి, కిందనున్న ఏటిలో పడ్డాయి. తేలుతున్న ఆకు ఒకదానిపైకి ఎక్కిన కండచీమ, ఎటుపోవాలో తెలీక గందరగోళ పడుతోంది.

సరిగ్గా యాభై నాలుగేళ్ల క్రిందట పుట్టిన సూర్యం జీవితం కూడా అలాగే ఉంది. ఆరుగురు సంతానంలో ఆఖరివాడుగా పుట్టిన సూర్యాన్ని తల్లి చాలా గారాబంగా పెంచింది. అందుక్కారణం ఐదుగురు అమ్మాయిల తర్వాత పుట్టిన ఏకైక మగ సంతానం కావడమే. అందరూ అమ్మచేతి గోరుముద్దలు తినే పెరుగుతారు. కానీ సూర్యాన్ని మేనత్త తాయారు కూడా గోరుముద్దలు తినిపిస్తూ పెంచింది. తనకీ, సూర్యానికీ వయసులో పదహారేళ్లు తేడా ఉండడంతో రోజూ తల దువ్వి బట్టలు తొడగడం, అన్నం తినిపించడం చేస్తూ, వదినగారికి ఇంటిపనుల్లో సాయంగా ఉంటూ, ఆమె బాధ్యతల్ని తాను కూడా పంచుకునేది తాయారు.

గారాబం ఎక్కువయ్యి పెంకితనం పెరగి, చాలా అల్లరి చేసేవాడు సూర్యం. చదువు వంటపట్టక అల్లరి చిల్లరగా తిరుగుతూ, ఇంటా బయటా అందరికీ తలనొప్పిగా మారాడు. నిలకడ లేని సూర్యం మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న మేనత్త తాయారు, అతని జీవితం గాడిలో పడేలా చేసింది. సూర్యానికి అక్షరాలు దిద్దించి, చదువు నేర్పించడంలో గురువయ్యింది. ఎంతో ఓర్పుగా అన్ని విషయాలూ బోధపరుస్తూ, ఎవరితో ఎలా మెలగాలో లాలనగా చెబుతుండేది. తనని ఎంతో ప్రేమగా చూసుకునే మేనత్త తాయారంటే సూర్యానికీ ప్రాణం.

తాయారుకి పెళ్లయినా, భర్తకి దూరదేశాల్లో ఉద్యోగం కావడంతో ఎక్కువగా పుట్టింట్లోనే ఉండేది. కొద్ది సంవత్సరాల తర్వాత అతను తిరిగి వచ్చినా, రకరకాల కారణాలు చెప్పి తాయారుని పుట్టింట్లోనే వదిలేసాడు తప్ప, కాపురానికి తీసుకు వెళ్లలేదు. దాంతో ఇంట్లో అందరికీ అన్నీ అమర్చి పెడుతూ, నాలుగు గోడల మధ్యనే బతకడం అలవాటు చేసుకుంది తాయారు. మనసుకి ఏదైనా బాధ కలిగితే, పెరట్లో పెంచుకుంటున్న పూల మొక్కలకి చెప్పుకుని ఊరటపొందేది. ఎంతో అందంగా పూసిన పూలు, మర్నాటికి కళావిహీనమైపోవడం చూసి, నొచ్చుకునేది. పచ్చగా ఉండగా పరిమళాలు వ్యాపింపజేసే పువ్వు లాగే, కాలంతోపాటే కరిగిపోయే మనిషి జీవితం కూడా పరిమళాలు వెదజల్లాలని భావించేది తాయారు. ఇంటిముందు పెరుగుతున్న బొగడచెట్టు అంటే ప్రాణం ఆమెకు. బొగడపూలు మాలకట్టి వినాయకుడికి వేస్తే, ఎలాంటి అరిష్టాలూ ఉండవని తలచే ఆమె, ఓసారి వేడి గాలుల తీవ్రతకు ఆ చెట్టు ఓ పక్కనుంచి నల్లగా మాడిపోవడం గమనించి, దానిని కీడుకి సాంకేతంగా భావించి కలవరపడింది. అప్పుడే తెలిసింది.. ఆ ఇంటి యజమానురాలు క్యాన్సర్ బారిన పడిందని.

తన తల్లికి నలభై ఎనిమిదేళ్లు వచ్చేసరికి గర్భసంచికి కాన్సర్ సోకి మరణించడం సూర్యాన్ని కలచివేసింది. భార్య మరణించాక, మౌన యోగిలా మారిన తండ్రి, ఎప్పుడు చూసినా పడక్కుర్చీలో కూచుని, శూన్యంలోకి చూస్తూ ఆలోచించేవాడు. అందరి మధ్యనా ఉన్నా తండ్రి ఒంటరితనంతో కుంగిపోతున్నాడని తెలిసి, సూర్యం చాలా బాధపడేవాడు. ఇంటి కోడలిగా వచ్చిన రమ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా, మామగారికి అన్నీ చేతివరకూ అందించాల్సివస్తోందని విసుక్కునేది. ఎన్నిసార్లు చెప్పినా భార్య ప్రవర్తనలో మార్పు రాక విసిగిపోయాడు సూర్యం. పైగా ఊరు వదిలి, దూరంగా పోయి ఉద్యోగం వెతుక్కుని, వేరు కాపురం పెడదామని నస పెట్టేది. చీటికీ మాటికీ తాయారమ్మ తనని ఆరళ్లు పెడుతున్నట్టు భర్తకి ఫిర్యాదు చేసేది. ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో తండ్రి బాధ్యతను, మేనత్త తాయారుకి అప్పగించి, తాను తన కుటుంబంతో హైదరాబాద్‌లో కాపురం పెట్టాడు సూర్యం. నెలనెలా డబ్బు పంపిస్తూ, వీలున్నప్పుడల్లా తండ్రినీ, మేనత్త తాయారునీ చూసి వచ్చేవాడు.

అన్న బిడ్డలందరినీ తన బిడ్డల లాగే పెంచి పెద్దచేసి, వాళ్ల పెళ్లిళ్లు పురుళ్ళు కూడా తన చేతి మీదనే జరిపించింది తాయారమ్మ. రెక్కలు వచ్చిన పక్షులు గూడు విడిచి వెళ్ళినట్టే, అందరూ ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు. అన్నగారి మరణం తర్వాత ఆ ఇంట్లో తాయారమ్మ ఒక్కతే ఒంటరిగా మిగిలిపోయింది. ఏదైనా పండగలు వచ్చినప్పుడు మాత్రం అక్క చెల్లెళ్ళూ, సూర్యం అందరూ తమ తమ కుటుంబాలతో ఊర్లో కలుసుకునేవారు. వాళ్ళందర్నీ చూసి, తన పిల్లలు తన దగ్గరకు వచ్చినట్టు మురిసిపోయేది తాయారు.

ఆ నాలుగు రోజులూ సందడిగా గడిచేవి. తరువాత ఎవరిదారి వారిదే. వీలున్నప్పుడు ఫోన్లలో పలకరించుకోవడానికే పరిమితమైపోయారు.

***

పిల్లలిద్దరూ అమెరికాలోనే సెటిల్ అయిపోవడంతో తరచూ వారి అవసరాలకోసం అమెరికా వెళ్లి రావడం రమకి తప్పలేదు. పెరుగుతున్న వయసుతోపాటు అనారోగ్యాలు కూడా పెరుగుతున్నాయి. కరోనా వచ్చి తగ్గినప్పటినుంచీ, చిన్న చిన్న పనులకే అలసట కమ్మేస్తుంటే, ఉద్యోగ బాధ్యతల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు సూర్యం. రమ మాత్రం ఈ బంధాలూ, బాధ్యతల ఆరాటంలో కొట్టుకుపోతోంది. కానీ సూర్యం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

డెబ్భయ్యోపడిలో ఉన్న అత్తయ్య తాయారు ఊర్లో ఒంటరిగా బతకడం, క్షణక్షణం ఆమెకెలా వుంటుందోనన్న ఆందోళనతోనే గడుపుతున్నాడు. ప్రకృతి ఒడిలో సేదదీరుతూ కాలం వెళ్ళదీస్తున్న తాయారత్తయ్యను తమ దగ్గరకి తీసుకువెళ్దామంటే.. కలుషితమైన వాతావరణంతో నిండిపోయిన సిటీకి రావడానికి ఒప్పుకోదని తెలుసు.

“ఎప్పటికప్పుడు డబ్బు పంపుతూనే ఉన్నావు కదా.. ఇప్పుడు నాకేం లోటు వచ్చిందని? నేనిక్కడ బాగానే వున్నాను.. అనవసరంగా బెంగ పెట్టుకోకు” ఫోనులో ఈ మాటలు అన్న మరుసటిరోజే, అత్తయ్య తాయారు పెరట్లో పూలు కోస్తూ, తలతిరిగి పడిపోయిందని తెలిసి పరిగెత్తుకొచ్చాడు సూర్యం.

మేనల్లుడు తనకోసం వచ్చాడని తెలియగానే, మంచం మీదనుండి దిగ్గున లేచి కూచుంది తాయారు. ఆమె గుండెల్లో గూడు కట్టుకున్న దిగులంతా చెదిరిపోయింది.

ఆమె ఆలోచనలూ, జ్ఞాపకాలలో సూర్యం ఇంకా చిన్నపిల్లాడిగానే ఉన్నాడు. పెరిగే వయసు శరీరానికే కానీ, మనసుకి కాదన్నట్టు.. రోట్లో మావిడికాయలు తొక్కి, ఎండబెట్టి చేసిన తొక్కుడుపచ్చడి వేసి, ఎర్రగా కంచం నిండా అన్నం కలిపి, పక్కన నంజుకోడానికి వెన్నముద్ద పెట్టి, సూర్యానికి గోరు ముద్దలు తినిపిస్తూ మురిసిపోయింది తాయారు. ఆ మావిడికాయలు పెరట్లో చెట్టుకి కాసినవి. తన తండ్రి చనిపోయే మూడు నెలల ముందు, అంటు కట్టిన చెరుకురసం చెట్టు ఈరోజు పెరిగి పెద్దదై, కాయలూ, పళ్ళూ ఇస్తోంది. ఆ చెట్టుకి కాసినవి తప్ప.. మందులు వేసి ముగ్గబెట్టే వేరే పళ్ళు తినడానికి ఇష్టపడని తాయారత్త పంచే స్వచ్ఛమైన ప్రేమ కోసమే వేసవిలో తప్పనిసరిగా ఆ ఊరు వచ్చి, ఓ ఇరవై రోజులైనా అక్కడ ఉంటాడు సూర్యం.

అత్తయ్య చేతిని బుగ్గకి ఆనించి పెట్టుకుని, ప్రేమగా అరచేతిని ముద్దాడాడు సూర్యం. ‘వెర్రి నాగన్నా’ అంటూ తల మీద చెయ్యి వేసి, మేనల్లుడిని దగ్గరకి తీసుకుంది తాయారు.

ఆమె కోసం తెచ్చిన నేత చీరను చేతిలో పెట్టి, ఆమె కాళ్లకు దణ్ణంపెట్టాడు.

“ఈ వయసులో నాక్కావాల్సింది ఇవి కాదురా! అంత దూరం నుంచి నాకోసం వచ్చావు, అది చాలు” అన్న మేనత్త తాయారు మాటలకి సూర్యం కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి.

***

వారం రోజులు గడిచాక తిరిగి హైదరాబాద్ వెళ్ళడానికి బెంగగా అనిపించింది సూర్యానికి.

“అత్తయ్యా! నిన్నీ పరిస్థితిలో ఒక్కదాన్నీ ఇలా వదిలేసి వెళ్లలేను. నాతోపాటు నువ్వుకూడా హైదరాబాద్ వచ్చెయ్యరాదా? కొన్నాళ్ళు ఊరు మారితే ఆరోగ్యం కూడా బాగుంటుందనిపిస్తోంది. కాదనకు, ఒక్కసారి ఆలోచించు” ప్రాధేయపడుతూ అడిగాడు సూర్యం.

“ఈ ఇల్లు మీ నాన్న కట్టింది రా! ఈ ఇంట్లో ప్రతి ఇటుకలోనూ మీ నాన్నని నేను చూసుకోగలను. ఇక్కడ నాకు ఏ భయం లేదు. చెప్పాలంటే నీకన్నా నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. ఇంతవరకు నాకు బీపీ గాని, షుగర్ గాని రాలేదు. కానీ నువ్వు చూడు.. మోకాళ్ళ నొప్పులతో సరిగ్గా నడవలేక పోతున్నావ్. బీపీ బిళ్ళ పడితే కానీ బండి నడవదు నీకు. రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నావు. ఆ కలుషితమైన వాతావరణాన్ని వదిలేసి హాయిగా ఈ పల్లెటూరికి వచ్చేయరా.. అందరం కలిసి ఉందాం అంటే వినవు. ఇక్కడి స్వచ్ఛమైన గాలికి ఎలాంటి అనారోగ్యాలు దగ్గరికి రావు. తెల్లారితే ఆత్మీయంగా పలకరించేందుకు చుట్టూ ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉన్నారు. నాకు లోటేముంది చెప్పు?” అంటున్న తాయారత్తయ్య మాటలు సూర్యాన్ని చాలా ఆలోచింపచేసాయి.

‘అత్తయ్య చెప్పింది నిజమే.. స్వచ్ఛమైన చెరువు నీరు తాగినన్నాళ్ళు నా ఆరోగ్యం బాగానే ఉంది. ఆర్వో వాటర్ పుణ్యమా అని ఎముకల్లో బలం తగ్గిపోయింది. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. పెరట్లో కాసిన కాయగూరలూ, మునగాకు నూరి చేసిన పొడులూ, పచ్చళ్ళూ.. ఇవన్నీ అత్తయ్య ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచాయి. నాకు కూడా ఇక్కడికి వచ్చి, పల్లె వాతావరణంలో హాయిగా గడపాలని ఉంది. కానీ సిటీ లైఫ్‌కి అలవాటు పడిపోయిన రమ, ఒక్క రోజు కూడా ఇక్కడ ఉండడానికి ఒప్పుకోదు. ఇక్కడికి వచ్చాక నా అనారోగ్యం బాధించట్లేదు. ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది. కానీ తిరిగి వెళ్ళాలి తప్పదు’ మనసులోనే భారంగా అనుకున్నాడు సూర్యం.

ప్రకృతితో మమేకమై జీవిస్తున్న తాయారత్త.. కాంక్రీటు అడవుల్లోకి రావడానికి ఇష్టపడదని తెలుసు. ఆమె ససేమిరా అనడంతో చేసేదేమీ లేక, తాయారత్తకి ఆసరాగా ఉండడానికి మనిషిని ఏర్పాటు చేసి, తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. వెళ్లేముందు కాసేపు ఏటి ఒడ్డున ఒంటరిగా కూచోవాలనిపించి అటువైపు వెళ్ళాడు.

***

ఏటి ప్రవాహంలో మునకలు వేస్తున్న చేప పిల్లలు, నీటి వాలుతో కొట్టుకుపోతున్నా, రెట్టించిన ఉత్సాహంతో తిరిగి గెంతుతున్నాయి. కాసేపు అక్కడ కూచుని సేదదీరిన సూర్యం లేచి, ఇరవై మీటర్ల దూరంలో ఉన్న శివాలయం వైపు అడుగులు వేసాడు. చలికి కొద్దిగా కండరాలు పట్టేసినట్టు అనిపించాయి. వెంటనే తాయారత్త గుర్తొచ్చి, కళ్ళల్లో నీళ్ళు పెల్లుబికాయి. అత్తయ్యకి ఈ మధ్య అడుగు వేస్తుంటే ఆయాసం వస్తోంది. ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టరు చేత వైద్యం చేయించుకుంటోoదే తప్ప, పెద్ద ఆసుపత్రికి వచ్చి ఈసీజీలు, ఎకో లు చేయించుకోడానికి కూడా ఇష్టపడట్లేదు.

“ఇక్కడే ఉంటే మరో నాలుగు రోజులు సంతోషంగా ఉంటాను. పెద్దాస్పత్రిలో మిషన్లు చూపించే రీడింగుల మీద ఆధారపడి చేసే వైద్యం, నాకు సరిపడదురా. నడిచినన్నాళ్ళు ఇలాగే నడవనియ్యి. ఆయుష్షు తీరితే ఈ ఊపిరి అదే ఆగిపోతుంది. పోయే ప్రాణాన్ని పట్టుకుని ఆపడం ఎందుకు? బలవంతంగా బతికే ప్రయత్నం చెయ్యకూడదు. రోజూ ఫోన్లు చేసి మాట్లాడుతున్నావుగా.. నాకేమీ పర్వాలేదు” అన్న అత్తయ్య మాటలు గుర్తొచ్చి సూర్యo మనసు భారమయ్యింది.

జేబులో ఫోను అదేపనిగా మోగుతుంటే తీసి చూసాడు. భార్య రమ..

“ఏమండీ! ఈ రోజైనా బయలుదేరుతున్నారా లేదా? ఇప్పటికే వారం రోజులు అయ్యింది. ఇక్కడ ఇంటి పనీ, బయట పనీ ఒక్కదాన్నే చేసుకోలేక చాలా ఇబ్బందిగా ఉంది. తొందరగా వచ్చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను.. వచ్చేటప్పుడు పెరట్లో చెట్లకు కాసిన కాయగూరలూ, పళ్ళూ ఏమైనా ఉంటే తీసుకురండి. మందు వెయ్యకుండా పండించినవి కదా.. బాగుంటాయి. అన్నట్టు మీ విషయం అడగడం మర్చిపోయాను.. టైముకి తింటున్నారా లేదా?” మొక్కుబడిగా అంటున్న భార్య మాటల్లో, ప్రేమ పలచనవడం గమనించి పేలవంగా నవ్వుకున్నాడు సూర్యం. ఒక్క మాట కూడా తాయారు అత్తయ్య గురించి అడగకపోవడంతో నొచ్చుకుని, ముక్తసరిగా సమాధానం చెప్పి ముందుకు నడిచాడు.

గుడి బయట చెప్పులు విడిచి, లోపల ఆవరణలో ఉన్న నుయ్యిలో చేదవేసి, నీళ్లు చేదుకుని కాళ్లు కడుక్కున్నాడు సూర్యం. పూజారుల తరం మారింది. ఇంతకుముందులా ఆప్యాయంగా పలకరించే అర్చకుడి స్థానంలో, ఆయన వారసుడు పూజాదికాలు నిర్వహిస్తున్నాడు. అర్చనానంతరం అలంకరణతో, దీపపు కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న నల్లని శివలింగానికి చేతులెత్తి నమస్కరించాడు సూర్యం.

కళ్ళు మూస్కుని, తాయారత్త ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకున్నాడు. ఆమె పంచిన ప్రేమానురాగాలను, తియ్యని జ్ఞాపకాలనూ మదిలో భద్రంగా నిక్షిప్తం చేసుకుని గమ్యం వైపు సాగాడు సూర్యం.

***

ఊర్లోంచి కిలోమీటరు దూరం నడిచి వస్తే కానీ, బస్సులు వెళ్లే రోడ్డు తగలదు. కేవలం రెండువందల గడపలు మాత్రమే ఉన్న ఆ ఊర్లో ఇంకా సైకిళ్ల వాడకం తగ్గలేదు. ఊరి బయటకి దింపేవారు ఎవరూ కనపడక, సూట్‌కేసు మోసుకుంటూ నడవడం మొదలుపెట్టాడు సూర్యం. మరో ఇరవై అడుగుల దూరంలో బస్టాప్ ఉందనగా, మోకాళ్ళ నొప్పులు ఎక్కువై, నడవడానికి అడుగు ముందుకి పడట్లేదు. భారంగా ఈడ్చుకుంటూ ఎలాగైతేనేం బస్టాప్‌కి చేరి, కూలబడ్డాడు. పది నిముషాల తర్వాత బస్సు వచ్చింది. మెల్లగా లేచి, చేతిలో పెట్టెతో బస్సు ఎక్కబోయి, కాలు బలంగా తొక్కి బస్సు మెట్టుపై మోపలేక, ఒక్కసారిగా కింద పడిపోయాడు సూర్యం. ఆ అదురుకి పక్కనున్న రాయిపై తల పడడంతో బాధతో విలవిల్లాడిపోయాడు.

ఊర్లో నుంచి సైకిల్‌పై అటుగా వస్తున్న పాల అప్పలస్వామి, గబగబా సైకిల్ పక్కన పడేసి, సూర్యాన్ని ఒడిసి పట్టుకున్నాడు. బస్సు డ్రైవరూ, కండక్టర్ల సాయంతో సూర్యాన్ని బస్సులోకి చేర్చి, పావుగంటలో పట్నం హాస్పిటల్లో చేర్చాడు. సూర్యం పడిపోయాడనీ, దెబ్బతగిలి స్పృహ తప్పిపోయాడన్న వార్త తెలిసిన తాయారమ్మ, ఒక్కక్షణం కూడా ఇంట్లో కుదురుగా ఉండలేకపోయింది. పక్కింటి వాళ్ళని బ్రతిమాలుకుని, సూర్యాన్ని ఉంచిన హాస్పిటల్‌కి చేరుకుంది. తెలివి లేకుండా పడి ఉన్న సూర్యాన్ని చూసి, గిలగిల్లాడిపోయింది.

“నా చిట్టి తండ్రికి, నేను బ్రతికుండగా ఏమీ జరగనివ్వను..” అంటూ కంటికీ మింటికీ ధారగా ఏడ్చింది.

చీకటి పడేవరకూ హాస్పిటల్‌లో సూర్యాన్ని ఒళ్ళో పడుకో పెట్టుకుని, ప్రేమగా తల నిమురుతూ కళ్ళ నీళ్లు పెట్టుకున్న తాయారమ్మ.. మెల్లగా కళ్ళు తెరిచిన మేనల్లుణ్ణి చూసి.. ఉదయించడానికి సిద్ధమవుతున్న పడమటి సూరీడులా కనిపించి, ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంది. ఆ రాత్రికి తాయారమ్మని తిరిగి ఇంటిదగ్గర దింపివచ్చిన పాల అప్పలస్వామి.. రాత్రంతా హాస్పిటల్‌లో సూర్యాన్ని కనిపెట్టుకుని ఉండిపోయాడు.

ఇల్లు చేరిన తాయారమ్మ, రాత్రంతా సూర్యం తిరిగి కోలుకోవాలని దేవుళ్ళందరికీ మొక్కులు మొక్కుతూనే ఉంది. ఏడుస్తూ నిద్రలోకి ఒరిగిన ఆమె మరింక లేవలేదు. తెల్లారి కళ్ళు తెరిచిన సూర్యం ఆ వార్త విని, గుండె పగిలేలా ఏడ్చాడు. ఆఖరి ఊపిరి ఉన్నంతవరకూ తన క్షేమం కోసమే ఆరాటపడిన అత్తయ్యకి అంత్యక్రియలు జరిపించి, ఋణం తీర్చుకున్నాడు. తిరిగి ఎడారి జీవితంలోకి పయనమవ్వక తప్పలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here